సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడం వైరస్ నాలుగో దశ వ్యాప్తికి సూచికనే ప్రచారం జరుగుతున్నా రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహిస్తూ కట్టడి చర్యలు సమర్థంగా అమలు చేస్తున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో క్రమంగా కేసులు పెరుగుతునప్పటికీ రాష్ట్రంలో ఆందోళనకర స్థాయిలో పరిస్థితులు లేవంటున్నారు.
చదవండి: దేశంలో మళ్లీ కరోనా టెన్షన్.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే!
ఈ నెల నాలుగో తేదీ నుంచి 10వతేదీ మధ్య దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 15,928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 13,771, కర్ణాటకలో 2,831, తమిళనాడులో 1,157, తెలంగాణలో 785 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఏపీలో 128 పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. ఇక గత మూడు రోజుల్లో వరుసగా 23, 18, 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పెద్దగా లేనప్పటికీ ముందస్తు అప్రమత్తత చర్యలను వైద్య శాఖ కొనసాగిస్తోంది.
కొనసాగుతున్న 46వ విడత ఫీవర్ సర్వే
ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహిస్తూ కరోనా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేస్తోంది. సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలున్న వారిని గుర్తించి వైద్య సేవలందిస్తున్నారు. తద్వారా వైరస్ బాధితులను ముందే గుర్తించి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 46వ విడత ఫీవర్ సర్వేలో 1.63 కోట్ల ఇళ్లను సిబ్బంది సందర్శిస్తున్నారు.
80.97 శాతం మందికి ప్రికాషన్ డోసు
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో గత జనవరిలో ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీ చేపట్టారు. వీరిలో ప్రికాషన్ డోసుకు 49,72,320 మంది అర్హులు కాగా ఇప్పటికే 40,26,135 మందికి టీకాలిచ్చారు. ప్రికాషన్ డోసు తీసుకున్న వారిలో హెల్త్‌కేర్ వర్కర్లు 4,34,710 మంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 9,96,999 మంది, వృద్ధులు 25,94,426 మంది ఉన్నారు.
99.65 శాతం టీనేజర్లకు డబుల్ డోస్
రాష్ట్రంలో 15 నుంచి 17 ఏళ్ల వయసున్న టీనేజర్లలో 99.65 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం 24.41 లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా అంతకు మించి 25,33,439 మందికి తొలి డోసు పంపిణీ చేసి జాతీయ స్థాయిలోనే ఏపీ రికార్డు సృష్టించింది. తొలి డోసు తీసుకున్న వారిలో 25,24,553 (99.65 శాతం) మందికి రెండో డోసు టీకా కూడా పూర్తయింది. 12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లల్లో 97.78 శాతం మందికి రెండు డోసుల టీకాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఈ వయసు పిల్లలు 14.90 లక్షల మంది ఉండగా ఇప్పటికే వంద శాతం తొలి డోసు పంపిణీ పూర్తయింది. అనంతపురం, నెల్లూరు జిల్లాలు రెండు డోసుల టీకాను వంద శాతం పంపిణీ చేసి తొలి స్థానంలో ఉన్నాయి.
ఆందోళన చెందాల్సిన పనిలేదు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తక్కువగానే ఉంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు కొనసాగిస్తున్నాం. టీకా పంపిణీ చేపడుతున్నాం. అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తున్నాం. నాలుగో దశ వైరస్ వ్యాప్తి అంటూ జరుగుతున్న ప్రచారంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు పాటించాలి.
– జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment