► ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టీకా కార్యక్రమం 7 కోట్ల మార్క్‌ను దాటింది. టీనేజర్లకు మొదటి రోజు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ జోరుగా సాగింది. ఈ నెల 7 వరకూ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 6,454 కేంద్రాలలో టీకా కార్యక్రమం జరుగుతోంది. మొదటి రోజు డ్రైవ్‌లో ఇప్పటి వరకు 6 లక్షల మంది టీనేజర్లు సింగిల్ డోసు వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇంకా కార్యక్రమం కొనసాగుతోంది.
► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. ఈ నెల 7వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగనుంది.
► ఏపీలో 25 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ అందించనున్నారు. వ్యాక్సినేషన్ కోసం 40 లక్షల డోసులు సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు, సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
► మిగిలిన వారికి వారివారి ఇళ్ల వద్దే వ్యాక్సినేషన్ అందించనున్నారు.19 వేల వైద్య బృందాలు కోవిడ్ వ్యాక్సినేషన్‌లో పాల్గొన్నాయి. విజయవాడ పడమట వార్డు సచివాలయంలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియను హెల్త్ డైరెక్టర్ హైమావతి పశీలించారు.
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి నేటి నుంచి మరో కీలక ఘట్టం ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా 15 – 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం వీరందరికీ కోవాగ్జిన్ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామ/వార్డు సచివాలయాలలో ఉదయం నుంచి టీకాల పంపిణీ చేపట్టనున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు ఇళ్లకు తిరిగి వచ్చిన అనంతరం టీకాలు పొందేందుకు వీలుగా మధ్యాహ్నం 3 గంటల తరువాత కూడా టీకా పంపిణీ కొనసాగించనున్నారు. తొలి మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ అనంతరం స్థానిక పరిస్థితుల ఆధారంగా విద్యా సంస్థల వద్ద టీకా పంపిణీపై అధికారులు చర్యలు తీసుకుంటారు.
అదే దూకుడుతో..
గత ఏడాది జనవరిలో టీకాల పంపిణీ పెద్ద ఎత్తున ప్రారంభమైన విషయం తెలిసిందే. 18 ఏళ్లు పైబడిన 3.95 కోట్ల మందికి టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్దేశించగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించి మహమ్మారి కట్టడికి దూకుడుగా ముందుకు వెళుతోంది. పెద్దల తరహాలోనే పిల్లలకూ శరవేగంగా టీకాలను ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.
28 రోజులకు రెండో డోసు
తొలి డోసు టీకా తీసుకున్న 28 రోజుల అనంతరం పిల్లలకు రెండో డోసు ఇస్తారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు కోవిడ్ టీకాల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
అపోహలొద్దు.. పిల్లలకు ఇప్పిద్దాం
అర్హులైన పిల్లలకు ఉచితంగా టీకాలు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు టీకా పంపిణీ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తారు. అపోహలు వీడి టీకాలు తీసుకోవాలి. పిల్లలు టీకాలు పొందేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. 15–18 ఏళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకాలు ఇప్పించాలి.
– కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్
తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాం
సచివాలయాలవారీగా పిల్లల వివరాలను ఇప్పటికే ఆరోగ్య శాఖ సిబ్బందికి అందించాం. వారంతా ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆశ వర్కర్లు నేటి నుంచి
మరోసారి ఇళ్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తారు. టీకా తీసుకున్న తరువాత ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే చికిత్స అందించేందుకు వీలుగా కేంద్రాలకు కిట్‌లు పంపిణీ చేశాం. అందుబాటులో అంబులెన్స్‌లు కూడా ఉంటాయి.
– డాక్టర్ హైమవతి, ప్రజారోగ్య సంచాలకులు
రోగ నిరోధకత పెరుగుతుంది
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే 15–18 ఏళ్ల వయసు పిల్లలు తరగతి గదుల్లో కూర్చోవడంతోపాటు నిత్యం వివిధ వర్గాలతో కలసి ప్రయాణం చేస్తుంటారు. వీరిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదు కానీ రోజూ ఎంతో మందిని కలుస్తున్నందున టీకా రక్షణ అవసరం. టీకా తీసుకోవడం ద్వారా రోగనిరోధకత బలపడుతుంది. వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుంది.
– డాక్టర్ రాఘవేంద్రరావు, వైద్య విద్య సంచాలకులు
6.35 లక్షల మంది రిజిస్ట్రేషన్
దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల వయసు వారిలో ఆదివారం రాత్రి 7.50 గంటల వరకు 6.35 లక్షల మందికిపైగా కోవిడ్ వ్యాక్సినేషన్‌కు పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాలు, బృందాలను సిద్ధం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాలకు సూచించారు. ఆరోగ్య శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య సంసిద్ధత, వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించారు.
ఈసీఆర్‌పీ–2 కింద ఆమోదించిన నిధులను మెరుగ్గా ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరారు. మార్గదర్శకాల ప్రకారం పిల్లలకు టీకాల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. దేశంలో 15–18 ఏళ్ల వయసున్న పిల్లల సంఖ్య దాదాపు 10 కోట్లు ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేసింది. పిల్లల్లో అత్యవసర వినియోగం కోసం కోవ్యాగ్జిన్ టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనుమతించిన విషయం తెలిసిందే.
వారం రోజుల్లో..
రాష్ట్రంలో 15–18 ఏళ్ల లోపు పిల్లలు 24.41 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరందరికి వారం రోజుల్లో టీకాల పంపిణీ పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కోవిన్ యాప్, పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోని వారు నేరుగా టీకా పంపిణీ కేంద్రాల్లోనూ పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందవచ్చు. ఆధార్ లేదా 10వ తరగతి గుర్తింపు కార్డు, ఇతర గుర్తింపు కార్డుల ద్వారా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment