Covaxin
-
కొవాగ్జిన్ పేటెంట్‌కు సహ యజమానిగా ఐసీఎంఆర్
హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) తమ కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్‌కు సహ యజమానిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)ను చేర్చినట్లు తెలిపింది.భారత్ బయోటెక్ తమ కొవాగ్జిన్ ఒరిజినల్ పేటెంట్ ఫైలింగ్‌లో ఐసీఎంఆర్‌ను చేర్చకపోవడం వివాదానికి దారితీసింది. అయితే ఈ తప్పిదం అనుకోకుండా జరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీబీఐఎల్-ఐసీఎంఆర్ అగ్రిమెంట్ కాపీ గోప్యమైన డాక్యుమెంట్ కావడంతో అందుబాటులో లేదని, దీంతో ఐసీఎంఆర్‌ను ఒరిజినల్ అప్లికేషన్ లో చేర్చలేదని వివరణ ఇచ్చింది.ఈ తప్పిదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, ఐసీఎంఆర్ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, వివిధ ప్రాజెక్టులపై నిరంతరం సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ పొరపాటును గుర్తించిన వెంటనే, కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పేటెంట్ దరఖాస్తులకు సహ యజమానిగా ఐసీఎంఆర్‌ను చేర్చడం ద్వారా దానిని సరిదిద్దే ప్రక్రియను బీబీఐఎల్ ఇప్పటికే ప్రారంభించింది. అవసరమైన లీగల్ డాక్యుమెంట్లను సిద్ధం చేస్తున్నామని, అవి సిద్ధమై సంతకం చేసిన వెంటనే పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేస్తామని కంపెనీ పేర్కొంది.ఐసీఎంఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థ. పుణెలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారత్ బయోటెక్ సంయుక్తంగా 2020 ఏప్రిల్‌లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) తర్వాత కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేశాయి. -
డాక్టర్ కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు
ప్రజారోగ్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇచ్చే జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ పతకాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డా.కృష్ణ ఎల్లా అందుకున్నారు. మే 22, 2024న యూఎస్‌లోని మేరీల్యాండ్ బాల్టిమోర్‌లో జరిగిన బ్లూమ్‌బెర్గ్ స్కూల్ కాన్వొకేషన్ వేడుకలో డీన్ ఎల్లెన్ జే.మెకెంజీ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు.కృష్ణఎల్లా ప్రజారోగ్యానికి చేసిన కృషిని గుర్తించి ఈ పథకానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి కొవిడ్ తీవ్రతను తగ్గించారని తెలిపారు. ఈ పతకం అందుకున్న సందర్భంగా కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ రిసెర్చ్‌లో ఎన్నో విజయాలు సాధించిన భారత్‌కు ఈ పతకాన్ని అంకితం ఇస్తున్నాను. ఈ పతకం మా శాస్త్రవేత్తల బృందానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మోనోక్లోనల్ యాంటీబాడీల అభివృద్ధి కోసం భారత్‌బయోటెక్ ఎన్నో పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ను కనుగొంది’ అన్నారు.ఇదీ చదవండి: 6.8లక్షల మొబైల్ నంబర్లను ధ్రువీకరించాలన్నటెలికాంశాఖడాక్టర్ ఎల్లా నేతృత్వంలో భారత్ బయోటెక్ 220 పేటెంట్లు, 20 వ్యాక్సిన్లు, బయో థెరప్యూటిక్స్ కలిగి ఉందని కంపెనీ చెప్పింది. 125 దేశాల్లో 9 బిలియన్ వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేసినట్లు తెలిపింది. -
కోవాగ్జిన్‌తోనూ సైడ్ ఎఫెక్ట్స్..
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆందోళనలు తగ్గేలోపే భారతీయ కంపెనీ తయారు చేసిన మరో కోవిడ్ వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’తోనూ సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు ఓ తాజా అధ్యయనం వెలువడింది.భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తీసుకున్న కొంతమందిని బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధక బృందం ఏడాదిపాటు పరిశీలించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది ప్రతికూల సంఘటనలను నివేదించారు. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు మొత్తం 1,024 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 304 (47.9 శాతం) మంది టీనేజర్లు, 124 మంది (42.6 శాతం) పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొన్నట్లు నివేదించారు. 10.5 శాతం మందిలో చర్మ సమస్యలు, 10.2 శాతం మందిలో సాధారణ రుగ్మతలు, 4.7 శాతం మందిలో నాడీ సంబంధిత సమస్యలు, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు, 2.7 శాతం మందిలో కంటి సమస్యలు గుర్తించారు.సైడ్ ఎఫెక్ట్స్ వార్తల నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వాణిజ్య కారణాలతో మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న కొన్ని రోజులకే ఈ అధ్యయనం వెలువడటంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. -
మళ్లీ కోవిషీల్డ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తగిన డిమాండ్ లేకపోవడం, కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్ కోవిడ్ టీకా ఉత్పత్తిని తాజాగా పునఃప్రారంభించామని దాని తయారీసంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా బుధవారం ప్రకటించారు. కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ‘ ఇప్పటికే 60 లక్షల కోవోవ్యాక్స్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వయోజనులు కచ్చితంగా బూస్టర్ డోసులు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు తమ ఐచ్ఛికంగా కోవిషీల్డ్నూ తీసుకోవచ్చు. వచ్చే 90 రోజుల్లో 60–70 లక్షల డోసుల కోవిషీల్డ్ అందుబాటులో ఉండేలా చూస్తాం. డిమాండ్‌కు తగ్గట్లు స్టాక్‌ను పెంచేందుకు తొమ్మిది నెలల సమయం పట్టొచ్చు’ అని పూనావాలా చెప్పారు. చివరిసారిగా కోవిషీల్డ్ ఉత్పత్తిని సీరమ్ సంస్థ 2021 డిసెంబర్లో నిలిపేసింది. -
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ రెడీ!
పలు దేశాల్లో కరోనా వైరస్ వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మరోసారి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బూస్టర్ డోస్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో అప్డేట్ ఇచ్చింది. ముక్కు ద్వారా అందించే(నాజల్ స్ప్రే) కోవిడ్ వ్యాక్సిన్‌ను త్వరలో దేశంలో బూస్టర్ డోస్‌గా తీసుకువస్తున్నట్టు పేర్కొంది. గోవాగ్జిన్ టీకా నుంచి నాజల్ వ్యాక్సిన్ రూపంలో దీన్ని అందించనున్నారు. డీజీసీఏ నుంచి తుది ఆమోదం పొందిన వెంటనే బూస్టర్ డోస్ రిలీజ్చేయనున్నట్టు సమాచారం. జాతీయ మీడియా సమాచారం మేరకు నాజల్ వ్యాక్సిన్‌కు అనుమతులు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే వారంలో టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. 18 ఏళ్లుపైన వయసు ఉన్న వారికి బూస్టర్ డోస్‌గా నాజల్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నాజల్ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం? నాజల్ వ్యాక్సిన్లు ఇంజెక్షన్ ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను కలిగి వున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, నాజల్ వ్యాక్సిన్లను నిల్వ సౌలభ్యం, పంపిణీలో సులభంగా ఉంటుంది. నాజల్ వ్యాక్సిన్లు వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు , ఎగువ శ్వాస కోశం వద్ద రక్షణను అందిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. #Breaking | Bharat Biotech’s nasal Covid vaccine to be rolled out as booster dose #6PMPrime #Covid #India | @Akshita_N @milan_reports pic.twitter.com/HutHQ7tLMj — IndiaToday (@IndiaToday) December 22, 2022 -
కోవిడ్ వ్యాక్సిన్‌పై మాట మార్చిన కేంద్రం.. తెరపైకి కొత్త కంపెనీ!
న్యూఢిల్లీ: కోవిషీల్డ్, కోవాగ్జిన్ కోవిడ్ టీకాలు తీసుకున్న వ్యక్తులు బూస్టర్ డోసుగా బయోలాజికల్–ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోర్బావ్యాక్స్ వ్యాక్సిన్ వేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. ఇప్పటివరకు ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నామో బూస్టర్ డోసుగా అదే కంపెనీ వ్యాక్సిన్ బూస్టర్ వేసుకోవాలని చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా వేరే కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చింది. కోవిడ్–19పై నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫార్స్ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఈ అనుమతులు మంజూరు చేసింది. కోవిషీల్డ్ లేదంటే కోవాగ్జిన్ తీసుకున్న ఆరు నెలలు లేదంటే 26 వారాల తర్వాత కోర్బావ్యాక్స్‌ను 18 ఏళ్లకు పైబడిన వారు బూస్టర్ డోసుగా వేసుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. చదవండి: ధనికులకు మాఫీలు.. పేదలకు పన్నులు: కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్ -
మరో మైలురాయికి సిద్ధమా?
కరోనా ఇప్పటికీ ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపెట్టలేదని వార్తలు వస్తున్న వేళ... ఆదివారం ఒకింత సంతోషకర సమాచారం వచ్చింది. మనదేశంలో వేసిన కోవిడ్–19 టీకా డోసుల సంఖ్య తాజాగా 200 కోట్ల మైలురాయిని చేరుకుంది. దేశ వయోజనుల్లో 96 శాతానికి కనీసం ఒక డోసు, 87 శాతానికి రెండు డోసులూ అందినట్లయింది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకాకరణ కార్యక్రమంలో ఇది ఓ అరుదైన విన్యాసం. ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే, ‘భారతదేశం మరోసారి చరిత్ర సృష్టించింది.’ టీకాలపై అపోహలు, మందకొడి టీకాకరణ, టీకాల కొరత – ఇలా సవాలక్ష సమస్యలు ఎదురైనా, 2021 జనవరి 16న మొదలుపెట్టి, 18 నెలల్లో ఇన్ని కోట్ల కరోనా టీకా డోసులు వేయడం కచ్చితంగా చరిత్రే. కాకపోతే, ‘ముందు జాగ్రత్త మూడో డోసు’ను వయోజనులకు ఉచితంగా వేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించే వేళకు దేశంలో గత నాలుగు నెలల్లోకెల్లా గరిష్ఠస్థాయికి మళ్ళీ కరోనా కేసులు పెరిగాయి. అలక్ష్యం వదలాలని అందరికీ గుర్తుచేస్తున్నాయి. మన దేశంలో తొలి శతకోటి డోసులకు 9 నెలలు పడితే, ఇప్పుడీ రెండో శతకోటి సంబరానికీ మళ్ళీ 9 నెలలే పట్టింది. టీకాలు వేయడంలో వేగం తగ్గలేదనడానికి ఇదే సాక్ష్యమని ప్రభుత్వ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి. లెక్కల్లో చూస్తే అది నిజమే కానీ, క్షేత్రస్థాయిలో నిజంగా వేగం తగ్గలేదంటారా అన్నది విమర్శకుల ప్రశ్న. వ్యవస్థాగతంగా ప్రభుత్వ సత్వర జోక్యం వల్లే దేశీయంగా ఒకటికి మించి కరోనా టీకాలు బయటికొచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రి జవాబు. దేశాన్ని ఇవే కాపాడాయనీ, ముఖ్యంగా ఈ ఏడాది థర్డ్ వేవ్‌లో భారత్‌లో మరణాలు తక్కువగా ఉన్నాయంటే అదే కారణమనీ మంత్రివర్యుల మాట. దేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారీ ‘కోవిషీల్డ్’ 160 కోట్లు, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్’ 33.5 కోట్లు, బయొలాజికల్ ‘ఇ’ వారి ‘కోర్బెవ్యాక్స్’ 6.5 కోట్లు – ఇలా పిన్నపెద్దలకు ఒకటికి మూడు డోసుల వంతున మొత్తం 200 కోట్ల డోసుల మార్కు చేరగలిగాం. ఇప్పటి దాకా వేసిన డోసుల్లో దాదాపు 71 శాతం గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించినవే. అలాగే, మొత్తం డోసుల్లో 48.9 శాతం ఆడవారికి అందాయని లెక్క. రెండేళ్ళ పైచిలుకు క్రితం అంతుచిక్కని మాయదారి రోగంతో యావత్ ప్రపంచంతో పాటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న అధిక జనాభా దేశం ఇప్పుడు కాస్తంత ఊపిరి పీల్చుకోవడం వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల, వైద్యుల, పలు వర్గాల ఫ్రంట్ లైన్ యోధుల అవిశ్రాంత కృషి ఉంది. దేశీయంగా టీకాల అభివృద్ధి, డోసులు వృధా కాకుండా నిరంతర సమీక్షలతో ప్రాధాన్యతా క్రమంలో సమర్థంగా టీకాలేస్తూ వచ్చిన విధానం, ప్రజలకూ – పాలకులకూ తక్షణ సమాచారం అందించే ‘కోవిన్’ పోర్టల్ – ఇలా అనేకం ఈ విజయానికి తోడ్పడ్డాయి. ఎవరేమన్నా కరోనాపై టీకాల యుద్ధంలో అనేక దేశాల కన్నా భారత్ ముందంజలో ఉంది. ఐరోపా అంతటా కలిపి 130 కోట్ల డోసులైతే... మన దగ్గర 200 కోట్ల డోసులు వేయడం, మరో 23 కోట్లకు పైగా డోసుల్ని 50కి పైగా దేశాలకు ఎగుమతి చేయడం విశేషం. ఇవి కాక దాదాపు మరో 10 కోట్ల డోసులు నిల్వలో సిద్ధంగా ఉన్నాయి. అంటే, గత 18 నెలల్లో భారత్ దాదాపు 233 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేసిందన్న మాట. ఇది రొమ్ము విరుచుకొనే విషయమే. ప్రపంచ జనాభాలో 17.5 శాతం, అందులోనూ 95 కోట్ల మంది వయోజనులూ ఉన్న దేశం మనది. ప్రతి ఇద్దరి మధ్య కనీసం నాలుగు భిన్నాభిప్రాయాలుంటాయనే ఇలాంటి దేశంలో ఇప్పటికి ఏడు విడతల్లో ఇంతమంది స్వచ్ఛందంగా టీకాకరణకు ముందుకొచ్చేలా చేయడం అంత సులభ మేమీ కాదు. అందులో ప్రభుత్వం విజయం సాధించింది. 75 రోజుల పాటు ఉచిత ‘ముందు జాగ్రత్త మూడో టీకా’ ప్రకటనతో మరోసారి ఊపు తేవాలని ప్రభుత్వ ప్రయత్నం. ఇదీ విజయవంతమైతే, అయిదారు నెలల్లో 250 కోట్ల డోసుల మైలురాయినీ దాటేస్తాం. నిజానికి, 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు ఈ జనవరి 10 నుంచీ, 18 –59 ఏళ్ళ మధ్యవయసు వారికి ఏప్రిల్ 10 నుంచే ప్రభుత్వం మూడో డోస్‌కు వీలు కల్పించింది. అయినా, ఆరు నెలల్లో నూటికి అయిదుగురే వేయించుకున్నారు. రెండు, మూడు డోసుల మధ్య ఉండాల్సిన విరామాన్ని తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు ఈ జూలై మొదట్లో సర్కార్ తగ్గించింది. అయినా అదే పరిస్థితి. ఉద్ధృతి తగ్గిందంటూ ఉదాసీనత ప్రజల్లో పేరుకుపోయిందనడానికి ఇది ఉదాహరణ. కానీ, కరోనా పూర్తిగా పోలేదని పెరుగుతున్న కేసులు తట్టి చెబుతున్నాయి. కొత్తగా మంకీ పాక్స్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళనకరం. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు, ముందు జాగ్రత్త డోసు లాంటివి అశ్రద్ధ చేయవద్దని వైద్యులు చెవినిల్లు కట్టుకొని మరీ చెబుతున్నది అందుకే. కేంద్రం సైతం 18–59 ఏళ్ళ వారికి మూడో డోసుకు ఓకే చెప్పడానికి తాత్సారం చేసింది. ప్రజారోగ్య రీత్యా ఏ మహమ్మారికైనా ఉచితంగా టీకా వేయాల్సిన పాలకులు 75 రోజులే ఉచితం అనడం సరికాదు. డబ్బులకే టీకా అంటే ఆరోగ్యంలోనూ ఆర్థిక, భౌగోళిక అంతరాలు పెరుగుతాయి. 2017 నాటి జాతీయ ఆరోగ్య విధానంలోని సమానత్వ భావనకే ఇది విరుద్ధం. అలాగే, కరోనా విజయగాధను ఇతర టీకాలకూ విస్తరించాలి. సాధారణ పిల్లల టీకాలను నేటికీ నూటికి 80 మందికే టీకాలిస్తూ, నేపాల్, శ్రీలంక కన్నా మనం వెనుకబడి ఉన్నాం. ద్విశత కోటి విజయగానంతో ఊరుకోకుండా బాలల టీకాల్లోనూ భారత్ ఉపక్రమించడానికి ఇదే సరైన సమయం. -
3 లక్షల మందికి జ్వరం..18 వేల మందికి కరోనా లక్షణాలు!
Covid hits North Korea six people Deand With Fever: ఉత్తరకొరియాలో కరోనా కలకలం తర్వాత తాజగా జ్వరంతో బాధపడుతున్న ఆరుగురు చనిపోయారుని శుక్రవారం ప్రకటించింది. వారిలో ఒక వ్యక్తికి కరోనా పరీకలు చేయగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ పాజిటివ్‌గా వచ్చింది. ప్రసుత్తం మూడు లక్షల మందికి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే వారిలో సుమారు 18 వేల మంది కరోనాకి సంబంధించిన లక్షణాలను కనిపించినట్లు పేర్కొంది. ప్రస్తుతానికి 16 వేల మంది చికిత్స పోందుతున్నారని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటి వరకు ఎంతమందికి కరోనా పరీక్షలు నిర్వహించారనేది స్పష్టం చేయలేదు. దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ యాంటీ-వైరస్ కమాండ్ సెంటర్‌ను సందర్శించి పరిస్థితి గురించి తెలుసుకోవడమే కాకుండా దేశంలో లాక్‌డౌన్‌ని అమలు చేశాడు. శాస్త్రీయ చికిత్సా విధానం ద్వారా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేలా బలోపేతం చేయాలంటూ కిమ్ పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా ఆరోగ్య అధికారులు కూడా జ్వరంతో బాధపడుతున్నవారిని సాధ్యమైనంత వరకు వేరుగా ఉంచి చికిత్స అందించడం ప్రారంభించామని, సత్వరమే ఈ మహమ్మారి నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు సరఫరా చేసే ఆలోచన లేదు కరోనా కలకలంతో టెన్షన్ పడుతున్న ఉత్తర కొరియాకు వ్యాక్సిన్లు పంపే ప్రణాళికలు ఏమి లేవని యూఎస్ స్పష్టం చేసింది. గతంలో కోవాగ్జిన్‌కి చెందిన గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విరాళాలను ఉత్తరకొరియా పదేపదే తిరస్కరించిందని తెలిపింది. కానీ ఉత్తరకొరియాకు మానవతా సాయం అందించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మాత్రం మద్దుత ఇస్తామని తెలిపింది. (చదవండి: నార్త్ కొరియాలో కరోనా కలకలం.. ఫస్ట్ టైమ్ మాస్కులో కిమ్ జోంగ్ ఉన్) -
6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మంగళవారం అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ అత్యవసర వినియోగానికి కొన్ని పరిమితులు విధించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంతవరకు డీసీజీఐ12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్ టీకాలు వేసేందేకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 21న ఆమోదం లభించింది. అంతేకాదు టీనేజ్ టీకా కార్యక్రమం ఈ ఏడాది జనవరి మూడు నుంచి ప్రారంభించింది. తదనంతరం మార్చి 16న 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభించింది. అయితే గతంలో డీసీజీఐ నిపుణుల కమిటీ 2 నుంచి 12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మరిన్ని వివరాలను సమర్పించాలని కోరిన సంగతి తెలిసిందే. (చదవండి: 2 వేలకు పైగా కొత్త కేసులు...మళ్లీ మాస్క్ ధరించాల్సిందే) -
మెక్సికో మార్కెట్లోకి కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా కోవాగ్జిన్‌ను మెక్సికో మార్కెట్లో కూడా సరఫరా చేసే దిశగా బయోటెక్నాలజీ సంస్థలు భారత్ బయోటెక్, ఆక్యుజెన్ తమ ఒప్పందంలో మార్పులు చేశాయి. దీనితో మొత్తం ఉత్తర అమెరికాలో కోవాగ్జిన్ విక్రయానికి సంబంధించి ఆక్యుజెన్‌కు హక్కు లభిస్తుంది. అమెరికా మార్కెట్ తరహాలోనే లాభాల్లో వాటాల పంపకం రూపంలో ఈ ఒప్పందం ఉంటుందని ఆక్యుజెన్ తెలిపింది. అమెరికా, కెనడా మార్కెట్లలో కోవాక్సిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడం, సరఫరా, విక్రయాల కోసం ఆక్యుజెన్, భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం ఉంది. ప్రస్తుతం 2–18 ఏళ్ల బాలలకు అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్‌ను ఉపయోగించే అంశాన్ని మెక్సికో నియంత్రణ సంస్థ పరిశీలిస్తోందని ఆక్యుజెన్ చైర్మన్ శంకర్ ముసునూరి తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్లో కోవాగ్జిన్‌ను వాణిజ్యావసరాలకు ఉత్పత్తి చేసేందుకు ఆక్యుజెన్‌కు పూర్తి తోడ్పాటు అందిస్తామని భారత్ బయో చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. -
గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన వ్యాక్సిన్ల ధర
వ్యాక్సిన్ తయారీ సంస్థలు శుభవార్త చెప్పాయి. కరోనాకి విరుగుడుగా పని చేసే వ్యాక్సిన్ల ధరలను భారీగా తగ్గించాయి. ఈ మేరకు ఈ వ్యాక్సిన్ల తయారీ సంస్థలు శనివారం వేర్వేరుగా ప్రకటించాయి. దీంతో దేశంలో తొలి, మలి వ్యాక్సిన్లుగా వచ్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. కరోనా ముప్పు తొలగిపోయిందనుకుంటున్న ప్రతీసారీ కొత్త వేరియంట్ తెరమీదకు వస్తోంది. ఒమిక్రాన్ ముచ్చట మరిచిపోయేలోగానే ఎక్స్ఈ వేరింట్ దాడి చేస్తోంది. దీంతో కరోనా వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు తప్పనిసరిగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు హాస్పటిల్స్‌కి కూడా తక్కువ ధరకే వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని సీరమ్ ఇన్సిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. సీరమ్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఒక డోసు ఇంతకు ముందు రూ.600గా నిర్ణయించారు. కాగా ఈ ధరను రూ.225కి తగ్గించారు. ఇదే సమయంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక డోసు ధర రూ.1,200 ఉండగా ఇప్పుడది రూ. 225కి మార్చారు. కరోనా కొత్త వేరియంట్ల నేపథ్యంలో 18 ఏళ్ల వయసుపైబడి సెకండ్ డోస్ తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు ముందు జాగ్రత్తగా వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. -
గుడ్ న్యూస్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులపై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. పాజిటివ్ కేసుల సంఖ్య కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, కరోనా కట్టడి కోసం దేశంలో ప్రజలు కోవిషీల్డ్, కోవాగ్జిన్ వాక్సిన్లను తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ల రెండు డోసులను తీసుకునేందుకు కేంద్రం.. కొన్ని వారాల గ్యాప్‌ను విధించింది. ఈ క్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై ఆదివారం కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్టీఏజీఐ(NTAGI) కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఇకపై 8-16 వారాల గ్యాప్‌తో రెండో డోసును తీసుకోవచ్చని పేర్కొంది. కాగా, ఎన్టీఏజీఐ సూచనల మేరకు మే 13, 2021 నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య గడువును 12-16 వారాల గ్యాప్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, డోసుల మధ్య గ్యాప్ తగ్గించడంతో వ్యాక్సిన్ తీసుకునే వారికి వెసులుబాటు కలిగింది. మరోవైపు కోవాగ్జిన్ వ్యాక్సిన్ షెడ్యూల్లో మాత్రం మార్పులేదని కేంద్రం తెలిపింది. కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశంలో వ్యాక్సిన్ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఇప్పటికే కోవిషీల్డ్‌తో పాటు కోవాగ్జిన్, రష్యన్ స్పుత్నిక్ వంటి వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లోనూ విక్రయించేందుకు కేంద్రం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్లను కేంద్రం విధించిన నిబంధనల మేరకే తీసుకోవాలని హెచ్చరించింది. ఇది చదవండి: దూసుకోస్తున్న 'అసని తుపాను'...భారీ నుంచి అతి భారీ వర్షాలు -
కోవాగ్జిన్, కోవిషీల్డ్ విక్రయానికి అనుమతి
న్యూఢిల్లీ: భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్లో అమ్మకానికి సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ గురువారం షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఈ రెండు టీకాలు ఇకపై సాధారణ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి. కొన్ని షరతులకు లోబడి ఈ రెండు వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. టీకా డేటా ప్రతి ఆరు నెలలకోసారి అందించాల్సి ఉంటుందని భారత ఔషధ నియంత్రణ మండలి తెలిపింది. ప్రతికూల ప్రభావాలపైనా పర్యవేక్షణ కొనసాగనుంది. అయితే వీటిని కేవలం ఆస్పత్రులు, క్లినిక్‌ల నుంచి మాత్రమే పొందగలుగుతారు. గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. అయితే బహిరంగ మార్కెట్లో విక్రాయానికి అనుమతించాలంటూ కోవాగ్జిన్ అభివృద్ది చేసిన భారత్ బయోటెక్, కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ సంస్థలు.. గత ఏడాది అక్టోబర్ 25న డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ, షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది. బహిరంగ మార్కెట్లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల ఒక్క డోసు రూ. 275గా నిర్ణయించినట్టుగా, సర్వీస్ చార్జీ మరో రూ. 150 ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1,200 రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. రోజురోజుకూ తగ్గుతున్న కరోనా కేసులు... వరుసగా మూడో రోజూ దేశంలో కోవిడ్ కేసులు తగ్గాయి. ఒక రోజులో 2,86,384 మంది కరోనావైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల వ్యవధిలో 20,546 కేసులు తగ్గాయని పేర్కొన్నది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతంగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 22,02,472 క్రియాశీల కేసులున్నాయి. నేటితో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,03,71,500కి పెరిగింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. 573 మరణాలతో మరణాల సంఖ్య 4,91,700కి చేరుకుంది. అయితే మరణాల సంఖ్యలోనూ తగ్గుదల నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 573 కొత్త మరణాలలో కేరళ నుండి 140 మరియు మహారాష్ట్ర నుండి 79 మంది ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజు 22 లక్షల మంది టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ డోసుల పంపిణీ 163 కోట్లను దాటింది. -
గుడ్‌న్యూస్: భారీగా తగ్గనున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు!
కొవిడ్ వ్యాక్సిన్లు త్వరలో రెగ్యులర్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయన్న విషయం తెలిసిందే. డ్రగ్ నియంత్రణ విభాగం నుంచి అప్రూవల్ దక్కిన వెంటనే టీకాలు మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నాయి ఆయా కంపెనీలు. ఈ క్రమంలో ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఈ రెండు కొవిడ్ వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ల ధరలు ఒక్కో డోసు రూ. 275గా నిర్ధారణ కానున్నాయని, అదనంగా సర్వీస్ ఛార్జీ మరో 150 రూపాయలతో మొత్తం.. రూ. 425గా ఉండొచ్చని ఆ కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు నేషనల్ ఫార్మాసుటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ధరల నియంత్రణ.. తగ్గింపు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 19న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ‘కోవిడ్-19పై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ’ కొన్ని షరతులకు లోబడి వయోజన జనాభాలో ఉపయోగించడానికి కోవిషీల్డ్ మరియు కోవాగ్జిన్‌లకు సాధారణ మార్కెట్ ఆమోదం ఇవ్వాలని సిఫార్సు చేసింది. అలాగే పనిలో పనిగా ధరల నిర్ధారణపై కూడా ఎన్‌పీపీఏను కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1,200రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ రెండూ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతులు ఉన్న వ్యాక్సిన్లు. ఒకవేళ వ్యాక్సిన్ కు మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ దక్కితే కేవలం అత్యవసర పరిస్థితులు, రిజర్వ్ డ్ కండిషన్స్ లో మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండదు. భారత్‌లో వ్యాక్సినేషన్ ఉధృతిగా సాగుతున్న టైంలోనే కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ కంపెనీలు రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. -
Hyderabad: జాంబాగ్ పీహెచ్సీలో వ్యాక్సిన్లు చోరీ
హైదరాబాద్: పాతబస్తీ జాంబాగ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొంగలు పడ్డారు. రెండు కంప్యూటర్లతో పాటు వ్యాక్సిన్ వయల్స్‌ను దొంగిలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పంజేషాలోని జాంబాగ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం వైద్య సేవలు అందించిన అనంతరం సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు వచ్చి చూడగా.. ఆస్పత్రి తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. రెండు కంప్యూటర్ మానిటర్లు, 2 సీపీయూలు, 2 కీ బోర్డులు, మౌస్‌లతో పాటు 17 కోవాగ్జిన్ వయల్స్, 27 కోవిషీల్డ్ వయల్స్, 22 బీసీజీ, 44 ఓపీవీ, 15 డీటీపీ, 7 ఐపీవీ 7, 39 హెపాటీబీ, 38 ఎంఆర్, 7 పీసీపీ, 23 పెంటా, 21 డీటీ, 2 ఏఈఎఫ్ఐ కిట్స్‌చోరీకి గుర య్యాయి. ఆస్పత్రి గోడకు ఉన్న స్మార్ట్ టీవీని సైతం దొంగిలించేందుకు యత్నించి విఫలమయ్యారు. ఈ ఘటనపై ఎంఓ లింగమూర్తి మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
టీనేజర్లకు టీకా తర్వాత పారాసిటమాల్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టీనేజీ వయసు వారికి ఇస్తున్న కోవాగ్జిన్ కోవిడ్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ బుధవారం ఒక స్పష్టతనిచ్చింది. ‘కోవాగ్జిన్ టీకా తీసుకున్న టీనేజర్లకు కొన్ని టీకా కేంద్రాలు.. పారాసిటమాల్ 500 ఎంజీ ట్యాబ్లెట్లు మూడు, పెయిన్ కిల్లర్లు తీసుకోవాలని సూచిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. నిజానికి పిల్లలు కోవాగ్జిన్ తీసుకున్నాక వారికి పారాసిటమాల్, పెయిన్ కిల్లర్లు ఇవ్వాల్సిన పని లేదు. అవి అనవసరం’ అని సంస్థ పేర్కొంది. టీనేజర్లు మందులు తీసుకోవాలనుకుంటే వైద్యుణ్ణి సంప్రదించి, వారి సలహా మేరకే తీసుకోవాలని సంస్థ సూచించింది. -
Andhra Pradesh: కొనసాగుతున్న టీనేజ్ టీకా డ్రైవ్
► ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టీకా కార్యక్రమం 7 కోట్ల మార్క్‌ను దాటింది. టీనేజర్లకు మొదటి రోజు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ జోరుగా సాగింది. ఈ నెల 7 వరకూ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 6,454 కేంద్రాలలో టీకా కార్యక్రమం జరుగుతోంది. మొదటి రోజు డ్రైవ్‌లో ఇప్పటి వరకు 6 లక్షల మంది టీనేజర్లు సింగిల్ డోసు వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇంకా కార్యక్రమం కొనసాగుతోంది. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. ఈ నెల 7వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగనుంది. ► ఏపీలో 25 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ అందించనున్నారు. వ్యాక్సినేషన్ కోసం 40 లక్షల డోసులు సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు, సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ► మిగిలిన వారికి వారివారి ఇళ్ల వద్దే వ్యాక్సినేషన్ అందించనున్నారు.19 వేల వైద్య బృందాలు కోవిడ్ వ్యాక్సినేషన్లో పాల్గొన్నాయి. విజయవాడ పడమట వార్డు సచివాలయంలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియను హెల్త్ డైరెక్టర్ హైమావతి పశీలించారు. సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి నేటి నుంచి మరో కీలక ఘట్టం ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా 15 – 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం వీరందరికీ కోవాగ్జిన్ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామ/వార్డు సచివాలయాలలో ఉదయం నుంచి టీకాల పంపిణీ చేపట్టనున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు ఇళ్లకు తిరిగి వచ్చిన అనంతరం టీకాలు పొందేందుకు వీలుగా మధ్యాహ్నం 3 గంటల తరువాత కూడా టీకా పంపిణీ కొనసాగించనున్నారు. తొలి మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ అనంతరం స్థానిక పరిస్థితుల ఆధారంగా విద్యా సంస్థల వద్ద టీకా పంపిణీపై అధికారులు చర్యలు తీసుకుంటారు. అదే దూకుడుతో.. గత ఏడాది జనవరిలో టీకాల పంపిణీ పెద్ద ఎత్తున ప్రారంభమైన విషయం తెలిసిందే. 18 ఏళ్లు పైబడిన 3.95 కోట్ల మందికి టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్దేశించగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించి మహమ్మారి కట్టడికి దూకుడుగా ముందుకు వెళుతోంది. పెద్దల తరహాలోనే పిల్లలకూ శరవేగంగా టీకాలను ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. 28 రోజులకు రెండో డోసు తొలి డోసు టీకా తీసుకున్న 28 రోజుల అనంతరం పిల్లలకు రెండో డోసు ఇస్తారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు కోవిడ్ టీకాల ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అపోహలొద్దు.. పిల్లలకు ఇప్పిద్దాం అర్హులైన పిల్లలకు ఉచితంగా టీకాలు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు టీకా పంపిణీ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తారు. అపోహలు వీడి టీకాలు తీసుకోవాలి. పిల్లలు టీకాలు పొందేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. 15–18 ఏళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకాలు ఇప్పించాలి. – కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాం సచివాలయాలవారీగా పిల్లల వివరాలను ఇప్పటికే ఆరోగ్య శాఖ సిబ్బందికి అందించాం. వారంతా ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆశ వర్కర్లు నేటి నుంచి మరోసారి ఇళ్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తారు. టీకా తీసుకున్న తరువాత ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే చికిత్స అందించేందుకు వీలుగా కేంద్రాలకు కిట్లు పంపిణీ చేశాం. అందుబాటులో అంబులెన్స్‌లు కూడా ఉంటాయి. – డాక్టర్ హైమవతి, ప్రజారోగ్య సంచాలకులు రోగ నిరోధకత పెరుగుతుంది పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే 15–18 ఏళ్ల వయసు పిల్లలు తరగతి గదుల్లో కూర్చోవడంతోపాటు నిత్యం వివిధ వర్గాలతో కలసి ప్రయాణం చేస్తుంటారు. వీరిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదు కానీ రోజూ ఎంతో మందిని కలుస్తున్నందున టీకా రక్షణ అవసరం. టీకా తీసుకోవడం ద్వారా రోగనిరోధకత బలపడుతుంది. వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుంది. – డాక్టర్ రాఘవేంద్రరావు, వైద్య విద్య సంచాలకులు 6.35 లక్షల మంది రిజిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల వయసు వారిలో ఆదివారం రాత్రి 7.50 గంటల వరకు 6.35 లక్షల మందికిపైగా కోవిడ్ వ్యాక్సినేషన్‌కు పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాలు, బృందాలను సిద్ధం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాలకు సూచించారు. ఆరోగ్య శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య సంసిద్ధత, వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించారు. ఈసీఆర్పీ–2 కింద ఆమోదించిన నిధులను మెరుగ్గా ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరారు. మార్గదర్శకాల ప్రకారం పిల్లలకు టీకాల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. దేశంలో 15–18 ఏళ్ల వయసున్న పిల్లల సంఖ్య దాదాపు 10 కోట్లు ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేసింది. పిల్లల్లో అత్యవసర వినియోగం కోసం కోవ్యాగ్జిన్ టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనుమతించిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో.. రాష్ట్రంలో 15–18 ఏళ్ల లోపు పిల్లలు 24.41 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరందరికి వారం రోజుల్లో టీకాల పంపిణీ పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కోవిన్ యాప్, పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోని వారు నేరుగా టీకా పంపిణీ కేంద్రాల్లోనూ పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందవచ్చు. ఆధార్ లేదా 10వ తరగతి గుర్తింపు కార్డు, ఇతర గుర్తింపు కార్డుల ద్వారా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. -
9 నెలల తర్వాతే బూస్టర్
న్యూఢిల్లీ: దేశంలోని 15–18 ఏళ్ల గ్రూపు టీనేజర్లకు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవాగ్జిన్ టీకా మాత్రమే అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలు తదితరులకు ‘ప్రికాషన్ డోస్’గా ఇచ్చే మూడో డోస్ టీకాపైనా మరింత స్పష్టత నిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘15ఏళ్లు ఆపై వారు కోవిన్ యాప్ ద్వారా టీకా కోసం జనవరి 1వ తేదీ నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2007, అంతకంటే ముందే పుట్టిన వారు అర్హులవుతారు. దేశంలో 15–18 ఏళ్ల గ్రూపు వారికి కోవాగ్జిన్ టీకా(అత్యవసర వినియోగానికి) ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉంది’అని వివరించింది. జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేసిన జైకోవ్–డీ వ్యాక్సిన్‌ను 12–18 ఏళ్ల వారికి వాడటానికి ఈ ఏడాది ఆగస్టు 20న అనుమతులు లభించినా.. ఈ టీకాను ఇంకా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చలేదు కాబట్టి ప్రస్తుతానికి పిల్లలకు కోవాగ్జిన్ ఒక్కటే అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. అదేవిధంగా, ‘ప్రాధాన్యతాక్రమం ప్రకారం హెల్త్‌కేర్ వర్కర్లు (హెచ్‌సీడబ్ల్యూలు), ఫ్రంట్‌లైన్ వర్కర్లు (ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు), 60 ఏళ్లకు పైబడిన ఇతర వ్యాధుల బాధితులు జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రికాషన్ డోస్‌కు అర్హులు. జనవరి 3వ తేదీ నాటికి వీరు కోవిడ్ టీకా రెండో డోస్ తీసుకుని 9 నెలలు లేదా 39 వారాలు పూర్తయి ఉండాలి’అని ఆ మార్గదర్శకాల్లో వివరించింది. ‘కోవిన్ యాప్ నుంచి వీరు టీకా కోసం నమోదు చేసుకోవచ్చు. కోవిన్ యాప్ నమోదైన రెండో డోస్ తీసుకున్న తేదీ ఆధారంగా ప్రికాషన్ డోస్‌కు అర్హత లభిస్తుంది. 9 నెలలు/39 వారాల గడువు ముగిసిన వారి రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు మెసేజీ అందుతుంది. ఆన్‌లైన్‌తోపాటు ఆన్‌సైట్‌లోనూ టీకా కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. నేడు రాష్ట్రాలతో భేటీ ప్రికాషన్ డోస్, టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అనుసరించాల్సిన కార్యాచరణ వ్యూహంపై చర్చించేందుకు కేంద్రం మంగళవారం రాష్ట్రాలతో వర్చువల్‌గా సమావేశం జరపనుంది. -
12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాగ్జిన్!
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 12ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అత్యవసర వాడుకకు అనుమతినిచ్చింది. అయితే ఈ అనుమతికి పరిమితులు విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2–18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాడకంపై భారత్ బయోటెక్ ఫేజ్–2 ట్రయల్స్ నిర్వహించి సీడీఎస్సీఓకు గతంలో సమర్పించింది. పిల్లలకు కొన్ని నిబంధనలతో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అక్టోబర్‌లో సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సూచించింది. ఈ సిఫార్సును డీజీసీఐకు చెందిన మరో కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని, మరిన్ని వివరాలు సమర్పించాలని కంపెనీని కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వివరాలు పరిశీలించిన అనంతరం డీజీసీఐ కోవాగ్జిన్‌కు శుక్రవారం అనుమతినిచ్చినట్లు వెల్లడించాయి. కమిటీ సూచన మేరకు కోవాగ్జిన్‌ను 12– 18ఏళ్ల వారికి 0– 28 రోజుల వ్యవధిలో అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అనుమతినిస్తున్నట్లు డీజీసీఐ ప్రకటన వెల్లడించింది. డీజీసీఐ నిర్ణయంపై భారత్ బయోటెక్ హర్షం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో జైడస్ క్యాడిలా వారి జైకోవ్– డీ టీకాను 18 ఏళ్లలోపు వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పిల్లలపై సీరమ్, బయోలాజికల్–ఇ లిమిటెడ్ కంపెనీల టీకాల ఫేజ్2 ట్రయల్స్‌కు డీజీసీఐ గతంలో అనుమతినిచ్చింది. డీజీసీఐ తాజా నిర్ణయాన్ని మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు. -
కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ టీకా ఉత్పత్తి 5 రెట్లు ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం నెలకు 25–27.5 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకా ఉత్పత్తి చేస్తుండగా, భారత్ బయోటెక్ నెలకు 5నుంచి 6 కోట్ల డోసుల కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ రెండు సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో 90% మేర సాధించినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి మంగళవారం లోక్‌సభకు వెల్లడించారు. చదవండి: 2011 ఎస్ఈసీసీ డేటాలో లోపాలు! -
ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది: లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్ కోవిడ్ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తోందని, పూర్తిగా సురక్షితమైనదని లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను లాన్సెట్ వైద్య నిపుణులు విశ్లేషించి నివేదిక రూపొందించారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 2 వారాల్లో యాంటీబాడీలు సమృద్ధిగా వచ్చాయని, దుష్ప్రభావాలు కనబడలేదంది. కోవాగ్జిన్ తీసుకుంటే కరోనా తీవ్రంగా సోకకుండా 93.4%, సాధారణంగా సోకకుండా 77.8%తో పని చేస్తోందని తెలిపింది. డెల్టా వేరియెంట్ నుంచి 65.2% సామర్థ్యంతో రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. టీకా ఇచ్చిన వారంలో తలనొప్పి, అలసట, జ్వరం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి తప్ప ఎలాంటి రియాక్షన్లు లేవని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ 16 నుంచి ఈ ఏడాది మే 17 వరకు మూడోదశ ప్రయోగాలు జరిగాయి. భారత్‌లోని 25 ఆస్పత్రుల్లో 18–97 ఏళ్ల 16,973 మందికి టీకాను ప్రయోగాత్మకంగా ఇచ్చారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారు ఆస్పత్రి పాలవడం, మరణించడం జరగలేదని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ఈ నివేదికపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెడికల్ జర్నల్‌లో కోవాగ్జిన్ ఫలితాలు వచ్చాయంటే అదెంత సమర్థంగా పని చేస్తోందో అర్థమవుతుందన్నారు. కోవాగ్జిన్‌పై లాన్సెట్ నిపుణుల పరిశోధనల్లో తేలిన అంశాలు టీకా అభివృద్ధిలో తమ చిత్తశుద్ధిని, డేటా ఇవ్వడంలో పారదర్శకతను వెల్లడిస్తోందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. కాగా లాన్సెట్ జర్నల్ ఈ నివేదిక ప్రాథమికమైనదని, మరింత డేటా వచ్చాక పూర్తి నివేదిక ప్రచురిస్తామని వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఇటీవల అనుమతులిచ్చింది. -
కోవాగ్జిన్‌కు యూకే గుర్తింపు
లండన్: భారత్ తయారీ కోవాగ్జిన్‌ను అనుమతి పొందిన కోవిడ్ టీకాల జాబితాలో చేర్చినట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ఈ నెల 22వ తేదీ ఉదయం 4 గంటల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు వర్తించనుందని పేర్కొంది. భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకుని యూకే వెళ్లిన ప్రయాణికులు ఇకపై ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని భారత్‌లో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు. యూకేలో ప్రవేశించే 18 ఏళ్లలోపు వారి విషయంలోనూ ప్రయాణ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. వీరికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు గుర్తిస్తూ, ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. యూకేకు వచ్చాక వీరికి కోవిడ్ పరీక్ష చేస్తారు. పాజిటివ్‌గా తేలితే మాత్రం, పీసీఆర్ పరీక్ష ఉచితంగా చేస్తారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తిస్తూభారత్ 96 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. -
కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి
న్యూఢిల్లీ/జెనీవా: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా ‘కోవాగ్జిన్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. కోవాగ్జిన్‌ను ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్(ఈయూఎల్)లో చేర్చినట్లు డబ్ల్యూహెచ్ఓ బుధవారం ప్రకటించింది. కోవాగ్జిన్‌కు ఈయూఎల్ హోదా కల్పించవచ్చంటూ డబ్ల్యూహెచ్ఓకు చెందిన స్వతంత్ర సాంకేతిక సలహా బృందం(టీఏజీ) ప్రతిపాదించడంతో టీకాకు మార్గం సుగమమైంది. గర్భిణులకు.. ఇప్పుడే చెప్పలేం కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసినందుకు గాను డబ్ల్యూహెచ్ఓకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కృతజ్ఞతలు తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు, దేశ ప్రజల విశ్వాసానికి ఇదొక నిదర్శనమని చెప్పారు. ఇది ఆత్మనిర్భర్ దీపావళి అని పేర్కొన్నారు. దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి దక్కడం పట్ల డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ భారత్‌కు అభినందనలు తెలియజేశారు. కరోనా నుంచి రక్షణ కల్పించే విషయంలో కోవాగ్జిన్ చక్కగా పని చేస్తున్నట్లు సాంకేతిక సలహా బృందం గుర్తించింది. దీంతో ఎలాంటి రిస్కు లేదని తేల్చింది. 18 ఏళ్లు దాటిన వారంతా ఈ టీకా నిరభ్యంతరంగా తీసుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ మరో ట్వీట్లో సూచించింది. నాలుగు వారాల వ్యవధితో రెండు డోసులు తీసుకోవాలని పేర్కొంది. అయితే, గర్భిణులకు కోవాగ్జిన్ ఇవ్వొచ్చా లేదా అనేది చెప్పడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం సరిపోదని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపింది. రెండు డోసులు తీసుకున్న 14 రోజుల తర్వాత కోవాగ్జిన్ టీకా కరోనాపై దాదాపు 78 శాతం సమర్థతను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది. కోవాగ్జిన్‌ను నిల్వ చేయడం చాలా తేలిక అని, అందుకే తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలకు ఈ టీకా చక్కగా సరిపోతుందని వివరించింది. లక్షణాలు కనిపించే కరోనాపై 77.8 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం కోవాగ్జిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే రోమ్‌లో జి–20 సమావేశాల సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయెసస్తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ నుంచి అత్యవసర వినియోగ అనుమతి రావడం విశేషం. కోవాగ్జిన్ షెల్ఫ్ లైఫ్ 12 నెలలు కోవాగ్జిన్ టీకా షెల్ఫ్ లైఫ్‌ను తయారీ తేదీ నుంచి 12 నెలల దాకా పొడిగించేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అంగీకరించినట్లు భారత్ బయోటెక్ సంస్థ బుధవారం వెల్లడించింది. కోవాగ్జిన్ షెల్ఫ్‌లైఫ్ అనుమతి తొలుత ఆరు నెలలకే లభించింది. తర్వాత దీన్ని తొమ్మిది నెలలు పొడిగించారు. తాజాగా ఒక సంవత్సరం(12 నెలల) పొడిగించడం విశేషం. అంటే టీకాను తయారు చేసిన తర్వాత 12 నెలల్లోగా ఉపయోగించవచ్చు. (చదవండి: కోవాగ్జిన్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా) విదేశాలకు వెళ్లేవారికి ఇక్కట్లు తప్పినట్లేనా? భారత్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి కరోనా టీకా కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగ అనుమతి దక్కడం పట్ల ఊరట వ్యక్తమవుతోంది. భారత్‌లో ఇప్పటిదాకా దాదాపు 15 కోట్ల మంది ఈ టీకా తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగస్థులు, గృహిణులు, కార్మికులు.. ఇలా అన్ని రంగాల వారు ఉన్నారు. అయితే, కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ నుంచి అనుమతి రావడంలో తీవ్ర జాప్యం జరగడంతో విదేశాలకు వెళ్లేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోవాగ్జిన్ తీసుకున్న వారు విదేశాలకు వెళ్లిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. సొంత ఖర్చుతో కరోనా పరీక్ష చేయించుకొని నెగెటివ్ ఆర్టీ–పీసీఆర్ రిపోర్టు ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఆమోదం పొంది కరోనా టీకాను తీసుకోక తప్పలేదు. డబ్ల్యూహెచ్ఓ నుంచి అత్యవసర వినియోగ అనుమతి లభించిన కరోనా టీకాలను ప్రపంచంలో దాదాపు చాలా దేశాలు అధికారికంగా గుర్తిస్తున్నాయి. అయితే అమెరికా, యూరోప్ దేశాల్లో మాత్రం వారి సొంత ఔషధ నియంత్రణ సంస్థలు కూడా ఆమోదం తెలిపితేనే... ఏ టీకానైనా అనుమతిస్తారు. అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ), యూరోప్ దేశాల్లో యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) అనుమతులను కోవాగ్జిన్ పొందాల్సి ఉంటుంది. తర్వాతే కోవాగ్జిన్ తీసుకున్న వారికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లుగా అమెరికా, యూరోప్ దేశాలు పరిగణిస్తాయి. మిగతా దేశాల్లో మాత్రం ఈ టీకా తీసుకున్న భారతీయులు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మళ్లీ మరోసారి కరోనా టీకా తీసుకోవాల్సిన పని ఉండదు. చదవండి: ‘ఇంటింటికి వెళ్లండి.. మత పెద్దల సాయం తీసుకోండి’ -
కోవాగ్జిన్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా
మెల్బోర్న్: భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారీ కోవిడ్ టీకా కోవాగ్జిన్‌ను గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ మహమ్మారితో సరిహద్దులను మూసివేసిన ఆస్ట్రేలియా దాదాపు 20 నెలల తర్వాత మొదటిసారిగా దేశంలోకి ప్రయాణికులను అనుమతించింది. కోవాగ్జిన్‌తోపాటు చైనాకు చెందిన బీబీఐబీపీ–కోర్వీ టీకాను దేశంలోకి వచ్చే యాత్రికుల టీకా స్టేటస్‌ను నిర్థారించేందుకు పరిగణనలోకి తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రకటించింది. కోవాగ్జిన్ తీసుకున్న 12 ఏళ్లకు పైబడిన వారిని, బీబీఐబీపీ–కోర్వీ తీసుకున్న 18–60 ఏళ్ల గ్రూపు వారిని కోవిడ్ టీకా తీసుకున్నట్లు గుర్తించనున్నట్లు ఆస్ట్రేలియా సోమవారం తెలిపింది. -
కోవాగ్జిన్‌పై అదనపుసమాచారం కావాలి: డబ్ల్యూహెచ్ఓ
ఐక్యరాజ్యసవిుతి/జెనీవా: కోవిడ్–19 నియంత్రణ కోసం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ పేరిట టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు ఏప్రిల్ 19న దరఖాస్తు చేసుకుంది. అయితే, అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయంలో తొందరపడలేమని, కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం ఆశిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ సోమవారం స్పష్టం చేసింది. కోవాగ్జిన్ టీకా భద్రత, ప్రభావశీలతను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉందని ట్విట్టర్లో తెలిపింది.