మొదటి డోస్ కోవాగ్జిన్ తీసుకున్నాం. నాలుగు వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. కానీ కోవాగ్జిన్ స్టాక్ లేదు. నిర్ణీత సమయంలో రెండో డోస్ తీసుకోకపోతే ఎలా? పోనీ రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా? ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. టీకాలు వేయించుకుంటున్న ఎంతోమందిలో ఇలాంటి సందేహాలే. ప్రస్తుతం మనదేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలే ప్రభుత్వాల తరఫున ప్రజలకు ఇస్తున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్– వీకి అనుమతి ఇచ్చినా.. అది పరిమిత సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉంది. రెండు వేర్వేరు వ్యాక్సిన్లను తీసుకోవచ్చా?... అంటే ప్రస్తుతానికైతే భారత్‌లో దీనికి అనుమతి లేదు. మొదటి డోసుగా ఏ టీకాను తీసుకున్నామో... రెండో డోసు కూడా అదే టీకా తీసుకోవాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా టీకాలను మిక్స్ చేసే విషయంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం...
నిపుణుల అభిప్రాయం
తొలి డోస్ కోవాగ్జిన్ లేదా సినోఫార్మ్ వేసుకున్నాక... రెండో డోసుగా ఫైజర్/ ఆస్ట్రాజెనెకా (మన కోవిషీల్డ్)/ జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకోవచ్చా?
‘ఇప్పటిౖMðతే వద్దనే అంటా ను. అధ్యయనాలు జరుగుతున్నాయి. అరుదుగా మినహాయింపులుండొచ్చు గాని... రెండు వేర్వేరు కంపెనీల టీకాలను మిక్స్ చేయొద్దు. అయితే ఇది తప్పకుండా మారుతుంది. గుడ్డిగా రిస్క్ తీసుకొనే బదులు 2–3 నెలలు ఆగండి’’
– అమెరికాలోని మేరీలాండ్ యూనివర్శిటీకి చెందిన అంటువ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ ఫహీమ్ యూనుస్
ఇతర దేశాల్లో పరిస్థితేమిటి...
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (కోవిషీల్డ్)ను తొలి డోసుగా తీసుకుంటే... రెండో డోసు కింద ఇతర టీకాలను తీసుకోవడానికి పలు దేశాలు అనుమతించాయి. తొలిడోసు కోవిషీల్డ్ తీసుకుంటే... రెండో డోసుగా ఇతర కంపెనీల టీకా ఇవ్వొచ్చని కెనడా, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, స్పెయిన్, దక్షిణకొరియాలు అనుమతించాయి. రెండు విభిన్నమైన సాంకేతికతలతో తయారైన టీకాలకు మిక్స్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చైనా ఏప్రిల్‌లోనే ప్రకటించింది.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..
ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలను మిక్స్ చేయడంపై స్పెయిన్‌లో అధ్యయనం జరిగింది. ఆస్ట్రాజెనెకా తీసుకున్న వారికి రెండో డోసుగా ఫైజర్ టీకా ఇస్తే... యాంటీబాడీలు గణనీయంగా వృద్ధి చెందినట్లు 600 మందిపై జరిపిన అధ్యయంలో తేలింది. రోగ నిరోధక వ్యవస్థ స్పందన మెరుగ్గా ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ చాలా స్వల్పంగా ఉన్నాయి. ఫైజర్, మోడెర్నా టీకాలను మిక్స్ చేయడానికి అమెరికా ఇప్పటికే అనుమతించింది. 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలని సూచించింది. ఆస్ట్రాజెనెకా, ఫైజర్, మోడెర్నా, నోవావాక్స్‌ల నుంచి ఏవేని రెండు టీకాలను రెండు డోసులుగా ఇవ్వడానికి బ్రిటన్‌లో 50 మంది వలంటీర్లపై అధ్యయనం మొదలైంది. ఫలితాలు వెల్లడి కావడానికి సమయం పడుతుంది.
ప్రమాదం లేదు.. కానీ అప్పుడే వద్దు
మొదటి డోసు ఒక కంపెనీ, రెండో డోసు మరో కంపెనీ టీకా తీసుకున్నా పెద్దగా ప్రతికూల ప్రభావాలేవీ ఉండే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం తెలియజేసింది. అయితే, దీనిపై మరింత పరిశీలన జరిగిన తర్వాతే తుది నిర్ణయానికి రావాల్సి ఉందని పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రోటోకాల్ ప్రకారం.. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఒకే కంపెనీవి తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో జరిగిన పొరపాటుపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. రెండు వేర్వేరు సంస్థల టీకా డోసులు తీసుకున్నప్పటికీ శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ తెలిపారు. రెండు వేర్వేరు కంపెనీ టీకాలు తీసుకుంటే... రోగనిరోధక శక్తి మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయం నెలకొందని, లోతైన విశ్లేషణల ద్వారా నిశ్చితాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు.
పొరపాటే... ప్రయోగం!
భారత్‌లో పొరపాటున 21 మందికి రెండు వేర్వేరు కంపెనీల టీకాలను ఇవ్వడం జరిగింది. యూపీలోని మహరాజ్‌గంజ్ జిల్లాలో మొదటి డోస్ కోవాగ్జిన్ ఇచ్చిన ఒకతనికి ఏప్రిల్‌లో రెండోడోసు కింద కోవిషీల్డ్ ఇచ్చారు. సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో ఏప్రిల్ నెలలో 20 మందికి కోవిషీల్డ్ ఇచ్చి... ఈనెలలో రెండో డోసు కింద కోవాగ్జిన్ ఇచ్చారు. ఈ 21 మందిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనపడకపోవడం గమనార్హం. టీకాలను మిక్స్ చేసే విషయంలో మనదేశంలో అధికారికంగా అధ్యయనం మొదలుకాకపోయినా... పొర పాటు జరిగిన ఘటనలను అధ్యయనానికి స్వీకరించే అవకాశం ఉంది.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment