Covishield
-
కోవిడ్ టీకాను ఎలా చూడాలి?
‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ టీకా వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి దుష్ప్రభావాలు అరుదుగానైనా కలగడమే ఆ నిర్ణయానికి కారణం. ఇదే టీకాను ‘కోవిషీల్డ్’ పేరుతో ఇండియాలో కోట్లాది డోసులు వేయడం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని విస్మరించకూడదు. మహమ్మారులు దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి పెద్ద దేశంలో ఆసుపత్రుల్లో పడకలు కూడా అందుబాటులో లేని కాలంలో, ఈ టీకా లక్షలాది మందిని చనిపోకుండా నిరోధించిందని మరిచిపోరాదు.ఆంగ్లో–స్వీడిష్ ఔషధ తయారీదారు అయిన ‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. భారతదేశంలో ‘కోవిషీల్డ్’ పేరుతో వచ్చిన ఈ టీకాను ఆస్ట్రా–జెనెకా సహకారంతో పుణెకు చెందిన ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ తయారు చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 175 కోట్ల టీకా డోసులను అందించారు. టీకాల ఉపసంహరణకు ‘భిన్న రకాల వేరియంట్లకు బహుళ టీకాల లభ్యత వల్ల కాలం చెల్లిన టీకాలు మిగిలిపోవడం’ కారణమని ఆస్ట్రా–జెనెకా సంస్థ పేర్కొంది. సరళంగా చెప్పాలంటే, తీవ్రమైన దుష్ప్రభావాల కేసులకు సంబంధించిన కోర్టు విచారణలు,కంపెనీ ఎదుర్కొంటున్న 100–మిలియన్ పౌండ్ల(సుమారు వెయ్యి కోట్ల రూపాయలు) మేరకు క్లాస్ యాక్షన్ వ్యాజ్యం(ఎక్కువమందికి సంబంధించిన కేసు) నేపథ్యంలో ఇది కేవలం వ్యాపార నిర్ణయం. కోవిడ్–19 టీకా ‘చాలా అరుదైన సందర్భాల్లో, టీటీఎస్‌కు కారణం కావచ్చు’ అని కంపెనీ, ఫిబ్రవరిలో అంగీకరించినట్లు నివేదించబడింది.‘టీటీఎస్’ అంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో థ్రాంబోసిస్. ఇది శరీరంలో ప్లేట్లెట్లు పడిపోవడానికీ, రక్తం గడ్డకట్టడానికీ కారణమవుతుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తలనొప్పులు, సులభంగా గాయపడటం వంటి లక్షణాలు దీంట్లో ఉంటాయి. బ్రిటన్ లో చాలా మంది వ్యక్తులు తాము వివిధ రకాల గాయాలతో బాధపడుతున్నామని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా, కొన్ని కుటుంబాలు ఆస్ట్రా–జెనెకాపై, సీరమ్ సంస్థపై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏమి చేయాలని ప్రజారోగ్యం నిర్దేశిస్తుంది, భారతదేశంలో దీనికి ఏదైనా భిన్నంగా చేయగలిగి ఉండేవాళ్లమా అనేదాని గురించి నేను ఆలోచిస్తున్నాను. మాజీ ప్రజారోగ్య పాలనాధికారిగా నా అభిప్రాయాలను ఇచ్చే ముందు, ఇద్దరు అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. నేను మొదటగా భారతదేశ ప్రముఖ మైక్రోబయాలజిస్టు, వైరాలజిస్టులలో ఒకరైన డాక్టర్ గగన్ దీప్ కాంగ్‌తో మాట్లాడాను. ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్లేషనల్, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆమె అభిప్రాయం మేరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 మార్చిలో అస్ట్రా–జెనెకా టీకా టీటీఎస్ దుష్ప్రభావం కలిగించే ప్రమాదం గురించి ప్రకటించింది. 2021 మే నాటికి దానిని ధ్రువీకరించింది. 2021 అక్టోబర్‌లో ‘కోవిషీల్డ్’కు సంబంధించిన ప్రమాద కారకాన్ని చేర్చడానికిగానూ సీరమ్ సంస్థ తన టీకా లేబుల్‌ను నవీకరించింది. టీటీఎస్ వల్ల, కొందరు రోగులు దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లు, కొన్ని సందర్భాల్లో చివరికి మరణాలు సంభవించాయని మనకు పొడికథలుగా మాత్రమే తెలుసు. అలాంటప్పుడు టీకాను కొనసాగించడం లేదా కొనసాగించకపోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి? మనకు ప్రత్యామ్నాయం ఉందా?గగన్‌దీప్ కాంగ్ మనకు తెలియని వాటి గురించి వివరించారు. ‘‘ప్రమాదం వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇది భౌగోళికతపై కూడా ఆధారపడి ఉండొచ్చు. భౌగోళికత సమస్యను రోటావైరస్ టీకాల కోసం మనం చేసినట్లుగా ఫార్మావిజిలె¯Œ ్స ద్వారా మాత్రమే లెక్కించవచ్చు. నిష్క్రియాత్మకంగా అంటే ప్రజలు సమస్యను నివేదించే వరకు వేచి ఉండటం మరొక మార్గం. ఈ విధానంలో ఉన్న సమస్య ఏమిటంటే, టీకా వేసిన మొదటి కొన్ని గంటలలో లేదా రోజులలో దుష్ప్రభావం చూపకుంటే అది టీకాతో సంబంధం ఉన్నదిగా గుర్తించబడకపోవచ్చు.ప్రమాదం–ప్రయోజనం నిష్పత్తి, ముఖ్యంగా డెల్టా వేవ్ విషయంలో చూస్తే, ప్రయోజనమే ఎక్కువగా ఉండింది; ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా, యువకులకు కొంత తక్కువగా. పాశ్చాత్య దేశాలను అనుసరించి, 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కోవిషీల్డ్‌ను వేయడం నిలిపివేసి ఉంటే, మన ప్రత్యామ్నాయం ‘కోవాక్సిన్ ’ అయివుండేది. ఇది తక్కువ సరఫరాలో ఉంది. ఫలితంగా యువకులకు రోగనిరోధక శక్తి విస్తరించేది. భారతదేశానికి నిర్దిష్టంగా టీటీఎస్ డేటా లేనందున, పర్యవేక్షించడం కష్టంగా ఉండేది’’ అని ఆమె చెప్పారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన సెంటర్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కృష్ణన్ దీనిని విభిన్నంగా చెప్పారు: ‘‘అరుదైన దుష్ప్రభావం ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోవడానికి భారీస్థాయి ప్రజారోగ్య ప్రయోజనం కారణమైంది. దుష్ప్రభావాలపై దృష్టి కేంద్రీకరించడం వలన టీకా వేసుకోవాలా వద్దా అనే సంకోచం ఏర్పడుతుంది. అంటే మనం ఆ దుష్ప్రభావాలను దాచిపెట్టాలని కాదు... వెనక్కి చూసుకుంటే, మెరుగైన, మరింత సూక్ష్మమైన, సమతుల్యమైన సమాచారం సహాయపడి ఉండేదని చెప్పడం మెరుగు. అరుదైన దుష్ప్రభావాలను ఎదుర్కొన్న వారికి పరిహారం కోసం కూడా మనం ప్లాన్ చేసి ఉండవచ్చు.’’దుష్ప్రభావాల క్లెయిమ్‌లను పరిశీలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పీడకలగా మారేదని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు. టీకాలు అత్యంత వేగంగా పూర్తి చేయడానికి అవి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. మహమ్మారి దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. అత్యంత హాని కలిగే వారికి ప్రాధాన్యతనిచ్చి టీకాలు వేసేలా చూసుకోవాలి. భారతదేశంలో ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేని కాలంలో వేలాది మంది ప్రజలు చనిపోకుండా టీకాలు నిరోధించాయి.ఇక టీకాను అభివృద్ధి చేయడానికి తీసుకునే సాధారణ సమయం పదేళ్లు. దీనికి భిన్నంగా అస్ట్రా–జెనెకా టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దానిని తప్పక గుర్తించి, గౌరవించాలి. ఇది కచ్చితంగా లక్షలాది మందిని తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకుండా లేదా చనిపోకుండా నిరోధించింది. తీవ్రమైన దుష్ప్రభావాల గురించి బాగా అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నవారు పట్టించుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అంతేనా? ఏదైనా నిపుణుల సంఘం ఇచ్చిన ప్రతికూల సలహా దేన్నయినా అణచిపెట్టారా? రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సిన ముఖ్యమైన, చర్య తీసుకోదగిన సమాచారం ఏదైనా ఉండిందా? అలా కాదంటే మాత్రం వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేయడానికి ప్రయోజనపు సమతూకం స్పష్టంగా అనుకూలంగా ఉంది.భారతదేశంలోని భారీ జనాభాకు టీకాలు వేయకుండా ఆటంకం కలిగించే శక్తిమంతమైన టీకా వ్యతిరేక ఉద్యమాన్ని మనం అదృష్టవశాత్తూ చూడలేదు. రద్దీగా ఉండే నగరాలు, ఆరు లక్షలకు పైగా గ్రామాలలో ప్రజలు చెదిరిపోయి ఉన్నందున ప్రజారోగ్య స్పందన అనేది సహజంగానే పెద్ద ఎత్తున వ్యాధిగ్రస్తులను మరియు మరణాలను నిరోధించడానికి ఉద్దేశించారు. అందులో చర్చకు తావులేదు. కుటుంబాలు, సంఘాల ఎంపికకు టీకాను వదిలేసివుంటే, లక్షలాదిమందిని ప్రమాదంలో పడేసేది. వయసు లేదా భౌగోళికతపై లేని డేటాను వెతుకుతూ పోతే, టీకా కార్యక్రమం పట్టాలు తప్పివుండేది. ఒక్కో జిల్లాలో దాదాపు 20 లక్షల జనాభా కలిగిన భారతదేశంలోని దాదాపు 800కు పైగా జిల్లాల్లోని జిల్లా ఆరోగ్య కార్యకర్తలు అప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నారు.కొన్ని సమయాల్లో, మంచి (ఈ సందర్భంలో, దుష్ప్రభావాలను పర్యవేక్షించడం) అనేది కూడా గొప్ప శత్రువుగా (లక్షలాదిమందికి టీకాలు అందని అపాయం ఉండటం) మారవచ్చు. భారతదేశానికి సంబంధించి, ఈ క్షణపు వాస్తవం ఇది!- వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి; మాజీ ప్రధాన కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- శైలజా చంద్ర -
భరోసా కావాలి!
పిల్ల పోయినా... పురుటి కంపు పోలేదని ఒక ముతక సామెత. కరోనా అనే మాట క్రమంగా విన మరుగవుతూ వస్తున్నా, దాని ప్రకంపనలు మాత్రం మానవాళిని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా టీకా కోవిషీల్డ్‌పై తాజాగా వస్తున్న వార్తలే అందుకు తార్కాణం. సదరు టీకా తీసుకోవడం వల్ల మనిషిలో రక్తం గడ్డలు కట్టడం, రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం (వైద్య పరిభాషలో ‘థ్రోంబో సైటోపేనియా సిండ్రోమ్’ – టీటీఎస్) లాంటి అరుదైన దుష్ప్రభావాలుంటాయని దాన్ని రూపొందించిన బ్రిటన్ దిగ్గజ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా లండన్ కోర్టులో ఒప్పుకుంది. దాంతో గత వారం గందరగోళం మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాను ఉపసంహరిస్తు న్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించడంతో, భారత్‌లో కోవిషీల్డ్‌గా, యూరప్‌లో వాక్స్‌జెవ్రి యాగా అమ్ముడైన కోవిడ్ టీకాపై రచ్చ పరాకాష్ఠకు చేరింది. కరోనా టీకాల భద్రతపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా కొత్త ఊపిరినిచ్చాయి. మన దేశంలో సుప్రీమ్ కోర్ట్ సైతం ఆస్ట్రాజెనెకా టీకాపై వచ్చిన పిటిషన్ విచారణకు అంగీకరించడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కోవిడ్ మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో ప్రజారోగ్యంలో ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా టీకా కీలక భూమిక పోషించింది. క్లినికల్ పరీక్షల అనంతరం 2021 జనవరి 4న టీకా తొలి డోస్ వినియోగించారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 250 కోట్ల డోసులు వేశారు. లక్షలాది ప్రాణాలను కాపాడారు. 2021 ప్రథమార్ధంలో భారతదేశంలో డెల్టా వేరియంట్ పెచ్చరిల్లినప్పుడు కూడా ఇదే సంజీవని. ప్రపంచదేశాల మధ్య టీకాల సరఫరాలో చిక్కులున్నప్పుడూ ఆ మానవతా సంక్షోభ పరిష్కారానికి అందుబాటులో ఉన్న కొన్నిటిలో ఇదీ ఒకటి. ఫైజర్, మోడర్నా, నోవావ్యాక్స్, వగైరాల లానే ఈ టీకా కూడా అనేక స్థాయుల పరీక్షలకు లోనైంది. మూడు విడతల ట్రయల్స్‌లో వేలాది ప్రజలపై పరీక్షలు చేసి, సురక్షితమనీ, ప్రభావశీలమనీ తేలాకనే అను మతులిచ్చారు. బ్రిటన్ సహా యూరప్‌లోని పలు దేశాల్లో 2021 ఆరంభంలో దీన్ని పంపిణీ చేశారు.నిజానికి, ఈ టీకా వినియోగం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉండవచ్చని బ్రిటన్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోనే చెప్పింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి 40 లక్షల కొత్త కేసులొస్తూ, కరోనా తీవ్రత భయం రేపుతున్న సమయమది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో... టీకాతో అరుదుగా వచ్చే ముప్పు కన్నా ఉపయోగాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి భావించాయి. పైగా, మహిళలు వాడే గర్భనిరోధక మాత్రల లాంటి అనేక ఇతర ఔషధాలతో పోలిస్తే ఈ టీకాతో రక్తం గడ్డలు కట్టే రేటు బాగా తక్కువనీ, ప్రతి వెయ్యిమందిలో ఒక్కరికే ఆ ప్రమాదం ఉంటుందనీ లెక్కల్లో తేల్చారు. అందుకే, ప్రపంచ క్షేమం కోసం ఈ టీకాను కొనసాగించారు. ఇక, భారత్ సంగతెలా ఉన్నా విదేశాల్లో కరోనా టీకాతో సహా ఏ ఔషధంతో ఇబ్బంది తలెత్తినా బాధితులకు నష్టపరిహార పథకాలున్నాయి. అయితే, అక్కడ కూడా నష్టపరిహారం అందడంలో చిక్కులు ఎదురవడంతో సమస్య వచ్చింది. టీటీఎస్ వల్ల బ్రిటన్‌లో కనీసం 81 మంది చనిపోగా, వందల మంది అనారోగ్యం బారిన పడ్డారు. నష్టపరిహారం కోరుతూ బాధిత కుటుంబాలు కోర్టుకెక్కాయి. అలా దాదాపు 51 కేసులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా లండన్‌లోని హైకోర్ట్‌లో తొలిసారిగా టీకా దుష్ప్రభావాలను అంగీకరించింది. సహజంగానే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 175 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకా డోసులు తీసుకున్న మన దేశ ప్రజానీకంలో కలకలం రేపింది. ఒక దశలో లక్షలాది ప్రజానీకాన్ని కాపాడి, ప్రపంచానికి రక్షాకవచంగా కనిపించిన టీకా ఇప్పుడిలా భయాందోళనలకు కారణం కావడం విచిత్రమే. కానీ, ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు మరో మార్గం లేని దశలో ఈ టీకాలే దిక్కయ్యాయని మర్చిపోరాదు. ప్రాణరక్షణ కోసం ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ, ఔషధ సంస్థలూ టీకాలను తీసుకురావడంలో కొంత హడావిడి పడివుండవచ్చు. లాభనష్టాలపై ప్రజల్ని మరింత చైతన్యం చేసి, టీకా కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు. అయితే, కోట్లాది ప్రాణాలకు ముందుగా ప్రాథమిక భద్రతే ధ్యేయంగా టీకాల వినియోగం త్వరితగతిన సాగిందని అర్థం చేసు కోవాలి. పైగా, టీకా దుష్ప్రభావాలు అత్యంత అరుదుగా కొందరిలోనే కనిపిస్తాయని వైద్య నిపు ణులు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నందున అతిగా ఊహించుకొని ఆందోళన చెందడం సరికాదు.ఆస్ట్రాజెనెకా వారి టీకా మంచిదే అయినా, ఫైజెర్, మోడర్నా లాంటి ఇతర టీకాలు మెరుగైనవని నిపుణుల మాట. మరింత భద్రత, ప్రభావశీలత ఉన్న ఎంఆర్ఎన్ఏ వెర్షన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు బాధితుల కేసులు. ఫలితంగా, ఆస్ట్రాజెనెకా తన టీకాలను ఉపసంహ రించుకోక తప్పలేదు. కోర్టు కేసులకూ, తమ ఉపసంహరణకూ సంబంధం లేదనీ, రెండూ కాకతాళీ యమేననీ ఆ సంస్థ చెబుతున్నా, ఇదంతా నష్టనివారణ చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది అటుంచితే, రోగుల భద్రతే తమ ప్రాధాన్యమని ఆస్ట్రాజెనెకా పునరుద్ఘాటిస్తే సరిపోదు. టీకా వాడకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలకు విరుగుడు ఆలోచించి, ప్రజల్లో భరోసా పెంచాలి. బాధ్యత వహించి, బాధిత రోగులకు సత్వర నష్టపరిహారం చెల్లించి తీరాలి. టీకాలో లోపమెక్కడ జరిగిందో క్షుణ్ణంగా పరిశోధించాలి. ప్రభుత్వాలు సైతం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. టీకా వినియోగం సురక్షితమేనని ప్రకటించడానికి అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో ఒకసారి సమీక్షించాలి. కఠినమైన ప్రమాణాలు పాటించకుండానే కోవిషీల్డ్ వినియోగానికి పచ్చజెండా ఊపిన నియంత్రణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు టీకాల పైన, వాటి తయారీదార్లపైన, చివరకు ఆరోగ్య వ్యవస్థ మీదే నమ్మకం సడలితే అది మరింత ప్రమాదం. -
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా సంస్థ తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్ నుంచి తొలగిస్తున్న సంస్థ ప్రకటించింది. కొన్ని వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్) కారణంగా చాలా అరుదుగా థ్రోంబోసిస్ అనే అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఈమేరకు సంస్థ వీటిని ధ్రువపరుస్తూ యూకే కోర్డులో పత్రాలను అందజేసింది. అనంతరం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.కొత్త కొవిడ్ వేరియంట్లతో పోరాడే వ్యాక్సిన్‌ను ఇకపై సంస్థ తయారు చేయదని, దానికి సంబంధించిన డ్రగ్‌ను సరఫరా చేయదని సంస్థ స్పష్టం చేసింది. ఐరోపాలో సరఫరా చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ వాక్స్జెవ్రియా మార్కెటింగ్‌ను తొలగిస్తున్నట్లు చెప్పింది. అధిక సరఫరా వల్ల దీనికి డిమాండ్ తగ్గిందని పేర్కొంది. ఇకపై ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి జరగదని వివరించింది.వ్యాక్సిన్‌ను రూపొందించడానికి గతంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఆస్ట్రాజెనెకా ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యూకే ఆధారిత ఫార్మా కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్ అందించేందుకు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ఒకపై ఆ ఒప్పందాలు రద్దైనట్లు తెలిసింది.ఇదీ చదవండి: సిబ్బంది అనారోగ్యంతో 70కి పైగా విమానాలు రద్దుఅసలేం జరిగిందంటే..యూకేకు చెందిన జామీ స్కాట్ అనే వ్యక్తి 2021లో కొవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. అప్పటినుంచి నిత్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వైద్య పరీక్షలు చేసిన అనంతరం తన శరీరంలో రక్తం గడ్డకడుతుందని వైద్యులు గుర్తించారు. అయితే టీకా వేయించినప్పటి నుంచి ఈ సమస్య ఉండడంతో తన అనారోగ్యానికి అదే కారణమని అనుమానం వ్యక్తంచేశారు. మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత తన పరిస్థితికి టీకానే కారణమని నిర్థారణ అయింది. తాను థ్రోంబోసైటోపెనియా, థ్రాంబోసిస్ బారిన పడినట్లు తేలింది. దాంతో యూకే కోర్టులో దావా వేశారు. తాజాగా కంపెనీ వివరణ ఇస్తూ చాలా అరుదుగా ఇలాంటి వాటికి అవకాశం ఉందని అంగీకరించింది. -
కొవిషీల్డ్ వివాదం.. బీజేపీపై అఖిలేశ్ యాదవ్ ఫైర్
లక్నో: కొవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదంపై సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో ప్రజలకు గుండె సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సైంటిస్టులు తేల్చితే దీనికి బాధ్యులెవరని అఖిలేశ్ ప్రశ్నించారు. సామాన్య ప్రజల జీవితాలను కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని మండిపడ్డారు. ఈ విషయమై బుధవారం(మే1) అఖిలేశ్ ఇటావాలో మాట్లాడారు. వ్యాక్సిన్ల విషయంలో బీజేపీ పెద్ద నేరం చేసిందన్నారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం కంటే పెద్ద నేరమన్నారు. ‘‘ఏక్ మే ఔర్ బీజేపీ గయ్’’ అని ఎద్దేవా చేశారు.మరోవైపు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా కొవిషీల్డ్ వివాదంపై స్పందించారు. ఒకపక్క కొవిషీల్డ్‌తో ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా కేంద్రం ఇంకా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పడమేంటన్నారు. యువత గుండె జబ్బులతో కుప్పకూలడానికి వ్యాక్సిన్‌కు లింక్ ఉందన్న ప్రచారం జరుగుతోందని చెప్పారు. కాగా, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మాట వాస్తవమేనని వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన యూకే కంపెనీ ఆస్ట్రాజెనెకా ఒప్పుకోవడంతో వివాదం రేగింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో 90 శాతం మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్నే తీసుకోడం గమనార్హం. — ANI (@ANI) May 1, 2024 -
అలాంటి వాటితోనే మరింత భయం: టాలీవుడ్ డైరెక్టర్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని తాజాగా ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రకటించడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఏకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోవిషీల్డ్ తీసుకున్నవారు మరింత భయపడుతున్నారు. తాజాగా ఈ వార్తలపై టాలీవుడ్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను స్పందించారు. వ్యాక్సిన్‌పై వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. కోవిషీల్డ్ గురించి వస్తున్న వార్తలపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్ భయం కంటే.. ఇలాంటి సగం సగం నాలెడ్జ్ కథనాలతో కలిగే ఒత్తిడి మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా దెబ్బతీస్తుందని తెలిపారు. ఇలాంటి వార్తలను అస్సలు పట్టించుకోవద్దని.. ప్రశాంతంగా, సరదాగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అంతే కాకుండా వ్యాక్సిన్ ప్రభావం గురించి ఓ క్లిప్‌ను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ ఏడాది శైలేశ్ కొలను తెరకెక్కించిన సైంధవ్ సంక్రాంతి రిలీజైన సంగతి తెలిసిందే. For people who have been terrified after the news about Covishield broke out. The stress from all the memes and half baked articles will damage you more than anything else. Stay calm and have fun. pic.twitter.com/DGgxn4mGXG— Sailesh Kolanu (@KolanuSailesh) April 30, 2024 -
కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం 'ఆస్ట్రాజెనెకా' (AstraZeneca) కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. అయితే ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణమవుతుందని ఇటీవల అంగీకరించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆస్ట్రాజెనెకా అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌కు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని దేశంలో విస్తృతంగా ఉపయోగించారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే ఫిటిషన్ వేశారు. జామీ స్కాట్ 2021 ఏప్రిల్‌లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ తరువాత చాలామంది దీనిపై కేసులు వేయడం మొదలుపెట్టారు.ప్రారంభంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ క్లెయిమ్‌లను వ్యతిరేకించింది. అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో.. TTS (థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ తక్కువవుతుందని అంగీకరించింది. -
మళ్లీ కోవిషీల్డ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తగిన డిమాండ్ లేకపోవడం, కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్ కోవిడ్ టీకా ఉత్పత్తిని తాజాగా పునఃప్రారంభించామని దాని తయారీసంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా బుధవారం ప్రకటించారు. కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ‘ ఇప్పటికే 60 లక్షల కోవోవ్యాక్స్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వయోజనులు కచ్చితంగా బూస్టర్ డోసులు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు తమ ఐచ్ఛికంగా కోవిషీల్డ్నూ తీసుకోవచ్చు. వచ్చే 90 రోజుల్లో 60–70 లక్షల డోసుల కోవిషీల్డ్ అందుబాటులో ఉండేలా చూస్తాం. డిమాండ్‌కు తగ్గట్లు స్టాక్‌ను పెంచేందుకు తొమ్మిది నెలల సమయం పట్టొచ్చు’ అని పూనావాలా చెప్పారు. చివరిసారిగా కోవిషీల్డ్ ఉత్పత్తిని సీరమ్ సంస్థ 2021 డిసెంబర్లో నిలిపేసింది. -
కోవిడ్ టీకాలకు కటకట..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో కోవిడ్ టీకాలకు కొరత ఏర్పడింది. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ల స్టాక్ పూర్తిగా ఖాళీ అయింది. టీకా కోసం ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్తున్నవారికి ప్రస్తుతం అందుబాటులో లేవన్న సమాధానమే వస్తోంది. మరోవైపు చైనాతోపాటు పలు దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నాయని వస్తున్నవార్తలతో జనంలో ఆందోళన కనిపిస్తోంది. డిమాండ్ మేరకు టీకాలను సరఫరా చేయకపోవడం, ప్రభుత్వ కోల్డ్ చెయిన్ పాయింట్ (సీసీపీ), డిస్ట్రిక్స్ వ్యాక్సి నేషన్ పాయింట్ (డీవీ ఎస్) కేంద్రాలకు ఇప్పటికే సర ఫరా చేసిన కోవిషీల్డ్ టీకాల గడువు ముగిసిపోవడం వంటివి ఇబ్బందికరంగా మారింది. ఇదే టీకా తొలి రెండు డోసులు వేసుకున్న వారితోపాటు విదేశాలకు వెళ్లాల్సినవారు వ్యాక్సిన్లు అందుబాటులో లేక ప్రైవేటులో తీసు కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని సొమ్ముచేసు కుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు టీకాలతోపాటు అదనపు చార్జీలు అంటూ అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోవిషీల్డ్ గడువు ముగియడంతో.. కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం ప్రభుత్వం ప్రజలకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఇస్తోంది. మెజార్టీ ప్రజలు మొదటి, రెండో డోసు కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నారు. బూస్టర్ డోసులు పంపిణీ మొదలైనా ఇటీవలి వరకు పెద్దగా డిమాండ్ కనిపించలేదు. కానీ కొన్నిరోజులుగా కోవిడ్ కొత్త వేరియంట్లను గుర్తించడం, ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో మళ్లీ ప్రభావం చూపిస్తుండటంతో.. బూస్టర్ (ప్రికాషన్) డోసు వేసుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,24,42,135 ఫస్ట్‌డోసు, 3,15,40,633 సెకండ్ డోసు టీకాలను పంపిణీ చేశారు. వీరిలో 1,32,93,044 మంది ప్రికాషన్ డోసు తీసుకోగా.. మరో 1,61,38,443 మందికి అవసరం ఉంది. ప్రభుత్వం ఇంతకు ముందు సరఫరా చేసిన కోవిïషీల్డ్ టీకాల గడువు ఈ నెల 10వ తేదీతో ముగిసి పోయింది. దీనితో మిగిలిన టీకాలను పక్కన పడేశారు. సంబంధిత వెబ్సైట్ కూడా మూడు రోజుల కిందే మూతపడింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా 2.77 లక్షల డోసులే స్టాకు ఉంది. ఈ వ్యాక్సిన్ గడువు కూడా ఈ నెలా ఖరుతో ముగియ నున్నట్టు సమాచారం. టీకా నిల్వలు దగ్గరపడుతుండటంతో వైద్య సిబ్బంది కూడా ఏమీ చేయ లేక చేతులెత్తేస్తున్నారు. వ్యాక్సినే షన్ కోసం ఆస్పత్రు లకు వెళ్తున్నవారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కోవిషీల్డ్ బూస్టర్ డోస్ లేదన్నారు ఈ నెల 23న అమెరికా వెళ్లాల్సి ఉంది. వాక్సినేషన్ తప్పనిసరి చేశారు. ఇప్పటికే మొదటి, రెండు డోసులు కోవిషీల్డ్ తీసుకున్నా. బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంది. టీకా కోసం గురువారం బాలాపూర్ పీహెచ్‌సీకి వెళ్లాను. కానీ ఆ టీకా లేదన్నారు. ఎనిమిది రోజుల్లో ప్రయాణం ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. – అశోక్‌కుమార్, మీర్పేట్, హైదరాబాద్ టీకాల కోసం లేఖ రాసినా స్పందించని కేంద్రం కేంద్ర ప్రభుత్వం కంపెనీల నుంచి కరోనా టీకాలను తీసుకుని దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. ఆయా రాష్ట్రాల అవసరాలు, డిమాండ్‌ను బట్టి పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలో కోవిడ్ టీకాల స్టాకు ఖాళీ అవుతుండటంతో వెంటనే పంపాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కొన్నిరోజుల కిందే కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. కానీ దీనిపై కేంద్రం ఇంతవరకు స్పందించలేదని.. రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా కేంద్రం నుంచి టీకాలు అందడం లేదని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. -
గుడ్ న్యూస్.. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులు ఫ్రీ..!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి. రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్‌కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. చదవండి: కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్‌లోకి ఎంట్రీ..! -
టీకా వల్లే నా కూతురు చనిపోయింది..వెయ్యి కోట్లివ్వండి..
ముంబై: ‘‘కోవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ వల్లే నా కుమార్తె మరణించింది. కేంద్ర ప్రభుత్వ కమిటీ కూడా దీన్ని ధ్రువీకరించింది. కనుక రూ.వెయ్యి కోట్ల పరిహారం ఇప్పించండి’’ అంటూ నాసిక్‌కు చెందిన స్నేహాల్ అనే వైద్య విద్యార్థి తండ్రి లునావత్ దిలీప్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతోపాటు, టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్కు, దానికి తోడ్పాటు అందించిన బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే విచారణ నాటికి సమాధానమివ్వాలని ఆదేశించింది. చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..! -
ఉచిత బూస్టర్ డోస్ 24/7
సాక్షి, హైదరాబాద్: నగర వ్యాప్తంగా ఉచిత బూస్టర్ డోస్ కార్యక్రమం ఊపందుకుంటోంది. గత ఏప్రిల్ 10 నుంచి ఇప్పటిదాకా 60 ఏళ్లు పైబడిన వారికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమం నిర్వహించగా, తాజాగా దీనిని 18 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా విస్తరించారు. రెండో డోస్ నుంచి 6 నెలల వ్యవధి వచ్చిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ టీకా అందించే ప్రక్రియను గత శుక్రవారం ప్రారంభించారు. నగర వ్యాప్తంగా మొత్తం 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ కార్యక్రమం కొనసాగనుంది. ఆఫీసులు.. కళాశాలల్లోనూ.. ఇటీవల కోవిడ్ కేసులు పెరగడం, కొత్త వేరియంట్ల రాకపై అంచనాల నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కోవాగ్జిన్, కోవిషీల్డ్ బూస్టర్డోస్లకు ఆర్డర్ ఇచి్చంది. ఇవి అందుబాటులోకి రావడంతో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో కూడా టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలలోనూ ఏర్పాటు చేస్తున్నారు. గత శనివారం వరకూ వానల కారణంగా విద్యా సంస్థలు మూసి ఉండడంతో సోమవారం నుంచీ వీటి ఏర్పాటు మొదలైంది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రానికి స్పందన చాలా బాగుందని, తొలిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యవధి నిర్ణయించుకోగా లబి్ధదారులు పెరగడంతో రాత్రి 8 గంటల దాకా కూడా కొనసాగించామని సెంటర్ ఇన్చార్జి సుధా ఓంకార్ చెప్పారు. 20 వేలు దాటిన ఫ్రీ బూస్టర్ గత 15వ తేదీ నుంచి మంగళవారం దాకా 20,485 వరకు వ్యాక్సిన్లు అందించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్ చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో కాకుండా అభ్యర్థనను అనుసరించి 100 మందికి మించి విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ బూస్టర్ డోస్ కేంద్రాలను నెలకొల్పుతున్నామని చెప్పారు. ఆయా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ 24/7 కొనసాగుతుందన్నారు. (చదవండి: డిటెన్షన్ సెంటర్ @ వికారాబాద్! ) -
మరో మైలురాయికి సిద్ధమా?
కరోనా ఇప్పటికీ ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపెట్టలేదని వార్తలు వస్తున్న వేళ... ఆదివారం ఒకింత సంతోషకర సమాచారం వచ్చింది. మనదేశంలో వేసిన కోవిడ్–19 టీకా డోసుల సంఖ్య తాజాగా 200 కోట్ల మైలురాయిని చేరుకుంది. దేశ వయోజనుల్లో 96 శాతానికి కనీసం ఒక డోసు, 87 శాతానికి రెండు డోసులూ అందినట్లయింది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకాకరణ కార్యక్రమంలో ఇది ఓ అరుదైన విన్యాసం. ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే, ‘భారతదేశం మరోసారి చరిత్ర సృష్టించింది.’ టీకాలపై అపోహలు, మందకొడి టీకాకరణ, టీకాల కొరత – ఇలా సవాలక్ష సమస్యలు ఎదురైనా, 2021 జనవరి 16న మొదలుపెట్టి, 18 నెలల్లో ఇన్ని కోట్ల కరోనా టీకా డోసులు వేయడం కచ్చితంగా చరిత్రే. కాకపోతే, ‘ముందు జాగ్రత్త మూడో డోసు’ను వయోజనులకు ఉచితంగా వేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించే వేళకు దేశంలో గత నాలుగు నెలల్లోకెల్లా గరిష్ఠస్థాయికి మళ్ళీ కరోనా కేసులు పెరిగాయి. అలక్ష్యం వదలాలని అందరికీ గుర్తుచేస్తున్నాయి. మన దేశంలో తొలి శతకోటి డోసులకు 9 నెలలు పడితే, ఇప్పుడీ రెండో శతకోటి సంబరానికీ మళ్ళీ 9 నెలలే పట్టింది. టీకాలు వేయడంలో వేగం తగ్గలేదనడానికి ఇదే సాక్ష్యమని ప్రభుత్వ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి. లెక్కల్లో చూస్తే అది నిజమే కానీ, క్షేత్రస్థాయిలో నిజంగా వేగం తగ్గలేదంటారా అన్నది విమర్శకుల ప్రశ్న. వ్యవస్థాగతంగా ప్రభుత్వ సత్వర జోక్యం వల్లే దేశీయంగా ఒకటికి మించి కరోనా టీకాలు బయటికొచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రి జవాబు. దేశాన్ని ఇవే కాపాడాయనీ, ముఖ్యంగా ఈ ఏడాది థర్డ్ వేవ్‌లో భారత్‌లో మరణాలు తక్కువగా ఉన్నాయంటే అదే కారణమనీ మంత్రివర్యుల మాట. దేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారీ ‘కోవిషీల్డ్’ 160 కోట్లు, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్’ 33.5 కోట్లు, బయొలాజికల్ ‘ఇ’ వారి ‘కోర్బెవ్యాక్స్’ 6.5 కోట్లు – ఇలా పిన్నపెద్దలకు ఒకటికి మూడు డోసుల వంతున మొత్తం 200 కోట్ల డోసుల మార్కు చేరగలిగాం. ఇప్పటి దాకా వేసిన డోసుల్లో దాదాపు 71 శాతం గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించినవే. అలాగే, మొత్తం డోసుల్లో 48.9 శాతం ఆడవారికి అందాయని లెక్క. రెండేళ్ళ పైచిలుకు క్రితం అంతుచిక్కని మాయదారి రోగంతో యావత్ ప్రపంచంతో పాటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న అధిక జనాభా దేశం ఇప్పుడు కాస్తంత ఊపిరి పీల్చుకోవడం వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల, వైద్యుల, పలు వర్గాల ఫ్రంట్ లైన్ యోధుల అవిశ్రాంత కృషి ఉంది. దేశీయంగా టీకాల అభివృద్ధి, డోసులు వృధా కాకుండా నిరంతర సమీక్షలతో ప్రాధాన్యతా క్రమంలో సమర్థంగా టీకాలేస్తూ వచ్చిన విధానం, ప్రజలకూ – పాలకులకూ తక్షణ సమాచారం అందించే ‘కోవిన్’ పోర్టల్ – ఇలా అనేకం ఈ విజయానికి తోడ్పడ్డాయి. ఎవరేమన్నా కరోనాపై టీకాల యుద్ధంలో అనేక దేశాల కన్నా భారత్ ముందంజలో ఉంది. ఐరోపా అంతటా కలిపి 130 కోట్ల డోసులైతే... మన దగ్గర 200 కోట్ల డోసులు వేయడం, మరో 23 కోట్లకు పైగా డోసుల్ని 50కి పైగా దేశాలకు ఎగుమతి చేయడం విశేషం. ఇవి కాక దాదాపు మరో 10 కోట్ల డోసులు నిల్వలో సిద్ధంగా ఉన్నాయి. అంటే, గత 18 నెలల్లో భారత్ దాదాపు 233 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేసిందన్న మాట. ఇది రొమ్ము విరుచుకొనే విషయమే. ప్రపంచ జనాభాలో 17.5 శాతం, అందులోనూ 95 కోట్ల మంది వయోజనులూ ఉన్న దేశం మనది. ప్రతి ఇద్దరి మధ్య కనీసం నాలుగు భిన్నాభిప్రాయాలుంటాయనే ఇలాంటి దేశంలో ఇప్పటికి ఏడు విడతల్లో ఇంతమంది స్వచ్ఛందంగా టీకాకరణకు ముందుకొచ్చేలా చేయడం అంత సులభ మేమీ కాదు. అందులో ప్రభుత్వం విజయం సాధించింది. 75 రోజుల పాటు ఉచిత ‘ముందు జాగ్రత్త మూడో టీకా’ ప్రకటనతో మరోసారి ఊపు తేవాలని ప్రభుత్వ ప్రయత్నం. ఇదీ విజయవంతమైతే, అయిదారు నెలల్లో 250 కోట్ల డోసుల మైలురాయినీ దాటేస్తాం. నిజానికి, 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు ఈ జనవరి 10 నుంచీ, 18 –59 ఏళ్ళ మధ్యవయసు వారికి ఏప్రిల్ 10 నుంచే ప్రభుత్వం మూడో డోస్‌కు వీలు కల్పించింది. అయినా, ఆరు నెలల్లో నూటికి అయిదుగురే వేయించుకున్నారు. రెండు, మూడు డోసుల మధ్య ఉండాల్సిన విరామాన్ని తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు ఈ జూలై మొదట్లో సర్కార్ తగ్గించింది. అయినా అదే పరిస్థితి. ఉద్ధృతి తగ్గిందంటూ ఉదాసీనత ప్రజల్లో పేరుకుపోయిందనడానికి ఇది ఉదాహరణ. కానీ, కరోనా పూర్తిగా పోలేదని పెరుగుతున్న కేసులు తట్టి చెబుతున్నాయి. కొత్తగా మంకీ పాక్స్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళనకరం. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు, ముందు జాగ్రత్త డోసు లాంటివి అశ్రద్ధ చేయవద్దని వైద్యులు చెవినిల్లు కట్టుకొని మరీ చెబుతున్నది అందుకే. కేంద్రం సైతం 18–59 ఏళ్ళ వారికి మూడో డోసుకు ఓకే చెప్పడానికి తాత్సారం చేసింది. ప్రజారోగ్య రీత్యా ఏ మహమ్మారికైనా ఉచితంగా టీకా వేయాల్సిన పాలకులు 75 రోజులే ఉచితం అనడం సరికాదు. డబ్బులకే టీకా అంటే ఆరోగ్యంలోనూ ఆర్థిక, భౌగోళిక అంతరాలు పెరుగుతాయి. 2017 నాటి జాతీయ ఆరోగ్య విధానంలోని సమానత్వ భావనకే ఇది విరుద్ధం. అలాగే, కరోనా విజయగాధను ఇతర టీకాలకూ విస్తరించాలి. సాధారణ పిల్లల టీకాలను నేటికీ నూటికి 80 మందికే టీకాలిస్తూ, నేపాల్, శ్రీలంక కన్నా మనం వెనుకబడి ఉన్నాం. ద్విశత కోటి విజయగానంతో ఊరుకోకుండా బాలల టీకాల్లోనూ భారత్ ఉపక్రమించడానికి ఇదే సరైన సమయం. -
ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు ఆగిపోతున్న వ్యాక్సిన్ల ఉత్పత్తి
కరోనా విషయంలో పరస్పర విరుద్ధమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఓ వైపు కేసులు పెరుగుతుంటే మరో వైపు వ్యాక్సిన్లు అమ్ముడుపోక ఫార్మా కంపెనీలు లబోదిబోమంటున్నాయి. తమ దగ్గర నిల్వ ఉన్న స్టాకును ఉచితంగా అయినా ఇచ్చేందుకు సై అంటున్నాయి. కరోనా వ్యాక్సిన్లకు మార్కెట్లో డిమాండ్ లేనందున తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పూనేలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఇప్పటికే 20 కోట్ల కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం నిల్వ ఉన్న డోసులు 2021 డిసెంబరులో తయారు చేసినవిగా తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి నుంచి 9 నెలల పాటు వాడుకునే వీలుంది. డిసెంబరు స్టాకే ఇంకా క్లియర్ కాకపోవడంతో కొత్తగా తయారీ వృధా అనే అంచనాలతో సీరమ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఎవరైనా అడిగితే ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని కూడా చెబుతోంది. గత డిసెంబరులో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తరుణంలో ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. విమాన సర్వీసులు రద్దు చేశాయి. కరోనా ఆంక్షలు విధించాయి. అయితే ఒమిక్రాన్‌తో ముప్పు తక్కుగా ఉండటంతో 2022 ఫిబ్రవరి నుంచి క్రమంగా ఆంక్షలు తొలగించాయి. దీంతో సాధారణ జీవితం మొదలైంది. అంతా సవ్యంగా సాగుతున్న దశలో ఏప్రిల్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మళ్లీ మాస్క్ తప్పనిసరంటూ ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. గతేడాది కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విలయ తాండవం చేసింది. లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. ఆ వెంటనే ప్రభుత్వాలు అప్రమత్తమై వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేశాయి. వ్యాక్సిన్ మిత్ర పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున వ్యాక్సిన్లపై నిషేధం విధించింది. ఎన్ని వ్యాక్సిన్లు ఉంటే అన్నింటినీ ఇండియాలోనే ఉపయోగించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం 2021 డిసెంబరులో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడటంతో మరోసారి బూస్టర్ డోసును కూడా అందించారు. ఆ తర్వాత ప్రైవేటు సెక్టారులో కూడా వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఆంక్షలన్నీ తొలగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో కరోనా వ్యాక్లిన్లకు డిమాండ్ లేదు. దీంతో ఒక్కో కంపెనీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే యూఎస్‌కి ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ ఈ ప్రటకన చేయగా తాజాగా ఇండియన్ ఫార్మా కంపెనీ సీరమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైతం ఇదే తరహా నిర్ణయం వెలువరించింది. చదవండి👉🏾 జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం ! -
రూ. 225కే కోవిడ్ ప్రికాషన్ డోస్
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే కరోనా టీకా ప్రికాషన్ డోస్‌ను రూ.225కే ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కోవిషీల్డ్ టీకా ఒక్కో డోస్ ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించాం’అని ఎస్ఐఐ సీఈవో అథర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. అదేవిధంగా, ‘మా సంస్థ తయారు చేసే కోవాగ్జిన్ టీకా ఒక్కో డోస్‌ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,200కు బదులుగా రూ.225కే అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నాం’అని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా వెల్లడించారు. 18 ఏళ్లు నిండి, రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా 10వ తేదీ నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కోవిడ్ ప్రికాషన్ డోస్‌కు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన వ్యాక్సిన్ల ధర
వ్యాక్సిన్ తయారీ సంస్థలు శుభవార్త చెప్పాయి. కరోనాకి విరుగుడుగా పని చేసే వ్యాక్సిన్ల ధరలను భారీగా తగ్గించాయి. ఈ మేరకు ఈ వ్యాక్సిన్ల తయారీ సంస్థలు శనివారం వేర్వేరుగా ప్రకటించాయి. దీంతో దేశంలో తొలి, మలి వ్యాక్సిన్లుగా వచ్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. కరోనా ముప్పు తొలగిపోయిందనుకుంటున్న ప్రతీసారీ కొత్త వేరియంట్ తెరమీదకు వస్తోంది. ఒమిక్రాన్ ముచ్చట మరిచిపోయేలోగానే ఎక్స్ఈ వేరింట్ దాడి చేస్తోంది. దీంతో కరోనా వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు తప్పనిసరిగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు హాస్పటిల్స్‌కి కూడా తక్కువ ధరకే వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని సీరమ్ ఇన్సిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. సీరమ్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఒక డోసు ఇంతకు ముందు రూ.600గా నిర్ణయించారు. కాగా ఈ ధరను రూ.225కి తగ్గించారు. ఇదే సమయంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక డోసు ధర రూ.1,200 ఉండగా ఇప్పుడది రూ. 225కి మార్చారు. కరోనా కొత్త వేరియంట్ల నేపథ్యంలో 18 ఏళ్ల వయసుపైబడి సెకండ్ డోస్ తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు ముందు జాగ్రత్తగా వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. -
ఓపెన్ మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోస్.. ధర ఎంతంటే ?
కరోనా తీవ్రత తగ్గి జనజీవతం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.అయితే ఇప్పటికీ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో 18 ఏళ్లు పైబడి ఇప్పటికే రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు బూస్టర్ డోసు వేసుకోవడం మంచిందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ తరుణంలో బూస్టర్ డోస్‌ను ఓపెన్ మార్కెట్లో అందిస్తున్నట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. దేశంలోనే తొలి కరోనా టీకా కోవిషీల్డ్‌ని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసింది. మొదటి రెండు డోసులు దాదాపుగా ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందించింది. కాగా బూస్టర్ డోసును ప్రభుత్వ ఆధ్వర్యంతో ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం అందించింది. కాగా ఇప్పుడు బూస్టర్ డోసును ఓపెన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో బయట మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోసుకు రూ. 600లుగా సీరమ్ నిర్ణయించింది. దీనికి స్థానిక పన్నులు అదనం అని సీరమ్ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా కొనుగోలుకు రూ. 600 ధర వర్తిస్తుందని, ఆస్పత్రులకు తక్కువ ధరకే సరఫరా చేస్తామని కూడా తెలిపింది. ఈ వ్యాక్సిన్ 2022 ఏప్రిల్ 10 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌వర్కర్లు 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసును ప్రభుత్వం ఉచితంగా అందివ్వనుంది. #LargestVaccineDrive Precaution/ booster Dose to be now available to all 18+ population group from 10th April, 2022, at Private Vaccination Centres.https://t.co/f0QDul20gz#CovidVaccine #IndiaFightsCorona @narendramodi @mansukhmandviya @blsanthosh @saudansinghbjp pic.twitter.com/dinGOwC4aq — Tajinder Singh Sran (@TajinderSTS) April 8, 2022 చదవండి: గుడ్ న్యూస్: బహిరంగ మార్కెట్లో విక్రయానికి 2 వ్యాక్సిన్లకు అనుమతి -
గుడ్ న్యూస్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులపై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. పాజిటివ్ కేసుల సంఖ్య కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, కరోనా కట్టడి కోసం దేశంలో ప్రజలు కోవిషీల్డ్, కోవాగ్జిన్ వాక్సిన్లను తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ల రెండు డోసులను తీసుకునేందుకు కేంద్రం.. కొన్ని వారాల గ్యాప్‌ను విధించింది. ఈ క్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై ఆదివారం కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్టీఏజీఐ(NTAGI) కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఇకపై 8-16 వారాల గ్యాప్‌తో రెండో డోసును తీసుకోవచ్చని పేర్కొంది. కాగా, ఎన్టీఏజీఐ సూచనల మేరకు మే 13, 2021 నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య గడువును 12-16 వారాల గ్యాప్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, డోసుల మధ్య గ్యాప్ తగ్గించడంతో వ్యాక్సిన్ తీసుకునే వారికి వెసులుబాటు కలిగింది. మరోవైపు కోవాగ్జిన్ వ్యాక్సిన్ షెడ్యూల్లో మాత్రం మార్పులేదని కేంద్రం తెలిపింది. కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశంలో వ్యాక్సిన్ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఇప్పటికే కోవిషీల్డ్‌తో పాటు కోవాగ్జిన్, రష్యన్ స్పుత్నిక్ వంటి వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లోనూ విక్రయించేందుకు కేంద్రం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్లను కేంద్రం విధించిన నిబంధనల మేరకే తీసుకోవాలని హెచ్చరించింది. ఇది చదవండి: దూసుకోస్తున్న 'అసని తుపాను'...భారీ నుంచి అతి భారీ వర్షాలు -
అవన్నీ తప్పుడు వార్తలు.. టీకా వృథాగా పోయే అవకాశమే లేదు..
న్యూఢిల్లీ: ఈ నెలాఖరుకు 50 లక్షల కోవిషీల్డ్ డోసులు వృథాగా పోయే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం హెచ్చరించింది. టీకాల లభ్యతపై వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆరంభం నుంచి రాష్ట్రాలతో సమీక్ష జరుపుతూనే ఉన్నామని, ఎక్కడా టీకా వృథాగా పోయే అవకాశమే లేదని తెలిపింది. టీకాలు నిరుపయోగంగా ఉన్న చోట నుంచి మరోచోటికి బదిలీ చేసే అవకాశం కూడా కల్పించామని పేర్కొంది. ఆయా సంస్థల వద్ద ఉన్న టీకాలను ఎక్స్పైరీ తేదీకి ముందే వినియోగించాలని ఆదేశించామని తెలిపింది. -
కోవాగ్జిన్, కోవిషీల్డ్ విక్రయానికి అనుమతి
న్యూఢిల్లీ: భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్లో అమ్మకానికి సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ గురువారం షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఈ రెండు టీకాలు ఇకపై సాధారణ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి. కొన్ని షరతులకు లోబడి ఈ రెండు వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. టీకా డేటా ప్రతి ఆరు నెలలకోసారి అందించాల్సి ఉంటుందని భారత ఔషధ నియంత్రణ మండలి తెలిపింది. ప్రతికూల ప్రభావాలపైనా పర్యవేక్షణ కొనసాగనుంది. అయితే వీటిని కేవలం ఆస్పత్రులు, క్లినిక్‌ల నుంచి మాత్రమే పొందగలుగుతారు. గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. అయితే బహిరంగ మార్కెట్లో విక్రాయానికి అనుమతించాలంటూ కోవాగ్జిన్ అభివృద్ది చేసిన భారత్ బయోటెక్, కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ సంస్థలు.. గత ఏడాది అక్టోబర్ 25న డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ, షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది. బహిరంగ మార్కెట్లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల ఒక్క డోసు రూ. 275గా నిర్ణయించినట్టుగా, సర్వీస్ చార్జీ మరో రూ. 150 ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1,200 రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. రోజురోజుకూ తగ్గుతున్న కరోనా కేసులు... వరుసగా మూడో రోజూ దేశంలో కోవిడ్ కేసులు తగ్గాయి. ఒక రోజులో 2,86,384 మంది కరోనావైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల వ్యవధిలో 20,546 కేసులు తగ్గాయని పేర్కొన్నది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతంగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 22,02,472 క్రియాశీల కేసులున్నాయి. నేటితో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,03,71,500కి పెరిగింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. 573 మరణాలతో మరణాల సంఖ్య 4,91,700కి చేరుకుంది. అయితే మరణాల సంఖ్యలోనూ తగ్గుదల నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 573 కొత్త మరణాలలో కేరళ నుండి 140 మరియు మహారాష్ట్ర నుండి 79 మంది ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజు 22 లక్షల మంది టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ డోసుల పంపిణీ 163 కోట్లను దాటింది. -
గుడ్‌న్యూస్: భారీగా తగ్గనున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు!
కొవిడ్ వ్యాక్సిన్లు త్వరలో రెగ్యులర్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయన్న విషయం తెలిసిందే. డ్రగ్ నియంత్రణ విభాగం నుంచి అప్రూవల్ దక్కిన వెంటనే టీకాలు మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నాయి ఆయా కంపెనీలు. ఈ క్రమంలో ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఈ రెండు కొవిడ్ వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ల ధరలు ఒక్కో డోసు రూ. 275గా నిర్ధారణ కానున్నాయని, అదనంగా సర్వీస్ ఛార్జీ మరో 150 రూపాయలతో మొత్తం.. రూ. 425గా ఉండొచ్చని ఆ కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు నేషనల్ ఫార్మాసుటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ధరల నియంత్రణ.. తగ్గింపు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 19న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ‘కోవిడ్-19పై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ’ కొన్ని షరతులకు లోబడి వయోజన జనాభాలో ఉపయోగించడానికి కోవిషీల్డ్ మరియు కోవాగ్జిన్‌లకు సాధారణ మార్కెట్ ఆమోదం ఇవ్వాలని సిఫార్సు చేసింది. అలాగే పనిలో పనిగా ధరల నిర్ధారణపై కూడా ఎన్‌పీపీఏను కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1,200రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ రెండూ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతులు ఉన్న వ్యాక్సిన్లు. ఒకవేళ వ్యాక్సిన్ కు మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ దక్కితే కేవలం అత్యవసర పరిస్థితులు, రిజర్వ్ డ్ కండిషన్స్ లో మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండదు. భారత్‌లో వ్యాక్సినేషన్ ఉధృతిగా సాగుతున్న టైంలోనే కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ కంపెనీలు రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. -
Covid Vaccine: 3 నెలలకే కోవి‘షీల్డ్’ మాయం!
లండన్: ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత మూడు నెలలకు అది కల్పించే రక్షణ తగ్గుతోందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. బ్రెజిల్, స్కాట్లాండ్లో సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించామని, దీన్ని ఇచ్చిన వారికి బూస్టర్ డోసులివ్వడం ద్వారా రక్షణ పెంచాలని సూచించింది. ఈ టీకా కోవిషీల్డ్ పేరిట ఇండియాలో గుర్తింపు పొందింది. వేరియంట్‌ను బట్టి టీకా రక్షణ తగ్గడం ఆధారపడి ఉందని పరిశోధకులు చెప్పారు. తమ పరిశోధన బూస్టర్ డోసుల ప్రాముఖ్యాన్ని వివరిస్తోందని ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ శ్రీనివాస్ విఠల్ కటికిరెడ్డి చెప్పారు. రక్షణ తగ్గుతోందని తెలియగానే భారత ప్రభుత్వం బూస్టర్ డోసులివ్వడం ఆరంభించాలన్నారు. (చదవండి: ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి.. 60 నిద్ర మాత్రలు మింగేశాడు!) -
కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ టీకా ఉత్పత్తి 5 రెట్లు ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం నెలకు 25–27.5 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకా ఉత్పత్తి చేస్తుండగా, భారత్ బయోటెక్ నెలకు 5నుంచి 6 కోట్ల డోసుల కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ రెండు సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో 90% మేర సాధించినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి మంగళవారం లోక్‌సభకు వెల్లడించారు. చదవండి: 2011 ఎస్ఈసీసీ డేటాలో లోపాలు! -
కోవిషీల్డ్ గడువును తిరిగి 4–6 వారాలకు కుదించండి: తెలంగాణ మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: కోవిషీల్డ్ మొదటి, రెండో డోస్‌ల మధ్య కాలవ్యవధిని మొదట్లో ఉన్న మాదిరి 4 నుంచి 6 వారాలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వా న్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. టీకా డోసుల కొరత కారణంగా కాలవ్యవధిని గతంలో 12 వారాలకు పెంచడంతో లబ్ధిదారులు రెండో డోసు తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. వలస కూలీలు మొదటి డోస్ వేసుకున్నాక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, వారిని గుర్తించి రెండో డోస్ వేయడం కష్టంగా మారిందన్నారు. మొదటి డోస్ వేసుకున్న వారి వివరాలు కొవిన్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నా, ఆ జాబితా ఆ రాష్ట్రానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నామన్నారు. టీకాల మధ్య గడువును కుదిస్తే రెండో డోస్ వేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. అలాగే వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లు, హైరిస్క్ గ్రూప్ వారికి టీకా రెండో డోస్ వేసి 8–10 నెలలు దాటడం, కరోనా కొత్త వేరియెంట్లు వస్తుండటంతో వారికి బూస్టర్ డోస్ వేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ విషయాన్ని శుక్రవారం తనను కలిసిన విలేకరులకు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలోనే 75 లక్షల టీకా డోసులు ఉన్నాయని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు కాల వ్యవధిని తగ్గించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి డోస్ 90 శాతం, రెండో డోస్ 46 శాతం వేశామన్నారు. వ్యాక్సిన్‌పై ఇంటింటి సర్వేలు... టీకాల పంపిణీ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ నమూనా దేశంలోనే ఆదర్శంగా ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్త, జీహెచ్ఎంసీ అధికారి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు కౌన్సెలింగ్ చేశారని, అయితే గ్రామాల్లో వ్యాక్సినేషన్‌కు సరైన సహకారం అందడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో కలిసి ఇంటింటి సర్వే చేపడు తున్నామన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారి ఇళ్లకు స్టిక్కర్లు పెడుతున్నామన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 3.82 కోట్ల కరోనా డోసులను వేశామన్నారు. విమానాశ్రయంలో టెస్ట్‌లు... శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పాజిటివ్‌గా తేలిన వారిని ‘టిమ్స్’కు పంపి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నామని చెప్పారు. ఒకవేళ ఒమిక్రాన్ వస్తే పూర్తిగా నయమయ్యాకే టిమ్స్ నుంచి బయటకు పంపుతామన్నారు. ప్రభుత్వంలో 27 వేలకుపైగా పడకలుంటే, వాటిల్లో 25 పడకలకు ఆక్సిజన్‌ను సమకూర్చామన్నారు. అలాగే అందులో 6 వేలు ఆక్సిజన్, ఐసీ యూ పడకలను పిల్లల కోసం సిద్ధం చేశామన్నారు. -
కోవిషీల్డ్ బూస్టర్ కోసం సీరమ్ దరఖాస్తు
న్యూఢిల్లీ: కోవిషీల్డ్ కరోనా టీకాను బూస్టర్ డోసుగానూ అనుమతించాలని కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకుంది. రెండు డోస్‌లతోపాటు మూడో(బూస్టర్) డోస్‌గానూ పంపిణీ చేసేంత స్థాయిలో భారత్‌లో టీకా నిల్వలు ఉన్నాయని కోవిషీల్డ్ తయారీసంస్థ సీరమ్ ఆ దరఖాస్తులో పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు భారత్‌లోనూ కమ్ముకుంటున్న ఈ తరుణంలో బూస్టర్ డోస్‌కు దేశంలో డిమాండ్ పెరిగిందని సీరమ్ వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌కు వైద్య, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ ఇప్పటికే బూస్టర్ డోస్‌గా ఆమోదించిందని డీసీజీఐకు పంపిన దరఖాస్తులో సీరమ్ ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ పేర్కొన్నారు. -
కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి అనుమతులివ్వండి
న్యూఢిల్లీ: భారత్‌తో పాటు పలు దేశాల్లో 100 కోట్లకు పైగా డోసుల పంపిణీ జరిగినందువల్ల కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి వ్యాపార అనుమతి మంజూరు చేయాలని తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఇండియా (సీఐఐ) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. భారత్‌లో వినియోగిస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్లకు అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఇదివరకే సమర్పించామని, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకాల పంపిణీ జరిగిందని, వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోందని, వ్యాక్సిన్ సమర్థతకు ఇదే నిదర్శనమని సీరమ్ పేర్కొంది.