ఎందుకు? ఎప్పుడు? ఎలా?
కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ రెండు డోసుల వ్యవధిపై సామాన్య జనానికి వస్తున్న సందేహాలివి.
మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
కేంద్రం డోసుల వ్యవధిని ఎందుకు పెంచుకుంటూ పోతోంది?
ఇలాగైతే ఎలా? వీటన్నింటి చుట్టూ పెద్ద వివాదానికే తెరలేచింది.
ఆ వివాదం ఏంటి? కేంద్రం ఏం చెబుతోంది?
బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ (కోవిషీల్డ్) రెండు డోసుల మధ్య వ్యవధిపై వివాదం నెలకొంది. పుణేకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి అత్యవసర అనుమతులు మంజూరు చేసినప్పుడు 4 –6 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలని కేంద్రం నిర్దేశించింది. జనవరి 16న తొలిదశ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక అలాగే ఇచ్చారు. మార్చి 23న రెండు డోసుల మధ్య వ్యవధిని 6–8 వారాలకు పెంచింది. ఆ తర్వాత మళ్లీ మే 13న హఠాత్తుగా వ్యవధిని ఒకేసారి 12–16 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇలా గడువు ఎందుకు పెంచుతోందని సామాన్య ప్రజలు గందరగోళానికి లోనవుతూ ఉంటే, శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ మధ్య ఏకంగా 12–16 వారాల వ్యవధి మంచిది కాదని, దానిని తగ్గించాలని ఒక వర్గం శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వ్యవధి తగ్గించాలని ఎందుకు అంటున్నారు?
కేంద్ర ప్రభుత్వం రెండు డోసుల వ్యవధి పెంచిన తర్వాత జరిగిన అధ్యయనాల్లో కోవిషీల్డ్ సింగిల్ డోసుతో కేవలం 33% రక్షణ మాత్రమే వస్తుందని రెండు డోసులు తీసుకున్నాక 65 నుంచి 85% వరకు కరోనా నుంచి రక్షణ వస్తుందని తేలింది. భారత్‌లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌తో ముప్పు పొంచివుండటంతో వ్యాక్సినేషన్ రక్షణ లభిస్తే... ప్రాణహాని తగ్గుతుందని, సీరియస్ కా కుండా ఉంటుందని వాదిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా రెండోడోసును 8–12 వారాల మధ్య ఇవ్వాలని సిఫారసు చేయడం గమనార్హం. దీంతో పలు దేశాలు డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తున్నాయి.
కేంద్రం చెబుతున్నదేంటి!
కోవిషీల్డ్ కనిష్ట వ్యవధిని ఒక్కసారిగా రెట్టింపు చేస్తూ 84 రోజులకు పెంచడంపై విమర్శలు రావడంతో కేంద్రం వివరణ ఇచ్చింది. శాస్త్రీయ డేటాను విశ్లేషించిన తర్వాత టీకా డోసుల మధ్య వ్యవధి పెంచామని, ఈ నిర్ణయాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఎన్‌టీఏజీఐ, కేంద్రం ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ గడువు 12 వారాలకు పెంచాలని అప్పట్లో కమిటీ కేంద్రానికి రాసిన లేఖ ప్రతిని కూడా హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఎన్‌టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా కూడా అన్ని రకాల అధ్యయనాలను విశ్లేషించి, భారత్‌లో డెల్టా వేరియెంట్‌పై ఎలా పని చేస్తోందో శాస్త్రీయపరమైన డేటా పరిశీలించాక ఈ సిఫారసులు చేశామని అన్నారు. తమ కమిటీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు.
రెండు డోసుల మధ్య వ్యవధి ఎందుకు?
మొదటి టీకా డోసు తీసుకున్నాక శరీరంలో కరోనా వైరస్‌ని తట్టుకునే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. రెండో డోసు బూస్టర్ డోసు లాంటిది. 12 వారాల తర్వాత రెండో డోసు ఇస్తే వ్యాక్సిన్ సామర్థ్యం మరింత పెరుగుతుందని ఏప్రిల్‌లో పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ వెల్లడించింది. బ్రిటన్‌లోని డోసుల మధ్య 12 వారాలు పెంచిన తర్వాతే ఆల్ఫా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. స్పెయిన్ (60 ఏళ్ల లోపు వారికి), కెనడా, శ్రీలంక దేశాల్లో కూడా 12–16 వారాల వ్యవధిలోనే రెండో డోసు ఇస్తున్నారు. యూరోప్‌లో ఈ గడువు 4–12 వారాలుగా ఉంది.
వివాదం ఎందుకు మొదలైంది?
కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య 42 రోజుల కనిష్ట వ్యవధిని 84 రోజులకి ఒకేసారి పెంచుతూ మే 13న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టీఏజీఐ) వివిధ అధ్యయనాలను పరిశీలించాక 12–16 వారాల వ్యవధి ఉంటే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయన్న సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో ఒక్కసారిగా టీకా డోసులకి కొరత ఏర్పడింది. వ్యాక్సిన్‌కున్న డిమాండ్‌కి తగ్గట్టుగా ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం వ్యాక్సిన్ గడువుని పెంచిందన్న ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా ఎన్‌టీఏజీఐలో అత్యంత కీలకమైన 14 మంది సభ్యుల్లో ముగ్గురు శాస్త్రవేత్తలు రాయిటర్స్ సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి తాము గడువు రెట్టింపు చేయాలని సిఫారసు చేయలేదని చెప్పారు. కేంద్రమే ఆ నిర్ణయం తీసుకుందని మాథ్యూ వర్ఘీస్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. దీంతో వివాదం మొదలై
వ్యాక్సిన్ గడువు వ్యవధిని తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కోవిడ్–19లో మార్పులు వస్తున్నట్టే దాని వ్యాక్సిన్ నిరంతరాయంగా మారే ప్రక్రియ. ఒకవేళ రెండో డోసుల వ్యవధిని తగ్గిస్తే ప్రజలకి 5–10% లబ్ధి జరుగుతుందని శాస్త్రీయంగా ఆధారాలు లభిస్తే తప్పకుండా వ్యవధి తగ్గించాలని సిఫారసు చేస్తాం. ప్రస్తుత 12–16 వారాల వ్యవధితోనే మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబితే ఇదే కొనసాగుతుంది
ఎన్.కె. అరోరా, నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ గ్రూప్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment