astrazeneca
-
భరోసా కావాలి!
పిల్ల పోయినా... పురుటి కంపు పోలేదని ఒక ముతక సామెత. కరోనా అనే మాట క్రమంగా విన మరుగవుతూ వస్తున్నా, దాని ప్రకంపనలు మాత్రం మానవాళిని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా టీకా కోవిషీల్డ్‌పై తాజాగా వస్తున్న వార్తలే అందుకు తార్కాణం. సదరు టీకా తీసుకోవడం వల్ల మనిషిలో రక్తం గడ్డలు కట్టడం, రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం (వైద్య పరిభాషలో ‘థ్రోంబో సైటోపేనియా సిండ్రోమ్’ – టీటీఎస్) లాంటి అరుదైన దుష్ప్రభావాలుంటాయని దాన్ని రూపొందించిన బ్రిటన్ దిగ్గజ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా లండన్ కోర్టులో ఒప్పుకుంది. దాంతో గత వారం గందరగోళం మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాను ఉపసంహరిస్తు న్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించడంతో, భారత్‌లో కోవిషీల్డ్‌గా, యూరప్‌లో వాక్స్‌జెవ్రి యాగా అమ్ముడైన కోవిడ్ టీకాపై రచ్చ పరాకాష్ఠకు చేరింది. కరోనా టీకాల భద్రతపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా కొత్త ఊపిరినిచ్చాయి. మన దేశంలో సుప్రీమ్ కోర్ట్ సైతం ఆస్ట్రాజెనెకా టీకాపై వచ్చిన పిటిషన్ విచారణకు అంగీకరించడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కోవిడ్ మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో ప్రజారోగ్యంలో ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా టీకా కీలక భూమిక పోషించింది. క్లినికల్ పరీక్షల అనంతరం 2021 జనవరి 4న టీకా తొలి డోస్ వినియోగించారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 250 కోట్ల డోసులు వేశారు. లక్షలాది ప్రాణాలను కాపాడారు. 2021 ప్రథమార్ధంలో భారతదేశంలో డెల్టా వేరియంట్ పెచ్చరిల్లినప్పుడు కూడా ఇదే సంజీవని. ప్రపంచదేశాల మధ్య టీకాల సరఫరాలో చిక్కులున్నప్పుడూ ఆ మానవతా సంక్షోభ పరిష్కారానికి అందుబాటులో ఉన్న కొన్నిటిలో ఇదీ ఒకటి. ఫైజర్, మోడర్నా, నోవావ్యాక్స్, వగైరాల లానే ఈ టీకా కూడా అనేక స్థాయుల పరీక్షలకు లోనైంది. మూడు విడతల ట్రయల్స్‌లో వేలాది ప్రజలపై పరీక్షలు చేసి, సురక్షితమనీ, ప్రభావశీలమనీ తేలాకనే అను మతులిచ్చారు. బ్రిటన్ సహా యూరప్‌లోని పలు దేశాల్లో 2021 ఆరంభంలో దీన్ని పంపిణీ చేశారు.నిజానికి, ఈ టీకా వినియోగం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉండవచ్చని బ్రిటన్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోనే చెప్పింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి 40 లక్షల కొత్త కేసులొస్తూ, కరోనా తీవ్రత భయం రేపుతున్న సమయమది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో... టీకాతో అరుదుగా వచ్చే ముప్పు కన్నా ఉపయోగాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి భావించాయి. పైగా, మహిళలు వాడే గర్భనిరోధక మాత్రల లాంటి అనేక ఇతర ఔషధాలతో పోలిస్తే ఈ టీకాతో రక్తం గడ్డలు కట్టే రేటు బాగా తక్కువనీ, ప్రతి వెయ్యిమందిలో ఒక్కరికే ఆ ప్రమాదం ఉంటుందనీ లెక్కల్లో తేల్చారు. అందుకే, ప్రపంచ క్షేమం కోసం ఈ టీకాను కొనసాగించారు. ఇక, భారత్ సంగతెలా ఉన్నా విదేశాల్లో కరోనా టీకాతో సహా ఏ ఔషధంతో ఇబ్బంది తలెత్తినా బాధితులకు నష్టపరిహార పథకాలున్నాయి. అయితే, అక్కడ కూడా నష్టపరిహారం అందడంలో చిక్కులు ఎదురవడంతో సమస్య వచ్చింది. టీటీఎస్ వల్ల బ్రిటన్‌లో కనీసం 81 మంది చనిపోగా, వందల మంది అనారోగ్యం బారిన పడ్డారు. నష్టపరిహారం కోరుతూ బాధిత కుటుంబాలు కోర్టుకెక్కాయి. అలా దాదాపు 51 కేసులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా లండన్‌లోని హైకోర్ట్‌లో తొలిసారిగా టీకా దుష్ప్రభావాలను అంగీకరించింది. సహజంగానే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 175 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకా డోసులు తీసుకున్న మన దేశ ప్రజానీకంలో కలకలం రేపింది. ఒక దశలో లక్షలాది ప్రజానీకాన్ని కాపాడి, ప్రపంచానికి రక్షాకవచంగా కనిపించిన టీకా ఇప్పుడిలా భయాందోళనలకు కారణం కావడం విచిత్రమే. కానీ, ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు మరో మార్గం లేని దశలో ఈ టీకాలే దిక్కయ్యాయని మర్చిపోరాదు. ప్రాణరక్షణ కోసం ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ, ఔషధ సంస్థలూ టీకాలను తీసుకురావడంలో కొంత హడావిడి పడివుండవచ్చు. లాభనష్టాలపై ప్రజల్ని మరింత చైతన్యం చేసి, టీకా కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు. అయితే, కోట్లాది ప్రాణాలకు ముందుగా ప్రాథమిక భద్రతే ధ్యేయంగా టీకాల వినియోగం త్వరితగతిన సాగిందని అర్థం చేసు కోవాలి. పైగా, టీకా దుష్ప్రభావాలు అత్యంత అరుదుగా కొందరిలోనే కనిపిస్తాయని వైద్య నిపు ణులు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నందున అతిగా ఊహించుకొని ఆందోళన చెందడం సరికాదు.ఆస్ట్రాజెనెకా వారి టీకా మంచిదే అయినా, ఫైజెర్, మోడర్నా లాంటి ఇతర టీకాలు మెరుగైనవని నిపుణుల మాట. మరింత భద్రత, ప్రభావశీలత ఉన్న ఎంఆర్ఎన్ఏ వెర్షన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు బాధితుల కేసులు. ఫలితంగా, ఆస్ట్రాజెనెకా తన టీకాలను ఉపసంహ రించుకోక తప్పలేదు. కోర్టు కేసులకూ, తమ ఉపసంహరణకూ సంబంధం లేదనీ, రెండూ కాకతాళీ యమేననీ ఆ సంస్థ చెబుతున్నా, ఇదంతా నష్టనివారణ చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది అటుంచితే, రోగుల భద్రతే తమ ప్రాధాన్యమని ఆస్ట్రాజెనెకా పునరుద్ఘాటిస్తే సరిపోదు. టీకా వాడకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలకు విరుగుడు ఆలోచించి, ప్రజల్లో భరోసా పెంచాలి. బాధ్యత వహించి, బాధిత రోగులకు సత్వర నష్టపరిహారం చెల్లించి తీరాలి. టీకాలో లోపమెక్కడ జరిగిందో క్షుణ్ణంగా పరిశోధించాలి. ప్రభుత్వాలు సైతం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. టీకా వినియోగం సురక్షితమేనని ప్రకటించడానికి అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో ఒకసారి సమీక్షించాలి. కఠినమైన ప్రమాణాలు పాటించకుండానే కోవిషీల్డ్ వినియోగానికి పచ్చజెండా ఊపిన నియంత్రణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు టీకాల పైన, వాటి తయారీదార్లపైన, చివరకు ఆరోగ్య వ్యవస్థ మీదే నమ్మకం సడలితే అది మరింత ప్రమాదం. -
అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తాము సరఫ రా చేసిన కోవిడ్ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు యూకేకు చెందిన ఫార్మా కంపెనీ అ్రస్టాజెనెకా వెల్లడించింది. కోవిడ్ అప్డేటెడ్ వ్యాక్సిన్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని, అందుకే వాణిజ్య కారణాలతో తమ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేసింది. అ్రస్టాజెనెకా కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చే సింది. అస్ట్రాజెనెకా టీకాతో దు్రష్పభావాలు తలెత్తుతున్నట్లు కోర్టుల్లో కేసులు నమోదవడంతో న్యాయ విచారణ జరుగుతోంది. -
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా సంస్థ తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్ నుంచి తొలగిస్తున్న సంస్థ ప్రకటించింది. కొన్ని వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్) కారణంగా చాలా అరుదుగా థ్రోంబోసిస్ అనే అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఈమేరకు సంస్థ వీటిని ధ్రువపరుస్తూ యూకే కోర్డులో పత్రాలను అందజేసింది. అనంతరం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.కొత్త కొవిడ్ వేరియంట్లతో పోరాడే వ్యాక్సిన్‌ను ఇకపై సంస్థ తయారు చేయదని, దానికి సంబంధించిన డ్రగ్‌ను సరఫరా చేయదని సంస్థ స్పష్టం చేసింది. ఐరోపాలో సరఫరా చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ వాక్స్జెవ్రియా మార్కెటింగ్‌ను తొలగిస్తున్నట్లు చెప్పింది. అధిక సరఫరా వల్ల దీనికి డిమాండ్ తగ్గిందని పేర్కొంది. ఇకపై ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి జరగదని వివరించింది.వ్యాక్సిన్‌ను రూపొందించడానికి గతంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఆస్ట్రాజెనెకా ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యూకే ఆధారిత ఫార్మా కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్ అందించేందుకు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ఒకపై ఆ ఒప్పందాలు రద్దైనట్లు తెలిసింది.ఇదీ చదవండి: సిబ్బంది అనారోగ్యంతో 70కి పైగా విమానాలు రద్దుఅసలేం జరిగిందంటే..యూకేకు చెందిన జామీ స్కాట్ అనే వ్యక్తి 2021లో కొవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. అప్పటినుంచి నిత్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వైద్య పరీక్షలు చేసిన అనంతరం తన శరీరంలో రక్తం గడ్డకడుతుందని వైద్యులు గుర్తించారు. అయితే టీకా వేయించినప్పటి నుంచి ఈ సమస్య ఉండడంతో తన అనారోగ్యానికి అదే కారణమని అనుమానం వ్యక్తంచేశారు. మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత తన పరిస్థితికి టీకానే కారణమని నిర్థారణ అయింది. తాను థ్రోంబోసైటోపెనియా, థ్రాంబోసిస్ బారిన పడినట్లు తేలింది. దాంతో యూకే కోర్టులో దావా వేశారు. తాజాగా కంపెనీ వివరణ ఇస్తూ చాలా అరుదుగా ఇలాంటి వాటికి అవకాశం ఉందని అంగీకరించింది. -
ఆస్ట్రాజెనెకాకు మరో షాక్, ఈ వాక్సీన్‌తోనే బిడ్డను కోల్పోయా ఓ తండ్రి కోర్టుకు
కోవిడ్ వ్యాక్సీన్‌ను తయారు చేసిన ప్రముఖ ఫార్మా కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఒక యువతి తల్లిదండ్రులు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)పై దావా వేశారు. బ్రిటన్‌కి చెందిన ఫార్మా దిగ్గజంపై పిటీషన్ దాఖలు చేశారు.ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్‌కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాల ఆరోపణలు, వీటిని ఆస్ట్రాజెన్‌కా కూడా అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కారుణ్య పుట్టిన రోజు మే 1. మా తొలి వివాహ వార్షికోత్సవ గిప్ట్ నా పాప. ఇపుడు అందనంతదూరంలో- వేణుగోపాల్ తమ 20 ఏళ్ల కుమార్తె కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తర్వాత జూలై 2021లో మరణించిందని తండ్రి వేణుగోపాలన్ గోవిందన్ ఎక్స్‌లో ఆరోపించారు. డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య టీకా తీసుకున్న ఒక నెల తర్వాత అనారోగ్యానికి గురైంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్ ఆరోపించరాఉ. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు.అలాగే ఇంత నష్టం జరిగిన తరువాత ఆస్ట్రాజెన్‌కా తప్పు ఒప్పుకోవడంపై వేణుగోపాలన్ మండి పడ్డారు. రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు వ్యాక్సీన్ వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా ఆయన నిందించారు. ఈ మేరకు వేణుగోపాలన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై సీరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.Thanks to @Teensthack for this article. 🙏I missed to tell Teena that today (May 1st) is Karunya's birthday and she was the first wedding anniversary gift to me and my wife from the heavens. 😭Perhaps due to editorial/space constraints few core points I gave missed to make… pic.twitter.com/bjJjHOc1aM— Venugopalan Govindan (@gvenugopalan) May 1, 2024 2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ కుమార్తె మరణంపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలులు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది.కాగా వ్యాక్సిన్ వల్ల థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌తో సహా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించాయని ఆరోపిస్తూ క్లాస్-యాక్షన్ దావా నుండి చట్టపరమైన చర్యను ఎదుర్కొంటోంది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసి, విక్రయించిన సంగతి తెలిసిందే. -
కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం 'ఆస్ట్రాజెనెకా' (AstraZeneca) కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. అయితే ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణమవుతుందని ఇటీవల అంగీకరించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆస్ట్రాజెనెకా అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌కు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని దేశంలో విస్తృతంగా ఉపయోగించారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే ఫిటిషన్ వేశారు. జామీ స్కాట్ 2021 ఏప్రిల్‌లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ తరువాత చాలామంది దీనిపై కేసులు వేయడం మొదలుపెట్టారు.ప్రారంభంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ క్లెయిమ్‌లను వ్యతిరేకించింది. అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో.. TTS (థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ తక్కువవుతుందని అంగీకరించింది. -
వేర్వేరు సంస్థల టీకాలు..
లండన్: కోవిడ్ టీకా రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా(కోవిషీల్డ్)ను తీసుకున్న వారితో పోలిస్తే ఒక డోసు ఆస్ట్రాజెనెకా, ఎంఆర్ఎన్ఏ ఆధారంగా తయారు చేసిన టీకా మరో డోసు తీసుకుంటే మహమ్మారి ముప్పు తక్కువగా ఉంటోందని స్వీడన్లో చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ మేరకు చేపట్టిన ‘మిక్స్ అండ్ మ్యాచ్’అధ్యయనం ఫలితాలు సోమవారం లాన్సెట్ రీజినల్ హెల్త్–యూరప్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వెక్టార్ ఆధారిత ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో స్వీడన్లో ఈ టీకా వినియోగాన్ని నిలిపివేశారు. దీంతో, అప్పటికే ఆస్ట్రాజెనెకా మొదటి డోసుగా తీసుకున్న వారికి, ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకాను రెండో డోసుగా తీసుకోవచ్చని నిపుణులు సిఫారసు చేశారు. దీంతో కొందరు రెండో డోసుగా ఫైజర్/ మోడెర్నా టీకాను తీసుకున్నారు. ఇలా, స్వీడన్లో వేర్వేరు డోసులు తీసుకున్న సుమారు 7 లక్షల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వే జరిగింది. ‘వెక్టార్ బేస్డ్ టీకా ఆస్ట్రాజెనెకాను మొదటి డోసుగా, ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్‌ను రెండో డోసుగా తీసుకున్న వారిలో కోవిడ్ ముప్పు తగ్గుతోందని గమనించాం’అని పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనంలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లను కలిపి తీసుకున్న వారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పు 67% తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. అదే, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లను వేర్వేరు డోసులుగా తీసుకున్న వారిలో, అసలు టీకా తీసుకోని వారితో పోలిస్తే కోవిడ్ ముప్పు 79% వరకు తగ్గుతున్నట్లు గుర్తించారు. రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా తీసుకున్న వారికి కోవిడ్ ముప్పు 50%మాత్రమే తగ్గుతున్నట్లు కూడా గుర్తించామన్నారు. -
ఫైజర్, ఆస్ట్రాజెనెకా సామర్థ్యం ఆరునెలలే!
లండన్: అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్, బ్రిటన్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ల సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత అయిదు నుంచి ఆరు నెలల్లోగా దాని సామర్థ్యం 88% నుంచి 74 శాతానికి పడిపోయినట్టు బ్రిటన్‌కు చెందిన జోయి కోవిడ్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ఇక ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సామర్థ్యం నాలుగైదు నెలల్లోనే 77 శాతం నుంచి 67 శాతానికి పడిపోయినట్టుగా ఆ అధ్యయనం తెలిపింది. చదవండి: ‘టార్గెట్‌లో ఉన్నారు జాగ్రత్త!’ ఆగష్టు 31 డెడ్‌లైన్‌పై బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. 12 లక్షలకిపైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించి, దాని డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. అంతకు ముందు జరిగిన అధ్యయనాల్లో కరోనా వ్యాక్సిన్ సామర్థ్యం కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుందని వెల్లడైంది. వయసులో పెద్దవారు, ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 50 శాతానికి కూడా పడిపోవచ్చునని ఆ అధ్యయనం తెలిపింది. ‘‘మనం ఇక చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఒకవైపు వ్యాక్సిన్ సామర్థ్యం పడిపోతుంటే మరోవైపు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్ స్పెక్టర్ అన్నారు. చదవండి: అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్ బూస్టర్ డోసులు అత్యవసరం కరోనా రెండు డోసుల వ్యాక్సిన్లతో పాటు కొంత విరామంలో బూస్టర్ డోసు ఇవ్వాలని ఇప్పటికే ఎందరో శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. తాజాగా వీటి సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తేలిన నేపథ్యంలో బూస్టర్ డోసుల ఆవశ్యకత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బూస్టర్ డోసులు ఇవ్వడం అత్యవసరమని ప్రొఫెసర్ స్పెక్టర్ అన్నారు. -
తగ్గుతున్న టీకా యాంటీబాడీలు
లండన్: ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల వల్ల ఏర్పడిన యాంటీబాడీలు 10 వారాల్లో 50 శాతానికి పడిపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నా యాంటీబాడీలు తగ్గిపోవడం గమనార్హం. యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు యూకేలో జరిపిన ఈ పరిశోధన వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కాలం గడిచేకొద్దీ యాంటీబాడీలు తగ్గిపోతుండడంతో, భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లను ఎదుర్కోవడానికి సమస్యలు ఎదురుకావచ్చనే ఆందోళన వెల్లడవుతోంది. బూస్టర్ డోస్‌తో సానుకూల ఫలితం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా (భారత్‌లో కోవిషీల్డ్) వ్యాక్సిన్లు తీసుకున్న 600 మందిపై ఈ ప్రయోగం నిర్వహించినట్లు యూసీఎల్ పరిశోధకులు తెలిపారు. ఇందులో 18 ఏళ్లు దాటిన అన్నిరకాల గ్రూపులవారు ఉన్నట్లు వెల్లడించారు. వీరిపై చేసిన పరిశోధనలో రోజులు గడిచే కొద్దీ యాంటీబాడీలు తగ్గిపోవడాన్ని గుర్తించారు. ఫైజర్ వ్యాక్సిన్ విషయంలో.. వ్యాక్సినేషన్ జరిగిన 21–41 రోజులకు యాంటీబాడీ లెవెల్స్ ప్రతి మిల్లీలీటర్‌కు 7506 యూనిట్లకు తగ్గిపోయాయి. అదే 70 రోజులు దాటే సమయానికి 3320 యూనిట్లకు తగ్గిపోయాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ విషయంలో వ్యాక్సినేషన్ జరిగిన 20 రోజుల్లోపు యాంటీబాడీ లెవెల్స్ 1201కి తగ్గాయి. 70 రోజులు దాటే సరికి ఆ సంఖ్య 190కి పడిపోయింది. అంటే దాదాపు అయిదు రెట్ల వేగంతో యాంటీబాడీలు తగ్గిపోయాయి. కోవిషీల్డ్ 93 శాతం రక్షిస్తుంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ కరోనా సోకకుండా 93 శాతం రక్షణ కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. 98 శాతం మరణాలను తగ్గించినట్లు తాజా పరిశోధనలో తేలిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో ఆర్మ్›్డ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపారు. దాదాపు 15 లక్షల మంది డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై జరిగిన పరిశోధనలో ఈ మేరకు ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అత్యంత ముఖ్యమని అన్నారు. -
కోవిషీల్డ్ టీకా.. వ్యవధి పెరిగితే మేలే!
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన కోవిడ్ 19 టీకా (భారత్‌లో కొవిషీల్డ్) రెండో డోసు వేసుకోవడానికి ఎక్కువ వ్యవధి తీసుకోవడం మంచిదని తాజా అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ చేసిన ఈ అధ్యయనంలో రెండో డోసు తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల, అలాగే, ఆ తరువాత మూడో డోసును కూడా ఆలస్యంగా తీసుకోవడం వల్ల కరోనా నిరోధక శక్తి బాగా పెరుగుతోందని తేలింది. మొదటి, రెండో డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. 45 వారాల వ్యవధి వల్ల కరోనా ఇమ్యూనిటీ తగ్గుతుందన్న వాదనను ఇది తోసిపుచ్చింది. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాత మూడో డోసు తీసుకుంటే శరీరంలో యాంటీబాడీల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. అయితే, ఈ అధ్యయనాన్ని మరింత లోతుగా పరీక్షించాల్సి ఉంది. ‘తగినన్ని టీకాలు అందుబాటులో లేని దేశాలకు ఇది శుభవార్త. రెండో డోసు ఆలస్యం కావడం వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువ’అని ఆ స్టడీలో పాల్గొన్న ఆండ్య్రూ పోలర్డ్ వ్యాఖ్యానించారు. మొదటి డోసు వేసుకున్న 10 నెలల తరువాత రెండో డోసు వేసుకున్న వారికి అద్భుతంగా ఇమ్యూనిటీ పెరిగిందన్నారు. మూడో డోసును ఆలస్యంగా వేయడం వల్ల కూడా సానుకూల ఫలితాలు వెలువడ్డాయన్నారు. కాగా, ఈ వ్యాక్సిన్‌తో అతికొద్ది మందిలో రక్తం గడ్డకట్టే సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో కొన్ని దేశాలు ఈ టీకాను నిషేధించగా, కొన్ని దేశాలు యువతకు ఈ టీకా ఇవ్వరాదని నిర్ణయించాయి. -
రెండు వేర్వేరు టీకాలు తీసుకోనున్న ఏంజెలా
బెర్లిన్: రెండు వేర్వేరు కరోనా టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. నిపుణులు మాత్రం ఇలా రెండు వేర్వేరు టీకాలను తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక మన దేశంలో అక్కడక్కడా రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు తీసుకున్నవారు ఉన్నారు. అయితే వీరంతా వైద్య సిబ్బంది తప్పిదం వల్ల ఇలా రెండు వేర్వేరు కంపెనీలు వ్యాక్సిన్లు తీసుకున్నారు కానీ.. కావాలని కాదు. ఈ క్రమంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ సాహసం చేయడానికి ముందుకు వచ్చారు. ఏంజెలా రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మొదటి డోస్‌లో భాగంగా ఆస్ట్రాజెనికా తీసుకున్న ఏంజెలా రెండో డోసులో భాగంగా మోడర్న టీకా తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. మూడేళ్ల క్రితం ఏంజెలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న ఆమెకు ఉన్నట్లుండి కళ్లు తిరగడంతో వెంటనే లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె తిరిగి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 16ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మెర్కెల్ ఈ ఏడాది పదవీవిరమణ చేయనున్నారు. ఇక గత రెండు వారాల నుంచి జర్మనీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగతుంది. చదవండి: రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవచ్చా..! -
వ్యాక్సిన్‌లో ఎందుకింత గ్యాప్..!
ఎందుకు? ఎప్పుడు? ఎలా? కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ రెండు డోసుల వ్యవధిపై సామాన్య జనానికి వస్తున్న సందేహాలివి. మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? కేంద్రం డోసుల వ్యవధిని ఎందుకు పెంచుకుంటూ పోతోంది? ఇలాగైతే ఎలా? వీటన్నింటి చుట్టూ పెద్ద వివాదానికే తెరలేచింది. ఆ వివాదం ఏంటి? కేంద్రం ఏం చెబుతోంది? బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ (కోవిషీల్డ్) రెండు డోసుల మధ్య వ్యవధిపై వివాదం నెలకొంది. పుణేకి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి అత్యవసర అనుమతులు మంజూరు చేసినప్పుడు 4 –6 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలని కేంద్రం నిర్దేశించింది. జనవరి 16న తొలిదశ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక అలాగే ఇచ్చారు. మార్చి 23న రెండు డోసుల మధ్య వ్యవధిని 6–8 వారాలకు పెంచింది. ఆ తర్వాత మళ్లీ మే 13న హఠాత్తుగా వ్యవధిని ఒకేసారి 12–16 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇలా గడువు ఎందుకు పెంచుతోందని సామాన్య ప్రజలు గందరగోళానికి లోనవుతూ ఉంటే, శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ మధ్య ఏకంగా 12–16 వారాల వ్యవధి మంచిది కాదని, దానిని తగ్గించాలని ఒక వర్గం శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వ్యవధి తగ్గించాలని ఎందుకు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం రెండు డోసుల వ్యవధి పెంచిన తర్వాత జరిగిన అధ్యయనాల్లో కోవిషీల్డ్ సింగిల్ డోసుతో కేవలం 33% రక్షణ మాత్రమే వస్తుందని రెండు డోసులు తీసుకున్నాక 65 నుంచి 85% వరకు కరోనా నుంచి రక్షణ వస్తుందని తేలింది. భారత్‌లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌తో ముప్పు పొంచివుండటంతో వ్యాక్సినేషన్ రక్షణ లభిస్తే... ప్రాణహాని తగ్గుతుందని, సీరియస్ కా కుండా ఉంటుందని వాదిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా రెండోడోసును 8–12 వారాల మధ్య ఇవ్వాలని సిఫారసు చేయడం గమనార్హం. దీంతో పలు దేశాలు డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తున్నాయి. కేంద్రం చెబుతున్నదేంటి! కోవిషీల్డ్ కనిష్ట వ్యవధిని ఒక్కసారిగా రెట్టింపు చేస్తూ 84 రోజులకు పెంచడంపై విమర్శలు రావడంతో కేంద్రం వివరణ ఇచ్చింది. శాస్త్రీయ డేటాను విశ్లేషించిన తర్వాత టీకా డోసుల మధ్య వ్యవధి పెంచామని, ఈ నిర్ణయాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఎన్టీఏజీఐ, కేంద్రం ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ గడువు 12 వారాలకు పెంచాలని అప్పట్లో కమిటీ కేంద్రానికి రాసిన లేఖ ప్రతిని కూడా హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా కూడా అన్ని రకాల అధ్యయనాలను విశ్లేషించి, భారత్‌లో డెల్టా వేరియెంట్‌పై ఎలా పని చేస్తోందో శాస్త్రీయపరమైన డేటా పరిశీలించాక ఈ సిఫారసులు చేశామని అన్నారు. తమ కమిటీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు. రెండు డోసుల మధ్య వ్యవధి ఎందుకు? మొదటి టీకా డోసు తీసుకున్నాక శరీరంలో కరోనా వైరస్‌ని తట్టుకునే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. రెండో డోసు బూస్టర్ డోసు లాంటిది. 12 వారాల తర్వాత రెండో డోసు ఇస్తే వ్యాక్సిన్ సామర్థ్యం మరింత పెరుగుతుందని ఏప్రిల్‌లో పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ వెల్లడించింది. బ్రిటన్‌లోని డోసుల మధ్య 12 వారాలు పెంచిన తర్వాతే ఆల్ఫా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. స్పెయిన్ (60 ఏళ్ల లోపు వారికి), కెనడా, శ్రీలంక దేశాల్లో కూడా 12–16 వారాల వ్యవధిలోనే రెండో డోసు ఇస్తున్నారు. యూరోప్‌లో ఈ గడువు 4–12 వారాలుగా ఉంది. వివాదం ఎందుకు మొదలైంది? కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య 42 రోజుల కనిష్ట వ్యవధిని 84 రోజులకి ఒకేసారి పెంచుతూ మే 13న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) వివిధ అధ్యయనాలను పరిశీలించాక 12–16 వారాల వ్యవధి ఉంటే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయన్న సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో ఒక్కసారిగా టీకా డోసులకి కొరత ఏర్పడింది. వ్యాక్సిన్కున్న డిమాండ్‌కి తగ్గట్టుగా ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం వ్యాక్సిన్ గడువుని పెంచిందన్న ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా ఎన్టీఏజీఐలో అత్యంత కీలకమైన 14 మంది సభ్యుల్లో ముగ్గురు శాస్త్రవేత్తలు రాయిటర్స్ సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి తాము గడువు రెట్టింపు చేయాలని సిఫారసు చేయలేదని చెప్పారు. కేంద్రమే ఆ నిర్ణయం తీసుకుందని మాథ్యూ వర్ఘీస్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. దీంతో వివాదం మొదలై వ్యాక్సిన్ గడువు వ్యవధిని తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోవిడ్–19లో మార్పులు వస్తున్నట్టే దాని వ్యాక్సిన్ నిరంతరాయంగా మారే ప్రక్రియ. ఒకవేళ రెండో డోసుల వ్యవధిని తగ్గిస్తే ప్రజలకి 5–10% లబ్ధి జరుగుతుందని శాస్త్రీయంగా ఆధారాలు లభిస్తే తప్పకుండా వ్యవధి తగ్గించాలని సిఫారసు చేస్తాం. ప్రస్తుత 12–16 వారాల వ్యవధితోనే మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబితే ఇదే కొనసాగుతుంది ఎన్.కె. అరోరా, నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ గ్రూప్ చైర్మన్ -
Vaccination: రానున్నది వ్యాక్సిన్ల కాలం
కోవాగ్జిన్, కోవిషీల్డ్, ఈమధ్యే స్పుత్నిక్.. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ల పేర్లే ఎక్కువగా వింటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్నా.. రాబోయే రోజుల్లో మరికొన్ని కంపెనీల రాకతో ఆ సమస్య తీరబోతోంది. రకరకాల వ్యాక్సిన్లు మన మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. వెబ్‌డెస్క్: అవును.. వ్యాక్సినేషన్ కోసం కంగారుపడాల్సిన అవసరం లేదని కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో కొత్త వ్యాక్సిన్ రకాలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికారిక ఆమోదంతో కొన్ని మార్కెట్లోకి అడుగుపెట్టగా, ఇంకొన్ని ట్రయల్ ఫేజ్‌లో.. ఉత్పత్తి దిశగా, మరికొన్ని అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ధరల విషయంలో స్పష్టత లేనప్పటికీ.. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై భారం తగ్గించడంతో పాటు ఎక్కువ మందికి వ్యాక్సిన్ డోసుల్ని త్వరగా అందించేందుకు వీలు పడనుంది. బయోలాజికల్ ఈ టెక్సాస్‌కు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ దీనిని అభివృద్ధి చేసింది. రీకాంబినెంట్ ప్రొటీన్ వ్యాక్సిన్ ఇది. 28 రోజుల గ్యాప్‌తో రెండో డోసులుగా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది హ్యూమన్ ట్రయల్స్ ఫేజ్ 3లో ఉంది. జులై ఆగష్టు మధ్యలో ఇది మార్కెట్లోకి రావొచ్చని అంచనా. నెలకు ఏడు నుంచి ఎనిమిది కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా భావిస్తున్నారు. ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీ దీనిని డెవలప్ చేస్తోంది. ఇది లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్(వైరస్..రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపేది). ఒకే డోసుతో రానున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం జంతువులపై అధ్యయనంలోనే ఉంది. దీంతో కమర్షియల్ మార్కెట్లోకి ఇది రావడానికి ఏడాదిపైనే టైం పట్టొచ్చు. బీఎన్టీ162 ఫైజర్ జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ ఎస్ఈ రూపొందించిన వ్యాక్సిన్. రెండో డోసుల ఎంఆర్ఎన్ఎ బేస్డ్ వ్యాక్సిన్ ఇది. ఇది ఇప్పటికే 85 దేశాలు ఈ వ్యాక్సిన్‌ను ఆమోదించాయి. అమెరికాలోనూ 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఈమధ్యే అనుమతి దొరికింది. ప్రస్తుతం మనదేశంతో ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి. జులై నాటికి ఇది మన మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. జైకోవ్ డీ అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్ కాడిల్లా రూపొందిస్తున్న వ్యాక్సిన్. ఇది మూడు డోసుల(మొదటిరోజు, 28 రోజుల తర్వాత రెండో డోస్, 45 రోజుల తర్వాత మూడో డోస్) వ్యాక్సిన్. ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ డీఎన్ఎ వ్యాక్సిన్. ఫేస్ 3 హ్యూమన్ ట్రయల్స్‌లో ఉంది. జూన్ జులై మధ్య వినియోగానికి అప్రూవల్ దొరికే అవకాశం ఉంది. నెలకు కోటి డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని ప్రకటించుకుంది జైడస్ కాడిల్లా. అంతేకాదు ఐదు నుంచి 12 ఏళ్ల పిల్లల మీద టెస్ట్ కోసం ప్రణాళిక వేసుకుంటోంది. రెండు డోసుల వ్యాక్సిన్‌నూ డెవలప్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎడీ26.కోవ్2.ఎస్ యూఎస్ జాన్సన్ అండ్ జాన్సన్ వారి వ్యాక్సిన్. జులైలో మనదగ్గరికి వచ్చే అవకాశం. ఒకేడోస్. సింగిల్ షాట్ ఇంజెక్షన్ వ్యాక్సిన్. ఏడాదికి యాభై నుంచి 60 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని బయో ఈ వారి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యూ4 ప్రకటించుకుంది. స్పుత్నిక్ వీ రష్యన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సహకారంతో పంపిణీ అవుతున్న వ్యాక్సిన్. ఆర్ఎడీ26, ఆర్ఎడీ5 వెక్టర్స్ ఉపయోగించే తయారు చేసిన అడినోవైరస్ వ్యాక్సిన్. కిందటి నెలలోనే ఈయూఎ కింద అనుమతి. మే 14న తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ద్వారా ప్రారంభించిన రెడ్డీస్ ల్యాబ్స్. లక్షన్నర డోసుల ఆర్ఎడీ26, ఆర్ఎడీ5 యాభై వేల డోసులు ఇదివరకే దిగుమతి. జూన్ రెండో వారం నుంచి వేగంగా ఉత్పత్తి. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌గా ఆర్ఎడీ26ను స్పుత్నిక్ లైట్ పేరుతో ఇండియాలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొవిషీల్డ్ ఇండియాలో కొవిడ్ కట్టడికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న మరో వ్యాక్సిన్. ఆక్స్‌ఫర్ట్, ఆస్ట్రాజెనెకాలతో కలిసి సీరం ఇండియా ఈ వ్యాక్సిన్‌ను తయారీ చేస్తోంది. పన్నెండు వారాల వ్యవధిలో రెండు డోసుల టీకాగా తీసుకోవాలి. చింపాజీ అడినోవైరస్ కారం నుంచి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. దీనికి కూడా జనవరిలోనే అనుమతి దొరికింది. ఇది కూడా పదికోట్ల డోసుల టార్గెట్‌నే పెట్టుకుంది. కోవాగ్జిన్ కొవిడ్-19 జబ్బు కట్టడికి తయారు చేసిన మొట్టమొదటి దేశీయ వాగ్జిన్. ఇన్ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన ఈ రెండు డోసుల వ్యాక్సిన్.. ఈ జనవరిలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్(ఈయూఏ) కింద వాడకంలోకి వచ్చింది. ఇన్‌యాక్టివేటెడ్ వైరస్ నుంచి దీనిని డెవలప్ చేశారు. ఈ ఏడాది చివరివరకు నెలకు పదికోట్ల డోసుల్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత్ బయోటెక్. ఇక అనుమతులతో రెండు నుంచి పద్దెనిమిదేళ్ల వయసున్న పిల్లలపై జూన్ మొదటి వారం నుంచి ఫేజ్ 2,3 ట్రయల్స్ నిర్వహించనుంది. -
రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవచ్చా..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం పలు దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే సరిపడా టీకాలు లేకపోవడంతో అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాల్లో రెండు వేర్వేరు డోసులు తీసుకోవచ్చా.. అనే కోణంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగానే ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తెలిసింది. ఇలా రెండు వేర్వేరు టీకా డోసులు తీసుకోవడం వల్ల తీవ్ర ప్రమాదం లేనప్పటికీ.. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నందున రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను తీసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేర్వేరు వ్యాక్సిన్లకు చెందిన రెండు డోసులను తీసుకున్న వారిలో తక్కువ నుంచి ఓ మోస్తరుగా దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా నివేదిక వెల్లడించింది. ఇవి తొలిడోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చని పేర్కొంది. రెండు టీకాలు కలిసినప్పుడు కనిపించే లక్షణాలపై ఇవి ఆధారపడి ఉంటాయని వెల్లడించింది. ఇలాంటి దుష్ప్రభావాలు తరచుగా కనిపిస్తున్నాయని.. కాకపోతే ఇవి తర్వగానే తగ్గిపోతున్నట్లు ఈ వ్యాక్సిన్ మిక్సింగ్ ప్రయోగాలకు అధ్యక్షత వహించిన డాక్టర్ మాథ్యూ స్నేప్ పేర్కొన్నారు. 830 మందిపై ప్రయోగాలు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అందుబాటులోకి వచ్చిన టీకాలు అన్ని రెండు డోసులుగా తీసుకోవాల్సినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు మోతాదుల్లో తీసుకోవడంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను మొదటి డోసులో ఒకటి, రెండో డోసులో మరో వ్యాక్సిన్‌ను ఇచ్చి పరీక్షిస్తోంది. ఇలా 830 మంది వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో వేర్వేరు డోసులను ఇచ్చింది. ఈ ప్రయోగాలను తొలుత ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలపై మొదలుపెట్టగా.. ఈ రెండు టీకాలను నాలుగు కాంబినేషన్లలో ఇచ్చి ప్రయోగాలు చేసింది. వేర్వేరు టీకాలతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ.. ఇలా రెండు వ్యాక్సిన్లను నాలుగు కాంబినేషన్లలో ఇవ్వగా.. ఒకేరకమైనా టీకా రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే రెండు వేర్వేరు టీకాలు తీసుకున్న వారిలో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడం గుర్తించామని తాజా నివేదిక వెల్లడించింది. వారిలో తీవ్ర జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయి అని తెలిపింది. ఆస్ట్రాజెనికా తొలి డోసు, ఫైజర్ రెండో డోసు తీసుకున్న వారిలో 34 శాతం మందిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. రెండు డోసులు ఆస్ట్రాజెనికా తీసుకున్నవారిలో కేవలం 10శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఇక ఫైజర్ తొలిడోసు, ఆస్ట్రాజెనెకా రెండో డోసు తీసుకున్న 41 శాతం మందిలో ప్రతికూల ప్రభావాలు కనిపించగా.. ఫైజర్‌లో రెండు డోసులు తీసుకున్న వారిలో కేవలం 21శాతం దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే, ఇవి ఆసుపత్రుల్లో చేరేంత తీవ్రంగా లేవని పరిశోధకులు స్పష్టం చేశారు. వీటిపై మరింత విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. టీకాలను మార్చి తీసుకోవద్దు.. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేర్వేరు టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు ఎటువంటి నిబంధనలూ లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఒకే వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కూడా రెండు డోసులూ ఒకే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తోంది. వేర్వేరు వ్యాక్సిన్ డోసులు కేవలం ప్రయోగాల దశల్లోనే ఉన్నాయి. అవి కూడా కేవలం ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలపై మాత్రమే ఇలాంటి ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్వేరు వ్యాక్సిన్లను కాంబినేషన్‌తో తీసుకోకూడదని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వ్యక్తులు రెండో డోసు ఇతర రాష్ట్రాలు/జిల్లాల్లో తీసుకోవాల్సి వస్తే తప్పకుండా అదే వ్యాక్సిన్ తీసుకోవాలని భారత ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. చదవండి: కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల! -
పాజిటివ్ వచ్చిందో... చోటు పోయినట్లే
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత క్రికెటర్లంతా స్వస్థలాల్లోనూ తగు జాగ్రత్తలతో కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టంగా చెప్పింది. టీమ్ అంతా ఒక్క చోటికి చేరే సమయంలో ఎవరైనా పాజిటివ్ వస్తే వారు ఇంగ్లండ్ పర్యటన నుంచి దూరమైనట్లేనని హెచ్చరించింది. టీమిండియా ఫిజియో యోగేశ్ పర్మార్ సూచనలతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం జూన్ 2న భారత జట్టు ఇంగ్లండ్ బయలుదేరాల్సి ఉండగా కనీసం పది రోజుల పాటు భారత్‌లో ప్రత్యేక బబుల్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. వేర్వేరు నగరాల నుంచి ముంబైకి వచ్చే క్రికెటర్లు హోటల్లోకి అడుగు పెట్టగానే ఆర్టీ–పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా వేయాల్సి రావడంతో బోర్డు ఈసారి అదనపు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. ‘ముంబైకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆటగాడు కరోనా పాజిటివ్‌గా తేలితే వారి ఇంగ్లండ్ పర్యటన ఇక్కడే ముగిసిపోయినట్లుగా భావించవచ్చు. క్రికెటర్లు అందరికీ ఈ విషయం చెప్పేశాం. ఎవరి కోసం కూడా బీసీసీఐ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ముంబైకి రాక ముందే వీలైనంత వరకు వారు ఐసోలేషన్‌లోనే ఉంటే మరీ మంచిది’ అని బోర్డు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కోవిషీల్డ్ డోసు తీసుకోండి... మరోవైపు క్రికెటర్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే మొదటి డోసు వేసుకోవాలని కూడా సూచించింది. కోవిషీల్డ్ మరో వెర్షన్ అయిన అస్ట్రాజెన్కా ఇంగ్లండ్‌లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి రెండో డోసు అక్కడ తీసుకోవచ్చని... అదే కోవాగ్జిన్ అయితే సాధ్యం కాదని చెప్పింది. ఎవరైనా క్రికెటర్లు తమ నగరంలో కోవిషీల్డ్ అందుబాటులో లేదని చెబితే తాము ఏర్పాటు చేస్తామని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. బుమ్రా, స్మృతిలకు ‘వ్యాక్సిన్’ వ్యాక్సిన్ వేయించుకోవడానికి భారత క్రికెటర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సారథి విరాట్ కోహ్లిŠ, రహానే, పుజారా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో సహా పలువురు క్రికెటర్లు తమ తొలి డోస్ కోవిడ్ వ్యాక్సిన్‌ను వేయించుకోగా... తాజాగా ఆ జాబితాలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా చేరాడు. తాను తొలి డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు బుమ్రా ట్విట్టర్ ద్వారా మంగళవారం తెలిపాడు. ‘వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తయింది. మీరూ క్షేమం గా ఉండండి’ అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. దినేశ్ కార్తీక్, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానలు కూడా తొలి డోస్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. -
కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల!
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే పలు దేశాలు టీకాలు పంపిణీ చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్‌తో 80 శాతం మరణాలు తగ్గే అవకాశం ఉందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాడ్ పేర్కొంది. అంతే కాకుండా ఫైజర్ బయోటెక్ ఫస్ట్ డోస్‌తో 80శాతం, రెండో డోస్‌తో 97శాతం కోవిడ్ మరణాలు తగ్గుతాయని వెల్లడించింది. ఏప్రిల్ నెలలో కరోనా సోకి 28 రోజుల అనంతరం మృతి చెందిన బాధితులపై బ్రిటన్‌లో రియల్ వరల్డ్ సెట్టింగ్ సంస్థ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనం ప్రకారం.. ఎటువంటి టీకా తీసుకోని వారితో పోల్చితే ఒక డోసు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 55 శాతం, ఒక డోసు ఫైజర్ టీకా తీసుకున్న వారిలో 44 శాతం మంది మరణించకుండా సురక్షితంగా కోవిడ్ నుంచి బయటపడినట్లు తెలిపింది. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 80 శాతం మరణాలు తగ్గుతాయని కూడా పేర్కొంది. అదేవిధంగా ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవడం వల్ల 69శాతం మరణాలు తగ్గడంతో పాటు 97 శాతం సురక్షితమని ఈ అధ్యయనం వివరించింది. ఫైజర్-బయోటెక్ రెండు డోస్‌లు తీసుకున్న 80సంవత్సరాల వయసు వారిలో 93శాతం ఆస్పత్రిలో చేరే అవసరం ఉండదని తెలిపింది. ఇక ఇంగ్లండ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దేశంలో లాక్డౌన్ ఆంక్షలను మరింత సడలించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు వేగంగా అందిస్తే కోవిడ్ నియంత్రణ మెరుగవుతుందని రియల్ వరల్డ్ సెట్టింగ్ అధ్యయన సంస్థ అభిప్రాయపడింది. (చదవండి: కోవిడ్ సంక్షోభం: భారత్‌కు మద్దతుగా ట్విటర్ భారీ విరాళం) -
ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు.. కీలక విషయాలు వెల్లడి
న్యూఢిల్లీ: ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ గురించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా పాజిటివ్ బాధితులు ఒక్క డోస్ ఫైజర్ లేదా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వేయించుకుంటే వారినుంచి ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని తేలింది. దాదాపు 50 శాతం వరకు ఈ రెండు వ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయని ది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ రీసెర్చ్ (పీహెచ్ఈ) అనే జర్నల్ తన కథనంలో పేర్కొంది. ది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ రీసెర్చ్ (పీహెచ్ఈ) కథనం ప్రకారం.. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల్లో ఏదైనా ఒక్కడోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారు మూడు వారాల తర్వాత కోవిడ్ బారినపడితే.. ఈ రెండు వ్యాక్సిన్లు వేసుకున్న కారణంగా వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి 38 నుంచి 49 శాతం మేర తక్కువగా ఉన్నట్లు పీహెచ్ఈ రీసెర్చ్ సైంటిస్ట్‌లు వెల్లడించారు. ‘ఇది అద్భుతం. ఇప్పటికే మేం చేసిన పరిశోధనల్లో వ్యాక్సిన్ ప్రాణాల్ని కాపాడుతుందని గుర్తించాం. తాజా పరిశోధనల్లో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని మరోసారి నిరూపితమైంది’ అని బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ అన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న 57 వేల మందికి చెందిన 24 వేల కుటుంబాల ఆరోగ్య స్థితిగతులు, సంబంధిత డేటా ఆధారంగా తాము చేసిన పరిశోధనల్లో ఈ ఫలితాలు వెలుగులోకి వచ్చాయని మాట్ హాన్కాక్ చెప్పారు. అంతేకాదు ఒక్కడోస్ వ్యాక్సిన్ వేయించుకున్నవారు నాలుగు వారాల తర్వాత వైరస్‌బారిన పడితే 65 శాతం వరకు వైరస్ వ్యాప్తి చెందడం తగ్గుతుందని గతంలో తేలిందన్నారు. -
కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసి కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కోవిషీల్డ్ టీకా డోసు తీసుకున్నవారిలో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ఔషధ నియంత్రణ సంస్థతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇండియాలోనూ కోవిషీల్డ్ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఇలాంటి కేసులు ఇప్పటిదాకా దాదాపు 700 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్ అనంతరం నమోదైన ఈ కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించాయి. ఈ వారం ఆఖరికల్లా సమీక్ష పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కోవిషీల్డ్ టీకాకు మనిషిలో రక్తంలో ప్లేట్లెట్లు పడిపోయి గడ్డకట్టడానికి సంబంధం ఉన్నట్లు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) వెల్లడించింది. అయితే, అత్యంత అరుదుగానే జరుగుతుందని స్పష్టం చేసింది. -
కోవిషీల్డ్ టీకా: సీరమ్‌కు లీగల్ నోటీస్
సాక్షి,న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా సంస్థ తమకు లీగల్ నోటీసు జారీ చేసిందని కరోనా వైరస్ టీకా ‘కోవిషీల్డ్’ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) వెల్లడించింది. ఒప్పందం మేరకు కోవిషీల్డ్‌ను సరఫరా చేయడంలో జరుగుతున్న జాప్యంపై నోటీసులో ప్రశ్నించిందని ఎస్ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా బుధవారం తెలిపారు. ఈ విషయం కేంద్రానికి కూడా తెలుసన్నారు. దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనని, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. (కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్ స్పెషల్ డ్రైవ్) భారత్‌లో సరఫరా చేయాల్సిన డోసులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆస్ట్రాజెనెకాకు సరఫరా చేయాల్సిన టీకా డోసుల్లో జాప్యం నెలకొన్నదని ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూనావాలా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ టీకాకు డిమాండ్ ఉందని, భారత దేశ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ.. టీకా అవసరమైన భారతీయులందరికీ దీన్ని అందజేయలేమని ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో టీకా డోసు ధర కూడా ఎక్కువగా ఉందన్నారు. ఎస్ఐఐ నెలకు ఆరు కోట్ల నుంచి ఆరున్నర కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 10 కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేశామని, మరో 6 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేశామని వివరించారు. ‘భారత ప్రభుత్వ అభ్యర్థనపై భారత్‌కు సబ్సీడీ ధరకు సుమారు రూ. 150 రూ. 160 కే టీకా డోసు అందిస్తున్నాం. లాభాలు రావడం లేదని చెప్పలేం. కానీ గొప్పగా లాభాలేమీ రావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. -
ఆస్ట్రాజెనెకా టీకా: రక్తం గడ్డకట్టి ఏడుగురు మృతి
లండన్: యూకేలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టిన సమస్యలతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని యూకే ఔషధ నియంత్రణ సంస్థ నిర్ధారించింది. మార్చి 24వ తేదీ వరకు 1.81 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకుంటే 30 మందిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తిందని, వారిలో ఏడుగురు మరణించారని మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వెల్లడించింది. కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకుంటే కొంతమందిలో ఏదో ఒక దుష్ప్రభావం కనిపించడం సాధారణంగా జరిగేదేనని ఆ సంస్థ తెలిపింది. ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమని, నిర్భయంగా అందరూ టీకా తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్‌తో యాంటీ బాడీలు బాగా ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. రక్తం గడ్డ కట్టే సమస్య కేవలం ఈ వ్యాక్సిన్ ద్వారా వచ్చిందా లేదా వారిలో మరేమైనా అనారోగ్య సమస్యలున్నాయా అన్న దానిపై విచారణ జరుపుతోంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లోని పుణేలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌తో భారత్‌లో ఎలాంటి సైడ్ అఫెక్ట్‌లు కనిపించలేదు. -
అమెరికా జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ షాక్
వాషింగ్టన్: ఉత్పత్తి సమయంలో చోటు చేసుకున్న తప్పిదం కారణంగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి దాదాపు 15 మిలియన్ డోసులకు సరిపడా ఔషధ పదార్థాలు వృథా అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు వెల్లడించారు. అయితే కంపెనీ ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దిడమే కాక వ్యాక్సిన్ డెలివరీ టార్గెట్‌ని రీచ్ అయినట్లు వారు తెలిపారు. ఈ సంఘటన బాల్టిమోర్‌లోని ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ ఇంక్ కేంద్రంలో చోటు చేసుకుంది. దీని వల్ల మే నాటికి దేశంలో పెద్దలందరికి వ్యాక్సిన్ ఇవ్వాలనే అధ్యక్షుడి ఆలోచనకు బ్రేక్ పడవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక తప్పిదం సంభవించిన యూనిట్ నుంచి ఒక్క డోసును కూడా బయటకు పంపలేదని తెలిసింది. కానీ దీని గురించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇక ఒక బ్యాచ్ ఔషధ పదార్థాలు క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటన చేసింది. ప్లాంట్‌లో ఉత్పత్తి సమయంలో తలెత్తిన లోపం గురించి తొలుత న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కార్మికులు అనుకోకుండా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు సంబంధించని ఔషధ పదార్థాలను ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పదార్థలతో కలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. దీని గురించి ఆస్ట్రాజెనికా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తప్పిదం అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రభావం చూపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కోవిడ్ టీకా కార్యక్రమం కోసం జాన్సన్ అండ్ జాన్సన్‌తో పాటు ఫైజర్, మోడర్నా కంపెనీలు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ మినహాయించి మిగతా రెండు కంపెనీలు 120 మిలియన్, 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేసి టార్గెట్ రీచ్ అయ్యాయి. ఈ తప్పిదం విషయాన్ని ఎమర్జెంట్‌తో పాటు ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అధికారులకు కూడా తెలిపామని జాన్సన్ అండ్ జాన్సన్ ఉద్యోగి ఒకరు తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని, రెండు డోసులు అవసరం లేదని ఎఫ్‌డీఏ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నేపాల్ సైన్యానికి భారత్ అరుదైన బహుమతి -
కరోనా వైరస్: ఆక్స్ఫర్డ్ టీకా బాగా పని చేస్తోంది
లండన్: ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా చాలా బాగా పని చేస్తోందని తాజాగా వెల్లడైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అమెరికా, చిలీ, పెరూ దేశాల్లో దాదాపు 32 వేల మంది వాలంటీర్లపై ఈ పరిశోధన జరిగింది. ఇందులో కోవిడ్–19ను అడ్డుకోవ డంలో ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా 79శాతం పనితీరును చూపిందని నివేదిక సోమవారం పేర్కొంది. వ్యాధి ముదరకుండా చూడటం, ఆస్పత్రిపాలు కాకుండా పని చేయడంలో ఈ వ్యాక్సిన్ 100 శాతం ఫలితాలను సాధించినట్లు తేలింది. ఇదే వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయరుచేయించి ప్రస్తుతం వ్యాక్సినేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్) -
ఆస్ట్రాజెనికా టీకాపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
జెనీవా: కరోనా వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకాపై వస్తోన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. వ్యాక్సిన్ వినియోగాన్ని ఆపాల్సిన అవసరం లేదని తెలిపింది. పలు యూరోపియన్ దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకడుతున్నట్లు ఆరోపణలు రావడంతో టీకా వినియోగాన్ని నిలిపేశారు. ఈ క్రమంలో ఈ ఆరోపణలపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిది ఒకరు మాట్లాడుతూ..‘‘మిగతా వాటితో పోలిస్తే ఆస్ట్రాజెనెకా చాలా అద్భుతమైన టీకా. వ్యాక్సిన్ వినియోగాన్ని ఆపాల్సిన పని లేదు. మా అడ్వైజరీ కమిటీ టీకాకు సంబంధించిన డాటాను పరిశీలించింది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌కు, రక్తం గడ్డకట్టడానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. అంతేకాక మేం మృతులకు సంబంధించిన డాటాను కూడా పరిశీలించాం. వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఆస్ట్రాజెనెకా టీకా తీసుకోవడం వల్ల మరణించిన వారు ఒక్కరు కూడా లేరు’’ అని వెల్లడించారు. మార్చి 9 నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షలమందికి పైగా టీకాలు తీసుకోగా.. రక్తం గడ్డకట్టిన 22 కేసులు నమోదయ్యాయని యూరోపియన్ మెడిసన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్ దేశాలు గురువారం ప్రకటించాయి. చదవండి: ఆస్ట్రాజెనెకా కరోనా టీకాకు మరో షాక్! -
ఆస్ట్రాజెనెకా కరోనా టీకాకు మరో షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ వినియోగంపై వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కరోనా వైరస్ నివారణకు గాను వాక్సీన్ తీసుకున్న తరువాత రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తాజాగా డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్ దేశాలు గురువారం ప్రకటించాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు రక్తం గడ్డకట్టినట్లు కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డెన్మార్క్ ఆరోగ్య అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. డెన్మార్క్‌లో పరిస్థితులు బాగానే ఉన్నా, వ్యాక్సిన్‌తో ముడిపడి ఉన్న కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. వీటిని మరింత దగ్గరగా పరిశీలించాల్సిన అవసరం ఉందని హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ తెలిపారు.అందుకే వాడకాన్ని పూర్తిగా నిషేధించలేదు కానీ, తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. టీకా సురక్షితమైనది సమర్థవంతమైందని రుజువు చేసే విస్తృత డాక్యుమెంటేషన్ ఉంది కానీ, ఇతర యూరోపియన్ దేశాలలో తీవ్రమైన దుష్ప్రభావాల గురించి సమాచారాన్ని పరిశీలించాలని బ్రోస్ట్రోమ్ చెప్పారు. (అమెరికన్ల జీవితాలు మారుతాయ్!) మార్చి 9 నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షలమందికి పైగా టీకాలు తీసుకోగా.. రక్తం గడ్డకట్టిన 22 కేసులు నమోదయ్యాయని యూరోపియన్ మెడిసన్స్ ఏజెన్సీ (ఇఎంఎ) తెలిపింది. అలాగే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కారణంగా ఆస్ట్రియా నర్సు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టీకా తీసుకున్న తరువాత ఆమె తీవ్రమైన రక్త గడ్డంకట్టే సమస్యతో చనిపోవడంతో ఆస్ట్రాజెనెకా టీకా వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు యూరోపియన్ యూనియన్ దేశాలు ఎస్టోనియా, లాట్వియా, లిధుయేనియా, లక్సంబర్గ్‌లు కూడా తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ క్రమంలో డెన్మార్క్ నార్వే, ఐస్లాండ్ కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. (కోవిడ్ ముప్పు తొలగిపోలేదు) -
‘ఆక్స్ఫర్డ్’ డోస్‌ల మధ్య 3నెలల గ్యాప్
న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య మూడు నెలల వ్యవధి తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వ్యాక్సిన్ డోసులకి మధ్య ఆరు వారాల వ్యవధి తీసుకున్నప్పటికన్నా, మూడు నెలల గ్యాప్‌తో వ్యాక్సిన్ తీసుకుంటే సత్ఫలితాలిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది. ఈ రెండు డోసుల్లో తొలి డోసు వ్యాక్సిన్ 76 శాతం రక్షణనిస్తుందని వెల్లడించింది. లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం వ్యాక్సిన్ డోసులకి మధ్య మూడు నెలల సమయం తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లదని, తొలి డోసు అందుకు రక్షణ కల్పిస్తుందని వెల్లడించింది. కొందరికే రెండో డోసుని తొందరగా ఇచ్చే బదులు 3 నెలల కాలవ్యవధిలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించే వీలుంటుదని అ«ధ్యయనం వెల్లడించింది. ‘వ్యాక్సిన్ సరఫరా తక్కువగా ఉండడం, అత్యధిక మంది జనాభాకి వ్యాక్సిన్ అందించేందుకు తక్కువ సమయం ఉండడంతో ప్రభుత్వాలు ప్రజారోగ్య పరిరక్షణకు ఎటువంటి విధానం అవసరమో నిర్ణయించుకోవాలి’’అని ఆక్స్ఫర్డ్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ పోల్లార్డ్ అన్నారు. యుకె, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు చెందిన 17,178 మంది ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన ఈ అధ్యయనంలో. సుదీర్ఘకాలం వ్యవధితో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఆరు వారాల్లోపు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కంటే 12 వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఒక డోసు తరువాత కరోనా యాంటీ బాడీలు మూడు నెలల పాటు శరీరంలో ఉంటున్నట్టు గుర్తించారు. వారిలో రోగనిరోధక శక్తి రెట్టింపు స్థాయిలో పెరిగినట్టు అధ్యయనవేత్తలు గుర్తించారు. తొలి డోసు ఇచ్చిన తరువాత 22 ల నుంచి మూడు నెలల వరకు వ్యాక్సిన్ సమర్థత 76 శాతం ఉన్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. -
జూన్ కల్లా మరో వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కోవిడ్–19ను నిలువరించే కోవోవ్యాక్స్ అనే మరో టీకాను వచ్చే జూన్‌కల్లా అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)ప్రకటించింది. ట్రయల్స్ ప్రారంభించేందుకు అనుమతులు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు చేశామని ఎస్ఐఐ సీఈవో అధర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. నోవావ్యాక్స్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ టీకా పనితీరు అద్భుతంగా ఉందన్నారు. 2021 జూన్ కల్లా ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రా జెనెకా ఉమ్మడిగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాను ఎస్ఐఐ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్ టీకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కేంద్రం 1.1 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకాను ఎస్ఐఐ నుంచి కొనుగోలు చేసింది. ఏప్రిల్ నాటికి నాలుగైదు కోట్ల నోవావ్యాక్స్ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని ఇటీవలే పూనావాలా ప్రకటించారు. 35 లక్షల మందికి కోవిడ్ టీకా ఆరోగ్య సిబ్బంది కోసం ప్రారంభించిన దేశవ్యాప్త కోవిడ్–19 వ్యాక్సినేషన్లో ఇప్పటి వరకు 35 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 5.70 లక్షల మందికి టీకా వేసినట్లు తెలిపింది. వీరిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 4,63,793 మంది, రాజస్తాన్‌లో 3,24,973 మంది, కర్ణాటకలో 3,07,891 మంది, మహారాష్ట్రలో 2,61,320 మంది లబ్ధిదారులు ఉన్నారంది. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ కోసం 63,687 సెషన్లు నిర్వహించినట్లు వెల్లడించింది. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు తగ్గిపోయాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 1.58% మాత్రమేనని వెల్లడించింది. -
కోవాగ్జిన్ వద్దు.. కోవిషీల్డ్ కావాలి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకా మాత్రమే తమకు ఇవ్వాలని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంఎల్) ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్డీఏ) మెడికల్ సూపరింటెండెంట్‌ను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ పట్ల తమ వైద్యుల్లో కొన్ని సందేహాలు, స్వల్పంగా భయాందోళనలు ఉన్నాయని పేర్కొంది. ఆర్ఎంఎల్లో కోవిషీల్డ్ కాకుండా కోవాగ్జిన్ మాత్రమే ఇవ్వనున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపింది. కోవాగ్జిన్ విషయంలో అన్ని ట్రయల్స్ పూర్తి కాలేదని వెల్లడించింది. కోవిషీల్డ్ విషయంలో అన్ని స్థాయిల్లో ట్రయల్స్ పూర్తయ్యాయని గుర్తుచేసింది. కోవాగ్జిన్‌తో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్టపరిహారం కరోనా టీకా తీసుకునేందుకు వచ్చిన వారితో అంగీకార పత్రంపై సంతకం చేయించుకుంటున్నారు. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో వారం రోజుల్లోగా తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు పత్రంలో స్పష్టం చేశారు. ఇలాంటి వారిని ఆసుపత్రుల్లో చేర్చి, చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వల్లనే దుష్భ్రభావాలు తలెత్తినట్లు తేలితే దాని తయారీదారు భారత్ బయోటెక్ నష్టపరిహారం చెల్లిస్తుందని వెల్లడించారు. -
ఏ టీకా అనేది మన ఇష్టం కాదు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. టీకా సరఫరా కోసం ఉద్దేశించిన కో–విన్ యాప్‌లో ఇప్పటికే కోటి మందికిపైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మరో మూడు రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిదశలో ఈ నెల 16వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్లను దాదాపు 3 కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఉచితంగా అందజేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లో నిర్దిష్టంగా ఏదైనా ఒకటి ఎంచుకునే అవకాశం లబ్ధిదారులకు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రెండు టీకాల్లో ఎవరికి ఏ టీకా వేయాలన్నది ప్రభుత్వమే నిర్ధారిస్తుందని వెల్లడించింది. అంటే ఇష్టమైన టీకా తీసుకునే వెసులుబాటు లేనట్లే. వచ్చే ఎనిమిది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 16.5 లక్షల కోవాగ్జిన్ డోసులు ఉచితం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తోంది. తొలిదశలో ఈ సంస్థ నుంచి 1.1 కోట్ల టీకా డోసులు, భారత్ బయోటెక్ నుంచి 55 లక్షల డోసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 10 కోట్ల డోసుల్లో ఒక్కో డోసును రూ.200 చొప్పున ధరకు ప్రభుత్వానికి విక్రయించనున్నట్లు సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా చెప్పారు. పన్నులతో కలుపుకుంటే ఒక్కో డోసు ధర రూ.220కు చేరుతుందన్నారు. ఇక కోవాగ్జిన్ ధర పన్నులు లేకుండా ఒక్కో డోసు రూ.295. పన్నులు కూడా కలిపితే రూ.309.5 అవుతుంది. 55 లక్షల డోసుల కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, ఇందులో 16.5 లక్షల డోసులను ఉచితంగా సరఫరా చేస్తామని భారత్ బయోటెక్ హామీ ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.206కే ప్రభుత్వం కొన్నట్లు అవుతుందని అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో కరోనా టీకాల చేరవేత ఊపందుకుంది. విమానాల్లో తొలుత ప్రధాన నగరాలకు, అక్కడి నుంచి ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు జాగ్రత్తగా, వేగంగా చేరవేస్తున్నారు. కరోనా టీకా రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం చెప్పారు. -
కోవిషీల్డ్ @ రూ.200-400
న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కోవిడ్ టీకా ’కోవిషీల్డ్’ను భారత ప్రభుత్వానికి ఒక్కో డోసు 3–4 డాలర్ల చొప్పున, ప్రైవేట్ మార్కెట్లో 6–8 డాలర్ల చొప్పున విక్రయిస్తామని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. దేశీయంగా ఆక్స్ఫర్డ్ టీకా ఉత్పత్తి, పంపిణీ సీరమ్ ఇన్స్టిట్యూట్ చేపట్టనుంది. ఇప్పటికే దాదాపు 5 కోట్ల డోసుల కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేశామని అదర్ చెప్పారు. తొలిదశలో భారత ప్రభుత్వానికి, జీఏవీఐ (గ్లోబల్ అలయన్స్ ఫర్ వాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్స్) దేశాలకు అందిస్తామని, తర్వాతే ప్రైవేటు మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపారు. తమ వ్యాక్సిన్ అందరికీ అందుబాటు ధరలో ఉండాలన్నదే తమ ప్రయత్నమని, అందుకే ప్రభుత్వానికి ఒక్కో డోసు 3–4 డాలర్ల ధరకు (సుమారు 200– 280 రూపాయలు) అందిస్తామని చెప్పారు. ప్రైవేట్ మార్కెట్లో ధర రెట్టింపు ఉండొచ్చని అంటే సుమారు 6–8 డాలర్లు (సుమారు 400–600 రూపాయలు) ఉంటుందని చెప్పారు. ఈప్రకారం చూస్తే రెండు డోసులకు కలిపి ప్రభుత్వానికి సుమారు 400–600 రూపాయలు, ప్రైవేట్ మార్కెట్లో రూ. 800–1,200 వరకు ఉంటుంది. వ్యాక్సిన్ అందజేయడంపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. డీసీజీఐ అనుమతి అనంతరం 7–10 రోజుల్లో టీకా పంపిణీకి రెడీగా ఉంటుందన్నారు. దేశీయ అవసరాలు తీరే వరకు టీకాను ఎగుమతి చేయవద్దని సీరమ్‌ను డీసీజీఐ ఆదేశించడంపై స్పందిస్తూ, ప్రభుత్వంతో అనుమతి పొందిన అనంతరమే ఎగుమతులు ఆరంభిస్తామన్నారు. తమ వ్యాక్సిన్ 100 శాతం సమర్ధవంతంగా పనిచేస్తోందని భరోసా ఇచ్చారు. -
డయాలసిస్ పేషెంట్లకు ఆక్స్ఫర్డ్ టీకా
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా కలిసి తయారు చేసిన కోవిడ్–19 టీకా వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే ప్రప్రథమంగా సోమవారం యూకేలో మొదలైంది. డయాలసిస్ పేషెంట్లకు ముందుగా ఈ టీకాను ఇస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్లో డయాలసిస్ రోగి బ్రియాన్ పింకెర్(82)కు మొదటగా టీకా వేశారు. టీకా తయారీలో కీలక పాత్ర పోషించిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ కూడా మొదటగా టీకా తీసుకున్న వారిలో ఉన్నారు. ‘ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తయారీ బ్రిటిష్ సైన్స్ సాధించిన ఘన విజయం. ఈ విజయంలో పాలుపంచుకున్న అందరికీ ధన్యవాదాలు’అని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. పరిశీలన నిమిత్తం ఆక్స్ఫర్డ్ టీకాను కొద్ది డోసుల్లో ముందుగా పంపిణీ చేస్తారు. వారం తర్వాత భారీ మొత్తంలో దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నారు. ఇందుకోసం 700 వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరుస్తారు. జాతీయ ఆరోగ్య సేవల సిబ్బందికి కరోనా కొత్త వేరియంట్‌తో ముప్పు పొంచి ఉందని ఆరోగ్య మంత్రి మ్యాట్ హాంకాక్ తెలిపారు. మాస్క్ ధరించడం, పరిశుభ్రత పాటించడం వంటివి తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు. యూకే ప్రభుత్వం ఇప్పటికే ఫైజర్/బయోఎన్‌టెక్ టీకాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఫైజర్ టీకా మొదటి డోసును 10 లక్షల మంది ఆరోగ్య సేవల సిబ్బందికి అందజేశారు. రెండో డోసు కూడా త్వరలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైజర్ టీకాతో పోలిస్తే ఆక్స్ఫర్డ్ టీకా తరలింపు, నిల్వ చాలా తేలిక. ఫైజర్ టీకాలను –70 డిగ్రీల వద్ద నిల్వ ఉంచాల్సి ఉంటుంది. ఆక్స్ఫర్డ్ టీకాను కోవిషీల్డ్ పేరుతో భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం ఇటీవలే అనుమతి మంజూరు చేసింది. కాగా, కరోనా కొత్త వేరియంట్ యూకేలో శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వరుసగా ఆరు రోజులుగా 50వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. స్కాట్లాండ్లో లాక్డౌన్ ఆంక్షలు లండన్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ బాధితులు, మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో స్కాట్లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయి లాక్డౌన్ ప్రకటించింది. అత్యవసరాలకు తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్కాట్లాండ్ ఫస్ట్‌మినిస్టర్ నికోలా స్టర్జియన్ ప్రజలను కోరారు. బ్రిటన్ ప్రధాని జాన్సన్ బ్రిటన్‌లో మరిన్ని ఆంక్షలు విధిస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో స్కాటిష్ పార్లమెంటు సోమవారం అత్యవసర సమావేశం జరిపి లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. యూకేలో మరిన్ని ఆంక్షలు దేశంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని బ్రిటన్ ప్రధాని జాన్సన్ ప్రకటించారు. దేశవ్యాప్త పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలంటూ యూకే ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో జాన్సన్ సోమవారం ఈ ప్రకటన చేశారు. యూకేలో చాలా ప్రాంతాలు ఇప్పటికే టయర్–4 ఆంక్షల కింద ఉన్నాయి. వైరస్ కొత్త వేరియంట్ బయటపడిన తర్వాత 28 రోజుల్లో యూకేలో 454 మంది కోవిడ్‌తో చనిపోయారు. ఇలా ఉండగా, దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా వైరస్.. యూకే వేరియంట్ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. -
టీకాకు అటు..ఇటు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో నిర్ణయాత్మక ముందడుగు పడింది. కోవిడ్–19పై చేస్తున్న యుద్ధంలో భారతీయులకు సునిశిత ఆయుధం లభించింది. దేశంలో కరోనా టీకా అత్యవసర, నియంత్రిత వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆదివారం ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ టీకా ‘కోవాగ్జిన్’, బ్రిటన్‌కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’లకు షరతులతో డీసీజీఐ అనుమతించింది. ఈ రెండు టీకాలకు అనుమతివ్వాలని జాతీయ ఔషధ ప్రామాణికాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తొలి అడుగు పడినట్లయింది. అలాగే, జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న టీకా ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్‌కు కూడా డీసీజీఐ అనుమతించింది. ఈ టీకా అభివృద్ధి కోసం జైడస్ క్యాడిలాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ వెల్లడించారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు అనుమతి లభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతించారు. కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు అని అభివర్ణించారు. ‘భారత్ ఆరోగ్యకర, కోవిడ్ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. టీకా కోసం అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు’అని ప్రధాని ట్వీట్ చేశారు. భారత్‌లో కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు, ఈ టీకాలను ఆగమేఘాలపై అభివృద్ధి చేసిన నేపథ్యంలో.. వాటి సమర్ధత, భద్రతలపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ అధ్యయనం తరువాతే అనుమతి.. ఆయా సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా విశ్లేíషించిన అనంతరం, నిపుణుల సిఫారసుల మేరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు అత్యవసర పరిస్థితుల్లో నియంత్రిత వినియోగానికి అనుమతినివ్వాలని నిర్ణయించామని డీసీజీఐ వీజీ సోమానీతెలిపారు. ఈ రెండు టీకాలను రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వీటిని 2 నుంచి 8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుందని వివరించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 70.42% సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపారు. 23,745 మంది వలంటీర్లపై చేసిన ‘కోవిషీల్డ్’ప్రయోగ ఫలితాల సమగ్ర వివరాలను సీరమ్ ఇన్స్టిట్యూట్ తమకు అందించిందన్నారు. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అత్యంత సురక్షిత వీరోసెల్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిందని తెలిపారు. ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని, ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని సోమానీ వెల్లడించారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్‌ను దేశవ్యాప్తంగా 22,500 మంది వలంటీర్లపై నిర్వహించారని, ఫలితాలు సానుకూలంగా వచ్చాయన్నారు. కోవాగ్జిన్ ప్రత్యామ్నాయమే! భారత్ బయోటెక్ చేసినకోవాగ్జిన్ను ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమేనని ఎయిమ్స్ డైరెక్టర్, జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యుడు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ తొలిదశలో ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకానే వాడుతామన్నారు. ‘వీటికి అనుమతులు లభించడం కొత్త ఏడాది ప్రారంభంలో చోటుచేసుకున్న శుభ పరిణామం. ఈ రెండు టీకాలు చౌకైనవి. భద్రపరచడం, పంపిణీ సులువు. దేశీయంగా తయారైన వీటితో త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రారంభించవచ్చు. కోవిషీల్డ్ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున, సైడ్ ఎఫెక్ట్స్ కనిపించిన అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌కు కోవాగ్జిన్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు’అని ఆయన అన్నారు. యూకే కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో అదుపుతప్పినా, లేదా మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ పూర్తయినా.. కోవాగ్జిన్‌ను పూర్తిస్థాయిలో వాడే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. సీరం సంస్థ 5 కోట్ల డోసులు సిద్ధం చేసినందున, తొలి విడత వ్యాక్సినేషన్లో 3 కోట్ల మందికి కోవిషీల్డ్ వాడుతామన్నారు. సమర్థతపై అనుమానాలు.. కరోనా విజృంభణను అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసిన టీకాల సామర్ధ్యం, భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిషీల్డ్ సమర్ధత 70.42%గా డీసీజీఐ ప్రకటించింది. కానీ కోవాగ్జిన్ సమర్ధతపై స్పష్టమైన వివరణ రాలేదు. అలాగే, ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు పూర్తిగా వెలువడకముందే, టీకా సమర్ధతపై, సురక్షితమేనా అన్న విషయంపై పూర్తిస్థాయి సమాచారం అందకముందే కోవాగ్జిన్‌కు అనుమతినివ్వడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా టీకా వినియోగం ప్రారంభమైన తరువాత దుష్ప్రభావాలు వెల్లడైతే, పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, యూకేలో గుర్తించిన కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్‌పై ఈ టీకాలు ఎంతవరకు సమర్ధంగా పనిచేస్తాయనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తు చేస్తున్నారు. కోవాగ్జిన్ ఫేజ్ –3 క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైన సామర్ధ్యం, భద్రతలకు సంబంధించిన డేటా ఇంకా తమ వద్దకు రాలేదని ఆదివారం ఐసీఎంఆర్ కూడా స్పష్టం చేసింది. అయితే, కోవాగ్జిన్ అత్యున్నత సామర్థ్య, భద్రత ప్రమాణాలతో రూపొందుతున్న సంకేతాలున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ నివేదిక మరి కొన్ని వారాల్లో అందనుందన్నారు. కోవాగ్జిన్ ఫేజ్ 1, 2 ట్రయల్స్ ఫలితాలు సామర్ధ్యం, భద్రత పరంగా సానుకూలంగా ఉన్నాయన్నారు. ట్రయల్స్‌లో కోవాగ్జిన్ సమర్థతను నిరూపించుకుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. కోవాగ్జిన్‌కు అనుమతి ఎలా ఇచ్చారు: కాంగ్రెస్ కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతులు ఇవ్వడంపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టీకా మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే అనుమతులివ్వడం ప్రమాదకరమని కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ హెచ్చరించారు. అత్యంత కీలక అంశాన్ని రాజకీయం చేయడం అవమానకరమంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి ఎదురుదాడికి దిగారు. ఇప్పటివరకు ఏ దేశం కూడా వ్యాక్సిన్ సామర్థ్యం ఎంతో తెలుసుకోకుండా అనుమతులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. తొలి విడతలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకి టీకాలు ఇస్తున్నారని, వారి ఆరోగ్యానికి ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా కోవాగ్జిన్‌కు అనుమతులివ్వడాన్ని తప్పు పట్టారు. అంతవరకు కోవిషీల్డ్‌ను వాడుకోవాలని సూచించారు. కోవాగ్జిన్ టీకా అంశంలో నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చిందని మరో నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్వదేశీ టీకాకి అనుమతులివ్వడాన్ని స్వాగతించారు. శాస్త్రవేత్తల కృషిని ఆయన కొనియాడారు. కీలక అంశాల్లో రాజకీయాలా ? కాంగ్రెస్ నేతల ప్రశ్నలకి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. ఇలాంటి కీలక అంశాల్ని రాజకీయం చేయడం అత్యంత అవమానకరమని అన్నారు. ‘కళ్లు తెరిచి చూడండి ఇలా మాట్లాడి మీకు మీరే అభాసు పాలవుతున్నార’ని మంత్రి అన్నారు. బీజేపీ ఎదురు దాడి కోవాగ్జిన్ అనుమతులపై కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని నిలదీయడంతో బీజేపీ ఎదురు దాడికి దిగింది. కాంగ్రెస్ ప్రతీది రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ విమర్శించారు. ఒకప్పుడు సైనికుల త్యాగాలను ప్రశ్నించారని, ఇప్పుడు స్వదేశీ టీకాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్ సాధించిన ఘనతలు ఎప్పటికీ కాంగ్రెస్‌కి గర్వకారణంగా అనిపించవని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు. ‘భారత్ ఆరోగ్యకర, కోవిడ్ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు. – ప్రధాని మోదీ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్ సహా కొత్త కరోనా వైరస్ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి. – హర్షవర్ధన్ , ఆరోగ్య శాఖ మంత్రి మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే వ్యాక్సిన్‌కు ఎలా అనుమతినిచ్చారు? ప్రొటోకాల్ నిబంధనలు పాటించకుండా, మూడో దశ ప్రయోగాలపై ఫలితాలు తేలకుండా అనుమతులు ఇవ్వడం ప్రమాదకరం. – కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమే. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ తొలిదశలో ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకానే వాడతాం. కోవిషీల్డ్ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌కు కోవాగ్జిన్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. – డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్, జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యుడు భద్రత పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా అనుమతించేవాళ్లం కాదు. ఈ టీకాలు 110% సురక్షితం. స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు, అలర్జీ కనిపించవచ్చు. ఏ వ్యాక్సిన్‌కైనా అది సాధారణమే. – వి.జి. సోమానీ, డీసీజీఐ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్ సహా కొత్త కరోనా వైరస్ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి. – హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి -
వ్యాక్సిన్: సుబ్రమణియన్ స్వామి కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అతిత్వరలోనే అందుబాటులోకి రానుందని భావిస్తున్న కరోనా వైరస్ టీకాకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన ట్వీట్ చేశారు. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తున్న కోవిషీల్డ్ వాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కనీసం అత్యవసర వినియోగానికి కూడా ఇంకా అనుమతి ఇవ్వలేదు..ఈ నేపథ్యంలో భారతీయులంతా ప్రయోగాలకు ఉపయోగించుకునే గినియా పిగ్స్‌లా మారి పోనున్నారా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి సంబంధించి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. (తొలి విడతలో 3 కోట్ల మందికి టీకా ఉచితం : కేంద్ర మంత్రి) దీంతో ట్విటర్లో దుమారం రేగింది. ముఖ్యంగా మన శాస్త్రవేత్తల సామర్ధ్యాన్నే తప్పుబడుతున్నారా అని కొంతమంది ప్రశ్నించారు. అలాగే మహమ్మారి గురించి ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టి డబ్ల్యూహెచ్ఓ మొత్తం ప్రపంచాన్నే మోసం చేసింది. అలాంటి సంస్థను ఎందుకు విశ్వసించాలంటూ మరికొంతమంది ట్విటర్ యూజర్లు ప్రశ్నించారు. అయితే టీకాలకు తాను వ్యతిరేకం కాదని, కానీ ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ దేశాన్ని దోచుకోవాలనుకుంటున్న దోపిడీదారులను అనుమతించకూడదంటూ స్వామి సమాధానం ఇచ్చారు. (కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్) మరోవైపు ఈ వ్యాక్సిన్‌ను బీజేపీ వ్యాక్సిన్ అంటూ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. తాను వ్యాక్సిన్‌ను తీసుకోబోనని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నవ్యాక్సిన్‌ను తానెలా విశ్వసిస్తున్నానంటూ వైద్యులను శాసస్త్రవేత్తలను అవమానిస్తున్నారన్న బీజేపీ విమర్శలనుఆయన తిప్పికొట్టడం విశేషం. WHO hasn't cleared AstraZeneca even for emergency use!! Are Indians going to be Guinea pigs? — Subramanian Swamy (@Swamy39) January 2, 2021 -
కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు సంబంధించి కొత్త ఏడాదిలో ప్రజలకు శుభవార్త అందింది. తాజాగా సీరం అభివృద్ధి చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. దేశంలో అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు వ్యాక్సిన్ నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతి నిచ్చింది. పంపిణీకి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉందిని భావిస్తున్నారు. (గుబులు రేపుతున్న కొత్త కరోనా, ఎన్ని కేసులంటే) దేశంలో పంపిణీకిగాను దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరమ్ 30 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను సిద్ధం చేస్తోంది. భారత్‌లో 10 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వినియోగించను న్నామని సీరం ఇప్పటికే ప్రకటించింది.మరో పక్క దేశంలో యూకేకు చెందిన కొత్త కరోనా వేరియంట్ స్ట్రెయిన్ ఉనికి ఆందోళన రేపుతోంది. తాజాగా నాలుగు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కొత్త వైరస్ బాధితుల సంఖ్య 29కి చేరింది. అటు కొత్త వేరియంట్‌ను కూడా ఎదుర్కొనే సామర్ధ్యం తమ టీకాకు ఉందని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. -
ఆక్స్ఫర్డ్ టీకాకు బ్రిటన్ ఓకే
లండన్/న్యూఢిల్లీ/బీజింగ్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధిపరిచిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ అనుమతిచ్చింది. బయోటెక్ ల్యాబ్స్ ఫైజర్ టీకా తరువాత యూకె.. ఓకే చెప్పిన రెండో కరోనా టీకాగా ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ మరో వారం రోజుల్లో బ్రిటన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్‌ని బ్రిటిష్ రెగ్యులేటరీ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్ఆర్ఏ) పరిశీలించింది. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదీ, శక్తివంతమైనదని ఎంహెచ్ఆర్ఏ నిర్ధారించింది.సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. జనవరి 4 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్టు బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాన్కాక్ తెలిపారు. భారత్‌లో ఇలా.. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ ఓకే చెప్పడంతో భారత్‌లో ౖ టీకా వాడకానికి అనుమతికోసం సీరం కంపెనీ ఎదురుచూస్తోంది. ఆస్ట్రాజెనెకా టీకాను సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. పుణేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ భారత్‌లో ఈ టీకా అత్యవసర వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం పరిగణనలోనికి తీసుకుంది. వీరు అందించిన వ్యాక్సిన్ సంబంధిత సమాచారాన్ని ప్యానల్ పరిశీలిస్తోంది. శుక్రవారం నిపుణుల బృందం సమావేశం జరగనుంది. -
కోవిడ్-19కు చెక్: మరో వ్యాక్సిన్ రెడీ
న్యూఢిల్లీ, సాక్షి: ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్, స్వీడిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ కోవీషీల్డ్‌కు యూకే ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కరోనా వైరస్ కట్టడికి కొత్త ఏడాది(2021)లో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. వచ్చే వారం నుంచీ ఎమర్జెన్సీ ప్రాతిపదికన కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను యూకేలో వినియోగించనున్నారు. ఔషధాలు, ఆరోగ్య పరిక్షణ నియంత్రణ సంస్థ(ఎంహెచ్ఆర్ఏ) సలహామేరకు యూకే ప్రభుత్వం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించింది. కోవిడ్-19 కట్టడికి ఇప్పటికే యూకేలో యూఎస్ దిగ్గజం ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్న విషయం విదితమే. యూఎస్‌లో అయితే ఫైజర్ వ్యాక్సిన్‌తోపాటు, మోడర్నా ఇంక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సైతం అందుబాటులోకి వచ్చాయి. యూకే ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఏప్రిల్‌కల్లా 10 కోట్ల డోసేజీలను అందించవలసి ఉన్నట్లు ఆస్ట్రాజెనెకా ఈ సందర్భంగా తెలియజేసింది. (కొత్త ఏడాదిలో కరోనాకు కోవీషీల్డ్) ప్రమాణాలకు ఓకే కోవీషీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలపై ఆస్ట్రాజెనెకా దాఖలు చేసిన డేటాను విశ్లేషించిన ఎంహెచ్ఆర్ఏ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నట్లు అభిప్రాయపడింది. భద్రత, నాణ్యత తదితర అంశాలలో ప్రమాణాలను అందుకున్నట్లు పేర్కొంది. కాగా.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను దేశీయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను సైతం నిర్వహిస్తోంది. కాగా.. కోవీషీల్డ్ వ్యాక్సిన్‌కు యూకే ఎంహెచ్ఆర్ఏ ఓకే చెప్పడంతో దేశీయంగానూ ప్రభుత్వం వేగంగా అనుమతించే వీలున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది దేశయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్కు జోష్‌నివ్వనున్నట్లు ఫార్మా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతించమంటూ సీరమ్ డీజీసీఏకు క్లినికల్ పరీక్షల డేటాను దాఖలు చేయడం ద్వారా అభ్యర్థించింది. ఇందుకు అనుగుణంగా ఇటీవల 5 కోట్ల డోసీజీలను సిద్ధం చేస్తున్నట్లు తెలియజేసింది. సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతల్లో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి వీలుండటంతోపాటు.. ధర కూడా అందుబాటులో ఉండటంతో ఈ వ్యాక్సిన్‌పట్ల పలు దేశాలు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు ఫార్మా రంగ నిపుణులు తెలియజేశారు. (వచ్చే వారం నుంచీ మనకూ వ్యాక్సిన్! ) -
మరి కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ : సీరం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ప్రకంపనలు రేపుతున్న మరో ప్రమాదకరమైన కరోనా వైరస్ ఉనికి తెలంగాణాలో కూడా ఉందన్న తాజా అంచనాల మధ్య దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం కీలక విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో సీరం ఉత్సత్తి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్‌కు మరికొన్నిరోజుల్లో అత్యవసర ఉపయోగానికి ఆమోదం లభించనుంది. ఈ మేరకు సీరం సీఈఓ అదార్ పూనావల్లా వ్యాఖ్యలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించిన సీరం సమర్పించిన లేటెస్ట్ డేలా సంతృప్తికరంగా ఉన్నందున త్వరలోనే వ్యాక్సిన్ అత్యసర వినియోగానికి ప్రభుత్వ అనుమతి లభించనుందని ఆశిస్తున్నట్టు పూనావల్లా తెలిపారు. ఇప్పటికే 40 మిలియన్ల నుండి 50 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్ సిద్దంగా ఉందన్నారు. అంతేకాదు డేటా విశ్లేషణ పూర్తయిన తర్వాత, టీకాకు అనుమతినిచ్చేందుకు యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ఆమోదం కోసం భారత ప్రభుత్వం వేచి ఉండక పోవచ్చని ఆయన పేర్కొన్నారని రాయిటర్స్ తెలిపింది. -
ఈయూలో టీకా షురూ
లండన్/రోమ్: ఐరోపా దేశాల సమాఖ్య(ఈయూ)లో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. డాక్టర్లు, నర్సులు, వృద్ధులకు ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చారు. వీరికి మూడు వారాల్లో మరో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈయూలో 27 సభ్య దేశాలు ఉండగా, జర్మనీ, హంగేరి, స్లోవేకియా తదితర దేశాలు ఒకరోజు ముందే అంటే శనివారం వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టాయి. కరోనా బారినపడే ప్రమాదం అధికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇచ్చారు. స్పెయిన్‌లో 96 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు ఇచ్చారు. చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి అండ్రెజ్ బబీస్ కూడా ఆదివారం వ్యాక్సిన్ తీసుకున్నారు. జర్మనీలో 101 ఏళ్ల మహిళ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈయూలో ఇప్పటివరకు 1.60 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,36,000 మంది బాధితులు మరణించారు. వారికే మొదటి ప్రాధాన్యత.. ఆక్స్ఫర్డ్, అస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు గురువారంలోగా యూకే ప్రభుత్వం అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ సోకితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల మందికి తొలుత వ్యాక్సిన్ అందజేస్తామని, వారే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం తెలిపింది. ఒక్కో డోసు కేవలం 2 పౌండ్లు ఫైజర్, మోడెర్నా టీకాల తరహాలోనే ఆక్స్ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా కూడా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో తేలిందని అస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కాల్ సొరియొట్ చెప్పారు. కరోనా బాధితులపై 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని, ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి 100 శాతం రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. ఈ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయవచ్చు. ధర ఒక్కో డోసుకు కేవలం 2 పౌండ్లు. 10 కోట్ల ఆక్స్ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా డోసుల కోసం యూకే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మార్చికల్లా 4 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయి. -
ఆక్స్ఫర్డ్ టీకాకే తొలి ఛాన్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనవరిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఒక పక్క ముమ్మరం కాగా, అత్యవసర వినియోగానికి ఆక్స్ఫర్డ్ కోవిడ్–19 టీకాకు వచ్చే వారంలో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టీకా డోసులను దేశీయంగా పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కోవిషీల్డ్ టీకా వినియోగానికి యూకేలో అనుమతులు లభించిన వెంటనే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) నిపుణుల సమావేశం కానుంది. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఈ టీకా క్లినికల్స్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను పరిశీలించి భద్రత, వైరస్ నిరోధకతపై చర్చించి, దీనిని అత్యవసర వినియోగానికి అనుమతించే విషయం పరిశీలించనుందని అధికారులు తెలిపారు. భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా తమ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, భారత్ బయోటెక్ ‘కోవాగ్జిన్’ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నందున అనుమతించేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఫైజర్ సంస్థ తన టీకా పనితీరుపై నివేదిక అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ ‘కోవిషీల్డ్’కే భారత్‌లో అత్యవసర వినియోగానికి తొలి అనుమతి లభించనుందని అధికారులు అంటున్నారు. వివిధ దేశాలు, సంస్థలు తయారు చేస్తున్న టీకాలు కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్‌పైనా పనిచేస్తాయని ఇటీవల యూకే స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే 4 కోట్ల డోసుల టీకాను తయారు చేసి, సిద్ధంగా ఉంచింది. తగ్గుతున్న యాక్టివ్ కేసులు దేశంలో ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల, పెరుగుతున్న రికవరీల కారణంగా యాక్టివ్ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2,81,667 ఉన్నాయని శనివారం వెల్లడించింది. మొత్తం కేసుల్లో ఇవి 2.77% మాత్రమేనని వివరించింది. ‘కోవిడ్‌తో ఇప్పటి వరకు 97,40,108 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 95.78%గా ఉంది’ అని వివరించింది. రోజువారీ కోవిడ్ బాధితుల మరణాలు 6 నెలల తర్వాత మొదటిసారి 300లోపు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 251 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,47,343కు చేరుకుంది. అదేవిధంగా, కొత్తగా 22,273 కొత్త కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,69,118కు చేరుకుందని తెలిపింది. -
వచ్చే వారం నుంచీ మనకూ వ్యాక్సిన్!
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశీయంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్‌కు వచ్చే వారం అనుమతి లభించే వీలున్నట్లు ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు వీలుగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు తాజాగా మరింత క్లినికల్ డేటాను అందించినట్లు తెలుస్తోంది. దీంతో దేశీ ఔషధ నియంత్రణ సంస్థలు అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించనున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెరసి కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను అనుమతించిన తొలి దేశంగా భారత్ నిలిచే వీలున్నట్లు పేర్కొంటున్నాయి. (భారత్ బయోటెక్‌తో యూఎస్ కంపెనీ జత) దేశీయంగా.. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో కరోనా వైరస్ కట్టడికి బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా కోవీషీల్డ్ పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌పై దేశీయంగా క్లినికల్ పరీక్షలు, తయారీలను సీరమ్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యాక్సిన్‌ను అత్యవసర ప్రాతిపదికన అనుమతించమంటూ డీసీజీఐకు సీరమ్ ఇన్స్టిట్యూట్ దరఖాస్తు చేసింది. ఈ బాటలో ఫైజర్, భారత్ బయోటెక్ తదితర కంపెనీలు సైతం అనుమతులు కోరాయి. వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగంపై సీడీఎస్‌సీవో ఈ నెల 9న ఈ కంపెనీల దరఖాస్తులను సమీక్షించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిలో భాగంగా క్లినికల్ పరీక్షలపై మరింత సమాచారాన్ని కోరినట్లు తెలియజేశాయి. దీంతో సీరమ్ తాజాగా మరింత డేటాను అందించినట్లు పేర్కొన్నాయి. ఇదే విధంగా ఫైజర్, భారత్ బయోటెక్ సైతం అదనపు సమాచారాన్ని అందించవలసి ఉన్నట్లు వెల్లడించాయి. (సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ) 5 కోట్ల డోసేజీలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై యూకే, బ్రెజిల్ తదితర పలు దేశాలలో మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. రెండు పూర్తి డోసేజీల వల్ల 62 శాతం ఫలితాలు వెలువడగా.. ఒకటిన్నర డోసేజీలతో 90 శాతం మెరుగైన ఫలితాలు లభించినట్లు ఇటీవల కంపెనీ వెల్లడించింది. అయితే రెండు పూర్తి డోసేజీల అంశంపైనే దేశీ ఔషధ నియంత్రణ సంస్థలు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కాగా.. తొలి దశలో 5-6 కోట్ల డోసేజీలను అందించేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ సంసిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ జులైకల్లా 40 కోట్ల డోసేజీలను రెడీ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి. -
ప్రపంచం కోసం 200 కోట్ల డోసులు
ఐక్యరాజ్యసమితి: కరోనా వ్యాక్సిన్ కోసం డబ్బు వెచ్చించలేని పేద దేశాలకు సాయం చేసేందుకు అంతర్జాతీయ వ్యాక్సిన్ భాగస్వామి కోవాక్స్ ముందుకొచ్చింది. ఐక్యరాజ్యసమితి ద్వారా ఈ వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు అందించడానికి కోవాక్స్ సిద్ధమైంది. ఇందులో 2 కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా/ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు పొందిన వ్యాక్సిన్లను 2021లో దాదాపు 92 దేశాలకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానొమ్ ఘెబ్రియేసుస్ స్పందించారు. ప్రపంచ ఆరోగ్యంలో ఇదో మైలు రాయి అని, గొప్ప వార్త అని వ్యాఖ్యానించారు. అయితే ఇది ఇంకా ప్రారంభం కాలేదని, త్వరలోనే అవుతుందని అన్నారు. వ్యాక్సిన్ రేసుల్లో ముందున్న అన్ని సంస్థలతోనూ డోనార్ల ఆర్థిక సాయంతో చర్చలు జరిపి వ్యాక్సిన్లను సేకరించి, వాటిని ఐరాస ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు, ఆయా జనాభాను బట్టి అందించనున్నారు. -
వ్యాక్సిన్‌పై వాస్తవాలేంటి?
ఇంకొన్ని రోజుల్లో భారత్‌లో కోవిడ్ టీకాలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్య సిబ్బందితో మొదలుపెట్టి వృద్ధులు.. ఆరోగ్య సమస్యలున్న వారు అన్న క్రమంలో... వరుసగా టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి! మరి గడ్డుకాలమిక తొలగిపోయినట్లేనా? ఇక అంతా మంచేనా? ఊహూ.. కానేకాదు! టీకా తీసుకున్నా మరికొంత కాలం జాగ్రత్తలు కొనసాగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ అంశంతోపాటు టీకాలకు సంబంధించిన ఇతర సందేహాలకు సమాధానాలివిగో.. వ్యాక్సిన్లలో రకాలేమిటి? హా ఫైజర్, మోడెర్నా సంస్థలు మెసెంజర్ ఆర్ఎన్ఏతో(ప్రొటీన్ తయారీకి పనికొచ్చే డీఎన్ఏ పోగు)టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. హా భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ టీకాలో వాడే వైరస్లు రోగ నిరోధక కణాలు గుర్తించే యాంటిజెన్లను సిద్ధం చేస్తాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ను చింపాంజీకి చెందిన అడినోవైరస్‌ను వాహకంగా వాడుతున్నారు. హా భారత్ బయోటెక్ (హైదరాబాద్), గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (రష్యా) నిర్వీర్యం చేసిన వైరస్ ఆధారంగా టీకాను తయారు చేస్తున్నాయి. ఈ వైరస్లు వ్యాధిని కలిగించవు కానీ.. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. ఏ వ్యాక్సిన్ సామర్థ్యం ఎంత? కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవిడ్–19 లక్షణాలు కనబరిచే వారిలో 70.4 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న వారిలో 100 శాతం పనిచేస్తుందని అంచనా. ఫైజర్ టీకా సామర్థ్యం 95 శాతం కాగా, రష్యా టీకా స్పుత్నిక్–వీ 92 శాతం సామర్థ్యాన్ని కనబరిచింది. టీకాలు ఎవరెవరికి ఇవ్వవచ్చు? పైన పేర్కొన్న టీకాలను 18 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఇవ్వవచ్చు. ఇందుకు తగ్గట్టుగా ప్రయోగాలు జరిగాయి. ప్రస్తుతం 12–18 ఏళ్ల వారిపై ఈ టీకాలు ఎలా పనిచేస్తాయన్నది పరీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్నాయా? కోవిషీల్డ్ టీకా అత్యవసర వాడకంపై అనుమతికి సీరమ్ ఇన్స్టిట్యూట్ దరఖాస్తు చేసుకుంది. భారత్ బయోటెక్, స్పుత్నిక్–వీ మూడో దశ ప్రయోగాలను పూర్తి చేయాల్సి ఉంది. ఫైజర్ వ్యాక్సిన్ ప్రైవేట్ రంగంలో అందుబాటులోకి రావచ్చు. 18 ఏళ్ల లోపువయసున్న వారికి ఏ టీకా అందుబాటులో లేదు. వ్యాధి సోకి నయమైన వారికి టీకా అవసరమా? కోవిడ్ బారిన పడి సహజసిద్ధంగా కోలుకున్న వారికి దీర్ఘకాలంలో వ్యాధి నుంచి రక్షణ ఉంటుందా? అన్నది ఇప్పటికీ అస్పష్టం. కాలక్రమంలో శరీరంలో యాంటీబాడీలు బలహీన పడే అవకాశాలు ఎక్కువైనప్పటికీ వ్యాధి నుంచి రక్షణ తగ్గిపోతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అందుకే కోవిడ్ నుంచి బయటపడిన వారికి ఆఖరులో టీకా ఇవ్వాలని యోచిస్తున్నారు. ఒక్కో డోస్ ఎంత? ఎన్ని డోసులు? కోవిషీల్డ్ టీకా ఒక డోసుకు 0.5 మిల్లీలీటర్ ఉంటుంది. 28 రోజుల వ్యవధిలో 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్–వీ టీకాలను 21 రోజుల వ్యవధిలో 2 డోసులు ఇస్తారు. రెండు వారాల సమయంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎంఆర్ఎన్ఏ టీకా మాత్రం తొలి డోసు తీసుకున్న 10 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలిసింది. రెండు డోసుల స్థానంలో ఒకటే తీసుకున్నా ఓమోస్తరు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండు డోసులతో రక్షణ ఎంత కాలం? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం వ్యాధి నుంచి రక్షణ లభించింది. యాంటీబాడీలు బలహీన పడినా వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని అంచనా. బూస్టర్ టీకా అవసరం రాకపోవచ్చనే అనుకుంటున్నారు. టీకా తీసుకున్న వారిలో నొప్పి, జ్వరం వంటి కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. టీకా వేసుకున్నాక మామూలుగా తిరిగేయవచ్చా? ఏ వ్యాక్సిన్ అయినా 100 శాతం రక్షణ కల్పించదు. టీకా తీసుకున్న వారు మళ్లీ వ్యాధి బారిన పడకపోవచ్చుగానీ.. ఇతరులకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. అందుకే టీకా వేసుకున్న తరువాత కూడా మాస్కు ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్ -
ఫైజర్ వ్యాక్సిన్‌కు కేంద్రం నో!
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తాజాగా అమెరికాలో సైతం వినియోగించనున్న ఫైజర్ వ్యాక్సిన్‌కు దేశీయంగా చుక్కెదురుకానుంది. ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ధర 37 డాలర్లు(సుమారు రూ. 2720) కావడం దీనికి కారణమని ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ 10 డాలర్ల(రూ. 737)కే అందుబాటులోకి రానుండటంతో కేంద్ర ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ కొనుగోలుకి ముందుకెళ్లకపోవచ్చని తెలియజేశాయి. అధిక ధరకుతోడు.. ఫైజర్ తయారీ వ్యాక్సిన్‌ను మైనస్ 70-90 సెల్షియస్‌లో నిల్వ చేయవలసి రావడం సైతం ప్రతికూలంగా పరిణమించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వెరసి ఫైజర్ వ్యాక్సిన్ ధర, నిల్వ సమస్యలు, పంపిణీ వ్యయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలుకి విముఖత చూపనున్నట్లు ఫార్మా వర్గాలు అభిప్రాయపడ్డాయి. (అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు) నాలుగో దేశం ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ను యూకే, బెహ్రయిన్, కెనడా అత్యవసర ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతులు మంజూరు చేశాయి. ఈ బాటలో వారాంతాన యూఎస్ఎఫ్ఎడీఏ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేటి నుంచి యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించనున్నారు. ఫైజర్ స్వయంగా రూపొందించిన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాల ద్వారా యూఎస్‌లో వ్యాక్సిన్ల పంపిణీని ఆదివారం ప్రారంభించింది. వీటిని తొలుత హెల్త్ వర్కర్లు, నర్సింగ్ హోమ్ సిబ్బంది తదితరులకు వినియోగించనున్నారు. -
కోవిడ్ వ్యాక్సిన్లతో సరికొత్త ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ కనుగొన్న స్పుత్నిక్ వి కోవిడ్–19 వ్యాక్సిన్ ఇప్పటికే రష్యా మార్కెట్లోకి ప్రవేశించిన విషయం తెల్సిందే. మరో పక్క ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులతో కలసి ఆస్ట్రాజెనెకా రూపొందించిన మరో కోవిడ్–19 వ్యాక్సిన్‌ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరగుతున్నాయి. వీటిలో స్పుత్నిక్ వ్యాక్సిన్ సక్సెస్ రేటు 92 శాతం కాగా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తొలి దశలో 70 శాతంగా తేలిన విషయం తెల్సిందే. ఈ రెండింటి ఫలితాలను బేరీజు వేసిన పరిశోధకులకు ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. (మొదటి విడత టీకా వేసేది వీరికే..) స్పుత్నిక్ వి వ్యాక్సిన్తోని ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను కలిపి ట్రయల్స్ నిర్వహిస్తే! అదే సరికొత్త ఆలోచన. రెండు వ్యాక్సిన్లు కూడా జలుబుకు కారణమవుతున్న వైరస్ల నుంచి తయారు చేసినవే అవడం ఈ ట్రయల్స్ ప్రతిపాదనకు మరో కారణం. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌తో కలిపి ట్రయల్స్ నిర్వహించేందుకు ఆస్ట్రాజెనికా శనివారం ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరులోగా ఈ ట్రయల్స్ మొదలవుతాయని, రెండు వ్యాక్సిన్లను కలపడం వల్ల మెరుగైన ఫలితాలు లభించిన పక్షంలో కొత్త వ్యాక్సిన్‌ను రష్యానే తయారు చేస్తుందని రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ ప్రకటించింది. (క్రిస్మస్కు ముందే ఇండియాలో వ్యాక్సిన్!) సోవియట్ యూనియన్ కాలంలో రోదసిలోకి విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహం పేరు స్పుత్నిక్ వి. ఈ పేరునే ఇప్పుడు రష్యా కోవిడ్ వ్యాక్సిన్‌కు పెట్టారు. స్పుత్నిక్ వి సక్సెస్ రేటు 92 శాతం ఉండడంతో రష్యా మార్కెట్లోకి వ్యాక్సిన్ విడుదలకు రష్యా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ వ్యాక్సిన్ పట్ల పాశ్చాత్య దేశాలు ఇంతవరకు ఆసక్తి చూపకుండా నిర్లిప్తంగానే ఉన్నాయి. మరోపక్క ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సక్సెస్ రేటు 70 శాతం ఉండడంతో వ్యాక్సిన్ ప్రభావాన్ని మరోసారి సమీక్షించాల్సిందిగా ఉన్నతాధికారులను బ్రిటన్ అధికార యంత్రాంగం ఆదేశిందింది. (వచ్చే జనవరిలోనే వ్యాక్సిన్: అక్టోబరు నాటికి..) -
ఆస్ట్రాజెనెకా సురక్షితం.. ప్రభావవంతం
వాషింగ్టన్: యూకే వ్యాప్తంగా ఫైజర్ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ భాగస్వామ్యంలో అభివృద్ధి చేందుతోన్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిడ్‌కు వ్యతిరేకంగా ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపారు. డోసేజ్ ప్రకారం ఇది 62 శాతం, 70 శాతం, 90 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ఫేస్ 3 డాటాని పలువురు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు పరిశీలించారని.. మొత్తం మీద తమ వ్యాక్సిన్ 70.4శాతం సామార్థ్యం కలిగి ఉన్నట్లు సైంటిస్ట్‌ల బృందం వెల్లడించదని తెలిపారు. దాదాపు 20 వేల మందికి పైగా అధునాతన పరీక్షల పూర్తి ఫలితాలను పరిశీలించిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ నివేదిక రూపొందించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ అత్యవసర వినియోగం.. అనుమతులు జారీ చేయడం వంటి కీలక అంశాలన్ని ఈ డాటా మీదనే ఆధారపడతాయన్నారు. అంతేకాక తమ ఫేజ్ 3 డాటాను స్టడీ చేసి లాన్సెట్ ఓ నివేదక విడుదల చేసిందని.. దాని ప్రకారం ఆస్ట్రాజెనెకా కోవిడ్19-కు వ్యతిరేకంగా ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ డైరెక్టర్, ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మేం ఫేజ్ 3 ట్రయల్ డాటా తాత్కాలిక విశ్లేషణలను ప్రచురించాము. ఈ కొత్త వ్యాక్సిన్ మంచి సేఫ్టీ రికార్డ్, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పని చేయగల సామార్థ్యం కలిగి ఉన్నట్లు ఈ విశ్లేషణలు వెల్లడించాయి’ అన్నారు. అయితే ఏ డోస్ సురక్షితం.. ఏ వయసుల వారి మీద ఎంత డోస్ ఎఫెక్టివ్‌గా పని చేస్తుందనే పలు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇంకా లభించలేదని లాన్సెట్ నివేదిక పేర్కొంది. ఇక గత నెల రిలీజ్ చేసిన తాత్కాలిక ట్రయల్ రిజల్ట్స్ ఆధారంగా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ సమర్థత స్థాయిలను మూడు రకాలుగా విభజించారు. మొత్తం సమర్థత స్థాయి 70 శాతంగా ఉండగా.. 62 శాతం తక్కువ సమర్థత స్థాయిగా ఉండగా.. 90 శాతం అధిక సమర్థత స్థాయిగా ఉంది. ట్రయల్స్ సమయంలో వ్యాక్సిన్ డోసుల విషయంలో పొరపాటు జరగడంతో సమర్థత స్థాయిలోల తేడా వచ్చినట్లు తెలిపారు. (చదవండి: బ్రిటన్‌లో ఫైజర్ టీకా మొదలు) ఇక లాన్సెట్ 1,367 మంది ఫలితాలను విశ్లేషించి మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. వీరిలో సగం డోసు.. పూర్తి డోసు తీసుకున్నవారు కూడా ఉన్నారు. ఇక వీరిలో కొందరిలో వ్యాక్సిన్ కోవిడ్ బారి నుంచి 90 శాతం రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడయ్యింది. అయితే ఇంత తక్కువ మంది సమాచారంతో ఓ ముగింపుకు రావడం కష్టం అంటున్నారు సైంటిస్టులు. ఇక ఈ డాటా ప్రకారం లో/స్టాండర్డ్ డోస్ లక్షణాలు బహిర్గతం కానీ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. చివరగా ఈ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిడ్-19కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీన్ని తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ తీవ్రం కావడం లేదు.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రావడం వంటి పరిస్థితులు తలెత్తడం లేదు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఎంతో సురక్షితం.. బాగా తట్టుకోగలదు అని నిరూపితమయ్యింది అని లాన్సెట్ వెల్లడించింది. (చదవండి: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ముందుగా మనకే!) ఈ సందర్భంగా ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాస్కల్ సోరియట్ మాట్లాడుతూ.. ‘మేము ముందస్తు అనుమతి పొందడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెగ్యులేటరీ అధికారులకు ఈ డాటాను సమర్పించడం ప్రారంభించాము. త్వరలోనే ప్రపంచ స్థాయిలో వందల మిలియన్ల డోసులను ఎటువంటి లాభాపేక్ష లేకుండా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము’ని తెలిపారు. భద్రత పరంగా, వ్యాక్సిన్‌కు సంబంధించిన ఒక తీవ్రమైన ప్రతికూల సంఘటన ఉంది మరియు మరొకటి - అధిక ఉష్ణోగ్రత - ఇప్పటికీ పరిశోధించబడుతోంది. -
దేశీయంగా వ్యాక్సిన్‌కు అనుమతించండి
న్యూఢిల్లీ, సాక్షి: కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతించవలసిందిగా డీసీజీఐకు సీరమ్ ఇన్స్టిట్యూట్ తాజాగా దరఖాస్తు చేసింది. తద్వారా కోవిడ్-19 కట్టడికి దేశీయంగా ఒక వ్యాక్సిన్ వినియోగం కోసం డీజీసీఐకు దరఖాస్తు చేసిన తొలి దేశీ కంపెనీగా సీరమ్ ఇన్స్టిట్యూట్ నిలిచినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఐసీఎంఆర్ సహకారంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై సీరమ్ ఇన్స్టిట్యూట్ దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టిన విషయం విదితమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై మరోపక్క యూకే, బ్రెజిల్‌లోనూ తుది దశ క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. డేటా ఇలా ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌పై చేపట్టిన క్లినికల్ పరీక్షల తొలి దశ డేటా ఆధారంగా వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ డీజీసీఐకు దరఖాస్తు చేసిన సందర్భంగా పేర్కొంది. ప్రధానంగా కరోనా వైనస్ సోకి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో కోవిషీల్డ్ మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు సీరమ్ తెలియజేసింది. యూకే నుంచి రెండు, బ్రెజిల్, భారత్‌ల నుంచి ఒకటి చొప్పున లభించిన డేటా మదింపు తదుపరి ఈ విషయాలు వెల్లడైనట్లు వివరించింది. కరోనా వైరస్ కట్టడికి ఇతర కంపెనీలు అభివృద్ధ చేస్తున్న వ్యాక్సిన్ల బాటలో కోవిషీల్డ్ సైతం సత్ఫలితాలు చూపుతున్నట్లు డీసీజీఐకు చేసిన దరఖాస్తులో సీరమ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. -
మా వ్యాక్సిన్ సేఫ్: సీరం ఇన్స్టిట్యూట్
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్’ ట్రయల్స్‌లో పాల్గొన్న తనకు ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై సీరం ఇన్స్టిట్యూట్ స్పందించింది. తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైనదని.. ఇమ్యూనోజెనిక్ అని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో తాము అన్ని నియంత్రణ, నైతిక ప్రక్రియలను అనుసరిస్తున్నామని వెల్లడించింది. అన్ని రకాల జాగ్రత్తల తర్వాతే తాము ట్రయల్స్ నిర్వహించామన్నది. సదరు వలంటీర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది. ‘వలంటీర్ అనారోగ్యం గురించి నోటీసులో పేర్కొన్న విషయాలు పూర్తిగా అవాస్తవం.. అసంబద్ధమైనవి. ప్రస్తుతం వలంటీర్ ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితికి, సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్‌కి ఎలాంటి సంబంధం లేదు. వలంటీర్ అబద్దం చెప్తున్నాడు.. అతడి అనారోగ్య సమస్యలకు కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌ని బ్లేమ్ చేస్తున్నాడు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. అబద్ధాలతో సంస్థ ప్రఖ్యాతిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు’ అని ప్రకటనలో పేర్కొంది. అంతేకాక సదరు వలంటీర్ ఆరోగ్య పరిస్థితిపై సీరం ఇన్స్టిట్యూట్ సానుభూతి వ్యక్తం చేసింది. వలంటీర్ ఆరోపణలపై ఆదివారమే స్పందించిన సీరం.. నేడు మరోసారి ప్రకటన విడుదల చేసింది. (చదవండి: 90%సామర్థ్యం ఉండాల్సిందే!) టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని సదరు వలంటీర్ ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు. ఇందుకు పరిహారంగా తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్ 1న చెన్నైలోని ‘శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో ఆ వలంటీరుకు టీకా వేశారు. -
వ్యాక్సిన్‌పై వార్.. 100 కోట్లకు దావా!
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్’తో ఆరోగ్య పరంగా దుష్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్ ఫిర్యాదు చేశారు. టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు. ఇందుకు పరిహారంగా తనకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 5 కోట్ల పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్ 1న చెన్నైలోని ‘శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో ఆ వలంటీరుకు టీకా వేశారు. టీకా వలంటీరుగా పనిచేసిన ఆ 40 ఏళ్ల వ్యాపార వేత్త తరఫున ఒక న్యాయ సేవల సంస్థ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ, ఆస్ట్రా జెనెకా సీఈఓ.. తదితరులకు లీగల్ నోటీసులు పంపించింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని తన క్లయింట్‌కు ఇచ్చిన సమాచార పత్రంలో పేర్కొన్నారని, అందువల్లనే ఆయన వలంటీరుగా చేరేందుకు అంగీకరించారని ఆ సంస్థ వివరించింది. టీకా తీసుకున్న 10 రోజుల తరువాత తీవ్రమైన తలనొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయని, దాంతో ఆసుపత్రిలో చేర్చారని తెలిపింది. మాట్లాడలేకపోవడం, ఎవరినీ గుర్తు పట్టలేకపోవడం.. తదితర సమస్యలు తలెత్తాయని, ఆ తరువాత ఐసీయూలో చేర్చి చికిత్స అందించారని వలంటీరుగా పనిచేసిన వ్యక్తి భార్య వివరించారు. 100కోట్లకు దావా : సీఐఐ ఈ ఆరోపణలను ఆదివారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు నష్ట పరిహారం కోరుతూ రూ. 100 కోట్లకు దావా వేస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ప్రయోగానికి, ఆ వలంటీరు అనారోగ్యానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తన అనారోగ్య సమస్యలకు టీకాను కారణంగా చూపుతున్నారని ఆరోపించింది. కాగా, టీకా దుష్ప్రభావాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతామని డీసీజీఐ పేర్కొంది. డీసీజీఐతో పాటు టీకా వేసిన సంస్థలోని ఎథిక్స్ కమిటీ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. క్లినికల్ ట్రయల్స్‌లో చోటు చేసుకునే టీకా దుష్ప్రభావాలపై.. ముఖ్యంగా దుష్ప్రభావాలకు, టీకాకు ఉన్న సంబంధంపై క్షుణ్నంగా, శాస్త్రీయంగా పరిశోధన జరుగుతుందని ఐసీఎంఆర్‌లో ఎపిడెమాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. హడావుడిగా విచారణ జరిపి, ఒక అంచనాకు రావడం సరికాదన్నారు. -
ఢిల్లీలో డేంజర్ బెల్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. యూరోపియన్ దేశాల్లో కోవిడ్–19 సెకండ్ వేవ్ నడుస్తుండగా, ఢిల్లీలో మాత్రం థర్డ్ వేవ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్–19 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోనే రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో మరణాలు కూడా ఎక్కువ పెరిగాయి. చలిగాలులతో పాటు కాలుష్యం కారణంగా కరోనా వైరస్ విజృంభిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్ రాజస్తాన్‌ల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కారణంగా కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా మహమ్మారి కేసులు వస్తున్న సమయంలోనైనా పంట వ్యర్థాల కాలుష్యాన్ని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ సర్కార్ విజ్ఞప్తి చేసింది. దేశ రాజధానిలో ఈ స్థాయిలో కరోనా విజృంభించడానికి కారణం గాలి కాలుష్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్–19 పాజిటివ్ వ్యక్తులు ఈ కలుషిత గాలిని పీల్చడంతో ఆరోగ్యం విషమించి, మరణాల రేటు పెరుగుతోంది. మార్చి నుంచి మే వరకు కరోనా కేసులు పెరిగినప్పటికీ, జూన్ నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, ఉత్తరాదిన చలి, కాలుష్య తీవ్రత కారణంగా ఢిల్లీలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. రోగ నిరోధక శక్తిని తగ్గించి, అనారోగ్యాన్ని పెంచే వాయు కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చేతులు దాటాక ఆస్పత్రికి.. హస్తినలో కోవిడ్ –19 కేసుల సంఖ్య పెరగడంతో, ఆసుపత్రుల్లో రోగులు గడిపే సమయం కూడా పెరిగింది. దీని కారణంగా దేశ రాజధానిలో కోవిడ్ పడకల కొరత పెరిగింది. అంతేగాక పాజిటివ్ నిర్ధారణ అయి, ఆక్సిజన్ స్థాయి తీవ్రంగా పడిపోయినప్పుడు మాత్రమే రోగులు ఆసుపత్రికి వస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురు తేజ్ బహదూర్ వైద్యులు తెలిపారు. అంతేగాక ఆసుపత్రిలో, కోవిడ్ రోగి బస చేసే సగటు వ్యవధి 10 రోజుల నుంచి మూడు వారాలకు పెరిగింది. జూన్–జూలై నెలల్లో మహమ్మారి సంక్రమణ సమయంలో ఒక్క రోజులో అత్యధిక మరణాలు (101) నమోదయ్యాయి. కానీ థర్డ్ వేవ్ ప్రారంభమైన తర్వాత, నవంబర్ 18న అత్యధికంగా ఒక్క రోజులో 131 మరణాలు నమోదయ్యాయి. నవంబర్ 11న ఒకే రోజులో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 8,593 గా నమోదైంది. పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత హోం క్వారంటైన్ అయిన రోగుల ఆరోగ్యం ఆక్సిజన్ స్థాయి నిర్ధారణలో ఆలస్యం కారణంగా విషమంగా మారుతోందని వైద్యులు తెలిపారు. ఇటువంటి కేసుల్లో 48–72 గంటల్లోనే మరణాలు సంభవిస్తున్నాయి. 57 లక్షల కరోనా సర్వేలో 13,516 మంది గుర్తింపు దేశ రాజధానిలో థర్డ్ వేవ్ కారణంగా ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఢిల్లీ ప్రభుత్వం ఐదు రోజుల పాటు ఇంటింటికి తిరిగి భారీ సంఖ్యలో కరోనా పరీక్షలను నిర్వహించింది. ఢిల్లీలోని 11 జిల్లాల్లో ముగ్గురు సభ్యుల 9వేల బందాలు కోవిడ్ హాట్‌స్పాట్ సెంటర్లలో 57 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో రోగ లక్షణాలు ఉన్న 13,516 మందిని, వీరితో పరిచయం ఉన్న 8,413 మందిని గుర్తించారు. రోగ లక్షణాలు గుర్తించిన వారిలో అత్యధికంగా 3,796 మంది నైరుతి ఢిల్లీ జిల్లాలో ఉన్నారు. కట్టడికి కఠిన నిబంధనలు కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మాస్కు ధరించని వారికి వేసే జరిమానాను రూ.500 నుంచి ఏకంగా రూ.2,000 కు పెంచింది. వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథుల సంఖ్యను 200 నుంచి 50కి కుదించింది. జన సంచారం అధికంగా ఉండే మార్కెట్లలో కోవిడ్–19 నిబంధనలను పాటించకపోతే మూసివేసేందుకు ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది. రెండు మార్కెట్లను తాత్కాలికంగా మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం విదితమే. భారత్‌లో రష్యా టీకా తయారీ రష్యాకు చెందిన సుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్‌ను ఇక భారత్‌లో పెద్ద ఎత్తున తయారు చేయనున్నారు. ఏడాదికి 10 కోట్లకు డోసులకు పైగా డోసుల్ని ఉత్పత్తి చేయడానికి రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) భారత్ ఫార్మా దిగ్గజం హెటిరోతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది మొదట్లో ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభిస్తామని ఆర్డీఐఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు వెనెజులా, భారత్ తదితర దేశాల్లో జరుగుతున్నాయి. 50కి పైగా దేశాల నుంచి 1,200 కోట్లకు పైగా టీకా డోసులు కావాలంటూ రష్యాకు విజ్ఞప్తులు అందాయి. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను అంచనా వేయండి లండన్: ఆక్స్ఫర్డ్–అస్ట్రాజెనెకా కోవిడ్–19 వ్యాక్సిన్ ఎంత వరకు పని చేస్తుందో అంచనా వేయాలంటూ యూకే ప్రభుత్వం వైద్య నియంత్రణ మండళ్లను కోరింది. ఈ మేరకు యూకే ఆరోగ్య మంత్రి మట్ హన్‌కాక్ లేఖ రాశారు. త్వరలోనే ఈ టీకా ప్రయోగాలు పూర్తి కావస్తూ ఉండడంతో ఈలోగా సామర్థ్యాన్ని అంచనా వేస్తే పంపిణీ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అస్ట్రాజెనెకా ఈ ఏడాది చివరి నాటికి 40 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేయనుంది. 2021 మార్చి నాటికి 4 కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. -
భారత్-బంగ్లా మధ్య వ్యాక్సిన్ డీల్
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య వ్యాక్సిన్ డీల్ కుదిరింది. పొరుగు దేశానికి మూడు కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసేందుకు భారత్ అంగీకరించింది. ఈ మేరకు భారత్, బంగ్లాదేశ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్స్ మధ్య ఎంఓయూ కుదిరింది. సీరం ఇన్స్టిట్యూట్, బ్రిటీస్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకాతో కలిసి అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ మూడు కోట్ల డోసులు కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ మహమ్మారి సమయంలో అన్ని దేశాలు కలసికట్టుగా పొరాటం చేయలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఆయన పొరుగు దేశాలకు సాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. (చదవండి: 2 డోసుల వ్యాక్సిన్ రూ. 1,000కే!) ఈ మేరకు భారత బంగ్లాదేశ్ హైకమిషనర్ విక్రమ్ దోరైస్వామి బంగ్లాదేశ్‌తో లోతైన సంబంధం ఏర్పర్చుకోవడంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది అంటూ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ హెల్త్ మినిస్టర్ జాహిద్ మాలెక్ మాట్లాడుతూ.. ‘సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అన్ని అనుమతులు పొందిన తర్వాత మొదటి దశలో భాగంగా మూడు కోట్ల డోసులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి ఢాకాలో ఒప్పందం కుదుర్చుకున్నాం’ అన్నారు. ఇక ప్రస్తుతం భారత్‌లో అభివృద్ధి చేస్తోన్న ఐదు కరోనా వైరస్ వ్యాక్సిన్లలో నాలుగు ఫేజ్ 2/3లో ఉండగా.. ఒకటి 1/2 దశలో ఉంది. బంగ్లాదేశ్ కాకుండా మయన్మార్, ఖతార్, భూటాన్ స్విట్జర్లాండ్, బహ్రెయిన్, ఆస్ట్రియా, దక్షిణ కొరియా దేశాలు మన వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని.. వినియోగించాలని భావిస్తున్నాయి. -
అస్ట్రాజెనెకా సురక్షితం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతున్న నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ సామర్థ్యంపైనే అందరి దృష్టి ఉంది. ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని, సమర్థవంతంగా పని చేస్తోందని సీరమ్ ఇన్‌నిస్టిట్యూట్ వెల్లడించింది. భారత్‌లో ప్రయోగాలు సజావుగా సాగుతున్నాయని గురువారం వెల్లడించింది. ‘‘అస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది. 60–70 శాతం సామర్థ్యమే కలిగి ఉన్నప్పటికీ ఈ టీకాపై పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంచవచ్చు’’అని తెలిపింది. సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి ప్రధాని ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు ఆశలు కల్పిస్తూ ఉండడంతో శనివారం ప్రధాని మోదీ పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించనున్నారు. అక్కడ శాస్త్రవేత్తలతో టీకా ప్రయోగాలపై, డోసుల ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ వంటివాటిపైన చర్చించే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో 100 దేశాల రాయబారులు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ని సందర్శించనున్నారు. డోసుల్లో పొరపాటు సామర్థ్యాన్ని పెంచింది అస్ట్రాజెనెకా ప్రయోగాల్లో డోసులు ఇవ్వడంలో పొరపాటు వల్ల వ్యాక్సిన్ పనితీరు అద్భుతంగా ఉన్నట్టు రుజువు కావడం అందరిలోనూ ఆశలు పెంచుతోంది. ఈ ప్రయోగాల్లో నెల రోజుల తేడాలో రెండు డోసులు ఇవ్వాలి. వైద్యులు పొరపాటుగా మొదటి డోసు పరిమాణాన్ని సగానికి తగ్గించి ఇచ్చారు. ఆ తర్వాత పొరపాటు తెలుసుకున్న వైద్యులు మరో బృందానికి పూర్తి డోసు ఇచ్చారు. అలా రెండు డోసులు పూర్తయ్యాక డోసున్నర తీసుకున్న వారిలో 90% సామర్థ్యం, రెండు డోసులు పూర్తిగా తీసుకున్న వారిలో 62% సామర్థ్యంతో టీకా పని చేసింది. దీంతో సగటున 70% సామర్థ్యాన్ని ఈ టీకా కలిగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్: పొరపాటుతో ఖుషీ!
న్యూయార్క్: కరోనా వైరస్ కట్టికి బ్రిటిష్, స్వీడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ తయారీలో పొరపాటు దొర్లినట్లు తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పేర్కొంది. దీంతో బ్రిటన్‌లో ఒకటిన్నర డోసేజీలతోనే మూడో దశ క్లినికల్ పరీక్షలను నిర్వహించినట్లు తెలుస్తోంది. కోవిడ్-19 నిలువరించేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా మూడో దశ క్లినికల్ పరీక్షలలో భాగంగా బ్రెజిల్లో రెండు పూర్తి డోసేజీలతో 8,895 మందిపై ప్రయోగాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదే విధంగా బ్రిటన్‌లో ఒకటిన్నర డోసేజీలతో 2,781పై పరిశీలించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇటీవలే ఈ వ్యాక్సిన్ 70 శాతం ఫలితాలను ఇచ్చినట్లు ఆస్ట్రాజెనెకా తెలియజేసింది. మూడో దశ క్లినికల్ పరీక్షల ప్రాథమిక డేటా ప్రకారం తక్కువ డోసేజీ ఇచ్చిన కేసులలో మరింత అధికంగా 90 శాతం ఫలితాలు నమోదైనట్లు మరోసారి వెల్లడించింది. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తాజా ప్రకటనతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రమాణాలపై సందేహాలు తలెత్తే అవకాశమున్నట్లు ఫార్మా రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. తక్కువ డోసేజీలో ఒకటిన్నర డోసేజీ పరీక్షలలో వ్యాక్సిన్ 90 శాతం విజయవంతంగా పనిచేసినట్లు ఆస్ట్రాజెనెకా చెబుతోంది. నిజానికి ఈ పొరపాటు అటు కంపెనీకి, ఇటు ప్రజలకూ ఒక విధంగా మేలు చేసే విషయమేనని ఫార్మా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా.. లోయర్ డోసేజీవల్ల రోగనిరోధక శక్తిని పెంచే టీసెల్స్ మరింత సమర్థవంతంగా పనిచేసి ఉండవచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ రెండు ప్రయోగాలలోనూ పలు ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ మూడో దశలో భాగంగా జపాన్, రష్యా, దక్షిణాఫ్రికాసహా పలు ఇతర దేశాలలోనూ క్లినికల్ పరీక్షలు కొనసాగుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. రెండు పూర్తి డోసేజీలతో భారీ సంఖ్యలో చేపట్టిన ఫలితాలను పూర్తిగా విశ్లేషించవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా ఫార్మా నిపుణులు తెలియజేశారు. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ముందుగా మనకే!
ముంబై, సాక్షి: కోవిడ్-19 కట్టడికి బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ను తొలుత దేశీయంగా పంపిణీ చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ అదార్ పూనావాలా తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు వీలుగా వ్యాక్సిన్ల కొనుగోలుకి దేశీ ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తద్వారా 2021 ఏప్రిల్‌కల్లా తొలి బ్యాచ్‌ను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం సత్ఫలితాలను సాధించిన తమ వ్యాక్సిన్ 90 శాతాన్ని సైతం అధిగమించనున్నట్లు ఆస్ట్రాజెనెకా పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి లభించవచ్చని భావిస్తున్నట్లు పూనావాలా చెప్పారు. ఫలితంగా ఫిబ్రవరి, మార్చిలలో పూర్తిస్థాయి అనుమతులకు వీలుండవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌కు త్వరితగతిన అనుమతి పొందేందుకు ప్రయత్నించనున్నట్లు ఆస్ట్రాజెనెకా ఇటీవల తెలియజేసింది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేయడం ద్వారా తక్కువ ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు వివరించింది. పంపిణీ సులభం దేశీ మార్కెట్లలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రూ. 1,000 స్థాయిలో్ ఉండవచ్చని, అయితే ప్రభుత్వం భారీ పరిమాణంలో కొనుగోలు చేయడం ద్వారా మరింత చౌకగా అందించేందుకు వీలుంటుందని పూనావాలా ఇటీవల పేర్కొన్నారు. 2021 జులైకల్లా సీరమ్ ఇన్స్టిట్యూట్కు 40 కోట్ల డోసేజీలను ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్నట్లు తెలియజేశారు. కాగా.. ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ యూకేలో అనుమతి పొందితే.. అత్యవసర వినియోగానికి దేశీయంగానూ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యాక్సిన్‌ను 2-8 సెల్షియస్‌లో నిల్వ చేసేందుకు వీలుండటంతో దేశీ మార్కెట్లో సులభంగా పంపిణీ చేయవచ్చని ఫార్మా వర్గాలు చెబుతున్నాయి. చౌకలో యూఎస్ కంపెనీల వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్-వి వ్యాక్సిన్ చౌకలో లభించగలదని రష్యా పేర్కొంటోంది. అంతేకాకుండా తమ వ్యాక్సిన్ సులభంగా నిల్వ చేయడంతోపాటు.. పంపిణీకీ వీలుంటుందని చెబుతోంది. యూఎస్ దిగ్గజాలలో ఫైజర్, మోడర్నా రూపొందించిన వ్యాక్సిన్లు రెండు డోసేజీలలో వినియోగించవలసి ఉంటుందని పేర్కొంది. కాగా.. ఫైజర్ ఇంక్ వ్యాక్సిన్ ధరను 19.5 డాలర్లుగా తొలుత తెలియజేసింది. అంటే రెండు డోసేజీలకు కలిపి 39 డాలర్లు వ్యయంకాగలదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదేవిధంగా మోడర్నా ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్ ధర మరింత అధికంగా 50-74 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
కరోనాను నిరోధిస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా!
లండన్: కరోనాను అడ్డుకోవడంలో ఆక్స్ఫర్డ్ రూపొందించిన టీకా (ChAdOx1 nCoV&19) మంచి సత్ఫలితాలు ఇస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫేజ్3లో ఈ టీకా కోవిడ్ నిరోధకతలో మంచి ఫలితాలు చూపిందని, అత్యున్నత రక్షణను ఇస్తోందని తెలిపాయి. ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ రూపొందిస్తున్న ఈ టీకాను ఫేజ్ 3 ప్రయోగాల్లో రెండు బ్యాచ్‌లకు ఇచ్చారు. తొలి బ్యాచ్‌లో టీకా 90 శాతం, రెండో బ్యాచ్‌లో 62 శాతం ప్రభావం చూపింది, సగటున వ్యాక్సిన్ 70.4 శాతం ప్రభావం చూపినట్లయింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వైరస్ వ్యాప్తి బాగా తగ్గినట్లు గమనించారు. ‘‘ట్రయిల్స్ కోసం బ్రిటన్, బ్రెజిల్ నుంచి 20వేల మంది వాలంటీర్లను తీసుకున్నారు. వ్యాక్సిన్‌ను రెండు దశల్లో హై డోసుల్లో ఇచ్చినప్పుడు 62 శాతం ప్రభావమే కనిపించగా, తొలుత తక్కువ డోసు ఇచ్చి అనంతరం రెండోదఫా అధికడోసు ఇచ్చిన కేసుల్లో 90 శాతం ప్రభావం కనిపించిందని, ఎందుకు ఈ తేడా వచ్చిందో ఇంకా తెలియరాలేదని సంస్థ ప్రతినిధులు వివరించారు. తాజా ఫలితాలు కరోనాపై టీకాకు మరింత దగ్గరకు చేర్చాయని ఆక్స్ఫర్డ్ ప్రొఫిసర్ సారా గిల్బర్ట్ చెప్పారు. ఎప్పటికప్పుడు ఫలితాలను నియంత్రణా సంస్థలకు అందిస్తామన్నారు. టీకాపై ఇండియా తదితర దేశాల్లో ఇంకా ట్రయిల్స్ జరుపుతూనే ఉన్నారు. ఏడాది చివరకు దాదాపు 60 వేల మందిపై టీకా ప్రయోగించాలని భావిస్తున్న ట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. సాధారణ జలుబును కలిగించే వైరస్‌ను బలహీన పరిరచి దాన్ని జన్యుపరంగా మార్చి కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగిస్తున్నారు. -
కోవిషీల్డ్ వ్యాక్సిన్ : జనవరి నాటికి పదికోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సాయంతో తీసుకొస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై సీరం సీఈవో మరోసారి కీలక విషయాన్ని ప్రకటించారు. జనవరి నాటికి కనీసం 100 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్‌ను అందుబాటులోఉంచుతామని తెలిపారు. అలాగే ఫిబ్రవరి చివరి నాటికి వందల మిలియన్లు సిద్ధంగా ఉంటాయని అంచనావేశారు. బ్రిటన్, బ్రెజిల్ ట్రయిల్స్‌లో అస్ట్రాజెనెకా టీకా 90 శాతం ప్రభావవంతంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా పరీక్షిస్తున్నవాటిలో ప్రోత్సాహకరంగా ఉన్న వాటిల్లో తమది కూడా ఉందని అదర పూనవాలలా చెప్పారు. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ : అద్భుతమైన వార్త!) కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్ ’ భారీ తయారీకి ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న పుణే సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా సోమవారం సాయంత్రం చెప్పారు. ఇప్పటికే 40 మిలియన్ల మోతాదులను సిద్ధం చేశామన్నారు. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ ఒక్కొక్క మోతాదు ధర 500-600 రూపాయల మధ్య ఉంటుందని తెలిపారు. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ : అద్భుతమైన వార్త!
లండన్: కరోనా మహమ్మారి ప్రకంపలు కొనసాగుతున్న తరుణంలో వ్యాక్సిన్ ప్రభావవంత ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఊరటనిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా సామార్థ్యానికి సంబంధించి ఆస్ట్రాజెనెకా సోమవారం కీలక ప్రకటన చేసింది. ఈ టీకా సగటు సామర్థ్యం 70 శాతమని ప్రకటించింది. ప్రయోగ ఫలితం 90 శాతం ప్రభావవంతంగా ఉందని, 70 శాతం మందిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉందని తెలిపింది. దీంతో ఇది "అద్భుతమైన వార్త" అంటూ బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ 90 శాతం వరకు ప్రభావవంతంగా ఉంటుందన్న సంస్థ గణాంకాలపై ఆయన ఉత్సాహంగా స్పందించారు. ఈ ఫలితాలు ధృవీకరణ అయితే ఇది చాలా శుభవార్త అవుతుంది. ఎందుకంటే ప్రజలు వ్యాధి బారిన పడకుండా నివారించడమే కాకుండా దాని విస్తృతిని కూడా నిలువరించాల్సి ఉందని ఆయన అన్నారు. 100 మిలియన్ మోతాదులను ఆర్డర్ చేశామనీ, అన్నీ సవ్యంగా జరిగితే, కొత్త సంవత్సరంలో వ్యాక్సిన్‌ను ఎక్కువమంది అందించనున్నామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని తేలితే దాన్ని ఎలా ఉత్తమంగా నిర్వహించాలో తెలిపేందుకు కూడా ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ అధ్యయనం చేయాలని సూచించారు. ఈ ఫలితాలను రెగ్యులేటరీ సంస్థలు అధ్యయనం చేయాల్సి ఉంటుందని హాంకాక్ చెప్పారు. అంతేకాదు వ్యాక్సిన్ వ్యాధి వ్యాప్తిని తగ్గించగలదనేందుకు నివేదికలో ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మరోవైపు క్లీనికల్ ట్రయల్స్ సమాచారంపై జరిపిన తొలి విశ్లేషణలో వలంటీర్లలో సగటున 70 శాతం మందిని రక్షించినట్టు వెల్లడైందని ఆస్ట్రాజెనెకా తాజాగా తెలిపింది. క్లీనికల్ ట్రయల్స్‌లో భాగంగా ఆక్స్ఫర్డ్ టీకా విషయంలో అధికారులు రెండు రకాల డోసుల వలంటీర్లకు ఇచ్చారు. మొదటి విధానంలో వలంటీర్లకు తొలుత సగం డోసు ఇచ్చి, ఆ తరువాత పూర్తి డోసు ఇచ్చారు. టీకా 90 శాతం సామర్థ్యంతో పనిచేసినట్టు వెల్లడైంది. కరోనా టీకా డోసులకు సంబంధించి రెండో విధానంలో ఈ టీకా 62 శాతం సామర్థ్యం చూపినట్టు తేలింది. సగం డోసు వినియోగించగా టీకా సామర్థ్యం 90 శాతంగా వెల్లడవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆస్ట్రాజెనెకా ప్రతినిధి తెలిపారు. ఈ విధానం అత్యంత ప్రభావశీలమైనదని, టీకా విషయంలో ఇదే అవలంబించాలని వివిధ దేశాల ఔషధ నియంత్రణ సంస్థలకు సూచిస్తామని పేర్కొన్నారు. సుమారు 24 వేల మంది వాలంటీర్ల నుంచి ఈ డేటాను సేకరించారు. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాల్లో భారీ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించారు. -
ఏప్రిల్‌కల్లా ఆక్స్ఫర్డ్ టీకా
న్యూఢిల్లీ : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ఆరోగ్య రంగ సిబ్బందికి, వృద్ధులకి ఫిబ్రవరి నాటికే వ్యాక్సిన్‌ని ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. రెండు వ్యాక్సిన్ డోసుల ఖరీదు వెయ్యి రూపాయల వరకు ఉంటుందన్నారు. హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్–2020లో పాల్గొన్న పూనావాలా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు ముగింపు దశకు వచ్చాయని చెప్పారు. 2024కల్లా అందరికీ వ్యాక్సినేషన్ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి 2024 అవుతుందని వెల్లడించారు. ‘‘130 కోట్ల జనాభాకి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మూడు, నాలుగేళ్లు పడుతుంది. కేవలం వ్యాక్సిన్ డోసుల సరఫరాలో సమస్యలే కాకుండా డోసుల ఉత్పత్తికి సరిపడా బడ్జెట్ ఉండాలి. వాటి పంపిణీకి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నింటినీ అధిగమించినా 80–90శాతం జనాభాకే వ్యాక్సిన్ ఇవ్వడం కుదురుతుంది’’అని ఆయన వివరించారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వృద్ధుల్లో కూడా సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ వ్యాక్సిన్‌పై అంచనాలు పెరిగిపోయాయని చెప్పారు. భారత్‌లో జరిగే ప్రయోగాల ఫలితాలు మరో నెలన్నరలో వెలువడతాయని పూనావాలా చెప్పారు. 2 నుంచి 8 డిగ్రీల వాతావరణంలో ఈ వ్యాక్సిన్‌ను నిల్వ చేయవచ్చునన్నారు. 2021 ఏప్రిల్ నాటికి 30 నుంచి 40 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని చెప్పారు. భారత్‌కి వ్యాక్సిన్ ఇవ్వడమే తొలిప్రాధాన్యమన్నారు. మూడో దశ ప్రయోగాల్లోకి చైనా టీకా చైనాకు చెందిన అన్హుయ్ ఝిఫై లాంగ్‌కామ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మూడో దశ మానవ ప్రయోగాల్లోకి అడుగుపెట్టింది. అన్హుయ్ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను చైనీస్ అకాడెమీ సైన్సెస్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో బయాలజీతో కలసి అభివృద్ధి చేస్తోంది. మూడో దశ ప్రయోగాల కోసం ప్రపంచవ్యాప్తంగా 29 వేల మందిని వాలంటీర్లుగా ఎంచుకోనుంది. రెమిడెసివిర్ ఇవ్వొద్దు డబ్ల్యూహెచ్‌వో సిఫారసు కరోనా చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌తో కలిగే ప్రయోజనం ఏమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. గిలియాడ్ సంస్థకు చెందిన ఈ ఔషధంతో కరోనా రోగులు కోలుకుంటారని, వారి ప్రాణాలు కాపాడగలమనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. రెమిడెసివిర్ ఇచ్చిన 7 వేలకు పైగా కోవిడ్ రోగుల్ని అధ్యయనం చేసిన తర్వాత దాంతో వచ్చే ఉపయోగం లేదని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులతో కూడిన డబ్ల్యూహెచ్‌వో గైడ్లైన్ డెవలప్మెంట్ గ్రూప్ అభిప్రాయపడింది. ఈ వివరాలను బ్రిటన్‌కు చెందిన మెడికల్ ట్రేడ్ జర్నల్ ప్రచురించింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుపై గిలియాడ్ సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొవాగ్జిన్ వాలంటీర్‌గా హరియాణా మంత్రి భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ చివరి దశ ప్రయోగాలు హరియాణాలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగాల్లో భాగంగా హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వాలంటీర్‌గా టీకా డోసు తీసుకున్నారు. అంబాలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రికి కొవాగ్జిన్ డోసు ప్రయోగాత్మకంగా ఇచ్చి చూశారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు ఆయనకు కొన్ని పరీక్షలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం భారత్‌లో ఇదే తొలిసారి. టీకా ఇవ్వడంతో ఆయనలో వచ్చే ఆరోగ్యపరమైన మార్పుల్ని నిరంతరం వైద్యులు పరీక్షిస్తారు. నాలుగు వారాల తర్వాత మంత్రికి రెండో డోసు ఇస్తారు. -
2 డోసుల వ్యాక్సిన్ రూ. 1,000కే!
ముంబై, సాక్షి: వచ్చే ఏడాది ఏప్రిల్‌కల్లా ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ దేశీయంగా అందరికీ అందుబాటులోకి రాగలదని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరికల్లా తొలుత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్న కార్యకర్తలకు అందించనున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో పూనావాలా తెలియజేశారు. ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజలందరికి విక్రయించే వీలున్నట్లు వివరించారు. నియంత్రణ సంస్థల అనుమతులు, తుది క్లినికల్ పరీక్షల ఫలితాలు ఆధారంగా రెండు డోసేజీల ఈ వ్యాక్సిన్ గరిష్టంగా రూ. 1,000 ధరలోనే లభించే వీలున్నట్లు తెలియజేశారు. వెరసి 2024కల్లా దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రధానంగా సరఫరా సమస్యలు, బడ్జెట్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, ప్రజల ఆసక్తి వంటి అంశాలు ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. ఈ అంశాల నేపథ్యంలో 2024కల్లా దేశంలోని 80-90 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ లభించవచ్చని అంచనా వేశారు. వ్యాక్సిన్ తయారీపై ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకాతో ఇప్పటికే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. కారు చౌకగా.. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ధరపై స్పందిస్తూ.. 5-6 డాలర్ల స్థాయిలో వెలువడవచ్చని హెల్త్‌కేర్ రంగ దేశీ కంపెనీ సీరమ్ సీఈవో పూనావాలా చెప్పారు. దీంతో దేశీయంగా రెండు డోసుల వ్యాక్సిన్ రూ. 1,000 గరిష్ట ధరలో లభించవచ్చని తెలియజేశారు. నిజానికి దేశీ ప్రభుత్వం వ్యాక్సిన్లను భారీ పరిమాణంలో కొనుగోలు చేయనుండటంతో ఇంతకంటే తక్కువ ధరలోనూ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. అంటే 3-4 డాలర్లకు సైతం ప్రభుత్వం వ్యాక్సిన్లను సమకూర్చుకునే వీలున్నదని వివరించారు. ఇది కోవాక్స్ ధరలకు సమానమని చెప్పారు. నేడు వినిపిస్తున్న పలు ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కారు చౌకగా వ్యాక్సిన్లను అందించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పెద్దవయసు వారిలోనూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. యువతతోపాటు, వయసుమీరిన వారిలోనూ ఒకేస్థాయిలో టీసెల్స్, రోగనిరోధక శక్తి పెంపు వంటివి వ్యాక్సిన్ ద్వారా కనిపించినట్లు తెలియజేశారు. అనుమతులు లభించాక ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు యూకే, యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థల నుంచి ఎమర్జెన్సీ అనుమతులు లభిస్తే.. దేశీయంగానూ వినియోగానికి దరఖాస్తు చేయనున్నట్లు పూనావాలా తెలియజేశారు. అయితే అత్యవసర అనుమతి ద్వారా హెల్త్‌కేర్ నిపుణులు, వర్కర్లు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే వ్యాక్సిన్లను అందించే వీలున్నట్లు వివరించారు. ఈ వ్యాక్సిన్‌ను 2-8 సెల్షియస్‌లో భద్రపరచవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి నెలకు 10 కోట్ల డోసేజీల తయారీపై దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. దేశీయంగా జులైకల్లా 40 కోట్ల డోసేజీలు అవసరమవుతాయని అంచనా వేశారు. -
విదేశీ టీకాలు మనకు సరిపోవు..!
సాక్షి, హైదరాబాద్: మన దేశ పరిస్థితులకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాలు సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్ మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని గగన్‌దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోట్ల సంఖ్యలో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో అతిశీతల వ్యవస్థలు తక్కువగా ఉండటంతో ఇతర కంపెనీల టీకాలు సరిగా పనిచేయవని ‘ద వైర్.ఇన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గగన్‌దీప్ కాంగ్ స్పష్టం చేశారు. ఫైజర్ వ్యాక్సిన్ 90 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందన్న అంచనాలున్నా వీటిని –70 నుంచి –80 డిగ్రీ సెల్సియస్ అతిశీతల ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుందని, రవాణా సమయంలోనూ ఇది తగ్గరాదని ఆమె వివరించారు. పైగా ఫైజర్ టీకా రెండ్రోజుల్లో పనికిరాకుండా పోతుందని గుర్తు చేశారు. ‘మోడెర్నా టీకా నిర్వహణ –20 డిగ్రీ సెల్సియస్ స్థాయిలోనే జరుగుతుంది. నెల పాటు ఉపయోగించుకోవచ్చు. కానీ.. ఒక్కో టీకా డోసు ఖరీదు దాదాపు రూ.3,000 వరకు ఉండవచ్చు. ఇంత ఖరీదైన టీకాను మనం భరించలేము..’ అని వెల్లడించారు. ఈ రెండింటితో పోలిస్తే ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా టీకా భారత్ పరిస్థితులకు బాగా సరిపోతుందన్నారు. ఈ టీకాను నిల్వ చేసేందుకు–8 నుంచి రెండు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ఈ స్థాయి ఉష్ణోగ్రతలను సాధారణ రిఫ్రిజిరేటర్లతోనే అందించవచ్చని తెలిపారు. టీకా ముందు ఎవరికి..? టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందుగా ఎవరికి ఇవ్వాలన్న విషయంలో ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని గగన్‌దీప్ కాంగ్ హెచ్చరించారు. ఆరోగ్యరంగంలో పనిచేసే వారు, పోలీసులు, సైన్యం, 50 ఏళ్ల పైబడిన వారు.. ఇలా ప్రాధాన్యత క్రమంలో టీకాలు ఇవ్వాలని, అయితే వీరిని ఎలా గుర్తిస్తారు? ఏ క్రమంలో టీకా ఇస్తారన్న అంశం కీలకమవుతుందని తెలిపారు. ఆరోగ్య రంగంలో వివిధ రకాలున్నాయని, కోవిడ్ రోగులకు దగ్గరగా పనిచేసే వారికి ముందుగా టీకా ఇస్తారా..? ఇది ఇతర ఆరోగ్య సేవలు అందించే వారిపై వివక్ష చూపడం కాదా.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని వైద్యులు, నర్సులకు టీకా ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు? ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు వెతికిన తర్వాతే టీకా పంపిణీ చేపట్టడం మేలని సూచించారు. (చదవండి: సీనియర్లపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ భళా) జాగ్రత్తలు తీసుకోకుంటే విజృంభణే.. దేశంలో చలికాలం నేపథ్యంలో మరోసారి కరోనా విజృంభించే (సెకండ్ వేవ్) అవకాశముందా..? అన్న ప్రశ్నకు గగన్‌దీప్ కాంగ్ సమాధానమిస్తూ.. తొలి దశ కేసులు క్రమేపీ తగ్గుముఖం పట్టడం ఇప్పుడు చూస్తున్నామని.. తర్వాతి కాలంలో వచ్చే కేసుల తీరు ఎలా ఉంటుందన్నది ప్రజలు తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. మాసు్కలు వేసుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల రెండోసారి కేసులు విజృంభించే అవకాశముందన్నారు. అయితే ఇది యూరప్, అమెరికాల కంటే తక్కువ తీవ్రతతోనే ఉండవచ్చునని చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌పై శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్.. ‘కరోనా టీకాల తయారీ దాదాపు చివరి దశకు వచ్చేసింది.. ప్రపంచం నలుమూలల్లోని పలుదేశాల్లో వేర్వేరు కంపెనీలు నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలు వెల్లడవుతున్నాయి. తమ టీకా సామర్థ్యం 95 శాతమని ఫైజర్ కంపెనీ ప్రకటిస్తే.. మా టీకా ఒక అర శాతం మాత్రమే తక్కువన్నట్టుగా అమెరికన్ కంపెనీ మోడెర్నా చెప్పుకుంది. ఈ టీకాలే కాకుండా.. రష్యా, బ్రిటన్, చైనా, భారతీయ కంపెనీలు తయారు చేస్తున్నవి ఇంకా బోలెడున్నాయి. మరి.. ఇవన్నీ మనదేశంలో వాడొచ్చా అంటే.. వీలుకాకపోవచ్చని’ చెబుతున్నారు దేశంలోనే పేరొందిన వ్యాక్సిన్ నిపుణురాలు, శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్.. -
సీనియర్లపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ భళా
లండన్: కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ సీనియర్ సిటిజెన్స్‌లో రోగనిరోధక శక్తిని బలంగా పెంపొందిస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తాజాగా వెల్లడించింది. క్లినికల్ పరీక్షల రెండో దశలో భాగంగా 56-69 ఏళ్ల వయసు వ్యక్తులలో తమ వ్యాక్సిన్ పటిష్ట ఫలితాలను సాధించినట్లు పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే 70 ఏళ్ల వయసు వ్యక్తులతోపాటు.. యువతపైనా ఒకే స్థాయిలో ఇమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేసింది. రెండో దశ పరీక్షలలో భాగంగా 560 మందిపై వ్యాక్సిన్‌ను పరిశీలించినట్లు వెల్లడించింది. వీరిలో 240 మంది సీనియర్ సిటిజెన్స్‌గా తెలియజేసింది. ఫలితాలు భేష్ బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రోత్సాహకర ఫలితాలను వెలువరించినట్లు తెలియజేసింది. వ్యాక్సిన్ వినియోగంతో యాంటీబాడీ, టీసెల్స్ బలమైన రెస్పాన్స్‌ను కనబరచిరినట్లు వివరించింది. ఈ విషయాలను తాజాగా లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించింది. మూడో దశ క్లినికల్ పరీక్షల ప్రాథమిక డేటా రానున్న వారాల్లో వెల్లడికాగలదని నివేదిక పేర్కొంది. తద్వారా సమాజంలోని భిన్న వ్యక్తులకు రక్షణ కల్పించగల అంశంపై మరిన్ని వివరాలు అందగలవని తెలియజేసింది. AZD1222 పేరుతో రూపొందించిన ప్లాసెబో, వ్యాక్సిన్‌ను రెండు డోసేజీలలో తీసుకున్న వొలంటీర్లలో ఎలాంటి ఇతర ఇబ్బందులూ తలెత్తలేదని వివరించింది. చదవండి: (నాలుగో రోజూ పసిడి- వెండి.. వీక్) వైరల్ వెక్టర్ యూఎస్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా.. మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్లను రూపొందిస్తున్న విషయం విదితమే. అయితే తాము వైరల్ వెక్టర్ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా ఇప్పటికే వెల్లడించింది. చింపాంజీలలో కనిపించే సాధారణ జలుబుకు సంబంధించిన వైరస్ ఆధారంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది. గతంలోనే యూకే ప్రభుత్వం 10 కోట్ల డోసేజీల వ్యాక్సిన్లను అందించవలసిందిగా ఆస్ట్రాజెనెకాకు ఆర్డర్లు జారీ చేసింది. దేశీయంగా ఆస్ట్రాజెనెకాతో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
డిసెంబర్ చివరి నాటికి కరోనా వ్యాక్సిన్
న్యూఢిల్లీ : డిసెంబర్ నాటికి భారత్‌లో 10 కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆస్ట్రాజెన్‌కా వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు భారత్‌లో సంయుక్తంగా తయారు చేస్తోన్న 'అస్త్ర జెనికా' అనే కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రాజెన్‌కా టీకా చివరి దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అదార్ పూనవాలా అన్నారు. కరోనా వైరస్‌ను ఈ టీకా సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడైతే.. అత్యవసర అనుమతి కింద బిలియన్ (వంద కోట్ల) డోసులను డిసెంబర్ నాటికి ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం డోసులన్నీ భారత్‌కు వెళ్లనున్నాయని పూనవాలా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి 2021లో పూర్తిస్థాయి అనుమతులు లభిస్తే 50-50 శాతం నిష్పత్తితో దక్షిణ ఆసియా దేశాలకు, పేద దేశాలకు సరఫరా చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు. (నాలుగు కోట్ల డోసులు సిద్ధం) ఇప్పటివరకు 40 మిలియన్ మోతాదుల ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అందరికీ వ్యాక్సి్న్ అందడానికి 2024 వరకు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. కొవిడ్ టీకాలు భారత్ లో అందరికీ అందించాలంటే రూ. 80, 000 కోట్లు అవసరం అని ఈ మేరకు పూనావాల గత సెప్టెంబర్ నెలలోనే భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాల టీకా కోవిషీల్డ్ ప్రయోగాలు చివరిదశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే టీకా పనితీరుపై ముందస్తు ఫలితాలు ప్రకటించాలని ఆస్ట్రాజెనెకా సిద్ధమవుతున్న తరుణంలో యూకేలో వేసవి కారణంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం మొదలైంది. దీంతో టీకాల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు కంపెనీ గత వారమే తెలిపింది. మరోవైపు రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి హైదరాబాద్‌కు చేరింది. భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్‌లో రెండు, మూడో విడత క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు రష్యా ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా భారత్‌లో సుమారు 2వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి రెడ్డీస్ ల్యాబ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించి... అనంతరం ట్రయల్స్ రిజల్ట్‌ను డీజీసీఐకి సమర్పించనున్నారు. (భారత్ చేరుకున్న రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్) -
నాలుగు కోట్ల డోసులు సిద్ధం
బెంగళూరు: కోవిడ్ టీకా తయారీలో ఇంకో ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా డోసులు సుమారు నాలుగు కోట్లు సిద్ధంగా ఉన్నాయని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది. ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభిస్తే నోవావాక్స్ టీకా తయారీ కూడా చేపడతామని సీరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాల టీకా కోవిషీల్డ్ ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి. టీకా పనితీరుపై ముందస్తు ఫలితాలు ప్రకటించాలని ఆస్ట్రాజెనెకా సిద్ధమవుతున్న తరుణంలో యూకేలో వేసవి కారణంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం మొదలైంది. దీంతో టీకాల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు కంపెనీ గత వారమే తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా టీకాలను భారత్‌లో తయారు చేస్తున్న సీరమ్ నాలుగు కోట్ల డోసులు సిద్ధమైనట్లు ప్రకటించడం గమనార్హం.∙తయారైన డోసులు అంతర్జాతీయ వినియోగానికా? భారత్‌లో పంపిణీ చేసేందుకా తెలిపేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ నిరాకరించింది. -
ఔషధ పరీక్షల్లో వలంటీర్ మృతి
సావోపౌలో: అస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో వాలంటీర్ మృతి చెందినట్లు బ్రెజిల్ హెల్త్ అథారిటీ అన్విసా బుధవారం ప్రకటించింది. ట్రయల్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ట్రయల్స్‌ను కొనసాగిస్తామంది. ఈ ఘటనపై అస్ట్రాజెనెకా స్పందించలేదు. చనిపోయిన వలంటీర్‌కు వ్యాక్సిన్ ఇచ్చినట్లు నిర్ధారణైతే ట్రయల్స్‌ను 3 నెలలు ఆపివేయ వచ్చని సంబంధితవర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం మృతి చెందిన వలంటీర్‌కు మెనింజిటిస్ వ్యాక్సిన్ ఇచ్చారని సదరు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ట్రయల్స్ కొనసాగించవచ్చని ఈ ఘటనపై విచారణ జరిపిన స్వతంత్ర విచారణ కమిటీ సూచించిందని ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తున్న సావోపౌలో ఫెడరల్ యూనివర్సిటీ తెలిపింది. మృతి చెందిన వలంటీర్ రియోడిజినిరోకు చెందిన 28 సంవత్సరాల వైద్యుడి గా చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి వలంటీర్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని యూనివర్సిటీ తెలిపింది. ఇప్పటివరకు 8 వేల మంది వలంటీర్లను ట్రయల్స్ కోసం తీసుకున్నారు. -
‘అతను చనిపోయింది మా వ్యాక్సిన్ వల్ల కాదు’
లండన్: కోవిడ్ చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినకల్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురవ్వడంతో ట్రయల్స్‌ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షల్లో పాల్గొన్న ఓ వలంటీర్ మరణించాడు. అయితే అతడు తమ వ్యాక్సిన్ డోస్ తీసుకోలేదని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. అలానే మరణించిన వ్యక్తికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేమని ఇందుకు సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా బ్రెజిల్ ఆరోగ్య అధికారి మాట్లాడుతూ.. ‘వలంటీర్ మరణానికి సంబంధించిన సమాచారం సోమవారం తెలిసింది. ట్రయల్ భద్రత గురించి అంచనా వేసే అంతర్జాతీయ కమిటీ నుంచి పాక్షిక నివేదిక అందింది. ట్రయల్స్ కొనసాగించవచ్చని కమిటీ సూచించింది’ అని తెలిపారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా ప్రైవసీ, క్లినికల్ ట్రయల్స్ నిబంధనల కారణంగా వ్యక్తిగత కేసులపై వ్యాఖ్యనించలేమని తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్ భద్రత గురించి జరిపిన స్వతంత్ర, కేర్‌ఫుల్ రివ్యూ ఎలాంటి ఆందోళన లేదని తెలియజేసింది. బ్రెజిల్ రెగ్యూలేటర్స్ ప్రయోగాలు కొనసాగించవచ్చని తెలిపినట్లు యూనివర్సిటీ సమాచార విభాగం అధిపతి స్టీఫెన్ రూస్ తెలిపారు. (చదవండి: కరోనా: 10 రకాల వ్యాక్సిన్ల అప్డేట్) అమెరికాలో ట్రయల్స్‌కు బ్రేక్.. అమెరికాలో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ ఒక నెలకు పైగా నిలిపివేయబడ్డాయి. సెప్టెంబరులో యూకేలో వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వలంటీర్ అనారోగ్యానికి గురవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్ ఆగిపోయాయి. అయితే యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారతదేశాలలో ఇటీవలి వారాల్లో తిరిగి ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. టీకా అధ్యయనాలలో తాత్కాలిక విరామాలు సాధారణం. అయితే, యూకే ఎపిసోడ్ గురించి మరింత సమాచారాన్ని బహిర్గతం చేయ్యాలంటూ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికాలో ట్రయల్స్ నిలిచిపోవడంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాల గురించి ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ సంఘటనలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేటప్పుడు పరిశోధకులు ఎదుర్కొంటున్న అవరోధాలను హైలైట్ చేశాయి. మరో టీకా తయారీదారు, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా ఓ వలంటీర్ అనారోగ్యానికి గురవ్వడంతో ట్రయల్స్‌ని తాత్కలికంగా నిలిపివేశారు. (చదవండి: కరోనా అంతానికిది ఆరంభం) ఆస్ట్రాజెనెకా, జేఅండ్‌జే టీకాలు రెండూ అడెనోవైరస్లపై ఆధారపడి ఉన్నాయి. తాజా పరిణామాలతో దశాబ్దాలుగా పరిశోధకులు ప్రయోగాత్మక చికిత్సలలో ఉపయోగించిన కోల్డ్ జెర్మ్స్ గురించి ఈ రెండు ట్రయల్స్ అనేక ప్రశ్నలు సంధించాయి. ఈ ఏడాది అమెరికాలో ట్రయల్స్ ప్రారంభించవచ్చని, యూఎస్ఏ వెలుపల పరీక్షల ఫలితాల ద్వారా వ్యాక్సిన్ ఆమోదం పొందుతుందని అక్టోబర్ ఆస్ట్రాజెనెకా తెలిపింది. -
ఆరునెలల్లో ఆక్స్ఫర్డ్ టీకా
లండన్: ఈ యేడాది చివరి నాటికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కి అనుమతులొచ్చే అవకాశం ఉందని, ఆరు నెలల్లోపు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని బ్రిటన్ మీడియా తెలిపింది. ప్రముఖ ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయని, క్రిస్మస్‌నాటికి అనుమతులొచ్చే అవకాశం ఉందని మీడియా తెలిపింది. వ్యాక్సిన్‌కి అనుమతులొచ్చిన తరువాత, వృద్ధులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరు నెలల లోపు అమలు చేయనున్నట్లు ఆ రిపోర్టు పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరు నెలల్లోపు, లేదా అంతకంటే ముందే ప్రారంభించడానికి ప్రయత్నించేలా చూస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదటిగా 65 సంవత్సరాలు పైబడిన వారికి, తరువాత హైరిస్క్, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న యువతరానికి ఈ వ్యాక్సిన్‌ని ఇస్తామని, తర్వాత క్రమంలో 50 ఏళ్ళు పైబడిన వారికీ, అలాగే యువతకు వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్రిటిష్ ప్రభుత్వం పది కోట్ల ఆక్స్ఫర్డ్ వ్యాక్సి న్ డోస్‌ల కొనుగోలుకి ఆదేశాలిచ్చినట్లు వారు తెలిపారు. మూడోదశ ప్రయోగాలకు అనుమతివ్వండి: రెడ్డీస్ ల్యాబ్స్ రష్యాకు చెందిన స్పుత్నిక్–వీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను కోరింది. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ను భారత్‌లో ప్రయోగించేందుకు, ఉత్పత్తి చేసేందుకు రెడ్డీస్ ల్యాబొరేటరీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కోలుకున్న 90 రోజుల తర్వాతా కరోనా వ్యాప్తి కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన వారి శరీరంలో కోవిడ్ నుంచి కోలుకున్న 90 రోజుల తర్వాత కూడా వైరస్ ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రవెన్షన్ ఇన్ అట్లాంటా అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని వివిధ ఆసుపత్రుల నుంచి రోగుల సమాచారాన్ని సేకరించి సంస్థ విశ్లేషించి చూడగా ఈ విషయం బయటపడింది. వారి ద్వారా ఈ వైరస్ అత్యంత వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని ఆ అధ్యయనం తెలిపింది. -
వ్యాక్సిన్: రూ. 80 వేల కోట్లు ఉన్నాయా?
ముంబై: మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మానవాళి మనుగడకు సవాలు విసురుతున్న కోవిడ్-19కు చెక్ పెట్టే దిశగా ఇప్పటికే పలు ఫార్మా దిగ్గజాలు టీకా రూపకల్పనలో మునిగిపోయాయి. ఈ క్రమంలో స్పుత్నిక్-వీ పేరిట కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేయగా, ఆస్ట్రాజెనెకా, మోడర్నా తదితర కంపెనీల వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్ పరీక్షలకు చేరుకున్నాయి. అన్నీ సజావుగా సాగితే ఈ ఏడాది చివర్లోగా టీకా విడుదల గురించి ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్ ప్రభావిత దేశాల్లో ఒకటైన భారత్.. వ్యాక్సిన్ కొనుగోలు, పంపిణీ మార్గదర్శకాలు తదితర విషయాల్లో ఎంత వరకు సన్నద్ధంగా ఉందన్న అంశంపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూణావాల కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: మార్కెట్లోకి రష్యా వ్యాక్సిన్) ఈ మేరకు.. ‘‘వచ్చే ఏడాది కాలానికి గానూ 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఎందుకంటే, వాక్సిన్ కొనుగోలు చేసేందుకు, దేశంలోని ప్రతీ వ్యక్తికి దానిని పంచేందుకు ఆరోగ్య శాఖ ఈ మొత్తం అవసరం పడుతుంది. మనం తర్వాత ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు ఇదే’’అని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశీయ, విదేశీ ఫార్మా కంపెనీలను సంప్రదించి టీకాను కొనుగోలు చేసే అంశంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించేందుకే తాను ఈ ప్రశ్న అడిగినట్లు పూణావాల పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ నిరోధక వ్యాక్సిన్ రూపకల్పనలో భాగంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనెకాతో సీరం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. వాక్సిన్ ఉత్పత్తి, సరఫరా బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలో జూలై నెలలో పూణావాల మాట్లాడుతూ.. టీకా ధర వేయి రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు. అంతేగాక ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు ప్రభుత్వాలే ఉచితంగా వ్యాక్సిన్ అందించే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మరణాలు సంభవించాయి. Quick question; will the government of India have 80,000 crores available, over the next one year? Because that's what @MoHFW_INDIA needs, to buy and distribute the vaccine to everyone in India. This is the next concerning challenge we need to tackle. @PMOIndia — Adar Poonawalla (@adarpoonawalla) September 26, 2020 -
కరోనా: 10 రకాల వ్యాక్సిన్ల అప్డేట్
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య సవాళ్లు విసురుతున్న కోవిడ్-19 కట్టడికి గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను నిలువరించేందుకు వ్యాక్సిన్ల తయారీకి నడుం బిగించాయి. ఈ బాటలో ఇప్పటికే కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలలో ఎంతో ముందంజ వేశాయి. అంతర్జాతీయ స్థాయిలో తొట్టతొలిగా రష్యా తయారీ వ్యాక్సిన్ అధికారికంగా రిజిస్టర్‌కాగా.. యూఎస్, బ్రిటన్ దేశాల ఫార్మా దిగ్గజాలతోపాటు.. దేశీయంగానూ కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ తయారీ సన్నాహాల్లో వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడర్నా తదితర కంపెనీల వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్ పరీక్షలకు చేరాయి. దేశీయంగా భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా తదితరాలు రేసులో ఉన్నాయి. దీంతో కొత్త ఏడాది అంటే 2021 ప్రారంభంలో కోవిడ్-19 చికిత్సకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావచ్చన్న అంచనాలు పెరుగుతున్నట్లు ఫార్మా నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కోవిడ్-19 బారినపడుతున్న వారి సంఖ్య లక్షల్లో నమోదవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆశలు రేపుతున్న 10 వ్యాక్సిన్ల పురోగతి వివరాలు ఎలా ఉన్నాయంటే... మోడర్నా ఇంక్ జెనెటిక్ మెటీరియల్(ఎంఆర్ఎన్ఏ) ఆధారంగా యూఎస్ కంపెనీ మోడర్నా ఇంక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కోవిడ్-19కు వ్యతిరేకంగా మానక కణాల్లో యాంటీజెన్‌ను ప్రేరేపిస్తుంది. తద్వారా ఇమ్యూనిటీ(రోగ నిరోధక శక్తి)ని పెంచేందుకు దోహదపడుతుంది. ఈ వ్యాక్సిన్‌పై జులై 17 నుంచి 30,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను మోడార్నా ప్రారంభించింది. ఫైజర్- బయోఎన్‌టెక్ జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో చేతులు కలపడం ద్వారా ఫైజర్ ఇంక్.. ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. జులై 27 నుంచీ రెండు, మూడో దశల క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తోంది. యూఎస్‌తోపాటు బ్రెజిల్, జర్మనీ తదితర దేశాలలో వీటిని చేపట్టింది. ఒక్క యూఎస్‌లోనే 43,000 మందిపై ప్రయోగాలు చేపట్టే ప్రణాళికల్లో ఉంది. ఆస్ట్రాజెనెకా- ఆక్స్ఫర్డ్ చింపాంజీ ఎడినోవైరస్ ఆధారంగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్- స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను రూపొందించింది. మే నెలలో రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో 17,000 మందిపై పరీక్షించింది. మూడో దశలో భాగంగా యూఎస్‌లో 30,000 మందిపై పరీక్షిస్తోంది. దేశీయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ 1,700 మందిపై ప్రయోగాలు చేపట్టింది. యూఎస్‌లో తాత్కాలికంగా పరీక్షలను నిలిపివేసినప్పటికీ ఇతర దేశాలలో కొనసాస్తున్నట్లు తెలుస్తోంది. జాన్సన్ అండ్ జాన్సన్ ఎడెనోవైరస్ వెక్టర్(ఏడీ26) ఆధారంగా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ ఇంతక్రితం ఎబోలా, జికా, ఆర్ఎస్వీ తదితరాలకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఇది సింగిల్ డోసేజీలో రూపొందింది. ఈ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. వివిధ దేశాలలో 60,000 మందిపై పరీక్షించే ప్రణాళికల్లో ఉంది. నోవావాక్స్ దశాబ్దాలుగా రీకాంబినెంట్ నానోపార్టికల్ టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్లను రూపొందించే ప్రయత్నాలు చేస్తోంది. 1.5 బిలియన్ డాలర్లను ఇందుకు వెచ్చించినప్పటికీ ప్రయత్నాలు పెద్దగా సఫలంకాలేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే కోవిడ్-19కు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మంచి ఫలితాలనివ్వగలదని కంపెనీ భావిస్తోంది. ప్రొటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్‌గా పిలిచే ఈ ఔషధంపై కంపెనీ ఆశావహంగా ఉంది. యూకే ప్రభుత్వ సహకారంతో ఈ నెల 24 నుంచీ యూకేలో 10,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. ఏడాదికి 2 బిలియన్ డోసేజీల తయారీకి దేశ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్పుత్నిక్-వి తొలి రెండు దశల పరీక్షలు అత్యంత విజయవంతమైనట్లు ప్రకటించిన రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి తొలిసారి అధికారిక రిజిస్ట్రేషన్ పొందింది. అయితే మరో 40,000 మందిపై రష్యాలో మూడో దశ క్లినికల్ పరీక్షలను ఈ నెల నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయంగా తయారీతోపాటు, మూడో దశ క్లినికల్ పరీక్షలకు వీలుగా డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్ బయోటెక్ దేశీయంగా ఐసీఎంఆర్‌తో భాగస్వామ్యంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అందించిన స్ట్రెయిన్ ఆధారంగా ఇనేక్టివేటెడ్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఈ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను కోతులపై ప్రయోగించగా మంచి ఫలితాలను సాధించినట్లు తెలుస్తోంది. జులై నుంచీ తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను చేపట్టింది. అక్టోబర్‌లో మూడో దశ పరీక్షలను ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. దేశ, విదేశాలలో 25,000- 30,000 మందిపై ప్రయోగించే ప్రణాళికలున్నట్లు తెలుస్తోంది. జైడస్ క్యాడిలా ప్లాస్మిడ్ డీఎన్ఏగా పిలిచే వ్యాక్సిన్‌ను జెనెటిక్ మెటీరియల్ ఆధారంగా రూపొందించినట్లు జైడస్ క్యాడిలా పేర్కొంది. వ్యాక్సిన్‌పై తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను జులైలో చేపట్టింది. మరో 15,000-20,000 మందిపై మూడో దశ పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది. సనోఫీ- జీఎస్కే జీఎస్‌కేతో భాగస్వామ్యంలో దేశీయంగా తయారీ, పంపిణీ సామర్థ్యాలు కలిగిన సనోఫీ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ప్రొటీన్ సబ్యూనిట్ ఆధారిత ఈ వ్యాక్సిన్‌పై తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను ఈ నెల 3న ప్రారంభించింది. ఫలితాల ఆధారంగా ఈ ఏడాది చివరికల్లా మూడో దశ పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది. క్యాన్సినో బయోలాజిక్స్ హ్యూమన్ ఎడినోవైరస్(ఏడీ5) ఆధారంగా చైనా కంపెనీ క్యాన్సినో బయోలాజిక్స్ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇందుకు బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మిలటరీ మెడికల్ సైన్స్ అకాడమీ సహకారాన్ని తీసుకుంది. ప్రత్యేక అవసరాలరీత్యా చైనీస్ మిలటరీ ఈ వ్యాక్సిన్‌ను జూన్ 25న అనుమతించినట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌లో 40,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. ఇందుకు రష్యా, పాకిస్తాన్, సౌదీ అరేబియా నుంచి అనుమతి పొందింది. -
షరతులతో సీరంకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్‌ను తిరిగి ప్రారంభించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆక్స్ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ పరీక్షలకు అనుమతినిచ్చింది. అయితే ఈ సమయంలో ప్రోటోకాల్ ప్రకారం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికపుడు సంబంధిత సమాచారాన్ని కచ్చితంగా అందించాలని స్పష్టం చేసింది. రోజుకు 90 వేలకు పైగా కేసులతో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాక్సిన్ ప్రయోగాలు తిరిగి మొదలు కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. (కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు) ఇటీవల ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్‌ను బిట్రన్‌లో నిలిపివేసిన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వ్యాక్సిన్ రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిలిపి వేయాలని డీసీజీఐ ఈ నెల 11న సీరంను ఆదేశించింది. విదేశాల్లో అనుమతి లభించిన నేపథ్యంలో తాజా అనుమతిని డా.వి.జి.సొమానీ మంగళవారం మంజూరు చేశారు. అయితే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీరం ఇన్స్టిట్యూట్కు సూచించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వినియోగించాల్సిన మందుల జాబితాతో పాటు ఇతర చికిత్సా వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించారు. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షలు మళ్లీ షురూ!) కాగా బ్రిటిష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా కోవిడ్ వాక్సిన్ను అభివృద్ధి చేసింది. దేశీయంగా ఆ వాక్సిన్ ఉత్పత్తికి పుణేకు చెందిన సీరం ఒప్పందం చేసుకుంది. మూడవ దశ ఫలితాల్లో సమస్యల కారణంగా ఇండియా సహా, బిట్రన్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసింది. ఇటీవల బ్రిటన్ మెడిసిన్ హెల్త్ రెగ్యులేటరీ అధారిటీ అనుమతి లభించడంతో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లోనూ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతినిచ్చింది. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షలు మళ్లీ షురూ!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేశామంటూ ఉసూరుమనిపించిన బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మళ్లీ శుభవార్త చెప్పింది. మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ధృవీకరించిన తరువాత యునైటెడ్ కింగ్డమ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్‌ను తిరిగి ప్రారంభించినట్లు బ్రిటిష్-స్వీడిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. డేటాను స్వతంత్రంగా సమీక్షించిన తరువాత ట్రయల్స్ తిరిగి ప్రారంభించాలని యూకే రెగ్యులేటరీ అథారిటీ సిఫారసు చేసినట్లు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. (ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్) ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా ఒక వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో తాత్కాలికంగా ప్రయోగాలకు విరామం ఇచ్చినట్టు ప్రకటించింది. దీనిపై తమకు సమాచారం అందించలేదనీ, భద్రతా కారణాల రీత్యా పరీక్షలు నిలిపివేసి వివరణ ఇవ్వాలంటూ పూణేకు చెందిన అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరంకు డ్రగ్ కంట్రోలర్స్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) షోకాజ్ నోటీసులిచ్చింది. దీంతో మనదేశంలో ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి పొందిన సీరం కూడా ఇండియాలో పరీక్షలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (వ్యాక్సిన్ అభివృద్ధిలో తొందర పనికిరాదు) -
గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్ని కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అందరి చూపు ఆక్స్‌ఫోర్డ్ ఆస్ట్రాజెనెకా మీదనే ఉండగా.. అనూహ్యంగా ఆ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరింత ఆలస్యమవుతుందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ శుభవార్త చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కోవాక్జిన్ జంతువుల్లో సత్ఫలితాలిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ట్వీట్ చేసింది. Bharat Biotech proudly announces the animal study results of COVAXIN™ - These results demonstrate the protective efficacy in a live viral challenge model. Read more about the results here - https://t.co/f81JUSfWpD@icmr_niv #BharatBiotech #COVAXIN #Safety #Vaccine #SARSCoV2 pic.twitter.com/fva1SOcLOr — BharatBiotech (@BharatBiotech) September 11, 2020 ‘జంతువులపై కోవాక్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయని గర్వంగా తెలియజేస్తున్నాం. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో ఇమ్యూనిటీ పెరిగింది. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ వృద్ధిని నియంత్రించినట్టు గుర్తించాము. రెండో డోస్ ఇచ్చిన 14రోజుల తర్వాత మరోసారి జంతువులను పరిశీలిస్తాం’ అంటూ భారత్ బయోటెక్ ట్వీట్ చేసింది. ఇక ఇప్పటికే నిమ్స్‌లో కోవాక్జిన్ రెండో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. (చదవండి: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఆగిందా?) -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు మన దేశంలోనూ ఆగాయి. ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనెకా తిరిగి ప్రయోగాలు చేపట్టేవరకు తామూ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉండగా టీకా డోసు ఇచ్చిన ఒక వాలంటీర్‌కి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టుగా వెల్లడించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలేవరకూ భారత్‌లో రెండు, మూడో దశలకు ఇచ్చిన అనుమతుల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) డాక్టర్ వి.జి. సొమానీ సీరమ్ ఇన్స్టిట్యూట్కి షోకాజ్ నోటీసులు పంపింది. ఆ నోటీసులు అందుకున్న తర్వాతే ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా సీరమ్ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలకు బ్రేక్ పడినప్పటికీ ముందుగా అనుకున్నట్టుగానే ఈ ఏడాది చివరికి టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కాల్ సోరియెట్ చెప్పారు. టీకా భద్రతపై సమీక్షను వేగవంతంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరికి, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కరోనాకు చైనా నాజల్ స్ప్రే వ్యాక్సిన్ బీజింగ్: కరోనాను నిలువరించడానికి నాజల్ స్ప్రే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కి చైనా అనుమతించింది. తొలి దశ క్లినికల్ ట్రయల్ నవంబర్‌లో ప్రారంభం కావొచ్చని చైనా తెలిపింది. చైనాకి చెందిన నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ తరహా వ్యాక్సిన్‌ని ఆమోదించడం ఇదే తొలిసారి. -
వ్యాక్సిన్ అభివృద్ధిలో తొందర పనికిరాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై బయోకాన్ చైర్పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తయారీలో తొందర పనికి రాదని, త్వరితంగా అభివృద్ధి చేయడం సాధ్యం కాదని ఆస్ట్రాజెనెకా ప్రయోగాల ఆటంకం ద్వారా తేలిందని పేర్కొన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మాత్రమే ఆమోదం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. క్లినికల్ పరీక్షల్లో సమస్యల కారణంగా బ్రిటన్, భారతదేశంతో పాటు ఇతర దేశాలలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. (ఆస్ట్రాజెనెకా ట్రయల్స్‌కు డీసీజీఐ బ్రేక్) టీకా పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వైద్య, శాస్త్రీయ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న అంశం ఇదేనని మజుందార్ షా పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా ప్రతి తీవ్రమైన ప్రతికూలతను పరిశోధించాల్సి ఉంటుందనీ, చాలా అప్రమత్తంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. కాగా ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను కొన్ని సమస్యల కారణంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలో పరీక్షలకు అనుమతి పొందిన సీరం సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తాజా ఆదేశాల మేరకు పరీక్షలను నిలిపివేసింది. ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ రోగుల్లో మోడరేట్ నుండి తీవ్రంగా ఏర్పడే సైటోకిన్ రిలీజ్ సిండ్రోమ్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ చికిత్సకు బయోకాన్ ఐటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను మార్కెట్ చేసుకునేందుకు జులైలో డీసీజీఐ అనుమతిని సాధించిన సంగతి తెలిసిందే. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన) -
ఆస్ట్రాజెనెకా ట్రయల్స్‌కు డీసీజీఐ బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కోవిడ్-19 వ్యాక్సిన్ పై తాజా పరిణామాలు నీళ్లు చల్లాయి.ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పరీక్షల్లో సమస్యల కారణంగా కొన్ని దేశాల్లో తుది దశ క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి. దీంతో మన దేశంలో కూడా క్లినికల్ పరీక్షలకు బ్రేక్ పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతా సమస్యల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులకు వరకు పరీక్షలను నిలిపి వేయాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సీరంను ఆదేశించింది. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగాలకు డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ తాత్కాలిక బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలవరకు నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు షోకాజ్ నోటీసులిచ్చింది. ఇతర దేశాలలో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ సమస్యలు, నిలిపివేతపై కేంద్ర లైసెన్సింగ్ అథారిటీకి తెలియజేయలేదని వ్యాఖ్యానించింది. ఎందుకు సమాచారం ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో దేశంలోని 17 సైట్లలో నిర్వహిస్తున్న దశ 2/3 ట్రయల్స్ నిలిచిపోయాయి. తాజా షో-కాజ్ నోటీసుపై స్పందించిన సీరం ఇప్పటివరకు ట్రయల్స్ పాజ్ చేయమని తమకు చెప్పలేదని పేర్కొంది. అయితే డీసీజీఐ జారీ చేసిన ఆదేశాలను అనుసరిస్తామని తెలిపింది. వారి సూచనలు, ప్రామాణిక ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా తుది దశ పరీక్షలలో భాగంగా బ్రిటన్‌లో ఒక వ్యక్తిపై ప్రయోగం సందర్భంగా సమస్యలు తలెత్తడంతో తాత్కాలికంగా నిలిపి వేసినట్టు బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా నిన్న(బధవారం) వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశంపై దృష్టిసారించామని, డేటాను విశ్లేషించాక తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఆగిందా?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి నుంచి రక్షిస్తుందని అందరూ నమ్ముతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించడం ఇందుకు కారణమైంది. బ్రిటన్‌లోని ఆరోగ్య వెబ్సైట్ స్టాట్‌న్యూస్ ప్రయోగాలు నిలిపివేస్తున్న సమాచారాన్ని ప్రకటించింది. ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా, పుణే కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు జరిపిన ప్రయోగాలూ ఆగిపోతాయా? ఆ పరిస్థితి వచ్చే అవకాశాలు తక్కువ అని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేస్తున్న ఈ టీకా తొలి రెండు దశల మానవ ప్రయోగాలు పూర్తయ్యాయి. అమెరికా, యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో కనీసం 30 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు మొదలయ్యాయి. వేల మందిపై జరిగే ఈ మూడో దశ ప్రయోగాలు ఏళ్లపాటు కొనసాగుతాయి. ఈ క్రమంలో ఒకరిద్దరు జబ్బుపడటం అసాధారణంకాదని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన శాస్త్రవేత్త చెప్పారు. ఆస్ట్రాజెనెకా ఏం చెబుతోంది? స్వతంత్ర సంస్థ ఒకటి ప్రయోగాలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సమీక్షించనుందని, ఆ తరువాతే ప్రయోగాల కొనసాగింపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆస్ట్రాజెనెకా చెప్పినట్లు వార్తాలొచ్చాయి. గతంలోనూ ఒకసారి ఈ టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశామని, టీకా వేసిన వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి సమస్యకు కారణం వెంటనే తెలియని పక్షంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రయోగాలు నిలిపివేస్తారని ఆరోగ్యవార్తలను మాత్రమే ప్రచురించే స్టాట్‌న్యూస్ తెలిపింది. అన్నీ సవ్యంగా సాగితే కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రయోగాలను పునరుద్దరిస్తారని వివరించింది. భారత్‌లో సాఫీగా ఆక్స్ఫర్డ్ రెండోదశ ప్రయోగాల్లో భారత్‌లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. రెండోదశలో 100 మంది వలంటీర్లపై టీకాను ప్రయోగించామని, కీలకంగా భావించే ఏడురోజుల సమయం దాటినా ఎవరిలోనూ సైడ్ఎఫెక్ట్స్ కనిపించలేదంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ 100 కోట్ల ఆక్స్ఫర్డ్ టీకాలను ఉత్పత్తి చేయడానికి అస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకుంది. సీరమ్‌కు నోటీసు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌పై విదేశాల్లో ప్రయోగాలు నిలిపివేసిన సమాచారాన్ని తమకు ఇవ్వనందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) సీరమ్ ఇన్స్టిట్యూట్కు బుధవారం షోకాజ్ నోటీసు జారీచేసింది. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమేనని నిరూపణ అయ్యేంతవరకు రెండు, మూడో దశల కోసం సీరమ్‌కు ఇచ్చిన అనుమతులను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరింది. షోకాజ్‌కు వెంటనే బదులివ్వాలని, లేని పక్షంలో సీరమ్ వద్ద వివరణ ఇవ్వడానికేమీ లేదని భావించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీసీఏ డాక్టర్ వి.జి.సొమానీ స్పష్టం చేశారు. ప్లాస్మా.. పని చేయట్లేదు వెల్లడించిన ఐసీఎంఆర్ న్యూఢిల్లీ: కోవిడ్ వైద్యంలో భాగంగాచేసే ప్లాస్మా చికిత్స పెద్దగా ప్రభావం చూపలేదని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎంఆర్) బుధవారం స్పష్టంచేసింది. మరణాల రేటును తగ్గించడంలో గానీ, కోవిడ్ తీవ్రతను తగ్గించడంలోగానీ ప్లాస్మా ప్రభావం చూపలేకపోయిందంది. ఏప్రిల్ 22 నుంచి జూలై 14 మధ్య 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపెన్ లేబెల్ పారలెల్ ఆర్మ్ ఫేజ్ 2 మల్టీ సెంటర్ రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్(ప్లాసిడ్ ట్రయల్) పేరుతో జరిపిన పరీక్షల్లో ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపింది. ఈ పరిశోధనలో భాగంగా వైద్య నిపుణులు.. 464 మంది కోవిడ్ రోగులను ఎన్నుకొని, వారిలో 235 మందికి ప్లాస్మాను ఎక్కించారు. మరో 229 మందికి సాధారణ చికిత్స చేశారు. పరీక్షలో పాల్గొన్న వారికి 24 గంటలకు ఒక్కొక్కటి చొప్పున రెండు డోసుల ప్లాస్మా ఇచ్చినట్లు తెలిపింది. ప్రతి డోసులో 200 మిల్లీలీటర్ల ప్లాస్మా ఇచ్చినట్లు పేర్కొంది. పేషెంట్ల ఎన్రోల్, డేటా కలెక్షన్ వంటి విషయాల్లో ఐసీఎంఆర్ కలుగజేసుకోలేదని, అయితే పరీక్షల డిజైన్, స్టడీ కోఆర్డినేషన్, డేటా అనలైజేషన్ వంటి విషయాలను పరిశీలించిందని చెప్పింది. ప్లాస్మా ఇచ్చిన నాటి నుంచి 28 రోజుల వరకు వారిని పరీక్షించగా, రెండు గ్రూపుల మధ్య పెద్ద తేడాలేమీ లేవని గుర్తించినట్లు చెప్పారు. మరణాల రేటు కూడా పెద్దగా మారలేదని తెలిపారు. కోవిడ్ 19 కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ ఈ పరిశోధనను పరిశీలించి ఆమోదించిందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ప్లాస్మా థెరపీ ప్రయోగించడం సురక్షితమే అయినప్పటికీ ప్లాస్మాను నిల్వ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దేశంలో కేవలం కొన్ని సంస్థల్లోనే ఈ తరహా సదుపాయం ఉంది. దీనిపై చైనా, నెదర్లాండ్ లు కూడా పరిశోధనలు చేశాయి. అయితే రెండు దేశాలూ ఆయా పరిశోధనలను మధ్యలోనే ఆపేశాయి. ప్లాస్మా థెరపీని కోవిడ్ ఓ మోస్తరు స్థాయిలో ఉన్న వారిపైనే, పరిశోధనా పూర్వకంగా ప్రయోగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో తెలిపింది. 43లక్షలు దాటిన కేసులు న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి ఆగడం లేదు. ఇటీవల రోజుకు 90 వేలకు పైగా కేసులు బయట పడగా, తాజాగా గత 24 గంటల్లో 89,706 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,70,128 కు చేరుకుంది. గత 24 గంటల్లో 74,894 మంది కోలుకోగా.. 1,115 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 73,890 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 33,98,844 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,97,394 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.53 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శనివారానికి ఇది 77.77 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.69 శాతానికి పడిపోయిందని తెలిపింది. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 1,678 ల్యాబుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి మిలియన్ మందికి 37,539 పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. -
‘ఆస్ట్రాజెనెకా’ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ చివరి దశ పరీక్షలను నిలిపివేస్తున్నట్టు వచ్చిన వార్తలపై ఫార్మా దిగ్గజం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయిల్స్ భారత్‌లో నిలిపి వేయలేదని వివరించింది. పరీక్షలు కొనసాగుతున్నాయనీ ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని సీరం స్పష్టం చేసింది. కరోనా వైరస్ ఆస్ట్రాజెనెకా టీకా పరీక్షలకు సంబంధించి యూకేలో ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు వచ్చిన నివేదికలపై వ్యాఖ్యానించేందుకు సీరం నిరాకరించింది. ప్రస్తుతానికి బ్రిటన్‌లో పరీక్షలను నిలిపివేసినా.. త్వరలోనే పునఃప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. అయితే భారత విషయానికి వస్తే ట్రయల్స్‌కు ఎలాంటి ఆటంకం లేదని పేర్కొంది. కాగా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌లో ఈ టీకా తీసుకున్న వలంటీర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తుది దశ ట్రయల్స్‌ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా అధికారికంగా ప్రకటించింది. ప్రయోగ ప్రామాణిక ప్రక్రియ, వ్యాక్సిన్ భద్రతపై పూర్తిస్థాయి సమీక్ష కోసం ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. దీంతో పలు దేశాల్లో జరుగుతున్న ఈ వ్యాక్సిన్ ప్రయోగం నిలిచిపోయింది. కరోనా వ్యాక్సిన్ రేసులో ఆక్స్ఫర్డ్ టీకా ముందువరుసలో ఉంది. ఈ టీకాకు సంబంధించి మనదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. We (Serum Institute of India) can't comment on reports of AstraZeneca pausing the trials in the UK, other than that they have been paused for review and shall restart soon. The Indian trials are continuing and we have faced no issues at all.#SII #COVID19 #Latestnews pic.twitter.com/HWPUrQydWc — SerumInstituteIndia (@SerumInstIndia) September 9, 2020 -
వ్యాక్సిన్ పరీక్షలకు బ్రేక్ -ఆస్ట్రాజెనెకా డౌన్
ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారిని అంతమొందించేందుకు రూపొందిస్తున్న వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తాజాగా వెల్లడించింది. తుది దశ క్లినికల్ పరీక్షలలో భాగంగా బ్రిటన్‌లో ఒక వ్యక్తిపై ప్రయోగించిన వ్యాక్సిన్ అనారోగ్యానికి దారితీసినట్లు తెలుస్తోంది. దీంతో వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా తెలియజేసింది. ప్రస్తుతం ఈ అంశంపై దృష్టిసారించామని, డేటాను విశ్లేషించాక తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఆశలు రేకెత్తిన విషయం విదితమే. భారీ స్థాయిలో నిర్వహించే క్లినికల్ పరీక్షలలో ఒక్కోసారి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తవచ్చని.. ఇవి సహజమేనని ఈ సందర్భంగా ఆస్ట్రాజెనెకా పేర్కొంది. అయితే ఏ చిన్న పొరపాటుకూ తావివ్వకుండా పరిశోధనలు నిర్వహించేందుకే పరీక్షలను స్వతంత్రంగా నిలిపివేసినట్లు వివరించింది. అమ్మకాలతో డీలా.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై పరీక్షలు నిలిచిపోయిన వార్తల నేపథ్యంలో దేశీ అనుబంధ సంస్థ అయిన ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 6.3 శాతం పతనమై రూ. 3,968 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 12 శాతంపైగా పడిపోయి రూ. 3,710ను తాకింది. కాగా.. ఈ ఏప్రిల్- జూన్ కాలంలో కంపెనీ నికర లాభం 13 శాతంపైగా క్షీణించి రూ. 19 కోట్లకు పరిమితంకాగా.. నికర అమ్మకాలు 5 శాతం తగ్గి రూ. 194 కోట్లకు చేరాయి. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. -
షాకిచ్చిన ఆస్ట్రాజెనెకా.. క్లినికల్ ట్రయల్స్‌కి బ్రేక్
లండన్: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వైరస్ భరతం పట్టే వ్యాక్సిన్ కోసం దేశాలన్ని ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా స్పూత్నిక్ వి అనే వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మిశ్రమ స్పందన వెలువడింది. ఇక ప్రపంచ దేశాలన్ని ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ మీదనే ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. తుది దశ ప్రయోగాలలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పలు దేశాలలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తుండగా.. బ్రిటన్‌లో కరోనా ఆస్ట్రాజెనెకా టీకాను తీసుకున్న ఓ వాలంటీర్ తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడని గుర్తించారు. దాంతో క్లినికల్ ట్రయల్స్‌ని తాత్కలింగా నిలిపి వేశారు. క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా వచ్చిన కొన్ని ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని తేలడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు వస్తూనే ఉంటాయని, అలాంటి సందర్భాలలో పరీక్షలు నిలిపేయడం సహజమేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. (చదవండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న దాదాపు డజనుకుపైగా వ్యాక్సిన్లలో ఆస్ట్రా జెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అన్నింటిలోకి ప్రభావవంతమయ్యింది అన్న అంచనాలున్నాయి. ఇప్పటికే రెండు దశల ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్, మిగతావాటికంటే ముందుగా మార్కెట్లోకి రావడానికి అవకాశముందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. భారత్ సహా ఇంగ్లాండ్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అమెరికాలో 62 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టారు. మూడోదశ ప్రయోగం విజయవంతమైతే.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశ అందరిలోనూ వ్యక్తమవుతోంది. అంతేకాక ఒక బిలియన్ డోసుల వ్యాక్సిన్ కోసం ఆ సంస్థకు ఇప్పటికే ఆర్డర్లు కూడా అందాయి. ఈ పరిస్థితుల్లో.. ఆస్ట్రాజెనెకా తీసుకున్న నిర్ణయం ఓ విఘాతంలా మారింది. ఈ ట్రయల్స్‌ను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది స్పష్టం చేయలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే విషయాన్ని కూడా ఆ సంస్థ ధ్రువీకరించలేదు. (చదవండి: ఈ వారంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ!) అయితే ప్రయోగాల సందర్భంగా దుష్ప్రభావాలు కనిపించాయని, అందుకే వెంటనే వాటిని నిలిపివేయాల్సి వచ్చిందని, వ్యాక్సిన్‌ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని మాత్రమే సంస్థ పేర్కొన్నది. క్లినికల్ ట్రయల్స్‌ను అర్ధాంతరంగా నిలిపివేయడం కొత్తేమీ కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై ప్రభావాన్ని చూపే కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను నిలిపివేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రయోగాలు పూర్తికాక ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేనందున.. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో మరింత జాప్యం చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ చివరి దశలో!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలన్నిటినీ వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందుకు వీలుగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ ఏజెడ్‌డీ 1222 చివరి దశ క్లినికల్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేటి నుంచి యూఎస్ సహకారంతో రెండు డోసేజీలు ఇవ్వడం ద్వారా 30,000 మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా నవంబర్‌కల్లా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నారు. ఆస్ట్రాజెనెకాతోపాటు.. బయోఎన్‌టెక్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల డేటాను అక్టోబర్‌కల్లా విశ్లేషించే వీలున్నట్లు యూఎస్ దిగ్గజం ఫైజర్ తాజాగా పేర్కొంది. ఇప్పటికే ప్రయోగాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇప్పటికే బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో చివరి దశ పరీక్షలలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటికి జతగా జపాన్, రష్యాలోనూ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌లో నిర్వహించిన మూడో దశ పరీక్షల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందిపై తుది దశ ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
రెండు నెలలు ఓపిక పట్టండి : సీరం సీఈఓ
సాక్షి,ముంబై: కరనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నతరుణంలో టీకా కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరోవైపు కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ పై మధ్యంతర డేటాపై రిపోర్టు చేయొద్దంటూ ఫార్మా దిగ్గజం సీరం సంస్థ మీడియాను కోరింది. ఈ మేరకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. క్లినికల్ ట్రయల్స్ రెండు నెలల్లో ముగిసిన అనంతరం సంబంధిత డేటా మొత్తం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అప్పటిదాకా ఓపిక పట్టాలని పూనవల్లా కోరారు. (చదవండి : కరోనా వ్యాక్సిన్ : సీరం గుడ్ న్యూస్ ) ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం-ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి సీరం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ పై రోగుల గురించి పూర్తి డేటా రాకముందే ఎలాంటి నివేదికలను ఇవ్వొద్దంటూ కోరారు. ఈ ప్రక్రియను గౌరవించాలని, పక్క దారి పట్టించవద్దంటూ ఆయన ట్వీట్ చేశారు. పూర్తి సమాచారం కోసం రెండు నెలలు ఓపికగా ఉండాలని పేర్కొన్నారు. కాగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందిన అనంతరం కోవిడ్-19 వాక్సీన్ 3 వ దశ క్లినికల్ ట్రయల్స్ సీరం సంస్థ ప్రారంభించింది. I would kindly request the media to refrain, from reporting on interim data coming in about patients on the SII - Covishield clinical trials. Let us not bias the process. Let us respect the process and stay patient for two months, all the relevant data will be published soon. — Adar Poonawalla (@adarpoonawalla) August 27, 2020 -
వ్యాక్సిన్ హోప్- రెండో రోజూ రికార్డ్స్
వరుసగా రెండో రోజు సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 34 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3,431 వద్ద నిలవగా.. నాస్డాక్ 68 పాయింట్లు(0.6 శాతం) ఎగసి 11,380 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఎస్అండ్పీ తొలిసారి 3,400 మార్క్‌ను అధిగమించింది. ఇక డోజోన్స్ 378 పాయింట్లు(1.4 శాతం) జంప్‌చేసి 28,308 వద్ద స్థిరపడింది. తద్వారా ఆరు నెలల తదుపరి తిరిగి 28,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి ఫిబ్రవరి 12న సాధించిన చరిత్రాత్మక గరిష్టానికి 4.2 శాతం దూరంలో నిలిచింది. గత వారం 2.7 శాతం లాభపడటం ద్వారా నాస్డాక్ 2020లో 36వ సారి సరికొత్త రికార్డును సాధించిన విషయం విదితమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు వాషింగ్టన్ ప్రభుత్వం త్వరితగతిన అనుమతివ్వనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నవంబర్‌లో ప్రారంభంకానున్న అధ్యక్ష ఎన్నికలలోపే కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే వీలున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ప్లాస్మా చికిత్సను యూఎస్ఎఫ్డీఏ తాజాగా అనుమతించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. యాపిల్ భళా వ్యాక్సిన్ అనుమతులపై అంచనాలతో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా షేరు 2 శాతం ఎగసింది. దీంతో ఎయిర్‌లైన్స్, క్రూయిజర్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి యునైటెడ్, డెల్టా ఎయిర్‌లైన్స్ 9 శాతం చొప్పున దూసుకెళ్లగా.. కార్నివాల్, నార్వేజియన్ క్రూయిజ్ లైన్, రాయల్ కరిబియన్ 10-5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో బోయింగ్ 6.5 శాతం జంప్‌చేసింది. ఇక ఫాంగ్ స్టాక్స్‌లో ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, అల్ఫాబెట్ 1.6-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్ తొలిసారి 503 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 2 శాతం క్షీణించింది. ఆసియా లాభాల్లో యూఎస్ ఇండెక్సుల ప్రోత్సాహంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి నెలకొంది. జపాన్, సింగపూర్, కొరియా, తైవాన్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ 1.8-0.5 శాతం మధ్య జంప్ చేశాయి. ఇతర మార్కెట్లలో థాయ్‌లాండ్, చైనా 0.5-0.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
73 రోజుల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్..
పూణే: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరి ఆశలు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌పైనే ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు చెందిన ఆస్ట్రాజెనికా మూడో దశ ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. కాగా ఆక్స్‌ఫర్డ్‌తో దేశీయ ఫార్మా దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ విడుదల తేదీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీరమ్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ 73 రోజులలో భారత్‌లో విడుదల కానుందని తెలిపింది. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాలలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక శక్తి పెరిగినట్లు సీరమ్ తెలిపింది. ప్రజలకున్న సందేహాలను తీర్చేందుకు త్వరలో ఐసీఎమ్ఆర్ కరోనా వ్యాక్సిన్ వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ వెబ్సైట్ ద్వారా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.ఇటీవల సీరమ్ సంస్థ బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో వ్యాక్సిన్‌ను వేగవంతంగా తయారు చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇటీవలే కరోనాను నివారించేందుకు ప్రపంచంలోనే మొదటిసారిగా రష్యా వ్యాక్సిన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. కానీ రష్యా వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు చేయకుండానే మార్కెట్లో విడుదల చేశారని కొన్ని దేశాలు ఆరోపించిన విషయం తెలిసిందే. చదవండి: ‘మురుగు నీటి ద్వారా వైరస్ వ్యాప్తి జరగదు’ -
కరోనా వ్యాక్సిన్ : సీరం గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న సమయంలో వ్యాక్సిన్ విషయంలో ఊరటనిచ్చే వార్త. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించి దేశంలో 3వ దశ ట్రయల్స్ ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ట్రయల్స్‌లో 1600 మందికి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇస్తామని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమాచారం అందించింది. ఈ వ్యాక్సిన్ తయారీకి అనుమతి పొందిన పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 22న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసింది. 20 కేంద్రాలలో ప్రారంభం కానున్న ఈ ట్రయల్స్ మొదటి రోజున వంద మందికి టీకాలు వేస్తారు. ముఖ్యంగా పూణే, మహారాష్ట్ర , అహ్మదాబాద్ ఢిల్లీ. ఎయిమ్స్ సహా, ముంబైలోని సేథ్ జి.ఎస్. మెడికల్ కాలేజ్, కేఇఎం హాస్పిటల్, టీఎన్ మెడికల్ కాలేజ్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రాల్లో 3వ దశ పరీక్షలను నిర్వహించనున్నారు. కోవిడ్-19 హాట్స్పాట్లుగా ఉన్న ఐదు వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా 20 వేర్వేరు ప్రాంతాలు, ఆసుపత్రులనుఎంపిక చేశామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో11-12 ఆసుపత్రులలో ట్రయల్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో పాల్గొనేవారు వ్రాతపూర్వక సమ్మతి ఇవాల్సి ఉంటుందని, అలాగే స్టడీ ప్రోటోకాల్ అవసరాలకు అనుగుణంగా వారు అధ్యయన ప్రాంతంలోనే నివసించాలని తెలిపింది. దీంతో కరోనా నివారణకు సంబంధించి భారతదేశంలో అందుబాటులోకి రానున్న తొలి వ్యాక్సిన్ కోవిషీల్డ్ కానుందనే అంచనా నెలకొంది.