ఇంకొన్ని రోజుల్లో భారత్‌లో కోవిడ్ టీకాలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్య సిబ్బందితో మొదలుపెట్టి వృద్ధులు.. ఆరోగ్య సమస్యలున్న వారు అన్న క్రమంలో... వరుసగా టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి! మరి గడ్డుకాలమిక తొలగిపోయినట్లేనా? ఇక అంతా మంచేనా? ఊహూ.. కానేకాదు! టీకా తీసుకున్నా మరికొంత కాలం జాగ్రత్తలు కొనసాగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ అంశంతోపాటు టీకాలకు సంబంధించిన ఇతర సందేహాలకు సమాధానాలివిగో..
వ్యాక్సిన్లలో రకాలేమిటి?
హా ఫైజర్, మోడెర్నా సంస్థలు మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏతో(ప్రొటీన్ తయారీకి పనికొచ్చే డీఎన్‌ఏ పోగు)టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. హా భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ టీకాలో వాడే వైరస్‌లు రోగ నిరోధక కణాలు గుర్తించే యాంటిజెన్లను సిద్ధం చేస్తాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ను చింపాంజీకి చెందిన అడినోవైరస్‌ను వాహకంగా వాడుతున్నారు. హా భారత్ బయోటెక్ (హైదరాబాద్), గమలేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (రష్యా) నిర్వీర్యం చేసిన వైరస్ ఆధారంగా టీకాను తయారు చేస్తున్నాయి. ఈ వైరస్‌లు వ్యాధిని కలిగించవు కానీ.. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలు గుర్తించేందుకు ఉపయోగపడతాయి.
ఏ వ్యాక్సిన్ సామర్థ్యం ఎంత?
కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవిడ్–19 లక్షణాలు కనబరిచే వారిలో 70.4 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న వారిలో 100 శాతం పనిచేస్తుందని అంచనా. ఫైజర్ టీకా సామర్థ్యం 95 శాతం కాగా, రష్యా టీకా స్పుత్నిక్–వీ 92 శాతం సామర్థ్యాన్ని కనబరిచింది.
టీకాలు ఎవరెవరికి ఇవ్వవచ్చు?
పైన పేర్కొన్న టీకాలను 18 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఇవ్వవచ్చు. ఇందుకు తగ్గట్టుగా ప్రయోగాలు జరిగాయి. ప్రస్తుతం 12–18 ఏళ్ల వారిపై ఈ టీకాలు ఎలా పనిచేస్తాయన్నది పరీక్షిస్తున్నారు.
అందుబాటులో ఉన్నాయా?
కోవిషీల్డ్ టీకా అత్యవసర వాడకంపై అనుమతికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తు చేసుకుంది. భారత్ బయోటెక్, స్పుత్నిక్–వీ మూడో దశ ప్రయోగాలను పూర్తి చేయాల్సి ఉంది. ఫైజర్ వ్యాక్సిన్ ప్రైవేట్ రంగంలో అందుబాటులోకి రావచ్చు. 18 ఏళ్ల లోపువయసున్న వారికి ఏ టీకా అందుబాటులో లేదు.
వ్యాధి సోకి నయమైన వారికి టీకా అవసరమా?
కోవిడ్ బారిన పడి సహజసిద్ధంగా కోలుకున్న వారికి దీర్ఘకాలంలో వ్యాధి నుంచి రక్షణ ఉంటుందా? అన్నది ఇప్పటికీ అస్పష్టం. కాలక్రమంలో శరీరంలో యాంటీబాడీలు బలహీన పడే అవకాశాలు ఎక్కువైనప్పటికీ వ్యాధి నుంచి రక్షణ తగ్గిపోతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అందుకే కోవిడ్ నుంచి బయటపడిన వారికి ఆఖరులో టీకా ఇవ్వాలని యోచిస్తున్నారు.
ఒక్కో డోస్ ఎంత? ఎన్ని డోసులు?
కోవిషీల్డ్ టీకా ఒక డోసుకు 0.5 మిల్లీలీటర్ ఉంటుంది. 28 రోజుల వ్యవధిలో 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్–వీ టీకాలను 21 రోజుల వ్యవధిలో 2 డోసులు ఇస్తారు. రెండు వారాల సమయంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎంఆర్‌ఎన్‌ఏ టీకా మాత్రం తొలి డోసు తీసుకున్న 10 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలిసింది. రెండు డోసుల స్థానంలో ఒకటే తీసుకున్నా ఓమోస్తరు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రెండు డోసులతో రక్షణ ఎంత కాలం?
ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం వ్యాధి నుంచి రక్షణ లభించింది. యాంటీబాడీలు బలహీన పడినా వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని అంచనా. బూస్టర్ టీకా అవసరం రాకపోవచ్చనే అనుకుంటున్నారు. టీకా తీసుకున్న వారిలో నొప్పి, జ్వరం వంటి కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది.
టీకా వేసుకున్నాక మామూలుగా తిరిగేయవచ్చా?
ఏ వ్యాక్సిన్ అయినా 100 శాతం రక్షణ కల్పించదు. టీకా తీసుకున్న వారు మళ్లీ వ్యాధి బారిన పడకపోవచ్చుగానీ.. ఇతరులకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. అందుకే టీకా వేసుకున్న తరువాత కూడా మాస్కు ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుంది.
– సాక్షి, హైదరాబాద్
వ్యాక్సిన్‌పై వాస్తవాలేంటి?
Published Sat, Dec 19 2020 3:30 AM | Last Updated on Sat, Dec 19 2020 11:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment