Vaccine supply
-
మళ్లీ కోవిషీల్డ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తగిన డిమాండ్ లేకపోవడం, కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్ కోవిడ్ టీకా ఉత్పత్తిని తాజాగా పునఃప్రారంభించామని దాని తయారీసంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా బుధవారం ప్రకటించారు. కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ‘ ఇప్పటికే 60 లక్షల కోవోవ్యాక్స్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వయోజనులు కచ్చితంగా బూస్టర్ డోసులు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు తమ ఐచ్ఛికంగా కోవిషీల్డ్నూ తీసుకోవచ్చు. వచ్చే 90 రోజుల్లో 60–70 లక్షల డోసుల కోవిషీల్డ్ అందుబాటులో ఉండేలా చూస్తాం. డిమాండ్‌కు తగ్గట్లు స్టాక్‌ను పెంచేందుకు తొమ్మిది నెలల సమయం పట్టొచ్చు’ అని పూనావాలా చెప్పారు. చివరిసారిగా కోవిషీల్డ్ ఉత్పత్తిని సీరమ్ సంస్థ 2021 డిసెంబర్లో నిలిపేసింది. -
బూస్టర్ డోస్‌గా ‘నాసల్’ వ్యాక్సిన్.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోందన్న భయాల వేళ మరో టీకా అందుబాటులోకి వచ్చింది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో నాసల్ వ్యాక్సిన్ ధరను మంగళవారం ప్రకటించింది భారత్ బయోటెక్. ప్రైవేటు కంపెనీలకు సింగిల్ డోసు టీకా ధర రూ.800(పన్నులు అదనం)గా నిర్ణయించినట్లు తెలిపింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రానుంది ఈ నాసల్ వ్యాక్సిన్. ‘ఇంకోవాక్’(iNCOVACC)గా పిలిచే ఈ నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు కోవిన్ పోర్టల్ ద్వారా ఇప్పటి నుంచే స్లాట్స్ బుక్సింగ్ చేసుకోవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకోవాక్ నాసల్ టీకాను బూస్టర్‌గా పొందవచ్చు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా దీని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. బీబీవీ154గా పిలిచే ఈ నాసల్ టీకా ఇంకోవాక్ బ్రాండ్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రాథమిక, బూస్టర్ డోసు కోసం అనుమతులు పొందిన ప్రపంచంలోనే తొలి నాసల్ వ్యాక్సిన్‌గా ఇంకోవాక్ నిలిచినట్లు పేర్కొంది భారత్ బయోటెక్. ఇదీ చదవండి: Corona New Variant BF.7: కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే? -
కోవిడ్ వ్యాక్సిన్ @ 200 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు వేసిన డోసుల సంఖ్య 200 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 199.71 కోట్ల డోసుల టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో మరో 20,044 కరోనా కేసులు నిర్థారణయ్యాయి. దీంతో, మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయని పేర్కొంది. అదే సమయంలో, మరో 56 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,25,660కు పెరిగినట్లు తెలిపింది. -
ప్రికాషన్ డోసు గడువు తగ్గింపు
సాక్షి, అమరావతి: కరోనా టీకా ప్రికాషన్ డోసు కాల వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించినట్టు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గడువును తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల మేరకు సవరించిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లకు జారీ చేశామని చెప్పారు. ఇకపై 18 ఏళ్లు పైబడిన వారందరూ రెండో డోసు టీకా తీసుకున్న 6 నెలలు లేదా 26 వారాల తర్వాత ప్రికాషన్ డోసు టీకా వేసుకోవచ్చన్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రభుత్వమే ఉచితంగా ప్రికాషన్ డోసు వేస్తోందని తెలిపారు. 18–59 ఏళ్ల వయసున్న వారు ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రికాషన్ డోసు తీసుకోవాలని సూచించారు. సవరించిన టీకా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేలా జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన వారంతా ప్రికాషన్ డోసు తీసుకునేలా చూడాలని సూచించారు. -
కోవిషీల్డ్ బూస్టర్ కోసం సీరమ్ దరఖాస్తు
న్యూఢిల్లీ: కోవిషీల్డ్ కరోనా టీకాను బూస్టర్ డోసుగానూ అనుమతించాలని కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకుంది. రెండు డోస్‌లతోపాటు మూడో(బూస్టర్) డోస్‌గానూ పంపిణీ చేసేంత స్థాయిలో భారత్‌లో టీకా నిల్వలు ఉన్నాయని కోవిషీల్డ్ తయారీసంస్థ సీరమ్ ఆ దరఖాస్తులో పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు భారత్‌లోనూ కమ్ముకుంటున్న ఈ తరుణంలో బూస్టర్ డోస్‌కు దేశంలో డిమాండ్ పెరిగిందని సీరమ్ వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌కు వైద్య, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ ఇప్పటికే బూస్టర్ డోస్‌గా ఆమోదించిందని డీసీజీఐకు పంపిన దరఖాస్తులో సీరమ్ ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ పేర్కొన్నారు. -
ప్రపంచ ఔషధశాల భారత్.. 100 దేశాలకు కరోనా టీకా
న్యూఢిల్లీ: ఈ ఏడాది దాదాపు 100 దేశాలకు 6.5 కోట్లకుపైగా కరోనా టీకా డోసులను ఎగుమతి చేశామని ప్రధాని మోదీ చెప్పారు. భారత ఆరోగ్యసంరక్షణ రంగం ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొన్నదని తెలిపారు. భారత్‌ను ప్రపంచ ఔషధశాలగా (ఫార్మసీ) పరిగణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని టీకా డోసులను విదేశాలకు ఎగుమతి చేయబోతున్నామని వెల్లడించారు. ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి తొలి ‘ప్రపంచ ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు’ను గురువారం ప్రారంభించారు. మనదేశంలో వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ప్రోత్సాహం అందిస్తున్నామని మోదీ గుర్తుచేశారు. దీనివల్ల కొత్త ఔషధాల అభివృద్ధి, వినూత్న వైద్య పరికరాల తయారీలో భారత్ అగ్రగామిగా ఎదగడం ఖాయమని చెప్పారు. వైద్య రంగాన్ని గొప్ప స్థాయికి చేర్చగల సామర్థ్యం ఉన్న సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారని తెలియజేశారు. ఇండియాను స్వయం సమృద్ధ దేశంగా(ఆత్మనిర్భర్) మార్చడానికి దేశంలోని 130 కోట్ల మంది కంకణం కట్టుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. టీకాలు, ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను దేశీయంగానే తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఇదే స్ఫూర్తిని చాటిచెప్పామని ఉద్ఘాటించారు. 150కిపైగా దేశాలకు ప్రాణరక్షక ఔషధాలు, వైద్య పరికరాలు అందజేశామని వివరించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఫార్మా రంగం ఎంతగానో దోహదపడుతోందని ప్రశంసించారు. డిజిటల్ విప్లవంతో కొత్త సవాళ్లు ఆస్ట్రేలియా డైలాగ్‌లో ప్రధాని మోదీ క్రిప్టోకరెన్సీ వాడకం ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఇది దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని∙మోదీ చెప్పారు. డిజిటిట్ విప్లవంతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భావ సారుప్యం కలిగిన దేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూషన్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులతో గురువారం నిర్వహించిన సదస్సులో(సిడ్నీ డైలాగ్) మోదీ ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. ఆధిపత్యం చెలాయించడానికి టెక్నాలజీ ఉపయోగించుకొనే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఫ్యూచర్ టెక్నాలజీలో పరిశోధనలు, అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య దేశాలు ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసే యత్నాలను అడ్డుకొనేందుకు కృషి చేయాలని చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక, సామాజిక రంగాలను డిజిటల్ యుగం పునర్నిర్వచిస్తోందని తెలిపారు. డిజిటల్ విప్లవంతో దేశాల సార్వభౌమత్వం, పరిపాలన, విలువలు, హక్కులు, భద్రత విషయంలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ విషయంలో అప్రమత్తత అవసరమని ఉద్ఘాటించారు. ఇది మన యువతను నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. భారత్‌లో డేటాను ప్రజల సాధికారత కోసం ఒక వనరుగా ఉపయోగిస్తున్నామని గుర్తుచేశారు. డిజిటల్ విప్లవంతో అభివృద్ధికి నూతన అవకాశాలే కాదు, కొత్త సవాళ్లు సైతం ఎదురవుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌తో భారత్‌లో 6 లక్షల గ్రామాలను అనుసంధానించామని తెలిపారు. -
TS: 41 కిలోమీటర్లు.. డ్రోన్ల ద్వారా టీకాలు..
సాక్షి, హైదరాబాద్: డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ‘మెడిసిన్స్ ఫ్రం స్కై’ప్రాజెక్టును వికారాబాద్ జిల్లాలో విజయవంతంగా పరీక్షించారు. దేశంలోనే తొలిసారిగా ఏకంగా 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి కోవిడ్ టీకాలు, మందులను రవాణా చేశారు. వికారాబాద్‌లోని న్యూ ఏరియా ఆస్పత్రి నుంచి బొంరాస్‌పేట ప్రాథమిక వైద్య కేంద్రానికి (పీహెచ్సీ) డ్రోన్ ద్వారా పది సార్లు మందులను రవాణా చేశారు. ఈ రెండు ప్రాంతాల మధ్య 41 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు మార్గాన వెళ్తే దాదాపు గంటా 25 నిమిషాల సమయం పడుతుంది. కానీ డ్రోన్ ద్వారా కేవలం 32 నిమిషాల్లోనే చేరుకుంది. 30 కిలోల బరువున్న ఈ డ్రోన్ 16 కిలోల బరువున్న మందులను మోసుకుంటూ వెళ్లింది. ‘మెడిసిన్స్ ఫ్రం స్కై’ప్రాజెక్ట్‌లో భాగంగా శుక్రవారం మారుత్ డ్రోన్స్ టెక్ పైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఒక్కో డ్రోన్ ద్వారా నాలుగు బాక్స్‌లను (ఒక్కో బాక్స్‌లో 10 యూనిట్ల రక్తం, 500 టీకా డోసులు) పంపించొచ్చు. అంటే ఒక్కో డ్రోన్ ఫ్లయిట్ ద్వారా రెండు నుంచి 3 వేల వ్యాక్సిన్ డోసులను పంపించవచ్చు. గతంలో 3 నుంచి 6 కి.మీ. దూరం లోపు మందులు, టీకాలు పంపే ప్రయోగాలు జరిపారు. తొలిసారి డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ గత సెప్టెంబర్‌లో అడవుల పునరుద్ధరణలో భాగంగా దేశంలోనే తొలిసారిగా కామారెడ్డి జిల్లాలోని అటవీ ప్రాంతంలో సీడ్ కాప్టర్ డ్రోన్ల సాయంతో విత్తనబంతులను వెదజల్లారు. ఆ తర్వాత 3 నుంచి 6 కి.మీ దూరానికి డ్రోన్ల ద్వారా టీకాలు, అత్యవసర ఔషధాలు, ఇంజెక్షన్లను విజయవంతంగా రవాణా చేశారు. తాజాగా డ్రోన్ల ద్వారా పంపిన మందుల వివరాలను అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో రికార్డు చేశారు. డ్రోన్ల ద్వారా మందులను చేరవేసే సందర్భంలో టీకాలు ఉంచిన కంటైనర్ల ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయా? ఔషధాలపై ప్రభా వం పడుతోందా అన్న అంశాలను పరిశీలించారు. నవంబర్ 8న గువాహటిలో.. నవంబర్ 8న అస్సాం రాజధాని గువా హటిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సమక్షంలో గువాహటి నుంచి రోడ్డు మార్గం సరిగా లేని 40 కి.మీ దూరంలో ఉన్న ప్రాంతాలకు కరోనా టీకాలు రవాణా చేస్తాం. పర్వతాలు, లోయలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాలతో మారుత్ డ్రోన్స్, పబ్లిక్‌హెల్త్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతినిధి బృందాలు చర్చలు జరిపాయి. గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాలతోనూ వర్చువల్ సమావేశం నిర్వహించాం. – ప్రేమ్‌కుమార్ విస్లావత్, మారుత్‌డ్రోన్స్ ఫౌండర్ -
టీకా రెండో డోస్‌పై దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ లభ్యత సంతృప్తికరంగా ఉన్నందున, మొదటి డోస్ టీకా వేయించుకున్న వారంతా రెండో డోస్ తీసుకునేలా కృషి చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో వేసిన డోసుల సంఖ్య 100 కోట్లకు చేరువవుతున్న సమయంలో ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ‘కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోని వారి సంఖ్య గణనీయంగా ఉన్నందున, వీరిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. చాలా రాష్ట్రాల్లో టీకా లభ్యత అవసరాలకు సరిపోను ఉండగా రెండో డోస్ కోసం లబ్ధిదారులు వేచి చూడాల్సిన పరిస్థితులు లేవు. ప్రభుత్వం కూడా అవసరమైన డోసులను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేసి, రాష్ట్రాలు తమ టీకా లక్ష్యాలను సులువుగా సాధించాలి’అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో ఏడాదిగా అమల్లో ఉన్న నిబంధనలపై తాజాగా సూచనలు చేయాల్సిందిగా రాష్ట్రాలను ఆయన కోరారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ మందకొడిగా సాగుతున్న జిల్లాలను గుర్తించడంతోపాటు అక్కడ ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అందుకు అనుగుణంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, అదనంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. చదవండి: వేలాదిగా కశ్మీర్‌ను వీడుతున్న వలసకూలీలు -
భారత్ మాకు కీలక భాగస్వామి
వాషింగ్టన్: భారత్ తమకు అత్యంత కీలక భాగస్వామ్య దేశమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అన్నారు. వ్యాక్సిన్ ఎగుమతులను తిరిగి ప్రారంభించాలనే భారత్ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రపంచాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడానికి ఇరుదేశాలు ఏళ్లుగా కలిపి పనిచేస్తున్నాయన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో వైట్‌హౌస్ ప్రాంగణంలో భేటీ అయ్యారు. చదవండి: అంత్యక్రియలు అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక... ప్రధాని మోదీతో ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. ప్రపంచం ప్రస్తుత పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో అమెరికా– భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కావాలని కమల ఆకాంక్షించారు. కోవిడ్ మహమ్మారిపై సమష్టిగా పోరాడుదామన్నారు. సమస్యలపై పోరులో భారత్ ధృడ సంకల్పాన్ని అభినందించారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం రోజుకు కోటి డోసులు ఇస్తున్నారని భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మెచ్చుకున్నారు. ఇరుదేశాలు సహజ మిత్రులని భారత ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, అమెరికాలు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలని అన్నారు. విలువలు, ప్రాదేశిక రాజకీయ ఆసక్తులు ఒకటేన్నారు. ఇరుదేశాల సంబంధాలు నానాటికీ బలోపేతమవుతున్నాయన్నారు. సప్లయ్ చైన్స్, నూతన సాంకేతికతలు, అంతరిక్ష రంగాలపై మీకు ఆసక్తి ఎక్కువని తెలుసు... నాకూ కూడా వీటిపై ఎంతో ఆసక్తి ఉందని మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలిని ఉద్దేశించి అన్నారు. కరోనా సెకండ్‌వేవ్ సంక్షోభ సమయంలో భారత్‌కు అమెరికా చేసిన సహాయాన్ని మరువలేమన్నారు. మీరు నిజమైన మిత్రుడిలా వ్యవహరించి అండగా నిలిచారని కొనియాడారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. మీరు భారత్‌కు రావాలని దేశ ప్రజలు ఎంతో కోరుకుంటున్నారని... తమ దేశానికి రావాలని కమాలా హ్యారిస్‌ను ఆహా్వనించారు. 40 లక్షల మంది ప్రవాస భారతీయులు ఇరుదేశాల మధ్య వారిధిలా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బైడెన్, హ్యారిస్‌ల నేతృత్వంలో అమెరికా పురోభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని ఆకాంక్షించారు. బంధాలను బలోపేతం చేసుకుందాం ప్రధాని మోదీ గురువారం వాషింగ్టన్లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్‌తో సమావేశమయ్యారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సంబంధాలతోపాటు ఇరు దేశాల ప్రజల నడుమ బంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు సైతం ప్రస్తావనకు వచ్చాయి. ఆస్ట్రేలియాతో మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విషయంలో ఇది మరొక అధ్యాయమని విదేశాంగ శాఖ ప్రతినిధి బాగ్చీ అన్నారు. కోవిడ్–19, వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, క్లీన్ ఎనర్జీ అంశాలపై ఇరువురూ మాట్లాడుకున్నారని వెల్లడించారు. ఆకస్(ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) భద్రతా భాగస్వామ్యం ఏర్పాటైన తర్వాత మోదీ, మోరిసన్ భేటీ కావడం ఇదే తొలిసారి. -
రేపు ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’ ప్రారంభం
వికారాబాద్: దేశంలోనే తొలిసారి డ్రోన్ల ద్వారా మందులు, టీకాలు సరఫరా చేసే కార్యక్రమానికి వికారాబాద్ వేదిక కానుంది. దేశంలోనే తొలిసారి చేపడుతున్న ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’కార్యక్రమాన్ని శనివారం కేంద్ర మంత్రి జోతిరాదిత్య, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ట్రయల్ రన్‌ను డ్రోన్ల తయారీ కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టర్ నిఖిల పరిశీలించారు. నూతన కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రవాణా వ్యవస్థ సరిగ్గాలేని ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందన్నారు. భవిష్యత్తులో టీకాలు, యాంటీవీనమ్ వంటి మందులు సకాలంలో ఆస్పత్రులకు చేరవేసేలా డ్రోన్లు ఎంతగానో సహాయపడతాయని స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా అవయవాలను కూడా చేరవేసే అవకాశం ఉందని తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు తదితర విషయాలు పర్యవేక్షిస్తున్నామన్నారు. ట్రయల్ రన్లో టీకాలు ఆకాశ మార్గాన వెళ్లే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో అంతే ఉంటుందా? ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? అనే విషయాలను గమనిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రయ్య, మోతీలాల్, అదనపు ఎస్పీ రషీద్, ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ తుకారామ్ తదితరులు పాల్గొన్నారు. -
టీకాలు ఎగిరొస్తాయ్!
వికారాబాద్: దేశంలో డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాను ప్రారంభించే ప్రక్రియకు రంగం సిద్ధమైంది. తెలంగాణ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ‘ఆకాశ మార్గం ద్వారా మందులు’ ప్రాజెక్టు ఈ నెల 11న ప్రారంభం కానుంది. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో కలసి జిల్లా కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా టీకా చేరవేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. శనివారం ప్రయోగాత్మకంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కార్యక్రమం జరుగనుంది. జిల్లా పరిధిలోని ఐదు పీహెచ్‌సీలకు మొదటి రోజు డ్రోన్ల ద్వారా చేరవేయనున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ, వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు, ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్, బంట్వారం, బొంరాస్‌పేట పీహెచ్‌సీలకు ముందుగా డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం కలెక్టర్ పర్యవేక్షణలో అధికారులు డ్రోన్ల ద్వారా టీకా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానయాన శాఖ, పోలీసు శాఖల అనుమతులు, పీహెచ్‌సీలకు సరఫరా చేయాల్సిన టీకా బాక్సులు, నిల్వ తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లు గగనతలంలో ఎగరటం, గమ్యస్థానాలకు చేరే వరకు పర్యవేక్షణ, వాటి రక్షణను పోలీసు శాఖ పర్యవేక్షిస్తుంది. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి సబితారెడ్డి ఈ నెల 11న కార్యక్రమం జరిగే వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలోని మైదానాన్ని బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సభా వేదిక, డ్రోన్లు ఎగిరే ప్రదేశం, మీడియా గ్యాలరీ తదితరాలను పరిశీలించిన మంత్రి.. ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట కలెక్టర్ నిఖిల, ఎస్పీ నారాయణ, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, ఫైలట్ రోహిత్‌రెడ్డి ఉన్నారు. అంతకుముందు వికారాబాద్ నుంచి అనంతగిరి రోడ్డులోని 100 పడకల ఆస్పత్రిని సబిత సందర్శించారు. కోవిడ్ పరీక్షల కోసం ఆర్టీపీసీఆర్ సెంటర్ ప్రారంభిస్తామని చెప్పారు. 9–10 కి.మీ. దూరం వరకు.. డ్రోన్ల ద్వారా టీకాలను తీసుకెళ్తుండటం దేశంలో ఇదే తొలిసారి. అందువల్ల గురు, శుక్రవారాల్లో అధికారులు వీటిని పరీక్షించనున్నారు. ఈ రెండు రోజులు డ్రోన్లు కనుచూపు మేర నుంచి 500–700 మీటర్ల దూరం వరకు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 11 నుంచి 9–10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సరఫరా చేయడాన్ని ప్రారంభిస్తారు. ఇవి టీకాతోపాటు, మందులు, ఇతర వైద్య పరికరాలను కూడా తీసుకెళ్తాయి. దీనికోసం డ్రోన్‌ఆధారితవస్తు రవాణాలో పేరొందిన స్కై ఎయిర్ కన్సార్టియం.. బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్‌తో కలిసి పనిచేస్తోంది. -
భారత్‌లో లైన్ క్లియర్.. జాన్సన్ – జాన్సన్ వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన సింగిల్ డోస్ కోవిడ్–19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ట్వట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో కరోనాపై భారత్ చేస్తున్న పోరాటం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ‘జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కి అనుమతినివ్వడంతో మన దేశంలో వ్యాక్సిన్ల సంఖ్య అయిదుకి చేరుకుంది. కోవిడ్–19పై దేశం చేస్తున్న సమష్టి పోరాటానికి ఈ వ్యాక్సిన్ మరింత ఊతమిస్తుంది’’ అని మాండవీయ ట్వీట్ చేశారు. బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసి పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ , స్వదేశీ వ్యాక్సిన్ భారత్ బయోటెక్‌కి చెందిన కొవాగ్జిన్, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్–వీ అందుబాటులో ఉండగా , ఇటీవల అమెరికాకి చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు ఆ జాబితాలో జాన్సన్ అండ్ జాన్సన్ కూడా చేరింది. శుక్రవారం నాడు జే అండ్ జే కంపెనీ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అదే రోజు డీసీజీఐ అనుమతినిచ్చిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కీలక ముందడుగు: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా మహమ్మారిని అరికట్టడంలో ఈ వ్యాక్సిన్‌కు అనుమతులివ్వడం కీలక ముందడుగు అని భారత్‌లోని జాన్సన్ అండ్ జాన్సన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 18 ఏళ్లు అంతకంటే పై బడిన వారికి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్‌లో అనుమతులు లభించాయని ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో జే అండ్ జే కంపెనీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో నిర్వహించడానికి దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. అదే సమయంలో వ్యాక్సిన్‌తో నరాలకు సంబంధించిన దుష్ప్రభావాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆ కంపెనీ వెనక్కి వెళ్లింది. ఆ తర్వాత తమ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు లేవని పలు అధ్యయనాలు తేల్చిన తర్వాత భారత్‌లో విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించి అనుమతులు పొందింది. ఎన్నెన్నో ప్రత్యేకతలు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ చాలా అంశాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. అవేంటో చూద్దాం ► ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉంటే జాన్సన్ అండ్ జాన్సన్ ఒక్క డోసు (0.5ఎంఎల్) తీసుకుంటే సరిపోతుంది. ► ఈ వ్యాక్సిన్ 85% సామర్థ్యంతో పని చేస్తుందని, అత్యంత సురక్షితమైనదని అమెరికా, దక్షిణాఫ్రికాలో జరిగిన పరిశోధనల్లో తేలింది. ► ఫైజర్, మోడెర్నా మాదిరిగా ఈ వ్యాక్సిన్‌కు అత్యంత శీతల వాతావరణంతో పని లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. దీంతో ఈ వ్యాక్సిన్‌ను కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలకు పంపిణీ చేయవచ్చు. ► అమెరికాలోని ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లో వినియోగించే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ టీకాలో వాడలేదు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా టీకా మాదిరిగా ఇది ఎడెనోవెక్టర్ వ్యాక్సిన్. కరోనా వైరస్ జన్యువుల్లోని స్పైక్ ప్రొటీన్‌ను ఎడెనోవైరస్తో సమ్మేళనం చేసి ఈ టీకాను తయారు చేశారు. ఇది శరీరంలో ప్రవేశించాక రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి స్పైక్ ప్రొటీన్‌పై పోరాడడానికి సిద్ధమవుతుంది. దీంతో శరీరంలో యాంటీబాడీలు వచ్చి చేరుతాయి. ► ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన కీలకమైన ఫార్ములా కరోనా వైరస్ బట్టబయలు కావడానికి పదేళ్లకు ముందే అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. బేత్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్‌కు చెందిన వైరాలజిస్టు డాన్ బరౌచ్, ఆయన బృందం జన్యుపరంగా మార్పులు చేసుకునే రోగకారకాలను మానవ కణజాలంలోకి ప్రవేశ పెట్టడానికి అవసరమైన వెక్టర్ (వాహకం)ను అభివృద్ధి చేస్తున్నారు. ఆ వాహకాన్నే ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌లో వినియోగించారు. వివాదాలేంటి ? ఈ వ్యాక్సిన్ చుట్టూ పలు వివాదాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా ఈ వ్యాక్సిన్ వినియోగం మొదలు పెట్టాక ఏప్రిల్‌లో కొందరిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తింది. వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల్లోనే ఈ దుష్ప్రభావం కనిపించింది. దీంతో కొన్నాళ్లు టీకా పంపిణీని నిలిపి వేశారు. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం విచారించి ఈ వ్యాక్సిన్‌తో జరిగే ప్రయోజనమే అత్యధికమని నిర్ధారించి మళ్లీ పంపిణీని మొదలు పెట్టింది. ఆ తర్వాత అరుదుగా వచ్చే నరాలకు సంబంధించిన వ్యాధి కూడా ఈ టీకా ద్వారా వచ్చే అవకాశం ఉందన్న ప్రమాదఘంటికలు మోగా యి. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజుల తర్వాత శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ దుష్ప్రభావం కూడా చాలా తక్కువ మందిలో ఉండడంతో టీకా తీసుకోవడానికి ఎలాంటి భయాం దోళనలు అక్కర్లేదని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. డెల్టా వేరియంట్‌ను అడ్డుకోగలదా ? ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా డెల్టా వేరియెంట్‌ను జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా అడ్డుకోగలదని దక్షిణాఫ్రికా తాజా సర్వేలో వెల్లడైంది. సిస్నోక్ అనే పేరుతో చేపట్టిన ఈ సర్వేలో డెల్టాతో పాటుగా బీటా వేరియంట్‌పై కూడా ఈ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తోందని తేలిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్ సోకితే ఆస్పత్రి చేరే అవసరం 71% మందికి రాదని, అదే బీటా వేరియంట్ అయితే 67% మందికి ఇంట్లోనే వ్యాధి నయం అయిపోతుంది. ఇక మరణాల రేటుని 96% తగ్గిస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రజలెవరూ ఆస్పత్రిపాలయ్యే అవకాశం ఉండదని, ప్రాణం మీదకి రావడం దాదాపుగా అసంభవమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిండా గెయిల్ వెల్లడించారు. -
Vaccine Corruption Scandal: బొల్సొనారోకు భారీ షాక్
కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోసుల కోసం భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం.. ఆపై ముడుపుల విమర్శలతో రద్దు చేసుకున్న పంచాయితీ బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. రాజకీయ ఒత్తిళ్లు, ప్రజా నిరసనల మధ్య బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు భారీ షాకిచ్చింది అక్కడి అత్యున్నత న్యాయస్థానం. ఈ భారీ కుంభకోణంలో బొల్సొనారోతో సహా కీలక పదవుల్లో ఉన్నవాళ్లను సైతం విచారించాలని దర్యాప్తు బృందాలను ఆదేశించింది బ్రెజిల్ సుప్రీం కోర్టు. సావ్ పాలో: కొవాగ్జిన్ డీల్‌కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై, ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు, బ్రెజిల్ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది. శుక్రవారం రాత్రి హడావిడిగా ఆదేశాలను జారీ చేసిన జస్టిస్ రోసా వెబర్.. 90 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని గడువు విధించారు. మరోవైపు బ్రెజిల్ కాగ్(సీజీయూ)ను ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరింది న్యాయస్థానం. తగ్గని ఆగ్రహజ్వాలలు కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడంటూ అధ్యక్షుడికి వ్యతిరేకంగా వేల మంది యాంటీ-బొల్సొనారో ఉద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనాతో ఐదు లక్షల మంది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడంటూ బొల్సొనారోపై హత్యాయత్నం కేసులు సైతం నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ ముడుపుల ఆరోపణలు రావడంతో వాళ్లలో మరింత ఆగ్రహం పెల్లుబిక్కింది. దీంతో మూడురోజులుగా రోడెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నారు. శనివారం సైతం పార్లమెంట్ ఆవరణలో వీళ్లు నిరసనలు చేపట్టారు. ఇక బొల్సొనారోను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. పాత-కొత్త ఆరోపణలు(కొవాగ్జిన్ డీల్ అంశం సహా), వివాదాలను ప్రస్తావిస్తూ ఈ వారంలోనే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. చదవండి: బొల్సొనారో రక్తపిశాచి.. జనాగ్రహంతో పెరిగిన కరోనా! అఘమేఘాల మీద రద్దు కాగా, ఈ ఫిబ్రవరిలో కొవాగ్జిన్ డోసుల కోసం బ్రెజిల్ ప్రభుత్వం భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకుంది. ఒక్కో డోస్‌కు 15 డాలర్ల చొప్పున.. సుమారు 2 కోట్ల డోసుల సరఫరాకు ఆ ఒప్పందం జరిగింది. ఈ డీల్ విలువ వేల కోట్లు కాగా, దాదాపు రూ.734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్తి కంపెనీ ప్రిసిసా మెడికంతోస్తో పాటు.. బొల్సొనారోకు సైతం ముట్టినట్టు ప్రతిపక్ష సెనేటర్లు ఆరోపించారు. అయితే ఈ డీల్‌లో ఆరోపణలతో తమకు సంబంధం లేదని భారత్ బయోటెక్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు ముందస్తు చెల్లింపులు తమకు జరగలేదని, ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని.. అయితే అత్యవసర అనుమతులు మాత్రం ఈమధ్యే జరిగాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఈలోపే బ్రెజిల్ ప్రభుత్వం ఒప్పందం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. చదవండి: వ్యాక్సిన్‌తో మొసళ్లుగా మారుతున్న మనుషులా? -
Telangana: నెలాఖరుకు సరిపడా టీకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఈనెలాఖరు వరకు సరిపోను వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 3 లక్షల డోస్‌లు సిద్ధంగా ఉన్నాయని, మరో 15 లక్షల టీకాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం లేఖ పంపిందని తెలిపాయి. ఏ రోజు ఎన్నెన్ని టీకాలు రాష్ట్రానికి వస్తాయన్న వివరాలను కూడా కేంద్రం వెల్లడించిందని పేర్కొన్నాయి. దీంతో ఈ నెలాఖరు వరకు వ్యాక్సిన్ల కొరత ఉండదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు మొదటి, రెండో డోసు కలిపి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు టీకాలు వేస్తున్నారు. కరోనా థర్డ్‌వేవ్‌కు ముందే వీలైనంత వేగంగా టీకాలు వేయించుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇతర వ్యాక్సిన్లపై అస్పష్టత.. ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర దేశాల్లో ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్ వంటి టీకాలు కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్ని టీకాలను తెప్పించేందుకు రాష్ట్రం లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల మాదాపూర్‌లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి స్పుత్నిక్ టీకా వైయల్స్‌ను తెప్పించి కొందరికి వేసింది. దీంతో అనేకమంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. అలాగే మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కూడా బుక్ చేసుకున్నాయి. అయితే చివరకు కొన్ని అడ్డంకుల కారణంగా తాము సరఫరా చేయలేమని కంపెనీ చెప్పినట్లు ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు తెలిపాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా టీకాలు తెప్పించలేని పరిస్థితి ఉన్నట్లు వారంటున్నారు. దీంతో ఇతర కంపెనీల టీకాల రాకపై అస్పష్టత నెలకొంది. అయితే ప్రపంచంలోని అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే, తమకు ఇష్టమైనది వేయించుకుంటామనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇదిలాఉండగా, కొందరు ధనవంతులైతే తమకు ఇష్టమైన టీకా తీసుకునేందుకు సమీప దేశాలకు వెళ్తున్నారు. అక్కడ టీకా తీసుకొని ఒకట్రెండు రోజులు ఉండి వస్తున్నారు. మరికొందరైతే తమ పిల్లలు, స్నేహితులు అమెరికాలో ఉంటే అక్కడకు వెళ్లి ఫైజర్ వంటి టీకాలు వేయించుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య పనిమీద విదేశాలకు వెళ్లేవారు కూడా ఇదే చేస్తున్నారు. ప్రభుత్వం మన రాష్ట్రంలో అన్ని రకాల టీకాలు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. -
త్వరలో జైడస్ క్యాడిలా టీకా..!
అహ్మదాబాద్: భారత్‌లో తమ కోవిడ్ 19 వ్యాక్సిన్ ‘జైకోవ్–డీ’అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా ఈ నెలలో ప్రభుత్వానికి దరఖాస్తు చేయనుంది. ఈ నెలలోనే తమకు అనుమతి లభిస్తుందని ఆ కంపెనీ భావిస్తోంది. నెలకు కోటి డోసుల టీకాలను ఉత్పత్తి చేయగలమని, త్వరలో ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 4 కోట్లకు పెంచగలమని సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. 2 – 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆ టీకాను నిల్వ చేయాలని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ టీకాల వినియోగానికి అనుమతి ఉంది. ఇది భారత్‌లో తయారైన తొలి డీఎన్ఏ వ్యాక్సిన్ క్యాండిడేట్ అని జైడస్ క్యాడిలా ఎండీ డాక్టర్ శార్విల్ పటేల్ తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 28 వేల మందికి ఈ టీకా వేశామన్నారు. వారిలో పెద్దలు, ఇతర ప్రాణాంతక వ్యాధులున్నవారితో పాటు 12 నుంచి 17 ఏళ్ల వయస్సున్న పిల్లలు ఉన్నారన్నారు. టీకా సామరŠాధ్యనికి సంబంధించిన పూర్తి సమాచారం రాగానే అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తామని, అనుమతి రాగానే ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు. -
కోవాగ్జిన్... రాష్ట్రాలకు రూ.600
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ తమ కోవిడ్–19 వ్యాక్సిన్.. ‘కోవాగ్జిన్’ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600 డోసు చొప్పున సరఫరా చేస్తామని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1,200లకు డోసు చొప్పున అందజేస్తామని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట అనుమతించిన విషయం తెలిసిందే. ఉత్పత్తిదారులు 50 శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి... మిగతా 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవడానికి వీలుకల్పించింది. అయితే మే 1లోగా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు తమ ధరలను బహిరంగంగా ప్రకటించాలని కోరింది. ప్రస్తుతం దేశంలో రెండు సంస్థల వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అస్ట్రాజెనెకా– ఆక్స్‌ఫర్డ్‌లు అభివృద్ధి చేసిన టీకాను పుణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తోంది. కోవిషీల్డ్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400లకు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లకు అందజేస్తామని సీరమ్ ఇదివరకే ప్రకటించింది. కేంద్రానికి రూ.150కే డోసును సరఫరా చేస్తూ... రాష్ట్రాలకు, ప్రైవేటుకు అధికధరలను నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు స్వేచ్ఛనిచ్చి జనంపై భారం మోపుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు కోవాగ్జిన్ అంతకంటే చాలా ఎక్కువగా ధరలు నిర్ణయించడం గమనార్హం. సీరమ్‌తో పోలిస్తే రాష్ట్రాలకు ప్రతిడోసుకు రూ.200 అధికంగా వసూలు చేయనుంది. ప్రైవేటుకైతే ఏకంగా రెండింతలు ధరను నిర్ణయించింది. ముందస్తు ఒప్పందంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకట్లాగే తాము ఉత్పత్తి చేసేవాటిలో 50 శాతం టీకాలను రూ.150కి డోసు చొప్పున సరఫరా కొనసాగిస్తామని కృష్ణా ఎల్లా చెప్పారు. అయితే బహిరంగ మార్కెట్లో ఈ నష్టాన్ని పూడ్చుకోవడం అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తు ఆవిష్కరణలకు పెట్టుబడుల సమీకరణకు ఇది తప్పదని, కోవిడ్–19కు ముక్కుద్వారా వేసే టీకా, చికున్‌గున్యా, జికా వైరస్‌లకు టీకాలను అభివృద్ధి చేయడానికి నిధుల ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. -
ఈకాలంలోనూ రాజకీయమా.. చచ: కేటీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘ఒకే దేశం.. ఒకే పన్ను’ (జీఎస్టీ) విధానానికి మేము అంగీకరించాం. కానీ ఇప్పుడు మాత్రం ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు వేర్వేరు ధరలు ఎందుకు? అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ ద్వారా గురువారం వ్యాక్సిన్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికేమో వాక్సిన్ రూ.150, రాష్ట్రాలకు మాత్రం రూ.400 ఎందుకని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ‘పీఎం కేర్స్’ నుంచి అదనపు ధరను కేంద్ర ప్రభుత్వం ఎందుకు భరించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన ద్వంద్వ వాక్సిన్ ధరల విధానంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తుండగా, కేటీఆర్ కూడా గురువారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గత ఏడాది విధించిన లాక్డౌన్ మూలంగా ఆర్థికంగా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సందర్భంలో రాష్ట్రాలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై మరింత భారాన్ని మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సబ్కా సాథ్ సబ్కో వాక్సిన్’ హ్యాష్‌టాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో ద్వంద్వ వాక్సిన్ ధరలపై వెల్లువెత్తుతున్న నిరసనకు కేటీఆర్ మద్దతు పలికారు. మున్సిపల్ సిబ్బందికి వాక్సినేషన్‌పై హర్షం పురపాలక శాఖ పరిధిలోని ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వాక్సినేషన్ జరుగుతున్న తీరుపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 141 మున్సిపాలిటీల్లో 95.55 శాతం మందికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 96.19 శాతం మంది సిబ్బందికి వాక్సినేషన్ పూర్తయిందని కేటీఆర్ వెల్లడించారు. చదవండి: లక్షల్లో అడిగితే వేలల్లో ఇస్తారా? కేంద్రంపై ఈటల ఫైర్ చదవండి: కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం We agreed for One Nation - One Tax (GST) But now we see, One Nation - Two different Vaccine prices !? For Govt of India @ Rs 150 And State Govts @ Rs 400 Can’t the GoI subsume any additional cost from PM CARES & help rapid vaccination across India?#SabkaSaathSabkoVaccine — KTR (@KTRTRS) April 22, 2021 -
వారంలో కరోనా టీకా ఎగుమతులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్లు భారత్ నుంచి వారం రోజుల్లో ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సార్స్–సీవోవీ–2 వైరస్ పరిశోధనలను వేగవంతం చేయడం నుంచి అందరికీ టీకా అందేలా చేసేందుకు ‘కోవాక్స్’ పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా అన్ని దేశాలకు టీకా సరఫరా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బయో ఆసియా–2021 సదస్సులో భాగంగా సోమవారం ‘ప్రపంచానికి టీకా వేయించడం.. భారత్ ప్రస్తుత స్థితి, భవిష్యత్ సమర్థత’ అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. కోవాక్స్ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక వనరుల అవసరం ఉందని ఈ ఏడాది సుమారు 300 కోట్ల డాలర్ల నిధులు అవసరమని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. పెద్ద ఎత్తున టీకా తయారీకి ప్రత్యేక కేంద్రాలు అవసరమవుతాయని, కోవాక్స్‌లో భాగమైన 199 దేశాలు కూడా తమవంతు పాత్ర పోషిస్తేనే తారతమ్యాలు, వివక్ష వంటివి లేకుండా అందరినీ టీకా ద్వారా కోవిడ్ నుంచి రక్షణ కల్పించొచ్చని వివరించారు. కోవాక్స్ ప్రయత్నాల ఫలితంగా ఇంకో వారంలోనే భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి పెద్ద ఎత్తున టీకాలు 25–30 దేశాలకు ఎగుమతి అవుతాయని తెలిపారు. రకరకాల టీకాల తయారీ, నిల్వ, నిర్వహణ అంశాల్లో భారతీయ కంపెనీలు ఎంతో కృషి చేశాయని చెప్పారు. రూపాంతరిత వైరస్‌లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటిని సకాలంలో గుర్తించి జన్యుక్రమాలను నమోదు చేయడం ద్వారా నియంత్రించొచ్చని వివరించారు. ఎవరూ సురక్షితం కాదు.. తగిన టీకా వేయించుకోనంత వరకు ప్రపంచంలో ఎవరూ సురక్షితంగా ఉన్నామనుకోవద్దని యూనిసెఫ్ ప్రధాన సలహాదారు రాబిన్ నంది స్పష్టం చేశారు. గతంలో కొత్త టీకాలు పేద దేశాలకు చేరేందుకు చాలా ఏళ్లు పట్టేదని, అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు కోవాక్స్ ఉపయోపడుతుందని చెప్పారు. 2021 నాటికి కనీసం 200 కోట్ల కోవిడ్–19 వ్యాక్సిన్లను పంపిణీ చేయాలన్నది యునిసెఫ్ లక్ష్యమని వివరించారు. కోవాగ్జిన్ సామర్థ్యానికి సంబంధించిన వివరాలను సకాలంలో అందివ్వలేకపోయామని భారత్ బయోటెక్ చైర్మన్ అండ్ ఎండీ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. ముక్కు ద్వారా పిచికారీ చేసే టీకా తొలి దశ ప్రయోగాలు ఈ వారం మొదలు అవుతాయని చెప్పారు. కోవాక్స్‌లో భాగస్వాములయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏటా 4 కోట్ల టీకాలు తయారు చేసే సామర్థ్యం తమ వద్ద ఉందన్నారు. -
బ్రెజిల్ అధ్యక్షుడి వినూత్న అభినందన
జెనీవా: కరోనా వైరస్‌తో అతలాకుతలమైన బ్రెజిల్‌కు భారత్ 20 లక్షల డోసుల్ని పంపడంపై బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోదీని వినూత్నంగా అభినందించారు. కరోనా వ్యాక్సిన్‌ను హనుమంతుడు మోసుకొచ్చిన సంజీవిని పర్వతంతో పోల్చారు. ‘నమస్కార్ ప్రధాని మోదీ, ప్రపంచాన్ని పీడిస్తున్న ఒక మహమ్మారిని జయించడంలో ఒక అద్భుతమైన భాగస్వామిని పొందడం గౌరవంగా భావిస్తున్నాం. టీకా డోసుల్ని మాకు పంపించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ సందేశంతో పాటు సంజీవిని పర్వతం స్థానంలో వ్యాక్సిన్ పర్వతాన్ని హనుమంతుడు మోసుకొస్తున్నట్టుగా ఒక చిత్రాన్ని ట్వీట్ చేశారు. భారత్ వ్యాక్సిన్ మైత్రి భేష్: డబ్ల్యూహెచ్ఓ ఇరుగు పొరుగు దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఉద్దేశించిన వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసల జల్లు కురిపించింది. భారత్ మాదిరిగా ప్రపంచదేశాలు ఒకరికొకరు సహకరించుకుంటే త్వరలోనే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ అంశంలో నైబర్ ఫస్ట్ విధానాన్ని అవలంబిస్తున్న ప్రధాని మోదీని అభినందించారు. ‘‘కోవిడ్–19పై మీరు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. ప్రపంచ దేశాలు ఒకరికొకరు అన్నీ పంచుకుంటూ ఉంటేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడుతుంది. ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం’ అని టెడ్రోస్ ట్వీట్ చేశారు. బోల్సనారో ట్వీట్ చేసిన చిత్రం -
తెలంగాణలో జోరుగా కరోనా టీకా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకా కార్యక్రమం ఊపందుకుంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 51,997 మందికి టీకాలు వేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు వ్యాక్సినేషన్ బులెటిన్‌ను ఆయన విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీ తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండోరోజు 18వ తేదీన 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. మూడోరోజు మంగళవారం 894 కేంద్రాలకు విస్తరించారు. ఈ మూడు రోజుల్లో 69,625 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. తాజాగా 51 మందికి రియాక్షన్లు వచ్చాయని, అందులో ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించగా.. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సెలవని, తిరిగి ఈ నెల 21వ తేదీన వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు. టీకా కార్యక్రమం సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే నిర్వహిస్తారు. బుధ, శని, ఆదివారాలు, ఇతరత్ర సెలవు దినాల్లో టీకా వేయడం లేదు. బుధ, శనివారాల్లో చిన్న పిల్లలు, గర్భిణులకు రెగ్యులర్ సార్వత్రిక టీకాలు వేస్తారు. జిల్లాలకు కోవిషీల్డ్ .. మంగళవారం ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన మరో 3,48,500 కోవిషీల్డ్ టీకాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. పుణే నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన టీకాలను కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ సెంటర్‌కు తరలించారు. రెండో దశ పంపిణీ కోసం వాటిని జిల్లాలకు పంపించనున్నారు. మొదటి విడతలో 80 లక్షల మందికి ఉచితం మొదటి విడతలో రాష్ట్రంలోని 80 లక్షల మందికి ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదటి విడత లబ్ధిదారులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 50 ఏళ్లు దాటిన వారు, 18–50 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముగిసిన తర్వాత మిగతా రెండు కేటగిరీలకు టీకాలు ఇస్తారు. మార్చి నుంచి 50 ఏళ్లు దాటిన వారికి, 18–50 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకాలు వేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. -
కోవాగ్జిన్ వద్దు.. కోవిషీల్డ్ కావాలి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకా మాత్రమే తమకు ఇవ్వాలని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంఎల్) ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్డీఏ) మెడికల్ సూపరింటెండెంట్‌ను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ పట్ల తమ వైద్యుల్లో కొన్ని సందేహాలు, స్వల్పంగా భయాందోళనలు ఉన్నాయని పేర్కొంది. ఆర్ఎంఎల్లో కోవిషీల్డ్ కాకుండా కోవాగ్జిన్ మాత్రమే ఇవ్వనున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపింది. కోవాగ్జిన్ విషయంలో అన్ని ట్రయల్స్ పూర్తి కాలేదని వెల్లడించింది. కోవిషీల్డ్ విషయంలో అన్ని స్థాయిల్లో ట్రయల్స్ పూర్తయ్యాయని గుర్తుచేసింది. కోవాగ్జిన్‌తో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్టపరిహారం కరోనా టీకా తీసుకునేందుకు వచ్చిన వారితో అంగీకార పత్రంపై సంతకం చేయించుకుంటున్నారు. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో వారం రోజుల్లోగా తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు పత్రంలో స్పష్టం చేశారు. ఇలాంటి వారిని ఆసుపత్రుల్లో చేర్చి, చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వల్లనే దుష్భ్రభావాలు తలెత్తినట్లు తేలితే దాని తయారీదారు భారత్ బయోటెక్ నష్టపరిహారం చెల్లిస్తుందని వెల్లడించారు. -
వ్యాక్సిన్ కేంద్రాలు @ 1,213
సాక్షి, హైదరాబాద్: ‘ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ను అన్ని పీహెచ్‌సీల పరిధిలో ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే చేసింది. 1,213 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. వ్యాక్సిన్‌ను తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేశాం. వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది. జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సోమవారం ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ 2 సందర్భాల్లో సీఎం వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. రెండు వ్యాక్సిన్లు: ‘సీరం రూపొందించిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్‌ను సమర్థవంతమైన వ్యాక్సిన్లుగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్లనే రాష్ట్రంలో అందించాలని నిర్ణయించాం. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి అనంతరం కోవిడ్ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా బలగాలు, పారిశుధ్య సిబ్బంది తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తాం. ప్రాధాన్యత క్రమంలో నిర్ణయించిన వారిని వ్యాక్సినేషన్ సెంటర్‌కు తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలి’అని సీఎం వెల్లడించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు భాగస్వాములు కావాలి అని కోరారు. తక్షణమే వైద్యం..: ‘వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే వారికి వెంటనే వైద్య చికిత్స అందించడానికి వీలుగా వ్యాక్సిన్ సెంటర్‌కు అనుబంధంగా ఒక గదిని, వైద్యులను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది’అని కేసీఆర్ వివరించారు. -
టీకాపై ఎటూ తేల్చుకోలేక..
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంపై ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నవారు 69 శాతం మంది ఉన్నారని లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో తేలింది. ఆన్లైన్ మాధ్యమం ద్వారా మీరు టీకా తీసుకుంటారా? అని 8,723 మందిని ప్రశ్నించగా 26 శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగానే తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ సంస్థ ప్రజల్లో టీకా ఆమోదంపై సర్వే చేçస్తూ ఫలితాల్ని ఆన్లైన్లో ఉంచుతోంది. రోజులు గడుస్తున్నప్పటికీ టీకాపై ఎటూ తేల్చుకోలేని వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్టోబర్‌లో 61 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోవడం గురించి ఇంకా ఆలోచిస్తున్నామని చెబితే నవంబర్ నాటికి వారి సంఖ్య 59 శాతానికి తగ్గింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) టీకాలకి పచ్చజెండా ఊపాక టీకాపై సందేహాలు వ్యక్తం చేసే వారి సంఖ్య కూడా పెరిగిందని ఆ సర్వే వెల్లడించింది. ఇక పిల్లలకి టీకా ఇవ్వడానికి 26% తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. వ్యాక్సిన్ సామర్థ్యంపై నెలకొన్న అనుమానాలు, హడావుడిగా అనుమతులివ్వడం, దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఆందోళన నెలకొని 69 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోతున్నారని లోకల్‌సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, మరణాల రేటు చాలా తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్న వారు కూడా ఉన్నారు. -
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చేసింది
న్యూఢిల్లీ : కొత్త ఏడాది వస్తూ వస్తూ శుభవార్తని మోసుకొచ్చింది. కరోనాని కట్టడి చేయడానికి మనకూ ఓ వ్యాక్సిన్ వచ్చేసింది. కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ (సీడీఎస్సీఓ) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడానికి శుక్రవారం సిఫారసు చేసింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దీనికి ఇంకా తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. నేడు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్‌కి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (సీఎస్‌వో) వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులివ్వడానికి సిఫారసు చేసినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. 18 ఏళ్లు దాటిన వారికి 4– 6 వారాల మధ్యలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇచ్చేలా సూచించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆరో తేదీ నుంచి వ్యాక్సినేషన్ ..? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పుణేకి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. శుక్రవారం జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ ప్రతినిధులూ పాల్గొన్నారు. తమ వ్యాక్సిన్ల సంపూర్ణ సమాచారాన్ని అందించారు. అన్నింటినీ సమీక్షించిన అనంతరం నిపుణుల కమిటీ మాత్రం తొలుత ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వినియోగానికే సిఫారసు చేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్‌లో అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మార్గం సుగమం అయింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం జనవరి 6 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ టీకాకు బ్రిటన్, అర్జెంటీనా తర్వాత అనుమతులు ఇచ్చిన మూడో దేశంగా భారత్ నిలుస్తోంది. రష్యా, బ్రిటన్, అమెరికా, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, మధ్యప్రాచ్య దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ మొదలైంది. ఫైజర్ వ్యాక్సిన్‌కి డబ్ల్యూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్ జెనీవా: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మొదటి సారిగా ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌తో పాటు డజనుకు పైగా దేశాలు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే డబ్ల్యూహెచ్ఒ అనుమతులు ఇవ్వడంతో నిరుపేద దేశాలకు కూడా ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. సాధారణంగా ఏ దేశానికి ఆ దేశమే వ్యాక్సిన్ వినియోగంపై నిర్ణయం తీసుకుంటాయి. కానీ వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాలు మాత్రం డబ్ల్యూహెచ్‌వో అనుమతించాక మాత్రమే టీకా పంపిణీ చేపడతాయి. డబ్ల్యూహెచ్‌వో గురువారం ఫైజర్ అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ అన్ని దేశాలు వారి పరిధిలో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులివ్వడం, టీకా డోసుల దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పింది. ఫైజర్ టీకా నాణ్యత, భద్రత అంశంలో ప్రమాణాలకు లోబడి ఉందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉండడంతో అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలు ఈ వ్యాక్సిన్‌ను ఎంతవరకు వినియోగిస్తారన్నది సందేహమే. ఈ విషయాన్ని అంగీకరించిన డబ్ల్యూహెచ్ఒ ఫైజర్ వ్యాక్సిన్ వినియోగంలో ఎదురయ్యే సవాళ్లను ఇతర దేశాలు ఎంతవరకు ఎదుర్కోగలవో చెప్పాలని పేర్కొంది. నేడు అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్.. కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ 2న అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్ చేపడుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చెక్‌లిస్టులు, ఎస్ఓపీలను పూర్తిగా పరిశీలించిన అనంతరమే వ్యాక్సినేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. 20 వేల కొత్త కరోనా కేసులు.. దేశంలో గత 24 గంటల్లో 20,035 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,86,709కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 256 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,48,994 కు చేరుకుందని తెలిపింది. యూకేకు చెందిన కొత్త కరోనా స్ట్రెయిన్ మరో నలుగురికి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో కొత్త స్ట్రెయిన్ కలిగిన మొత్తం వ్యక్తుల సంఖ్య 29కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 98,83,461కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.08 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,54,254గా ఉంది. ► ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో 30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ► మొదటి టీకా డోసు ఇచ్చిన నాలుగు నుంచి పన్నెండు వారాల్లోగా రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ► ధర విషయంలోనూ ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంది. ఒక్కో డోసు ధర 3 అమెరికా డాలర్లుగా నిర్ణయిం చారు. రెండు డోసులకి 6 డాలర్లు అంటే రూ. 440 అవుతుంది. అయితే ప్రైవేటు మార్కెట్లో రెండు డోసులకి రూ.700–800 వరకు వెచ్చించాల్సి ఉంటుందని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా చెప్పారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే 5 కోట్ల టీకా డోసుల్ని సిద్ధంగా ఉంచింది. వాటినన్నింటినీ భారత్‌లోనే వినియోగించనున్నారు. మార్చి నాటికల్లా 10 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయనుంది. ► ఈ నెల 6 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ శనివారం నుంచే టీకా డోసుల పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. ► టీకా సామర్థ్యం అంశంలో ఫైజర్ మోడెర్నా కంటే కోవిషీల్డ్ వెనుకబడి ఉంది. ఫైజర్ టీకా 95% సామర్థ్యంతో పని చేస్తే ఈ వ్యాక్సిన్ 70.4% సామర్థ్యంతో పని చేస్తోంది. -
వ్యాక్సిన్‌పై వాస్తవాలేంటి?
ఇంకొన్ని రోజుల్లో భారత్‌లో కోవిడ్ టీకాలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్య సిబ్బందితో మొదలుపెట్టి వృద్ధులు.. ఆరోగ్య సమస్యలున్న వారు అన్న క్రమంలో... వరుసగా టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి! మరి గడ్డుకాలమిక తొలగిపోయినట్లేనా? ఇక అంతా మంచేనా? ఊహూ.. కానేకాదు! టీకా తీసుకున్నా మరికొంత కాలం జాగ్రత్తలు కొనసాగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ అంశంతోపాటు టీకాలకు సంబంధించిన ఇతర సందేహాలకు సమాధానాలివిగో.. వ్యాక్సిన్లలో రకాలేమిటి? హా ఫైజర్, మోడెర్నా సంస్థలు మెసెంజర్ ఆర్ఎన్ఏతో(ప్రొటీన్ తయారీకి పనికొచ్చే డీఎన్ఏ పోగు)టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. హా భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ టీకాలో వాడే వైరస్లు రోగ నిరోధక కణాలు గుర్తించే యాంటిజెన్లను సిద్ధం చేస్తాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ను చింపాంజీకి చెందిన అడినోవైరస్‌ను వాహకంగా వాడుతున్నారు. హా భారత్ బయోటెక్ (హైదరాబాద్), గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (రష్యా) నిర్వీర్యం చేసిన వైరస్ ఆధారంగా టీకాను తయారు చేస్తున్నాయి. ఈ వైరస్లు వ్యాధిని కలిగించవు కానీ.. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. ఏ వ్యాక్సిన్ సామర్థ్యం ఎంత? కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవిడ్–19 లక్షణాలు కనబరిచే వారిలో 70.4 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న వారిలో 100 శాతం పనిచేస్తుందని అంచనా. ఫైజర్ టీకా సామర్థ్యం 95 శాతం కాగా, రష్యా టీకా స్పుత్నిక్–వీ 92 శాతం సామర్థ్యాన్ని కనబరిచింది. టీకాలు ఎవరెవరికి ఇవ్వవచ్చు? పైన పేర్కొన్న టీకాలను 18 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఇవ్వవచ్చు. ఇందుకు తగ్గట్టుగా ప్రయోగాలు జరిగాయి. ప్రస్తుతం 12–18 ఏళ్ల వారిపై ఈ టీకాలు ఎలా పనిచేస్తాయన్నది పరీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్నాయా? కోవిషీల్డ్ టీకా అత్యవసర వాడకంపై అనుమతికి సీరమ్ ఇన్స్టిట్యూట్ దరఖాస్తు చేసుకుంది. భారత్ బయోటెక్, స్పుత్నిక్–వీ మూడో దశ ప్రయోగాలను పూర్తి చేయాల్సి ఉంది. ఫైజర్ వ్యాక్సిన్ ప్రైవేట్ రంగంలో అందుబాటులోకి రావచ్చు. 18 ఏళ్ల లోపువయసున్న వారికి ఏ టీకా అందుబాటులో లేదు. వ్యాధి సోకి నయమైన వారికి టీకా అవసరమా? కోవిడ్ బారిన పడి సహజసిద్ధంగా కోలుకున్న వారికి దీర్ఘకాలంలో వ్యాధి నుంచి రక్షణ ఉంటుందా? అన్నది ఇప్పటికీ అస్పష్టం. కాలక్రమంలో శరీరంలో యాంటీబాడీలు బలహీన పడే అవకాశాలు ఎక్కువైనప్పటికీ వ్యాధి నుంచి రక్షణ తగ్గిపోతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అందుకే కోవిడ్ నుంచి బయటపడిన వారికి ఆఖరులో టీకా ఇవ్వాలని యోచిస్తున్నారు. ఒక్కో డోస్ ఎంత? ఎన్ని డోసులు? కోవిషీల్డ్ టీకా ఒక డోసుకు 0.5 మిల్లీలీటర్ ఉంటుంది. 28 రోజుల వ్యవధిలో 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్–వీ టీకాలను 21 రోజుల వ్యవధిలో 2 డోసులు ఇస్తారు. రెండు వారాల సమయంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎంఆర్ఎన్ఏ టీకా మాత్రం తొలి డోసు తీసుకున్న 10 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలిసింది. రెండు డోసుల స్థానంలో ఒకటే తీసుకున్నా ఓమోస్తరు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండు డోసులతో రక్షణ ఎంత కాలం? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం వ్యాధి నుంచి రక్షణ లభించింది. యాంటీబాడీలు బలహీన పడినా వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని అంచనా. బూస్టర్ టీకా అవసరం రాకపోవచ్చనే అనుకుంటున్నారు. టీకా తీసుకున్న వారిలో నొప్పి, జ్వరం వంటి కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. టీకా వేసుకున్నాక మామూలుగా తిరిగేయవచ్చా? ఏ వ్యాక్సిన్ అయినా 100 శాతం రక్షణ కల్పించదు. టీకా తీసుకున్న వారు మళ్లీ వ్యాధి బారిన పడకపోవచ్చుగానీ.. ఇతరులకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. అందుకే టీకా వేసుకున్న తరువాత కూడా మాస్కు ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్ -
ఫైజర్ టీకా ఖరీదెక్కువే..
ముంబై: కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విషయంలో అమెరికాలోని ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్, జర్మనీలోని బయోఎన్‌టెక్ సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కరోనా టీకాను అభివృద్ధి చేశాయి. తమ టీకా 95 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు పరీక్షల్లో తేలిందని ఆయా సంస్థలు ప్రకటించాయి. కొన్ని దేశాలు కరోనా బాధితులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ఇప్పటికే మొదలుపెట్టాయి. మరోవైపు భారత్‌లోనూ కోవిడ్–19 ఇమ్యూనైజేషన్ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అదిపెద్ద టీకా కార్యక్రమం కానుంది. అయితే, ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ఇండియాలోని కరోనా బాధితులకు దక్కే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ అధిక ధరే ఇందుకు ప్రధాన కారణం. ఎందుకంత అధిక వ్యయం? ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ వ్యయం అధికంగా ఉండడానికి కారణం. దాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలకు విపరీతంగా పెట్టుబడి పెట్టాల్సి రావడం. ఇతర టీకాల మాదిరిగా కాకుండా ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. 68 కోట్ల కరోనా టీకాల డోసులను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ.13,870 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయానికి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఒక్కో డోసుకు రూ.220 వ్యయం కానుంది. కాబట్టి ప్రభుత్వం ఒక్కో డోసుకు రూ.2,725 చొప్పున వెచ్చింది, ఫైజర్ టీకాను కొనుగోలు చేసి, ప్రజలకు అందించడం అసాధ్యమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలోని ప్రజలందరికీ కరోనా టీకా ఇవ్వాలంటే రూ.43,800 కోట్లు(ఒక్కో డోసు రూ.220 చొప్పున) అవసరం. ఈ మేరకు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడితేనే ప్రజలందరికీ టీకా ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. కేవలం ప్రభుత్వం ద్వారానే తమ వ్యాక్సిన్ విక్రయిస్తామని ఫైజర్ సంస్థ చెబుతోంది. అత్యవసర వినియోగ అనుమతి కోసం భారత ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసింది. ఇండియాలో ఇప్పటికిప్పుడు ఫైజర్ టీకాను ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాలన్నా కుదరదు. కాగా, ఫైజర్–బయోఎన్టెక్లు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు సింగపూర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల చివరికల్లా వ్యాక్సిన్ డోసులు తమ దేశానికి చేరతాయని ఆ దేశ ప్రధాని లీ హెయిన్ లూంగ్ సోమవారం ప్రకటించారు. కోవిషీల్డ్ చాలా చౌక ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.2,725 (37 డాలర్లు) పలుకుతోంది. అక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవిషీల్డ్’ ఒక్కో డోసు ధర కేవలం రూ.221 (3 డాలర్లు). ఇక రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–5 వ్యాక్సిన్ ధర కూడా తక్కువే. అది ఒక్కో డోసు రూ.736కు (10 డాలర్లు) లభ్యమవుతోంది. హైదరాబాద్‌లోని భారత్ బయో టెక్ సంస్థ భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.220 నుంచి రూ.440(3–6 డాలర్లు) ధరకు లభించే అవకాశం ఉంది. జైడస్ కాడిలా సంస్థ టీకా ధర కూడా ఇదే రేంజ్లో ఉండనుంది. భారత్‌లో తగ్గిన కేసులు న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 27,071 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ నెలలో మూడో సారి ఒక రోజులో 30 వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,52,586గా ఉంది. మరోవైపు మొత్తం కేసుల సంఖ్య 98,84,100కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 336 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,43,355కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య సోమవారానికి 93,88,159కు చేరుకుంది. వ్యాక్సిన్ ధర(రూ.లో) ఫైజర్ 2,725 స్పుత్నిక్ వీ 736 ఆస్ట్రాజెనెకా 221 భారత్ బయోటెక్ 220–440 జైడస్ కాడిలా 220–440 -
టీకా పంపిణీలో ఎన్నికల యంత్రాంగం!
న్యూఢిల్లీ: దేశంలో కరోనాతో తీవ్రంగా ప్రభావితమయ్యేవారికి 60కోట్ల డోసుల వాక్సిన్ను అందించేందుకు ఎన్నికల యంత్రాంగాన్ని వినియోగించనున్నట్లు నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. అతి త్వరలో టీకాలకు అనుమతి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. వచ్చే 6–8 నెలల్లో సాంప్రదాయ కోల్డ్ చైన్ వ్యవస్థ ద్వారా వ్యాక్సిన్ సరఫరా జరుగుతుందని, ఇందుకోసం ఎన్నికల యంత్రాంగ సాయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలను 2–8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మెయిన్‌టెయిన్ చేస్తూ తయారుగా ఉందని చెప్పారు. భారత్‌లో వినియోగానికి త్వరలో రానున్న నాలుగు కంపెనీల వ్యాక్సిన్ల(సీరమ్, భారత్, జైడస్, స్పుత్నిక్)కు ఈ ఏర్పాట్లు సరిపోవచ్చన్నారు. త్వరలో ఏదో ఒక వ్యాక్సిన్‌కు నియంత్రణా సంస్థ నుంచి అత్యవసర వాడుకకు అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అయితే టీకా ధరపై ఇంకా ప్రభుత్వం చర్చించాల్సిఉందని, అలాగే కొనుగోలు ఆర్డర్లు ఇవ్వాల్సిఉందని చెప్పారు. టీకాలను తొందరగా ఆమోదించాలని నియంత్రణా సంస్థలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేదని స్పష్టం చేశారు. ఫస్ట్ ఫేజ్‌లో 30 కోట్ల మందికి దాదాపు 60 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరపడతాయి. ఈ 30 కోట్ల మంది ప్రజల్లో 50 ఏళ్లు దాటిన వారు దాదాపు 26 కోట్ల మంది ఉండొచ్చని, 3 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లుంటారని, కోటి మంది సీరియస్ కండీషన్ ఉన్నవాళ్లుంటారని పాల్ చెప్పారు. -
అర్హుల నమోదుకు‘కోవిడ్’ యాప్!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ కు అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి తెలంగాణ ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది వారం, పది రోజుల్లో అందుబాటులోకి రానుంది. దీన్ని కోవిడ్ యాప్‌గా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే నెల రెండో వారం నుం చి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ వేసేం దుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పటివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్రం తేల్చిచెప్పడంతో వైద్య, ఆరోగ్యశాఖ యుద్ధ ప్రా తిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు గత రెండ్రోజులుగా ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు యాప్‌నకు సం బంధించి సన్నాహాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొ దటి విడత దాదా పు 70 లక్షల నుంచి 75 లక్షల మందికి టీకాలు వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు మొత్తం కలిపి 3 లక్షల మంది వివరాలను ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ సేకరించి వివరాలను కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. ఇక మున్సిపల్ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్ల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. వీరే కాకుండా 50 ఏళ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారెవరైనా కరోనా వ్యాక్సిన్ పొందడానికి అర్హులే అయినందున ప్రభుత్వం రూపొందించే ప్రత్యేక యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నాక అర్హుల జాబితాను అధికారులు తయారు చేస్తారు. దాని ప్రకారం వ్యాక్సిన్‌ను అందజేస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో దాదాపు 75 లక్షల మందికి మొదటి విడత టీకాలు ఇచ్చే అవకాశమున్నందున ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 3 కోట్ల టీకాలను నిల్వ చేసే సామర్థ్యమున్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌పై వర్క్‌షాప్.. వ్యాక్సిన్‌పై వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బుధవారం వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ప్రారంభమైంది. అది గురువారం కూడా కొనసాగనుంది. -
కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు
న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ భారత్‌లో వినియోగానికి అత్యవసర అనుమతుల్ని మంజూరు చేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ని కోరింది. ఇప్పటికే యూకే, బహ్రెయిన్‌లో ఫైజర్ అనుమతులు పొందింది. కరోనా టీకా వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న మొదటి సంస్థ ఇదే కావడం విశేషం. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగం కోసం శుక్రవారం ఫైజర్ దరఖాస్తు చేసుకుందని డీసీజీఐ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ టీకా అత్యవసర వినియో గానికి అనుమతులు ఇవ్వాలని సీరం ఇన్స్టి ట్యూట్ కూడా ఆదివారం కేంద్రాన్ని కోరింది. నిబంధనల ప్రకారం ఔషధ వినియోగానికి అనుమతులు కోరితే 90 రోజుల్లో బదులివ్వాల్సి ఉంది. యూకే, బహ్రెయిన్లలో ఫైజర్ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇస్తే డీసీజీఐ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ప్రయోజనం ఎంత ? భారత్‌లో ఈ వ్యాక్సిన్ వినియోగం ఎంతవరకు ఉపయోగం అన్న దానిపై అనుమానాలున్నాయి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరచాలి. సాధారణంగా భారత్‌లో వ్యాక్సిన్లన్నీ రెండు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనే ఉంచుతారు. మన దగ్గర ఈ వ్యాక్సిన్‌ను భద్రపరిచే కోల్డ్ స్టోరేజీలు దొరకడం దుర్లభం. అందుకే భారత్ మొదట్నుంచి ఫైజర్‌తో ఎలాంటి ఒప్పందాలు కానీ వ్యాక్సిన్ ప్రయోగాలు కానీ చేపట్టలేదని అధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ 95% సామర్థ్యంతో పని చేస్తుందని తేలినప్పటికీ ఈ సంస్థల మాతృదేశాలైన అమెరికా, జర్మనీలు ఇంకా అనుమతులివ్వలేదు. జనవరి నుంచి నెలకి 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తామని ఫైజర్ సంస్థ చెప్పింది. దీంతో భారత్ అవసరాలకు సరిపడా డోసులు ఉత్పత్తి, పంపిణీ చేయడం ఫైజర్ ఇప్పట్లో చేయడం కష్టమేనని కరోనాపై జాతీయ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. -
నేడు మూడు నగరాలకు మోదీ
అహ్మదాబాద్/పుణె/సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను భయపెడుతున్న వేళ అందరూ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వివిధ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకోవడంతో తాజా పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకే రోజు పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సందర్శించనున్నారు. ప్రధాని స్వయంగా శనివారం ఈ మూడు నగరాలకు వెళ్లి కరోనా వ్యాక్సిన్ పురోగతిని సమీక్షిస్తారని పీఎంఓ కార్యాలయం వెల్లడించింది. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియను సమీక్షిస్తారు. శనివారం ఆయన అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్‌ని, హైదరాబాద్‌లో భారత్ బయోటెక్, పుణెలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శిస్తారు’’ అని ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్లో పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు దాదాపుగా పూర్తి కావస్తూ ఉండడంతో శాస్త్రవేత్తలతో స్వయంగా ప్రధాని మోదీ మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకోనున్నారు. దీని వల్ల భారత్‌లో వంద కోట్లకు పైగా జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అవసరమయ్యే మార్గదర్శకాల రూపకల్పన చేసుకోవచ్చునని పీఎంఓ తెలిపింది. మొదట అహ్మదాబాద్‌కు.. శనివారం ఉదయం తొలుత గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా ప్లాంట్‌ను మోదీ సందర్శించనున్నారు. అహ్మదాబాద్‌కి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లాంట్‌కి మోదీ 9.30కి చేరుకుంటారని గుజరాత్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. జైడస్ తయారు చేస్తున్న జికోవ్–డి వ్యాక్సిన్ ప్రస్తుతం రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో హకింపేటలోని సైనిక విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారత్ బయో టెక్ కు వెళ్లి అక్కడ వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తారు. భారత్ స్వదేశీయంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉంది. దీని గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రధాని అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరానికి వస్తుండడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ పర్యటన అనంతరం సాయంత్రం 4.30 గంటలకు పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి వెళతారు. ఆస్ట్రాజెనికా–ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ ఇక్కడ తయారవుతోంది. సాయంత్రం ప్రధాని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. కలిసి పనిచేద్దాం.. సవాళ్లను ఎదుర్కొందాం కరోనా మహమ్మారిపై పోరాటంతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణ మార్పులు, రక్షణ వంటి కీలక అంశాల్లో పరస్పరం సహకరించుకుందామని భారత్, బ్రిటన్ ప్రధానులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్ నిర్ణయించుకున్నారు. కలిసి పని చేస్తూ ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొందామని తీర్మానించుకున్నారు. మోదీ శుక్రవారం జాన్సన్‌తో మాట్లాడారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య సహకారం పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వైరస్ విసురుతున్న సవాళ్లతోపాటు వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో సహకారంపై సమీక్షించారు. భాగస్వామ్యంపై రోడ్‌మ్యాప్ రూపకల్పన వేగవంతం చేయాలని నిర్ణయించారు. -
మార్చికల్లా జైడస్ క్యాడిలా వ్యాక్సిన్!
ముంబై, సాక్షి: అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే మార్చికల్లా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను విడుదల చేసే వీలున్నట్లు దేశీ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా ప్రతినిధులు తాజాగా పేర్కొన్నారు.సుమారు 1,000 మందిపై నిర్వహించిన రెండో దశ క్లినికల్ పరీక్షల డేటాను ఔషధ నియంత్రణ సంస్థలకు వచ్చే వారం దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలను డిసెంబర్లో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. మూడో దశలో భాగంగా 39,000 మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. రెండో దశ పరీక్షలలో ప్రాథమిక డేటా ప్రకారం ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని తెలియజేశారు. వ్యాక్సిన్ భద్రతకు సంబంధించి పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నట్లు వివరించారు. అన్ని పరీక్షలు విజయవంతమైతే 10 కోట్ల డోసేజీల తయారీని చేపట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు ఇటీవల జైడస్ క్యాడిలా చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ పేర్కొన్న విషయం విదితమే. ఒప్పందాలు.. వ్యాక్సిన్ టెక్నాలజీ కేంద్రంలో తయారీకి అనుగుణంగా జైడస్ క్యాడిలా తగిన సౌకర్యాలను సమకూర్చుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వ్యాక్సిన్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అవసరమైతే ఇతర కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఉన్న అవకాశాలను సైతం కంపెనీ పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. కంపెనీ జులైలో తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జైకోవ్-డీ పేరుతో ప్లాస్మిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు నేషనల్ బయోఫార్మా మిషన్, బీఐఆర్ఏసీతో జైడస్ క్యాడిలా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. తద్వారా దేశీయంగా వ్యాక్సిన్ తయారీకిఆ డీఎన్ఏ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోడీ పర్యటన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం దేశీయంగా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్లను రూపొందిస్తున్న కేంద్రాలను సందర్శించే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా పర్యటన ఖరారుకాలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా.. పర్యటనలో భాగంగా తొలుత అహ్మదాబాద్‌లోగల జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ప్రధాని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. జైకోవ్-డీ పేరుతో కోవిడ్-19 కట్టికి జైడస్ క్యాడిలా వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. ఇక బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ను సైతం ప్రధాని సందర్శించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ బాటలో కోవాగ్జిన్ పేరుతో వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ యూనిట్‌నూ ప్రధాని మోడీ పరిశీలించనున్నట్లు సంబంధితవర్గాలు అభిప్రాయపడ్డాయి. -
అస్ట్రాజెనెకా సురక్షితం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతున్న నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ సామర్థ్యంపైనే అందరి దృష్టి ఉంది. ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని, సమర్థవంతంగా పని చేస్తోందని సీరమ్ ఇన్‌నిస్టిట్యూట్ వెల్లడించింది. భారత్‌లో ప్రయోగాలు సజావుగా సాగుతున్నాయని గురువారం వెల్లడించింది. ‘‘అస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది. 60–70 శాతం సామర్థ్యమే కలిగి ఉన్నప్పటికీ ఈ టీకాపై పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంచవచ్చు’’అని తెలిపింది. సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి ప్రధాని ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు ఆశలు కల్పిస్తూ ఉండడంతో శనివారం ప్రధాని మోదీ పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించనున్నారు. అక్కడ శాస్త్రవేత్తలతో టీకా ప్రయోగాలపై, డోసుల ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ వంటివాటిపైన చర్చించే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో 100 దేశాల రాయబారులు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ని సందర్శించనున్నారు. డోసుల్లో పొరపాటు సామర్థ్యాన్ని పెంచింది అస్ట్రాజెనెకా ప్రయోగాల్లో డోసులు ఇవ్వడంలో పొరపాటు వల్ల వ్యాక్సిన్ పనితీరు అద్భుతంగా ఉన్నట్టు రుజువు కావడం అందరిలోనూ ఆశలు పెంచుతోంది. ఈ ప్రయోగాల్లో నెల రోజుల తేడాలో రెండు డోసులు ఇవ్వాలి. వైద్యులు పొరపాటుగా మొదటి డోసు పరిమాణాన్ని సగానికి తగ్గించి ఇచ్చారు. ఆ తర్వాత పొరపాటు తెలుసుకున్న వైద్యులు మరో బృందానికి పూర్తి డోసు ఇచ్చారు. అలా రెండు డోసులు పూర్తయ్యాక డోసున్నర తీసుకున్న వారిలో 90% సామర్థ్యం, రెండు డోసులు పూర్తిగా తీసుకున్న వారిలో 62% సామర్థ్యంతో టీకా పని చేసింది. దీంతో సగటున 70% సామర్థ్యాన్ని ఈ టీకా కలిగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. -
వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కొన్ని కంపెనీల క్లినికల్ ట్రయల్స్ ముగింపు దశకు చేరాయి. తమ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఫైజర్, మోడెర్నా వంటి దిగ్గజ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. వ్యాక్సిన్ రాగానే ఉపయో గించాలంటే ప్రభుత్వం అత్యవసర అనుమతి (ఎమర్జెన్సీ ఆథరైజేషన్) ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లకు ఇలాంటి అనుమతి ఇవ్వడానికి అందుబాటులో ఉన్న విధానాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ (వీటీఎఫ్) ఈ పనిలో నిమగ్నమై ఉంది. మోడెర్నా టీకా డోసు ధర ఎంతంటే.. ఫ్రాంక్ఫర్ట్: కరోనా టీకా అభివృద్ధిలో అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ముందంజలో ఉంది. త్వరలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని నమ్మకంగా చెబుతోంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టెఫానీ బాన్సెల్ మాట్లాడుతూ తమ వ్యాక్సిన్‌కుగాను ప్రభుత్వాల నుంచి ఒక్కో డోసుకు 25 డాలర్ల నుంచి 37 డాలర్లు(రూ.1,854–రూ.2,744) తీసుకుంటామని చెప్పారు. ఆర్డర్ చేసిన డోసులను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంద న్నారు. ఫ్లూ వ్యాక్సిన్ డోసు 10 డాలర్ల నుంచి 50 డాలర్ల దాకా పలుకుతోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారులు ఇప్పటికే మోడెర్నా సంస్థతో చర్చలు జరిపారు. వ్యాక్సిన్ డోసు 25 డాలర్ల లోపు ధరకే తమకు సరఫరా చేయాలని కోరారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. -
భారత్‌కు ప్రొటీన్ ఆధారిత టీకా ఉత్తమం
న్యూఢిల్లీ: భారత్‌లోని వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రొటీన్ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భద్రత, ధర, దిగుమతికి, నిల్వకు అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాను అధిక ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తేనే ప్రభావవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం ఫైజర్–బయోఎన్‌టెక్, మోడెర్నా వంటి సంస్థలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. తమ వ్యాక్సిన్లు 90 శాతానికి పైగానే ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. అమెరికాకు చెందిన మోడెర్నా అభివృద్ధిచేస్తున్న టీకాను అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదని, ఇండియాలోని వాతావరణ పరిస్థితులకు ఈ టీకా సరిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నోవావాక్స్ టీకా భారత్‌లో బాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఫైజర్ టీకా సురక్షితం కరోనా వైరస్‌ను అరికట్టడానికి తాము అభివృద్ధి చేస్తున్న టీకా సురక్షితమేనని 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు చివరి దశ ప్రయోగాల్లో తేటతెల్లమైందని ఫైజర్ కంపెనీ బుధవారం వెల్లడించింది. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ అనే సంస్థతో కలిసి ఫైజర్ కరోనా టీకాను అభివృద్ధిచేస్తున్న విషయం తెల్సిందే. 65 ఏళ్ల వయసుపైబడిన వారికి కరోనా ముప్పు అధికం. వీరిలో ఫైజర్ టీకా దాదాపు 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. అమెరికాలో తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం అతి త్వరలో దరఖాస్తు చేయనున్నట్లు ఫైజర్ తెలిపింది. తమ వ్యాక్సిన్‌కు సంబంధించిన పూర్తి డేటాను అమెరికాతోపాటు ప్రపంచ దేశాల్లోని వ్యాక్సిన్ నియంత్రణ సంస్థలకు అందజేస్తామని ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా వెల్లడించాయి. కోవాగ్జిన్ మూడో దశ ఈ నెల 20 నుంచి హరియాణాలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. మూడో దశ ప్రయోగ మొదటి వాలంటీర్‌గా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వ్యాక్సిన్ ట్రయల్‌ను స్వీకరించనున్నారు. ఆయనతో పాటు మరో 25 సెంటర్లలో 26 వేల మంది వాలంటీర్లు వ్యాక్సిన్ ట్రయల్‌ను స్వీకరించనున్నారు. భారత్‌లో ఎక్కువ మంది ట్రయల్స్‌లో పాల్గొంటున్న వ్యాక్సిన్ తయారీదారు కోవాగ్జిన్ కావడం గమనార్హం. ఈ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్.. ఐసీఎంఆర్‌తో సంయుక్తంగా తయారు చేస్తోంది. తమ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని వ్యాక్సిన్ తయారీ దారులు ఇటీవల వెల్లడించడం తెల్సిందే. -
వ్యాక్సిన్లు ఓకే- కోట్ల డోసేజీలు ఈజీ కాదు!
న్యూయార్క్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి ఇటీవల రెండు వ్యాక్సిన్లు చివరి దశలో విజయవంతమైనట్లు కంపెనీలు ప్రకటించాయి. అమెరికన్ దిగ్గజాలు ఫైజర్, మోడర్నా.. తమ వ్యాక్సిన్లు 90 శాతంపైగా సురక్షితమంటూ పేర్కొన్నాయి. దీంతో ప్రపంచ దేశాలు ఈ వ్యాక్సిన్లపై దృష్టిసారించాయి. ఇప్పటికే నోవావాక్స్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర కంపెనీల వ్యాక్సిన్లు సైతం చివరి దశ పరీక్షలలో ఉన్నాయి. కాగా.. అమెరికన్ దిగ్గజాల వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో విజయవంతమై నియంత్రణ సంస్థల అనుమతులు పొందవలసి ఉంది. ఒకవేళ యూఎస్ఎఫ్డీఏ తదితరాలు వ్యాక్సిన్లకు వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ వీటి తయారీ, పంపిణీ పలు సవాళ్లతో కూడుకుని ఉన్నట్లు ఫార్మా నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: (ఇండియాకు మోడర్నా వ్యాక్సిన్) వచ్చే ఏడాదిలోనే ఫెడరల్ నియంత్రణ సంస్థల నుంచి ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లకు త్వరితగతిన అనుమతులు పొందినప్పటికీ వీటిని భారీ స్థాయిలో తయారు చేయడం కష్టమేనని ఫార్మా రంగ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది లేదా జనవరికల్లా గరిష్టంగా 5 కోట్ల డోసేజీలను మాత్రమే రూపొందించే వీలున్నట్లు అంచనా వేశారు. ఫైజర్, మోడర్నా సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్లు తొలుత అమెరికన్లకు మాత్రమే అందనున్నాయి. ఫెడరల్ ప్రభుత్వం బిలియన్లకొద్దీ డాలర్లను వ్యాక్సిన్ల అభివృద్ధికి అందించడంతో తొలుత ప్రభుత్వానికి సరఫరా చేయవలసి ఉంటుంది. యూఎస్ ప్రభుత్వం ఈ ఏడాది 30 కోట్ల డోసేజీలను లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: (వ్యాక్సిన్ దెబ్బకు పసిడి- వెండి డీలా) సాంకేతికత కారణంగా కోవిడ్-19కు చెక్ పెట్టగల వ్యాక్సిన్ల తయారీలో ఫైజర్, మోడర్నా కొత్త టెక్నాలజీలను వినియోగించాయి. ఇలాంటి టెక్నాలజీ ఆధారిత వ్యాక్సిన్లను ఇంతక్రితం భారీ స్థాయిలో వినియోగించేందుకు నియంత్రణ సంస్థలు అనుమతులు ఇచ్చింది లేదని ఫార్మా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే.. ఫార్మా దిగ్గజాలు మిలియన్లకొద్దీ డోసేజీలను రూపొందించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఇందుకు వీలుగా ముడి(రా) వ్యాక్సిన్, ఇతర ముడిపదార్ధాలు(ఇన్‌గ్రెడియంట్స్) తగినంతగా సమకూర్చుకోవలసి ఉంటుంది. ఇదేవిధంగా వీటన్నిటినీ క్రోడీకరించి అత్యంత నాణ్యమైన వ్యాక్సిన్ల బ్యాచ్‌లను తయారు చేయవలసి ఉంటుంది. అన్నిటినీ ఒకే స్థాయి ప్రమాణాలతో రూపొందించవలసి ఉంటుంది. బయోలాజికల్ ప్రొడక్టుకు సంబంధించిన తయారీని పెంచడంలో పలు సవాళ్లు ఎదురుకావచ్చని ఆరోగ్య పరిరక్షణ శాఖకు చెందిన స్టాఫ్ డిప్యూటీ చీఫ్ పాల్ మ్యాంగో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా 30 కోట్ల డోసేజీల తయారీ అత్యంత క్లిష్టతతోకూడిన వ్యవహారమని అభిప్రాయపడ్డారు. 5 కోట్ల డోసేజీలే.. ఫైజర్ తొలుత ఈ ఏడాది చివరికల్లా 10 కోట్ల డోసేజీలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ తాజాగా వీటిలో సగం పరిమాణంలోనే అందించగలమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రపంచ దేశాలకు కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల కారణంగా గతంలోలేని విధంగా ముందుగానే ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలు పూర్తికాకుండానే తయారీ ప్రణాళికలకు శ్రీకారం చుట్టాయి. వ్యాక్సిన్ విజయవంతమైతే వెనువెంటనే భారీ స్థాయిలో డోసేజీలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 10 కోట్ల డోసేజీలను అందించేందుకు వీలుగా మోడర్నా 2 బిలియన్ డాలర్లను ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందుకుంది. అయితే జనవరికల్లా 2 కోట్ల డోసేజీలను అందించే వీలున్నట్లు అంచనా. ఇక ఫైజర్ అయితే 10 కోట్ల డోసేజీలను 1.95 బిలియన్ డాలర్లకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసేజీలను అందించగలమని భావిస్తున్నట్లు ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బోర్లా ఇటీవల తెలియజేశారు. ఇతర కంపెనీలు బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా జనవరికల్లా మిలియన్లకొద్దీ వ్యాక్సిన్లను అందించేందుకు సన్నాహాలు చేసినప్పటికీ క్లినికల్ పరీక్షలను ఆరు వారాలపాటు నిలిపివేయడంతో ఈ ఏడాది చివరికల్లా అనుమతులు లభించకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో జనవరిలో ఈ వ్యాక్సిన్లకు గ్రీన్‌సిగ్నల్ లభించవచ్చని భావిస్తున్నారు. ఇక రెండు డోసేజీలలో వ్యాక్సిన్లను రూపొందిస్తున్న నోవావాక్స్ వచ్చే ఏడాదిలో 2 బిలియన్లకుపైగా డోసేజీలను అందించాలని చూస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధికి ఫెడరల్ ప్రభుత్వం నుంచి నోవావాక్స్ 1.6 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ సైతం మార్చికల్లా 10 కోట్ల డోసేజీలను సిద్ధం చేసే వ్యూహాల్లో ఉంది. 2021 చివరికల్లా 1 బిలియన్ డోసేజీలను సరఫరా చేయాలని భావిస్తోంది. -
వ్యాక్సిన్‌కు యాస్పెన్ ఫార్మా- జేఅండ్‌జే డీల్
ప్రపంచ దేశాలను పీడిస్తున్న కోవిడ్-19 కట్టడికి వీలుగా వ్యాక్సిన్ తయారీ కోసం అమెరికన్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్‌తో హెల్త్‌కేర్ రంగ దక్షిణాఫ్రికా కంపెనీ యాస్పెన్ ఫార్మాకేర్ చేతులు కలిపింది. ఇందుకు జేఅండ్జేతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యాస్పెన్ హెల్త్‌కేర్ తాజాగా వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కు దక్షిణాఫ్రికాతోపాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు అనుమతి లభిస్తే.. తయారీని చేపట్టనున్నట్లు యాస్పెన్ ఫార్మాకేర్ పేర్కొంది. ప్రస్తుతం జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ తగినంత ప్రభావం చూపడంతోపాటు భద్రతా ప్రమాణాలను అందుకుంటే తయారీని చేపట్టే వీలున్నట్లు వివరించింది. ఇందుకు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఆమోదముద్ర వేయవలసి ఉంటుందని తెలియజేసింది. తద్వారా పోర్ట్ఎలిజెబెత్లోగల ప్లాంటు ద్వారా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేయనున్నట్లు పేర్కొంది. ట్రయల్స్‌లో.. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం పరీక్షల స్థాయిలో ఉన్న నాలుగు విభిన్న వ్యాక్సిన్లలో జేఅండ్‌జే రూపొందించిన ఏడీ26.సీవోవీ3-ఎస్ ఒకటని యాస్పెన్ తెలియజేసింది. ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే భారీ స్థాయిలో జేఅండ్‌జే సరఫరా చేయవలసి ఉంటుందని, వీటిని ఇండివిడ్యుయల్ డోసేజీలలో తాము రూపొందిస్తామని వివరించింది. దక్షిణాఫ్రికా ప్లాంటుపై 18.4 కోట్ల డాలర్లను(సుమారు రూ. 1,360 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు యాస్పెన్ సీఈవో స్టీఫెన్ సాద్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ప్లాంటు నుంచి ఇప్పటికే హెచ్ఐవీ, మల్టీడ్రగ్ రెసిస్టెంట్ టీబీ తదితర వ్యాధుల చికిత్సకు వినియోగించగల పలు ఔషధాలను రూపొందించిన విషయాన్ని ప్రస్తావించారు. -
జనవరి నాటికి అమెరికాలో టీకా
షికాగో: అంతా అనుకున్నట్టుగా జరిగితే డిసెంబరు చివరి నాటికి, లేదా జనవరి ప్రారంభం నాటికి సురక్షితమైన, సమర్థవంతమైన తొలి కోవిడ్ వ్యాక్సిన్ అమెరికాలో అందుబాటులోకి వస్తుందని అంటువ్యాధుల నిపుణుడు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు మోడర్న, ఫైజర్లు ఇచ్చిన అంచనాల ప్రకారం రాబోయే కొద్ది వారాల్లోనే తొలి దశ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అది తొలుత హై రిస్క్‌లో ఉన్నవారికి అందించనున్నట్లు ఆయన తెలిపారు. జూలై చివర్లో ఈ రెండు కంపెనీలు చివరి దశ మానవప్రయోగాలు ప్రారంభించాయి. తొలుత అక్టోబర్‌లో తాత్కాలిక ప్రయోగాల వివరాలను ప్రకటిస్తారని భావించినప్పటికీ, ప్రస్తుతం నవంబరు 3 వ తేదీకి ముందు డేటాను విడుదల చేసే అవకాశం లేదని ఫైజర్ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం డేటాని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సమాచారాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సమీక్షించాల్సి ఉంది. దాని ఫలితాల ఆధారంగా ప్రయోగాలు విజయవంతమైతే మొదటి డోస్‌లను ఎవరికి ఇవ్వాలని అనేది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిఫార్సులు చేస్తుంది. తొలి వ్యాక్సిన్ డోసులు డిసెంబర్ చివరినాటికి లేదా జనవరి ప్రారంభం నాటికి అత్యవసరమని భావించే వ్యక్తులకు ముందుగా అందిస్తారని ఫౌసీ తెలిపారు. రష్యాలో టీకా ప్రయోగాలకు బ్రేక్ వ్యాక్సిన్ డోసుల కొరతతో టీకాప్రయోగాలను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. కొత్త డోసులు వచ్చే వరకు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని రష్యా అంటోంది. అదేవిధంగా, అమెరికా, భారత్ తర్వాత అత్యధికంగా ప్రభావితమైన దేశం బ్రెజిల్. కోవిడ్ వ్యాక్సిన్ అన్ని అనుమతులు పొంది, జూన్ నాటికి వినియోగంలోకి రావచ్చునని భావిస్తున్నట్లు బ్రెజిల్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు వ్యాక్సిన్ల అభివృద్ధికి తుదిప్రయోగాలకు అనుమతులిచ్చారు. -
డిసెంబర్ 31కల్లా 30 కోట్ల డోస్‌లు రెడీ
న్యూఢిల్లీ: భారత్‌లో ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి దాదాపు 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్ధమవుతాయని పుణేలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ జాదవ్ చెప్పారు. డీసీజీఐ నుంచి లైసెన్స్ రాగానే ఈ వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు. చివరి పరీక్ష జరుపుకున్న వ్యాక్సిన్ 2021 మార్చిలో అందుబాటులోకి వస్తుందన్నారు. కరోనా వైరస్ నివారణకు సీరమ్ సంస్థ ఐదు రకాల వ్యాక్సిన్లతో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. సీరమ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికం తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని అనుమతులు పొందాకే వ్యాక్సిన్‌ను విక్రయిస్తామన్నారు. తాము నెలకు దాదాపు 7 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తామన్నారు. భారత్‌లో స్పుత్నిక్–వీ పరీక్షలు కరోనా నివారణకు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ వ్యాక్సిన్ రెండు/మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు తమకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి లభించిందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్)తో కలిసి తాము ఈ ట్రయల్స్ నిర్వహిస్తామంది. సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తేవడమే తమ సంకల్పమని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కో–చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. రష్యాలో స్పుత్నిక్–వీ టీకా మానవ ప్రయోగాలు జరుగుతున్నాయని ఆర్డీఐఎఫ్ సీఈఓ కిరిల్ చెప్పారు. భారత్‌లోనూ ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైందన్నారు. భారత్‌లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు, వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్ గత నెలలో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా ఆర్డీఐఎఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు 10 కోట్ల్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేయనుంది. కేసులు @ 74 లక్షలు దేశంలో గత 24 గంటల్లో 62,212 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 74,32,680కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 837 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,12,998 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 65,24,595కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,95,087గా ఉంది. దాదాపు నెలన్నర తర్వాత తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల దిగువకు వచ్చింది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 10.70 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 87.78 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.52గా నమోదైంది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. -
వ్యాక్సిన్ : వారు 2022 వరకు ఆగాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా ఉన్న యువత కరోనా టీకా కోసం 2022 వరకు వేచి చూడాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఎందుకంటే కరోనా ప్రమాదం ఎక్కువ పొంచి ఉన్న ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఫ్రంట్ లైన్ కార్మికులకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని, వారితోనే టీకా ప్రక్రియ మొదలవుతుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన యువత 2022 వరకు వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. (రెండో వాక్సిన్ : పుతిన్ కీలక ప్రకటన) వైరస్ వల్ల రిస్క్‌లో ఉన్న హెల్త్ వర్కర్లకు ముందుగా టీకా అందుతుందని స్వామినాథన్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అనేక మార్గదర్శకాలు రానున్నాయని, దీంతో ఆరోగ్యంగా ఉన్న యువత వాక్సిన్ కోసం 2022 వరకు ఎదురు చూడాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. 2021 వరకు కనీసం ఒక్క వ్యాక్సిన్ అయినా వస్తుందని ఆమె అన్నారు. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల కరోనా టీకా ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయని, ముందుగా ఎవరికి టీకా ఇవ్వాలన్న అంశంపై చర్చలు జరుగుతున్నట్లు స్వామినాథన్ తెలిపారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందు కరోనా టీకా ఇవ్వాలని చాలా మంది అంగీకరిస్తున్నారని, అయినా ఆ వర్కర్లలో ఎవరికి ముందుగా ఇవ్వాలన్న అంశం కూడా చర్చిస్తున్నామన్నారు. ఆ తర్వాత వృద్ధులకు టీకా ఇవ్వనున్నట్లు స్వామినాథన్ తెలిపారు. టీకా చాలా తక్కువ మోతాదులో అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే మరణాల శాతం తగ్గుతోందన్న సంతృప్తితో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. పెరుగుతున్న కేసుల సంఖ్య వల్ల మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉందని సౌమ్య హెచ్చరించారు. -
జూలైకి 25 కోట్ల మందికి టీకా
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జూలై కల్లా దేశంలోని 20 నుంచి 25 కోట్ల మందికి సరిపోయేలా 40 నుంచి 50 కోట్ల కోవిడ్–19 టీకా డోసుల్ని సిద్ధం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ టీకాను ఇవ్వాల్సిన వారి పేర్లను ప్రాధాన్యతాక్రమంలో అక్టోబర్ చివరిలోగా అందజేయాలని రాష్ట్రాలను కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆదివారం ఈ విషయం వెల్లడించారు. కోవిడ్–19పై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీలో మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా ‘సండే సంవాద్’వేదికగా ఆయన పలు విషయాలపై మాట్లాడారు. కోవిడ్–19 పంపిణీపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను పరిశీలిస్తోందన్నారు. టీకా పంపిణీలో అనుసరించాల్సిన ప్రాధాన్యతా క్రమంపై రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఈ కమిటీ ఒక ఫార్మాట్‌ను తయారు చేస్తోందని వెల్లడించారు. మొదటి ప్రాధాన్యంలో కోవిడ్–19 ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సిబ్బందికి ఇస్తామన్నారు. ‘టీకా సేకరణ బాధ్యతను కేంద్రమే తీసుకుంది. అది సిద్ధమయ్యాక అందరికీ సమానంగా, నిష్పక్షపాతంగా అందించేందుకు చేపట్టే ఏర్పాట్లపై ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తోంది’అని చెప్పారు. ‘దేశంలోని వివిధ సంస్థలు టీకా అభివృద్ధి కోసం సాగిస్తున్న ప్రయత్నాలు.. అవి ఏ దశలో ఉన్నాయనే అంశాన్ని ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు ఆయా సంస్థల నుంచి సేకరించే టీకాపై ముందుగానే హామీ తీసుకుంటోంది’అని అన్నారు. తయారైన టీకాను పక్కదారి పట్టించడం, బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం వంటి వాటికి తావు లేదన్నారు. రష్యా టీకా స్పుత్నిక్–వీకి భారత్‌లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు ఇచ్చే అంశం పరిశీలనలోనే ఉందన్నారు. ఇప్పటి వరకు ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కోవిడ్ కేసులు 65 లక్షలు పైనే న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కేసుల సంఖ్య 65 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 75,829 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65,49,373కు చేరుకుంది. అదే సమయంలో 940 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,01,782 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం రికవరీల సంఖ్య 55,09,966కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,37,625గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 14.32 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 84.13 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.55 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 278 మంది మరణించారు. ఈ నెల 3 వరకూ 7,89,92,534 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం మరో 11,42,131 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. -
టీకా ఇతర దేశాలకూ ఇస్తాం: ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్ నిరోధానికి సిద్ధం చేస్తున్న టీకాలను అమెరికా ఇతర దేశాలకు సరఫరా చేసే అవకాశాలు లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. టీకా తయారైన తరువాత దేశవ్యాప్తంగా వేగంగా టీకా ఉత్పత్తి చేపడతామని, కరోనా చికిత్సకు ఉపయోగపడే వెంటిలేటర్లు సరఫరా చేసినట్లే టీకాను కూడా ఇతర దేశాలకు అందిస్తామని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికిగానీ.. వచ్చే ఏడాది మొదట్లోగానీ టీకా అందుబాటులోకి రాచవ్చనని ట్రంప్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
కోవిడ్-19 వ్యాక్సిన్ల ధరల యుద్ధం?!
అంతర్జాతీయంగా ఫైజర్, మోడర్నా ఇంక్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్, సనోఫీ- జీఎస్కే, మెర్క్ తదితర గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ఇందుకు వీలుగా ఇప్పటికే క్లినికల్ పరీక్షలను వేగవంతం చేశాయి. ప్రస్తుతం పలు ఔషధాలు రెండు, మూడో దశ పరీక్షలకు చేరుకున్నాయి. సాధారణంగా నాలుగు దశల తదుపరి ఔషధ పరీక్షల ఫలితాలను విశ్లేషించాక సంబంధిత ఔషధ నియంత్రణ సంస్థలు అనుమతులు మంజూరు చేస్తాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఇందుకు రోగుల భద్రత, వ్యాక్సిన్ పనితీరు తదితర పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయని తెలియజేశాయి. కాగా.. 2020 డిసెంబర్‌లోగా మోడర్నా తదితర సంస్థలు వ్యాక్సిన్‌ను విడుదల చేసే అంచనాలు వేస్తుంటే.. సనోఫీ, జీఎస్కే 2021 తొలి అర్ధభాగంలో ప్రవేశపెట్టే వీలున్నట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశ, విదేశీ కంపెనీలు భారీ స్థాయిలో వ్యాక్సిన్లను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలకు ఆరోగ్యపరమైన సవాళ్లు విసురుతున్న కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల ధరలు తదితరాలపై వెలువడుతున్న అంచనాలను చూద్దాం.. 60-4 డాలర్ల మధ్య కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు యూఎస్, తదితర సంపన్న దేశాలలో 50-60 డాలర్ల చొప్పున ధరను మోడార్న్ ఇంక్ ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. అయితే జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్ భాగస్వామ్యంతో ఫైజర్ రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు 39 డాలర్లను ప్రకటించే యోచనలో ఉన్నట్లు విదేశీ మీడియా పేర్కొంది. కాగా.. లక్షలాది మంది రోగులకు వినియోగించగల వ్యాక్సిన్ల ధరలపై ప్రభుత్వంతో తొలుత సంప్రదింపులు జరిపాకే ధరలు నిర్ణయమవుతాయని మోడర్నా ఇంక్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. మరోవైపు యూఎస్ ప్రభుత్వం నుంచి ముందస్తుగా అందుకోనున్న 120 కోట్ల డాలర్ల చెల్లింపులకుగాను ఆస్ట్రాజెనెకా 4 డాలర్ల ధరలో 30 కోట్ల డోసేజీలను సరఫరా చేయవచ్చని మీడియా పేర్కొంది. యూఎస్ ప్రభుత్వం మోడర్నాకు సైతం 100 కోట్ల డాలర్ల ఫండింగ్‌ను అందించిన విషయం విదితమే. 30 కోట్ల డోసేజీలు కోవిడ్-19కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు తొలిసారి ఏప్రిల్‌లో చేతులు కలిపిన ఫార్మా దిగ్గజాలు సనోఫీ, జీఎస్కే.. 2021 తొలి అర్ధభాగంలో ఔషధ నియంత్రణ సంస్థల అనుమతి పొందగలమని భావిస్తున్నట్లు తెలియజేశాయి. క్లినికల్ పరీక్షలు విజయవంతమైతే 6 కోట్ల డోసేజీలను సరఫరా చేసేందుకు బ్రిటన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ బాటలో యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్ ప్రభుత్వాలతోనూ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. తద్వారా 30 కోట్లకుపైగా డోసేజీలను సరఫరా చేసే యోచనలో ఉన్నట్లు విదేశీ మీడియా తెలియజేసింది. -
‘ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పంపిణీ’
న్యూఢిల్లీ: ప్రభుత్వం ద్వారానే దేశంలోని ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందుతుందని.. ఎవరూ ప్రైవేట్‌లో కొనాల్సిన అవసరం లేదంటుంది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ). కరోనా వ్యాక్సిన్ విజయవంతమైన తర్వాత ప్రభుత్వం ద్వారానే దాన్ని ప్రజలకు పంపిణీ చేస్తామని వెల్లడించింది. అంతేకాక దేశ జనాభా కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల సామార్థ్యం తమ సొంతం అన్నది సీరమ్. ఆదివారం సీరమ్ సీఈఓ అదార్ పూనవాలాకి, మరో పార్సీకి మధ్య జరిగిన ట్విటర్ సంభాషణ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. రోని స్క్రూవాలా అనే పార్సీ.. అదార్‌ను ఉద్దేశిస్తూ.. ‘పార్సీ సమాజంలో జనాభా చాలా తక్కువగా ఉంది. అయితే ఇప్పటికే ప్రపంచంలో అంతరించిపోతున్న జాతులను కాపాడటానికి ఒక లాబీ పనిచేస్తోంది. కాబట్టి పార్సీల కోసం కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలి’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై అదార్ స్పందిస్తూ.. ‘సమాజానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తాం. ఈ గ్రహం మీద ఉన్న పార్సీలను కవర్ చేయడానికి మా ఒక్క రోజు ఉత్పత్తి సరిపోతుంది’ అంటూ సరదాగా స్పందించారు. (అక్టోబర్–నవంబర్‌లో టీకా) ఈ క్రమంలో సోమవారం అదార్ మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతమైన తర్వాత దేశ ప్రజలు ఎవరూ దీన్ని బహిరంగ మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నెట్వర్క్ ద్వారా ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తాం అని తెలిపారు. అంతేకాక నిన్న జరిగిన ట్విటర్ సంభాషణ కేవలం ఇద్దరు పార్సీ మిత్రుల మధ్య జరిగిన స్నేహపూర్వక సంభాషణ మాత్రమే’ అన్నారు. ఆక్స్ఫర్డ్ దాని భాగస్వామి ఆస్ట్రాజెనికా తమ వ్యాక్సిన్ విజయవంతమైన తర్వాత.. దాన్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం కోసం ఎస్ఐఐతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆక్సఫర్డ్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాలను ఆగస్టులో ప్రారంభించనున్నట్లు అదార్ తెలిపారు. మూడవ దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి కోరుతూ ఎస్ఐఐ ఇప్పటికే దరఖాస్తు చేసింది. వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఎస్ఐఐ కరోనా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పూణే, ముంబైలలో ట్రయల్స్ నిర్వహించాలని యోచిస్తోంది. (దేశంలో వ్యాక్సిన్ పరీక్షల జోరు) రెండు నెలల పాటు కొనసాగబోయే ట్రయల్స్‌లో భాగంగా ఆగస్టు చివరి నాటికి పూణే, ముంబైలలో 4,000 నుంచి 5,000 మందికి టీకా ఇంజెక్ట్ చేయనున్నట్లు ఎస్ఐఐ గత ప్రకటనలో తెలిపింది. గత వారం వ్యాక్సిన్ పరీక్ష ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సంతృప్తికరమైన పురోగతిని సాధించడంతో.. తరువాతి ట్రయల్స్ కోసం ఎస్ఐఐ డీసీజీఏ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. -
ప్రజారోగ్యానికే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ రూపకల్పనలో భారత్ పురోగతి సాధించడంతో ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై పడింది. ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15నాటికి అందుబాటులోకి తెస్తామన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన ప్రకటనపై సందేహాలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ని ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో నిర్వహించాలని ఆగస్టు 15 వరకు గడువు ఇస్తూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ రాసిన లేఖ బయటకి వచ్చి వివాదాస్పదమైంది. అంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆచరణ సాధ్యం కాదని చాలా మంది వైరాలజిస్టులు తేల్చేయడంతో ఐసీఎంఆర్ వివరణనిచ్చింది. అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఫాస్ట్ ట్రాక్ ప్రయోగాలు చేస్తున్నామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అధికారికంగా అనుమతుల మంజూరులో జాప్యాన్ని నివారించడానికే ఫాస్ట్ ట్రాక్ పద్ధతి అవలంబిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే ప్రక్రియని వేగవంతం చేశామని తెలిపింది. ఈ ఏడాది వ్యాక్సిన్ రాదు: సీసీఎంబీ కోవిడ్ వ్యాక్సిన్ ఈ ఏడాది వచ్చే అవకాశాల్లేవని సీఎస్ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలెక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ కె మిశ్రా చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో జరిగే ప్రక్రియలో పెద్ద సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుందని వచ్చే ఏడాది లోపు అది పూర్తి చెయ్యడం సాధ్యం కాదని అన్నారు. వ్యాక్సిన్ ప్రయోగాలను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లినప్పటికీ ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని అన్నారు. ఎందుకంటే వ్యాక్సిన్‌ను అత్యంత ఎక్కువ మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్ అంటే అదేదో మందు కాదని, అది వేశాక తగ్గిపోతుందో లేదో చూడడానికని మిశ్రా అన్నారు. మానవ ప్రయోగాలకి 12–18 నెలలు మొత్తం మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. మొదటి దశలో వ్యాక్సిన్ మనుషులకి సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి చాలా తక్కువ మందిపై ప్రయోగించి చూస్తారు. రెండో దశలో అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో చూస్తారు. ఇక మూడో దశలో కొన్ని నెలల పాటు ఈ వ్యాక్సిన్ సమర్థతను పరీక్షించి చూస్తారు. ఈ దశలో వేలాది మంది పాల్గొనాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా వ్యాక్సిన్ పనిచేస్తోందని నిర్ధారణయ్యాకే ప్రజలకి టీకాని అందుబాటులోకి తెస్తారు. ఒక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటు రావాలంటే కనీసం 12–18 నెలల కాలం పడుతుందని కోల్‌కతాకు చెందిన వైరాలజిస్టు ఉపాసన రే అన్నారు. -
20 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు రెడీ
వాషింగ్టన్: తమ దేశం 20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసుల్ని సిద్ధం చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రక్షణ పరమైన పరీక్షలు పూర్తి చేశాక వాటిని సరఫరా చేస్తామని చెప్పారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ వ్యాక్సిన్ విషయంలో అమెరికా అద్భుతమైన పురోగతిని సాధించిందని అన్నారు. కోవిడ్ చికిత్సా విధానంలో కూడా అమెరికా మంచి పురోగతి సాధించిందని అన్నారు. ట్రంప్ అధికార యంత్రాంగం కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి 5 కంపెనీలను ఎంపిక చేసినట్టుగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. (ఇటలీని దాటేసిన భారత్) పరస్పర వ్యతిరేక వ్యాఖ్యలు కరోనా వ్యాక్సిన్ అంశంలో అమెరికా ప్రభుత్వం చెబుతున్నదానికి, పరిశోధకులు చెబుతున్న మాటలకి పొంతన లేదు. అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి కరోనా వైరస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిందని ట్రంప్ అంటుంటే, పరిశోధకులు మానవ శరీరంలోకి వైరస్ ప్రవేశించాక వారి రోగ నిరోధక శక్తి వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. (ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా.. హైకోర్టుకు తాళం) భారత్ పరీక్షలు చేస్తే మరిన్ని కేసులు చైనా, భారత్ మరిన్ని కరోనా పరీక్షలు నిర్వహించి ఉండి ఉంటే అగ్రరాజ్యాన్ని మించిపోయేలా కేసులు నమోదై ఉండేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మైన్‌లో కరోనా కిట్స్ తయారు చేసే ప్యూరిటన్ మెడికల్ ప్రొడక్ట్స్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా రెండు కోట్ల మందికి పరీక్షలు నిర్వహించిందన్నారు. జర్మనీ 40 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే దక్షిణ కొరియా 30 లక్షల మందికి మాత్రమే కోవిడ్ పరీక్షలు నిర్వహించిందని ట్రంప్ గుర్తు చేశారు. ఎక్కువ మందికి టెస్టులు చేస్తే, ఎక్కువ కేసులు నమోదవుతాయని అందరూ గ్రహించాలని ట్రంప్ అన్నారు. చైనా, భారత్, ఇతర దేశాలు ఇంకా ఎక్కువ పరీక్షలు చేసి ఉంటే, మరెన్నో కేసులు నమోదయ్యేవని ట్రంప్ అన్నారు. -
2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం: ట్రంప్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నానాటికీ కేసుల సంఖ్య తీవ్రరూపం దాల్చుతూ మానవ మనుగడను ప్రమాదంలోకి నెట్టివేస్తోంది. ముఖ్యంగా కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. అమెరికాలో ప్రస్తుతం 1.87 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 108,120 మంది మరణించారు. దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇప్పటికే 2 మిలియన్ల కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. వీటికి భద్రతా పరిశోధనలు పూర్తి అయితే ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ('ఆయన నాపై అత్యాచారం చేశారు') ‘వ్యాక్సిన్‌పై నిన్న అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించాం. కరోనా టీకా తయారీలో అద్భుత పురోగతి సాధిస్తున్నాం. వ్యాక్సిన్ అభివృద్ధిలో సానుకూల ఫలితాలు అందుతున్నాయి. భద్రతాపరమైన పరీక్షలు కొనసాగుతున్నాయి. అవి పూర్తయితే దాదాపు 2 మిలియన్లకు పైగా వాక్సిన్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం’. అని పేర్కొన్నారు. అదే విధంగా కరోనా నియంత్రణ చర్యల్లో తాము చాలా బాగా పని చేస్తున్నామని, వైరస్‌ను ఎదుర్కోవడంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. (జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి) కరోనావైరస్ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసేందుకు ట్రంప్ పరిపాలన విభాగం అయిదు కంపెనీలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏ కంపెనీ వ్యాక్సీన్ తయారీని ప్రారంభించిందనే విషయం మాత్రం తెలీదు. ఈ విషయంపై వైట్ హౌస్ ఆరోగ్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఇటీవల మాట్లాడుతూ.. కరోనాకు నేరుగా లేదా పరోక్షంగా ఉపయోగించే కనీసం నాలుగు వ్యాక్సిన్ల ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. 2021 ప్రారంభం నాటికి రెండు లేదా మూడు మిలియన్ వ్యాక్సిన్లను కలిగి ఉండగలమని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ దశల్లో అనేక పరిశోధనలు జరిపిన తర్వాత శాస్త్రవేత్తలు టీకా అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారన్నారు. (అమెరికాలో కొత్తగా 2.5 మిలియన్ ఉద్యోగాలు!) -
రేపు రెండో విడత పల్స్‌పోలియో
* ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య ఆరోగ్యశాఖ * జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 3.67 లక్షలు * పీహెచ్‌సీలు, అర్భన్హెల్త్సెంటర్లకు వ్యాక్సిన్ సరఫరా నల్లగొండ టౌన్: రెండో విడత పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లాలో ఆదివారం నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు, ఐదు రెవెన్యూ డివిజన్లలో కలిపి మొత్తం 3లక్షల 67వేల 460మంది ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వారికి అవసరమైన వ్యాక్సీన్ జిల్లాకు తెప్పించారు. జిల్లాలోని 15 సీహెచ్‌ఎన్‌సీలు, వాటి పరిధిలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు పీపీ యూనిట్లు, 8 అర్భన్ హెల్త్ సెంటర్లు, మూడు అర్భన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లకు వ్యాక్సిన్ సరఫరా చేశారు. పోలియో చుక్కలను వేయడానికి రూరల్ పరిధిలో 2737 సెంటర్లు, అర్భన్‌లో 234 పోలియే చుక్కల కేంద్రాలను కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా 2971 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు. 79 మొబైల్ బృందాల ఏర్పాటు సంచారజాతులు,ఇటుకబట్టీలు,మురికివాడలు, నిర్మాణ రంగాలు, చేపలుపట్టే ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 79 మొబైల్ బృందాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్టు చేసింది. మొబైల్ బృందంలో పీహెచ్సీ వైద్యాధికారితో పాటు నలుగురు సిబ్బంది పోలియో చుక్కలను వేయడంతో పాటు వారి పరిధిలో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్, బస్‌స్టాప్‌లలో పోలియో చుక్కలను వేయడం కోసం 54 ట్రాన్సిట్ బృందాలను నియమించారు. పోలియో చుక్కల కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పించడం కోసం అవసరమైన కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. 21వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలియో కేంద్రాలలో పిల్లలకు చుక్కలను వేయనున్నారు. అదే విధంగా 22, 23 తేదీల్లో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయించని పిల్లలను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయనున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాలు, ఐకేపీ, ఐసీడీఎస్, ఆశ వర్కర్ల సేవలను వినియోగించుకుంటారు. 11,884 మంది సిబ్బంది నియామకం పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 11,884 మంది సిబ్బందిని నియమించారు. అందులో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 1836, ఉపాధ్యాయులు 327, అంగన్వాడీ వర్కర్లు 3560, ఆశ వర్కర్లు 2978, ఇతర వాలంటీర్లు 3183 మందిని నియమించారు. కార్యక్రమం పర్యవేక్షణ కోసం 294 మంది సూపర్వైజర్లను నియమించారు. కార్యక్రమాన్ని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదనపు జా యింట్ కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ, డీఐఓ, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు పర్యవేక్షించనున్నారు. నేడు పల్స్‌పోలియో ర్యాలీ జిల్లాలో ఆదివారం నుంచి నిర్వహించనున్న రెండో విడత పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భానూప్రసాద్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీ ఉదయం 9. గంటలకు డీఎంహెచ్ కార్యాలయం వద్ద ప్రారంభమై గడియారం సెంటర్ మీదుగా ప్రకాశంబజార్, డీఈఓ కార్యాలయంనుంచి డీఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకుంటుందని తెలిపారు.