న్యూఢిల్లీ: కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ రూపకల్పనలో భారత్ పురోగతి సాధించడంతో ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై పడింది. ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15నాటికి అందుబాటులోకి తెస్తామన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన ప్రకటనపై సందేహాలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ని ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో నిర్వహించాలని ఆగస్టు 15 వరకు గడువు ఇస్తూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ రాసిన లేఖ బయటకి వచ్చి వివాదాస్పదమైంది.
అంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆచరణ సాధ్యం కాదని చాలా మంది వైరాలజిస్టులు తేల్చేయడంతో ఐసీఎంఆర్ వివరణనిచ్చింది. అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఫాస్ట్ ట్రాక్ ప్రయోగాలు చేస్తున్నామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అధికారికంగా అనుమతుల మంజూరులో జాప్యాన్ని నివారించడానికే ఫాస్ట్ ట్రాక్ పద్ధతి అవలంబిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే ప్రక్రియని వేగవంతం చేశామని తెలిపింది.
ఈ ఏడాది వ్యాక్సిన్ రాదు: సీసీఎంబీ
కోవిడ్ వ్యాక్సిన్ ఈ ఏడాది వచ్చే అవకాశాల్లేవని సీఎస్‌ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలెక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ కె మిశ్రా చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో జరిగే ప్రక్రియలో పెద్ద సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుందని వచ్చే ఏడాది లోపు అది పూర్తి చెయ్యడం సాధ్యం కాదని అన్నారు. వ్యాక్సిన్ ప్రయోగాలను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లినప్పటికీ ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని అన్నారు. ఎందుకంటే వ్యాక్సిన్‌ను అత్యంత ఎక్కువ మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్ అంటే అదేదో మందు కాదని, అది వేశాక తగ్గిపోతుందో లేదో చూడడానికని మిశ్రా అన్నారు.
మానవ ప్రయోగాలకి 12–18 నెలలు
మొత్తం మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. మొదటి దశలో వ్యాక్సిన్ మనుషులకి సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి చాలా తక్కువ మందిపై ప్రయోగించి చూస్తారు. రెండో దశలో అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో చూస్తారు. ఇక మూడో దశలో కొన్ని నెలల పాటు ఈ వ్యాక్సిన్ సమర్థతను పరీక్షించి చూస్తారు. ఈ దశలో వేలాది మంది పాల్గొనాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా వ్యాక్సిన్ పనిచేస్తోందని నిర్ధారణయ్యాకే ప్రజలకి టీకాని అందుబాటులోకి తెస్తారు. ఒక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటు రావాలంటే కనీసం 12–18 నెలల కాలం పడుతుందని కోల్‌కతాకు చెందిన వైరాలజిస్టు ఉపాసన రే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment