న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న భారత్ స్వదేశీ వ్యాక్సిన్ ప్రయోగాలను వేగవంతం చేసింది. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సంస్థలకు చెందిన వ్యాక్సిన్‌లను దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మనుషులపై ప్రయోగించి చూస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో 30 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు ఇచ్చారు. ఈ రెండు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్‌లు మొదటి, రెండో దశ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్‌ను పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ రెండు/మూడో దశ ప్రయోగాల అనుమతుల కోసం వేచిచూస్తోంది.
స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్‌లు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్‌ను మొత్తం 12 ఆస్పత్రుల్లో 500 మంది వాలంటీర్లపై ప్రయోగించి చూశారు. 18–55 మధ్య వయసున్న వీరికి వ్యాక్సిన్ డోసు ఇచ్చాక స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చినట్టుగా ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. కొద్దిగా జ్వరం తప్ప ఇతరత్రా అనారోగ్య సమస్యలేవీ రాలేదని ఢిల్లీలో ఎయిమ్స్ డైరెక్టర్ వెల్లడించారు.
జూలై 29 నుంచి రెండో దశ ప్రయోగాలు
మొదటి దశలో చేసిన ప్రయోగాలు విజయవంతంగా ముగిస్తే ఈ నెల 29 నుంచి రెండో దశ వ్యాక్సిన్ ప్రయోగాలు చేపడతారు. మొదటి దశలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు లేవని నిర్ధారించుకోవడం, యాంటీ బాడీలు ఏ స్థాయిలో ఉత్పన్నమయ్యాయో తెలుసుకోవడానికి వాలంటీర్లకు మరికొన్ని టెస్టులు చేయాల్సి ఉందని ఎయిమ్స్ పట్నా డైరెక్టర్ సింగ్ చెప్పారు. కొవాగ్జిన్ ట్రయల్స్ హైదరాబాద్, పట్నా, కాంచీపురం, రోహ్‌తక్, ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. నాగపూర్, భువనేశ్వర్, బెల్గామ్, గోరక్‌పూర్, కాన్పూర్, గోవా, విశాఖపట్నంలలో ప్రయోగించాల్సి ఉంది. రెండో దశ ప్రయోగాలు పట్నా, రోహ్‌తక్‌లలో 26 నుంచి ప్రారంభం కానున్నాయి. జైడస్‌కి చెందిన జైకోవిడ్ టీకాని అహ్మదాబాద్‌లో ప్రయోగించి చూస్తున్నారు.
దేశంలో వ్యాక్సిన్ పరీక్షల జోరు
Published Sun, Jul 26 2020 5:22 AM | Last Updated on Sun, Jul 26 2020 5:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment