న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్ కోవిడ్ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తోందని, పూర్తిగా సురక్షితమైనదని లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను లాన్సెట్ వైద్య నిపుణులు విశ్లేషించి నివేదిక రూపొందించారు.
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 2 వారాల్లో యాంటీబాడీలు సమృద్ధిగా వచ్చాయని, దుష్ప్రభావాలు కనబడలేదంది. కోవాగ్జిన్ తీసుకుంటే కరోనా తీవ్రంగా సోకకుండా 93.4%, సాధారణంగా సోకకుండా 77.8%తో పని చేస్తోందని తెలిపింది. డెల్టా వేరియెంట్ నుంచి 65.2% సామర్థ్యంతో రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. టీకా ఇచ్చిన వారంలో తలనొప్పి, అలసట, జ్వరం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి తప్ప ఎలాంటి రియాక్షన్లు లేవని స్పష్టం చేసింది.
గత ఏడాది నవంబర్ 16 నుంచి ఈ ఏడాది మే 17 వరకు మూడోదశ ప్రయోగాలు జరిగాయి. భారత్‌లోని 25 ఆస్పత్రుల్లో 18–97 ఏళ్ల 16,973 మందికి టీకాను ప్రయోగాత్మకంగా ఇచ్చారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారు ఆస్పత్రి పాలవడం, మరణించడం జరగలేదని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ఈ నివేదికపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెడికల్ జర్నల్‌లో కోవాగ్జిన్ ఫలితాలు వచ్చాయంటే అదెంత సమర్థంగా పని చేస్తోందో అర్థమవుతుందన్నారు. కోవాగ్జిన్‌పై లాన్సెట్ నిపుణుల పరిశోధనల్లో తేలిన అంశాలు టీకా అభివృద్ధిలో తమ చిత్తశుద్ధిని, డేటా ఇవ్వడంలో పారదర్శకతను వెల్లడిస్తోందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. కాగా లాన్సెట్ జర్నల్ ఈ నివేదిక ప్రాథమికమైనదని, మరింత డేటా వచ్చాక పూర్తి నివేదిక ప్రచురిస్తామని వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఇటీవల అనుమతులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment