Antibodies
-
ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్!? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి
Omicron Boost Immunity Against Delta: ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి.. అనేది పాత సామెత! ముందునుంచి ఉన్న చెవులకు కొత్త కొమ్ముల వాడి తగలడం దీనికి కొనసాగింపు! ఈ కథలో ముందునుంచి ఉన్న చెవులు డెల్టా వేరియంట్ కాగా, వెనకొచ్చిన కొమ్ములు ఒమిక్రాన్ వేరియంట్. డెల్టాను మించిన వేగంతో ఆవతరించిన ఒమిక్రాన్ క్రమంగా డెల్టాకే పరోక్ష ప్రమాదకారిగా మారుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వివరాలేంటో చూద్దాం.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీలు భవిష్యత్‌లో డెల్టా వేరియంట్ సోకితే అడ్డుకునేలా సదరు వ్యక్తి శరీరంలో రోగనిరోధకతను పెంచుతాయని దక్షిణాఫ్రికా పరిశోధకులు వెల్లడించారు. డెల్టా వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో జరిగిన పలు మ్యుటేషన్లతో ఒమిక్రాన్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే! డెల్టాతో పోలిస్తే దీనికి వేగం, వ్యాప్తి సామర్ధ్యం ఎక్కువని నిరూపితమైంది. అదేవిధంగా శరీరంలో టీకాల వల్ల, గత ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా ఒమిక్రాన్ అధిగమిస్తుందని పరిశోధనలు వెల్లడించాయి. అయితే డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల కలిగే వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడం గమనార్హం. దీనివల్లనే ఒమిక్రాన్ ప్రపంచమంతా అత్యధిక వేగంతో వ్యాపించినా, డెల్టా తరహాలో మరణాలు సంభవించడం లేదు. అంటే డెల్టా సోకితే వచ్చిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. కానీ ఒమిక్రాన్ సోకితే వచ్చే యాంటీబాడీలు మాత్రం అటు డెల్టాను, ఇటు ఒమిక్రాన్‌ను అడ్డుకోగలుగుతున్నాయి. అందుకే కొందరు సైంటిస్టులు ఒమిక్రాన్ దేవుడు ఇచ్చిన ‘‘సహజ వ్యాక్సిన్’’గా అభివర్ణిస్తున్నారు. టీకా చేసే పనులను ( వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండడం, శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రేరేపించడం) ఈ వేరియంట్ చేస్తోందని భావిస్తున్నారు. ఈ భావనకు తాజా పరిశోధన బలం చేకూరుస్తోంది. ఏమిటీ పరిశోధన ఒమిక్రాన్ వేరియంట్‌ను మరింతగా అవగాహన చేసుకునేందుకు దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక అధ్యయనం జరిపారు. దీని వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా 15మందిని అధ్యయనం చేశారు. వీరిలో టీకాలు తీసుకున్నవారు మరియు ఇంతవరకు టీకాలు తీసుకోకుండా ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారు ఉన్నారు. ఈ రెండు గ్రూపులకు చెందిన వారి రక్తం, ప్లాస్మాల్లో యాంటీబాడీలను విశ్లేషించారు. వీరి శరీరంలో ఉత్పన్నమైన యాంటీబాడీల్లో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లను అడ్డుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇందుకోసం ‘‘న్యూట్రలైజేషన్’’పరీక్ష నిర్వహించారు. లక్షణాలు కనిపించినప్పుడు, తిరిగి రెండు వారాల తర్వాత మొత్తం రెండు దఫాలు ఈ పరీక్షలు చేశారు. ఒమిక్రాన్ సోకి యాంటీబాడీలు ఉత్పత్తైన వ్యక్తుల్లో ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్ 14 రెట్లు అధికంగా పెరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా డెల్టాకు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్ 4.4 రెట్లు పెరిగినట్లు గమనించారు. అంటే ఒమిక్రాన్ సోకి వ్యాధి తగ్గిన వారిలో అటు ఒమిక్రాన్, ఇటు డెల్టాకు వ్యతిరేకంగా ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుందని తేల్చారు. అంటే ఒకసారి ఒమిక్రాన్ సోకి తగ్గితే సదరు వ్యక్తికి భవిష్యత్‌లో డెల్టా, ఒమిక్రాన్ సోకే అవకాశాలు బాగా తగ్గవచ్చని పరిశోధకుడు అలెక్స్ సైగల్ అభిప్రాయపడ్డారు. టీకా సైతం ఇదే పనిచేస్తున్నందున ఒమిక్రాన్‌ను కరోనాకు వ్యతిరేకంగా దేవుడిచ్చిన టీకాగా భావించవచ్చన్నది నిపుణుల అంచనా. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తే కరోనా ఒక సాధారణ జలుబుగా మారిపోయే అవకాశాలున్నాయనేది ప్రస్తుతానికి వినిపించే గుడ్ న్యూస్! విమర్శలు కూడా ఉన్నాయి... సైగల్ చేపట్టిన పరిశోధన వివరాలు ఆశాజనకంగా ఉన్నా, ఈ పరిశోధనపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కేవలం 15మంది వాలంటీర్ల అధ్యయనంతో మొత్తం ప్రపంచ మానవాళి ఆరోగ్యాన్ని అంచనా వేయలేమన్నది విమర్శకుల వాదన. డెల్టా కన్నా ఒమిక్రాన్ మంచిదనేందుకు ఈ యాంటీబాడీల పరీక్ష కాకుండా మరే ఆధారాలు దొరకలేదు. ఇప్పటికే శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని ఒమిక్రాన్ యాంటీబాడీలు పెంచిఉండొచ్చని కొందరి అంచనా. అలాగే డార్విన్ సిద్ధాంతం ప్రకారం డెల్టాను ఒమిక్రాన్ తరిమేస్తే భవిష్యత్‌లో మరో శక్తివంతమైన వేరియంట్ పుట్టుకురావచ్చు. అందువల్ల కేవలం ఒమిక్రాన్‌తో కరోనా ముగిసిపోకపోవచ్చని పరిశోధకుడు డాక్టర్ పియర్సన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో మూడు పరిణామాలకు అవకాశం ఉందన్నారు. 1. ఫ్లూ వైరస్లాగా ప్రతి ఏటా ఒక సీజనల్ కరోనా వేరియంట్ పుట్టుకురావడం . 2. డెంగ్యూలాగా పలు కోవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తూ కొన్ని సంవత్సరాలకొకమారు ఒక వేరియంట్ విజృంభించడం. 3. తేలికగా నివారించగలిగే ఒకటే వేరియంట్ మిగిలడం.. అనేవి పియర్సన్ అంచనాలు. వీటిలో మూడోది మానవాళికి మంచిదని, కానీ దీనికి ఛాన్సులు తక్కువని ఆయన భావిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
ఒమిక్రాన్‌ను అడ్డుకునే యాంటీబాడీల గుర్తింపు
వాషింగ్టన్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకునే యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్ శరీరంలో ఉత్పరివర్తనాలు చెందినా మారని భాగాలపై ఈ యాంటీబాడీలు పనిచేస్తాయని తెలిపారు. జర్నల్ నేచర్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ వివరాలు భవిష్యత్‌లో వచ్చే వేరియంట్లను అడ్డుకునే టీకాల తయారీకి, చికిత్సకు ఉపయోగపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు. స్పైక్ ప్రోటీన్‌లో అత్యధిక రక్షణ మధ్య ఉండే ప్రాంతాలను ఈ యాంటీబాడీలు లక్ష్యంగా చేసుకుంటాయని, అందువల్ల వైరస్ ఎంత మ్యుటేషన్ చెందినా వీటి పనితీరును అడ్డుకోలేదని ప్రొఫెసర్ డేవిడ్ వీజ్లర్ వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబాడీ చికిత్సలో వాడే యాంటీబాడీలను పరిశోధకులు విశ్లేషించారు. వీటిలో సొట్రోవిమాబ్ అనే యాంటీబాడీ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తుందని, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని 3 రెట్లు అధికంగా తగ్గిస్తుందని గుర్తించారు. అదేవిధంగా గత వేరియంట్లకు వ్యతిరేకంగా ఉత్పత్తైన యాంటీబాడీల్లో నాలుగు తరగతులకు చెందిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను అడ్డుకునే సామర్ధ్యంతో ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఈ యాంటీబాడీలు కేవలం కరోనా వేరస్ కాకుండా సార్బెకోవైరస్ జాతి వైరస్‌లన్నింటి స్పైక్ప్రొటీన్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. అలాగే ఇవి ప్రభావం చూపే ప్రాంతం స్పైక్ ప్రొటీన్‌లో సంరక్షిత ప్రాంతమని, ఇది మ్యుటేషన్లతో మారదని, అందువల్ల వైరస్ ఎన్ని మ్యుటేషన్లు చెందినా ఈ యాంటీ బాడీలు అడ్డుకుంటాయని వీజ్లర్ వివరించారు. అలాగే ఒక్క డోసు టీకా తీసుకున్నవారి కన్నా రెండు డోసులు టీకా తీసుకున్నవారిలో ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా టీకా శక్తి తరుగుదల ఐదురెట్లు తక్కువని పరిశోధనలో గుర్తించారు. వీరితో పోలిస్తే బూస్టర్ డోసు తీసుకున్నవారిలో టీకాల సామర్ధ్యం తగ్గడం మరింత తక్కువని తెలిసింది. అందువల్ల బూస్టర్ డోసు ఒమిక్రాన్ నిరోధంలో కీలకపాత్ర పోషిస్తుందని వీజ్లర్ అభిప్రాయపడ్డారు. పరిశోధన ఇలా సాగింది... తాజాగా ఉద్భవించిన ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో 37 ఉత్పరివర్తనాలను గుర్తించారు. ఈ స్పైక్ ప్రొటీన్ ఆధారంగానే వైరస్ మానవ కణాల్లోకి వెళ్లగలుగుతుంది. అధిక మ్యుటేషన్ల కారణంగానే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపించడంతో పాటు రోగనిరోధకతను సైతం తట్టుకుంటోంది. స్పైక్ ప్రొటీన్‌లో వచ్చిన మార్పులు ఒమిక్రాన్‌కు ఇంత శక్తిని ఎలా ఇవ్వగలుగుతున్నాయనే అంశంపై పరిశోధన చేశామని వీజ్లర్ చెప్పారు. ఇందుకోసం కృత్తిమంగా స్పైక్ ప్రొటీన్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం గల ఒక ప్రభావ రహిత వైరస్(మిధ్యావైరస్)ను సృష్టించారు. ఈ సూడో వైరస్ స్పైక్ ప్రొటీన్లు ఏవిధంగా మానవ శరీర కణాలకు అతుకుంటున్నాయో, ఎలా కణాల్లోకి వెళ్లేందుకు ఉపయోగపడుతున్నాయో పరిశీలించారు. మానవ శరీర కణాలపై ఉండే ఏసీఈ2 రిసెప్టార్ ప్రొటీన్‌కు ఈ స్పైక్ప్రొటీన్స్ అతుక్కోవడం ద్వారా వైరస్‌ను కణాల్లోకి పంపుతాయి. ఒమిక్రాన్ వేరియంట్ గత వేరియంట్ల కన్నా 2.4 రెట్లు అధిక సామర్ధ్యంతో ఏసీఈ2 ప్రోటీన్ రిసెప్టార్‌ను అతుక్కోగలదని పరిశోధనలో తేలింది. దీనివల్లనే ఒమిక్రాన్ వ్యాప్తి అంత వేగంగా ఉందని వీజ్లర్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌కు కేవలం మానవ శరీర కణాలనే కాకుండా ఎలుక కణాల్లోని ఏసీఈ2 రిసెప్టార్తో అతుకునే సామర్ధ్యం ఉందని పరిశీలనలో గుర్తించారు. అంటే ఒమిక్రాన్ వేరియంట్ మనిషితో పాటు ఇతర క్షీరదాలకు కూడా సోకే ఛాన్సులున్నాయని తెలుసుకున్నారు. -
బూస్టర్ డోస్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు!
గుంటూరు మెడికల్: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో అనుసరించిన ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్నే అవలంబిస్తోంది. విదేశాల నుంచి జిల్లాకు 864 మంది విదేశాల నుంచి వచ్చిన వారి గురించి అధికారులు ప్రాంతాల వారీగా జల్లెడపడుతున్నారు. ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది ద్వారా ట్రేస్ చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు వారిని ఇటీవల కలిసిన వారికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వైరస్ సోకినట్టు నిర్ధారణైతే తక్షణం వైద్యం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు మొదలైనప్పటి నుంచి జిల్లాకు పలు దేశాల నుంచి 864 మంది వచ్చారు. వీరంతా ఎక్కడెక్కడ ఉంటున్నారో వారి పాస్‌పోర్టు ఆధారంగా వైద్యసిబ్బంది గుర్తించారు. వారిని కలిసిన వారితోపాటు ఇప్పటివరకూ 1,109 మందికిపైగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ పాజిటివ్ రిపోర్టు రాలేదు. నిత్యం సర్వే విదేశాల నుంచి వస్తున్న వారి సమాచారాన్ని జిల్లా రెవెన్యూ అధికారుల వద్ద నుంచి సేకరించిన వైద్య అధికారులు ప్రతిరోజూ ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందికి చేరవేసి సర్వే చేయిస్తున్నారు. దీనికోసం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేకంగా వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ముందస్తు కట్టడే వ్యూహం ఒమిక్రాన్‌ను ముందుగానే కట్టడి చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. యాంటీబాడీస్‌పై శ్రద్ధ యాంటీ బాడీస్ పరీక్షపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ఈ పరీక్ష చేయించుకునేందుకు ఎక్కువ మంది ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. శరీరంలోని యాంటీబాడీస్ కరోనా వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తాయి కాబట్టి.. అవి ఉన్నాయా లేదా అనే సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఫలితంగా ప్రైవేటు ల్యాబ్‌లు కిటకిటలాడుతున్నాయి. ఒమిక్రాన్ భయంతో రెండు డోసులు టీకా వేసుకున్న వారూ యాంటీబాడీస్ టెస్టు చేయించుకుంటున్నారు. అవసరమైతే మూడో డోస్ వేయించుకునేందుకు యత్నిస్తున్నారు. అనుమతులు రాలేదు ఎలాంటి వైరస్ సోకినా శరీరంలో కొంత వరకు యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. బూస్టర్ డోస్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. చాలామంది యాంటీబాడీస్ టెస్టుల కోసం, మూడో డోస్ వేయించుకోవాలా లేదా అనే సందేహాలతో వైద్యసిబ్బందిని, అధికారులను సంప్రదిస్తున్నట్టు సమాచారం ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన వారు కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చు. – డీఎంహెచ్ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ -
ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది: లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్ కోవిడ్ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తోందని, పూర్తిగా సురక్షితమైనదని లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను లాన్సెట్ వైద్య నిపుణులు విశ్లేషించి నివేదిక రూపొందించారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 2 వారాల్లో యాంటీబాడీలు సమృద్ధిగా వచ్చాయని, దుష్ప్రభావాలు కనబడలేదంది. కోవాగ్జిన్ తీసుకుంటే కరోనా తీవ్రంగా సోకకుండా 93.4%, సాధారణంగా సోకకుండా 77.8%తో పని చేస్తోందని తెలిపింది. డెల్టా వేరియెంట్ నుంచి 65.2% సామర్థ్యంతో రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. టీకా ఇచ్చిన వారంలో తలనొప్పి, అలసట, జ్వరం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి తప్ప ఎలాంటి రియాక్షన్లు లేవని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ 16 నుంచి ఈ ఏడాది మే 17 వరకు మూడోదశ ప్రయోగాలు జరిగాయి. భారత్‌లోని 25 ఆస్పత్రుల్లో 18–97 ఏళ్ల 16,973 మందికి టీకాను ప్రయోగాత్మకంగా ఇచ్చారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారు ఆస్పత్రి పాలవడం, మరణించడం జరగలేదని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ఈ నివేదికపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెడికల్ జర్నల్‌లో కోవాగ్జిన్ ఫలితాలు వచ్చాయంటే అదెంత సమర్థంగా పని చేస్తోందో అర్థమవుతుందన్నారు. కోవాగ్జిన్‌పై లాన్సెట్ నిపుణుల పరిశోధనల్లో తేలిన అంశాలు టీకా అభివృద్ధిలో తమ చిత్తశుద్ధిని, డేటా ఇవ్వడంలో పారదర్శకతను వెల్లడిస్తోందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. కాగా లాన్సెట్ జర్నల్ ఈ నివేదిక ప్రాథమికమైనదని, మరింత డేటా వచ్చాక పూర్తి నివేదిక ప్రచురిస్తామని వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఇటీవల అనుమతులిచ్చింది. -
Covid-19: కేరళే కాదు, అంతా జాగ్రత్త పడాలి
గత కొన్ని వారాలుగా కేరళలోని కోవిడ్–19 కేసుల సంఖ్య జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలోని సగం కేసులు ఇక్కడినుంచే వస్తున్నాయి. జాతీయ సగటుతో (2 శాతం) పోల్చితే, అత్యధిక పాజిటివ్ రేటు(10 శాతం) నమోదవుతోంది. ఓనమ్ పండుగ సందర్భంగా, ఒక దశలో 18 శాతం పాజిటివ్ రేటు, దేశ కేసుల్లో మూడింట రెండొంతుల మార్కును కూడా కేరళ చేరుకుంది. ఏ మహమ్మారిలోనైనా మూడు ముఖ్యాంశాలను బట్టి వ్యవస్థ స్పందనను అంచనాకట్టొచ్చు. సంక్రమణను నెమ్మదింపజేయడం (దీనివల్ల ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేసే వీలుంటుంది); మెరుగైన ఆరోగ్య సేవల వల్ల సంక్రమించినవాళ్ల మీద పడే ప్రభావాన్ని తగ్గించగలగడం(మరణాల రేటుతో లెక్కించొచ్చు); సంక్రమణను నిరోధించడానికి తీసుకున్న చర్యలు (టీకాలు, ఇతర నియంత్రణ చర్యలు). (చదవండి: చైనాతో లడ్డాఖ్ లడాయి.. భారత్ మేల్కొనాల్సిన సమయం ఇదే!) దేశంలోని ఏ రాష్ట్రం కన్నా కూడా సంక్రమణను నెమ్మదింపచేయడంలో కేరళ విజయవంతమైంది. 21 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన జాతీయ సీరో ప్రివలెన్స్ సర్వేలో 44.6 శాతంతో అతి తక్కువ సీరోప్రివలెన్స్ (రక్తంలో యాంటీబాడీల వ్యాప్తి) ఉన్నది కేరళలోనే అని వెల్లడైంది. ఇంకో రకంగా చెప్పాలంటే, మిగతా రాష్ట్రాలతో పోల్చితే సోకనివారి సంఖ్య ఇక్కడ ఎక్కువ. వాస్తవం ఏమిటంటే, డెల్టా రకం కేరళకు మిగతా దేశంతో పోలిస్తే కొంచెం ఆలస్యంగా ప్రవేశించింది. ఇప్పుడు స్థిరంగా కనబడుతున్న వ్యాప్తికి కారణం, ఈ డెల్టా. (చదవండి: ముప్పు వచ్చేసింది... మనకు మరింత!) మరణాల సంఖ్య పరంగానూ కేరళ మెరుగ్గా ఉంది. జాతీయ సగటు 1.3 శాతం ఉన్నప్పటికీ, కేరళలో ఇది 0.5 శాతం మాత్రమే. సెకండ్ వేవ్ ఉధృతిలో దేశంలో హాస్పిటల్ బెడ్లు, ఆక్సిజన్, ఇతర ఆరోగ్య సరఫరాల విషయంలో సంక్షోభం తలెత్తింది. కేరళలోనూ ఒత్తిడి పెరిగినప్పటికి ఆరోగ్య వ్యవస్థ చేతులు ఎత్తేయలేదు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండి, ఇతరులకు సోకని వ్యాధుల భారం ఉన్నప్పటికీ ఇంకో రాష్ట్రమైతే బలహీనమైన ఆరోగ్య వ్యవస్థ మూలంగా మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. కానీ ఈ విషయంలోనూ కేరళ మెరుగ్గా స్పందించింది. అలాగే కోవిడ్ టీకా పంపిణీ కూడా వేగంగా జరుగుతోంది. దాదాపు 21 శాతం జనాభాకు పూర్తి టీకా వేశారు. 58 శాతం జనాభాకు కనీసం ఒక్క డోసైనా పడింది. అత్యధిక వ్యాప్తికి అవకాశముండే చోట్ల, ఇప్పటికీ కాంటాక్టులను వెతికి పట్టుకుని కోవిడ్–19 పరీక్షలు చేస్తున్న అతి కొద్ది రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఒక విధంగా అత్యధిక పాజిటివ్ రేటుకు ఇది కూడా కారణం. అలాగే, వచ్చిన అన్ని కేసులను నివేదించడం బాగా పనిచేసే వ్యాధి పర్యవేక్షక వ్యవస్థ లక్షణం. కాబట్టి, సరైన రీతిలో స్పందిస్తున్నందుకు కేరళను నిందించకూడదు. స్వల్ప వ్యవధిలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో అత్యధిక మందికి సోకిన డెల్టా, కేరళలో నెమ్మదిగా వ్యాపించడం కూడా రాష్ట్ర పనితీరుకు నిదర్శనం. అయితే ప్రతిదీ కేరళ సరిగ్గా చేసిందని కాదు. ఎక్కువ జనం పోగయ్యే ఓనమ్‌కు సడలింపులిచ్చింది. ఎన్నికల ర్యాలీలకు అనుమతించింది. ఈ పరిణామాలు కూడా కేసుల పెరుగుదలకు కారణమైనాయి. స్పష్టంగా ఈ తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రమైనా జనాలు పోగయ్యే సందర్భాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించాలి. స్థిరమైన సంక్రమణలను దృష్టిలో ఉంచుకుంటూ, కేరళ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణ, అన్‌లాక్ వ్యూహం మరింత పకడ్బందీగా అమలుచేయాలి. స్థానిక సంస్థలను చురుకైన భాగస్వాములను చేయాలి. టీకాలు వేసుకోనివాళ్లు ప్రజా సమూహాల్లోకి హాజరు కాకుండా చూసుకోవాలి. ఏ పండుగకైనా సడలింపులు ఇవ్వడం మానుకోవాలి. టీకాల వేగం మరింత పెరగాలి. జీనోమ్ సీక్వెన్సింగ్ తరచూ చేయాలి. ఇండియా ఇంకా మహమ్మారి మధ్యలోనే ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ భిన్న రకాలు వ్యాప్తిలో ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ, కొత్త రకం ప్రబలితే పరిస్థితి మారిపోవచ్చు. థర్డ్ వేవ్‌కు అవకాశం ఉండటంతోపాటు, వ్యాధి ‘ఎండెమిక్’(సీజనల్ వ్యాధి కావడం) అవడానికి ఇంకా చాలా నెలలు పట్టొచ్చు. అందుకే ఏ రాష్ట్రమైనా కేసుల సంఖ్యతో నిమిత్తం లేకుండా సర్వ సన్నద్ధంగా ఉండాలి. ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి. ఇతర రాష్ట్రాల అనుభవాల నుంచి నేర్చుకోవాలి. అదే మహమ్మారి మీద జరిగే పోరాటంలో ఇండియాను గెలిపించగలదు. - డాక్టర్ చంద్రకాంత్ లహరియా ఎపిడీమియాలజిస్ట్ -
కరోనా కొత్త రూపాంతరాలు.. ‘బూస్టర్’ డోసు తప్పనిసరా?
రిచ్మండ్ (అమెరికా): కరోనా వైరస్ కొత్త వేరియంట్లు (రూపాంతరితాలు) పుట్టుకొస్తున్న కొద్దీ... కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత ఏమేరకు రక్షణ ఉంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త వేరియంట్లు టీకా కల్పించే రక్షణ కవచాన్ని ఛేదిస్తాయా? టీకా కారణంగా ఎంతకాలం కోవిడ్–19 నుంచి రక్షణ లభిస్తుంది? రెండు డోసులు తీసుకున్నాక కూడా మరో బూస్టర్ డోసు అవసరమా? ఇలా పలు సందేహాలు ప్రజలను వేధిస్తున్నాయి. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్టు, అంటువ్యాధుల నిపుణులు విలియం పెట్రి వీటికి సమాధానాలు ఇచ్చారు. సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. బూస్టర్ డోస్ అంటే ఏమిటి? వైరస్, బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధుల నుంచి రక్షణకు మనం వ్యాక్సిన్లు తీసుకుంటాం. సదరు వైరస్‌కు వ్యతిరేకంగా మన శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెంది... దానితో పోరాడి నిర్వీర్యం చేస్తాయి లేదా వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. అయితే వ్యాక్సిన్ల ద్వారా లభించే రోగనిరోధకత సమయం గడిచినకొద్దీ బలహీనపడం సహజమే. ఉదాహరణకు ‘ఫ్లూ’ నిరోధానికి ఏడాదికోసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. డిప్తీరియా, ధనుర్వాతానికి ప్రతి పదేళ్లకోసారి తీసుకోవాలి. వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధకత స్థాయిని కొనసాగించేందుకు వీలుగా కొన్నాళ్ల తర్వాత ఇచ్చే అదనపు డోసునే ‘బూస్టర్ డోసు’ అని పిలుస్తారు. అప్పుడే అవసరమా? అమెరికాలో ఆరోగ్య సంస్థలు ఇప్పటివరకు బూస్టర్ డోసుపై అంతగా ఆసక్తిని కనబర్చడం లేదు. అయితే ఇజ్రాయెల్‌లో 60 ఏళ్లు పైబడిన వారు మూడోడోసు తీసుకోవాలని పోత్రహిస్తున్నారు. కరోనా బారినపడే ముప్పు అధికంగా ఉన్నవారికి (వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు) బూస్టర్ డోసు ఇవ్వాలనే దానిపై ఫ్రాన్స్‌లో సమాలోచనలు జరుగుతున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువుంటే ‘బూస్టర్’ అవసరమా? స్టెరాయిడ్ల వాడకం వల్ల రోగనిరోధక శక్తి తగ్గినవారు, దీర్ఘకాలిక రోగులకు బూస్టర్ డోస్ అవసరం. కిడ్నీ మార్పిడి జరిగిన 40 రోగుల్లో 39 మందిలో, డయాలసిస్ చేయించుకున్న వారిలో మూడోవంతు మందిలో (పరీక్షించిన శాంపిల్‌లో) వ్యాక్సినేషన్ తర్వాత యాండీబాడీల ఆచూకీ లేదని అధ్యయనంలో తేలింది. కిడ్నీ మార్పిడి చేసుకున్న రోగుల్లో బూస్టర్ తర్వాత యాంటీబాడీలు కనిపించాయి. ఎందుకు సిఫారసు చేయడం లేదు? టీకా మూలంగా లభించే రక్షణ శాశ్వతం కానప్పటికీ... ఎంతకాలం ఉంటుందనేది ఇప్పటికైతే స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆమోదం పొందిన వ్యాక్సిన్లు అన్నీ మంచి రక్షణ కల్పిస్తున్నాయి. రోగకారక వైరస్ తాలూకు నిర్మాణాన్ని ‘బి లింఫోసైట్స్’ జ్ఞాపకం పెట్టుకుంటాయి. వైరస్ సోకితే... దాన్ని ఎదుర్కొనడానికి వెంటనే తగినంత స్థాయిలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. వ్యాక్సినేషన్ పూర్తయిన 11 నెలల తర్వాత కూడా యాంటీబాడీలు కనపడటం ... బూస్టర్ డోస్ అప్పుడే అవసరం లేదనే అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. బూస్టర్ డోస్ అవసరమని మనకెలా తెలుస్తుంది? కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో ఏమేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా వైద్యులు ఐజీజీ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీని ఫలితాన్ని బట్టి బూస్టర్ డోస్ అవసరమా? కాదా? అనేది తెలుస్తుంది. అయితే టీకా తీసుకున్న వారు సైతం కరోనా బారినపడుతున్న కేసులు అధికం అవుతుండటంతో వైద్య పరిశోధకులు వ్యాక్సిన్స్ ద్వారా లభించే రోగనిరోధకత ఏస్థాయిలో ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? అనేది కచ్చితంగా తేల్చే పనిలో ఉన్నారు. -
ఆర్–ఫ్యాక్టర్.. పెరుగుదల ఆందోళనకరం: ‘ఎయిమ్స్’ చీఫ్
న్యూఢిల్లీ: దేశంలో ఆర్–వాల్యూ(ఆర్–ఫ్యాక్టర్) క్రమంగా పెరుగుతోందని, ఇది నిజంగా ఆందోళనకర పరిణామమేనని ఢిల్లీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి శృంఖలాన్ని తెంచడానికి ‘టెస్టు, ట్రాక్, ట్రీట్’ అనే వ్యూహాన్ని కచ్చితంగా పాటించాలని చెప్పారు. ఆర్–వాల్యూ అనేది కరోనా వ్యాప్తి తీరును గుర్తించే ఒక సూచిక. ప్రారంభంలో ఆర్–వాల్యూ రేటు 0.96గా ఉండేదని, ఇప్పుడు 1 దాటేసిందని రణదీప్ గులేరియా పేర్కొన్నారు. అంటే కరోనా బాధితుడి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశాలు పెరుగుతున్నట్లేనని వివరించారు. దేశంలో 46 రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు కొన్ని వారాలుగా 10 శాతం కంటే అధికంగా నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఆర్–ఫ్యాక్టర్ సైతం క్రమంగా పెరుగుతోంది. ఇంట్లో ఒకరికి ఈ వైరస్ సోకితే మిగిలినవారికి కూడా అంటుకుంటున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. కుటుంబంలో ఒకరికి కరోనా డెల్టా వేరియంట్ సోకితే మిగిలినవారు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది’’ అని గులేరియా పేర్కొన్నారు. కేరళలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగుతున్నాయని, దీని వెనుక కొత్త వేరియంట్ ఏదైనా ఉందా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. తమిళనాడులో 66 శాతం మందిలో ప్రతిరక్షకాలు(యాంటీబాడీస్) వృద్ధి చెందినట్లు వెల్లడయ్యిందని వివరించారు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. మనుషుల్లో కొంతకాలం తర్వాత ప్రతిరక్షకాలు తగ్గుతాయని, కేసులు మళ్లీ ఉధృతం కావడానికి ఇదీ ఒక కారణమేనన్నారు. అయితే, ప్రతిరక్షకాలు తగ్గినవారికి కరోనా సోకితే వారి నుంచి వ్యాప్తి చెందే వైరస్ తీవ్రత అంతగా ఉండదని అన్నారు. -
తగ్గుతున్న టీకా యాంటీబాడీలు
లండన్: ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల వల్ల ఏర్పడిన యాంటీబాడీలు 10 వారాల్లో 50 శాతానికి పడిపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నా యాంటీబాడీలు తగ్గిపోవడం గమనార్హం. యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు యూకేలో జరిపిన ఈ పరిశోధన వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కాలం గడిచేకొద్దీ యాంటీబాడీలు తగ్గిపోతుండడంతో, భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లను ఎదుర్కోవడానికి సమస్యలు ఎదురుకావచ్చనే ఆందోళన వెల్లడవుతోంది. బూస్టర్ డోస్‌తో సానుకూల ఫలితం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా (భారత్‌లో కోవిషీల్డ్) వ్యాక్సిన్లు తీసుకున్న 600 మందిపై ఈ ప్రయోగం నిర్వహించినట్లు యూసీఎల్ పరిశోధకులు తెలిపారు. ఇందులో 18 ఏళ్లు దాటిన అన్నిరకాల గ్రూపులవారు ఉన్నట్లు వెల్లడించారు. వీరిపై చేసిన పరిశోధనలో రోజులు గడిచే కొద్దీ యాంటీబాడీలు తగ్గిపోవడాన్ని గుర్తించారు. ఫైజర్ వ్యాక్సిన్ విషయంలో.. వ్యాక్సినేషన్ జరిగిన 21–41 రోజులకు యాంటీబాడీ లెవెల్స్ ప్రతి మిల్లీలీటర్‌కు 7506 యూనిట్లకు తగ్గిపోయాయి. అదే 70 రోజులు దాటే సమయానికి 3320 యూనిట్లకు తగ్గిపోయాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ విషయంలో వ్యాక్సినేషన్ జరిగిన 20 రోజుల్లోపు యాంటీబాడీ లెవెల్స్ 1201కి తగ్గాయి. 70 రోజులు దాటే సరికి ఆ సంఖ్య 190కి పడిపోయింది. అంటే దాదాపు అయిదు రెట్ల వేగంతో యాంటీబాడీలు తగ్గిపోయాయి. కోవిషీల్డ్ 93 శాతం రక్షిస్తుంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ కరోనా సోకకుండా 93 శాతం రక్షణ కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. 98 శాతం మరణాలను తగ్గించినట్లు తాజా పరిశోధనలో తేలిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో ఆర్మ్›్డ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపారు. దాదాపు 15 లక్షల మంది డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై జరిగిన పరిశోధనలో ఈ మేరకు ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అత్యంత ముఖ్యమని అన్నారు. -
60% పెద్దల్లో యాంటీబాడీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 60.1 శాతం పెద్దల్లో కరోనా వైరస్‌కు విరుగుడుగా యాంటీబాడీలు తయారైన్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రకటించింది. పిల్లల్లో ఇది 55 శాతంగా నమోదైనట్లు తెలిపింది. కౌమార వయస్కుల విషయానికి వస్తే 61 శాతం మంది, ఆరోగ్య కార్యకర్తల్లో 82.4 శాతం మందిలోనూ యాంటీబాడీలు ఉన్నాయని వివరించింది. అయితే వారిలో చాలా మంది టీకాలు వేయించుకుని ఉండ టం కూడా ఎక్కువ శాతం మందిలో యాం టీబాడీల ఉండేందుకు కారణమై ఉండొచ్చని అభి ప్రాయపడింది. ఈ మేరకు నాలుగో విడత సెరో సర్వే వివరాలను ప్రకటించింది. క్రమంగా పెరుగుదల... కరోనా వ్యాప్తిని అర్థం చేసుకోవడంలో భాగంగా ఐసీఎంఆర్ ఒకే ప్రాంతంలో పలు దఫా లుగా సెరో సర్వే నిర్వహించింది. తొలి సర్వే గతే డాది మేలో జరగ్గా రెండు, మూడు సర్వేలు ఆగస్టు, డిసెం బర్లలో చేపట్టింది. తాజాగా ఈ ఏడాది జూన్‌లో నాలుగో సర్వే జరిగింది. తొలి మూడు సర్వేల్లో పాజిటివిటి వరుసగా 0.33 శాతం, 12.5 శాతం, 24.1 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో సెరో పాజిటివిటీ గతేడాది డిసెంబర్ నాటికి 24 శాతం ఉంటే ఈ ఏడాది జూన్‌కు అది 67 శాతానికి ఎగబాకింది. ఇదే కాలానికి తెలంగాణలో కొంచెం తక్కువగా (24 శాతం నుంచి 60.1 శాతం) ఉం డటం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణలో టీకాలు వేయించుకోని వారిలోనూ సెరో పాజిటివిటీ 51.3 శాతంగా ఉండటం. ఒక డోసు తీసుకున్న వారిలో ఇది 78.5 శాతం ఉండగా రెండో డోసూ పూర్తి చేసుకున్న వారిలో 94 శాతంగా ఉంది. -
కోవిడ్ ప్రమాదంలో 40 కోట్ల మంది
న్యూఢిల్లీ: దేశంలోని ఆరేళ్లపైబడి వయస్సున్న మూడింట రెండొంతుల మంది జనాభాలో కోవిడ్ నిరోధక యాంటీబాడీలు అభివృద్ధి చెందినప్పటికీ, సుమారు 40 కోట్ల మంది కోవిడ్ బారిన పడే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది. జాతీయ స్థాయిలో జూన్–జూలైల్లో చేపట్టిన నాలుగో సెరో సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మీడియాకు చెప్పారు. దేశ జనాభాలోని ఆరేళ్లకు పైబడిన మూడింట రెండొంతుల జనాభా, 67.6% మందిలో కోవిడ్ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు తేలిందని చెప్పారు. ఇంకా, సుమారు 40 కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారి బారినపడే ప్రమాదంలో ఉన్నారని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తల్లో 85 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడైంది. కానీ, దేశంలోని ప్రతి 10 మందిలో ఒక ఆరోగ్య కార్యకర్త ఇప్పటికీ టీకా వేయించుకోలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 28,975 మంది సాధారణ ప్రజలు, 7,252 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ సర్వే జరిగింది. పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ కోవిడ్‌పై పోరులో రాజీ పడరాదని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిం దేనని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, సామాజిక, మత, రాజకీయ సమావేశాలకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. చిన్నారులు వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడేందుకు అవకాశాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే స్కూళ్లు తెరవడం మంచిదని సూచించారు. 125 రోజుల్లో కనిష్ట స్థాయికి కేసులు దేశంలో 125 రోజుల తర్వాత ఒక్క రోజులో కనిష్టంగా 30,093 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,11,74,322కు చేరాయి. అదేవిధంగా, 111 రోజుల తర్వాత ఒక్క రోజులో అతితక్కువగా 374 కోవిడ్ మరణాలు సంభవించాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో, కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,14,482కు చేరుకుంది. యాక్టివ్ కేసులు కూడా 117 రోజుల తర్వాత 4,06,130కి తగ్గాయని పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 1.30% మాత్రమే. రికవరీ రేట్ కూడా 97.37%గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,03,53,710 మంది కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. చిన్నతరగతులతో స్కూళ్లు ఆరంభించడం బెటర్! ఒకవేళ భారత్‌లో బడులు తెరవడం ఆరంభించేట్లయితే ముందుగా చిన్న తరగతులతో ఆరంభించడం మేలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ సూచించారు. మానవ కణాల్లో వైరస్ రాకను అనుమతించే గ్రాహకాలు చిన్నపిల్లల్లో తక్కువని, అందువల్ల పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లల్లో వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని వివరించారు. అయితే బడులు తెరిచినా సరే నిబంధనలు కఠినంగా పాటించాల్సిందేనని సూచించారు. ముఖ్యంగా టీచర్లు ఇతర సిబ్బంది టీకాలు వేయించుకొనిఉండాలన్నారు. దేశంలో 6–9వయసు గ్రూపు జనాభాలో సీరోప్రీవాలెన్స్(బ్లడ్ సీరమ్‌లో సూక్ష్మజీవి స్థాయి) పెద్దలతో సమానంగా దాదాపు 57.2 శాతంఉందని జాతీయ సర్వేలో తేలిందన్నారు. ప్రైమరీ తరగతులకు చెందిన పిల్లలతో బడులు ఆరంభించడం మంచిదని అభిప్రాయపడ్డారు. పలు దేశాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ సందర్భాల్లో కూడా ప్రైమరీ బడులు మూసివేయలేదని తెలిపారు. అందువల్ల మనదగ్గర కూడా ముందుగా ప్రైమరీ పాఠశాలలు తెరవడం మంచిదన్నారు. -
నిర్లక్ష్యం పెరిగింది..మూడో వేవ్ ముందుంది!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందనగానే చాలా మందిలో నిర్లక్ష్యం ఆవరిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని వైద్యారోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా ఉధృతి ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్న వారు కూడా.. ఇప్పుడు ఒకరిని చూసి మరొకరు కోవిడ్ జాగ్రత్తలను పట్టించుకోవడం లేదని పేర్కొంటోంది. ముఖ్యంగా కరోనా నియంత్రణలో కీలకమైన మాస్క్‌లను కూడా ధరించడం లేదని, ఎన్నిసార్లు హెచ్చరించినా చాలా మంది పద్ధతి మార్చుకోవడం లేదని చెబుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ కొద్దిరోజులుగా వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. కరోనా నియంత్రణ చర్యలపై కార్యాచరణ ప్రణాళిక, మూడో వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగానే కోవిడ్ జాగ్రత్తలపై జనం నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి కరోనా రెండో దశ కొనసాగుతూనే ఉందని, సగటున రోజుకు ఏడెనిమిది వందల కేసులు నమోదవుతూనే ఉన్నాయని గుర్తుచేశారు. దీనికితోడు పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల పేరుతో ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడుతున్నారని.. తిరిగి కరోనా విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, మూడో వేవ్ ముప్పు ముందుందని సూచించారు. యాంటీబాడీస్ తగ్గిపోతున్నాయి రెండో వేవ్‌లో వైరస్ సోకి తగ్గినవారు, వ్యాక్సిన్లు వేసుకున్న వారిలో కరోనా యాంటీబాడీస్ వృద్ధి చెందాయని.. అందువల్లే ప్రస్తుతం కరోనా ఉధృతి కాస్త నియంత్రణలో ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే చాలా మందిలో యాంటీబాడీస్ తగ్గిపోతున్నాయని.. కొందరిలో ఆరు నెలలు ఉంటే, మరికొందరిలో రెండు, మూడు నెలలే ఉంటున్నాయని స్పష్టం చేస్తున్నారు. యాంటీబాడీస్ తగ్గిపోయినవారు మళ్లీ కరోనా బారినపడే ప్రమాదం ఉందని, అందువల్ల జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్తున్నారు. రెండో వేవ్‌లో 90 శాతం కేసులు డెల్టా వేరియంట్ వల్ల వచ్చినవేనని, వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, దాని ప్రభావం తీవ్రంగా ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికీ కేరళ, మహారాష్ట్రలలో కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. కరోనా నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవడమే కీలకమని స్పష్టం చేశారు. -
‘డెల్టా’పై టీకాల ప్రభావం అంతంతే!
న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్ (బి.1.617.2).. ఇప్పుడు ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న కరోనా మహమ్మారిలోని కొత్తరకం ఇది. మరోవైపు కరోనా నియంత్రణ కోసం టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఈ టీకాలు చైనాలోని వూహాన్లో పుట్టిన ఒరిజినల్ వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 8 రెట్లు తక్కువ ప్రభావం చూపుతున్నట్లు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిరక్షకాలు కరోనా దాడిని అడ్డుకుంటాయి. డెల్టా వేరియంట్‌పై టీకాల వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీలు 8 రెట్లు తక్కువగా స్పందిస్తున్నట్లు గుర్తించారు. సర్ గంగారాం హాస్పిటల్ సహా దేశంలో మూడు కేంద్రాల్లో వంద మందికిపైగా హెల్త్‌కేర్ వర్కర్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు గమనించారు. అంటే కరోనా టీకాలు డెల్టాపై పెద్దగా ప్రభావం చూపడం లేదన్నమాట. డెల్టా రకం కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళనకరమైన వేరియంట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాన్–డెల్టా ఇన్ఫెక్షన్లతో పోలిస్తే డెల్టాలో వైరల్ లోడ్ అధికం. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉంది. ఇది డామినెంట్ (ఆధిపత్య) వేరియంట్‌గా డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది. -
సగానికి పైగా పిల్లల్లో కోవిడ్ యాంటీబాడీలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదాపు 51.8 శాతం మంది పిల్లల్లో(1–18 సంవత్సరాల వయసు) కోవిడ్‌వైరస్‌కు వ్యతిరేక యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు సీరో సర్వేలో తేలిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. ధర్డ్ వేవ్ వస్తుందన్న భయాల నేపథ్యంలో బీఎంసీ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగా ఏప్రిల్– జూన్ కాలంలో 2,176 బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించారని తెలిపింది. యాంటీబాడీలున్న పిల్లల సంఖ్య గత సర్వేతో పోలిస్తే పెరిగినట్లు బీఎంసీ తెలిపింది. బీవైఎల్ నాయర్ హాస్పిటల్, కేఎండీఎల్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. సీరో సర్వేలో ప్రజల బ్లడ్ సీరమ్‌ను పరీక్షించి ట్రెండ్‌ను అధ్యయనం చేస్తారు. కరోనా ఆరంభం నుంచి ఇది మూడో సీరో సర్వే అని బీఎంసీ వెల్లడించింది. 10–14 సంవత్సరాల వయసు పిల్లల్లో సీరో పాజిటివిటీ అత్యధికంగా 53.43 శాతం ఉందని, 1–4 సంవత్సరాల పిల్లల్లో 51.04 శాతం, 5–9 సంవత్సరాల పిల్లల్లో 47.33 శాతం, 15–18 సంవత్సరాల పిల్లల్లో 51.39 శాతం సీరో పాజిటివిటీ ఉందని తెలిపింది. -
వ్యాక్సిన్ మిక్సింగ్‌పై మరింత డేటా కావాలి
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ రెండు డోసుల్లో... ఒకటి ఒక కంపెనీ, మరొకటి మరో కంపెనీ (మిక్స్ అండ్ మ్యాచ్ టీకా విధానం) వేసుకోవడం వల్ల యాంటీబాడీలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. అయితే దీనిపై లోతైన అధ్యయనాలు చేయాలని, మరింతగా సమాచారాన్ని సేకరించాల్సి ఉందని చెప్పారు. భవిష్యత్‌లో వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, అందువల్ల ఏయే కంపెనీల కాంబినేషన్లు బాగా పని చేస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కేంద్రం ఈ దిశగా అధ్యయనం చేస్తోందని... కొద్ది నెలల్లోనే ఫలితాలు వస్తాయని తెలిపారు. బ్రిటన్‌లో ప్రయోగాత్మకంగా ఒక టీకా డోసు ఆస్ట్రాజెనికా (కోవిషీల్డ్) రెండో డోసు ఫైజర్ ఇచ్చిన వారిలో సైడ్ అఫెక్ట్‌లు కనిపించాయని లాన్సెట్ జనరల్ నివేదిక వెల్లడిస్తే, ఈ రెండు కంపెనీల టీకా డోసుల్ని ఇస్తే మరింత సామర్థ్యంగా పని చేశాయని స్వానిష్ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా ప్లస్ వేరియెంట్‌కు పనిచేయవని జరుగుతున్న ప్రచారాన్ని గులేరియా కొట్టి పారేశారు. ఇలాంటి భయాలు పెట్టుకునే బదులుగా ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. సింగిల్ డోసు వ్యాక్సిన్ డెల్టా వేరియెంట్‌పై 33 శాతం పని చేస్తుందని, అదే రెండు డోసులు తీసుకుంటే 90 శాతం రక్షణ వస్తుందని వెల్లడైన అధ్యయనాలపై గులేరియా ఆందోళన వ్యక్తంచేశారు. భారత్ ప్రజలకి వీలైనంత త్వరగా బూస్టర్ డోసు ఇచ్చే కార్యక్రమం మొదలుకావాలని ఆకాక్షించారు. -
వ్యాక్సినేషన్ తర్వాతా.. 76% మందికి కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, వైరస్ ఇన్ఫెక్షన్కు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన మొట్టమొదటి అధ్యయనం విడుదలైంది. వ్యాక్సిన్ ప్రభావంపై తీసుకున్న శాంపిల్స్‌పై జరిగిన అధ్యయనంలో వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్న 76 శాతం మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. అంతేగాక కరోనా సోకిన వారిలో కేవలం 16% మందిలో మాత్రమే ఎలాంటి లక్షణాలు కనిపించకపోగా, 10 శాతం మంది చికిత్స కోసం ఆసుపత్రులలో చేరాల్సి వచ్చిందని అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్య జరిగిన ఈ అధ్యయన సమయంలో 361మందికి ఆర్టీ–పీసీఆర్ పరీక్ష నిర్వహించగా, అందులో 274 మందికి పాజిటివ్‌గా తేలింది. వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్న 14 రోజుల తరువాత ఈ వ్యక్తులకు వైరస్ సంక్రమించినట్లుగా గుర్తించారు. కోవిషీల్డ్‌తో పోలిస్తే కోవాగ్జిన్ తీసుకునే వారిలో 77% యాంటీబాడీలు మాత్రమే కనిపించాయని అధ్యయనంలో గుర్తించారు. మెడికల్ జర్నల్ రీసెర్చ్ స్క్వేర్‌లో ఈ ఫలితాలు ప్రచురితమయ్యాయి. వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకోని కారణంగా 87 శాంపిల్స్‌ను ఈ అధ్యయనం నుంచి మినహాయించారు. అనంతరం జరిగిన దర్యాప్తులో వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్న తరువాత 274 మందిలోనూ వైరస్ జాడను కనుగొన్నారు. వీటిలో 35 శాంపిల్స్(12.8%) కోవాగ్జిన్ రెండు డోస్‌లను తీసుకోగా, 239 శాంపిల్స్ (87.2%) కోవిషీల్డ్ రెండు డోస్‌లను తీసుకున్నారు. అంతేగాక కోవాగ్జిన్ రెండు డోస్‌లు తీసుకున్న తరువాత వైరస్ సోకిన వారిలో 43% మంది ఇటీవల వచ్చిన సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ వార్డుల్లో పనిచేసిన ఆరోగ్య కార్యకర్తలు. అదే సమయంలో, కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత 10% మంది ఆరోగ్య కార్యకర్తలు సైతం వ్యాధి బారిన పడ్డారు. కోవిషీల్డ్ రెండు డోస్‌ల తర్వాత కరోనా వైరస్ సంక్రమణకు గురికావడం మధ్య సగటు వ్యవధి 45 రోజులుగా గుర్తించారు. అయితే ఈ సంక్రమణ సగటు వ్యవధి కోవాగ్జిన్ తీసుకునే వారిలో 33 రోజులుగా ఉంది. అధ్యయన సమయంలో ఒక రోగి మృతి అధ్యయనం సమయంలో కోవిషీల్డ్ రెండు డోస్‌లు వేసుకున్న ఒక వ్యక్తికి వైరస్ సంక్రమించి మరణించినట్లు ఐసీఎంఆర్ నిపుణులు నిర్ధారించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మహారాష్ట్రకు చెందిన ఒకే ఒక్క రోగి మరణించినట్లు ప్రభుత్వం ఇప్పటివరకు సమాచారం ఇవ్వగా, ఈ అధ్యయనంలో దాని సమాచారం ఇవ్వలేదు. ఈ రెండు కేసులు భిన్నమైనవని శాస్త్రవేత్తలు అంటున్నారు. అధ్యయన సమయంలో హాస్పిటల్లో చేరిన 9.9%మంది: వ్యాక్సిన్ రెండు డోస్‌లను తీసుకున్న తరువాత కరోనా సోకిన వారిలో 9.9% మంది అధ్యయన సమయంలో మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అయితే వీరు డిశ్చార్జ్ అయ్యేందుకు కనీసం 11 రోజులు పట్టిందని, ఒక రోగి ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడని నివేదికలో పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ ప్రభావమే వ్యాక్సిన్లు వేసిన తరువాత కూడా డెల్టా వేరియంట్ సంక్రమణకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ వేరి యంట్ యాంటీబాడీలను గణనీయంగా తగ్గిస్తుంది. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16 నుంచి జరుగుతున్నప్పటికీ, మార్చిలో వచ్చిన సెకండ్ వేవ్‌లో నమోదైన 80%కి పైగా కేసులు డెల్టా వేరియంట్‌తో ముడిపడి ఉన్నాయి. ఇది వేగంగా పెరుగుతూ వచ్చింది. ఈ వేరియంట్ కారణంగా వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్న వారిపై కూడా కరోనా సంక్రమణ ప్రభావం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. -
మాస్క్ లేకుంటే డెల్టా ప్లస్ డేంజరే.. పక్కన ఉన్నా పాజిటివ్!
►మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తమిళ నాడు, జమ్మూకశ్మీర్ రాష్ట్రా ల్లోనూ కేసులు మొదలయ్యాయి. ►డెల్టా ప్లస్ సోకినట్టు గుర్తించిన వారిలో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో మహిళ చనిపోయింది. ఆమె ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్యులు ప్రకటించారు. ►కొత్త వేరియంట్ ప్రమాదకరమయ్యే అవకాశం ఉందన్న అంచనాలతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన కరోనా వేరియంట్)’గా ప్రకటించింది. డెల్టా, దాని అనుబంధ వేరియంట్లతో ప్రమాదం ఎక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల వెల్లడించింది. ►కరోనా ఏ వేరియంట్ వచ్చినా కూడా.. ‘కోవిడ్ జాగ్రత్తలు పాటించడం, వ్యాక్సినేషన్, లాక్డౌన్’ ఈ మూడు అంశాలే కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటితోనే మూడో వేవ్‌ను నియంత్రించవచ్చని చెప్తున్నారు. ►మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గా, సాతారా, సాంగ్లీ, క్లోహపూర్, హింగోలి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. తొందరపడి లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించవద్దని సీఎం అధికారులకు సూచించారు. సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో దశలో లక్షల కేసులకు కారణమైన డెల్టా వైరస్‌ను అదుపు చేయగలిగామని అనుకుంటుండగానే.. డెల్టా ప్లస్ కలవరం మొదలైంది. ఇది మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుందని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా ఇటీవల వెల్లడించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్ సోకు తుందని.. మాస్కులు, శానిటైజేషన్, భౌతికదూరం వంటి కోవిడ్ జాగ్రత్తతోనే రక్షణ అని స్పష్టం చేశారు. డెల్టా ప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో ఈ కొత్త వేరియంట్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు అత్యంత కీలకమని రణ్‌దీప్ స్పష్టం చేశారు. మొదట ఇంగ్లండ్‌లో గుర్తింపు కరోనా వైరస్ రూపాంతరాల్లో డెల్టా ప్లస్ (ఏవై.1) సరికొత్తది. ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ అధికారులు ఈ కొత్త వేరియంట్‌ను తొలిసారి గుర్తించినట్టుగా ఈ నెల 11న ప్రకటించారు. భారత్‌లో రెండో వేవ్‌కు ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్లోని కొమ్ము (స్పైక్) ప్రొటీన్‌లో ‘కే417’ జన్యు మార్పు జరిగి కొత్త వేరియంట్ పుట్టింది. ఈ తరహా జన్యుమార్పును బీటాగా పిలిచే దక్షిణాఫ్రికా వేరియంట్లో గతంలోనే గుర్తించారు. అయితే బీటా రకం కంటే డెల్టా వేరియంట్‌కు వ్యాప్తి చెందే సామర్థ్యం ఎక్కువ. అలాంటిది ఈ సామర్థ్యానికి తాజా జన్యుమార్పు జత కలవడంతో.. డెల్టా ప్లస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్‌పై మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రముఖ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ ఇటీవలే వెల్లడించారు. ఎక్కడెక్కడ కేసులు? డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను ఇప్పటికే 11కుపైగా దేశాల్లో గుర్తించారు. మొదట గుర్తించిన బ్రిటన్‌తోపాటు అమెరికా, చైనా, రష్యా, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలండ్, నేపాల్ తదితర దేశాల్లో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. మన దేశంలోనూ 40కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 45 వేల నమూనాల్లోని జన్యుక్రమాలను విశ్లేషించి ఈ కేసులను గుర్తించారు. ఇవి మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. నిజానికి భారత్‌లో ఏప్రిల్ ఐదో తేదీన తీసిన ఓ శాంపిల్‌లోనే డెల్టా ప్లస్ ఆనవాళ్లు ఉన్నాయని, ఈ వేరియంట్ అప్పుడే మొదలైందని ఓ అంచనా. బ్రిటన్‌లో తొలి ఐదు కేసులను ఏప్రిల్ 26న సేకరించిన శాంపిళ్లలో గుర్తించారు. ప్రమాదం ఎంత? రెండో దశలో నమోదైన కేసుల్లో అత్యధికం డెల్టా రూపాంతరితానివే. డెల్టా ప్లస్ విషయంలోనూ కేసులు అంత భారీ సంఖ్యలో ఉంటాయా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. డెల్టా ప్లస్‌తో ప్రమాదం ఎంత? ఇప్పుడున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా? అన్నదానిపై భారత వైద్య పరిశోధన సమాఖ్య, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు ఇప్పటికే అధ్యయనం ప్రారంభించాయి. ప్రమాదం ఉండకపోవచ్చు డెల్టా ప్లస్‌లోని కే417 జన్యుమార్పు ఒక్కదానితోనే ప్రమాదం పెరిగిపోదని, లక్షలకొద్దీ కేసులు వస్తాయని అనుకోవాల్సిన పనిలేదని కొందరు వైరాలజిస్టులు అంటున్నారు. కోవిడ్ జాగ్రత్తలు, నియమాలు ఎలా అమలు చేస్తున్నామన్నది కూడా ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. కరోనా వైరస్ భవిష్యత్తులోనూ మరింతగా రూపాంతరం చెందుతూనే ఉంటుందని, అవకాశం ఉన్నంత వరకు సోకుతూనే ఉంటుందని అంటున్నారు. అందువల్ల నమూనాల సేకరణ, జన్యుక్రమ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా, విస్తృతంగా జరగాలని.. ఎక్కడికక్కడే కొత్త రూపాంతరితాలను గుర్తించి, కట్టడి చేయడం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. వ్యాక్సిన్లు పనిచేస్తాయా? మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు డెల్టా రూపాంతరితం నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ డెల్టా ప్లస్ విషయంలో టీకాల సమర్థత ఎంత అన్నది ఇంకా తేలలేదు. టీకా ఒక డోసు తీసుకున్న తర్వాత కొందరు వైరస్ బారిన పడటాన్ని బట్టి చూస్తే.. కొత్త రూపాంతరితాలపై టీకా ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దు కరోనా కేసులు తగ్గిపోయాయి కదా అంటూ మొదటి వేవ్ తర్వాతిలాగా ఇప్పుడూ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు. ఏది ఏమైనాసరే అన్నట్టుగా కఠినంగా మాస్కులు, భౌతికదూరం, శానిటైజేషన్ వంటి కోవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇదే సమయంలో విస్తృతంగా వ్యాక్సినేషన్ చేపట్టాలి. అప్పుడే మూడో వేవ్‌ను ఎదుర్కోగలుతాం. -ఎయిమ్స్ ప్రధానాధికారి రణదీప్ గులేరియా ఆ కేసులు తక్కువగానే ఉన్నాయి డెల్టా ప్లస్‌తో దేశంలో మరోదఫా లక్షల సంఖ్యలో కేసులు వస్తాయన్న దానికి రుజువులేమీ లేవు. అలాగని అజాగ్రత్తగా ఉండటం సరికాదు. మేం ఇప్పటివరకు మహారాష్ట్ర నుంచి సేకరించిన 3,500 నమూనాలను విశ్లేషించాం. ఏప్రిల్, మే నెలల నమూనాల్లో డెల్టా ప్లస్‌కు చెందినవి ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి. -డాక్టర్ అనురాగ్ అగర్వాల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ -
Andhra Pradesh: 60.7% మందికి కరోనా వచ్చి పోయింది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 60 శాతం మందికిపైగా కరోనా పలకరించి వెళ్లిపోయింది! అధికారికంగా జరిగిన కరోనా పరీక్షలు ద్వారా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది 15 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ ‘సీరో’ సర్వేలో 60.7 శాతం మంది కరోనా సోకి కోలుకున్నట్లు తేలింది. మహిళలు, పురుషులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఇలా రకరకాలుగా నమూనాలు సేకరించి సర్వే నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 9 నుంచి 15వ తేదీల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించింది. పట్టణాల్లో 63.5 శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 56.8 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్టు తేల్చారు. వీరంతా టీకాలు తీసుకోని వారే. 79 శాతం మందిలో యాంటీబాడీస్ ఇక కరోనా టీకాలు తీసుకున్న వారిని మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్– 1లో హెల్త్‌కేర్ వర్కర్లు, గ్రూప్ –2లో ఫ్రంట్‌లైన్ వర్కర్లు, గ్రూప్– 3లో ఇతర విభాగాల సిబ్బంది నుంచి నమూనాలు సేకరించారు. వీరంతా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారే. వీరి నుంచి 6,284 శాంపిళ్లు సేకరించి పరీక్షించారు. మొత్తమ్మీద టీకాలు తీసుకున్న 79 శాతం మందిలో యాంటీబాడీస్ కనిపించాయి. కృష్ణాలో అత్యధికంగా పాజిటివ్ రేటు.. సీరో సర్వే లెన్స్‌లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా పాజిటివిటీ రేటు కనిపించింది. జిల్లా మహిళల్లో అత్యధికంగా కరోనా వచ్చి పోయినట్టు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 72.7 శాతం మంది మహిళలకు కరోనా వచ్చిపోయింది. పట్టణాల్లోనూ 79.1 శాతం మంది మహిళల్లో పాజిటివిటీ రేటు నమోదైంది. ఇక రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కూడా ఎక్కువగా కృష్ణా జిల్లాలోనే యాంటీబాడీస్ వృద్ధి చెందిన వారున్నారు. వ్యాక్సిన్ మొదటి గ్రూపు వారిలో పట్టణాల్లో 84.5, గ్రామాల్లో 92.6 శాతం మందిలో యాంటీబాడీస్ కనిపించాయి. విశాఖపట్నంలో అత్యల్పంగా... విశాఖ జిల్లాలో పట్టణాల్లో పురుషులు 35.4% మంది కరోనా సోకి కోలుకున్నారు. గ్రామీణ ప్రాంత పురుషుల్లో 29.1 శాతం మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మహిళల్లో పల్లెల్లో 33.2 శాతం, పట్టణాల్లో 46.8 శాతం మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. రెండు డోసులు వేసుకున్న వారిలో అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో గ్రూప్–1 వారికి పట్టణాల్లో 63.6 శాతం, గ్రామాల్లో 54.1 శాతం, గ్రూప్ –2 వారికి పట్టణాల్లో 64 శాతం, గ్రామాల్లో 49 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి కనిపించాయి. -
కరోనాకు మరో వ్యాక్సిన్, ఇది అన్నిటికంటే స్పెషల్!
బెంగళూరు: గది ఉష్ణోగ్రత వద్ద పని చేసే తొలి కరోనా వ్యాక్సిన్ ఇండియాలో రూపు దిద్దుకుంటోంది. ఇండియన్ ఇన్స్‌స్టిట్యూ్‌ట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) ఈ వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. బెంగళూరు వేదికగా ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు చేసిన ప్రయోగ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఐఐఎస్ చెబుతోంది. ఎలుకల్లో ప్రయోగాలు ఐఐఎస్ బెంగళూరులో మాలిక్యూలర్ బయో ఫిజిక్స్ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు కరోనాకు విరుగుడుగా పని చేసే మాలిక్యూల్‌ని కనుగొన్నారు. ఈ మాలిక్యూల్‌తో ఎలుకల్లో ప్రయోగాలు జరపగా యాంటీబాడీస్ పెరిగినట్టు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి కంటే ఎనిమిదిరెట్లు అధికంగా యాంటీబాడీలు ఎలుకల్లో తయారయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకల్లో చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడంతో మనుషుల్లో త్వరలోనే ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు అన్నీ శీతల ఉష్ణోగ్రతల్లోనే పని చేసేవిగా తయారయ్యాయి. కరోనాకు తొలి వ్యాక్సిన్‌గా వచ్చిన ఫైజర్ అయితే ఏకంగా మైనస్ 71 సెల్సియస్ డిగ్రీల దగ్గర నిల్వ చేయాల్సి ఉంది. ఇక కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీలు 8 సెల్సియస్ డిగ్రీలు ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. దీంతో వ్యాక్సిన్ల నిల్వ, సరఫరా ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారుతోంది. కానీ ఐఐఎస్ బెంగళూరు రూపొందించిన వ్యాక్సిన్‌ను గది ఉష్ణోగ్రత వద్ద కూడా బాగా పని చేస్తోందంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సులువు అవుతుందంటున్నారు సైంటిస్టులు. -
రెండో డోసు లేటైతే భారీగా యాంటీబాడీలు
వాషింగ్టన్: వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఆలస్యం అయితే ఎక్కువ మేలు జరుగుతోందని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని మయో క్లినిక్ వ్యాక్సిన్ రీసెర్చ్ గ్రూప్ డైరెక్టర్, వైరాలజిస్ట్ గ్రెగొరీ పోలండ్ ఈ విషయాలను వెల్లడించారు. ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండో డోసుకు తీసుకునే కాలాన్ని పెంచడం ద్వారా యాంటీబాడీలు 20 శాతం నుంచి 300 శాతం ఎక్కువగా పెరుగుతాయని తేలిందని గ్రెగొరీ చెప్పారు. దాదాపు అన్ని రకాల వ్యాక్సిన్లలో ఈ తరహా ఫలితాలే చూసినట్లు వెల్లడించారు. మొదటి డోసు వ్యాక్సిన్‌వేసిన వారికి రెండో డోసు వ్యాక్సినేషన్ కూడా కేటాయిస్తున్న నేపథ్యంలో చాలామందికి వ్యాక్సిన్ అందడం ఆలస్యమవుతోందని.. అయితే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి వ్యాక్సినేషన్ ఆలస్యం చేసి ఇతరులకు ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
‘ఓ’ గ్రూప్ రక్తం ఉన్న వారికి కరోనా రిస్క్ తక్కువ, వారికి మాత్రం!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న పెనుభూతం కరోనా. ఈ వైరస్ బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాలని, మాంసం అధికంగా తినాలన్న సూచనలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. నిజానికి మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. అంతేకాదు ‘ఓ’ గ్రూప్ రక్తం ఉన్నవారు కూడా కరోనా బారినపడే అవకాశాలు తక్కువేనని తాజా పరిశోధనలో తేలింది. శాకాహారుల్లో సెరో–పాజిటివిటీ స్వల్పమేనని పరిశోధకులు అంటున్నారు. కోవిడ్–19 వ్యాధికి కారణమయ్యే సార్స్–కోవ్–2 వైరస్‌ను ఢీకొట్టే ప్రతిరక్షకాలు (యాంటీబాడీస్) ఎవరెవరిలో ఎక్కువగా ఉంటాయన్న దానిపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) పాన్–ఇండియా సెరో సర్వే నిర్వహించింది. సర్వేలో భాగంగా 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్ఐఆర్ ల్యాబ్‌ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతిరక్షకాల తీరును పరిశీలించారు. పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ‘బీ’, ‘ఏబీ’ గ్రూప్ రక్తం ఉన్నవారిలో సెరో పాజిటివిటీ అధికంగా ఉంటుందని, వారికి కరోనా రిస్క్ ఎక్కువని పరిశోధకులు తేల్చారు. ‘ఓ’ గ్రూప్ రక్తం ఉన్నవారికి ఈ వైరస్ వల్ల పెద్దగా ముప్పేమి ఉండదని అంటున్నారు. అంతేకాకుండా సిగరెట్ తాగేవారి గొంతులో జిగురు పొర ఏర్పడుతుందని, ఇది వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యయనంలోనూ ఇదే విషయం బయటపడింది. ప్రతిరక్షకాలు తగ్గడం వల్లే.. భారత్‌లో మొదటి వేవ్‌లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు గత ఏడాది సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తర్వాత తీవ్రత తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఈ ఏడాది మార్చి నుంచి కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీన్ని సెకండ్ వేవ్ అంటున్నారు. జనంలో ‘అర్థవంతమైన ప్రతిరక్షకాలు’ తగ్గడమే ఇందుకు కారణమని సీఎస్ఐఆర్ అభిప్రాయపడింది. చదవండి: ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో తేడా ఏంటి ? -
పాజిటివ్ అయితే వ్యాక్సిన్‌కు తొందర వద్దు
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్ అయిన వారు వ్యాక్సిన్ కోసం తొందర పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. చాలామంది కరోనా పాజిటివ్ అయ్యాక కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. మరికొంతమంది తొలి డోసు వ్యాక్సిన్ తర్వాత పాజిటివ్ అయ్యారు. వీళ్లు కూడా రెండో డోసు వేయించుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. పాజిటివ్ నుంచి కోలుకున్నాక కనీసం 8 వారాల వరకూ వ్యాక్సిన్ అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకోగానే శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయి ఉంటాయని, ఈ దశలో కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదని, మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. సీడీసీఏ, డబ్ల్యూహెచ్‌వోలో 90 రోజులు చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ తర్వాత ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలా అన్నదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. కానీ అమెరికాలోని సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ సంస్థ (సీడీసీఏ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాత్రం కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్న అనంతరం 90 రోజుల వరకూ వ్యాక్సిన్ అవసరం లేదని, ఆ తర్వాత వేయించుకోవాలని సూచించాయి. యాంటీబాడీస్ ఉంటాయి కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్నామంటేనే మనలో యాంటీబాడీస్ ఉన్నట్టు లెక్క. మూడు మాసాలు మళ్లీ కరోనా వచ్చే అవకాశం తక్కువే. ఆ తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుంది. కరోనా నుంచి కోలుకోగానే వ్యాక్సిన్ అవసరం లేదు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలి. –డా.చైతన్య, హృద్రోగ నిపుణులు, విజయవాడ -
ఒకసారి కరోనా వస్తే.. మళ్లీ రావడం చాలా అరుదేనట!
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇప్పుడు కరోనా సోకుతున్న వారంతా తొలిసారి ఆ వైరస్ బారినపడుతున్న వారే. ఇప్పటికే కోవిడ్ వచ్చి తగ్గిపోయినవారిలో మళ్లీ సోకుతున్నవారి సంఖ్య అత్యల్పంగా ఉంటోంది. యూరోపియన్ యూనియన్ వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (ఈయూ–సీడీసీ) దీనిపై క్షుణ్నంగా అధ్యయనం చేసి, తాజాగా నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సెకండ్, థర్డ్ వేవ్ కరోనా వ్యాపిస్తున్న అన్నిప్రాంతాల్లో కూడా రీఇన్ఫెక్షన్ పెద్దగా లేదని తేల్చింది. ఫస్ట్ వేవ్‌లో కరోనా వచ్చిన ప్రతి వెయ్యి మందిలో కేవలం ఇద్దరు ముగ్గురికే సెకండ్ వేవ్‌లో సోకే అవకాశం ఉందని పేర్కొంది. చాలా దేశాల్లో పరిశోధన చేసి.. ► అమెరికాలో 28,76,773 మంది కరోనా నెగెటివ్ వచ్చినవారు, అప్పటికే కరోనా వచ్చిపోయిన 3,78,606 మందిపై శాస్త్రవేత్తలు నాలుగున్నర నెలల పాటు అధ్యయనం నిర్వహించారు. అందులో అప్పటికి కరోనా సోకని (నెగెటివ్ వచ్చిన) వారిలో 3 శాతం మంది పాజిటివ్ అయ్యారు. అదే ఫస్ట్‌వేవ్‌లో సోకినవారిలో కేవలం 0.3 శాతం మందికి రీఇన్ఫెక్షన్ వచ్చింది. అమెరికాలో సెకండ్ వేవ్‌లో వైరస్ సోకినవారిలో 99.7 శాతం కొత్తవారేనని తేలింది. ► ఖతార్‌లో 43,400 మంది కరోనా బాధితులను 240 రోజులు పరిశీలించారు. మళ్లీ కరోనా వచ్చిందా, లేదా అనేదానిపై జీనోమ్ సీక్వెన్సింగ్స్ చేశారు. పాజిటివ్ వచ్చినవారిలో కొత్తరకం వైరస్ ఉందా, పాత వైరసే వచ్చిందా అని పరిశీలించారు. రీఇన్ఫెక్షన్ 0.1 శాతం మందికి మాత్రమే ఉన్నట్టు నిర్ధారించారు. ► బ్రిటన్‌లో థర్డ్ వేవ్ కొనసాగుతోంది. అక్కడి యూకే వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న సమయంలో.. ఆ వేరియెంట్ బారినపడ్డ 1,769 మందిపై, ఇతర రకాల వైరస్ సోకినవారిపై వేర్వేరుగా పరిశోధన చేశారు. యూకే వేరియెంట్ వారిలో వెయ్యిలో 11 మందికి రీఇన్ఫెక్షన్ రాగా.. నాన్ యూకే వేరియెంట్ల వారిలో ఏడుగురికి రీఇన్ఫెక్షన్ వచ్చింది. ► ఇక సిరెన్ అనే సంస్థ 20 వేల మంది ఆరోగ్య సిబ్బంది మీద అధ్యయనం చేసింది. వారిలో మొదటి వేవ్‌లో 6,614 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సెకండ్ వేవ్‌లో 362 మందికి పాజిటివ్ రాగా.. ఇందులో తొలిసారి కరోనా బారినపడ్డవారు 318 మందికాగా.. రీఇన్ఫెక్షన్కు గురైనవారు 44 మంది. అంటే సగటున వెయ్యిలో 22 మంది రీఇన్ఫెక్షన్ బారినపడ్డారు. వ్యాక్సిన్ వేసుకున్న వెయ్యి మందిలో ఇద్దరికి కరోనా కరోనా వచ్చిపోయిన వెయ్యి మందిలో ముగ్గురి వరకు మరోసారి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉండగా.. వ్యాక్సిన్లు వేసుకున్నవారిలో వెయ్యికి ఇద్దరు కరోనా బారినపడుతున్నారని సీడీసీ నివేదిక పేర్కొంది. అయితే వ్యాక్సిన్ వేసుకున్నవారికి కరోనా వస్తే.. ఆరోగ్య పరిస్థితి సీరియస్ కాకుండా వంద శాతం రక్షణ లభిస్తుందని తెలిపింది. ఇజ్రాయిల్‌లో మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత కరోనా వచ్చినవారిలో.. మామూలు వారితో పోలిస్తే వైరస్ లోడ్ నాలుగో వంతు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. వ్యాక్సిన్ వల్ల యాంటీబాడీస్ వృద్ధి చెంది, కరోనా వైరస్‌ను అడ్డుకుంటున్నాయని, టీ సెల్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. అయితే దక్షిణాఫ్రికా వేరియెంట్ కరోనా వైరస్‌పై మాత్రం ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావం 25 శాతమే ఉంటోందని.. యూకే వేరియెంట్‌పై 60 శాతం ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. రీఇన్ఫెక్షన్ తక్కువని నిర్లక్ష్యం తగదు ‘ఫస్ట్ వేవ్‌లో కరోనా వచ్చిన వారికి సెకండ్ వేవ్‌లో రీఇన్ఫెక్షన్ రావడం చాలా స్వల్పమని ఈయూ సీడీసీ చెబుతోంది. భారత్‌లో అదే పరిస్థితి ఉంది. అలాగని ఫస్ట్ వేవ్‌లో కరోనా వచ్చి పోయిన వారు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం. కరోనాలో కొత్త స్ట్రెయన్లు వస్తున్నాయి. వాటిపై వ్యాక్సిన్ల ప్రభావం తక్కువ. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ మన దగ్గర రీఇన్ఫెక్షన్ కేసులు తక్కువే.. మన దేశంలో, రాష్ట్రం లో రీఇన్ఫెక్షన్ కేసులు తక్కువే. కరోనా వచ్చిపోయిన వారి శరీరం లో యాంటీబాడీస్ ఉండటం, లేదా టీ సెల్స్ నుంచి రక్షణ దొరకడమే రీఇన్ఫెక్షన్ రాకపోవడానికి కారణం. వారిపై వైరస్ ప్రభావం చూపించకున్నా.. వారి ద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్ ఏవీ గురవారెడ్డి, సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ ( చదవండి: క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి! ) -
బట్టలు, బూట్లు వైరస్‌ను తెస్తే.. ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఇలా
కరోనా సెకండ్‌వేవ్ ఆరంభమైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక పక్క టీకా కార్యక్రమం కొనసాగుతున్నా సమాజంలో కేసులు పెరగడంపై ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు డెవలప్ అయ్యేందుకు సమయం పడుతుంది, ఈలోపు వారు భౌతిక దూరం లాంటి నిబంధనలు పాటించక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా బారిన పడే ఛాన్సులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక నష్టానికి భయపడి ప్రభుత్వాలు లాక్డౌన్ ఆలోచన చేయడం లేదు. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ ప్రభావాన్ని తప్పించుకోవాలంటే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పదని వైద్య, ఆరోగ్య నిపుణుల సూచన. కరోనా రూపుమార్చుకొని కొత్త స్ట్రెయిన్ల రూపంలో పంజా విసురుతుంది కాబట్టి తొలిదశ కన్నా మరింతగా అప్రమత్తత అవసరమంటున్నారు. కొత్త స్ట్రెయిన్లు, సెకండ్‌వేవ్ ఆరంభం సందర్భంగా కరోనా, దానిపై వినిపించే రూమర్లు, నిజాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు.. తదితర అంశాలపై పునరావలోకనం ఈవారం ప్రత్యేకం.... సంవత్సర కాలంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు బలిగొంది. కరోనాకు టీకాలు కనుగొన్నా అన్ని దేశాల్లో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయిలు రాలేదు. మరోవైపు కరోనా సెకండ్‌వేవ్ పలు దేశాల్లో ఆరంభమై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా బయటపడినప్పటినుంచి ఈ వైరస్‌ను ఫలానా ఫలానా వాటితో నిర్మూలించవచ్చంటూ రకరకాలు అపోహలు బయలుదేరాయి. వీటిలో కొన్ని కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సాయపడినా, వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు. కరోనాపై అపోహలు, వాస్తవాల గురించి ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. కరోనా విపత్కర కాలంలో ‘ఇందుగలదందు లేదని’ అన్నట్లు ఈ వైరస్ ఏ వస్తువుపై ఉందో... వాటి ద్వారా ఎప్పుడు? ఎలా? ఒంట్లోకి, ఇంట్లోకి చొరబడుతుందోనని జనంలో భయం... ఏదో ఒక పని మీద బయటకెళ్లి తిరిగి వచ్చినప్పుడు తమతోపాటే వైరస్‌ను మోసుకొచ్చామేమో అనే కలవరపాటు.. మాస్క్ వేసుకొని ఉన్నా, భౌతిక దూరం పాటించినా, చేతులను శానిటైజ్చేసినా, ఇంటికి రాగానే ముట్టుకున్న డోర్, తాళం వంటి వాటిని, మార్కెట్ నుంచి తెచ్చిన వస్తువులను రసాయనాలతో క్రిమిరహితం చేసినా ఇంకా ఎక్కడో ఏదో అనుమానం.. ఇందులో ఒక కారణం దుస్తులు, బూట్లు. వీటి ద్వారా వైరస్ ఇంట్లోకి వచ్చిందేమో అనే సందేహం. ఈ ఆందోళనలపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. వాహకాలే.. కానీ.. ప్లాస్టిక్, ఇనుము, రాగి వస్తువులు కొవిడ్ వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తాయనే సంగతి తెలిసిందే. అలాగే దుస్తులు, బూట్లు సైతం ఈ వైరస్‌కు ఆశ్రయమిస్తాయి. కానీ వీటి ద్వారా వైరస్ వ్యాపించిందనడానికి సరైన ఆధారాలు లేవంటున్నారు వైద్య నిపుణులు. ‘ఈ వైరస్ గురించి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దుస్తులు, బూట్ల ద్వారా ఇతరులకు వ్యాపించినట్లు ఆధారాలు లేవు’ అని అమెరికాలోని ఓర్లాండోలో ఉన్న అడ్వాంట్హెల్త్ కేంద్రం నిపుణులు చెప్పారు. వాస్తవానికి వస్తువు ఉపరితలాన్ని బట్టి వైరస్ కొన్ని గంటల నుంచి రోజుల వరకు వాటిపై మనగలుగుతుంది. ఇందులో ఇనుము, ప్లాస్టిక్‌పై అత్యధికంగా 2 నుంచి 3 రోజుల వరకు ఉండగలుగుతుంది. అలాగే దుస్తులు, బూట్లపైనా కొన్ని గంటల పాటు జీవిస్తుంది. అంటే కఠిన ఉపరితలం ఉండే వస్తువులతో పోలిస్తే దుస్తులపై వైరస్ ఎక్కువ సేపు మనలేదు. కారణం.. వైరస్ ఎక్కువ రోజులు ఉండడంలో వాతావరణం, తేమ, ఆర్ధ్రతది కీలకపాత్ర. దుస్తుల స్వభావం దీనికి విరుద్ధం కాబట్టి ఎక్కువ సేపు బతకలేదు. తరచూ ఉతకడం.. దుస్తుల వల్ల వైరస్ వ్యాపించినట్లు ఆధారాలు లేకపోయినప్పటికీ, కచ్చితంగా రాదు అనీ చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల కొవిడ్ రోగులకు సేవలు చేసే వాళ్లు.. ముఖ్యంగా ఆరోగ్య సిబ్బంది తమ దుస్తులను తరచూ డిటర్జంట్లతో ఉతికి, ఇస్త్రీ చేసుకోవడం మేలంటున్నారు. అయితే, మార్కెట్‌కో, సరకుల దుకాణానికో వెళ్లి వచ్చిన ప్రతిసారి ఇలా చేయాల్సిన అవసరం లేదంటున్నారు. భౌతిక దూరం పాటించడం కష్టమైనప్పుడు, లేదా ఎవరైనా దుస్తుల మీద పడేలా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాత్రం ఇంటికి రాగానే వాటిని ఉతికి, ఇస్త్రీ చేయాలని సూచిస్తున్నారు. షూ సంగతి? సాధారణంగా దుస్తులతో పోలిస్తే బూట్లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. అలాగే వీటిపైనా కరోనా వైరస్ చేరుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సర్వేలో తేలింది. దీనికోసం పరిశోధకులు చైనాలో కొవిడ్ వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించిన కొంత మంది వైద్యుల బూట్లను పరిశీలించినప్పుడు వాటి కింది భాగంలో వైరస్ ఉండడాన్ని గుర్తించారు. అయితే, సాధారణంగా బూట్లను ఇంట్లోకి తీసుకురావడం అరుదు. ఇంటిబయట తలుపు వద్దనే వదులుతారు. ఒకవేళ వాటిని ఇంట్లోకి తీసుకురావాల్సి వస్తే బయటే మొదట డిజర్జంట్ నీళ్లు లేదా రసాయనాలతో శుభ్రం చేయాలి. లేదా వాటిని ఇంటి బయట ప్రత్యేక స్థలంలో వదలాలి. దుస్తులు, షూ ద్వారా వైరస్ రావడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అయితే, అన్నింటికంటే ముఖ్యం మార్కెట్‌కు, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం. వీటిని మాత్రం కచ్చితంగా పాటించాలనేది వైద్య నిపుణులు స్పష్టంగా చెప్పేమాట. -దుర్గరాజు శాయి ప్రమోద్ చదవండి: (కరోనా ప్రమాద ఘంటికలు.. తెలుసుకోవాల్సిన విషయాలు) -
యాంటీబాడీస్‌తో పుట్టిన మొదటి చిన్నారి!
మనందరికీ తెలుసు ఇప్పటివరకూ రకరకాల వయసుల వారికీ, ఎన్నోరకాల జబ్బులున్నవారికీ, మరెన్నో రకాల ఆరోగ్య సమస్యలున్నవారికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చి ట్రయల్స్ నిర్వహించారు. కానీ ఎందుకైనా మంచిదంటూ మొదట్లో గర్భవతుల మీద, 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల మీద ట్రయల్స్ జరగలేదు. అయితే ఇప్పుడు ఆ ట్రయల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే దాదాపు ప్రసవానికి రెడీగా అంటే... తొమ్మిదినెలలప్పుడు నెలలుపూర్తిగా నిండిన గర్భవతికి (ఖచ్చితంగా చెప్పాలంటే 36 వారాల మూడురోజుల గర్భవతి గా ఉన్నప్పుడు) కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి చూశారు. ఆ గర్భవతికి మాడర్నాఎమ్ఆర్ఎన్ఏ తరహా వ్యాక్సిన్ ఇచ్చి పరిశీలించారు. మరో మూడు వారాల తర్వాత ఆమెకు పండంటి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా చురుగ్గా ఉంది. చిన్నారి పాప పుట్టిన వెంటనే ఆమె నుంచి రక్తం సేకరించి పరిశీలించి చూశారు. విచిత్రం ఏమిటంటే... అప్పుడే పుట్టిన ఆ చిన్నారి కూడా దేహంలో పుష్కలమైన యాంటీబాడీస్‌తో పుట్టడం చూసి ఆశ్చర్యపోవడం శాస్త్రవేత్తల వంతయ్యింది. దీన్ని బట్టి తేలుతున్నదేమిటంటే... గర్భవతిగా ఉన్న కాబోయే తల్లికి వ్యాక్సిన్ ఇచ్చినా లేదా గర్భవతిగా ఉన్న మహిళకు కోవిడ్ వచ్చినా... బొడ్డుతాడు (ప్లాసెంటా) ద్వారా ఆ యాంటీబాడీస్ చిన్నారుల్లోకి కూడా ప్రవేశించి, వారికీ రక్షణ కల్పిస్తాయని తేలింది. అంటే కాబోయే తల్లికి వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల కొంతమేర బిడ్డకు సైతం కరోనా వైరస్ నుంచి రక్షణ కలుగుతుందని చాలావరకు తేలిందంటున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న అమెరికాలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు పాల్ గిల్బర్ట్, చాడ్ రడ్నిక్లు. అయితే ఇలా ఇచ్చిన ఈ వ్యాక్సిన్ల ప్రభావం (ఎఫెకసీ) బిడ్డలో ఖచ్చితంగా ఎంత ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. అంతేకాదు... ఇలా గర్భవతులకు వ్యాక్సిన్ ఇచ్చాక... బిడ్డ పుట్టిన అనంతరం... ఆ చిన్నారులకు రొమ్ముపాలు పడుతూ... తద్వారా ఆ వ్యాక్సిన్ ప్రభావం ఎంత ఉందో కూడా చూడాలంటున్నారు పరిశోధకులు. అయితే ఇవి కేవలం తొలి దశ పరిశోధనలు మాత్రమే కావడంతోనూ, ఇంకా పరిశోధనలూ, ట్రయల్స్ జరుగుతుండటం వల్లనూ కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం గర్భవతులూ... వారి గర్భస్థ శిశువులపై ఎలా ఉంటుందనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ ఆశారేఖగా కనిపించే విషయం ఒక్కటే... ఇప్పటికి వస్తున్న ఫలితాల మేరకు గర్భవతుల్లోనూ వ్యాక్సిన్ చాలావరకు సురక్షితమేననీ, బిడ్డకు సైతం గర్భస్థపిండానికీ, కడుపులో ఎదుగుతున్న శిశువుకూ అది హాని చేయకపోగా... ఎంతోకొంత సంరక్షణ ఇస్తుందనే సానుకూల ఫలితాలు వస్తుండటంతో పరిశోధకులు చాలా ఆశావహంగా, ఆనందంగానే ఉన్నట్లు తొలి పరిశీలనల ద్వారా తెలుస్తోంది. l -
కరోనా యాంటీ బాడీస్‌తో పాప పుట్టింది
ఫ్లొరిడా: కరోనా పేరు తలిస్తేనే గుండె గుభేలుమనే పరిస్థితి. దాన్నుంచి రక్షణకు టీకా వేసుకోవడమే మార్గం. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో, వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కరోనా యాంటీ బాడీస్ తయారవుతాయి. శరీరంలోకి వైరస్ ఎంటరవకుండా పోరాడుతాయి. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలోని ఫ్లారిడాలో ఓ చిన్నారి కరోనా యాంటీ బాడీస్‌తోనే పుట్టింది. వైరస్ వచ్చినా గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా జన్మించింది. పాప పుట్టాక బొడ్డుతాడు నుంచి తీసిన రక్తంతో పరీక్షలు చేసిన వైద్యులు పాల్ గిల్బర్ట్, చాడ్ రుడ్నిక్ ఈ విషయాన్ని నిర్ధారించారు. చిన్నారి కడుపులో ఉన్నప్పుడే ఆమె తల్లి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుందని, దానివల్ల చిన్నారిలోనూ యాంటీ బాడీస్ ఏర్పడ్డాయని తేల్చారు. అయితే ఈ యాంటీ బాడీస్ ఎంతకాలం ఉంటాయి, వీటి నుంచి ఎంత వరకు రక్షణ ఉంటుం దన్నది పరిశోధకులు తేల్చాల్సి ఉందని వారు చెప్పారు. దానివల్ల గర్భంతో ఉన్న మహిళలకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల ఏర్పడే పరిస్థితులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. -
కరోనా యాంటీబాడీస్‌పై కీలక సర్వే, వివరాలివే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి యాంటీబాడీస్ (ప్రతి దేహకాలు) అభివృద్ధి చెందాయి. ఈ మేరకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) మంగళవారం వివరాలు వెల్లడించాయి. కోవిడ్‌పై పోరాడే యాంటీబాడీస్ రాష్ట్ర వ్యాప్తంగా 24.1% మందిలో ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందని పేర్కొంది. డిసెంబర్లో జనగాం, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో మూడో విడత సీరో సర్వే జరిగింది. ఆ వివరాలను ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. జనగాం జిల్లాలో మే నెలలో 0.49%, ఆగస్టులో 18.2%, డిసెంబర్లో 24.8% మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. నల్లగొండ జిల్లాలో మేలో 0.24 శాతం, ఆగస్టులో 11.1%, డిసెంబర్లో 22.9 శాతం యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. కామారెడ్డి జిల్లాలో మేలో 0.24%, ఆగస్టులో 6.9%, డిసెంబర్లో 24.7 శాతం అభివృద్ధి చెందాయి. ఆ ప్రాంత సీరో సర్వేను రాష్ట్రానికి వర్తింపచేయగా, గతేడాది మేలో మొదటి సీరో సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 0.33 శాతం మాత్రమే కరోనా యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత ఆగస్టులో రెండో సీరో సర్వేలో 12.5 శాతం జనాభాలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు తేలింది. గత డిసెంబర్లో జరిపిన మూడో సర్వేలో 24.1 శాతం మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయని తెలిపాయి. దేశవ్యాప్తంగా 3 రెట్లు వృద్ధి ఆగస్టుతో పోలిస్తే డిసెంబర్లో దేశవ్యాప్తంగా సగటున యాంటీబాడీస్ 3.1 రెట్లు పెరగగా, తెలంగాణలో 2 రెట్లు పెరిగినట్లు ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ అమలు చేయడం, మాసు్కలు ధరిం చడం వల్ల ఇప్పటికీ వైరస్ వ్యాప్తి నెమ్మదిగా, నిలకడగా ఉందని ఐసీఎంఆర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. అయితే మున్ముందు కూడా ప్రజలు మాస్కులు ధరించాలని, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని కోరారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సర్వే.. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సీరో సర్వే జరుగుతోందని, తమ అంచనా ప్రకారం దాదాపు 50 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందే అవకాశం ఉందని డాక్టర్ లక్ష్మయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 17 నుంచి జనవరి 8 వరకు నిర్వహించిన మూడో సీరో సర్వేలో 21.5 శాతం మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయని ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ వెల్లడించాయి. గతేడాది మే 11 నుంచి జూన్ 4 మధ్య నిర్వహించిన సర్వేలో 0.7 శాతం మందిలో, ఆగస్టు 17 నుంచి సెపె్టంబర్ 22 మధ్య నిర్వహించిన సర్వేలో 7.1 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందాయని తెలిపాయి. దేశవ్యాప్తంగా మూడో సర్వేలో మహిళల్లో 22.7 శాతం, పురుషుల్లో 20.3 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు వెల్లడించాయి. వయసు వారీగా చూస్తే 10–17 ఏళ్ల వయసు వారిలో 25.3 శాతం, 18–44 ఏళ్ల వయసు వారిలో 19.9 శాతం, 45–60 ఏళ్ల మధ్య వయసు వారిలో 23.4 శాతం, 60 ఏళ్లు పైబడిన వారిలో 23.4 శాతం యాంటీబాడీస్ అభివృద్ధి అయినట్లు తెలిపాయి. మూడో సర్వే ప్రకారం ఆరోగ్య కార్యకర్తల్లో 25.7 శాతం యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు వెల్లడించాయి. కాగా, డాక్టర్లు, నర్సుల్లో మాత్రం అత్యధికంగా 26.6 శాతం యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. యాంటీ బాడీస్ అంటే? వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రెండు రకాల రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. వాటినే బీ సెల్ ఆధారిత, టీ సెల్ ఆధారిత రోగ నిరోధక శక్తి అంటారు. బీ సెల్ ఆధారిత రోగ నిరోధక శక్తి వల్ల మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఇవి రెండు రకాలు. వాటినే ఐజీఎం, ఐజీజీ అంటారు. మన శరీరంలో కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన వారం రోజుల్లో యాంటీ బాడీల ఉత్పత్తి మొదలవుతుంది. యాంటీబాడీస్ ఉన్నాయంటే గతంలో కరోనా ఇన్ఫెక్షన్ వచ్చి పోయినట్లు అర్థం. ఇవి ఎన్ని నెలలు ఉంటాయనేది వైరస్ రకాన్ని బట్టి ఉంటుంది. ఐసీఎంఆర్ అంచనా ప్రకారం కోవిడ్‌లో అవి ఆరు నెలలు ఉంటాయి. -
కరోనా చికిత్స.. కొత్త వారికి మాత్రం మేలు
కోవిడ్ కట్టడికి ప్రపంచమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంటే.. అమెరికాకు చెందిన ఎలి లిలీ అనే ఫార్మా కంపెనీ మరో శుభవార్త తెచ్చింది. యాంటీబాడీలతో కోవిడ్ చికిత్స చేసేందుకు తాము జరిపిన ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయని ప్రకటించింది. బామ్లానివిమాబ్ పేరుతో తాము సిద్ధం చేసిన యాంటీబాడీలు 80 శాతం సామర్థ్యాన్ని కనబరిచినట్లు తెలిపింది. మూడోదశ ప్రయోగాలకు సంబంధించిన ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది. వ్యాక్సిన్ వేయించుకోలేని వారికి కరోనా నుంచి రక్షణ పొందే వీలు కలుగుతుందని కంపెనీ ప్రకటించింది. వైరస్‌లను ఎదుర్కొనే యాంటీబాడీల తయారీకి టీకాలు ఉపయోగపడతాయన్నది మనకు తెలిసిన విషయమే. కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలతో చికిత్స చేస్తే అది ప్లాస్మా థెరపీ అంటారు. ఎలి లిలీ అభివృద్ధి చేసిన కొత్త చికిత్స పద్ధతిలో పరిశోధనశాలలో అభివృద్ధి చేసిన యాంటీబాడీలను శరీరంలోకి ఎక్కిస్తారు. గతేడాది అక్టోబర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రిజెనెరాన్ అనే కంపెనీ తయారు చేసిన యాంటీబాడీలను తీసుకుని, బాగా పనిచేస్తుందని కితాబిచ్చారు కూడా. గతేడాది నవంబర్లోనే ఎలి లిలీ ‘బామ్లానివిమాబ్’కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ (ఎఫ్‌డీఐ) అత్యవసర అనుమతులు ఇచ్చింది. అయితే వ్యాధి బాగా ముదిరాక యాంటీబాడీలు ఇవ్వడం వల్ల పరిస్థితి మరింత క్షీణించే అవకాశముందని కొన్ని హెచ్చరికలు వినిపించాయి. కొత్త వారికి మాత్రం మేలు.. కొత్తగా వ్యాధి బారిన పడిన వారిపై మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స సత్ఫలితాలు ఇస్తుందని ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు నిరూపించాయి. ఇప్పుడు ఎలి లిలీ బామ్లాని విమాబ్ మూడో దశ మానవ ప్రయోగాలు కూడా దాన్ని రూఢీ చేశాయి. వ్యాధి సోకక ముందు కూడా ముందు జాగ్రత్త చర్యగా దీన్ని వాడొచ్చని కంపెనీ చెబుతోంది. గతేడాది ఆగస్టులో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో మూడో దశ మానవ ప్రయోగాలు చేశామని, సిబ్బందితో పాటు రోగులకు కూడా బామ్లానివిమాబ్, ఉత్తుత్తి మందులను అందించామని కంపెనీ తెలిపింది. ఫలితాలను పరిశీలిస్తే బామ్లానివిమాబ్ తీసుకున్న వారిలో 80 శాతం మందికి వ్యాధి సోకలేదని పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్త మైరాన్ కోహెన్ తెలిపారు. మూడో దశ మానవ ప్రయోగాలు కొనసాగు తున్నాయని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్ -
కరోనా టీకా.. ఓ బాధ్యత!
►కరోనా టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది. శాస్త్రవేత్తల ప్రయోగాలు ఎంతవరకు వచ్చాయి. దాని ధర ఎంత వరకు ఉండొచ్చు. ఇవీ కొన్ని నెలల క్రితం వరకూ సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరిలోనూ మెదిలిన ప్రశ్నలు ►మరి ఇప్పుడు.. హడావుడిగా తీసుకొచ్చిన టీకా ఎంత మేరకు పనిచేస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్నాక వచ్చే దుష్ప్రభావాల మాటేమిటి. టీకా వేసుకున్నా మాస్కు ఎందుకు. ప్రజల్లో ఈ అనుమానాల నివృత్తికి డబ్ల్యూహెచ్‌వో తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్‌తోనే వ్యక్తిగత, కుటుంబసభ్యులకు రక్షణ ఉంటుందని, తద్వారా మొత్తం సమాజం మహమ్మారిని పారదోలుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగతమే కాదు.. సామాజిక బాధ్యత కూడా అని పేర్కొంది. టీకా వేసుకొనే విషయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించింది. సోషల్ మీడియాలో కొందరి వ్యతిరేక ప్రచారం, సామాజిక వాతావరణం, భయాందోళనలు, లేనిపోని అనుమానాల వల్లే ఇప్పటికిప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది వెనకాడుతున్నారని తాజా నివేదికలో తెలిపింది. ఇందుకుగల కారణాలు తెలుసుకొని అందరూ టీకా వేసుకొనేలా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించింది. చదవండి: (‘బ్రిటన్’ భయం!) చుట్టుపక్కల వాతావరణ ప్రభావం... ‘వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అనే విషయంలో ప్రజల్లో ఉండే సంశయాలకు కారణాలు మూడు రకాలు. అవి చుట్టుపక్కల పరిస్థితులు, బయటి సమాజ పరిస్థితులు, వ్యక్తిగత ఆలోచనలు. కొందరు వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుం టారు. కాబట్టి దీనిపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టాలి. కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ తప్పనిసరి అంటున్నారా లేదా అనే దానిపై కూడా ప్రజలు టీకా వేసుకోవాలా లేదో నిర్ధారణకు వస్తారు. దుష్ప్రభావాలు, ఉపయోగాల వంటి వాటి విషయంలో సరైన సమాచారం ఉంటే కూడా ప్రజలు ముందుకు వస్తారు. స్వచ్ఛందంగా వేసుకొనే పద్ధతి వల్లే వ్యాక్సిన్ విజయవంతం అవుతుంది. వ్యాక్సిన్ వేసుకోవడానికి దూరం వెళ్లాలా? క్యూలో నిల్చోవాలా? ఇవి కూడా వ్యాక్సిన్‌ను వేసుకునే వారిని ప్రభావితం చేస్తాయి’అని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. ‘ఫ్రంట్‌లైన్’తో సామాన్యుల్లో ధైర్యం... ‘వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి ముందుగా టీకా వేయడం వల్ల ప్రజల్లో వ్యాక్సిన్‌పై నమ్మకం ఏర్పడుతుంది. ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వేసుకున్నాక వారి ద్వారా ప్రచారం చేయించాలి. ఇందుకోసం మీడియా సహకారం తీసుకోవాలి. టీకాలు వేసుకొనే ప్రముఖుల ద్వారా కూడా ప్రచారం నిర్వహించాలి’అని డబ్ల్యూహెచ్‌వో ప్రభుత్వాలకు సూచించింది. వేసుకోకుంటే వచ్చే నష్టాలు చెప్పాలి... ‘చాలా మంది వారిలో కరోనా వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే అంశాన్ని బేరీజు వేసుకుంటారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా సైడ్‌ఎఫెక్టŠస్ వస్తాయా? అనవసరంగా వేసుకుంటున్నామా? అని ఆలోచిస్తారు. అందువల్ల వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల జరిగే నష్టాలను ఎక్కువగా ప్రచారం చేయాలి. వ్యాక్సిన్ అనేది వ్యక్తిగతమే కాదు, అది సమాజానికి, పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఎంత ప్రయోజనమో చెప్పాలి’అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. యాంటీబాడీలు ఏర్పడే దాకా జాగ్రత్తలు పాటించాలి... వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా మాస్క్ పెట్టుకోవాలని పదేపదే చెప్పడం వల్ల వ్యాక్సిన్‌పై ప్రజల్లో అపనమ్మకాలు ఏర్పడతాయి. టీకానే దివ్యౌషధం అంటున్నప్పుడు మళ్లీ మాస్క్ ఎందుకు వాడాలనే సందేహం ప్రజల్లో తలెత్తుతుంది. వాస్తవానికి మాస్క్ ఎందుకు పెట్టుకోవాలంటే వ్యాక్సిన్ రెండు డోసుల్లో రెండుసార్లు వేస్తారు. ఆ రెండు డోసుల మధ్య కాలవ్యవధి 28 రోజులు. రెండో డోసు వేసుకున్న 14వ రోజుకు అంటే మొత్తంగా 42 రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. అప్పటివరకు జాగ్రత్తలు పాటించక తప్పదు. దీనిపైనే ప్రజలకు అవగాహన కల్పించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి 53% భారతీయులు నో దేశంలో 53 శాతం మంది ప్రజలు ఇప్పటికిప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి సుముఖంగా లేరని తాజా ఆన్లైన్ అధ్యయనంలో వెల్లడైంది. కేవలం 47 శాతం మందే వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆన్లైన్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించే ‘జీవోక్యూఐఐ’అనే సంస్థ పేర్కొంది. అయితే సుముఖంగా లేని 53 శాతం మందిలో 80 శాతం మంది మాత్రం వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు నమ్మకం కుదిరితే వేసుకుంటామని పేర్కొన్నట్లు తెలిపింది. అందులో మిగిలిన 20 శాతం మంది మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో టీకా తీసుకోబోమని తేల్చిచెప్పినట్లు జీవోక్యూఐఐ వివరించింది. వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్న వారిలో 48 శాతం మంది పురుషులు, 42 శాతం మంది మహిళలు ఉన్నట్లు చెప్పింది. 45 ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి సిద్ధంగా లేరని సర్వే పేర్కొంది. జీవోక్యూఐఐ చేపట్టిన ఈ ఆన్లైన్ సర్వేలో సుమారు 11 వేల మంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. -
కొత్త కరోనా: భారత్‌లో ఆందోళన అవసరం లేదు!
బ్రిటన్, దక్షిణాఫ్రికాలో సెప్టెంబర్ నుంచే కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు 70 శాతం ఉన్నా.. అంత ప్రమాదకరం కాదనే భావిస్తున్నాం. ఎందుకంటే బ్రిటన్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన వ్యాక్సిన్ ఈ కొత్త వైరస్‌పై ప్రభావం చూపుతుందని అంచనా. యువతరం అధికంగా ఉండటం, ఊబకాయం, బీపీ, గుండె సంబంధిత రోగులు తక్కువగా ఉండటం మంచి విషయం. సాక్షి, హైదరాబాద్: పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఎదురవుతున్న సమస్యలతో పోలిస్తే భారత్‌లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తక్కువగా సెకండ్ వేవ్ రావొచ్చని, జనవరిలో మళ్లీ కేసులు పెరిగే అవకాశాలున్నాయని, అయితే అది పెద్ద ఆందోళన కరమైనది కాకపోవచ్చని పేర్కొన్నారు. జనవరి నాటికి వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే, ఏప్రిల్ కల్లా వ్యాక్సిన్లు అందిస్తే.. మే నాటికి కేసులు తగ్గుముఖం పడతాయని చెప్పారు. వచ్చే అక్టోబర్ కల్లా సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయుల్లో రోగ నిరోధకశక్తి కాస్త ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా సంబంధిత అంశాలంపై ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా.నాగేశ్వర్‌రెడ్డి తెలిపిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. ఇక్కడ తక్కువగానే కేసులు..: అమెరికా, ఐరోపాలతో పోలిస్తే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అమెరికా, లండన్‌లో థర్డ్ వేవ్ కూడా వచ్చేసింది. భారత్‌లో ఫస్ట్ వేవ్ మాత్రమే ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ కేసులు నమోదు అవుతుండటంతో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో సెప్టెంబర్ నుంచే కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు 70 శాతం ఉన్నా.. అంత ప్రమాదకరం కాదనే భావిస్తున్నాం. ఎందుకంటే బ్రిటన్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన వ్యాక్సిన్ ఈ కొత్త వైరస్‌పై ప్రభావం చూపుతుందని అంచనా. యువతరం అధికంగా ఉండటం, ఊబకాయం, బీపీ, గుండె సంబంధిత రోగులు తక్కువగా ఉండటం మంచి విషయం. చదవండి: (కరోనా కొత్త అవతారం!) అధిక రోగ నిరోధకతపై పరిశోధన.. భారతీయుల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండటం, జన్యుపరంగా రక్షణలు, వైరస్ ప్రవేశించే తీరు తక్కువగా ఉండటం, హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ నిరోధక వ్యవస్థ.. మన దేశంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ఏఐజీలో పరిశోధనలు నిర్వహిస్తున్నాం. దీని వివరాలు మరో నెలలో వెల్లడిస్తాం. వ్యాక్సిన్‌పై ట్రయల్స్ మేమూ నిర్వహించాం. ఇక్కడి వ్యాక్సిన్లు 70 శాతానికిపైగా ప్రభావం చూపుతున్నాయి. ఇండియాలో లేని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఫైజర్, మోడర్నా 95 శాతం కచ్చితత్వం ఉన్నట్లు వెల్లడైంది. వ్యాక్సిన్ల ధరలు, భద్రపరచడం మన దేశంలో కాస్త సమస్య. ఈ వ్యాక్సిన్లను అత్యల్ప ఉష్ణోగ్రతల్లో భద్రపరచాల్సి ఉంటుంది. ఇక్కడి పెద్ద పట్టణాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో ఈ వెసులుబాటు లేకపోవడం మైనస్. ఇండియాలో ఆక్స్ఫర్డ్, భారత్ బయోటెక్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు తొందరగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. గర్భిణులు,16 ఏళ్లలోపు వారు మినహా.. గర్భిణులు, 16 ఏళ్లలోపు పిల్లలు మినహా అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్న వారు వ్యాక్సిన్లు తీసుకుంటే యాంటీబాడీస్ ఏర్పడతాయి. మొదటి డోస్ తీసుకున్నాక 3, 4 వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 15 రోజులకు యాంటీబాడీస్ ఏర్పడతాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశం కావడంతో భారత్‌లో ఇప్పటికీ ఇంకా 20 నుంచి 30 శాతమే హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడినట్లు అంచనా. అలాగే వ్యాక్సిన్ వచ్చే వరకు మాస్క్ శ్రీరామ రక్ష. అయితే బయటికి వెళ్లినప్పుడే మాస్క్ ధరించాలి. ఇంట్లో ఉన్నప్పుడు అవసరం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి భారత్‌లో మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. కోవిడ్‌పై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు చైతన్యం కలిగించింది. సోషల్ మీడియాలో మాత్రం కొంత అసత్యాల ప్రచారం జరిగి భయాలు ఏర్పడ్డాయి. మొత్తం కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుంటే 30 శాతం కంటే ఎక్కువగా గ్యాస్ట్రో ఎంటరాలజీ సంబంధిత సమస్యలతో కూడుకున్నవే ఉన్నాయి. డయేరియా, వాంతులు, కడుపులో నొప్పి, బరువు తగ్గుదల, వాసన కోల్పోవడం వంటి కారణాలతో ఈ కేసులు ట్రేస్ అయ్యాయి. చదవండి: (బ్రిటన్ నుంచి ముంబైకు ఐదు విమానాలు!) పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు... భారత్‌లో జీర్ణకోశ సంబంధ వ్యాధులు, వాటితో ముడిపడిన సమస్యలు పెరుగుతున్నాయి. ఆహారం, నీరు కలుషితం కావడం, పరిశుభ్రత పాటించకపోవడం, హెపటైటిస్ బీ, సీ వైరస్ సోకడం, జీవనశైలిలో మార్పులే ఇందుకు ప్రధాన కారణం. ధూమపానం, మద్యం అలవాట్లు పెరుగుతున్నాయి. పెయిన్ కిల్లర్ మందులు విచక్షణారహితంగా వాడుతున్నారు. దీంతో అసిడిటీ పెరుగుతోంది. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు కరోనాకే కాకుండా హెపటైటిస్ బీ, ఏ వ్యాక్సిన్లు కూడా తీసుకుంటే మంచింది. -
భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందా?
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిర్వహించిన సెరో సర్వేల ద్వారా చాలామందిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు స్పష్టమైంది. కొన్ని ప్రాంతాల్లో 60–70 శాతం యాంటీబాడీలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పుణేల్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి కోవిడ్–19 కారక వైరస్‌ను అడ్డుకునే యాంటీబాడీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇటీవలే కరోనా బారిన పడ్డవారు. కానీ హెర్డ్ ఇమ్యూనిటీకి అవసరమైన దాని కంటే ఎక్కువ స్థాయిలో యాంటీబాడీలు కలిగి ఉన్నారు. (ప్రపంచానికి పెను సవాలు.. కరోనా) దీంతో తరచూ కరోనా వైరస్ల బారిన పడుతుండటం(కరోనా వైరస్ కుటుంబంలో దాదాపు 32 రకాలు ఉన్నాయి. జలుబుకు కారణమైన వైరస్ కూడా ఇదే కుటుంబానికి చెందినది. కోవిడ్–19 వ్యాధిని కలుగజేసే కరోనా వైరస్ మనుషుల్లోకి ప్రవేశించడం వల్లే సమస్య తీవ్రంగా ఉంది) వల్ల వాటి కోసం ఉత్పత్తి అయిన యాంటీబాడీలతో వైరస్ నుంచి రక్షణ లభిస్తుండవచ్చునని నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత్ లాంటి పెద్ద దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుండటం.. ఇతర ప్రాంతాల్లో ఇందుకు భిన్నంగా ఉండటం సహజమేనని, అయితే దేశం మొత్తమ్మీద ఏం జరుగుతోందన్నదే ముఖ్యమని వారు అంటున్నారు. -
కరోనా ఎప్పుడొచ్చిందో.. ఎప్పుడు పోయిందో!
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వారికి ఎప్పుడు వచ్చిందో తెలియదు.. ఎప్పుడు వెళ్లిందో తెలియదు.. ఎటువంటి లక్షణాలూ లేకుండానే వారు కోలుకున్నారు. ఇలాంటి కేసులు రాష్ట్రంలో భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) విజయనగరం, కృష్ణా, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రెండో దఫా సీరో సర్వైలెన్స్ నిర్వహించింది. విజయనగరం జిల్లాలో 38 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్టు తేలింది. అయితే వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కానీ వారి నుంచి నమూనాలు సేకరించి చూస్తే కరోనాతో పోరాడే యాంటీబాడీస్ వారిలో విపరీతంగా వృద్ధి చెంది ఉన్నాయి. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాంభార్గవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలిపారు. మొదటి దశ సీరో సర్వైలెన్స్‌లో 20 శాతం మందికి యాంటీబాడీస్ వృద్ధి చెందినట్టు తేలిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో తీసుకున్న నమూనాలు, కరోనా వచ్చిపోయిన వారి సంఖ్య జిల్లా నమూనాలు పాజిటివ్ శాతం విజయనగరం 418 159 38.0 కృష్ణా 399 117 29.3 నెల్లూరు 428 76 17.7 -
కరోనా వచ్చినట్టే తెలియదు..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలువురికి కరోనా సోకినట్లుగానీ, వైరస్ ప్రభావం ఉన్నట్లు గానీ తెలియకుండానే సురక్షితంగా బయటపడినట్లు వెల్లడైంది. తాజాగా 9 జిల్లాల్లో సీరో సర్వైలెన్స్ (యాంటీబాడీస్ వృద్ధి వివరాలు) సర్వే నిర్వహించగా ఆ నివేదికను కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ గురువారం మీడియాకు వివరించారు. ♦రాష్ట్రంలో గతంలో తూర్పు గోదావరి, నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో ఆగస్ట్ 26 నుంచి 31 వరకు సర్వే నిర్వహించారు. తాజాగా 9 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో 19.7 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్టు తేలింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 30.6 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు గుర్తించారు. కర్నూలులో 28.1 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. ♦చిత్తూరు జిల్లాలో ఐదు వేల మందిని పరీక్షించగా 20.8 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు గుర్తించారు. అంటే వీరంతా మహమ్మారి సోకినట్లు తెలియకుండానే కోలుకున్నారు. వీరిలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదు. ♦9 జిల్లాల్లో 5 వేల చొప్పున నమూనాలు సేకరించి సర్వే నిర్వహించారు ♦కంటైన్మెంట్, నాన్ కంటైన్మెంట్, హైరిస్క్ ఏరియాల్లో సర్వే నిర్వహించారు (చదవండి: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్) సర్వే ఫలితాలతో కేసులపై అంచనా తాజాగా సీరో సర్వైలెన్స్ ఫలితాలను బట్టి కేసులు ఎక్కడ తగ్గవచ్చు? ఎక్కడ పెరగవచ్చు? అనే విషయంపై ఓ అంచనాకు రావచ్చు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టవచ్చు. పశ్చిమతో పాటు మరికొన్ని జిల్లాల్లో పీక్ దశ నడుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ప్రభుత్వం పారదర్శకంగా కోవిడ్ నియంత్రణ చర్యలు చేపడుతోంది. కొంతమంది తమకు నచ్చినట్టు అన్వయించుకుని వార్తలు రాయడం దురదృష్టకరం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
యాంటీబాడీలపై శాస్త్రవేత్తల కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శరీరంలో యాంటీబాడీల ఉనికితో వ్యక్తులు గతంలో కోవిడ్-19 బారినపడిన విషయం తెలిసినా కరోనా వైరస్ నుంచి ఇవి ఎప్పటికీ పూర్తి రక్షణ ఇవ్వలేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. యాంటీ బాడీల రకాలతో పాటు అవి ఎంత పరిమాణంలో తయారయ్యాయి..ఎంతకాలం మనగలుగుతాయనే వైరుధ్యాలే ఇందుకు కారణమని తెలిపారు. వ్యక్తి శరీరంలో ఉండే యాంటీబాడీలు వ్యాధి పురోగతి గురించి ఏమీ చెప్పవని న్యూఢిల్లీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ శాస్త్రవేత్త సత్యజిత్ రథ్ పేర్కొన్నారు. శరీరంలో తటస్థీకరించే యాంటీబాడీస్ (న్యూట్రలైజింగ్), సాధారణ యాంటీబాడీస్ ఉంటాయని, న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ కణాల్లోకి కరోనా వైరస్ రాకను అడ్డుకునే వ్యవస్థను ప్రేరేపిస్తాయని పూణేకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చి (ఐఐఎస్ఈఆర్) శాస్త్రవేత్త వినీతా బాల్ తెలిపారు. సాధారణ యాంటీబాడీలు వైరస్ ఉనికికి స్పందించే సంకేతాలు పంపినా, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాత్రం ఉపయోగపడవని ఆమె వివరించారు. వ్యక్తి శరీరంలో యాంటీబాడీల ఉనికి కేవలం గతంలో కోవిడ్-19 సోకిందని గుర్తించేందుకు ఉపయోగపడినా న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు లేకుంటే అవి వ్యాధి నుంచి పూర్తి రక్షణ ఇవ్వని ఇమ్యూనాలజిస్ట్ తెలిపారు. న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు తగిన సంఖ్యలో ఎక్కువ కాలం ఉంటేనే తదుపరి వైరస్ దాడిని ఎదుర్కోగలరని వివరించారు. ఏ స్ధాయిలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఉంటే ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చనే దానిపై ఏకాభిప్రాయం లేదని చెప్పారు. చదవండి : ఢిల్లీ తెలంగాణ భవన్లో కరోనా కలకలం -
కరోనాను ఢీకొట్టే యాంటీబాడీస్‌పై విశ్లేషణ
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు వ్యాక్సిన్ ప్రయోగాల్లో నిమగ్నమైనా, ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనాను జుయించే యాంటీబాడీస్‌పై డాక్టర్లు దృష్టి పెట్టారు. యాంటీబాడీస్ మానవ శరీరంలో ఏ విధంగా వస్తుందో విశ్లేషిద్దాం. మానవ శరీరంలో ప్రవేశించే వైరస్(కరోనా), బ్యాక్టేరియాలను ఢీకొట్టి శరీరానికి రక్షణ వ్యవస్థ లాగా యాంటీబాడీస్(వ్యాధి కారకాన్ని ఎదుర్కొనే రక్షక దళాలు,) పనిచేస్తాయి. రెండు రకాల ఇమ్యునోగ్లోబులిన్ యాంటీబాడీస్(ఐజీఎమ్), (ఐజీజీ)లు మానవులకు రక్షణ కల్పిస్తాయి. రెండు రకాల యాంటీబాడీస్ గురించి తెలుసుకుందాం. ఐజీఎమ్ యాంటీబాడీస్: మానవులలో వైరస్ ప్రవేశించిన మొదటి వారంలో ఐజీఎమ్ యాంటీబాడీస్ రక్షణ కలిగిస్తాయి. కానీ ఆరు వారాల తరువాత శరీరం నుంచి నిష్క్రమిస్తాయి. కాగా ఐజీఎమ్ యాంటీబాడీస్ మానవుల్లో ప్రవేశించాక వైరస్ లేదా బ్యాక్టేరియా ప్రవేశించినట్లు తెలిపే మొదటి సూచన అని అపోలో శ్వాస వ్యాధి నిపుణులు రవీంద్ర మెహతా తెలిపారు ఐజీజీ యాంటీబాడీస్: మానవుల్లో వ్యాధి కారకం(వైరస్, బ్యాక్టేరియా) ప్రవేశించాక మూడు వారాల తరువాత ఐజీజీ శరీరానికి సూచిస్తుంది. లేట్‌గా వచ్చిన లేటేస్ట్ అన్నట్లుగా ఐజీజీ యాంటీబాడీస్ చాలా కాలం పాటు మానవుల రోగనిరోధకశక్తిని కాపాడుతుంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యాంటీబాడీస్ పరీక్షలవైపు డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. కాగా యాంటీబాడీస్ పరీక్ష, రక్తపరీక్ష మాదిరిగా సులభంగా చేయొచ్చు. కేవలం యాంటీబాడీస్ పరీక్ష రూ.500లతో చేసి, అరగంటలో ఫలితం ఇస్తారు. చదవండి: ప్రాణం తీసిన భయం -
ఇమ్యూనిటీ బూస్టర్: వాస్తవమెంత?
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బతో అన్ని దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ)పెంచుకోవడమే ఏకైక మార్గమని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్యునాలజీ నిపుణులు రోగనిరోధక శక్తిపై ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ప్రజలు రోగనిరోధకశక్తిను పెంచుకునేందుకు మార్కెట్లలో రకరకాల పండ్ల జ్యూస్‌లు, విటమిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నారు. నిజంగా ఆహారపు అలవాట్లు, విటమిన్ ట్యాబ్లెట్లతో కరోనాను నివారించవచ్చా తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి అనేది సంక్లిష్టమైన అంశమని, ప్రజలకు ఇంకా పూర్తిగా ఈ అంశంపై అవగాహన రాలేదని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) మాజీ డైరెక్టర్, ఇమ్యునాలజీ నిపుణులు రామ్ విశ్వకర్మ తెలిపారు. ఆయన స్పందిస్తు.. ముఖ్యంగా మనిషి తీవ్రంగా రోగగ్రస్తులను చేసే యాంటిజన్స్(వ్యాధి కారకం)ను ఎదుర్కొనేందుకు సహజసిద్దంగా శరీరంలో యాంటిబాడీస్(యాంటీజన్స్‌ను ఎదుర్కొనేవి) ఉంటాయి. మరోవైపు సహజ రోగనిరోధక శక్తి (ఇన్నేట్ ఇమ్యున్ రెస్పాన్స్) మానవుని నిరంతరం కాపాడుతూ ఉంటుంది. సహజ రోగనిరోధక శక్తిలో తెల్లరక్తకణాల, న్యూట్రోఫిల్స్, టీసెల్స్(కణాలు), బీసెల్స్(కణాలు), యాంటిబాడీస్‌లతో కూడిన రక్షణాత్మక వ్యవస్థ కాపాడుతూ ఉంటుంది. కాగా ఈ కణాలను సైటోకైన్స్ ఉత్పత్తి చేస్తాయి. సైటోకైన్స్ అనేది ప్రొటీన్ ఇమ్యూన్ కణాలకు సిగ్నలింగ్ వ్యవస్థ లాంటిది. ఆహారపు అలవాట్ల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోలేమని అన్నారు. సాధారణంగా కొందరు తమకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని చెబుతుంటారు. వారికి ఎక్కువగా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. విటమిన్ సీ, జింక్ ట్యాబ్లెట్లతో రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చనే అపోహలు ఉన్నాయి. మరోవైపు ఈ ట్యాబ్లెట్ల ద్వారా కిడ్నీ, లివర్ తదితర వ్యాధులతో చాలా మంది సతమతమవుతున్నారని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మేలైన మార్గమని రామ్ విశ్వకర్మ పేర్కొన్నారు. 1962లో నోబెల్ బహుమతి పొందిన పాలింగ్ కూడా విటమిన్ సీ, జింక్ ట్యాబ్లెట్లు ఏ మాత్రం ప్రభావం చూపవని తెలిపారు. కానీ ఆహారం ద్వారానే రోగనిరోధక శక్తి లభిస్తుందని ప్రకృతి, ఆయుర్వేద నిపుణులు గట్టిగా చెబుతున్నారు. కానీ అందరు ఏకీభవించేది మాత్రం వ్యాయామం. జీవనశైలి మార్పులతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చని అందరు ఏకీభవీస్తున్నారు. మానవ శరీరంలో రక్షణాత్మక వ్యవస్థను బలంగా ఉంచే సైటోకైన్స్, న్యూట్రోఫిల్స్, టీకణాలు, బీకణాలు వ్యాయామంతో బలోపేతమవుతాయని అల్లోపతి, ఆయుర్వేద, అన్ని రంగాల నిపుణులు ఏకీభవిస్తున్నారు. రోజుకు ఒక గంట వ్యాయామంతో రక్షణాత్మక వ్యవస్థను బలోపేతం చేసే అన్ని కణాలు ఉత్తేజితమవుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
ఆ యాంటీబాడీలు సూపర్ పవర్ఫుల్!
కరోనా వైరస్‌ను మట్టుబెట్టేందుకు ప్రస్తుతానిౖకైతే ఎలాంటి చికిత్స, టీకా అందుబాటులో లేదు. ఇతర వ్యాధుల కోసం తయారుచేసిన మందులను కరోనా రోగులపై ప్రయోగిస్తూ తాత్కాలిక ఉపశమనం మాత్రం పొందుతున్నాం. వీటితోపాటు వ్యాధిబారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి యాంటీబాడీలను వేరుచేసి వాడటమూ జరుగుతోంది. అయితే ఈ ప్లాస్మా చికిత్స కొందరికి పనిచేస్తోం ది. మరికొందరికి లేదు. ఈ నేపథ్యంలో స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనం ఆసక్తి రేకెత్తిస్తోంది. వైరస్‌ను ఎదుర్కొనే లక్ష్యంతో శరీర రోగనిరోధక వ్యవస్థ తయారుచేసే యాంటీబాడీల్లో కొన్ని ఇతరాల కంటే శక్తిమంతంగా ఉన్నట్లు వీరు గుర్తించారు. ప్లాస్మా చికిత్స అందుకున్న వారిలో సుమారు 300కుపైగా వేర్వేరు యాంటీబాడీలున్నట్లు పలు అధ్యయనాల ద్వారా ఇప్పటికే తెలియగా.. స్క్రిప్స్ శాస్త్రవేత్తలు వీటన్నింటినీ నిశితంగా పరిశీలించారు. రోగ నిరోధక వ్యవస్థకు చెందిన బీ–కణాలు తయారుచేసే యాంటీబాడీలు సాధారణంగా వై ఆకారంలో ఉంటాయి. ప్రొటీన్లతో తయారవుతాయి. మన వ్యవస్థలోని ఒక్కో బీ–సెల్ ఒక్కో రకమైన యాంటీబాడీని తయారుచేస్తుంది. ఆసక్తికరంగా.. ఐజీహెచ్‌వీ3–53 అనే జన్యువు ఉత్పత్తిచేసే యాంటీబాడీలు మిగిలిన వాటికంటే ఎక్కువ శక్తి కలిగి ఉన్నట్లు తెలిసింది. ఇవి కరోనా వైరస్‌ను అత్యంత సమర్థంగా మట్టుబెట్టగలవని తేలింది. ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ పద్ధతి ద్వారా ఈ శక్తిమంతమైన యాంటీబాడీలు రెండింటి ఛాయాచిత్రాలను పరిశీలించినప్పుడు వాటి నిర్మాణం కూడా స్పష్టమైందని, ఈ అంశం ఆధారం గా సమర్థమైన వ్యాక్సిన్లు తయారుచేసే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా.. సార్స్ కోవిడ్ –2 వైరస్‌కు ఈ యాంటీబాడీలు అతుక్కుపోయిన విధానం, ప్రాంతాల ఆధారంగా కోవిడ్ –19 చికిత్సకు కొత్త మందు లు కూడా తయారు చేయవచ్చునని అంచనా. ఐజీహెచ్‌వీ3–53 జన్యువు కారణంగా ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఆరోగ్యంగా ఉన్న సాధారణ ప్రజల్లోనూ కొద్ది మోతాదుల్లో ఉంటాయని ఇప్పటికే జరిగిన పరిశోధనలు చెబుతుండగా.. వీటి సంఖ్యను పెంచేలా ఒక వ్యాక్సిన్‌ను తయారుచేస్తే కరోనా వైరస్ నుంచి దీర్ఘకాలం రక్షణ పొం దవచ్చునని స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్త, ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఐయాన్ విల్సన్ చెబుతున్నారు. కరోనా రోగుల్లోనూ ఈ యాంటీబాడీలను గుర్తించామని, కాకపోతే అసలువాటి కంటే ఇవి కొంచెం భిన్నంగా ఉన్నాయని విల్సన్ వివరించారు. మనిషి వేల ఏళ్లుగా కరోనా వైరస్ల బారినపడతున్నాడని, రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీల రూపంలో ఎప్పుడో వీటికి విరుగుడును కూడా సిద్ధంగా ఉంచిందని, సరైన వాటిని గుర్తించి వాడటమే ప్రస్తుతం చేయాల్సిన పనని విల్సన్ అంటున్నారు. -
ఆ 18 కోట్ల మందికి కరోనా భయం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్‌ను మాత్రం కట్టడి చేయలేకపోతున్నాయి. దీంతో తొందరగా కరోనా టెస్టులు చేయాల్సిన అవశ్యకత పెరిగింది. ఎందుకంటే పరీక్షలు చేయడం అలస్యమైతే కరోనా ఒకరి నుంచి మరొకరికి వారి నుంచి ఇంకొంత మందికి వేగంగా వ్యాపిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశంలో కోవిడ్-19కు సంబంధించి రెండు రకాల పరీక్షలను ఆమోదించింది. అవి ఆర్టీ- పీసీఆర్ పరీక్షలు, యాంటీబాడీ పరీక్షలు. ఈ పరీక్షలను ప్రభుత్వ అనుమతి పొందిన కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా నిర్వహించవచ్చు. అలాంటి ఒక ల్యాబ్ థైరోకేర్. ఇది 60,000 పరీక్షలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడయ్యింది. చదవండి: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు సగం మనకే My #Guesstimate after 60,000 AB testing: 15% globally have had COVID exposure and remain immunized. In India only 1/10,000 exposed die, high immunity. In western rich countries 1/500 exposed die, poor immunity. Data says after March 2021, vaccine will have less value. https://t.co/PuYu6zK5F7 — Antibody Velumani. (@velumania) July 19, 2020 18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని థైరోకేర్ డేటా పేర్కొంది. దేశంలో దాదాపు 15 శాతం మంది కరోనా వైరస్ కు వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి వుండవచ్చని తమ డేటాలో తేలిందని తెలియజేసింది. దేశంలోని 600 ప్రాంతాల్లో 60 వేల మందిపై సుమారు 20 రోజుల పాటు ఈ సంస్థ యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించింది. దేశంలో దాదాపు 15 శాతం మందిలో ఇప్పటికే ప్రతినిరోధకాలు అభివృద్ధి చెందినట్లు తెలుస్తోందని స్టడీ తెలిపింది. ఈ విషయాన్ని థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ వెలుమని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ అంచనాల్లో 3శాతం అటూఇటుగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ డేటా ప్రకారం, యాంటీబాడీలను అభివృద్ధి చేసుకున్న జాబితాలో థానేలోని బివాండీ టాప్ లో ఉంది. ఆ తర్వాత బెంగుళూరులోని పీణ్య ఉంది. ఇక మరోవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అయితే ఒకసారి శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందితే వారికి కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.ఇప్పటి వరకు భారతదేశంలో 1.24 మిలియన్ కరోనా కేసులు నమోదు కాగా, 29,861 మంది మరణించారు. చదవండి: 24 గంటల్లో 45,720 పాజిటివ్ కేసులు -
వారికి భవిష్యత్తులో కరోనా సోకే అవకాశం
న్యూఢిల్లీ: చైనాలోని వుహాన్‌లో ప్రారంభమై అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ కరోనా. దీనిని మొదట్లో న్యూమోనియా లాంటి అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ అని భావించినప్పటికీ, ఈ విధంగా తీవ్ర రూపం దాలుస్తుందని పరిశోధకులు, వైద్యనిపుణులు ఊహించలేకపోయారు. ఆరు నెలల కాలంలోనే వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. కరోనా వైరస్ అంటే నిన్నటి వరకూ మనకు తెలిసిన లక్షణాలు చాలా తక్కువ. దగ్గు, జ్వరం ఉంటాయని, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని మాత్రమే. ఆ తరువాత రుచి లేకపోవడం, వాసన కోల్పోవడం కొత్తగా చేరిన లక్షణాలు. ఇలా రోజుకో వ్యాధి లక్షణం, కొత్త సమస్య బయటపడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో కరోనా నివారణకు అందించే టీకా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని కలిగిఉండేలా ప్రభావవంతంగా ఉంటుందా..? లేక శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రతిరోధకాలకు ఏమి జరుగుతుంది. శరీరంలో వైరస్ పునర్నిర్మాణం సాధ్యమా వంటి అనేక అనుమానాలు సగటు మానవుడి మెదడుని తొలుస్తున్నాయి. (చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్) అయితే బ్లూమ్‌బెర్గ్ సంస్థ అందించిన నివేదిక ప్రకారం.. కోవిడ్ నుంచి కోలుకున్నవారికి లేదా తేలికపాటి వ్యాధి లక్షణాలు ఉన్న వారికి భవిష్యత్తులో అంటువ్యాధుల నుంచి శాశ్వత రక్షణ లభించకపోవచ్చని రోగనిరోధక శక్తి, టీకాల మన్నికను అర్థం చేసుకోవడానికి నిర్వహించిన ఓ అధ్యయం సూచిస్తుంది. తేలికపాటి కోవిడ్ లక్షణాలు కలిగి ఉన 34 మంది రోగుల రక్తం నుంచి ప్రతిరోధకాలు తీసుకోగా వారికి ఇంటెన్సివ్ కేర్ అవసరం రాలేదు. కేవలం ఆక్సిజన్, హెచ్ఐవీ ఔషదాలు, రెమెడిసివిర్ మాత్రమే ఇచ్చారు. లక్షణాలు ప్రారంభమైన 37 రోజుల తర్వాత తీసుకున్న ప్రతిరోధకాలను మొదట విశ్లేషించగా, తర్వాత 86 రోజుల తర్వాత మరొక విశ్లేషణ చేశారు. (చైనా టీకా ఫలితాలూ భేష్!) పై రెండు ఫ్రేమ్‌ల మధ్య సుమారు 73 రోజుల తర్వాత యాంటీబాడీ స్థాయిలు త్వరగా పడిపోయాయని పరిశోధకులు కనుగొన్నారు. 2002-03లో వచ్చిన సార్స్‌తో పోలిస్తే కరోనా యాంటీబాడీస్‌ను కోల్పోవడం చాలా వేగంగా జరిగిందని గుర్తించారు. వీరి అధ్యయంలో ముఖ్యంగా స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి శాశ్వత కోవిడ్ యాంటీబాడీస్ ఉండకపోవచ్చని గుర్తించారు. వైరస్‌ను అడ్డుకోవడంలో యాంటీబాడీలు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా బారిన పడినవారిలో చాలా వరకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వీరికి భవిష్యత్తులో కూడా తిరిగి ఈ వైరస్ సోకే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ అధ్యయనంలో తేలింది. -
కరోనాకు ‘క్యూర్’ ఉందన్న శాస్త్రవేత్తలు
న్యూయార్క్ : మానవ శరీర జన్యువుల్లోకి ప్రాణాంతక కరోనా వైరస్‌ను ప్రవేశించకుండా అడ్డుకునే యాంటీ బాడీస్ మందును కనుగొన్నామని అమెరికా, శాండియాగో నగరంలోని సొరెంటో థెరాప్యూటిక్స్ బయోటెక్ కంపెనీ ప్రకటించింది. ఈ మందు ఉత్పత్తికి అనుమతి ఇవ్వాల్సిందిగా అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ’కి దరఖాస్తు చేసుకున్నామని, అనుమతి రాగానే నెలకు రెండు లక్షల డోసుల చొప్పున ఉత్పత్తి చేయగలమని కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ శరీర జన్యువుల్లో కరోనా వైరస్ ప్రవేశించకుండా తాము కనిపెట్టిన మందు నూటికి నూరుపాళ్లు అడ్డుకుంటుంది కనుక ఆ మందుకు ‘క్యూర్’ అని పేరు పెట్టామని, ‘కోవిడ్–19’కు వ్యాక్సిన్ కనుగొనే వరకు తాము కనిపెట్టిన మందును వాడి కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని వారు చెప్పారు. (కరోనా విజృంభణ: ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా) తాము న్యూయార్క్‌లోని ఎంటీ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో కరోనా వైరస్‌పై పలు యాంటీ బాడీస్‌ను పరీక్షిస్తూ వచ్చామని, ‘ఎస్టీఐ–1499’ యాంటీ బాడీస్‌తో తమ పరీక్ష విజయవంతమైందని శాస్త్రవేత్తలు వివరించారు. నూటికి నూరు పాళ్లు కరోనాకు మందుందని, ల్యాబ్‌లో మానవ సెల్స్‌పై యాంటీ బాడీస్‌తో నిర్వహించిన పరీక్షలు మంచి ఫలితాలు ఇచ్చాయని, మానవ ట్రయల్స్ మాత్రం ఇంకా జరపలేదని కంపెనీ సీఈవో డాక్టర్ హెన్రీ జీ తెలిపారు. అనుమతి కోసం ‘అత్యవసర కేటగిరి’ కింద దరఖాస్తు చేశామని, అప్పుడు నేరుగానే హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించవచ్చని ఆయన చెప్పారు. (ట్రంప్: డబ్ల్యూహెచ్ఓకు నిధుల కోత?) -
కరోనాకి అంత సీన్ లేదు!
పాప్ గాయని మడోన్నాకు కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి ఉందట. అందుకే కరోనా నన్ను ఏమీ చేయలేదు.. నా విషయంలో కరోనాకి అంత సీన్ లేదంటున్నారామె. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ లో తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ప్రతిరోజూ జరిగిన విషయాలను ‘‘క్వారంటైన్ డైరీ’’ పేరుతో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకుంటున్నారామె. ఇటీవలే కరోనా గురించి ఓ అప్ డేట్‌ను తన అభిమానులతో పంచుకున్నారు మడోన్నా. ‘‘ఈ మధ్యే కరోనాకి సంబంధించిన టెస్ట్ చేయించుకున్నాను. కరోనాను ఎదిరించే యాంటీబాడీస్ నా శరీరంలో తగినన్ని ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చింది. రేపు ఉదయమే కారు తీసుకొని లాంగ్ డ్రైవ్ కి వెళ్లబోతున్నాను. దారిలో కారు అద్దాలు దించి కోవిడ్ గాలి కూడా పీలుస్తాను. అందర్నీ ఇలా చేయమని చెప్పను. అందరూ ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి’’ అని పేర్కొన్నారు మడోన్నా. -
సీరియస్ సమస్యలు వస్తాయా?
గర్భిణులు నెగటివ్ బ్లడ్‌గ్రూప్‌తో, బిడ్డ పాజిటివ్ బ్లడ్ గ్రూప్‌తో ఉంటే సీరియస్ సమస్యలు వస్తాయా? నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చా? దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు. – స్మిత, హైదరాబాద్ గర్భిణులు నెగెటివ్ గ్రూపుతో ఉంటే ‘ఆర్‌హెచ్ నెగెటివ్ ప్రెగ్నెన్సీ’ అంటారు. భర్తకి కూడా నెగెటివ్ గ్రూపు ఉంటే సమస్య ఏమీ ఉండదు. భర్తది పాజిటివ్ గ్రూపు ఉండి, బిడ్డది కూడా పాజిటివ్ గ్రూపు ఉంటే కొందరు పిల్లల్లో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యది నెగెటివ్, భర్తది పాజిటివ్ గ్రూప్ బ్లడ్ ఉన్నా, కొందరి బిడ్డల్లో నెగెటివ్ గ్రూపు వస్తుంది. దీనివల్ల కూడా సమస్యలేవీ ఉండవు. నెగెటివ్ బ్లడ్ గ్రూపు ఉన్న గర్భిణుల్లో బిడ్డ పాజిటివ్ గ్రూపుతో ఉంటే, తల్లి రక్తంలోకి బిడ్డ పాజిటివ్ రక్తకణాలు ప్రవేశిస్తే, బిడ్డ రక్తకణాల మీద ఉన్న ఆర్‌హెచ్ యాంటీజెన్‌కు వ్యతిరేకంగా తల్లిలో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తయారవుతాయి. కొందరిలో కొన్ని రకాల పరిస్థితుల్లో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తల్లి నుంచి మాయ ద్వారా బిడ్డకు చేరి, బిడ్డలో ఉన్న పాజిటివ్ రక్తకణాల మీద దాడిచేసి వాటిని మెల్లగా నశింపజేస్తాయి. దీనివల్ల బిడ్డలో ఎర్ర రక్తకణాలు తగ్గిపోయి, బిడ్డలో కొన్నిసార్లు కడుపులోనే రక్తహీనత, పసిరికలు వంటివి ఏర్పడటం, బిడ్డకు శరీరమంతా నీరు చేరడం, కడుపులోనే చనిపోవడం, పుట్టిన తర్వాత బిడ్డలో రక్తహీనత, తీవ్రమైన పసిరకలు (జాండీస్) వంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మొదటగా గర్భ నిర్ధారణ తర్వాత తల్లి బ్లడ్‌గ్రూపు పాజిటివా, నెగెటివా తెలుసుకోవాలి. ఒకవేళ నెగెటివ్ గ్రూపయితే, భర్త గ్రూపు పాజిటివా, నెగెటివా నిర్ధారణ చేసుకోవాలి. భర్తది నెగెటివ్ గ్రూపు అయితే సమస్యలేవీ ఉండవు. భర్తది పాజిటివ్ గ్రూపయితే, బిడ్డకు పాజిటివ్ గ్రూపు రావచ్చు లేదా నెగెటివ్ గ్రూపు రావచ్చు. గర్భంలో ఉన్న బిడ్డ గ్రూపు ముందుగా తెలియదు కాబట్టి, ముందు జాగ్రత్తగా పాజిటివ్ అయితే వచ్చే సమస్యలను పరిగణనలోకి తీసుకుని, తల్లికి అవసరమైతే ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ (ఐసీటీ) మూడో నెలలోపు ఒకసారి, ఏడో నెలలో ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవడం వల్ల ఆర్‌హెచ్ యాంటీబాడీస్ ఏవైనా ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ అవేమీ లేకపోతే, అంటే ఐసీటీ నెగెటివ్ వస్తే, ఏడో నెలలో తల్లికి ‘యాంటీ డీ’ అనే ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. సాధారణంగా ఏడో నెల నుంచి బిడ్డలోని పాజిటివ్ రక్తకణాలు తల్లిలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఇంజెక్షన్లో ఉండే యాంటీబాడీస్ తల్లిలోకి ప్రవేశించే బిడ్డకు చెందిన పాజిటివ్ రక్తకణాలను నశింపజేస్తాయి. దాని ద్వారా తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు కావు. కాబట్టి బిడ్డలో సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అలాగే నెగెటివ్ గ్రూపు తల్లులు గర్భంతో ఉన్నప్పుడు, మధ్యలో బ్లీడింగ్ అయినా, కడుపుకి దెబ్బ తగిలినా ఈ యాంటీ–డి ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. చాలావరకు మొదటిసారి గర్భం దాల్చిన వారిలో సమస్యలు పెద్దగా రావు. తర్వాతి కాన్పులలో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తల్లిలో ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ పాజిటివ్ వస్తే, అంటే తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉన్నాయని అర్థం. అప్పుడు అవి ఎంత శాతం ఉన్నాయి, అవి బిడ్డ రక్తకణాలను నశింప చేస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు, డాప్లర్ స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వీటిలో సమస్య కనిపిస్తే, సమస్య తీవ్రతను బట్టి గర్భంలోని శిశువులో ఎర్రరక్తకణాలు తగ్గిపోయి, రక్తహీనత ఏర్పడతున్నట్లయితే, తల్లి గర్భంలోకే రక్తం ఎక్కించడం జరుగుతుంది. అవసరమనుకుంటే త్వరగా కాన్పు చేయడం జరుగుతుంది. కాన్పు తర్వాత బిడ్డ బ్లడ్ గ్రూపు నిర్ధారణ చేసుకుని, పాజిటివ్ గ్రూపయితే, బిడ్డలో రక్తహీనత, జాండీస్ వంటి ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సీబీపీ, డైరెక్ట్ కూంబ్ టెస్ట్, బైలురుబిన్ టెస్ట్ వంటి పరీక్షలు జరిపించి, నిర్ధారించుకోవాలి. రక్తహీనత ఎక్కువగా ఉంటే, అవసరమైతే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా రక్తం ఎక్కించడం జరుగుతుంది. జాండీస్ ఉంటే ‘ఫొటో థెరపీ’ అని బ్లూ లైట్ కింద పెట్టడం జరుగుతుంది. రెండో కాన్పులో బిడ్డకు ఈ సమస్యలు రాకుండా, కాన్పు అయిన 24 గంటల లోపు లేదా గరిష్టంగా 72 గంటల లోపల తల్లి ‘యాంటీ–డి’ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. ఈ ఇంజెక్షన్ వల్ల కాన్పు సమయంలో తల్లిలోకి ప్రవేశించే బిడ్డ పాజిటివ్ రక్తకణాలను ఇంజెక్షన్‌లోని యాంటీబాడీస్ నశింపజేస్తాయి. కాబట్టి తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు కాకుండా ఉంటాయి. మళ్లీ గర్భం ధరించినప్పుడు తల్లిలో యాంటీబాడీస్ ఉండవు కాబట్టి, కడుపులోని బిడ్డపై దుష్ప్రభావాలు లేకుండా సురక్షితంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముందు గర్భాలలో అబార్షన్లు ఏవైనా అయి ఉంటే, ఆ సంగతిని గోప్యంగా ఉంచకుండా డాక్టర్‌కు తప్పనిసరిగా వివరించాలి. అబార్షన్ సమయంలో కూడా కొన్నిసార్లు బిడ్డ రక్తకణాలు తల్లిలోకి ప్రవేశించి, తల్లిలో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి తర్వాత గర్భం దాల్చినప్పుడు బిడ్డ రక్తకణాలను నశింపజేసి, బిడ్డలో సమస్యలు తలెత్తడానికి కారణమవుతాయి. కాబట్టి అబార్షన్ తర్వాత కూడా 24 గంటలలోగా ‘యాంటీ–డి’ ఇంజెక్షన్ తక్కువ డోసులో తీసుకోవడం మంచిది. -
ఫ్లూ టీకా ఉదయమే మేలు
లండన్: ఫ్లూ వ్యాక్సిన్లు ఉదయం పూట వాడినప్పుడు ఎక్కువ క్రియాశీలకంగా, ప్రతిరక్షకాల స్పందనలు ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలో తేలింది. ఇన్‌ఫ్లూయెంజా ‘వ్యాక్సినేషన్ ప్రోగ్రాం’లో భాగంగా లండన్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ప్రభావంపై అధ్యయనం చేశారు. మూడు రకాల ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లతో పోరాడేందుకు వివిధ రకాల వ్యాక్సిన్లను 65 ఏళ్లకు పైబడిన దాదాపు 276 మందిపై ప్రయోగించారు. ఉదయం 9 -11 గంటల మధ్య, మధ్యాహ్నం 3-5 గంటల మధ్య శస్త్రచికిత్సలు జరిగిన వారికి ఈ మూడు రకాల వ్యాక్సిన్లను వేర్వేరుగా నెలరోజుల పాటు ఇచ్చారు. మొదటి రెండు వ్యాక్సిన్లు ఇచ్చిన వారిలో మధ్యాహ్నం వ్యాక్సిన్ ఇచ్చిన వారి కన్నా ఉదయం ఇచ్చిన వారిలో ప్రతి రక్షకాలు ఎక్కువగా విడుదలైనట్లు గుర్తించారు. -
సిస్టిమిక్ ల్యూపస్ ఎరిథెమాటసస్ (SLE)
SLE వలన శరీరంలోని అనేక అవయవాలు వ్యాధికి గురి అవుతాయి. ఇది గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కీళ్ళు, చర్మం, రక్తనాళాలు, నాడీవ్యవస్థను పీడిస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన రోగనిరోధక వ్యవస్థలోని తెల్ల రక్తకణాలు మన సొంత కణాలపై దాడి చేయడం వలన వచ్చే వ్యాధులను ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఇది 15 నుండి 35 సంవత్సరాల లోపు స్త్రీలలో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జబ్బు యొక్క దిశను ఊహించటం కష్టం. ఇది కొద్దిరోజులు తీవ్రంగానూ (Flare up), కొద్ది రోజులు వ్యాధి లక్షణాలు తక్కువ అవటం జరుగుతుంది. (Remissions) లక్షణాలు ఈ వ్యాధికి గురయ్యే అవయవాన్ని బట్టి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. చర్మము: ముఖచర్మంపై దద్దుర్లు రావటం, చెంప మరియు ముక్కు పైన సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు రావటం చూస్తాము. దీనినే butterfly Rash అంటాము. డిస్కాయిడ్ లూపస్ (Discoid lupus) : ఈ రకం SLE లో చర్మం ఎర్రబడటం, పొలుసులు రాలటం, చర్మంలోని లో పొరలలో నుంచి దళసరి పగుళ్ళు, రక్తస్రావంతో కూడిన పొలుసులు రాలటం, చర్మంపై నల్లటి మచ్చలు అవటం వంటివి జరుగుతాయి. మూత్రపిండాలు: ఎక్కువ శాతం SLE రోగులలో మూత్రపిండాలు ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉంటుంది. దీనినే Lupus Nephritis అంటారు. మూత్రంలో రక్తకణాలు, ప్రొటీన్లు కోల్పోతాయి. శరీరమంతా వాపులు వస్తాయి, బరువు పెరుగుతుంది. SLE దీర్ఘకాలంలో మూత్రపిండాలను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఒక్కోసారి Dialysis గానీ మూత్రపిండ మార్పిడి గానీ చేయవలసిన అవసరం ఉండవచ్చు. అందువలన వ్యాధి తీవ్రమయ్యే కంటే ముందుజాగ్రత్త పడటం మంచిది. గుండె: SLE రోగులలో గుండెకు సంబంధించిన సమస్యలతో మరణించే వారి సంఖ్య అధికం. ముఖ్యంగా పెరికార్డైటిస్, మయోకార్డైటిస్ మరియు ఎండోకార్డైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివలన ఆయాసం, జ్వరము, నీరసం మొదలగు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. SLE వలన గుండెలోని రక్తనాళాలలో కొవ్వు పదార్థాలు వేగంగా, అధికంగా పేరుకుపోవడం వలన గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు రావటం. SLE సాధారణంగా అనేక కీళ్ళను, ముఖ్యంగా చిన్న కీళ్ళను ప్రభావితం చేస్తాయి. రక్తహీనత, తెల్లరక్తకణాలు తగ్గటం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గటం జరుగుతుంది. దీనివల్ల తరచు ఇన్ఫెక్షన్లకు గురికావటం, అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులలో నిమ్ము చేరటం. దీర్ఘకాలంలో SLE వలస Diffuse Interstitial Lung Disease బారినపడే అవకాశం ఉంటుంది. నాడీవ్యవస్థ SLE వ్యాధి బారినపడితే మానసిక అశాంతి, పక్షవాతం, మూర్ఛవ్యాధి, తలనొప్పి మొదలగు లక్షణాలు వస్తాయి. గర్భిణీలలో SLE వలన పిండ మరణం, గర్భస్రావం అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. వ్యాధి నిర్థారణ పరీక్షలు CBP, ESR, CUE, రుమటాయిడ్ ఫ్యాక్టర్ C రియాక్టర్ ప్రొటీన్ (C-RP) యాంటీ న్యూక్లియర్ యాంటీ బాడీ (ANA) యాంటీ SM యాంటీ బాడీస్ (Anti SM- - Antibodies) యాంటీ ds DNA, ఇతర పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును. సాధారణంగా ఈ వ్యాధికి అనేక చికిత్స పద్ధతులు ఉన్నప్పటికీ ఏ పద్ధతిలోనూ సంపూర్ణంగా నయం చేసే అవకాశం లేదు. కేవలం హోమియోపతి వైద్యవిధానంలో మాత్రమే మందుల వల్ల ఎటువంటి అసౌకర్యం, దుష్ఫలితాలు లేని చికిత్స చేయవచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం, అధునాతనమైన నిపుణులచే SLE ని అదుపులో ఉంచడమే కాకుండా ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. కారణాలు శాస్త్రీయపరంగా SLE వ్యాధికి గల కారణాలు మనకు అందుబాటులో లేవు. కానీ, జన్యుపరమైన, పర్యావరణ కారణాలు మరియు మానసిక ఒత్తిడి వలన ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుస్తోంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.