►కరోనా టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది. శాస్త్రవేత్తల ప్రయోగాలు ఎంతవరకు వచ్చాయి. దాని ధర ఎంత వరకు ఉండొచ్చు. ఇవీ కొన్ని నెలల క్రితం వరకూ సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరిలోనూ మెదిలిన ప్రశ్నలు
►మరి ఇప్పుడు.. హడావుడిగా తీసుకొచ్చిన టీకా ఎంత మేరకు పనిచేస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్నాక వచ్చే దుష్ప్రభావాల మాటేమిటి. టీకా వేసుకున్నా మాస్కు ఎందుకు. ప్రజల్లో ఈ అనుమానాల నివృత్తికి డబ్ల్యూహెచ్‌వో తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్‌తోనే వ్యక్తిగత, కుటుంబసభ్యులకు రక్షణ ఉంటుందని, తద్వారా మొత్తం సమాజం మహమ్మారిని పారదోలుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగతమే కాదు.. సామాజిక బాధ్యత కూడా అని పేర్కొంది. టీకా వేసుకొనే విషయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించింది. సోషల్ మీడియాలో కొందరి వ్యతిరేక ప్రచారం, సామాజిక వాతావరణం, భయాందోళనలు, లేనిపోని అనుమానాల వల్లే ఇప్పటికిప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది వెనకాడుతున్నారని తాజా నివేదికలో తెలిపింది. ఇందుకుగల కారణాలు తెలుసుకొని అందరూ టీకా వేసుకొనేలా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించింది. చదవండి: (‘బ్రిటన్’ భయం!)
చుట్టుపక్కల వాతావరణ ప్రభావం...
‘వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అనే విషయంలో ప్రజల్లో ఉండే సంశయాలకు కారణాలు మూడు రకాలు. అవి చుట్టుపక్కల పరిస్థితులు, బయటి సమాజ పరిస్థితులు, వ్యక్తిగత ఆలోచనలు. కొందరు వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుం టారు. కాబట్టి దీనిపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టాలి. కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ తప్పనిసరి అంటున్నారా లేదా అనే దానిపై కూడా ప్రజలు టీకా వేసుకోవాలా లేదో నిర్ధారణకు వస్తారు. దుష్ప్రభావాలు, ఉపయోగాల వంటి వాటి విషయంలో సరైన సమాచారం ఉంటే కూడా ప్రజలు ముందుకు వస్తారు. స్వచ్ఛందంగా వేసుకొనే పద్ధతి వల్లే వ్యాక్సిన్ విజయవంతం అవుతుంది. వ్యాక్సిన్ వేసుకోవడానికి దూరం వెళ్లాలా? క్యూలో నిల్చోవాలా? ఇవి కూడా వ్యాక్సిన్‌ను వేసుకునే వారిని ప్రభావితం చేస్తాయి’అని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది.
‘ఫ్రంట్‌లైన్’తో సామాన్యుల్లో ధైర్యం...
‘వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి ముందుగా టీకా వేయడం వల్ల ప్రజల్లో వ్యాక్సిన్‌పై నమ్మకం ఏర్పడుతుంది. ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వేసుకున్నాక వారి ద్వారా ప్రచారం చేయించాలి. ఇందుకోసం మీడియా సహకారం తీసుకోవాలి. టీకాలు వేసుకొనే ప్రముఖుల ద్వారా కూడా ప్రచారం నిర్వహించాలి’అని డబ్ల్యూహెచ్‌వో ప్రభుత్వాలకు సూచించింది.
వేసుకోకుంటే వచ్చే నష్టాలు చెప్పాలి...
‘చాలా మంది వారిలో కరోనా వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే అంశాన్ని బేరీజు వేసుకుంటారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా సైడ్‌ఎఫెక్టŠస్ వస్తాయా? అనవసరంగా వేసుకుంటున్నామా? అని ఆలోచిస్తారు. అందువల్ల వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల జరిగే నష్టాలను ఎక్కువగా ప్రచారం చేయాలి. వ్యాక్సిన్ అనేది వ్యక్తిగతమే కాదు, అది సమాజానికి, పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఎంత ప్రయోజనమో చెప్పాలి’అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
యాంటీబాడీలు ఏర్పడే దాకా జాగ్రత్తలు పాటించాలి...
వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా మాస్క్ పెట్టుకోవాలని పదేపదే చెప్పడం వల్ల వ్యాక్సిన్‌పై ప్రజల్లో అపనమ్మకాలు ఏర్పడతాయి. టీకానే దివ్యౌషధం అంటున్నప్పుడు మళ్లీ మాస్క్ ఎందుకు వాడాలనే సందేహం ప్రజల్లో తలెత్తుతుంది. వాస్తవానికి మాస్క్ ఎందుకు పెట్టుకోవాలంటే వ్యాక్సిన్ రెండు డోసుల్లో రెండుసార్లు వేస్తారు. ఆ రెండు డోసుల మధ్య కాలవ్యవధి 28 రోజులు. రెండో డోసు వేసుకున్న 14వ రోజుకు అంటే మొత్తంగా 42 రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. అప్పటివరకు జాగ్రత్తలు పాటించక తప్పదు. దీనిపైనే ప్రజలకు అవగాహన కల్పించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి
53% భారతీయులు నో
దేశంలో 53 శాతం మంది ప్రజలు ఇప్పటికిప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి సుముఖంగా లేరని తాజా ఆన్‌లైన్ అధ్యయనంలో వెల్లడైంది. కేవలం 47 శాతం మందే వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆన్‌లైన్‌లో ఆరోగ్యంపై అవగాహన కల్పించే ‘జీవోక్యూఐఐ’అనే సంస్థ పేర్కొంది. అయితే సుముఖంగా లేని 53 శాతం మందిలో 80 శాతం మంది మాత్రం వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు నమ్మకం కుదిరితే వేసుకుంటామని పేర్కొన్నట్లు తెలిపింది. అందులో మిగిలిన 20 శాతం మంది మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో టీకా తీసుకోబోమని తేల్చిచెప్పినట్లు జీవోక్యూఐఐ వివరించింది. వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్న వారిలో 48 శాతం మంది పురుషులు, 42 శాతం మంది మహిళలు ఉన్నట్లు చెప్పింది. 45 ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి సిద్ధంగా లేరని సర్వే పేర్కొంది. జీవోక్యూఐఐ చేపట్టిన ఈ ఆన్‌లైన్ సర్వేలో సుమారు 11 వేల మంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment