జెనీవా: కోవిడ్–19 వైరస్ డెల్టా వేరియంట్ దాదాపు 85 దేశాల్లో వ్యాపించిందని, ఇప్పటివరకు గుర్తించిన వేరియంట్ల కన్నా ఇది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయాసస్ హెచ్చరించారు. ముఖ్యంగా టీకా తీసుకోని సమూహాల్లో దీన్ని వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందన్నారు. ప్రపంచ దేశాలతో పాటు తాము సైతం ఈ వేరియంట్‌పై ఆందోళనగా ఉన్నామన్నారు. కొన్ని దేశాల్లో కరోనా నిబంధనల సడలింపు కారణంగా ఈ వేరియంట్ వ్యాప్తి మరింత పెరగవచ్చన్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే మరలా మృత్యు ఘంటికల మోత పెరుగుతుందన్నారు.
భవిష్యత్‌లో మరిన్ని కరోనా వైరస్ వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. వైరస్‌లంటేనే మార్పులు తప్పనిసరని, కానీ వ్యాప్తిని అరికట్టడం ద్వారా కొత్త వేరియంట్ల పుట్టుకను అడ్డుకోవచ్చని తెలిపారు. డెల్టా వేరియంట్ మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఆల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్ చాలా డేంజరని డబ్ల్యూహెచ్‌ఓ ఉన్నతాధికారి డా. మారియా హెచ్చరించారు. పలు దేశాల్లో ఈ వేరియంట్ల కేసులు పెరుగుతున్నట్లు గమనిస్తున్నామన్నారు. పలు యూరప్ దేశాల్లో మొత్తంమీద కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో ప్రజలు గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయ ని, దీనివల్ల డెల్టావేరియంట్ వేగంగా వ్యాపించేందుకు దోహదం చేసినట్లవుతుందని ఆమె వివరించారు. చదవండి: (వ్యాక్సినేషన్ తర్వాతా.. 76% మందికి కరోనా)
కొన్ని దేశాల్లో ఎక్కువమందికి టీకాలందినా, పూర్తి జనాభాకు ఇంకా టీకాలు వేయడం పూర్తికాలేదని గుర్తు చేశారు. డెల్టా వేరియంట్ సహా అన్ని రకాల వేరియంట్లను సమర్ధవంతంగా అడ్డుకోవడంలో టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని భరోసా ఇచ్చారు. టీకాలతో పాటు ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పక పాటించడమే ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమని గుర్తు చేశారు. భారీ గా గుమిగూడడం వల్ల భారీ ప్రమాదాలుంటాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం ఆల్ఫా వేరియంట్ 170 దేశాల్లో, బీటా వేరియంట్ 119 దేశాల్లో, గామా వేరియంట్ 71 దేశా ల్లో, డెల్టా వేరియంట్ 85 దేశాల్లో వ్యాపించాయి. చదవండి: (వణికిస్తున్న‘డెల్టా’.. అక్కడ మరోసారి పూర్తి లాక్‌డౌన్)
Comments
Please login to add a commentAdd a comment