![ICMR And NIN Reports Antibodies Developing One For Every Four Persons - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/10/corona.jpg.webp?itok=_hSmVuxd)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి యాంటీబాడీస్ (ప్రతి దేహకాలు) అభివృద్ధి చెందాయి. ఈ మేరకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) మంగళవారం వివరాలు వెల్లడించాయి. కోవిడ్‌పై పోరాడే యాంటీబాడీస్ రాష్ట్ర వ్యాప్తంగా 24.1% మందిలో ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందని పేర్కొంది. డిసెంబర్‌లో జనగాం, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో మూడో విడత సీరో సర్వే జరిగింది. ఆ వివరాలను ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి.
జనగాం జిల్లాలో మే నెలలో 0.49%, ఆగస్టులో 18.2%, డిసెంబర్‌లో 24.8% మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. నల్లగొండ జిల్లాలో మేలో 0.24 శాతం, ఆగస్టులో 11.1%, డిసెంబర్‌లో 22.9 శాతం యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. కామారెడ్డి జిల్లాలో మేలో 0.24%, ఆగస్టులో 6.9%, డిసెంబర్‌లో 24.7 శాతం అభివృద్ధి చెందాయి. ఆ ప్రాంత సీరో సర్వేను రాష్ట్రానికి వర్తింపచేయగా, గతేడాది మేలో మొదటి సీరో సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 0.33 శాతం మాత్రమే కరోనా యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత ఆగస్టులో రెండో సీరో సర్వేలో 12.5 శాతం జనాభాలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు తేలింది. గత డిసెంబర్‌లో జరిపిన మూడో సర్వేలో 24.1 శాతం మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయని తెలిపాయి.
దేశవ్యాప్తంగా 3 రెట్లు వృద్ధి
ఆగస్టుతో పోలిస్తే డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా సగటున యాంటీబాడీస్ 3.1 రెట్లు పెరగగా, తెలంగాణలో 2 రెట్లు పెరిగినట్లు ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ అమలు చేయడం, మాసు్కలు ధరిం చడం వల్ల ఇప్పటికీ వైరస్ వ్యాప్తి నెమ్మదిగా, నిలకడగా ఉందని ఐసీఎంఆర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. అయితే మున్ముందు కూడా ప్రజలు మాస్కులు ధరించాలని, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని కోరారు.
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సర్వే..
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సీరో సర్వే జరుగుతోందని, తమ అంచనా ప్రకారం దాదాపు 50 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందే అవకాశం ఉందని డాక్టర్ లక్ష్మయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 17 నుంచి జనవరి 8 వరకు నిర్వహించిన మూడో సీరో సర్వేలో 21.5 శాతం మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయని ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ వెల్లడించాయి. గతేడాది మే 11 నుంచి జూన్ 4 మధ్య నిర్వహించిన సర్వేలో 0.7 శాతం మందిలో, ఆగస్టు 17 నుంచి సెపె్టంబర్ 22 మధ్య నిర్వహించిన సర్వేలో 7.1 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందాయని తెలిపాయి.
దేశవ్యాప్తంగా మూడో సర్వేలో మహిళల్లో 22.7 శాతం, పురుషుల్లో 20.3 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు వెల్లడించాయి. వయసు వారీగా చూస్తే 10–17 ఏళ్ల వయసు వారిలో 25.3 శాతం, 18–44 ఏళ్ల వయసు వారిలో 19.9 శాతం, 45–60 ఏళ్ల మధ్య వయసు వారిలో 23.4 శాతం, 60 ఏళ్లు పైబడిన వారిలో 23.4 శాతం యాంటీబాడీస్ అభివృద్ధి అయినట్లు తెలిపాయి. మూడో సర్వే ప్రకారం ఆరోగ్య కార్యకర్తల్లో 25.7 శాతం యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు వెల్లడించాయి. కాగా, డాక్టర్లు, నర్సుల్లో మాత్రం అత్యధికంగా 26.6 శాతం యాంటీబాడీస్ వృద్ధి చెందాయి.
యాంటీ బాడీస్ అంటే?
వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రెండు రకాల రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. వాటినే బీ సెల్ ఆధారిత, టీ సెల్ ఆధారిత రోగ నిరోధక శక్తి అంటారు. బీ సెల్ ఆధారిత రోగ నిరోధక శక్తి వల్ల మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఇవి రెండు రకాలు. వాటినే ఐజీఎం, ఐజీజీ అంటారు. మన శరీరంలో కరోనా ఇన్‌ఫెక్షన్ వచ్చిన వారం రోజుల్లో యాంటీ బాడీల ఉత్పత్తి మొదలవుతుంది. యాంటీబాడీస్ ఉన్నాయంటే గతంలో కరోనా ఇన్‌ఫెక్షన్ వచ్చి పోయినట్లు అర్థం. ఇవి ఎన్ని నెలలు ఉంటాయనేది వైరస్ రకాన్ని బట్టి ఉంటుంది. ఐసీఎంఆర్ అంచనా ప్రకారం కోవిడ్‌లో అవి ఆరు నెలలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment