ICMR
-
క్షయ నిర్మూలన ఓ అత్యవసరం!
క్షయ (టీబీ) వ్యాధిని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ వ్యాధిపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీబీ నిర్మూలనలో మన దేశం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, రోగులు పూర్తిగా కోలుకునేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని అమలుచేస్తోంది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి, స్వల్పకాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకూ అనుమతి ఇవ్వడం విశేషం.దేశం నుంచి క్షయ (టీబీ)ని పారదోలాలని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆయన నాయకత్వంలో టీబీని నిర్మూలించేందుకు వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సల్లో మార్పు తీసుకువచ్చేందుకు గత కొన్నేళ్లుగా వినూత్న విధానాలను భారత్ అవలంబిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన ‘ప్రపంచ టీబీ నివేదిక – 2024’లో ఇప్పటి వరకు దేశంలో అవలంబిస్తున్న విధానాలను ప్రస్తావించింది. దేశంలో 2015 నుంచి 2023 వరకు 17.7 శాతం మేర టీబీ వ్యాప్తి తగ్గింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాధి క్షీణత రేటు విషయంలో ఇది రెట్టింపు. అలాగే దేశ వ్యాప్తంగా 25.1 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఫలితంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకునేవారి శాతం 2015లో ఉన్న 59 నుంచి 2023 నాటికి 85 గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి దార్శనిక స్ఫూర్తితో టీబీని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. క్షయపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్య క్రమాన్ని పంచకుల నుంచి ప్రారంభించింది. వ్యాధి తొలిదశలో ఉండగానే క్షయ రోగులందరినీ గుర్తించి వారికి సకాలంలో అవస రమైన, నాణ్యమైన చికిత్సను అందించాలనే మా సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది. ‘జన్ భగీదారి’ స్ఫూర్తితో మనమంతా– ప్రజాప్రతినిధులు, ఆరోగ్య నిపుణులు, పౌరసమాజం, కార్పొరేట్ సంస్థలు, సంఘాల–సంయుక్తంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేద్దాం.భారత్ నుంచి టీబీని తరిమేసే ప్రయాణంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న చురుకైన భాగస్వామ్యం... ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలుస్తుందనే భరోసాను ఇచ్చింది. టీబీ నిర్మూలనలో మన దేశ సామాజిక విధానం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, టీబీ రోగులు పూర్తిగా కోలుకొనేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం... ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని భారత్ అమలుచేస్తోంది. ఏప్రిల్ 2018 నుంచి 1.16 కోట్ల మంది లబ్ధి దారులకు ఎన్‌పీవై పథకం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ. 3,295 కోట్లు అందించారు. ఈ పథకం ద్వారా నెలవారీగా అందించే ఆర్థిక సాయం గత నవంబర్ నుంచి రూ. 500 నుంచి రూ. 1000కి పెంచడం క్షయ నిర్మూలనలో భారత్ నిబద్ధతను సూచించే మరో అంశం.మరో కీలక అంశం... పోషకాహర సమస్యను పరిష్కరించడంతో పాటు సమాజ భాగస్వామ్యం పెరిగేలా ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ తోడ్పడింది. అలాగే సమాజంలో వివిధ వర్గాలను ఏకం చేసి అవగాహన పెంచడానికి, టీబీ రోగులకు పోషకాహారం, వృత్తిపరంగా, మానసికంగా సాయం అందించే దిశగా సామూహిక ఉద్య మాన్ని సృష్టించింది. జన్ భగీదారి స్ఫూర్తితో ప్రభుత్వ – పౌర భాగ స్వామ్యంతో చేపట్టిన ఈ ఉద్యమం 1.75 లక్షల మంది ని–క్షయ మిత్రల ద్వారా దేశవ్యాప్తంగా 21 లక్షల ఆహార కిట్లను సరఫరా చేసేందుకు స్ఫూర్తినిచ్చింది.టీబీని రూపుమాపడానికి వినూత్న విధానంఅనేక సంవత్సరాలుగా చికిత్స సఫలతా రేటును పెంపొందించేందుకు బెడాక్విలైన్, డెలామనిడ్ వంటి సరికొత్త ఔషధాలను భారత్ ప్రవేశపెట్టింది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి స్వల్ప కాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకు అనుమతి నిచ్చాం. ఇప్పటికే ఉన్న చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది మరింత ప్రభావ వంతంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు 19 నుంచి 20 నెలల పాటు సాగే సంప్రదాయ చికిత్సా విధానంతో పాటు 9 నుంచి 11 నెలల పాటు సాగే చికిత్సా విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ బీపీఏఎల్ఎమ్ విధానంతో రోగులు ఆరు నెలల్లోనే చికిత్సను పూర్తి చేసుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో రోగులందరినీ గుర్తించి సత్వరమే చికిత్స అందించడడానికి వీలుగా అందుబాటులో అధునాతన పరికరాలు ఉండేలా నిరంతర కృషి చేస్తున్నాం. దీని కోసమే సమర్థవంతమైన, కచ్చితమైన పరీక్షా పద్ధతులను ప్రవేశపెట్టాం. అవే జీవ పరమాణు పరీక్షలు (మాలిక్యులర్ టెస్ట్స్). 2014 –15లో కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఉన్న వ్యాధి నిర్ధారణ పరికరాల సంఖ్య ప్రస్తుతం 8,293 కు చేరుకున్నాయి. ఈ పరికరాలు అన్ని జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ స్ఫూర్తితో స్వదేశీ జీవ పరమాణు పరీక్షలను క్షేత్రస్థాయిలో పరీక్షించి రూపొందించిన పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా జిల్లా, బ్లాకు స్థాయిల్లో టీబీ నిర్ధారణకు వెచ్చించే సమయాన్ని తగ్గించడంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించగలిగాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన మన స్వదేశీ మాలిక్యులర్ పరీక్షలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాలు టీబీ నిర్మూలనలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాయి.2018 నుంచి టీబీ పరిశోధనలపై అధికంగా నిధులు వెచ్చిస్తున్న అగ్ర సంస్థల్లో ఒకటిగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్థిరంగా నిలవడం మనందరికీ గర్వకారణం. రోగులకు అతి చేరువలోనే సమర్థవంతమైన వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో సహా మరిన్ని నూతన సాధనాలను త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు కొనసాగిస్తాం. భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తూ...వివిధ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నిరూపి తమైన సాంకేతికతలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడం... టీబీ నిర్మూలనా దిశలో భారత్ నాయకత్వానికి నిదర్శనాలు. అధు నాతన రోగ నిర్ధారణ, చికిత్సలకు దారితీసే మార్గదర్శక పరిశోధనల నుంచి సార్వత్రిక సామాజిక తోడ్పాటును అందించే నియమాలను ప్రవేశ పెట్టేవరకూ... టీబీని పారదోలడంలో మన దేశం ముందంజలో ఉంది. టీబీని గుర్తించడం, నిర్ధారించడం, చికిత్స, నివారణలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేయడం ఈ సమయంలో అత్యవసరం. 100 రోజుల పాటు ఉద్ధృతంగా సాగే ప్రచారం టీబీని రూపుమాపడంలో సామూహిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వంలో అందరి భాగస్వా మ్యంతో, మానవాళికి పెద్ద శత్రువుగా ఉన్న టీబీని ఓడించి, ఆరోగ్య కరమైన భవిష్యత్తును కల్పిస్తామని నేను విశ్వసిస్తున్నాను.జగత్ ప్రకాశ్ నడ్డా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి -
అతి వినియోగం అనర్థమే
యాంటీ బయాటిక్స్ అతి వినియోగం కొంపముంచుతోంది. దగ్గు, జలుబు, ఇలా ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగి పోయింది. దీంతో వ్యాధి కారక సూక్ష్మజీవులు రోగనిరోధక శక్తిపెంచుకుని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)తీవ్ర సమస్యగా మారుతోంది. ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ), బ్లడ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సాధారణ యాంటీ బయోటిక్ మందులతో చికిత్సలు కష్టతరంగా మారాయని ఐసీఎంఆర్ చెబుతోంది. ఐసీఎంఆర్‌కు చెందినఏఎంఆర్ రీసెర్చ్, సర్వైలెన్స్ నెట్వర్క్ విభాగం ఇటీవల 2023 నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ మధ్య దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 99,492 నమూనాలను విశ్లేషించి, ఆ ఫలితాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. 20 శాతం తక్కువ ప్రభావంవిశ్లేషించిన నమూనాల్లో 22,182 రక్తం, 20,026 యూరిన్, 19,360 అంటు వ్యాధులు, 17, 902 లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మిగిలినవి ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు చెందినవి. కాగా సెఫోటాక్సిమ్, సెప్టాజిడిమ్, సిప్రోఫ్లా్లక్సాసిన్, లెవోఫ్లాక్సాసిన్ వంటి కీలక యాంటీ బయాటిక్స్ బ్యాక్టీరియాతో కలిగే ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో 20 శాతం తక్కువ ప్రభావాన్ని చూపినట్టు నిర్ధారించారు. ఉదాహరణకు పైపెరాసిలిన్–టాజోబాక్టమ్ ప్రభావం 2017లో 56.8 శాతం ఉండగా 2023లో 42.4 శాతానికి తగ్గింది. గ్యాస్ట్రోఎంటరైటిస్కు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫీ వంటి బ్యాక్టీరియా ఫ్లూరోక్వినోలోన్ ఔషధానికి 95 శాతానికిపైగా నిరోధకతను పెంచుకుందని స్పష్టమైంది. మూత్రనాళ, ఇతర ఇన్ఫెక్షన్లలో చికిత్స కోసం వినియోగించే అమికాసిన్ ప్రభావం 2017లో 79.2 శాతం ఉండగా, 2023లో 68.2 శాతానికి పడిపోయింది. ఏఎంఆర్ ముప్పు నుంచి బయటపడటానికి తక్షణ చర్యలు అవసరమని ఈ నివేదిక నొక్కి చెప్పింది. యాంటీ బయాటిక్స్ విక్రయాలు, వినియోగంపై కఠినమైన నిబంధనలు ఉండాలని వెల్లడించింది. వ్యవసాయరంగంలోనూ యాంటీ బయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టాలని స్పష్టం చేసింది. ఏటా 10 లక్షల మంది మృతి యాంటీ బయాటిక్స్ అపరిమిత వినియోగం కారణంగా వ్యాధులు సోకిననప్పుడు చికిత్సల్లో అవి పని చేయక ప్రపంచంలో ఏటా 10 లక్షల మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. 1990–2021 మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాన్సెట్‌లో ప్రచురించిన స్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. రాబోయే 25 ఏళ్లలో నాలుగు కోట్ల మంది మృత్యువాత పడే ప్రమాదం ఉన్నట్టు అంచనా వేసింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో 2025–2050 మధ్య యాంటీ బయాటిక్స్‌కు లొంగని వ్యాధులతో 1.18 కోట్ల మరణాలు సంభవిస్తాయని పేర్కొంది. మానవాళి ఎదుర్కొంటున్న 10 అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో ఏఎంఆర్ ఒకటని డబ్ల్యూహెచ్‌వో సైతం ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిందని గుర్తు చేసింది.- సాక్షి, అమరావతి -
ఎడాపెడా పురుగుమందుల స్ప్రే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పురుగుమందుల వాడకం మితిమీరుతున్నట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) వెల్లడించాయి. దీంతో రైతులను తీవ్రమైన శ్వాసకోశ, చర్మ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని పేర్కొంది. వరి, పత్తి పండించే రైతులే ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సంస్థలు నిర్వహించిన ‘దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పురుగుల మందు వాడకం–రైతుల ఆరోగ్యంపై ప్రభావం–నివేదిక’అనే అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 18–70 ఏళ్ల మధ్య వారిపై సర్వే చేశారు. అందులో కనీసం ఒక సంవత్సరం పాటు పురుగుమందులు పిచికారీ చేసిన వారున్నారు.వయస్సు, లింగం, ఎత్తు, బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి, విద్యాస్థాయి, ప్రధానవృత్తి, వారు అనుసరించే వ్యవసాయ పద్ధతులు, పురుగుమందుల వాడకం, విస్తీర్ణం, ఖర్చులు, కూలీల పనులు, çపురుగు మందుల వినియోగానికి గల కారణాలు తదితర సమాచారం సేకరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రక్తం, మూత్ర నమూనాలను సేకరించారు. పురుగు మందులను ఎక్కువగా వాడటం వల్ల కొందరు కేన్సర్, అల్జీమర్స్ వంటి పెద్ద వ్యాధులకు కూడా గురువుతున్నారని పేర్కొంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లెక్కల ప్రకారం 28 రకాల పురుగు మందుల్లో 11 రకాల మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా వర్గీకరించింది. రైతుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల ద్వారా వారిలో పురుగు మందుల అవశేషాలు కనుగొన్నట్టు ఆ నివేదిక తెలిపింది. నిషేధిత రసాయనాలు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారని తేలి్చంది. యాదాద్రి–భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో క్రాస్ సెక్షనల్ సర్వే జరిగింది. అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలు ⇒ వాణిజ్య పంటల్లో మితిమీరిన పురుగు మందుల వినియోగం వల్ల అనేక నష్టాలు వాటిల్లుతున్నాయి. అవగాహన లేకపోవడంతో తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ⇒ రైతులు పురుగుమందులను కలపడానికి ఒట్టి చేతులను ఉపయోగించడం వల్ల కూడా నష్టం జరుగుతోంది. ⇒ పురుగు మందుల మితిమీరిన వాడకం వల్ల ఊపిరి ఆడక పోవడం, ఛాతీనొప్పి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, వాంతులు, తిమ్మిరి, కండరాల బలహీనత, తలనొప్పి, తల తిరగడం, బ్యాలెన్స్ సమస్యలు తలెత్తుతున్నాయి. ⇒ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో వాణిజ్య పంట లు పండించే రైతులు పురుగు మందులను మితిమీరి వా డారు. నిషేధిత రసాయనాలను కూడా వినియోగించారు. ⇒ అవగాహన ఉన్న రైతులు మాత్రం 36 శాతం తక్కువగా పురుగు మందులను వినియోగించినట్టు తేలింది. ఈ రైతులు మెరుగైన విత్తన రకాలు, సేంద్రియ పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ⇒ పురుగు మందులకు గురికావడం వల్ల రైతుల్లో జీర్ణాశయ సమస్యల నుంచి నాడీ సంబంధిత లక్షణాలు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వంటివి చుట్టుముడుతున్నాయి. పిల్లలు కూడా పురుగు మందులకు గురవుతున్నారు. ⇒ సేంద్రియ పురుగు మందులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. -
టెకీలూ.. కాస్త విశ్రమించండి
సాక్షి, అమరావతి: జీవితంలో త్వరగా స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే భేష్ అని చాలామంది అనుకుంటారు. మంచి వేతనం.. వారాంతపు సెలవులు వంటి వెసులుబాట్లు సౌకర్యాలెన్నో వారికి ఉంటాయని చెబుతారు. టెకీల జీవితంలో ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు పరిశీలిస్తే వారిని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒత్తిడి వల్ల తరచూ వెన్నునొప్పి వంటి సమస్యలతో టెకీలు ఇబ్బందులు పడుతున్నారు. యాంత్రిక జీవన శైలితో 25 నుంచి 40 ఏళ్లలోపే ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒకేచోట గంటల తరబడి కూర్చుని పని చేయడం, శారీరక శ్రమ లేమి వంటి కారణాలతో 40 ఏళ్లు పైబడిన వారిలో ఆరోగ్య సూచీలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. 43% మందిలో ఆరోగ్య సమస్యలే దేశంలో 43 శాతం మంది టెకీలు పని నుంచి ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ అంశాన్ని నాలెడ్జ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (కేసీసీఐ) సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. టెకీల్లో సగానికిపైగా వారానికి సగటున 52.50 గంటలు పని చేస్తున్నారు. అస్థిరమైన పని షెడ్యూళ్లతో 26 శాతం మంది నిద్ర లేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 51 శాతం మంది రోజుకు సగటున ఐదున్నర గంటల నుంచి ఆరు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఎక్కువ మందిలో వెన్నునొప్పి ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మందిలో మెడ, వెన్నునొప్పి సాధారణంగా ఉంటోంది. ఈ సమస్యలతో తమ దగ్గరకు వచ్చే యువతలో అత్యధికులు టెకీలే ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. టెకీలు గంటల తరబడి కార్యాలయాల్లో కూర్చుని పనిచేస్తుంటారు. మెడ ఎముక, భుజం ఎముక వెన్నెముకతో అనుసంధానమై ఉంటాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల మెడ, వెన్నెముకలో ఒకచోట అమరిక అస్తవ్యస్తమై ఇతర భాగా లపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో కూర్చోవడంతో పాటు, నిలబడినప్పుడు భంగిమ సరిగా ఉండేలా చూసుకోవాలని వైద్యు లు సూచిస్తున్నారు. నిల్చున్నప్పుడు తల, భుజాల వెనుక భాగం, పిక్కలు గోడకు తాకి ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఫోన్, ల్యాప్‌ట్యాప్ చూసేప్పుడు సహజంగానే మెడ ముందుకు వాల్చకుండా ఉండాలి. ఒత్తిడిని అధిగమించడానికి యోగా, మెడిటేషన్ చేయాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కుటుంబ సభ్యులు, పిల్లలతో గడపడం, ఇష్టమైన సంగీతం వినడం, సినిమాలు చూడటం ద్వారా ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటున్నారు. యాంత్రిక జీవన శైలితో ఇబ్బందులు పడుతున్న టెకీల వయసు 25 - 40సగానికి పైగా టెకీలు వారానికి (5 రోజులు) సగటున పనిచేస్తున్న గంటలు 52.50అస్థిరమైన పని షెడ్యూళ్లతో నిద్రలేమిని ఎదుర్కొంటున్నవారు (శాతంలో) 26రోజుకు సగటున ఐదున్నర గంటలు మాత్రమే నిద్రపోతున్న టెకీలు (శాతంలో) 51ఐసీఎంఆర్ ఏం చెబుతోందంటే.. పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచిస్తోంది. ఆ సూచనలు ఇవీ..» ఎంత బిజీగా ఉన్నప్పటికీ పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కుపోకుండా పనిచేసే ప్రదేశాల్లో స్టాండింగ్ డెస్క్ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి. » ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలి. » ఇల్లు లేదా పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్‌కు బదులు మెట్లను వినియోగించాలి. » టీవీ చూస్తున్నప్పుడు కుర్చికే పరిమితం కాకూడదు. కమర్షియల్ బ్రేక్ సమయంలో లేచి తిరగాలి. » రోజుకు 30 నుంచి 60 నిమిషాలు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి. వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి. » రోజులో 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. -
కుర్చీకి అతుక్కుపోతే అంతే సంగతులు
ఏ వయసు వారైనా రోజుకు తగినంత శారీరక శ్రమ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. చదువు, పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సూచిస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), ఐసీఎంఆర్ కలిసి డైట్రీ గైడెన్స్ ఫర్ ఇండియా పేరిట మెరుగైన ఆరోగ్యం కోసం 17 మార్గదర్శకాలను ఇటీవల వెల్లడించాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం శారీరక శ్రమ, యోగా, వ్యాయామంపై పలు సిఫార్సులు చేశాయి. – సాక్షి, అమరావతిప్రతి కొద్ది గంటలకు కదలిక ఉత్తమంఎంత బిజీగా ఉన్నా పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కోపోవడం సరికాదు. ప్రతి కొన్ని గంటలకు ఒకసారి శరీరాన్ని కదల్చాలని ఐసీఎంఆర్ సూచించింది. పని చేసే ప్రదేశాల్లో స్టాడింగ్ డెస్క్ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి. అదే విధంగా ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలని పేర్కొంది. ఇంట్లో, పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్‌కు బదులు మెట్లను వినియోగించాలి. టీవీ చూస్తున్నప్పుడు కుర్చీకే పరిమితం కాకూడదు. టీవీల్లో వచ్చే కమర్షియల్ బ్రేక్ సమయంలో లేచి తిరగాలి.30 నుంచి 60 నిమిషాల వ్యాయామం⇒ 19 నుంచి 60 ఏళ్ల వయసు వారు రోజుకు 30 నుంచి 60 నిమిషాల పాటు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి.⇒ వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి.⇒ వయసు, ఆరోగ్య స్థితిగతులను పరిగణనలో ఉంచుకుని ఏరోబిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ వంటి ఇతర శారీరక శ్రమ చేయాలి.⇒ ఇదే తరహాలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు కూడా వారం మూడు, అంతకంటే ఎక్కువ రోజులు శారీరక శ్రమను ఐసీఎంఆర్ సూచించింది.⇒ 5–19 ఏళ్ల పిల్లలు, యుక్త వయస్కులకు రోజుకు కనీసం 60 నిమిషాల ఇంటెన్సిటీ యాక్టివిటీని సూచించింది.భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో సూచనలు అందుకోలేక పోయిన వారు.. (శాతం)సంపూర్ణ ఆరోగ్యం కోసం దైనందిన జీవనంలో వివిధ కార్యకలాపాలపై సిఫార్సులు ఇలా..లాన్సెట్ అధ్యయనం ఏం చెబుతోందంటే.. భారత్‌లోని 57 శాతం మహిళలు, 42 శాతం మంది పురుషులు ఫిజికల్ ఇనాక్టివ్‌గా ఉంటున్నట్టు తాజాగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లోని డేటాను అధ్యయనం చేయగా భారత్ 12వ స్థానంలో ఉన్నట్టు స్పష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా 31 శాతం మంది పెద్దలు అంటే.. దాదాపు 1.8 బిలియన్ల మంది 2022లో ఇనాక్టివ్‌గా ఉంటున్నారు. 2010 నుంచి 2022 మధ్య 5 శాతం మేర ఈ స్థాయి పెరిగినట్టు తేలింది.వారానికి కనీసం 150 నిమిషాలు..ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతీయుల్లో కూడా శారీరక శ్రమ తగ్గిపోతోంది. జీవన శైలి జబ్బుల బారినపడకుండా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచిస్తోంది. -
కొవాగ్జిన్ పేటెంట్‌కు సహ యజమానిగా ఐసీఎంఆర్
హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) తమ కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్‌కు సహ యజమానిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)ను చేర్చినట్లు తెలిపింది.భారత్ బయోటెక్ తమ కొవాగ్జిన్ ఒరిజినల్ పేటెంట్ ఫైలింగ్‌లో ఐసీఎంఆర్‌ను చేర్చకపోవడం వివాదానికి దారితీసింది. అయితే ఈ తప్పిదం అనుకోకుండా జరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీబీఐఎల్-ఐసీఎంఆర్ అగ్రిమెంట్ కాపీ గోప్యమైన డాక్యుమెంట్ కావడంతో అందుబాటులో లేదని, దీంతో ఐసీఎంఆర్‌ను ఒరిజినల్ అప్లికేషన్ లో చేర్చలేదని వివరణ ఇచ్చింది.ఈ తప్పిదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, ఐసీఎంఆర్ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, వివిధ ప్రాజెక్టులపై నిరంతరం సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ పొరపాటును గుర్తించిన వెంటనే, కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పేటెంట్ దరఖాస్తులకు సహ యజమానిగా ఐసీఎంఆర్‌ను చేర్చడం ద్వారా దానిని సరిదిద్దే ప్రక్రియను బీబీఐఎల్ ఇప్పటికే ప్రారంభించింది. అవసరమైన లీగల్ డాక్యుమెంట్లను సిద్ధం చేస్తున్నామని, అవి సిద్ధమై సంతకం చేసిన వెంటనే పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేస్తామని కంపెనీ పేర్కొంది.ఐసీఎంఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థ. పుణెలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారత్ బయోటెక్ సంయుక్తంగా 2020 ఏప్రిల్‌లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) తర్వాత కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేశాయి. -
మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
మంచి రుచికరంగా వంట చేయడం ఓ కళ. అయితే ఇప్పుడూ చాలా విభిన్నమైన కొత్త కొత్త రుచులు వచ్చేస్తునన్నాయి. అంతా వాటిని ట్రై చేస్తున్నారు కూడా. అయితే రుచికి మాత్రమే కాదు, వండే విధానానికి కూడా ప్రాధాన్యం ఇవ్వమని హెచ్చరిస్తోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్). వండేటప్పుడూ మూత పెట్టకుండా వండితే ఇక అంతే సంగతులను గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. దీని వల్ల ఎక్కవసేపు మంటమీద ఉడికించాల్సి రావడమే గాక ఆరోగ్యానికి హనికరమని చెబుతుంది. ఎలా వండితే మంచిదో కూడా వెల్లడించింది. అవేంటో సవివరంగా చూద్దామా..!ఓపెన్ మూత వర్సెస్ క్లోజ్డ్ వంట:మూత పెట్టి కూరలు వండితే సమయం ఆదా అవ్వడమే గాక పోషకాల నష్టం కూడా ఉండదని చెబుతోంది. అదే మూత లేకుండా వండితే..ఎక్కువసేపు పట్టడమేగాక ఆహార పదార్థాలు ఎక్కువ సేపు ఉష్ణోగ్రతలోనే ఉడకటంతో పోషకల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తోంది. అలాగే మూత పెట్టి వండే వంటలో త్వరితగతిన వండేయగలం, మంచి పోషకవంతంగా ఉంటుందని చెబుతోంది. ముఖ్యంగా ఆకుపచ్చ కూరలను మూతపెట్టి వండితే కూర రంగు మారి, పోషకాల నష్టాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది. ఆరోగ్యకరమైన వంట పద్ధతులు..పప్పు దినులు పోషక నాణ్యత ఉండాలంటే మూత పెట్టి ఉడకించడం లేదా ప్రెజర్ కుక్కర్లో వంట చేయడం ఉత్తమం అని చెబుతోంది. అంటే మూతపెట్టి ప్రెజర్లో తగు మోతాదులో ఉడకించడం వల్ల పోషకాల నష్టం జరగకుండా కాపాడటమే గాక తొందరగా ఉడికిపోతాయి. పైగా ఆయా ఆహారపదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. అదీగాక ఇలా వంట చేయడం వల్ల ఆయా పదార్థాల ఆకృతిమారి, రుచికరంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి కూడా. దీని వల్ల హానికరమైన సూక్ష్మజీవులు ప్రమాదం కూడా ఉండదని, ఆహారం కలుషితం కాదని ఐసీఎంఆర్ పేర్కొంది. మైక్రోవేవ్‌లో వంట మంచిదేనా..ఇక్కడ మైక్రోవేవ్ కూడా త్వరితగతిన వండేస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. ఎక్కువసేపు మంట మీద ఉడకించే పద్ధతులతో పోలిస్తే పోషకాలు విచ్ఛిన్నం కాకుండా తక్కవ టైంలోనే త్వరితగతిన వండేసే పద్ధతులు బెటర్ అని చెప్పకనే చెప్పింది. మైక్రోవేవ్‌లో తక్కువ టైంలోనే ఆహార పదార్థాలు ఉడికిపోతాయి కాబట్టి విటమిన్లు, ఇతర పోషకాలు నష్టపోకుండా చేయడంలో సహాయ పడుతుందని ఐసీఎంఆర్ మార్గదర్శకాల్లో పేర్కొంది.(చదవండి: రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..! ఇంటర్ ఫెయిల్ అవ్వడమే..!) -
వ్యాయామం చేయని మహిళలు తీసుకోవాల్సిన డైట్ ఇదే!
మహిళలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అత్యంత ముఖ్యంగా. అందులోనూ వ్యాయామం చేయని మహిళలు తినే ఆహారం విషయంలో పట్ల శ్రద్ద వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతోంది. అలాంటి మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదే ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శకాలు కూడా అందించింది. అవేంటో చూద్దామా..!వ్యాయామం చేయని మహిళలు తినే ఫుడ్‌పై శ్రద్ధ పెట్టడం కీలకం. అతిగా తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ నూనెతో కాల్చినవి, ఆవిరిపై ఉడికించినవి తీసుకోవాలిన చెబుతున్నారు. అలాగే వాటి తోపాటు లీన్ ప్రోటీనఖ కూడా అవసరం. స్కిన్లెస్ చికెన్, చేపలు, అప్పడప్పుడూ రెడ్ మీట్ వంటివి తీసుకోవాలని సూచించారు. అదనప్పు కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు,లేకుండా చేసుకోవాలి. కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. హెర్బల్ టీలు వంటివి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటమే బెటర్బరువు అదుపులో ఉంచుకునే యత్నం చేయాలి. ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా తృణధాన్యాలు, కాలానుగుణంగా పండ్లకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అనారోగ్యకరమైన చిరుతిండ్లకు దూరంగా ఉండటం మంచిది. భోజనాని కంటే వివిధ రకాల పచ్చి కూరగాయలు తినడానికి యత్నం చేయాలి. మిల్లెట్స్ , బ్రౌన్‌రైస్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా బీన్స్, కాయధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన గింజలను(బాదం పప్పులు, జీడిపప్పులు)కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా గానీ తీసుకునే ఆహారాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తూ తినాలి, సమతుల్యతకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే.. మీ చేతుల్లోనే ఆరోగ్యం పదిలంగా ఐసీఎంఆర్ చెబుతోంది. వ్యాయామం చేయని మహిళలు ఈ విషయాలు గుర్తించుకుని మంచి డైట్ పాటిస్తే చాలని చెబుతోంది.(చదవండి: తొలి పోస్టల్ సర్వీస్ నుంచి .. సరికొత్త ట్యూన్ వరకు ఎన్నో ఘటనలకు సాక్షి 'మే 31'!) -
నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇటీవల చాలామంది నాన్‌స్టిక్ పాత్రలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిల్లో అయితే డీప్ ఫ్రైలు చేస్తే ఆయిల్ ఎక్కుపట్టదు. అదీగాక గమ్మున అడుగంటదు, ఈజీగా వంట అయిపోతుందని మహిళలు ఈ పాత్రలకే ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఐతే వీటిని అస్సలు ఉపయోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) గట్టిగా హెచ్చరిస్తోంది. వీటి వినియోగం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదమని తెలిపింది. పైగా ఎలాంటి పాత్రలు వాడితే మంచిదో కూడా సూచనలు ఇచ్చిందో అవేంటో సవివరంగా తెలుసుకుందామా!.ఎందుకు మంచిది కాదంటే..నాన్‌స్టిక్ వంటపాత్రలపై చిన్న గీత పడినా దాని మీద ఉన్న టెఫ్లాన్ పైపూత (కోటింగ్)లో నుంచి విష వాయువులు, హానికారక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఒక్క గీత నుంచి కనీసం 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది. గీతలు పడిన నాన్‌స్టిక్ వంటపాత్రలను 170 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది. కడిగేటప్పుడు నాన్‌స్టిక్ పాత్రలపై బోలెడన్ని గీతలు పడుతుంటాయి. ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. అవి తెలియకుండానే మనం తినే ఆహారంలో కలిసిపోతాయని పేర్కొంది. అందువల్ల వీటిని వినియోగించటం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వెల్లడించింది. వచ్చే అనారోగ్య సమస్యలు..హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది. నాన్ స్టిక్ వంటపాత్రల బదులు మట్టిపాత్రల్లో వండుకోవటం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్ పాత్రలను కూడా సూచించింది. అయితే వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది. అలాగే ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. ఈ మేరక సీఎంఆర్ భారతీయులకు ఆహార మార్గదర్శకాలు అనే పేరుతో ఈ సూచనలను ఇటీవలే విడుదల చేసింది.(చదవండి: ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?) -
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
ఢిల్లీ: ఆరోగ్యంగా ఉండటంలో పౌష్టిక ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారం తినటం వల్ల శరీరకంగా బలంగా ఉంటాం. సమతుల ఆహారం తీసుకోవటంతో వ్యాధులు సైతం దరిచేరవు. ఇందుకోసమే.. తాజాగా భారత ప్రభుత్వం, ఐసీఎంఆర్ సంయుక్తంగా కొన్ని ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది.భారతీయులకు ఈ ఆహార మార్గదర్శకాలను పోషకాహార పరిశోధనా సంస్థ, ఐసీఎంఆర్ నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్), హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ఈ 17 ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలతో కూడిన ఈ బుక్‌ను ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డెరెక్టర్ డాక్టర్. హేమలత బుధవారం విడుదల చేశారు.ముఖ్యమైన 17 ఆహార మార్గదర్శకాలు ఇవే..1. సమతుల ఆహారం కోసం అన్ని రకాల ఆహారాలను తినాలి.2. గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు సాధారణం కంటే కొంచం అధిక మోతాదులో పౌష్టిక ఆహారం తీసుకోవాలి.3. మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా శిశువులకు రెండేళ్లు వచ్చే వరకు ఆపై కూడా తల్లి పాలు అందించాలి. 4. శిశువులకు ఆరు నెలల తర్వాత ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన ఘన, ద్రవ ఆహారాన్ని తినిపించాలి.5. చిన్నపిల్లలు అనారోగ్యం పాలు కాకుండా.. బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు చాలినంత ఆహారాన్ని అందించాలి.6. కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి.7. ఆహారంలో నూనెను సాధారణ మోతాదులో వాడాలి. మంచి కొవ్వు కోసం నూనె గింజలు, పప్పులు, అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి.8. నాణ్యమైన ప్రోటిన్, ఆమైనో యాసిడ్స్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. కండరాల దృఢత్వం కోసం ప్రోటిన్ సప్లిమెంట్లుకు దూరంగా ఉండటం మంచిది.9. జీవనశైలిలో ఉబకాయం, అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.10. ఆరోగ్యం కోసం శరీరాన్ని కదిలిస్తూ.. రోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి.11. ఆహారంలో ఉప్పును అధికంగా తినటం తగ్గించాలి. 12. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తినాలి13. మంచి ఆహార తయారీ పద్దతులు పాటించాలి.14. అధిక మోతాదులో శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి.15. అధిక కొవ్వు, తీపి ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.16. వృద్ధులు ముఖ్యంగా పౌష్టిక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.17.ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం కోసం.. ఆహార పదార్థాల మీద ఫుడ్ లెబుల్స్‌ను చదవాలి. -
చాక్లెట్లా? మందులా..? కాంబినేషన్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్
సాక్షి, హైదరాబాద్: వైద్యులపై విశ్వాసంతో రోగులు వారి వద్దకు వెళుతుంటారు. చిన్నాచితకా అనారోగ్య సమస్యల్ని సైతం వారికి చెప్పుకుంటారు. కానీ కొందరు డాక్టర్ల అవగాహన రాహిత్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. అవసరం లేకున్నా ఎడాపెడా మందులు రాస్తున్నారని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలో వెలుగు చూసింది. దేశంలో పేరెన్నికగన్న ఎయిమ్స్ వంటి ఆసుపత్రులు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు రాస్తున్న ప్రిస్కిప్షన్లలో నిబంధనల అతిక్రమణ జరుగుతున్నట్లు పరిశోధన తేల్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజేఎంఆర్‌లో తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. పీజీ విద్యార్థుల నుంచి అనుభవజ్ఞుల వరకు.. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్లు ఏ మేరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్న దానిపై ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. మొత్తం 4,838 ప్రిస్కిప్షన్లను అధ్యయనం చేసింది. ఇందులో 55 శాతం ప్రిస్కిప్షన్లు మాత్రమే నిబంధనల మేరకు ఉన్నాయని, 45 శాతం ప్రిస్కిప్షన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించింది. 9.8 శాతం ప్రిస్కిప్షన్లలో పూర్తిగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ, సైకియాట్రీ, ఆర్థో, ఛాతీ, డెంటల్, సూపర్ స్పెషాలిటీలకు చెందిన అన్ని విభాగాల్లో డాకర్లు రాసిన ప్రిస్కిప్షన్లలో ఈ రకంగా నిబంధనల అతిక్రమణ జరుగుతుంది. ఐసీఎంఆర్ అధ్యయనం చేసిన ప్రిస్కిప్షన్లు రాసిన వారిలో పీజీ విద్యార్థులు మొదలు నాలుగు నుంచి 18 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు కూడా ఉండటం గమనార్హం. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రిస్క్రిప్షన్లలో సగటున నాలుగు మందులు అనవసరంగా రాసినట్లు పరిశోధనలో గుర్తించారు. జలుబుకు ఇన్ని మందులా..! సాధారణ జలుబుకు కూడా డాక్టర్లు ఇష్టారాజ్యంగా మందులు రాసేస్తున్నారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. జలుబు, తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మాంటిలూకాస్ట్+లివోసిట్రిజిన్, పారసిటమాల్, డెక్స్ట్రోమితార్పాన్,రాబిప్రజోల్+డోమ్‌పెరిడోన్ ఈ నాలుగు మందులు అధికంగా వాడుతున్నారు. ఇందులో మాంటెలుకాస్ట్+లివోసిట్రిజిన్, రాబిప్రజోల్+డోమ్‌పెరిడోన్ మందులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని అనవసరంగా రాస్తున్నారు. ఈ కాంబినేషన్లు నిబంధనలకు విరుద్ధం. ఈ రెండు నిషేధిత జాబితాలో కూడా ఉన్నాయి. వీటివల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, మలేరియా, కీళ్ల నొప్పులు, మైగ్రెయిన్, కడుపులో మంట, అజీర్తి, పిప్పిపళ్లు, చెవిపోటు, టీబీ, పోస్ట్ కోవిడ్‌కు సంబంధించిన జబ్బుల్లో అత్యధికంగా నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. అజిత్రోమైసిన్, ర్యాంటిడిన్, ట్రిప్సిన్ వంటివి కూడా ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. ప్రిస్కిప్షన్లలో వీటిని ఎడాపెడా రాసేసుస్తున్నారు. చెవికి, శ్వాసకోశానికి కూడా ఒకేరకమైన మందులు వాడుతున్నారు. నొప్పి మందులతో పాటు ఎసిడిటీ మందులు ఎందుకు? నొప్పి మందుల వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎసిడిటీ రిస్క్ ఉన్న వారికే ఆయా మందులు రాయాలి. కానీ అందరికీ రాస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తేలికపాటి ఆహారం తీసుకుంటే సరిపోయే వారికి కూడా ఎసిడిటీ మందులు రాస్తున్నారు. ఎసిడిటీకి సంబంధించి పాంటోప్రొజోల్, రాబిప్రజోల్+డోంపెరిడోన్ అనే మందులు అత్యంత దుర్వినియోగానికి గురవుతున్నాయి. 21.9 శాతం ప్రిస్కిప్షన్లు అనవసరంగా రాసినట్లు నిర్ధారించారు. కాంబినేషన్ మందుల కింద అనవసరంగా రాస్తున్నారు. రియాక్షన్లు..దుష్ప్రభావాలు కీళ్ల నొప్పులకు సెరాసోపెప్టిడేజ్ అనే మందు రాస్తున్నారు. కానీ ఇది పనిచేస్తుందో లేదో స్పష్టత లేదని ఐసీఎంఆర్ తేల్చింది. కర్ణభేరి ఇన్ఫెక్షన్లకు వాడే సెఫిక్జిమ్ అనే మందు మొదటి ప్రాధాన్య మందు కాదు. కానీ అధికంగా వాడేస్తున్నారు. బీపీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మందులను అనవసరంగా రాస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆయా మందులు వాడటం వల్ల మందుల ఖర్చు పెరుగుతుంది. డ్రగ్ రియాక్షన్లకు కారణమవుతున్నాయి. చర్మంపై మచ్చలు వస్తున్నాయి. కాంబినేషన్లో రెండు మూడు మందులు రాయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. డోసులు ఎక్కువ తక్కువ! నిబంధనల అతిక్రమణలో మందులు అధికంగా, అనవసరంగా రాయడమే కాదు...డోసులు తక్కువ లేదా ఎక్కువ ఉండటం కూడా జరుగుతోంది. మందులు ఎన్ని రోజులు వాడాలి, రోజుకు ఎన్నిసార్లు వాడాలన్న దానిపైనా ప్రిస్క్రిప్షన్లు సరిగా ఉండటం లేదు. అలాగే ఫార్ములేషన్‌లో తప్పులు జరుగుతున్నట్లు నిర్ధారించారు. డయాబెటిక్ మందులు, హార్మోన్ మందులు, రక్తాన్ని పలుచన చేసే మందులు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. బీపీ, షుగర్, ఫిట్స్ రోగాలకు వాడే మందుల్లో సరైన కాలపరిమితిపై స్పష్టత ఇవ్వడం లేదు. డాక్టర్లకు అవగాహన కల్పించాలి ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులో 40 శాతం మందుకే వెచ్చిస్తున్నారు. మందుల వినియోగం శాస్త్రీయంగా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 344 మందుల కాంబినేషన్లను నిషేధిత జాబితాలో చేర్చింది. వీటి మీద డాక్టర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఐసీఎంఆర్ తీసుకువచ్చిన స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ కేవలం వెబ్‌సైట్‌కే పరిమితం అవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వైద్యంలో మనం నాణ్యతను పెంచగలం. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ బోధనా వైద్యుల జాతీయ అనుసంధానకర్త -
గుండెపోటు ముప్పు పెంచిన కరోనా
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 18–45 మధ్య వయస్కుల గుండెపోటు మరణాలు సాధారణంగా ఏడాదికి లక్షకు నాలుగు ఉంటాయి. కానీ కరోనా కాలంలో ఈ సంఖ్య పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే కరోనా కాలంలో యువతీ యువకులు అత్యధికంగా ఆకస్మిక గుండెపోటుకు గురై చనిపోయారు. దీనిపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రీయ అధ్యయనం చేసింది. దీని ప్రకారం కరోనా రాని యువకులతో పోలిస్తే వైరస్ సోకిన వారు మొదటి వారంలో గుండెపోటుకు గురయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ ఉంది. అదే రెండో వారంలో రెండున్నర రెట్లు, 30 రోజుల తర్వాత రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తేలింది. ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్, మితిమీరిన వ్యాయామం లాంటి కారణాలతో పాటు కరోనా సోకడం యువతకు ముప్పు పెంచిందని నిర్ధారించింది. ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించలేదని అధ్యయనం తేల్చింది. పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 31.6% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు మరణించిన 729 యువకుల్లో 31.6 శాతం మంది అసలు వ్యాక్సిన్ తీసుకోలేదు. కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరినవారు 2.3 శాతం మంది ఉన్నారు. అందులో పొగతాగేవారు 26 శాతం ఉన్నారు. ఆల్కహాల్ తీసుకునేవారు 27 శాతం ఉన్నారు. చనిపోవడానికి 48 గంటలకు ముందు మితిమీరి ఆల్కహాలు తీసుకున్నవారు 7 శాతం ఉన్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ తీసుకున్నవారు 1.7 శాతం ఉన్నారు. ఏ రకమైన వ్యాయామం చేయనివారు 81 శాతం, 48 గంటలకు ముందు మితిమీరిన శారీరక శ్రమ లేదా అధిక వ్యాయామం చేసినవారు 3.5 శాతం ఉన్నారు. సాధారణ వ్యాయామం చేసినవారు 16 శాతం ఉన్నారు. ఆకస్మికంగా మరణించిన ఆ యువకులకు చెందిన 10 శాతం మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అంటే గుండెపోటుకు సంబంధించి కుటుంబ చరిత్ర ఉన్నవారు అన్నమాట. కుటుంబ సభ్యులంటే తల్లి, తండ్రి, తోబుట్టువులని ఐసీఎంఆర్ పేర్కొంది. కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన యువకుల్లో సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఆకస్మిక మరణాలు నాలుగు రెట్లు అధికంగా సంభవించాయి. 48 గంటలకు ముందు మితిమీరిన మద్యం తీసుకుంటే మరణాలు ఆరు రెట్లు ఎక్కువ. విపరీతమైన శారీరక శ్రమ చేయడం వల్ల మూడు రెట్లు రిస్క్ ఎక్కువగా ఉంది. డ్రగ్స్‌తో నాలుగు రెట్లు, పొగతాగడం వల్ల రెండు రెట్లు రిస్క్ ఎక్కువగా ఉంది. వ్యాయామం చేస్తున్నప్పుడు సాధారణంగా రెండు నిమిషాల్లోనే శ్వాస అదుపులోకి వస్తుంది. కానీ 10 నిమిషాల పాటు కొనసాగితే దాన్ని మితిమీరిన వ్యాయామం అంటారు. అటువంటి వారిలో మరణాలు సంభవించాయి. వ్యాక్సిన్ వల్ల గుండెపోట్లు తగ్గాయి... కోవిడ్ వ్యాక్సిన్ వల్ల యువకులు ఆకస్మిక మరణాలకు గురైనట్లు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐసీఎంఆర్ వీటిపైనా అధ్యయనం చేసింది. వార్తల్లో కథనాలను ఆధారంగా చేసుకొని పరిశోధన కొనసాగించింది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించలేదని తేల్చింది. పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఆకస్మిక మరణాలపై అధ్యయనం దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 47 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల పరిధిలో ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. 2021 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు కరోనా కాలంలో యువకుల ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేసింది. ఆయా కాలేజీల పరిధిలో 18–45 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించిన 29,171 మంది యువకుల్లో 729 మందిపై ప్రత్యేకంగా పరిశో ధన చేసింది. వారి మరణాలకు కారణాలపై డేటా సేకరించి విశ్లేషించింది. నాలుగింట మూడొంతుల మంది మరణాల వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుంచే తీసుకుంది. కరోనా సామాజికంగా కూడా దెబ్బతీసింది అలవాటు లేని శారీరక శ్రమ, వ్యాయామం అతిగా చేయడం వల్ల యువకుల్లో ఆకస్మిక మరణాలు సంభవించాయి. తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలిక జబ్బులు కూడా దోహదపడ్డాయి. కోవిడ్ అనేది సాధారణ జబ్బే కాదు. అది సామాజికంగా కూడా దెబ్బతీసింది. ఉద్యోగం కోల్పోవడం లాంటివి పరోక్షంగా ప్రభావం చూపించాయి. మరోవైపు మానసిక రుగ్మతలు 25 శాతం పెరిగాయి. వదంతులు, ప్రచారాలు కూడా ప్రజలపై మానసికంగా ప్రభావం చూపాయి. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
ఆకస్మిక మరణాలకు.. టీకాకు సంబంధం లేదు!
అకస్మాత్తుగా తీవ్రస్థాయి వ్యాయామంతో ముప్పు.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన 22 ఏళ్ల యువకుడు!.. వ్యాయామం చేస్తూండగా గుండెపోటు.. 42 ఏళ్ల యాక్టర్ మృతి.. పాతికేళ్లకే గుండెపోటు.. ఆకస్మిక మరణం!.. ఇలాంటి శీర్షికలు వార్తాపత్రికల్లో మీరూ చూసే ఉంటారు. కోవిడ్ తరువాత ఇలాంటి ఆకస్మిక మరణాలు మరీ ముఖ్యంగా తక్కువ వయసు వారిలో ఎక్కువయ్యాయి అన్న చర్చ కూడా జరిగే ఉంటుంది. అయితే ఇందులో వాస్తవం లేదంటోంది భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, క్లుప్తంగా ఐసీఎంఆర్). కోవిడ్ టీకాలతోనే గుండె జబ్బుల ముప్పు పెరిగిందన్నది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కంటే ముందు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం మొదలుకొని కుటుంబ ఆరోగ్య చరిత్ర, మితిమీరిన మద్యపానం, అలవాటు లేని తీవ్రమైన పనులు కొనసాగించడం వంటివి యువత ఆకస్మిక మరణాలకు కారణాలు కావచ్చునని వీరు అంటున్నారు. కోవిడ్ తరువాత యువకులు ఆకస్మికంగా గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్నారన్న వదంతులు ప్రబలుతున్న సమయంలో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 47 టెరిటరీ ఆసుపత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ద్వారా అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ అధ్యయనంలో 18 - 45 మధ్య వయస్కుల ఆకస్మిక మరణాల కారణాలను విశ్లేషించారు. ఈ మరణాల్లో కొంతమంది సెలబ్రిటీలూ ఉండటం గమనార్హం. ‘‘కోవిడ్ వ్యాధి, టీకాలకు ఈ మరణాలకు సంబంధం ఉందన్న ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో అసలు కారణాలేమిటో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టాం’’ అని ఐసీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. 3645 మంది వివరాలతో... ఐసీఎంఆర్ అధ్యయనంలో భాగంగా మొత్తం 3645 మంది వివరాలను విశ్లేషించారు. ఇందులో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరి ఆ తరువాత 24 గంటల్లోనే మరణించిన వారు కూడా ఉన్నారు. వీరందరూ 18 - 45 మధ్య వయస్కులే. ఆకస్మిక మరణానికి కారణం కాగల వ్యాధులు, సమస్యలు ఏవీ లేనివారే. అక్టోబరు 2021 - మార్చి 2023 మధ్యకాలంలో వీరు ఆకస్మికంగా మరణించారు. ఆకస్మిక మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమైనప్పటికీ అన్నీ కార్డియాక్ అరెస్ట్ (అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా పోవడం) ఫలితంగానూ జరగలేదని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడియమాలజీ డైరెక్టర్ శాస్త్రవేత్త మనోజ్ ముర్హేకర్ తెలిపారు. మరణించిన వారి సమచారాన్ని, కోవిడ్ బాధితులను పోల్చి చూసినప్పుడు టీకాలే మరణానికి కారణమని సూచించే ఏ అంశమూ బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వాస్తవానికి టీకాలు మరణాలను అడ్డుకుంది. ఆకస్మిక మరణాలకు ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు’’ అని ఆయన వివరించారు. కోవిడ్ -19 టీకాలు, వ్యాధి, చికిత్స తరువాత ఆరోగ్యం వంటి విషయాలపై తాము కొంతమందిని ఇంటర్వ్యూ చేశామని, కుటుంబంలో ఆకస్మిక మరణాల చరిత్ర ఏమైనా ఉందా? అన్నదీ పరిశీలించామని, ధూమపానం, మత్తుముందుల వాడకం, మద్యపానం ఎంత తరచుగా చేస్తారు? మరణానికి రెండు రోజుల ముందు అతిగా శ్రమించారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నామని... ఇలాంటి కారణాల వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని మనోజ్ ముర్హేకర్ తెలిపారు. ‘‘మద్యపానం ఎంత తరచుగా తీసుకుంటూంటే ఆకస్మిక మరణానికి అవకాశాలు అంత ఎక్కువగా పెరిగాయి’’ అని వివరించారు. రెండు డోసుల టీకాతో రక్షణ... కోవిడ్ వ్యాధి నివారణకు రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు తక్కువైనట్లు తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ చెబుతోంది. అయితే కోవిడ్-19 కారణంగా మరణాలు ఎలా సంభవిస్తాయన్న అంశం ప్రస్తుతానికి పూర్తిగా అర్థం కావడం లేదని తెలిపింది. అయితే సార్స్ కోవ్-2 వ్యాధి వల్ల గుండెజబ్బు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని మాత్రం ఈ అధ్యయనం అంగీకరించడం గమనార్హం. ఆకస్మిక మరణాలకూ కారణమవుతుందా? అన్న విషయంపై మాత్రం తగినంత సమాచారం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. కోవిడ్ టీకాల కారణంగా ఆకస్మిక మరణాలు పెరిగాయని కొంతమంది తగిన సాక్ష్యాధారాల్లేకుండా మాట్లాడుతున్రాను. వ్యాక్సీన్లతో మరణాలు తగ్గాయని చెప్పేందుకు రుజువులు ఉన్నాయి. ముప్ఫై ఏళ్ల పైబడ్డ వారు.. అప్పటివరకూ తరచూ వ్యాయామం చేయకుండా.. అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం మొదలుపెడితే వారిలో ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం వల్ల గుండె రక్తనాళాల్లో అప్పటివరకూ పేరుకుపోయిన గార లాంటి పదార్థం ముక్కలై గుండెపోటుకు దారితీయవచ్చు’’ అని వైద్య నిపుణులు కొందరు చెబుతున్నారు. చదవండి: డయాబెటిస్ పేషెంట్స్.. ఇకపై ఆ బాధ తీరినట్లే -
టీకాతో అకాల మరణాల ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు
ఢిల్లీ: కరోనా వాక్సినేషన్ యువకుల్లో అకాల మరణాలను పెంచబోదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కనీసం టీకా ఒక్క డోసు తీసుకున్నా.. అకాల మరణాలు సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కరోనా టీకా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పుకు సంబంధించి ఐసీఎమ్ఆర్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టీకాతో అకాల మరణాలు ముప్పు అంశంపై ఐసీఎమ్ఆర్ అక్టోబరు 1, 2021 నుండి మార్చి 31, 2023 మధ్య అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధనలో దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో రోగులను పరిశీలించారు. ముఖ్యంగా 18-45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై దృష్టి సారించారు. వారిలో ఎలాంటి ఆనారోగ్య లక్షణాలు కనిపించలేదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విశ్లేషణలో 729 కేసులను పరిశీలించారు. టీకా రెండు డోసులను తీసుకున్నవారికి అకాల మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువ అని అధ్యయనం స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అకాల మరణ ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలను అధ్యయనం గుర్తించింది. వీటిలో కోవిడ్-19 కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగుల ఆరోగ్య చరిత్ర, ఆకస్మిక మరణానికి సంబంధించిన వ్యక్తి కుటుంబ ఆరోగ్య చరిత్ర ప్రభావితం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరణానికి ముందు 48 గంటలలోపు అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వంటి పదార్ధాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొనడం వంటివి అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతున్నాయని గుర్తించారు. ఇదీ చదవండి: IndiGo Flight Viral Incident: ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు! -
గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!
ICMR Male Contraceptive: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక పురోగతిని సాధించింది. పురుషులకోసం గర్భనిరోధక ఇంజెక్షన్‌ను అభివృద్ది చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్’ (ICMR Male Contraceptive)ను ఇంజెక్షన్‌ను డెవలప్ చేసింది. దీనికి సంబందించిన క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు ఏడేళ్ల పరిశీలిన తర్వాత RISUG (రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్) పిలిచే నాన్-హార్మోనల్ ఇంజెక్షన్నపై సానుకూల ఫలితాలు వెలువడ్డాయి. అంతేకాదు ఈ ఇంజక్షన్ వల్ల ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు లేవనీ, చాలా సురక్షితం ప్రభావవంతమైనదని కూడా తేలడం విశేషం. ఫేజ్ 3 ట్రయల్స్ సక్సెస్ 25-40 ఏళ్ల వయసుస్సున్న 303 మంది ఆరోగ్యవంతులైన, వివాహిత పురుషులపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలు గత నెలలో రిలీజ్ అయ్యాయి. ICMR, న్యూఢిల్లీ సమన్వయంతో ఢిల్లీ, ఉదంపూర్, లూధియానా, జైపూర్, ఖరగ్ పూర్ ఆసుపత్రుల్లో ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించారు. ఈ వాలంటీర్లకు 60 మి.గ్రా. RISUG ఇంజెక్షన్‌ను అందించారు. ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా 99.02 శాతం సమర్థతతో ఈ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా హార్మోన్లను ఇంజెక్ట్ చేసే ఇతర గర్భ నిరోధకాల మాదిరిగా గాకుండా, లోకల్ ఇంజెక్షన్‌తోనే దీన్ని సాధించడం కీలకమని కూడా పేర్కొంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఇండియా (DCGI)సహా, ఇతర సంబంధిత కమిటీలచే అనుమతి మేరకు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఫలితాలను అంతర్జాతీయ ఓపెన్ యాక్సెస్ ఆండ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు. కాగా గర్భనిరోధం అంటే కేవలం అది స్త్రీల పనే అని అభిప్రాయం సమాజంలో బాగా వేళ్లూనుకుంది. పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేసెక్టమీపై రకరకాల అపోహలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వేసెక్టమీ అంటేనే భయపడే పరిస్థితి. ఈ క్రమంలో పురుషుల్లో సంతానం నిరోధం కోసం ఒక ఇంజెక్షన్‌ను తీసుకు రావడం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. -
30% మందికి బీపీ.. 9.9% మందికి షుగర్
సాక్షి, హైదరాబాద్: అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్/షుగర్) తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ..తద్వారా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇతర కారణాలతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 30 శాతం మంది హైబీపీతో బాధ పడుతుండగా, 9.9 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. దేశంలో డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటిపై భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) అధ్యయనం చేసింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 ఏళ్లకు పైబడిన వారిపై సర్వే జరిపింది. జనాభా, ప్రాంతాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. దేశవ్యాప్తంగా 1.13 లక్షల మందిని సర్వే చేశారు. 79,506 మంది గ్రామీణులు, 33,537 మంది పట్టణ ప్రాంత ప్రజల (మొత్తం 1.13 లక్షల మంది) ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 వరకు ఐదు దశల్లో రాష్ట్రాల వారీగా కొనసాగిన సర్వే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగింది. ఆ వివరాలను తాజాగా లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. పట్టణాల్లోనే ఎక్కువ.. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 30 శాతం మందికి పైగా హైబీపీతో బాధపడుతుండగా, గ్రామాల్లో 25–30 శాతం మంది బాధపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 10 శాతం కంటే ఎక్కువగా మధుమేహ బాధితులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 7.4 శాతంగా ఉంది. ఇక 15 శాతం మంది వరకు ప్రీ డయాబెటీస్ (వ్యాధికి ముందు దశ) స్థితిలో ఉన్నారు. పట్టణాల్లో ఇది 10–15 శాతంగా ఉంది. తెలంగాణ గ్రామాల్లో ప్రీ డయాబెటీస్ 15 శాతం వరకు ఉండగా, ఏపీలోని గ్రామాల్లో 10 శాతం వరకు ఉంది. పంజాబ్‌లో 51.8 శాతం మందికి హైబీపీ దేశవ్యాప్తంగా 11.4 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నట్లు సర్వే నిర్ధారించింది. డయాబెటిస్ ముందు దశలో 15.3 శాతం మంది ఉన్నారు. 35.5 శాతం బీపీతో బాధపడుతుండగా, 28.6 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు. పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ ఉన్నవారు 39.5 శాతం మంది ఉన్నారు. రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నవారు 81.2 శాతం ఉన్నారు. అత్యధికంగా గోవాలో 26.4 శాతం మందికి డయాబెటిస్ ఉంది. అతి తక్కువగా యూపీలో 4.8 శాతం మందికి ఉంది. బీపీ బాధితులు అత్యధికంగా పంజాబ్‌లో 51.8 శాతం మంది ఉన్నారు. అత్యంత తక్కువగా మేఘాలయలో 24.3 శాతం మంది ఉన్నారు. దేశంలో ఊబకాయులు 28.6 శాతంగా ఉన్నారు. పాండిచ్చేరిలో ఎక్కువ (53.3 శాతం) మంది, జార్ఖండ్‌లో తక్కువ (11.6 శాతం) మంది ఊబకాయ బాధితులు ఉన్నారు. మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ ఉమ్మడి ఏపీలో ఊబకాయులు 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ గ్రామాల్లో 20 శాతం వరకు ఉన్నారు. గ్రామీణ ఏపీలో 20–25 శాతం మధ్య ఉన్నారు. ♦ పొట్ట దగ్గర అధిక కొవ్వు పేరుకుపోయిన వారు ఉమ్మడి ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ♦ రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉభయ రాష్ట్రాల్లోని 20–25 శాతం మందికి ఉంది. అర్బన్ తెలంగాణలో ఇది 20–25 శాతంగా, ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. గ్రామీణ తెలంగాణలో 20–25 శాతం మధ్య, గ్రామీణ ఏపీలో 15–20 శాతం మధ్య ఉంది. ♦ మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవారు తెలంగాణలో 50–60 శాతం మంది ఉండగా, ఏపీలో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 15–20 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 20–25 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికంగా ఉంది. చాలా జబ్బులు పట్టణాల్లో ఉన్నాయి. ప్రీ డయాబెటిస్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో షుగర్ తక్కువగా ఉంది. దీర్ఘకాలిక జబ్బులు అధికంగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది. ప్రీడయాబెటిస్ స్థితిలో ఉన్నవారిని డయాబెటిస్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. అధిక షుగర్ బాధితుల్లో తదుపరి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. –ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
ముగింపు దశకు కరోనా! అయినా నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ఈసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ ముగింపు దశకు చేరుకుందని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని చెప్పారు. అయితే వైరస్‌ను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెంది(మ్యుటేషన్లు) బలహీన పడుతోందని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. ఇప్పుడు వైరస్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఇంకా కొన్ని మ్యూటేషన్ల అనంతరం కరోనా పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌పై ఈ ఏడాది జనవరిలో తొలిసారి వెలుగుచూసిన ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కూడా అంత ప్రమాదకరం కాదని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. గత మూడు నెలల్లో దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. 'XBB.1.16 అనేది రీకాంబినెంట్ వైరస్. ఇది మానవ శరీరంలో అనుకోకుండా తయారవుతుంది. రెండు వేర్వేరు వేరియంట్లు మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, పునరుత్పత్తి సమయంలో జన్యు పదార్ధం మిక్స్అప్ అయినప్పుడు అవి తయారవుతాయి.' అని ఆయన వివరించారు. బూస్టర్ డోసులు, మాస్కులు దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున ఇంకా బూస్టర్ డోసు టీకా తీసుకోని వారు, ఆలస్యం చేసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అలాగే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. పిల్లలు అనారోగ్యానికి గురైతే వాళ్లను స్కూళ్లకు అసలు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఒకవేళ వారికి సోకింది కరోనా అయితే అది ఇతర విద్యార్థులకు, టీచర్లకు, సిబ్బంది సోకి మరింత మందికి వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. చదవండి: మాక్‌డ్రిల్‌తో అప్రమత్తమైన భారత్.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు -
రెండు సెకన్లకో దాడి.. అరగంటకో మరణం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్కకాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా అరగంటకో మరణం సంభివిస్తున్నట్లు తేలింది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా పరిశోధన నిర్వహించాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్) ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించింది. 100 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుక్కల సంఖ్య. 70 కోట్లు: వివిధ దేశాల్లో వీధికుక్కల సంఖ్య. ప్రపంచంలో వీధికుక్కలు లేని మొదటి దేశం నెదర్లాండ్స్ 2030: రేబిస్ మరణాలను పూర్తిగా నియంత్రించేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్న గడువు. ఏటా సుమారు 20 వేల మంది మృతి ♦ ఐసీఎంఆర్–ఎయిమ్స్ అధ్యయనం ప్రకారం దేశంలో కుక్కకాట్లు, ఇతరత్రా జంతువుల కాటు కారణంగా సంభవించే రేబిస్‌తో ఏటా 18 వేల నుంచి 20 వేల మంది వరకు మృత్యువాతపడుతున్నారు. దేశంలో నమో దవుతున్న రేబిస్ మరణాల్లో 93% కుక్కకాటు ద్వారానే సంభవిస్తున్నా యి. అందులో 63% వీధికుక్కల ద్వారానే చోటుచేసుకుంటున్నాయి. పట్టణాల్లో 60%, గ్రామాల్లో 64% వీధికుక్కల ద్వారా రేబిస్ వ్యాప్తి చెందుతోంది. దేశంలో కోటిన్నర వీధికుక్కలు... ♦ భారత్‌లో 2 కోట్ల కుక్కలు ఉండగా అందులో వీధికుక్కల సంఖ్య 1.53 కోట్లుగా ఉంది. వీధికుక్కలు పెరగడానికి ప్రధాన కారణం... వ్యర్థాలను తీసుకెళ్లే పద్ధతి సక్రమంగా లేకపోవడమేనని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది. అందువల్లే వ్యర్థాలు ఉన్న దగ్గర వీధికుక్కల సంతతి పెరుగుతోందని విశ్లేషించింది. ఆస్పత్రుల ప్రాంగణాల్లో తిష్ట... దేశంలో ఎన్నో ఆసుపత్రులు కుక్కలకు ఆవాస కేంద్రాలుగా ఉంటున్నాయి. రోగులు పడేసే ఆహార వ్యర్థాలను తింటూ అక్కడే తిష్ట వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. తిండి దొరకనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహణ సరిగ్గాలేని శవాగారాల్లోకి చొరబడి శవాలను సైతం పీక్కుతింటున్నాయి. 3 రకాల శునకాలు.. ♦ మనుషుల మీద ఆధారపడే దాన్ని బట్టి కుక్కలను ఇంట్లో పెంచుకొనేవి, సామాజిక అవసరాలకు ఉపయోగించేవి, వీధికుక్కలుగా విభజించారు. అయితే ప్రధానంగా వీధికుక్కలతోనే సమస్యలు వస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కుక్కల సంతతి నియంత్రణకు సరైన ప్రణాళికలు రచించకపోవడం, జంతు హక్కుల కార్యకర్తల కార్యకలాపాల వల్ల కుక్కకాట్లు అధికమవుతున్నాయి. కుక్కల నియంత్రణ ఇలా... ♦ దేశవ్యాప్తంగా ఏకకాలంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ కష్టసాధ్యమైనందున నోటి ద్వారా వేసే టీకాలను అభివృద్ధి చేసి కుక్కలకు ఆహారంలో కలిపి అందించాలి. దీనివల్ల వాటి జాతిని వీలైనంత మేర కట్టడి చేయవచ్చు. ♦ వీధికుక్కల కట్టడికి మున్సిపాలిటీ, వెటర్నరీ, ఎన్జీవోలు, కుక్కల సంరక్షణ కేంద్రాలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి. ♦ వీధికుక్కల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలను చైతన్యపరచాలి. -
హెచ్3ఎన్2పై వైద్య శాఖ అప్రమత్తం.. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హెచ్3ఎన్2 ప్రభావం లేనప్పటికీ ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని గుర్తించి వారికి వైద్య సహాయం అందించడానికి సోమవారం నుంచి ఫీవర్ సర్వేను చేపట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారుల (డీఎంహెచ్‌వో)కు ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమవుతున్న క్రమంలో వాతావరణ మార్పులతో దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2 అనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇప్పటికే వెల్లడించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సైతం రాష్ట్రాలకు ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసింది. సీజన్ మారడం వల్లే.. హెచ్3ఎన్2 ఫ్లూ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేయడం కోసం టెస్టింగ్ కిట్లను వైద్య ఆరోగ్య శాఖ కొనుగోలు చేస్తోంది. రెండు రోజుల్లో అన్ని బోధనాస్పత్రులకు వీటిని పంపనుంది. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్‌లోని వీఆర్డీఎల్ ల్యాబ్‌లో హెచ్3ఎన్2 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడ జనవరిలో 12, ఫిబ్రవరిలో తొమ్మిది పాజిటివ్ కేసులను నిర్ధారించారు. అయితే ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఏటా సీజన్ మారుతున్న సమయంలో కేసులు కొంత పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ మొదలవుతుండటంతో అవే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు వస్తున్న బాధితులకు చాలా అరుదుగా మాత్రమే అడ్మిషన్ అవసరమవుతోందని చెబుతున్నారు. సాధారణంగా ఆస్పత్రులకు వచ్చే ఓపీల్లో 5 నుంచి 6 శాతం వరకు జ్వరం, దగ్గు, జలుబు వంటి కేసులే ఉంటాయని గుర్తు చేస్తున్నారు. వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు.. ► క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ► ఫ్లూ లక్షణాలున్నవారు మాస్క్ ధరించాలి. ► వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ► షేక్‌హ్యాండ్, ఆలింగనాలు మానుకోవాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు. కంగారు పడవద్దు.. వాతావరణం మారుతున్నప్పుడు సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి. వీటికే ప్రజలు కంగారు పడిపోవద్దు. ఈ లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ఆశా వర్కర్, ఏఎన్ఎంలను సంప్రదించవచ్చు. వారు మందులు ఇవ్వడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతారు. హెచ్3ఎన్2 ప్రభావం రాష్ట్రంలో లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తల్లో భాగంగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, డైరెక్టర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జాగ్రత్త.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై వైరస్లు, బ్యాక్టీరియాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు, షుగర్, హెచ్ఐవీ బాధితులు మాస్క్ ధరించాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే పారాసెటమాల్, బ్రూఫెన్ మాత్రలు, గొంతు ఉపశమనానికి విక్స్ బిళ్లలు వేసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఒసెల్టామివిర్ 75 ఎంజీ మాత్ర రోజుకు రెండుసార్లు వేసుకోవాలి. – డాక్టర్ ఎస్.రఘు,సూపరింటెండెంట్, ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, గుంటూరు -
తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా విసురుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, కళ్లమంటలు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ సీజనల్ జ్వరాల బారినపడినట్లు సమాచారం. బాధితుల్లో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాల్లో సాధారణ లక్షణాలకు భిన్నంగా ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణం మారడంతో.. ప్రస్తుతం శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. చలిగాలులు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వైరస్ కారకాలు మార్పు చెందుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాలను ఐసీఎంఆర్ ఇటీవల విశ్లేషించగా విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఐసీఎంఆర్ చేసిన సీరో సర్వేలో 92 శాతం మందికి తీవ్రమైన జ్వరంతోపాటు దగ్గు, కళ్ల మంటలు, నిమోనియా (హెచ్3ఎన్2 వైరస్) లక్షణాలున్నట్లు గుర్తించింది. సాధారణ స్వైన్‌ఫ్లూ కంటే ఈ వైరస్ తీవ్రత కొంత ఎక్కువున్నట్లు పేర్కొంది. పదేళ్ల క్రితం తగ్గినట్లే తగ్గి.. 2009లో హైదరాబాద్‌లో తొలిసారిగా స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. 2012 వరకు హెచ్1ఎన్1 ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసుల తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆపై కేసుల సంఖ్య క్రమంగా తగ్గి సాధారణ ప్లూ జాబితాలో చేరింది. అడపాదడపా కేసులు నమోదవుతున్నప్పటికీ రోగనిరోధకశక్తి పెరగడం, చికిత్స సులభతరం కావడంతో ఆ తర్వాత పెద్దగా ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఈ వైరస్ హెచ్3ఎన్2గా రూపాంతరం చెంది మరింత బలపడింది. సాధారణంగా చలి ప్రదేశంలో ఈ వైరస్ విస్తరిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా వేసవిలోనూ విజృంభిస్తోంది. జనసమూహాలతో వ్యాపిస్తూ.. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ కావడంతో ప్రజలు భారీగా ఒకచోట చేరుతున్నారు. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఈ సమయంలో వైరస్ సోకిన వ్యక్తి తుమ్మడం, దగ్గడం వల్ల ఆ వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తోంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాలు ప్రస్తుతం ఫ్లూ బాధితులతో రద్దీగా మారుతున్నాయి. బాధితుల్లో జ్వరం 3–5 రోజులపాటు ఉంటుండగా దగ్గు 10–15 రోజులపాటు వేధిస్తోంది. సకాలంలో వైరస్‌ను గుర్తించకపోవడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన నిమోనియాకు కారణమవుతోంది. ఆందోళన అక్కర్లేదు వైరస్లు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంటాయి. హెచ్3ఎన్2 వైరస్ కారకాలపై ఆందోళన అవసరం లేదు. ఇది కూడా ఓ సాధారణ ఫ్లూనే. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. జన సమూహంలోకి వెళ్లకపోవడం, విధిగా మాస్క్‌లు ధరించడం, రోగనిరోధకశక్తిని పెంచుకోవడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారినపడకుండా కాపాడుకోవచ్చు. చికిత్సల్లో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడొద్దని ఐసీఎంఆర్ ఇప్పటికే సూచించింది. ఇది సాధారణ మందులతోనే నయమవుతుంది. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
కొత్త ఫ్లూ.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా హైఅలర్ట్ జారీ చేసింది. సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ పేషెంట్లతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చాలామందిలో అవి తీవ్రంగా.. దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. కొందరిలో అయితే జ్వరం తర్వాత న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది కూడా. ఈ తరుణంలో.. జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలని కోరింది. మరీ ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదని ప్రజలను, మరోవైపు ఇన్ఫెక్షన్లను నిర్ధారించుకోకుండా యాంటీ బయోటిక్స్ పేషెంట్లకు సూచించకూడదని వైద్యులను హెచ్చరించింది ఐసీఎంఆర్. అలాగే.. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని, ఈ వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ఐసీఎంఆర్. ఇదిలా ఉంటే.. కోవిడ్ తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడం గమనార్హం. ఇదీ చదవండి: H3N2 వైరస్ తీవ్రంగా ఎందుకు ఉందంటే.. లక్షణాలు గనుక కనిపిస్తే.. చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ ధరించాలి. గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి ఇవి చేయకుండా ఉండడం బెటర్ ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం గుంపుగా కలిసి తినకుండా ఉండడం సొంత వైద్యం జోలికి పోకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం. -
కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ వాడొద్దు!
కరోనా తర్వాత.. చాన్నాళ్లకు ఆ తరహా లక్షణాలు చాలామందిలో ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే కరోనా కాదు.. కరోనా లాంటి లక్షణాలు మాత్రమే!. ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో కేసులు దేశంలో విపరీతంగా నమోదు అవుతున్నాయి. గత రెండు నెలలుగా ఈ కేసులు దేశంలో దాదాపు అన్నిచోట్లా రికార్డు అయినట్లు కేంద్రం గణాంకాలను సేకరించింది. దగ్గు, జలుబుతో పాటు చాలాకాలంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పుల సమస్యతో బాధపడుతున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో కేంద్రం పరిధిలోని వైద్య విభాగాలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి. దేశంలో గత కొన్నివారాలుగా జ్వరం, జలుబు, దగ్గు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ఏమో అనే భయాందోళనతో చాలామంది యాంటీ బయాటిక్స్‌ను తెగ వాడేస్తున్నారు. అయితే అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. అది కరోనా కాదని.. ఇన్‌ఫ్లూయెంజా A సబ్టైప్ H3N2 వైరస్.. దేశంలో ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమని స్పష్టం చేసింది. H3N2 వైరస్ ఇతర ఉప రకాల కంటే ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. ఆస్పత్రి పాలుజేస్తుంది. కానీ, ఏమాత్రం ప్రాణాంతకం కాదు. గత రెండు రెండు, మూడు నెలలుగా దేశంలో కేసులు అధికంగా నమోదు కావడానికి కారణం కూడా ఇదేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ► ఈ వైరస్ కారణంగా దగ్గు, జలుబు, జ్వరం.. లక్షణాలు ఉంటాయి. కొన్ని కేసుల్లో ఇవి దీర్ఘకాలికంగా కనిపిస్తాయి. వీటితో పాటు ఒళ్లు నొప్పులు, డయేరియా, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ► ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి(అందుకే కరోనా అని కంగారు పడిపోతున్నారు). పేషెంట్లు కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ► వాయు కాలుష్యం కూడా ఇది త్వరగతిన వ్యాపించడానికి ఒక కారణం. ► ఇదేం ప్రాణాంతకం కాదు. కానీ, ఆస్పత్రి పాలుజేస్తుంది. కొందరిలో మాత్రం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపెడుతుంది. ► ఐసీఎంఆర్‌తో పాటు ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఆర్) కూడా పలు కీలక సూచనలు చేస్తోంది. ► మరోవైపు, దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను ఇష్టానుసారం వాడకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రజలను హెచ్చరిస్తోంది. ► యాంటీబయాటిక్స్ కాకుండా రోగలక్షణాలకు ఆధారంగా చికిత్సను అందించాలని, మందులను మాత్రమే సూచించాలని అసోసియేషన్ వైద్యులను కోరింది. ► కరోనా సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్‌లను జనాలు ఇష్టానుసారం వాడారు. ఇది కూడా తీవ్ర ప్రభావం చూపెట్టింది. యాంటీబయాటిక్స్ సూచించే ముందు ఇన్ఫెక్షన్ అనేది బాక్టీరియల్ అవునా? కాదా? అని నిర్ధారించుకోవడం కూడా అవసరం అని ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. లక్షణాలు గనుక కనిపిస్తే.. చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ ధరించడం, గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి ఇవి చేయకుండా ఉండడం బెటర్ ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం గుంపుగా కలిసి తినకుండా ఉండడం సొంత వైద్యం.. ఇది ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తేవొచ్చు. కానీ, సంబంధిత వైద్యులను సంప్రదించాకే మందులు వాడాలి. ముఖ్యంగా యాంటీ బయాటిక్స్ విషయంలో.. Influenza A subtype H3N2 is the major cause of current respiratory illness. ICMR-DHR established pan respiratory virus surveillance across 30 VRDLs. Surveillance dashboard is accessible at https://t.co/Rx3eKefgFf@mansukhmandviya @DrBharatippawar @MoHFW_INDIA @DeptHealthRes pic.twitter.com/3ciCgsxFh0 — ICMR (@ICMRDELHI) March 3, 2023 Fever cases on rise - Avoid Antibiotics pic.twitter.com/WYvXX70iho — Indian Medical Association (@IMAIndiaOrg) March 3, 2023 -
మెడ్‌టెక్ జోన్లో కృత్రిమ అవయవాల తయారీ
సాక్షి, విశాఖపట్నం: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కృత్రిమ అవయవాల తయారీపై దృష్టిసారించింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో అసిస్టివ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేసిన ఐసీఎంఆర్.. తాజాగా విశాఖలోనూ ప్రారంభించింది. ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోగా.. కేవలం 30 రోజుల వ్యవధిలోనే నిర్మించడం విశేషం. మరోవైపు, వైద్య ఉపకరణాలకు వేదికగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్లో మరో తయారీ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. చక్కెర స్థాయిల్ని తెలిపే బీజీఎంఎస్ పరికరాల తయారీ ప్రాజెక్టుకు యాక్యూరెక్స్ సంస్థ శ్రీకారం చుట్టింది. విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్లో వైద్య పరికరాల తయారీ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మెడ్‌టెక్ జోన్లో 100కి పైగా సంస్థలు వైద్య పరికరాల ఉత్పత్తి, పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. తాజాగా యాక్యురెక్స్ సంస్థ కూడా తమ పరికరాల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది. బ్లడ్ గ్లూకోజ్ మోనిటరింగ్ సిస్టమ్(బీజీఎంఎస్) పరికరాల్ని మెడ్‌టెక్‌జోన్‌లో ఇక నుంచి తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన పరిశ్రమని ఇటీవల ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా.రాజీవ్‌భాల్, ఏఎంటీజెడ్ సీఈవో, ఎండీ డా.జితేంద్రశర్మ ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి యూరిన్ స్ట్రిప్స్ తయారీ సంస్థగా రికార్డు సృష్టించామని, భవిష్యత్తులో మరిన్ని నూతన పరికరాల్ని తయారు చేసేందుకు విశాఖ కేంద్రంగా అడుగులు వేస్తున్నామని యాక్యురెక్స్ ఎండీ అభినవ్ ఠాకూర్ తెలిపారు. -
మధుమేహ భారతం! 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!
సమాజాన్ని దీర్ఘకాలిక వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మరణాల్లో 65 శాతం దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని... అధిక బరువు, ఊబకాయం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ప్రజల్లో 73 శాతం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తేల్చిచెప్పింది. ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధులపై ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సహా 21 సంస్థలు సర్వే చేశాయి. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల నుంచి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 10,659 మందిని (18–69 ఏళ్ల వయసు వారు) సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించాయి. తెలంగాణలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సర్వే చేసింది. సర్వే నివేదికపై పార్లమెంటు ఇటీవల చర్చించింది. దేశంలో దీర్ఘకాలిక వ్యాధులపై జరిగిన మొట్టమొదటి సర్వే ఇదేనని కేంద్రం తెలిపింది. – సాక్షి, హైదరాబాద్ సర్వేలో వెల్లడైన అంశాలు... ►2019లో దేశంలో దీర్ఘకాలిక జబ్బులతో 61 లక్షల మంది చనిపోయారు. అందులో షుగర్‌తో 1.70 లక్షల మంది మరణించారు. 1990తో పోలిస్తే దీర్ఘకాలిక వ్యాదులతో మరణించే వారి సంఖ్య రెట్టింపు అయింది. ►ధూమపానం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 15.5 శాతం ఎక్కువ. అధికంగా పొగతాగడం వల్ల కేన్సర్ ముప్పు సైతం 39 శాతం పెరుగుతుందని సర్వే తేల్చింది. ఉప్పుతో పెరుగుతున్న ముప్పు... ►సర్వేలో పాల్గొన్న వారిలో సగటు ఉప్పు వినియోగం 8 గ్రాములుగా వెల్లడైంది. అందులో పురుషుల్లో ఉప్పు సగటు వినియోగం 8.9 గ్రాములుకాగా, మహిళలు 7.1 గ్రాములు వాడుతున్నారు. పట్టణాల్లో 8.3 గ్రాములు, పల్లెల్లో 8 గ్రాముల మేర వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినదానికంటే దేశంలో రెట్టింపు ఉప్పు వినియోగం జరుగుతోంది. ‘పొగ’బారిన 33% మంది సర్వే ప్రకారం దేశంలో 32.8 శాతం మంది పొగతాగుతున్నారు. అందులో పురుషులు 51.2 శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం, పల్లెల్లో 36.8 శాతం పొగ తాగుతున్నారు. ►15.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. అందులో పురుషులు 28.3 శాతం, మహిళలు 2.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 14.2 శాతం, పల్లెల్లో 16.7 శాతం ఉన్నారు. అందులో అధిక మద్యం సేవించేవారు 5.9 శాతం మంది ఉన్నారు. అధిక మద్యం సేవించేవారిలో పురుషులు 10.9 శాతం, 0.5 శాతం మహిళలున్నారు. పట్టణాల్లో 10.7 శాతం, పల్లెల్లో 6.1 శాతం అధిక మద్యం సేవిస్తున్నారు. దేశంలో మద్యం వినియోగించే వారిలో 20–35 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నారు. వేధిస్తున్న ఊబకాయం... ►సర్వేలో పాల్గొన్న వారిలో 41.3 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో పురుషులు 30.9 శాతం మంది, మహిళలు 52.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 51.7 శాతం, గ్రామాల్లో 36.1 శాతం మంది చేయడంలేదు. ►26.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అందులో పురుషులు 23.3 శాతం, మహిళలు 29.3 శాతం ఉన్నారు. పట్టణాల్లో 42.5 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు, గ్రామాల్లో ఇది 18 శాతంగా ఉంది. పెరుగుతున్న బీపీ, షుగర్... ►28.5 శాతం మందిని బీపీ పట్టిపీడిస్తోంది. పురుషుల్లో 29.9 శాతం, మహిళల్లో 27 శాతం బీపీతో బాధపడుతున్నారు. ఇక పట్టణాల్లో 34 శాతం, గ్రామాల్లో 25.7 శాతం మంది బీపీతో ఉన్నారు. ►9.3 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నారు. అందులో పురుషుల్లో 8.5 శాతం, మహిళల్లో 10.2 శాతం షుగర్ ఉంది. పట్టణాల్లో 14.4 శాతం, గ్రామాల్లో 6.9 శాతంగా ఉంది. 2040 నాటికి ‘బరువు’మూడింతలు ►సర్వే అంచనాల ప్రకారం 2040 నాటికి అధిక బరువు బాధితుల సంఖ్య రెట్టింపు కానుంది. ఊబకాయం బాధితుల సంఖ్య మూడింతలు అవుతుంది. బీఎంఐ 25–30 మధ్య ఉంటే అధిక బరువు అంటారు. బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయం అంటారు. నడుము చుట్టుకొలత పురుషుల్లో 90 సెంటీమీటర్లు, మహిళల్లో 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే అధిక పొట్ట ఉన్నట్లు లెక్క. ►బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే అధికంగా ఉన్నట్లు. షుగర్ ఫాస్టింగ్ 126 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్లు లెక్క. వ్యాయామానికి విరామం... ►ఈ సర్వే ప్రకారం దేశంలో 98.4 శాతం మంది నిర్ణీత పరిమాణంలో కూరగాయలు, పండ్లు తీసుకోవడంలేదు. ►వారానికి కనీసం 150 నిమిషాలపాటు తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయి లేదా 75 నిమిషాలపాటు తీవ్రస్థాయిలో శారీరక శ్రమ చేయాలి. ఆ ప్రకారం శారీరక శ్రమ చేయనివారు 41.3 శాతం మంది ఉన్నారు. ప్రతి మూడు మరణాల్లో రెండు అవే... గత 30 ఏళ్లలో జీవనశైలి జబ్బుల ప్రభావం భారతీయుల్లో రెట్టింపైంది. దేశంలో ప్రస్తుతం సంభవించే ప్రతి 3 మరణాలలో రెండు వీటికి చెందినవే. తగిన శారీరక శ్రమ, బరువును అదుపులో ఉంచుకోవడం, తాజా కూరగాయలు, పండ్లు రోజుకు 400 గ్రాములకు తగ్గకుండా తీసుకోవడం ద్వారా ఈ జబ్బులను దూరం చేయవచ్చు. – డాక్టర్ హరిత, వైద్యురాలు, నిజామాబాద్ -
షాకింగ్ వివరాలు.. దేశంలో క్యాన్సర్ విజృంభణ.. 2022లో 8 లక్షల మంది మృతి
సాక్షి, అమరావతి: దేశంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. గత మూడేళ్లలో (2020–22) దేశంలో 42.88 లక్షల మంది క్యాన్సర్ బారినపడ్డారు. మృతుల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌లో ఈ వివరాలు పొందుపరిచింది. 2020 నుంచి 2022 మధ్య రాష్ట్రాలవారీగా ఐసీఎంఆర్ వెల్లడించిన క్యాన్సర్ కేసులు, మరణాలను ఇటీవల కేంద్ర వైద్య శాఖ మంత్రి మాండవీయా లోక్‌సభలో వివరించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. దేశవ్యాప్తంగా 2020లో 13,92,179 కేసులు నమోదవగా 2021లో 14,26,447 కేసులు, 2022లో 14,61,427 కేసులు నమోదయ్యాయి. ఇదే కాలంలో మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. 2020లో దేశవ్యాప్తంగా 7.70 లక్షలు, 2021లో 7.89 లక్షలు, 2022లో 8.08 లక్షల మరణాలు నమోదయ్యాయి. కేసులు, మరణాలు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నాయి. 2022లో ఉత్తరప్రదేశ్‌లో 2,10,958 కేసులు, 1,16,818 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఏపీలో 73,536 క్యాన్సర్ కేసులు నమోదవగా, 40,307 మంది మరణించినట్లు ఆ గణాంకాలు తెలిపాయి. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 28 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. క్యాన్సర్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, చికత్సకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చింది. ఇప్పటివరకు క్యాన్సర్ చికిత్సలకే రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాలను మెరుగుపరుస్తోంది. దీనివల్ల క్యాన్సర్ బాధితులు వ్యయప్రయాసలకోర్చి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని ఉండదు. ఇందులో భాగంగా తొలి దశలో ప్రస్తుతం ఉన్న ఏడు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స సదుపాయాల మెరుగుపరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.119.58 కోట్లు కేటాయించింది. వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా నోటిఫైడ్ జబ్బుల జాబితాలోకి క్యాన్సర్‌ను చేర్చింది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి, ప్రాణాపాయ పరిస్థితులను తప్పించడానికి సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ చేపడుతోంది.