ఆదివారం అహ్మదాబాద్‌లో మాస్కులు లేకుండా గుంపులుగా చేరి క్రికెట్ ఆడుకుంటున్న యువత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తెలిపింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనాని కట్టడి చేయవచ్చునని అంచనా వేసింది. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రం, ఐఐటీ ఐసీఎంఆర్‌కు చెందిన 10 మంది సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి నేతృత్వం వహించిన హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ దేశంలో కరోనా పరిస్థితికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు.
మార్చిలో లాక్‌డౌన్ విధించకపోయి ఉంటే కరోనా భారత్‌పై అత్యంత తీవ్ర ప్రభావం చూపించి ఉండేదని జూన్ నాటికే కోటి 40 లక్షల మందికి కరోనా సోకి ఉండేదని, 26 లక్షల మంది వరకు మృత్యువాత పడి ఉండేవారని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సరైన సమయంలో లాక్‌డౌన్ విధించి కరోనాని ఎదుర్కొనేలా ప్రజల్ని సమాయత్తం చేయడంతో పాటు, ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేశామని పేర్కొంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటివి కొనసాగిస్తూ, పండుగ సీజన్‌లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తే వచ్చే ఏడాదికల్లా కరోనాని నియంత్రించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది.
కొన్ని జిల్లాల్లో సామూహిక వ్యాప్తి: హర్షవర్ధన్
దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా సామూహిక వ్యాప్తి జరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అంగీకరించారు. అయితే దేశవ్యాప్తంగా ఆ పరిస్థితి లేదని ఆయన సండే సంవాద్ కార్యక్రమంలో చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తీవ్రతరంగా ఉందన్నారు. ఓనం ఉత్సవాల సమయంలో కేరళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా నిబంధనల్ని గాలికి వదిలేసినందుకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు. కేరళ నుంచి నేర్చుకున్న పాఠాలతో దసరా, దీపావళి సీజన్‌లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
చలికాలంలో సెకండ్ వేవ్ ?
దేశంలో వచ్చే శీతాకాలంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాల్ని కొట్టి పారేయలేమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే నిపుణుల కమిటీ సమన్వయ కర్త కూడా అయిన పాల్ దేశంలో మూడు వారాలుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్థిరంగా ఉందని చెప్పారు. అయితే కేరళ, కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌తో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. చలికాలంలో యూరప్‌లో కరోనా మళ్లీ విజృంభించి నట్టుగానే భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశాలున్నాయన్న పాల్ కరోనాపై ఇంకా మనం పాఠాలు నేర్చుకునే దశలోనే ఉన్నామని చెప్పారు. శీతాకాలంలో వాయు కాలుష్యం పెరిగిపోవడం వల్ల కూడా కరోనా ఉధృతరూపం దాలుస్తుందన్న ఆయన వచ్చే పండగ సీజన్‌లో కరోనా విసిరే సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ వైరస్ విజృంభిస్తుందని పాల్ హెచ్చరించారు.
పత్రికల ద్వారా సోకదు
వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశాల్లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ దశలో ఉన్న ప్రాంతాల్లో కూడా వార్తా పత్రికలు చదవడం అత్యంత సురక్షితమని ఆయన చెప్పారు. పత్రికల ద్వారా వైరస్ సోకుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని పునరుద్ఘాటిం చారు. రోజూ ఉదయం తాను పత్రికలు చదువుతూ టీ ఎంజాయ్ చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment