Centralgovernment
-
గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఆర్బీఐ కీలక సమావేశం!
ముంబై: గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) చిట్టచివరి, ఆరవ ద్వైమాసిక సమావేశం ఇది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022–23 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో సమర్పించిన నేపథ్యంలో జరుగుతున్న తాజా ఆర్బీఐ విధాన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ గురువారం మీడియాకు వెల్లడిస్తారు. నిజానికి ఈ సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భారత రత్న లతామంగేష్కర్ మృతి నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రారంభమైంది. పరిశీలించే కీలక అంశాలు.. అంతర్జాతీయంగా ముడిచమురు రికార్డు స్థాయిలో బేరల్‌కు 93 డాలర్లకు చేరడం, దేశంలో ద్రవ్యోల్బణం ఒత్తిడులు, కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పరిణామాలు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ మార్చిలోనే ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0–0.25%) పెంచవచ్చంటూ వస్తున్న సంకేతాలు, రష్యా–ఉక్రేయిన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతల తీవ్రత వంటి అంశాలు సమావేశంలో కీలక చర్చనీయాంశాలుగా ఉండే వీలుందని నిపుణుల అంచనా. యథాతథమే..: రెపో రేటు (ప్రస్తుతం 4%)ను ‘వృద్ధే లక్ష్యంగా’ యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. అయితే లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) నిర్వహణ, బ్యాంకుల వద్ద అదనపు నిధులు ఉన్న పరిస్థితులు వంటి అంశాల నేపథ్యంలో రివర్స్ రెపో (ప్రస్తుతం 3.35 శాతం)ను 20 బేసిస్ పాయింట్లు పెంచవచ్చన్న అభిప్రాయం ఉంది. -
పునీత్‌కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!
బెంగళూరు: ఇటీవల మరణించిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం 'పద్మశ్రీ' అవార్డు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి అంటూ కర్ణాటక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రలు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నారు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) కన్నడ సూపర్‌స్టార్ ఇటీవల అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ మాట్లాడుతూ" పునీత్ రాజ్‌కుమార్ జీవించి ఉన్నప్పుడే ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఉండాల్సిందని, అయితే దురదృష్టవశాత్తు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడంతో మరణానంతరం ఇవ్వాల్సిందే. నేను అతని అభిమానినే. పునీత్‌కి నటుడిగానే కాకుండా, సమాజానికి అందించిన సేవల కోసమైన ఇవ్వాల్సిందే. పైగా అతనికి ఆ అర్హత ఉంది. అని అన్నారు. అంతేకాదు పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్ మాట్లాడుతూ.. 'పునీత్ రాజ్‌కుమార్ మానవాళికి సేవ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి, నేను సామాజిక సేవలో ఉన్నప్పుడు పల్స్ పోలియో వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మాతో కలిశాడు. ఆయనకు పద్మశ్రీని ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి " అని అన్నారు. అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య.. పునీత్‌కు మరణానంతరం పద్మశ్రీ ప్రదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్లో కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ... “పద్మ అవార్డులకు ఎప్పుడు, ఏ రంగాల వ్యక్తులను సిఫారసు చేయాలనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా పునీత్ రాజ్‌కుమార్‌కు ఏకగ్రీవ సిఫార్సు అవుతుందేమో. ఏదిఏమైన ప్రభుత్వ పరంగా అన్నీ విషయాలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. (చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!) -
చిరు వ్యాపారులకు భారీ షాకిచ్చిన కేంద్రం.. గ్యాస్ ధర ఏకంగా..
అనుకున్నట్టే అయ్యింది. అంతా భయపడ్డట్టే జరిగింది. తనకు కనిరకరం లేదని మరోసారి కేంద్రం చాటుకుంది. పెట్రోలు, డీజిల్ రేట్ల పెంపుతోనే సతమతం అవుతున్న ప్రజానీకంపై ఈసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో విరుచుకుపడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేసేంది. రూ.266 రకరకాల కారణాలు చెప్పి ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా మారినట్టుంది. దాదాపు ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ రేట్లు సరిపోవన్నట్టు తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకాఎకిన రూ. 266లు పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధర రెండు వేల రూపాయలకు అటుఇటుగా నమోదు అవుతోంది. హైదరాబాద్‌లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1905.32కి చేరుకుంది. చిరువ్యాపారులకు ఇక్కట్లే ఆగస్టు 17న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం పెంచింది. ఆ తర్వాత రెండు నెలల విరామం ఇచ్చింది. అయితే రెండు నెలల విరామం ఉపశమనం పొందామనే భావన రానీయకుండా ఈసారి ఒకేసారి రూ.266 వంతున ధరను పెంచేసింది. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస సిలిండర్ ధరతో చిరువ్యాపారులు, స్ల్రీట్ఫుడ్ వెండర్ల కష్టాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతోంది. కరోనాతో పోయిన ఆదాయం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంటే.. ఆ ఆనందం క్షణకాలం కూడా నిలవకుండా పెరుగుతున్న గ్యాస్ ధరలు హరించివేస్తున్నాయి. దీపావళికి ముందే గత వారం రోజులుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయనే ఫీలర్లను ప్రభుత్వం వదులుతూ వస్తోంది. దీపావళి తర్వాత పెంపు ఉండవచ్చని భావించారు. కానీ అంతకు ముందే ధరను కేంద్రం పెంచింది. అది కూడా రికార్డు స్థాయిలో రూ.266గా ఉండటం గమనార్హం. రెండు నెలల్లో గ్యాస్‌పై అందిస్తున్న సబ్సిడీలను క్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గడిచిన రెండు నెలల కాలంలోనే గృహ, వాణిజ్యపరమైన సిలిండర్ల ధరలు నాలుగు సార్లు పెరిగాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై సెప్టెంబరులో రూ. 15 వంతున, అక్టోబరులో రూ. 25వంతున ధర పెంచింది. ఈ ఏడాది మొత్తంగా పరిశీలిస్తే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.205 వంతున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 952లుగా ఉంది. చదవండి: బైకు కంటే విమానాలకే చీప్‌గా ఫ్యూయల్ ! -
ఇలా అయితే ఒకే... టెస్లాకు ఇండియా ఆఫర్ ?
ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రవేశపెట్టే విషయంలో టెస్లా పరిస్థితి ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. టెస్లా కార్ల అమ్మకాలకు సంబంధించి భారత ప్రభుత్వం విధించిన షరతులకు టెస్లా నేరుగా సమాధానం చెప్పడం లేదు, మరోవైపు ఇండియా మార్కెట్‌పై ఆశలు వదులకోవడం లేదు. దీంతో కార్ల అమ్మకంపై టెస్లాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారత ప్రభుత్వం . ఇంపోర్ట్స్ ట్యాక్స్‌పై పీటముడి విదేశాల్లో పూర్తిగా తయరైన కార్లను ఇండియాలో దిగుమతి చేసుకుంటే ఇంజన్ సామర్థ్యం, ధర తదితర విషయాల ఆధారంగా కారు ధరలో 60 నుంచి 100 శాతం వరకు దిగుమతి సుంకాన్ని భారత ప్రభుత్వం విధిస్తోంది. అయితే తమవి పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లు కావడం వల్ల పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ టెస్లా చీఫ్ ఎలన్‌మస్క్ కోరారు. అయితే దీనికి ప్రతిగా కార్ల యూనిట్‌ను ఇండియాలో పెడతామంటే టెస్లాకు పన్ను రాయితీ అంశం పరిశీలిస్తామంటూ అధికారుల ద్వారా కేంద్రం ఫీలర్లు వదిలింది. టెస్లా ఒంటెద్దు పోకడలు కేంద్రం నుంచి ఓ మోస్తారు సానుకూల స్పందన రావడంతో తమ కార్లను ఇండియాకు తెచ్చే విషయంలో టెస్లా దూకుడు ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసేందుకు సన్నహకాలు చేస్తోంది. ముందుగా విదేశాల్లో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసుకుంటామని... ఆ కార్ల అమ్మకాలు జరిపి ఆపై తయారీ ప్లాంటు నెలకొల్పుతామని చెప్పింది. ఆన్లైన్ , ఆఫ్‌లైన్ మోడ్లలో తమ కార్ల సేల్స్ ఉంటాయంటూ వార్తలు వ్యాపింప జేసింది. అలా కుదరదు ఇండియాలో కార్ల తయారీకి సంబంధించి స్పష్టమైన వైఖరి తెలపకుండా.. టెస్లా అనుసురిస్తున్న కప్పదాటు వైఖరిపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇండియాలో టెస్లా కార్ల తయారీ పరిశ్రమను నెలకొల్పి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే పన్ను రాయితీ ఇస్తామంటూ కుండబద్దలు కొట్టింది, అయితే ఈ విషయాన్ని నేరుగా నేరుగా ప్రస్తావించకుండా, అధికారుల ద్వారా ఫీలర్లు వదిలింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఘాటు రిప్లైకి టెస్లా ఎలా స్పందిస్తోందే వేచి చూడాలి చదవండి: ఆ కారుపై లక్ష వరకు బెనిఫిట్ ఆఫర్స్ ! -
రియల్టీకి ఆక్సిజన్ అందించాలి!
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ కార్మికుల కొరత, ఆర్థిక పరిమితులు, అనుమతుల జారీలో జాప్యం, పెరిగిన నిర్మాణ వ్యయాలు, క్షీణించిన కస్టమర్ల డిమాండ్లతో దేశీయ రియల్ ఎస్టేట్ రంగం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రభావం రియల్టీ రంగాన్ని కుంగదీసింది. ఈ రంగాన్ని 90 శాతం నష్టాల్లోకి నెట్టేసిందని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలిపింది. ఆదుకోవాలి కరోనా సెకండ్ వేవ్‌తో దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఆక్సిజన్ అందించేందుకు ప్రభుత్వం బెయిల్ఔట్ ప్యాకేజీని ప్రకటించాలని క్రెడాయ్ చైర్మన్ సతీష్ మాగర్ కోరారు. డెవలపర్లకు రుణ రీస్ట్రక్చరింగ్‌కు అనుమతి ఇవ్వటంతో పాటు ఈ రంగంలో ద్రవ్యతను పెంచడం కోసం అన్ని రకాల రుణాల మొత్తం, వడ్డీల మీద 6 నెలల పాటు మారటోరియాన్ని విధించాలని సూచించారు. స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ (ఎస్ఎంఏ) వర్గీకరణను మరొక ఏడాది పాటు స్తంభింపచేయాలని కోరారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నిర్మాణ గడువు సమయాన్ని అదనంగా 6 నెలలు పొడిగించాలని, కొనుగోలుదారుల డిమాండ్‌ను ఏర్పరిచేందుకు స్టాంప్‌డ్యూటీని తగ్గింపు లేదా మాఫీ చేయాలని తెలిపారు. సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా నిర్మాణ అనుమతుల వేగవంతం చేయడంతో పాటు నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించాలని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉద్యోగ అవకాశాల పరిశ్రమ రియల్ ఎస్టేట్. స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్టీ వాటా 6–7 శాతం వరకు ఉంది. 10–20 శాతం ధరల వృద్ధి దేశంలో గత కొన్ని వారాలుగా స్టీల్ తయారీదారులు కుమ్మక్కు అయ్యి 40–50 శాతం మేర ధరలను పెంచారని.. దీంతో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగిందని క్రెడాయ్ ప్రెసిడెంట్ హర్షవర్థన్ పటోడియా తెలిపారు. ఇందువల్ల దీర్ఘకాలంలో గృహాల ధరలు 10–20 శాతం మేర పెరుగుతాయని చెప్పారు. నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను డెవలపర్లు భరించే స్థాయిలో లేరని.. అయితే ఈ ధరల వృద్ధి ప్రభావం ప్రస్తుతం ఉన్న కస్టమర్ల మీద పడదని, అయితే కొత్త విక్రయాలతో ప్రారంభమవుతుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ బోమన్ ఇరానీ తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకూ పోరాటం చేస్తూనే ఉంటాం
-
రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్
-
తెలంగాణపై చిన్నచూపు!
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి నిధుల హామీలు పారిస్తున్నారు. తెలంగాణకు నిధులిచ్చేందుకు మాత్రం కేంద్రానికి మనసు రావడం లేదు’ అని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను ఆదుకుని, ప్రాధాన్యతా రంగాలకు నిధులు కేటాయించే విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తవుతున్నాయని, 70 దేశాల రాయబారులు ఇక్కడి జీనోమ్ వ్యాలీని సందర్శించారని.. ఇంత ప్రాముఖ్యత ఉన్న నగరానికి తగిన సహాయ, సహకారాలు అందించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదేమని నిలదీశారు. బుధవారం శాసనసభలో మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల పద్దులు.. సీఎం తరఫున ప్రభుత్వ రంగసంస్థలు, ఐఅండ్ పీఆర్ పద్దులపై కేటీఆర్ సమాధానమిచ్చారు. వ్యాక్సిన్ ఇక్కడ.. బాట్లింగ్ అక్కడనా?: అంతర్జాతీయంగా మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే తయారవుతుండగా.. 1,200 కిలోమీటర్ల దూరంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఖసోలిలో వ్యాక్సిన్ బాట్లింగ్ను చేపడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నో విషయాల్లో దేశానికే ఆద ర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ వరదల్లో మునిగిపోతే.. కేంద్రం నుంచి అందిన సాయం సున్నా అని విమర్శించారు. ‘‘104 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా వరదల బారినపడ్డ హైదరాబాద్‌కు రూ.1,350 కోట్ల తక్షణ సాయం అందించాలని సీఎం కేసీఆర్ లేఖ రాసినా కేంద్రం నుంచి ఒక్కపైసా రాలేదు. ఐటీ, ఎయిరోస్పేస్, వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఉన్న తెలంగాణకు రూ.832 కోట్లు అందించాలని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరికి లేఖ రాస్తే.. ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదంటూ తిరుగుటపా వచ్చింది. దేశాభివృద్ధిలో హైదరాబాద్ కు ఐదు శాతం జీడీపీ వాటా ఉన్నా.. కేంద్రం ఎందుకు తోడ్పాటు అందించడం లేదు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్.. హైదరాబాద్ ఫార్మాసిటీ, బయోటెక్‌పార్క్, మెగా టెక్స్టైల్ తదితరాలపై రాష్ట్రం మొర ఆలకించడం లేదు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై ఉలుకూ పలుకు లేదు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో రక్షణ సంస్థలు ఉన్నా కూడా.. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఎక్కడో ఉన్న బుందేల్‌ఖండ్‌కు తరలించారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పసుపు విస్తారంగా పండుతుంటే.. అక్కడ తమిళనాడులో పసుపు బోర్డు పెడతామని ఎన్నికల హామీలిస్తారు. ఇవన్నీ చూస్తుంటే అసలు కేంద్రం ఆలోచన ఏమిటో అర్థం కావడం లేదు. ఎదుగుతున్న రాష్ట్రాన్ని వేరుగా చూడటం సరికాదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వరకు ఆధార్ లింకేజీ పొడిగింపు హైదరాబాద్‌లో 20వేల లీటర్ల వరకు ఉచిత నీరు పొందేందుకు ఆధార్ లింకేజీ తప్పనిసరని, దీనికి తుది గడువును వచ్చేనెల 30 వరకు పొడిగించామని కేటీఆర్ చెప్పారు. ఉచిత నీటికి సంబంధించి ఏడాదికి రూ.480 కోట్లను ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ప్రస్తావించిన అంశాలపై ఆయన ఈ సమాధానాలు ఇచ్చారు. మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల పనులను 71 మున్సిపాలిటీల్లో మొదలుపెట్టగా 11 చోట్ల పూర్తయ్యాయని, మిగతా చోట్ల త్వరలో ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరానికి గత ఆరున్నరేళ్లలో వివిధ శాఖలు, పథకాలు, కార్యక్రమాల కింద మొత్తం రూ.67,149.23 కోట్లు ఖర్చుచేసినట్టు వెల్లడించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రతిపక్ష సభ్యులను ఉద్దేవించి.. ‘‘మీరు అక్కడే ఉంటారు. మేం ఇక్కడే ఉంటాం. అనుకున్నవన్నీ పూర్తి చేస్తాం. అనుమానం వద్దు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
అణాపైసా ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి వీలుగా కేంద్రం ఆరున్నరేళ్లలో రాష్ట్రానికి అణాపైసా కూడా ఇవ్వలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ధ్వజమెత్తారు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణకు సహాయం చేయాలని, రాయితీలు ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ ఎలాంటి సాయం చేయలేదన్నారు. పార్లమెంట్లో తాను చేసిన చట్టాలనే కేంద్రం తుంగలో తొక్కుతోందన్నారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. పరిశ్రమలను ఆదుకోవాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చట్టాలను గౌరవించి, ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. ఇక కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్‌తో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం దక్కలేదన్నారు. దీనికింద ప్రకటించిన రూ.20 లక్షల నిధులు ఎక్కడికి పోయాయో తెలియడం లేదన్నారు. ఈ పథకం వల్ల కేవలం వీధి వ్యాపారులకు మాత్రం కొంత ప్రయోజనం కలిగిం దన్నారు. గడిచిన ఆరేళ్లలో టీఎస్–ఐపాస్ కింద 15,326 పరిశ్రమలు ఆమోదం పొందగా, ఇందులో 11,954 పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. మొత్తంగా రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించగా, ఇందులో రూ.97 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 15.52 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని భావించగా, ఇప్పటివరకు 7.67 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. ఇక రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిధ్దం చేస్తున్నామని, ఆయా జిల్లాల్లో సాగయ్యే పంటలకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ‘ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ’ను సిధ్దం చేశామన్నారు. వెనుకబడిన జిల్లాలకు కూడా పరిశ్రమలను విస్తరిస్తామని మంత్రి తెలిపారు. మాంసానికి తెలంగాణ బ్రాండింగ్: తలసాని మాంసం ఉత్పత్తిలో ఇప్పటికే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా మాంసానికి బ్రాండింగ్ చేస్తామన్నారు. డీడీలు కట్టిన 28,583 మందికి త్వరలోనే గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ తర్వాత దాని నుంచి వచ్చిన సంపద రూ.5,490 కోట్లని తెలిపారు. గొర్రెల పంపిణీపై ఇంతవరకు రూ.4,587 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రెండో విడతలో 3.50 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీకి రూ.3 వేల కోట్లు కేటాయించామన్నారు. 83 రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్: కొప్పుల రాష్ట్రంలో 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా, ఇందులో 2018–19లో 12 పాఠశాలలను, 2020–21లో 71 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ పాఠశాలల్లో మొత్తంగా 30,560 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 7,570 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని మంత్రి తెలిపారు. -
బీమా బ్రోకింగ్ సంస్థలు...
న్యూఢిల్లీ: బీమా బ్రోకింగ్ సంస్థలను కూడా అంబుడ్స్‌మన్ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పాలసీదారులు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా కల్పించింది. ఇందుకు సంబంధించి ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ నిబంధనలను సవరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. అంబుడ్స్‌మన్‌కి కేవలం వివాదాలపైనే కాకుండా బీమా సంస్థలు, ఏజెంట్లు, బ్రోకర్లు, ఇతరత్రా మధ్యవర్తులు అందించే సేవల్లో లోపాలపైన కూడా ఫిర్యాదు చేసే విధంగా కంప్లైంట్ల పరిధిని విస్తృతం చేసినట్లు వివరించింది. ఇన్సూరెన్స్ సేవల్లో లోపాలపై వచ్చే ఫిర్యాదులను సత్వరం, తక్కువ వ్యయాలతో, నిష్పక్షపాతంగా పరిష్కరించే విధంగా బీమా రంగ అంబుడ్స్‌మన్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ నిబంధనలు–2017కి ఈ మేరకు సమగ్రమైన సవరణలు చేసినట్లు పేర్కొంది. నిర్దిష్ట సవరణల ప్రకారం.. పాలసీదారులు ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఆయా ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే తెలుసుకునేలా ప్రత్యేక మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంటుంది. వీడియో–కాన్ఫరెన్సింగ్ ద్వారా అంబుడ్స్‌మన్ విచారణ నిర్వహించవచ్చు. అంబుడ్స్‌మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి స్వతంత్రంగా, సమగ్రంగా జరిగే విధంగా తత్సంబంధ నిబంధనలను సవరించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. బీమా రంగంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కృషి చేసిన వారిని కూడా సెలక్షన్ కమిటీలో చోటు ఉంటుందని పేర్కొంది. -
ప్రజలకు కష్టాలు.. ప్రభుత్వానికి లాభాలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచి కష్టాల్లో ఉన్న ప్రజల నుంచి లాభాలు దండుకుంటోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మండిపడ్డారు. రాజధర్మాన్ని పాటించి తాత్కాలికంగా ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని వెనక్కి తీసుకోవడం ద్వారా ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘పెరుగుతున్న ఇంధన, గ్యాస్ ధరలతో ప్రతి పౌరుడు పడుతున్న ఇబ్బందులను మీకు తెలియజేయడానికి ఈ లేఖ రాస్తున్నాను. దేశంలో ఒక వైపు ఉద్యోగాలు, వేతనాలు, గృహ ఆదాయాలు క్రమక్రమంగా కోల్పోతున్న పరిస్థితి ఉంది. మధ్యతరగతి ప్రజలు, పేద వర్గాల జీవనం కష్టతరంగా మారింది. వీటికి తోడు నిత్యావసరాలు సహా అన్ని వస్తువుల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు పెరుగుతూ పోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న కష్టాల నుంచి ప్రభుత్వం లాభాలు గుంజుతోంది’అని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100కు చేరుకుందనీ, డీజిల్ ధరలు కూడా అదే స్థాయిలో పైకి పాకుతుండటంతో కోట్లాది మంది రైతుల కష్టాలు రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంధన ధరల పెరుగుదలకు గత ప్రభుత్వాలదే బాధ్యతంటూ మాట్లాడటం శోచనీయమన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎన్నికైన ప్రభుత్వాలు, అందుకు విరుద్ధంగా పనిచేయడం తగదన్నారు. -
500 మంది ట్విటర్ ఖాతాలు రద్దు
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారి ట్విట్టర్ అకౌంట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలపై సామాజిక మాధ్యమం ట్విట్టర్ చర్యలు మొదలు పెట్టింది. మొత్తం 500 మంది ట్విట్టర్ ఖాతాలను రద్దు చేసినట్టుగా తన బ్లాగ్‌లో ట్విట్టర్ పేర్కొంది. భారత్‌లో మరికొంత మందికి ట్విట్టర్‌తో యాక్సెస్ లేకుండా నిరోధించింది. అదే సమయంలో వినియోగదారుల స్వేచ్ఛను కాపాడతామని ట్విట్టర్ పేర్కొంది. వార్తా సంస్థలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయనేతల ఖాతాల్ని నిరోధించలేమంది. అలా చేస్తే భారత రాజ్యాంగం వారికి ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసినట్టేనని ట్విట్టర్ కేంద్రానికి బదులిచ్చింది. రైతు ఉద్యమంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న పాకిస్తాన్, ఖలిస్తాన్ మద్దతుదారులకు చెందిన 1,178 ఖాతాలపై నిషేధం విధించాలని ఈ నెల 4న కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ సంస్థని ఆదేశించింది. రైతు నిరసనలపై తప్పుడు ప్రచారం చేస్తూ, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని కేంద్రం ట్విట్టర్‌కి తెలిపింది. దీనిపై ట్విట్టర్ చర్యలు చేపడుతూ మొత్తం 500 మంది అకౌంట్లను నిషేధించింది. కొంత మంది ఖాతాల్లో విద్వేషపూరిత ట్వీట్లను తొలగించింది. ‘కూ’లో స్పందించిన కేంద్రం అమెరికాకి చెందిన ట్విట్టర్ సంస్థ తన చర్యలన్నింటినీ బ్లాగ్‌లో పేర్కొనడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. ఈ అంశంపై కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శితో అపాయింట్మెంట్ కోరిన ట్విట్టర్ ఇలా బ్లాగ్‌లో పోస్టు చెయ్యడం అసాధారణమని ఐటీ శాఖ పేర్కొంది. ఐటీ శాఖ తన స్పందనని దేశీయంగా తయారు చేసిన ట్విట్టర్ తరహా ‘కూ’ యాప్‌లో పోస్టు చేసింది. కేంద్రం తన స్పందనని కూ యాప్‌లో ఉంచడంతో ఈ యాప్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
పూర్తి సామర్థ్యంతో సినిమా హాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంద శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లలో ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ఇటీవల జారీ చేసిన నూతన కోవిడ్–19 మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం ప్రామాణిక నియమావళిని విడుదల చేశారు. కోవిడ్–10 ప్రోటోకాల్స్ పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వంద శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిబంధనలు పాటించాలని చెప్పారు. శానిటైజేషన్ మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలన్నారు. పూర్తి సామర్థ్యంలో సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఏఐ) స్వాగతించాయి. డిజిటల్‌కి గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తాం.. ఓటీటీల్లో విడుదలవుతున్న పలు వెబ్ సిరీస్‌లు, షోలు వివాదాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ వేదికలపై విడుదలయ్యే వెబ్‌సిరీస్‌లు, షోల నియంత్రణకు గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తామని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ‘‘ఓటీటీల్లో విడుదలవుతున్న కంటెంట్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. త్వరలోనే గైడ్‌లైన్స్ తీసుకొస్తాం’’ అని వెల్లడించారు. నియమావళిలోని ముఖ్యాంశాలు ► కంటైన్మెంట్ జోన్లలోని థియేటర్లలో చలనచిత్రాల ప్రదర్శనకు అనుమతి లేదు. ► క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు చర్యలకు సిఫార్సు చేయొచ్చు. ► థియేటర్లలో సీట్ల సామర్థ్యం వందశాతానికి పెంచుకోవచ్చు. ► సినిమా హాళ్లు, థియేటర్లలో కోవిడ్–19 సంబంధిత భద్రతా చర్యలను అమలు చేయాలి. ► ఫేస్ మాస్కుల వినియోగం తప్పనిసరి. ► థియేటర్ల బయట, కామన్ ప్రాంతాలు, వేచిఉండే ప్రాంతాల్లో కనీసం ఆరు అడుగుల సామాజిక దూరం పాటించేలా చూడాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ► ఆరోగ్యసేతు యాప్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ► ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో రద్దీ లేకుండా ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ► సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ స్క్రీన్‌లో సినిమాల ప్రదర్శనల మధ్య తగినంత విరామం ఇవ్వాలి. ► టికెట్లు, ఆహారం, పానీయాల కొనుగోలులో చెల్లింపుల నిమిత్తం కాంటాక్ట్‌లెస్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలి. ► టికెట్ల కొనుగోలు నిమిత్తం రోజంతా తెరచి ఉండేలా తగిన సంఖ్యలో బాక్సాఫీస్ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా ముందస్తు బుకింగ్‌ను అనుమతించాలి. ► థియేటర్ల ప్రాంగణంలో శానిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► మానవ సంచారం ఉండే అన్ని చోట్లా హ్యాండిల్స్, రెయిలింగ్స్ తరచుగా శానిటైజ్ చేయాలి. ► థియేటర్లలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులపై ప్రకటనలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. -
సీఎస్ఆర్ విషయంలో కంపెనీలకు స్వేచ్ఛ!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమం విషయంలో కంపెనీలకు మరింత వెసులుబాటు కల్పిస్తూ కంపెనీల చట్టంలోని నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. సీఎస్ఆర్ కింద ఒకటికి మించి ఎక్కువ సంవత్సరాల పాటు పట్టే ప్రాజెక్టులను చేపట్టేందుకు అనుమతించింది. అదే విధంగా నిబంధనలకు మించి చేసిన అదనపు ఖర్చును తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో చూపించుకుని సర్దుబాటు చేసుకునే అవకాశం ఇచ్చింది. అదే విధంగా సీఎస్ఆర్ కింద లబ్ధిదారులు లేదా ప్రభుత్వం పేరిట మూలధన ఆస్తుల (క్యాపిటల్) కొనుగోలుకూ అనుమతించింది. కంపెనీల తరఫున సీఎస్ఆర్ కార్యక్రమాల అమలును చూసే ఏజెన్సీలకు 2021 ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ (నమోదును)ను తప్పనిసరి చేసింది. సీఎస్ఆర్ నిబంధనలను పాటించకపోవడాన్ని నేరపూరితం కాని చర్యగా మారుస్తూ.. దీని స్థానంలో పెనాల్టీని ప్రవేశపెట్టింది. ఒకవేళ సీఎస్ఆర్ కింద ఒక కంపెనీ చేయాల్సిన ఖర్చు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50లక్షల్లోపు ఉన్నట్టయితే సీఎస్ఆర్ కమిటీ ఏర్పాటు నుంచి మినహాయింపునిచ్చింది. వ్యాపార సులభ నిర్వహణ విషయంలో భారత్ స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు.. నిబంధనలను పాటించకపోవడాన్ని నేరంగా చూడకపోవడం, సీఎస్ఆర్ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యాలతో తాజా సవరణలు చేపట్టినట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీల చట్టం 2013 కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖా సీఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. లాభదాయక కంపెనీలు గడిచిన మూడేళ్ల కాల సగటు లాభంలో కనీసం 2% సీఎస్ఆర్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సంస్థలకు అనుమతి.. సీఎస్ఆర్ కార్యక్రమాలు లేదా ప్రాజెక్టుల రూపకల్పన, పర్యవేక్షణ, విశ్లేషణ పనులను చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతించడం కూడా కేంద్రం తీసుకువచ్చిన మార్పుల్లో భాగంగా ఉంది. కాకపోతే సీఎస్ఆర్ కార్యక్రమాలు లేదా ప్రాజెక్టుల అమలు బాధ్యతలను చూడ్డానికి వీల్లేదని స్పష్టం చేసింది. విదేశీ సంస్థలను అనుమతించడం వల్ల సీఎస్ఆర్ విభాగంలో అంతర్జాతీయంగా అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాలు, విధానాలను తీసుకొచ్చేందుకు వీలు పడుతుందని కార్పొరేట్ శాఖా తెలిపింది. 2014 ఏప్రిల్ 1 నుంచి సీఎస్ఆర్ నిబంధనలు అమల్లోకి రాగా.. 2014–15లో రూ.10,066 కోట్లను కంపెనీలు ఖర్చు చేశాయి. ఇది 2018–19లో రూ.18,655 కోట్లకు విస్తరించింది. ఐదేళ్లలో రూ.79,000 కోట్లను కంపెనీలు వెచ్చించాయి. -
లాంబ్రెటా కంపెనీ ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: లాంబ్రెటా.. విజయ్ సూపర్ .. కొన్ని దశాబ్దాల క్రితం స్కూటర్లకు పర్యాయపదంగా నిల్చాయీ బ్రాండ్లు. అప్పట్లో ఓ ఊపు ఊపిన లాంబ్రెటా స్కూటర్లంటే ఇప్పటికీ ఒక వింటేజ్ బ్రాండ్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమేణా లాంబ్రెటా, విజయ్ సూపర్ ఇతర వాహనాల పోటీ దెబ్బకు కనుమరుగయ్యాయి. ఇప్పుడిక వీటిని తయారు చేసిన కంపెనీ స్కూటర్స్ ఇండియా (ఎస్ఐఎల్) వంతు వచ్చింది. నష్టాల భారంతో కుదేలవుతున్న ఎస్ఐఎల్ను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో దీన్ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. మూసివేతకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తదుపరి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదన ప్రకారం స్కూటర్స్ ఇండియా బ్రాండ్ పేరును విడిగా విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాబినెట్ ముందు ఉంచిన ప్రణాళిక ప్రకారం కంపెనీ మూసివేతకు రూ. 65.12 కోట్లు అవసరమయ్యే నిధులను రుణం కింద కేంద్రం సమకూర్చాలి. తగు స్థాయిలో నిధులు సమకూరిన తర్వాత అదనంగా ఉన్న రెగ్యులర్ సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును (వీఆర్ఎస్/వీఎస్ఎస్) ఆఫర్ చేయనున్నారు. లక్నో కేంద్రంగా కార్యకలాపాలు సాగించే స్కూటర్స్ ఇండియాలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు, కంపెనీకి చెందిన 147.49 ఎకరాల స్థలాన్ని పరస్పర ఆమోదయోగ్య రేటు ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధి ప్రాధికార సంస్థకు అప్పజెబుతారు. ఇక, స్టాక్ ఎ క్సే్చంజీల నుంచి షేర్లను కూడా డీలిస్ట్ చేయాల్సి ఉంటుంది. 1972 నుంచి.. స్కూటర్స్ ఇండియా (ఎస్ఐఎల్) 1972లో ఏర్పాటైంది. వివిధ రకాల ఇంధనాలతో పనిచేసే త్రిచక్ర వాహనాల డిజైనింగ్, అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ కోసం దీన్ని నెలకొల్పారు. 1975లో దేశీ మార్కెట్ కోసం విజయ్ సూపర్ బ్రాండ్‌తోనూ, విదేశీ మార్కెట్ల కోసం లాంబ్రెటా పేరుతోనూ ఎస్ఐఎల్ స్కూటర్లను తయారు చేయడం మొదలు పెట్టింది. అటు పైన విక్రమ్/లాంబ్రో పేరిట త్రిచక్ర వాహనాలను కూడా ఉత్పత్తి చేసింది. 1997లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని నిలిపివేసిన ఎస్ఐఎల్ .. విక్రమ్ బ్రాండు కింద వివిధ త్రిచక్ర వాహనాల తయారీ, మార్కెటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టింది. కంపెనీ నష్టాల్లో కూరుకుపోతుండటంతో కేంద్రం గతంలో దీన్ని విక్రయించే ప్రయత్నాలు చేసింది. యాజమాన్య హక్కుల బదలాయింపుతో పాటు తనకున్న పూర్తి వాటాలను విక్రయించేందుకు 2018 లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించింది. కానీ, విక్రయ యత్నాలు కుదరకపోవడంతో చివరికి మూసివేత నిర్ణ యం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
మీరు చేయకపోతే.. మేమే స్టే విధిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతు ప్రతినిధులతో కేంద్రం జరుపుతున్న చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తామని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం మరింత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తేల్చిచెప్పింది. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభించే వరకు ఆ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, ఆ చట్టాల అమలుపై అంత పట్టుదల ఎందుకని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆ చట్టాల అమలును నిలిపేయండి. లేదంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు మేమే స్టే విధించాల్సి వస్తుంది’అని హెచ్చరించింది. చట్టాలపై స్టే విధించాలనుకోవడం లేదని, వాటి అమలును మాత్రమే తాత్కాలికంగా నిలిపేసి, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తే.. కోర్టు ఏర్పాటు చేయనున్న కమిటీకి పరిష్కారం కనుగొనడం సులభమవుతుందని వివరించింది. కొత్త వ్యవసాయ చట్టాలు, రైతు ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు(మంగళవారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది. సమస్య పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. అమలుపై స్టే ఇవ్వలేరు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రాథమికహక్కులకు భంగం కలిగిస్తోందనో, లేక రాజ్యాంగ పరిధిలో లేదనో కోర్టు భావిస్తేనే.. చట్టాల అమలుపై స్టే విధించడం సాధ్యమవుతుందని ఆయన వాదించారు. పిటిషనర్లు తమ వాదనల్లో ఈ అంశాలను లేవనెత్తలేదని గుర్తు చేశారు. దానికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు పరిష్కారం కనుగొనడంలో విఫలమైనందువల్లనే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు చేసిన చట్టాలు రైతుల ఆందోళనలకు కారణమయ్యాయి. ఆ సమస్యను మీరే పరిష్కరించాలి’అని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే.. చట్టాలపై స్టే విధించడానికి తాము వ్యతిరేకమేనని పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం గుర్తు చేసింది. చట్టాల అమలుపై స్టే విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తమకు అందించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను కోరింది. వ్యవసా య చట్టాలను పలు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాలు ప్రయోజనకరమని పేర్కొనే ఒక్క పిటిషన్ కూడా తమ ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది. ఆందోళనలు కొనసాగించవచ్చు ‘చట్టాల అమలును నిలిపివేసిన తరువాత కూడా ఆందోళనలను కొనసాగించుకోవచ్చు. ఆందోళనల గొంతు నులిమేశామన్న విమర్శలను మేం కోరుకోవడం లేదు’అని రైతు సంఘాల తరఫున హాజరైన న్యాయవాదులతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే కమిటీకి నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎం లోధా సహా రెండు, మూడు పేర్లను సూచించాలని ఇరువర్గాలను ధర్మాసనం కోరింది. సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందులో ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రభుత్వం, రైతు ప్రతినిధుల మధ్య జనవరి 15న మరో విడత చర్చలు జరగనున్నాయని, ఆ లోపు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ.. చర్చల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా ఉందని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. చట్టాల అమలుపై స్టే విధిస్తే.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగే అవకాశముందని పేర్కొంది. ‘స్టే’తో లాభం లేదు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం కానీ, సుప్రీంకోర్టు కానీ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. ఆ చట్టాల రద్దు కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, అయితే, చట్టాల అమలుపై స్టే విధించడం పరిష్కారం కాబోదన్నది తమ అభిప్రాయమని భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా శాఖ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చాదునీ పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమొక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. రాజ్యాంగవిరుద్ధమైన ఆ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు భోగ్ సింగ్ మాన్సా కోరారు. కొనసాగితే హింసాత్మకం.. రైతుల ఆందోళన ఎక్కువకాలం కొనసాగితే అది హింసాత్మకంగా మారే ప్రమాదముందని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ‘మనందరిపై బాధ్యత ఉంది. ఏ చిన్న సంఘటన అయినా హింసకు దారి తీయవచ్చు. అలాంటిది ఏదైనా జరిగితే మనమంతా బాధ్యులమవుతాం. ఎవరి మరణానికి కూడా మనం బాధ్యులం కాకూడదు’ అని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించేవారిని తాము కాపాడబోమని పేర్కొంది. పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఈ చట్టాలను రూపొందించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైతేనే.. సాగు చట్టాలు అన్యాయమైనవని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని, రాజ్యాంగ విరుద్ధమైనవని నిర్ధారణ అయితే చట్టాలపై కోర్టు స్టే విధించగలుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని గట్టి ఆధారాలుంటే తప్ప పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడం సాధ్యం కాదని న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేదీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వాదన వినకుండానే ఒక నిర్ధారణకు వచ్చారు. పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడానికి పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేయడం ప్రాతిపదిక కాకూడదు. ఎంపీల విజ్ఞతకు సంబంధించిన విషయమిది. కోర్టు పరిధిలో లేని అంశమిది’ అని ద్వివేదీ పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారు కాబట్టి చట్టాలను నిలిపేయాలనడం సరికాదన్నారు. -
రైతులతో చర్చలు అసంపూర్ణం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ఉద్యమిస్తున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య సోమవారం జరిగిన ఏడో విడత చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. కొత్త సాగు చట్టాల రద్దు మినహా మరే ప్రతిపాదన తమకు అంగీకారయోగ్యం కాదని రైతు నేతలు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఆ చట్టాల్లోని రైతుల అభ్యంతరాలను నిబంధనల వారీగా చర్చిద్దామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చారు. రైతు ప్రతినిధులు వ్యవసాయ చట్టాల రద్దుపైనే పట్టుపట్టడంతో, వారి మరో డిమాండ్ అయిన ‘కనీస మద్దతు ధరకు చట్టబద్ధత’ అంశం పెద్దగా చర్చకు రాలేదు. 8న మళ్లీ చర్చించాలని నిర్ణయించారు. 41 రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. విజ్ఞాన్ భవన్లో చర్చలు ప్రారంభం కాగానే, మొదట, ఈ ఆందోళనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన చర్చల్లో తొలి నుంచీ రైతు నేతలు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన సవరణల ప్రతులను చించివేశారు. దాంతో, చర్చలు ప్రారంభమైన గంట సేపటికే ప్రతిష్టంభన నెలకొంది. దాంతో ఇరువర్గాలు బ్రేక్ తీసుకున్నాయి. ఆ సమయంలో రైతు నేతలు, తమకు దీక్షాస్థలి నుంచి వచ్చిన భోజనాన్ని స్వీకరించారు. ఆరో విడత చర్చల సమయంలో రైతులతో పాటు కేంద్రమంత్రులు కూడా అదే ఆహారాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. కానీ ఈ విడత చర్చల్లో మంత్రులు రైతు నేతలతో కలిసి భుజించలేదు. ఆ సమయంలో వారు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అనంతరం, సాయంత్రం 5.15 గంటల సమయంలో ఇరు వర్గాలు మళ్లీ సమావేశమయ్యాయి. చట్టాల రద్దు మినహా మరే ప్రత్యామ్నాయానికి అంగీకరించబోమని రైతు నేతలు తేల్చిచెప్పడంతో, చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. రైతుల డిమాండ్లపై అంతర్గతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, ఆ తరువాత మళ్లీ చర్చలు కొనసాగిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పినట్లు రైతు నేతలు వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అహం అడ్డుపడుతోందని వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత.. కీలకమైన ఈ రెండు డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గబోమని పునరుద్ఘాటించారు. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం చర్చిస్తామన్నారు. రెండు చేతులతో చప్పట్లు జనవరి 8న జరిగే చర్చల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చర్చల అనంతరం వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. అయితే, అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం లభించాలంటే ఇరు వర్గాలు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ‘రెండు చేతులతోనే చప్పట్లు కొట్టగలం’ అని వ్యాఖ్యానించారు. ‘వారు చట్టాల రద్దు అనే ఒక్క విషయం పైననే మొండిపట్టు పట్టారు. చట్టాలను క్లాజ్లవారీ చర్చించాలన్నది మా అభిప్రాయం’ అని వివరించారు. జనవరి 8న జరిగే చర్చలు కూడా మరో తేదీకి వాయిదా పడేందుకే జరుగుతాయా? అన్న ప్రశ్నకు.. పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతోనే చర్చలు జరుపుతున్నామని సమాధానమిచ్చారు. దేశంలోని రైతులందరి ప్రయోజనాలు ఆశించి, తమ ప్రభుత్వం చట్టాలను చేసిందన్నారు. అనంతరం, ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సమస్య పరిష్కారానికి అన్ని సానుకూల ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అందులో పేర్కొంది. తద్వారా చట్టాల రద్దు కుదరదన్న విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేసింది. సింఘు సరిహద్దు వద్ద నిరసన -
వచ్చే వారమే డ్రై రన్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు యంత్రాంగం సన్నద్ధతను అంచనా వేసేందుకు ఈ నెల 28, 29వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో కేంద్రం మాక్‌డ్రిల్ చేపట్టనుంది. టీకా లేకుండానే చేపట్టే ఈ ‘డ్రై రన్’ అచ్చంగా వ్యాక్సినేషన్ మాదిరిగానే ఉంటుంది. ఒక్కో రాష్ట్రం నుంచి రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని జిల్లా ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం/కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ప్రైవేట్ ఆస్పత్రులు వంటి ఐదు విభాగాల్లో వ్యాక్సినేషన్ సన్నద్ధతను అంచనా వేయనుంది. ‘వ్యాక్సిన్ సరఫరా, కేటాయింపులు, పరీక్షలు, సిబ్బంది మోహరింపు, ‘డ్రై రన్’ చేపట్టే చోట ఏర్పాట్లు, మాక్ డ్రిల్ సమయంలో భౌతిక దూరం వంటి ముందు జాగ్రత్తలను పాటించడం, నివేదికల తయారీ, సంబంధిత అధికారుల సమీక్ష సమావేశం వివరాలను ‘కో విన్’ సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ‘యంత్రాంగం సమీకరణ, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరీక్షించడం, క్షేత్రస్థాయిలో ‘కో విన్’ వినియోగం, ప్రణాళిక, అమలు, ఎదురయ్యే సవాళ్లు, వాస్తవ కార్యాచరణకు చేపట్టాల్సిన చర్యలను ఈ కార్యక్రమంలో గుర్తిస్తాం’ అని ఆరోగ్య శాఖ తెలిపింది. వివిధ స్థాయిల్లో అధికారుల అనుభవాలను కూడా సమీక్షిస్తామని వివరించింది. వ్యాక్సినేషన్ సందర్భంగా ఏమైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై వివిధ రాష్ట్రాలకు చెందిన 7 వేల మంది జిల్లా స్థాయి ట్రైనర్లకు శిక్షణ ముగిసిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 17,831 బ్లాకులకు గాను 1,399 బ్లాకుల్లో వ్యాక్సినేషన్ బృందాలకు శిక్షణ పూర్తయిందనీ, మిగతా బ్లాకుల్లో శిక్షణ పురోగతిలో ఉందని తెలిపింది. ధారావిలో కొత్త కేసులు సున్నా ముంబై: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ముంబైలోని ధారావి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మొన్నటి వరకు ప్రపంచంలోని కోవిడ్ హాట్స్పాట్లలో ఒకటిగా ఉన్న ధారావిలో గత 24 గంటల్లో ఒక్క కొత్త కరొనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఏప్రిల్ ఒకటి తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇక్కడ మొత్తం 3,788 కేసులు నమోదు కాగా, 3,464 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ యాక్టివ్ కేసులు 12 మాత్రమే. సుమారు రెండున్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ మురికి వాడలో లక్షలాదిగా జనం నివసిస్తున్నారు. కొత్త కేసులు 23,067 దేశంలో కొత్తగా మరో 23,067 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 1,01,46,845కు చేరుకోగా కోలుకుని వారి సంఖ్య 97లక్షలు దాటింది. 24 గంటల్లో మరో 336 మంది కోవిడ్‌తో చనిపోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,47,092గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా నుంచి ఇప్పటి వరకు 97,17,834 మంది కోలుకోగా రికవరీ రేటు 95.77%కి చేరుకుంది. -
మేమే కమిటీ వేస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: గత 20 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తోన్న రైతాంగం సమస్యల పరిష్కారానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేంగా గడ్డకట్టే చలినిసైతం లెక్కచేయకుండా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తోన్న రైతాంగం సమస్య పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కోర్టు ఎత్తిచూపింది. రైతుల సమస్య పరిష్కారం కాకపోతే ఇది జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఇదే నేపథ్యంలో యావత్ దేశంలోని రైతు సంఘాలతో కలిపి తామే ఒక కమిటీని నియమించనున్నట్టు తేల్చి చెప్పింది. సమస్య పరిష్కారం విషయంలో ఇరు పక్షాలకు చిత్తశుద్ధి అవసరమని చెప్పకనే చెప్పింది. చర్చలు ఫలవంతం కావాలన్న అభిలాశ ఇరుపక్షాలకూ ఉండాలని, అప్పుడే చర్చలు ఫలవంతం అవుతాయని కోర్టు అభిప్రాయపడింది. అటువంటి సంస్థల పేర్లను తెలియజేయాల్సిందిగా కోర్టు, ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్‌ని కోరింది. రేపటిలోగా చెప్పండి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తోన్న రైతాంగాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం రైతుల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఇది ఇలాగే కొనసాగితే ఇది జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉన్నదని అభిప్రాయపడింది. సంబంధిత రైతాంగం వాదనలను వినేందుకు సైతం కోర్టు సమ్మతిని తెలియజేసింది. అలాగే ప్రజాప్రయోజన వ్యాజ్యంపై రేపటిలోగా సమాధానమివ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ చర్యలు చేపట్టలేదని సొలిసిటర్ జనరల్ విచారణ సందర్భంగా కోర్టుకి వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా రైతులకు సూచించాలని ఆయన కోర్టుని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జరిపిన చర్చలు సత్ఫలితాలనివ్వలేదని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించారు. -
వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం రూల్స్
న్యూఢిల్లీ : దేశంలో టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త సంవత్సరంలో మొదలయ్యే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలివిడత జూలై వరకు కొనసాగుతుందని, ఈ విడతలో 25 నుంచి 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో తొమ్మిది వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా మూడు కంపెనీల వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. మార్గదర్శకాలు.. ► ఒక్కో వ్యాక్సిన్ కేంద్రంలో ఒకే రోజు వంద మందికి, అవసరమైతే 200 మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ► వ్యాక్సిన్ తీసుకునేవారు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన కో–విన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ► హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 50 ఏళ్ల వయసుపైబడిన వారికి తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వాలి. ఎన్నికల ఓటర్ల జాబితాను బట్టి 50 ఏళ్ల వయసు పైబడిన వారిని గుర్తించాలి. ► 50 ఏళ్ల వయసు ఉన్న వారిని కూడా మళ్లీ రెండు గ్రూపులుగా విభజించాలి. తొలుత 60 ఏళ్లకి పైబడిన వారికి ఇవ్వాలి. ► వ్యాక్సినేషన్ బృందంలో వ్యాక్సినేటర్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్, ఆగ్జిలరీ నర్స్ మిడ్వైఫ్, లేడీ హెల్త్ విజిటర్లు ఉంటారు. వీరే కాకుండా పోలీసు శాఖకు చెందిన వారు సహాయకులుగా ఉంటారు. ► వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. జనవరి నుంచి వ్యాక్సినేషన్‌కు చాన్స్ : సీరమ్ చీఫ్ అదార్ పూనావాలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) చీఫ్ అదార్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ నాటికి మళ్లీ కరోనా ముందు నాటి పరిస్థితులు వస్తాయన్నారు. ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సంబంధించి అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు. దేశ జనాభాలో 20% మందికి వ్యాక్సిన్ ఇవ్వగానే సాధారణ పరిస్థితులు వస్తాయని అంచనా వేశారు. -
ఉద్యమం ఇక ఉధృతం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం కానుంది. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆరోవిడత చర్చలకు ముందు రైతుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉదయం రైతు సంఘాలకు కొన్ని ప్రతిపాదనలను పంపించింది. వ్యవసాయ చట్టాల రద్దు కుదరదని అందులో స్పష్టం చేసింది. ప్రతిగా, రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని సవరణలకు సిద్ధమని పేర్కొంది. కనీస మద్దతు ధర విధానం కొనసాగింపుపై లిఖితపూర్వక హామీ ఇస్తామని వివరించింది. అయితే, ఈ ప్రతిపాదనలను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే తమ ఏకైక డిమాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రం చేయాలని రైతు నేతలు నిర్ణయించారు. అందుకు ఒక కార్యాచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరగాల్సిన ఆరో విడత చర్చలు రద్దయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దు సహా పలు డిమాండ్లతో రెండు వారాలుగా వేలాదిగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కొత్తవేం లేవు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించిన అనంతరం రైతు నేతలు విలేకరులతో మాట్లాడారు. ఆ ప్రతిపాదనల్లో కొత్తవేం లేవని, గతంలో చర్చల సందర్భంగా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇవే ప్రతిపాదనలను తమ ముందు ఉంచారని వివరించారు. వాటిని ‘సంయుక్త కిసాన్ కమిటీ’ పూర్తిగా తిరస్కరిస్తోందని రైతు నేత శివ కుమార్ కక్కా తెలిపారు. ఆ ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా రైతులను అవమానించేవిగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం నుంచి కొత్తగా ఏవైనా ప్రతిపాదనలు వస్తే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా, డిసెంబర్ 14న ఉత్తరాది రాష్ట్రాల రైతులు ‘ చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడ్తారని, దక్షిణాది రాష్ట్రాల రైతులు స్థానిక జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుపడంతో పాటు, బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తారని రైతు నేతలు తెలిపారు. అలాగే, డిసెంబర్ 12న అన్ని టోల్ ప్లాజాల వద్ద ‘టోల్ ఫ్రీ’ కార్యక్రమం చేపడ్తామన్నారు. అదే రోజు ఢిల్లీ –జైపూర్ హైవే, ఢిల్లీ–ఆగ్రా హైవేలను దిగ్బంధిస్తామన్నారు. పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీలకు చెందిన సంస్థలకు సంబంధించిన సేవలు, ఉత్పత్తులను బహిష్కరించాలని, టెలీకాం సేవలను జియో నుంచి వేరే సంస్థలకు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులను ఘొరావ్ చేయాలని, నాయకుల ఇళ్లు, కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు జరపాలని విజ్ఞప్తి చేశారు. మీడియాలో వస్తున్నట్లు రైతు సంఘాల నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని కక్కా స్పష్టం చేశారు. రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు రైతు ఆందోళన అంశంపై బుధవారం ప్రతిపక్ష పార్టీల నాయకుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వారు రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, డీఎంకే నాయకుడు టికెఎస్ ఎలంగోవన్ ఉన్నారు. ఆ బిల్లులకు ప్రభుత్వం అప్రజాస్వామికంగా పార్లమెంటులో ఆమోదం పొందిందని వివరించారు. -
ఉద్యోగకల్పనకు రూ. 23,000 కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో వ్యాపార సంస్థలను ఉద్యోగ కల్పనకు ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై) పథకం పట్టాలెక్కనుంది. ఈ స్కీమ్ కోసం మొత్తం రూ.22,810 కోట్ల నిధుల కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ‘ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0 కింద కోవిడ్ రికవరీ దశలో కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహం అలాగే సంస్థాగత రంగంలో ఉపాధిని పెంపునకు తోడ్పాటు కోసం ఉద్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన’కు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రస్తుత 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,584 కోట్ల వ్యయ కేటాయింపునకు, అదేవిధంగా మొత్తం స్కీమ్ కాల వ్యవధికి (2020–23) గాను రూ.22,810 కోట్ల వ్యయానికి కేబినెట్ ఓకే చెప్పినట్లు వెల్లడించింది. ఏబీఆర్‌వై స్కీమ్‌లో భాగంగా 2020 అక్టోబర్ 1 తర్వాత, 2021 జూన్ వరకు కొత్తగా ఉద్యోగాలను కల్పించిన సంస్థలకు రెండేళ్ల పాటు సబ్సిడీ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని కేబినెట్ సమావేశం అనంతరం కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వివరించారు. పథకం సంగతిదీ... 1,000 మంది వరకూ ఉద్యోగులు ఉండే సంస్థలు కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చెల్లింపులను ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఆయా కొత్త ఉద్యోగుల మూల వేతనంపై 12% ఉద్యోగుల తరఫు చెల్లింపు, 12% వ్యాపార సంస్థ తరఫు చెల్లింపు, అంటే మొత్తం 24 శాతాన్ని ఈ స్కీమ్ కింద కేంద్రం సబ్సిడీ కింద అందజేస్తుంది. అయితే, 1,000 మంది కంటే అధికంగా ఉద్యోగులు కలిన సంస్థల విషయంలో మాత్రం రెండేళ్ల పాటు కేవలం ఉద్యోగుల తరఫున 12 శాతం ఈపీఎఫ్ చెల్లింపు మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. ఉదాహరణకు, 2020 అక్టోబర్ 1 తేదీకి ముందు ఈపీఎఫ్ఓలో నమోదైన ఏ సంస్థలో కూడా పనిచేయని, యూనివర్సల్ పర్మనెంట్ నంబర్ (యూఏఎన్) లేని ఒక ఉద్యోగి (నెల వేతనం రూ.15,000 లోపు ఉండాలి) ఈ స్కీమ్‌కు అర్హుడు. కోవిడ్ సమయంలో, 2020 మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగి (నెల వేతనం రూ.15,000 లోపు ఉండాలి), సెప్టెంబర్ 30, 2020 వరకూ ఈపీఎఫ్ఓ కవరేజీ ఉన్న ఏ సంస్థలోనూ చేరకుండా ఉన్నా కూడా ఈ స్కీమ్ ప్రయోజనానికి అర్హత లభిస్తుంది. ఆధార్‌తో అనుసంధానమైన సభ్యుల ఖాతాలోకి ఎలక్ట్రానిక్ విధానంలో భవిష్య నిధి వాటా మొత్తాన్ని ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. కేబినెట్ ఇతర నిర్ణయాలు.. ► కోచి, లక్షద్వీప్ ద్వీపాల మధ్య సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) కనెక్టివిటీని కల్పించే ప్రాజెక్టుకు ఆమోదం. దీనికి రూ.1,072 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ► భారత్, సురినామ్ మధ్య ఆరోగ్యం, వైద్య రంగాల్లో సహకారం కోసం ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి ఓకే. ► భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, లగ్జెంబర్గ్ క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సీఎస్‌ఎస్‌ఎఫ్ మధ్య ఒప్పందం. -
మద్దతు ధరకు ఢోకా లేదు
సాక్షి, న్యూఢిల్లీ: మద్దతు ధర ప్రధాన అంశంగా వ్యవసాయ బిల్లుల రద్దు డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల ఆందోళనను పరిష్కరించేందుకు కేంద్రం స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైతులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జరగనున్న ఆరో విడత చర్చల్లో మరింత స్పష్టతతో రైతులకు భరోసా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రైతుల ప్రతినిధి బృందం, కేంద్ర మంత్రుల మధ్య విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన ఐదో విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మళ్లీ డిసెంబర్ 9న సమావేశం కానుంది. 12 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)ను క్రమంగా తొలగించేందుకు ఈ చట్టాలు ఊతమిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ అంశంపై ఆందోళన అవసరం లేదని చెబుతూ వస్తోంది. ఈ చట్టాలు చేసిన అనంతరం కూడా పలు పంటలకు మద్దతు ధర ప్రకటించినట్టు వివరిస్తోంది. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా మద్దతు ధరలు పెంచుతూ, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ముందుకు వెళుతున్నామని వాదిస్తోంది. గతంలోనూ చట్టరూపం లేదు.. ‘వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్’ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా మొత్తం 22 వ్యవసాయ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను(ఎమ్మెస్పీ) నిర్ణయిస్తుంది. పంటలకు ఎమ్మెస్పీని సిఫారసు చేస్తున్నప్పుడు సీఏసీపీ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఉత్పత్తి వ్యయంపై ఎమ్మెస్పీ ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండాలని 2018–19 బడ్జెట్లోనే ప్రకటించామని, దీని ప్రకారమే అన్ని ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటల కనీస మద్దతు ధరలను పెంచినట్టు కేంద్రం వాదిస్తోంది. 2018–19, 2019–20 సంవత్సరాల్లో దేశపు సగటు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం మార్జిన్ తిరిగి వచ్చేలా ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొంది. ఇదే సూత్రానికి అనుగుణంగా 2020–21 మార్కెటింగ్ సీజన్ కోసం అన్ని ఖరీఫ్ పంటలకు, రబీ పంటలకు మద్దతు ధర ప్రకటించామని తెలిపింది. మద్దతు ధరకు చట్టరూపం గతంలోనూ లేదని, ఇప్పుడు కూడా అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి కొనసాగింపుగా ఐదో విడత చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ‘ఎమ్మెస్పీ కొనసాగుతుందని మేం చెప్పాం. ఎమ్మెస్పీపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. అయితే రైతుల మనస్సులో ఏమైనా సందేహాలు ఉంటే, వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఏపీఎంసీ చట్టం రాష్ట్రాలకు చెందినది. రాష్ట్రానికి చెందిన మండీలను ఏ విధంగానైనా ప్రభావితం చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ఎవరికైనా అనుమానాలు ఉంటే, వాటినీ నివృత్తి చేస్తాం. ఈ 9వ తేదీన జరగనున్న చర్చల్లో అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నాం’ అని తోమర్ తెలిపారు. రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెనక్కి తగ్గని రైతు సంఘాలు.. మద్ధతు ధరపై భరోసా ఇస్తే సరిపోదని, అది చేతల్లో కూడా ఉండాలని, చట్టబద్ధత తప్పని సరిగా కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెస్పీకి చట్టరూపం అవసరం లేదని, అది కార్యనిర్వాహక నిర్ణయమని ప్రభుత్వం చెబుతుండగా.. ఉపాధి హామీ, ఆహార భద్రత వంటివి కూడా చట్టరూపం దాల్చకముందు కార్యనిర్వాహక నిర్ణయంగానే ఉండేవని రైతు సంఘాలు గుర్తుచేస్తున్నాయి. 9వ తేదీన జరిగే చర్చల్లో ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి, ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాలు చెబుతున్నాయి. ముందు ఈ మూడు చట్టాలు రద్దు చేస్తేనే కేంద్రం చెప్పేది ఏదైనా వింటామని స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం సవరణలు తెస్తామని చెబుతున్నప్పటికీ ఈ మూడు చట్టాల మౌలిక స్వరూపం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నది తమ ఆందోళన అని వివరిస్తున్నాయి. అందుకే రేపు 8వ తేదీన జరిగే భారత్ బంద్ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. -
8న భారత్ బంద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతులు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే డిసెంబర్ 8న భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని మిగిలిన రహదారులను సైతం అడ్డుకునే ప్రణాళిక రూపొందించినట్లు రైతు నాయకుడు హర్విందర్ సింగ్ లఖ్వాల్ తెలిపారు. మోడీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల దిష్టిబొమ్మలను నేడు దేశవ్యాప్తంగా దగ్ధం చేయాలని నిర్ణయించారు. గణతంత్ర దినోత్సవ కవాతులో రైతులు పాల్గొనాలని ఢిల్లీ –ఘజియాబాద్ సరిహద్దులో ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మరోవైపు భారత ప్రభుత్వ సవరణను అంగీకరించే ప్రసక్తిలేదని, సింఘు సరిహద్దులో ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిసాన్ సభ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లాహ్ తెలిపారు. రైతు ఉద్యమాన్ని పంజాబ్ ఉద్యమం అని మాత్రమే ప్రచారం చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. అయితే ఈ ఉద్యమం భారతదేశం అంతటా జరుగుతోందని, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించని పరిస్థితుల్లో, ఉద్యమం మరింత దూకుడుగా జరుగుతుందని మొల్లాహ్ హెచ్చరించారు. కెనడాకు వార్నింగ్ గురువారం అసంపూర్తిగా ముగిసిన చర్చలను మరోసారి కొనసాగించేందుకు రైతులు సంఘాల నాయకులు, కేంద్రం సిద్ధమయ్యారు. రైతులు చేస్తున్న నిరసనలు పది రోజులకు చేరుకున్న నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో కేంద్రంతో రైతులు మరో దఫా చర్చలు జరుపనున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర విదేశాంగ శాఖ భారత్‌లో కెనడా హైకమిషనర్ నాదిర్ పటేల్‌ను శుక్రవారం హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అనంతరం కెనడా ప్రధాని, కేబి నెట్ మంత్రులు భారత్‌లో జరుగుతున్న నిరసనలపై స్పందించడాన్ని తప్పుబడుతూ.. అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇరు దేశాల మధ్య బంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. -
రోడ్డెక్కనున్న 5,595 ఎలక్ట్రిక్ బస్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా మరో 5,595 ఎలక్ట్రిక్ బస్‌లు రోడ్డెక్కనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఈ మేరకు ఫేమ్ ఇండియా స్కీం ఫేజ్–2 కింద ఆమోదం తెలిపింది. 64 నగరాల్లో ఇవి కొద్ది రోజుల్లో పరుగెత్తనున్నాయి. 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్ సిటీస్, రాజధాని నగరాలు, స్పెషల్ కేటగిరీ స్టేట్స్‌లోని నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆసక్తి వ్యక్తీకరణను డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కోరింది. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 14,988 ఎలక్ట్రిక్ బస్‌ల కోసం 86 ప్రతిపాదనలు చేశాయి. వీటిని పరిశీలించిన ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, సాంక్షనింగ్ కమిటీ చేసిన సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం 5,595 బస్‌లను మంజూరు చేసింది. ఇందులో 5,095 బస్‌లు నగరాల్లో (ఇంట్రాసిటీ) నడిపేందుకు నిర్దేశించారు. నగరాల మధ్య (ఇంటర్సిటీ) కార్యకలాపాలు సాగించేందుకు మరో 400 బస్‌లు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం 100 బస్‌లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు కేటాయించారు. కాంట్రాక్టు కాలంలో అన్ని బస్‌లు 400 కోట్ల కిలోమీటర్లు తిరగనున్నాయి. 120 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. ఫేజ్–2 కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్‌లను చేజిక్కించుకుంది. ఇందులో విశాఖపట్నం 100, విజయవాడ 50, అమరావతి 50, తిరుపతి 50, కాకినాడ 50 బస్‌లను దక్కించుకున్నాయి. అలాగే నగరాల మధ్య ప్రజా రవాణాకు 50 బస్‌లను కేటాయించారు. తెలంగాణలో హైదరాబాద్‌కు 300, వరంగల్‌కు 25 బస్‌లు అలాట్ అయ్యాయి. కాగా, ఫేజ్–2లో నాలుగు రాష్ట్రాల్లో లోయెస్ట్ బిడ్డర్‌గా హైదరాబాద్ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నిలిచినట్టు మార్కెట్ వర్గాల సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థల టెండర్లలో ఈ కంపెనీ పోటీలో ముందున్నట్టు తెలుస్తోంది. 9, 12 మీటర్ల పొడవున్న బస్‌లను ఒలెక్ట్రా తయారు చేస్తోంది. ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో 400కుపైగా ఒలెక్ట్రా ఈ–బస్‌లు విజయ వంతంగా పరుగెడుతున్నాయి. బ్యాటరీ మినహా బ స్కు కావాల్సిన విడిభాగాలన్నీ దేశీయంగా తయా రు చేస్తోంది. జడ్చర్ల వద్ద సంస్థకు ప్లాంటు ఉంది. -
కోట్లాదిమందికి వ్యాక్సినేషన్ ఎలా?
న్యూఢిల్లీ: ఆశలు చిగురిస్తున్నాయి, ఎదురు చూపులు ఫలించనున్నాయి. 2021 వస్తూ వస్తూ మంచి శకునాలు మోసుకురాబోతోంది కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది వేసవికి ముందే వస్తుందనే అంచనాలున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వాటి పంపిణీ ఎలా ? 130 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో అందరికీ వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుంది ? కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వచ్చే ఏడాది వేసవినాటికి 10 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అంచనాలున్నాయి. ఈ రేసులో ఫైజర్, మోడెర్నా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ముందున్నాయి. ఈ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని, సామర్థ్యంగా పని చేస్తాయని తేలితే భారత్‌లో 130 కోట్లకు పైగా ప్రజలకి వ్యాక్సినేషన్ చేయడమే కేంద్ర ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్. ఈ సవాళ్లను అధిగమించడానికి చాలా రోజులుగా కేంద్రం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. బ్లాక్ మార్కెట్లు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురుచూస్తూ ఉండడంతో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. దీంతో బ్లాక్ మార్కెట్లు విజృంభిస్తున్నాయన్న ఆందోళనలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇచ్చే టీకా చుట్టూ వ్యాపారం జరక్కుండా కేంద్రం చర్యలు తీసుకోవడం అతి పెద్ద సమస్య. వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీలో అవినీతికి తావు లేకుండా చూడడం అతి పెద్ద సవాలని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోల్డ్ స్టోరేజీలు ప్రపంచదేశాల్లో టీకా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించే దేశం మనదే. టీకా పంపిణీకి పటిష్టమైన వ్యవస్థ ఉంది. భారత్‌లో 27 వేల కోల్డ్ స్టోరేజీ చైన్లు ఉన్నాయి. కానీ కోట్లాది మందికి వ్యాక్సినేషన్ కోసం ఈ కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు సరిపోవు. అందులోనూ మోడెర్నా వ్యాక్సిన్ మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ చేయాలి. మన దేశంలో వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీల సెంటీ గ్రేడ్ వద్ద నిల్వ చేస్తూ ఉంటాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, దేశీయంగా తయారయ్యే భారత్ బయోటెక్ వ్యాక్సిన్లను సాధారణ రిఫ్రిజిరేటర్లలోనూ నిల్వ చేస్తే సరిపోతుంది. అందుకే ప్రభుత్వం ఈ రెండు వ్యాక్సిన్లపైనే దృష్టి సారించింది. టీకా ప్రాధాన్యాలు టీకా అందుబాటులోకి వస్తే తొలుత ఎవరికివ్వాలి అన్న సవాల్ ఎదుర్కోవడం అత్యంత సంక్లిష్టమైనది. ప్రాణాలను పణంగా పెట్టి అహరహం శ్రమిస్తున్న ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి ప్రాధాన్యమని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఆ తర్వాత 50–65 ఏళ్ల మధ్య వయసున్నవారికి, ఆ తర్వాత 50 ఏళ్లలోపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. కానీ వీరి జాబితా తయారు చేయడం శక్తికి మించిన పని. అందుకే ఎవరికి ముందు టీకా ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించడానికి నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అధ్యక్షుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. టీకా ఇవ్వడంలో వివక్ష చూపించారన్న విమర్శలు రాకుండా ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కరోనా వ్యాక్సినేషన్‌కి అవసరమయ్యే ఆర్థిక వనరులు మన ముందున్న అతి పెద్ద సవాల్. కరోనా వ్యాక్సిన్ ఏ సంస్థదైనా నెల రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండు డోసులకి కలిపి భారత్‌లో వెయ్యి రూపాయలుగా ధర నిర్ణయించినట్టుగా ఇప్పటికే ఆక్స్ఫర్డ్ –ఆస్ట్రాజెనెకా టీకాను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరి ప్రభుత్వమే ఈ టీకాలను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందా ? లేదంటే రాయితీపై అందిస్తుందా అన్నది అది పెద్ద ప్రశ్న. టీకాపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయడం ప్రభుత్వానికి శక్తికి మించిన భారమే. అందుకే భారత్‌లో రూ.50 లోపు టీకా ధర నిర్ణయించి, ఒక్క డోసు ఇచ్చేలా వ్యాక్సిన్‌ను రూపొందిస్తే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని ఆరోగ్యరంగ నిపుణుడు గగన్‌దీప్ అభిప్రాయపడుతున్నారు. ఆశలు రేపుతున్న వ్యాక్సిన్లు ఇవే..! ► అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్ 95% సురక్షితంగా పనిచేస్తోంది ► ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ 95% సురక్షితమని తేలింది. దీనికి బ్రిటన్ ప్రభుత్వం ఓకే చెప్పింది. ► యూకేకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వృద్ధుల్లో కూడా బాగా పని చేస్తోంది. ► రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందింది. ► భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ కొవాగ్జిన్ పేరుతో అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ ప్రయోగాల్లో ఉంది ► యూకేకి చెందిన నోవావాక్స్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉంది. వచ్చే ఏడాది మొదట్లోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా కూడా ఈ వ్యాక్సిన్ కోసం నిధులు అందిస్తోంది. ► అమెరికాకు చెందిన ఇనోవియో ఫార్మాస్యూటికల్ వ్యాక్సిన్ కూడా ఆశాజనక ఫలితాలు ఇస్తోంది. అమెరికా రక్షణ శాఖ ఈ వ్యాక్సిన్ కోసం నిధులు సమకూరుస్తోంది. -
రైతులను మోసం చేస్తున్నారు
వారణాసి/న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా వారిని మోసం చేసిన వారే ఇప్పుడు ఈ చరిత్రాత్మక చట్టాలపై దుష్ప్రచారం చేస్తూ మళ్లీ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో వేలాది రైతులు దేశ రాజధానిని దిగ్బంధించిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో సోమవారం జరిగిన ఒక బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ. 2,447 కోట్లతో వారణాసి నుంచి అలహాబాద్ వరకు 73 కి.మీ.ల మేర అభివృద్ధి చేసిన ఆరు మార్గాల రహదారిని మోదీ జాతికి అంకితం చేశారు. వారణాసిలో కాశీ విశ్వేశ్వరుని ప్రార్థనల్లో పాల్గొన్నారు. టెంపుల్ కారిడార్ పనులను సమీక్షించారు. బోట్లో అక్కడి ఘాట్లను సందర్శించారు. సాయంత్రం నదీతీరంలో దీపాలు వెలిగించే ప్రఖ్యాత ‘దేవ్ దీపావళి’ కార్యక్రమాన్ని వీక్షించారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ వ్యవసాయ చట్టాలను గట్టిగా సమర్థ్ధించారు. రైతులు ఇప్పుడు కూడా గతంలోలా వ్యవసాయ మార్కెట్లలో కనీస మద్దతు ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలుందని గుర్తు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులకు మరికొన్ని మార్గాలు లభించాయని వివరించారు. కొత్తగా చట్టాలు వచ్చినప్పుడు అనుమానాలు రావడం సహజమేనని, కానీ ఇప్పుడు తప్పుడు ప్రచారంతో రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ, యూరియాపై ఇన్నాళ్లు రైతులను మోసం చేశారని విపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గతంలో మోసపోయిన చరిత్రను దృష్టిలో పెట్టుకున్న రైతులు.. ఇప్పుడు తమ చట్టాలను కూడా అనుమానిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గంగానదీ తీరంలో జరిగిన దేవ్ దీపావళి ఉత్సవంలో పాల్గొన్న సందర్భంగా ‘ఈ రోజు కాశీకి ప్రత్యేకమైన రోజు’ అని వ్యాఖ్యానించారు. టీకా పురోగతిపై ప్రధాని సమీక్ష కరోనా వైరస్ టీకా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మూడు బృందాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. టీకా సామర్థ్యం సహా అన్ని అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించాలని వారిని కోరారు. టీకా నియంత్రణ విధానాలపై సూచనలివ్వాలని కూడా వారిని కోరారు. పుణెలోని జెనోవా బయోఫార్మాçస్యూటికల్స్, హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఈ లిమిటెడ్, హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్‌కు చెందిన శాస్త్రవేత్తలు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీకా రూపకల్పనలో శాస్త్రవేత్తల కృషిని ప్రధాని ప్రశంసించారు. టీకా ప్రయోగ ఫలితాలు ప్రజలందరికీ ఉపయోగపడేలా టీకా ఉత్పత్తిదారులతో సమన్వయంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా అన్ని సంబంధిత విభాగాలకు ప్రధాని సూచించారు. టీకా ప్రయోగ పురోగతి, టీకా ప్యాకేజ్, రవాణా, నిల్వ, కోల్డ్ స్టోరేజ్‌లు సహా మౌలిక వసతుల ఏర్పాట్లు, మానవ వనరుల అవసరం, వినియోగంపై జాగ్రత్తలు.. తదితర అంశాలపై ప్రధాని మోదీ వారితో చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. వివిధ టీకాల రూపకల్పన వివిధ దశల్లో ఉందని, వాటి ప్రయోగాల పూర్తి సమాచారం, ఫలితాలు వచ్చే సంవత్సరం మొదట్లో వెల్లడయ్యే అవకాశం ఉందని పీఎంఓ పేర్కొంది. అమెరికాలోని హెచ్‌డీటీ బయోటెక్ కార్పొరేషన్‌తో జెనోవా బయోఫార్మాçస్యూటికల్స్, అమెరికాకే చెందిన డైనావాక్స్ టెక్నాలజీస్, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో బయోలాజికల్ ఈ లిమిటెడ్, రష్యాకు చెందిన గామాలెయ ఇన్స్టిట్యూట్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ కరోనా టీకా రూపకల్పన, ఉత్పత్తి అంశాల్లో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2020 మనకు ఆవిష్కరణల సంవత్సరం కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020 సంవత్సరాన్ని మిగతా ప్రపంచం అంతా బాహ్య అంతరాయాల మయంగా భావిస్తోందని, ఇండియాకు మాత్రం అంతర్గత ఆవిష్కరణల సంవత్సరం అని ప్రధాని మోదీ అభివర్ణించారు. మనోరమ ఇయర్‌బుక్–2021లో ‘అత్మనిర్భర్ భారత్–ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’ శీర్షికతో ప్రధాని ప్రత్యేక వ్యాసం రాశారు. కరోనా విపత్కర సమయంలో దేశ ప్రజలంతా ప్రదర్శించిన నిబ్బరం, తెగువ, క్రమశిక్షణ, బాధ్యత, సహనాన్ని చూసి ప్రపంచం ఎంతో అబ్బురపడిందన్నారు. టీకా అభివృద్ధి కోసం భారత్ కంపెనీలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయని ప్రశంసించారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఔషధ కర్మాగారంగా అవతరించిందని పేర్కొన్నారు. 4న అఖిలపక్ష భేటీ దేశంలో కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితి, టీకా పురోగతి.. తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం 4వ తేదీన అఖిలపక్ష భేటీని నిర్వహిస్తోంది. పార్లమెంటు ఉభయసభల్లోని పార్టీల ముఖ్య ప్రతినిధులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఈ భేటీని ఏర్పాటు చేస్తోందని, ఇప్పటికే ఆహ్వానం పంపించిందని వెల్లడించాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన లోక్‌సభ, రాజ్యసభల అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుందని పేర్కొన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్, హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ భేటీలో పాల్గొంటారని తెలిపాయి. -
చర్చలకు రండి; కేంద్ర సర్కారు ఆహ్వానం
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం రాత్రి ప్రకటించారు. రైతు సంఘాలు పోరాటం ఇక్కడితో ఆపాలని, చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి డిసెంబర్ 3న రైతు సంఘాల నాయకులతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగుతుండడం, చలి సైతం తీవ్రమవుతుండడంతో రెండు రోజుల ముందే చర్చలు సాగించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు.. అక్టోబర్ 14, నవంబర్ 13న రైతులతో చర్చించింది. మంగళవారం(డిసెంబర్ 1) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మూడో దఫా చర్చలు జరగనున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతులు, రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. సాగు చట్టాలు కరోనా కంటే ప్రమాదం కరోనా›హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా అన్నదాతలు నిరసన సాగిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. కరోనాతో ముప్పు ఉంటుందన్న విషయం తమకు తెలుసని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాలు కరోనా కంటే మరింత ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ధర్నాలో ఉన్న రైతులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహమ్మారిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఏడుగురు వైద్యులతో కూడిన బృందం నవంబర్ 28 నుంచి 90 మంది రైతులకు పరీక్షలు చేసింది. వీరిలో ఎవరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని డాక్టర్లు చెప్పారు. షరతులు పెడితే.. ఢిల్లీని ముట్టడిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: చర్చల విషయం లో కేంద్రం ఎలాంటి షరతులు విధించరాదని రైతులు పేర్కొన్నారు. అవసరమైతే ఢిల్లీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. చలిని సైతం లెక్కచేయకుండా సింఘు, టిక్రీ రహదారులపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతుల ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. యూనియన్ల మద్దతు.. నిరసన తెలుపుతున్న రైతులకు అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్లు (సీఐటీయూ) సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్, అధ్యక్షురాలు కె.హేమలత, సీఐటీయూ కార్యదర్శి కరుమలియన్లు మద్దతు తెలిపారు. రైతుల పోరాటాన్ని దేశవ్యాప్తంగా తీవ్రతరం చేయాలని ఏఐఏడబ్ల్యూయూ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణ కార్యాచరణ ప్రకటించింది. -
వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కొన్ని కంపెనీల క్లినికల్ ట్రయల్స్ ముగింపు దశకు చేరాయి. తమ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఫైజర్, మోడెర్నా వంటి దిగ్గజ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. వ్యాక్సిన్ రాగానే ఉపయో గించాలంటే ప్రభుత్వం అత్యవసర అనుమతి (ఎమర్జెన్సీ ఆథరైజేషన్) ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లకు ఇలాంటి అనుమతి ఇవ్వడానికి అందుబాటులో ఉన్న విధానాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ (వీటీఎఫ్) ఈ పనిలో నిమగ్నమై ఉంది. మోడెర్నా టీకా డోసు ధర ఎంతంటే.. ఫ్రాంక్ఫర్ట్: కరోనా టీకా అభివృద్ధిలో అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ముందంజలో ఉంది. త్వరలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని నమ్మకంగా చెబుతోంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టెఫానీ బాన్సెల్ మాట్లాడుతూ తమ వ్యాక్సిన్‌కుగాను ప్రభుత్వాల నుంచి ఒక్కో డోసుకు 25 డాలర్ల నుంచి 37 డాలర్లు(రూ.1,854–రూ.2,744) తీసుకుంటామని చెప్పారు. ఆర్డర్ చేసిన డోసులను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంద న్నారు. ఫ్లూ వ్యాక్సిన్ డోసు 10 డాలర్ల నుంచి 50 డాలర్ల దాకా పలుకుతోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారులు ఇప్పటికే మోడెర్నా సంస్థతో చర్చలు జరిపారు. వ్యాక్సిన్ డోసు 25 డాలర్ల లోపు ధరకే తమకు సరఫరా చేయాలని కోరారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. -
‘తయారీ’ బూస్ట్ 2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: తయారీ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మరో పథకానికి తెరతీసింది. దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్ వంటి మరో 10 కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేయనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ స్కీమ్ అమలుకు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో మొత్తం రూ. 2 లక్షల కోట్ల మేర రాయితీలు ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలకు లభించనున్నాయి. కాగా, సామాజిక మౌలికసదుపాయాల కల్పన రంగాలకు కూడా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) స్కీమ్‌ను విస్తరించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ప్రస్తుతం ఆర్థిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ స్కీమ్ అమలవుతోంది. దేశీ తయారీకి దన్ను... ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పుంజుకునేలా చేయడం, అలాగే దిగుమతులను తగ్గించి తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా దేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ తోడ్పాటును అందించనుంది. ఈ కొత్త పథకం కింద రూ.1,45,980 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. కాగా, ఇప్పటికే రూ.51,311 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపిందని అధికారిక ప్రకటన వెల్లడించింది. ‘భారతీయ తయారీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మరింత పోటీపడేలా చేయడమే లక్ష్యంగా ఈ ఐదేళ్ల పీఎల్ఐ స్కీమ్‌ను రూపొందించాం. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఈ స్కీమ్‌ను అమలు చేస్తాయి. విడివిడిగా ఆయా రంగాలకు సంబంధించిన తుది ప్రతిపాదనలను వ్యయ ఆర్థిక కమిటీ (ఈఎఫ్‌సీ) మదింపు చేసిన తర్వాత, కేబినెట్ ఆమోదిస్తుంది. షిప్పింగ్ శాఖ పేరు మార్పు... కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ ప్రతిపాదనను ప్రధాన మంత్రి మోదీ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ దిశగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘స్వావలంబన భారత్’ సాకారం: నిర్మలా సీతారామన్ పీఎల్ఐ స్కీమ్‌కు ఆమోదం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, తయారీ రంగానికి ఇది అద్భుతమైన ప్రోత్సాహకాలను అందిస్తుందని చెప్పారు. తద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వావలంబన భారత్) లక్ష్యం సాకారం దిశగా దేశాన్ని నడిపించడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ‘రెండు స్కీమ్‌లకు సంబంధించి కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఇది కచ్చితంగా సరైన దన్నును అందిస్తుంది. ఎందుకంటే మేము స్వావలంబన కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్‌ను భాగంగా చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి’ అని సీతారామన్ వివరించారు. దీనిద్వారా ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ప్రపంచ సరఫరా వ్యవస్థకు భారత్‌ను అనుసంధానం చేస్తుందని చెప్పారు. భారత్‌ను ప్రపంచ తయారీ గమ్యస్థానంగా మార్చేందుకు ఈ ప్రోత్సాహకాలు తోడ్పడతాయని పేర్కొన్నారు. సమయానుకూల నిర్ణయం: కార్పొరేట్ ఇండియా పీఎల్ఐ స్కీమ్‌ను మరో 10 కీలక రంగాలకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల భారత పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు ప్రశంసలు కురిపింటటచారు. ఎవరేమన్నారంటే... కొత్త పీఎల్ఐ పాలసీ సమయానుకూలమైనది అలాగే తయారీ రంగంలో సమూల మార్పులను తీసుకొస్తుంది. తద్వారా ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా భారత్ ఎదిగేందుకు దోహదం చేస్తుంది. – ఉదయ్ కోటక్, సీఐఐ ప్రెసిడెంట్ తయారీ రంగంలో భారత్ స్వావలంబన సాధించేందుకు ఉద్దేశించిన ఈ ఫ్లాగ్షిప్ పథకానికి సుమారు రూ.2 లక్షల కోట్లను వెచ్చించనున్నారు. ఆర్థిక కార్యకలాపాలపై ఇది భారీ ప్రభావాన్నే చూపుతుంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, తదితర విభిన్న రంగాల వ్యాప్తంగా గణనీయంగా ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ పీఎల్ఐ స్కీమ్ పరిధిలోకి మరిన్ని రంగాలను తీసుకురావడం వల్ల తయారీ రంగానికి భారీ బూస్ట్ లభించనుంది. ఈ చర్యలు వ్యూహాత్మకం అలాగే సాంకేతికతతో ముడిపడినవి, దీనివల్ల దేశంలో ఉద్యోగాల కల్పన కూడా జోరందుకుంటుంది. దేశీ మార్కెట్ కోణంలోనే కాకుండా ఆయా రంగాలకు చెందిన ఉత్పత్తులకు భారత్‌ను ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు భారీ అవకాశాన్ని భారత ఆర్థిక వ్యవస్థ అందిస్తుంది. – సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ -
ఓటీటీలపై నిఘా
సాక్షి, న్యూఢిల్లీ: ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తదితర ఓటీటీ వేదికలను, ఇతర డిజిటల్ న్యూస్ వెబ్సైట్లు, కరెంట్ అఫైర్స్ కంటెంట్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ కంటెంట్‌పై ప్రస్తుతం దేశంలో ఎలాంటి నిఘా లేదు. నియంత్రణకు విధానాలు, నిబంధనలు లేవు. నెట్లో ప్రసారమయ్యే అశ్లీల, అనుచిత అంశాలపై కన్నేసి ఉంచేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చట్టం గానీ, స్వతంత్ర సంస్థ గానీ లేవు. అందుకే కేంద్ర సర్కారు ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టే అధికారాన్ని సమాచార, ప్రసార శాఖకు కట్టబెట్టింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి కోవింద్ సంతకం చేశారు. కోర్టు వివరణ కోరిన నెల రోజుల్లోపే... ఓటీటీలపై నిఘా కోసం కేంద్ర ప్రభుత్వం ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్–1961’లో సవరణలు చేసింది. దీన్ని ఇకపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) 357వ అమెండ్మెంట్ రూల్స్–2020గా వ్యవహరిస్తారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. అశ్లీలంపై చర్యలు తీసుకొనే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 క్లాజ్(3) ప్రకారం కేంద్రానికి సంక్రమించింది. ఆన్లైన్ వేదికలపై లభ్యమయ్యే న్యూస్, ఆడియో, విజువల్ కంటెంట్, సినిమాలకు సంబంధించిన నియంత్రణ విధానాలను రూపొందించే అధికారం సమాచార, ప్రసార శాఖకు దక్కింది. ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలపై నియంత్రణ కోసం ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు శశాంక్ శంకర్ జా, అపూర్వ అర్హతియా ఇటీవలే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం వివరణ కోరిన నెల రోజుల్లోనే కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. -
డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్‌ని నిషేధించాలి
న్యూఢిల్లీ: మనుషులపై రసాయనాలు చల్లే డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్‌ని నిషేధిస్తూ ఒక నెల రోజుల్లోగా ఆదేశాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనుషులు కృత్రిమ అతినీలలోహిత కిరణాలకు గురికాకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్–2005 లాంటి చట్టాల ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలంది. మనుషులను అతి నీలలోహిత కిరణాలకు గురిచేయడం, డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్‌ని వాడటం లాంటి చర్యలను నిషేధించాలని కోరుతూ గుర్ సిమ్రాన్ నరూలా దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు విచారించింది. ఇప్పటికే మనుషులపై క్రిమిసంహారాలను చల్లరాదని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మార్గదర్శకాలను విడుదల చేసినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నెలరోజుల్లోగా ఈ ప్రక్రియని ముగించాలని కేంద్రానికి కోర్టు సూచించింది. ‘నాలుగ్గోడల మధ్య అలా దూషిస్తే నేరం కాదు’ న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన ఒక వ్యక్తిని దూషించడానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంట్లోని నాలుగు గోడల మధ్య, ఎలాంటి సాక్షులు లేకుండా కులం పేరుతో దూషించడం నేరం కిందకు రాదని పేర్కొంది. బాధితుడు/ బాధితురాలు షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వ్యక్తి అయినప్పుడే.. కులం పేరుతో జరిగే అన్ని రకాలైన అవమానాలు, దూషణలను ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరాలుగా భావిస్తామని తెలిపింది. సమాజంలోని అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిని ఎవరైనా బహిరంగంగా అగౌరవపరచడం, అవమానించడం, వేధించడం వంటివి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరంగా చూడాలని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం తెలిపింది. ఉత్తరాఖండ్‌కు చెందిన హితేశ్ వర్మ తన ఇంట్లోకి వచ్చి కులం పేరుతో దూషించాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ రాష్ట్ర హైకోర్టు అతడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ధర్మాసనం పైవ్యాఖ్యలు చేస్తూ..ఆ కేసును కొట్టేసింది. -
జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జౌళి పరిశ్రమకు ఊతమిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆహార ధాన్యాలను తప్పనిసరిగా జనపనార బస్తాల్లోనే నిల్వ చేయాలనే నిబంధనను పొడగించే ప్రతిపాదనకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘100 శాతం ఆహార ధాన్యాలను, 20% పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిలువ చేసే నిబంధనను పొడగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది’ అని ఆ భేటీ అనంతరం ఒక అధికారిక ప్రకటన వెలువడింది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. రూ. 7500 కోట్ల విలువైన జౌళి సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. జౌళి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ‘జ్యూట్ ఐకేర్’ ద్వారా రైతులకు ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలనే భారత జౌళి కార్పొరేషన్ 10 వేల క్వింటాళ్లæ విత్తనాల పంపిణీ కోసం నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డ్యామ్‌ల నిర్వహణకు ఆమోదం రానున్న పదేళ్లలో 19 రాష్ట్రాల్లోని 736 ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా రూ. 10,211 కోట్లతో ఈ కార్యక్రమ రెండో, మూడో దశ పనులు పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరో సంస్థ 80% నిధులు సమకూర్చాయని వెల్లడించారు. ఈ పథకం తొలి దశ 2020లో ముగిసిందని పేర్కొన్నారు. తొలి దశలో ఏడు రాష్ట్రాల్లోని 223 ఆనకట్టల నిర్వహణ చేపట్టామన్నారు. -
ఫిబ్రవరికల్లా కరోనా కట్టడి..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తెలిపింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనాని కట్టడి చేయవచ్చునని అంచనా వేసింది. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రం, ఐఐటీ ఐసీఎంఆర్‌కు చెందిన 10 మంది సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి నేతృత్వం వహించిన హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ దేశంలో కరోనా పరిస్థితికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. మార్చిలో లాక్డౌన్ విధించకపోయి ఉంటే కరోనా భారత్‌పై అత్యంత తీవ్ర ప్రభావం చూపించి ఉండేదని జూన్ నాటికే కోటి 40 లక్షల మందికి కరోనా సోకి ఉండేదని, 26 లక్షల మంది వరకు మృత్యువాత పడి ఉండేవారని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సరైన సమయంలో లాక్డౌన్ విధించి కరోనాని ఎదుర్కొనేలా ప్రజల్ని సమాయత్తం చేయడంతో పాటు, ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేశామని పేర్కొంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటివి కొనసాగిస్తూ, పండుగ సీజన్లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తే వచ్చే ఏడాదికల్లా కరోనాని నియంత్రించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సామూహిక వ్యాప్తి: హర్షవర్ధన్ దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా సామూహిక వ్యాప్తి జరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అంగీకరించారు. అయితే దేశవ్యాప్తంగా ఆ పరిస్థితి లేదని ఆయన సండే సంవాద్ కార్యక్రమంలో చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తీవ్రతరంగా ఉందన్నారు. ఓనం ఉత్సవాల సమయంలో కేరళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా నిబంధనల్ని గాలికి వదిలేసినందుకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు. కేరళ నుంచి నేర్చుకున్న పాఠాలతో దసరా, దీపావళి సీజన్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చలికాలంలో సెకండ్ వేవ్ ? దేశంలో వచ్చే శీతాకాలంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాల్ని కొట్టి పారేయలేమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే నిపుణుల కమిటీ సమన్వయ కర్త కూడా అయిన పాల్ దేశంలో మూడు వారాలుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్థిరంగా ఉందని చెప్పారు. అయితే కేరళ, కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌తో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. చలికాలంలో యూరప్‌లో కరోనా మళ్లీ విజృంభించి నట్టుగానే భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశాలున్నాయన్న పాల్ కరోనాపై ఇంకా మనం పాఠాలు నేర్చుకునే దశలోనే ఉన్నామని చెప్పారు. శీతాకాలంలో వాయు కాలుష్యం పెరిగిపోవడం వల్ల కూడా కరోనా ఉధృతరూపం దాలుస్తుందన్న ఆయన వచ్చే పండగ సీజన్లో కరోనా విసిరే సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ వైరస్ విజృంభిస్తుందని పాల్ హెచ్చరించారు. పత్రికల ద్వారా సోకదు వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశాల్లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ దశలో ఉన్న ప్రాంతాల్లో కూడా వార్తా పత్రికలు చదవడం అత్యంత సురక్షితమని ఆయన చెప్పారు. పత్రికల ద్వారా వైరస్ సోకుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని పునరుద్ఘాటిం చారు. రోజూ ఉదయం తాను పత్రికలు చదువుతూ టీ ఎంజాయ్ చేస్తానన్నారు. -
బాలీవుడ్ తరలింపు అంత ఈజీ కాదు
ముంబై: ముంబై నుంచి బాలీవుడ్‌ని తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శివసేన ఆరోపించింది. అయితే అదంత సులభంగా జరిగే పనికాదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. ప్రతిపాదిత ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్(ఐఎఫ్ఎస్సీ)ని తరలిస్తే చూస్తూ ఊరుకోమంటూ మహారాష్ట్ర సీఎం ఠాక్రే హెచ్చరించిన రెండు రోజులకే సామ్నాలో బీజేపీపై శివసేన నిప్పులు చెరిగింది. ‘బాలీవుడ్‌ని నైతికంగా కేంద్రం దెబ్బ తీస్తోంది. అలా చేసి మహారాష్ట్ర గుర్తింపుని దెబ్బకొట్టాలన్నది కేంద్రం ఆలోచన. ముంబై నుంచి ఐఎఫ్ఎస్సీని తరలించడం ఈజీగా జరగదు. ముంబై దేశ ఆర్థిక రాజధాని మాత్రమే కాదు. వినోదానికీ రాజధాని. ముఖ్యమంత్రి ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడారు’ అని సామ్నా సంపాదకీయం పేర్కొంది. -
రాష్ట్రాలకు రూ.1.1 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద రాష్ట్రాలకు ఆదాయలోటును పూడ్చేందుకు కేంద్రమే రుణ సమీకరణ చేసేందుకు ముందుకు వచ్చింది. జీఎస్టీ వసూళ్లలో లోటు కారణంగా.. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం పరిహారాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే, ఈ మొత్తాన్ని మార్కెట్ నుంచి రుణాల రూపంలో రాష్ట్రాలే తీసుకోవాలని కేంద్రం కోరగా.. కేంద్రం తన పద్దుల కిందే తీసుకుని తమకు నిధులు సమకూర్చాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. అయితే, రాష్ట్రాల తరఫున రుణ సమీకరణకు కేంద్రం నిర్ణయించింది. రూ.1.1 లక్షల కోట్లను రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వం రుణం కింద సమీకరించి వాటికి సర్దుబాటు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో జీఎస్టీ వసూళ్లు ఆశించిన మేర లేవన్న విషయం తెలిసిందే. కరోనా ముందు నుంచే దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం కూడా వసూళ్లపై ప్రభావం చూపించింది. దీంతో రాష్ట్రాల బడ్జెట్లపై ప్రభావం పడింది. జీఎస్టీ ముందు అయితే లోటును భర్తీ చేసుకునేందుకు వ్యాట్, స్థానిక పన్నులను రాష్ట్రాలు అస్త్రాలుగా వినియోగించుకునేవి. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు చాలా పరిమితం. ‘‘లోటును భర్తీ చేసుకునేందుకు రాష్ట్రాల బడ్జెట్ పరిమితులకు అదనంగా రూ.1.1 లక్షల కోట్ల మేర రుణ సమీకరణకు ప్రత్యేక విండోను ఆఫర్ చేశాము. అంచనా లోటు రూ.1.1 లక్షల కోట్లను అన్ని రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వమే రుణాలుగా.. పలు విడతల్లో తీసుకుంటుంది. జీఎస్టీ పరిహారం కింద ఆయా రుణాలను రాష్ట్రాలకు బదిలీ చేస్తాము’’ అని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. అయితే, ఈ రుణాలకు వడ్డీ, అసలు చెల్లింపులు ఎవరు చేస్తారన్న విషయాన్ని ఇందులో ప్రస్తావించలేదు. రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడం వల్ల ఒకటే వడ్డీ రేటుకు వీలు పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ప్రత్యేక విండో కింద రుణ సమీకరణ ద్రవ్యలోటుపై ఏ మాత్రం ప్రభావం చూపించదని స్పష్టం చేసింది. -
కేంద్ర ఉద్యోగులకు బొనాంజా
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండుగల సమయంలో వినిమయ డిమాండ్‌ను పెంచి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 10 వేల వేతన అడ్వాన్స్‌ను, ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లను అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంగా అందించేందుకు రూ. 12 వేల కోట్లను కేటాయించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. ఆర్థిక మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) స్థానంలో ఈ సంవత్సరం క్యాష్ ఓచర్లను ఇస్తారు. జీఎస్టీ రిజిస్టర్డ్ అమ్మకందారు వద్ద, డిజిటల్ మోడ్‌లో, 12% లేదా అంతకుమించి జీఎస్టీ ఉన్న వస్తువులను కొనేందుకే వాటిని వినియోగించాలి. ఆహార ఉత్పత్తుల కొనుగోలుకు ఆ ఓచర్లను వినియోగించడం కుదరదు. 2021 మార్చి 31లోగా వాడేయాలి. ఎల్టీసీ ద్వారా పొందే విమాన/రైలు చార్జీ కన్నా 3 రెట్లు ఎక్కువ విలువైన వస్తువులు/ సేవలను కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు తమ ఉద్యోగులకు ఎల్టీసీల స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వనున్నాయి. శాలరీ అడ్వాన్స్, ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లతో మార్కెట్లో రూ. 28 వేల కోట్ల విలువైన డిమాండ్ ఉంటుందని నిర్మల వెల్లడించారు. ఎల్టీసీ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ సంస్థలకు కూడా, షరతులకు లోబడి, సంబంధిత మొత్తంపై పన్ను రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. రూ. 10 వేల శాలరీ అడ్వాన్స్‌ను 2021మార్చి 31లోగా ఉద్యోగులు ప్రీలోడెడ్ రూపే కార్డుల రూపంలో తీసుకోవాలి. వడ్డీ లేని ఆ రుణాన్ని గరిష్టంగా 10 వాయిదాల్లో చెల్లించాలి. సొంత ఊరికి లేదా దేశంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు పలు షరతులతో ఉద్యోగులకు ఎల్టీసీ లభిస్తుంది. అయితే, కరోనా కారణంగా ప్రయాణాలు సాధ్యం కాని పరిస్థితులు నెలకొనడంతో ఆ స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ఎల్టీసీ క్యాష్ ఓచర్లు, శాలరీ అడ్వాన్స్ సహా మొత్తంగా రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఎల్టీసీ, శా లరీ అడ్వాన్స్ కోసం రూ. 11,575 కోట్లు, రా ష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణంగా రూ. 12 వేల కోట్లు ఉన్నాయన్నారు. అదనంగా రూ. 2500 కోట్లను కేంద్రం రోడ్లు, డిఫెన్స్, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయనుందని తెలిపారు. రాష్ట్రాలకు ప్రకటించిన రూ. 12 వేల కోట్ల రుణంలో రూ. 1,600 కోట్లు ఈశాన్య రాష్ట్రాలకు, రూ. 900 కోట్లు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు, రూ. 7,500 కోట్లు ఇతర రా ష్ట్రాలకు కేటాయించామన్నారు. ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కోవిడ్‌పై పోరుకు ప్రజాచైతన్య కార్యక్రమం
న్యూఢిల్లీ: కోవిడ్‌పై పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో అవగాహనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కరోనాను ఓడించడానికి ప్రజలందరూ మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ, మంత్రులు కోరారు. రానున్న పండుగల సీజన్, శీతాకాలం, అన్ని ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనాందోళన్ పేరుతో ఈ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాగ్రత్తలు పాటించకపోతే కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మొత్తం ప్రజలే కేంద్రంగా నడుస్తుందని మోదీ అన్నారు. దేశ ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చినప్పుడే కోవిడ్ లాంటి మహమ్మారిపై పోరాడగలుగుతామని హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ‘యునైట్ 2 ఫైట్ కరోనా’హ్యష్‌టాగ్‌తో ఈ వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి మన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని మోదీ అన్నారు. -
కామత్ కమిటీ ఏం సూచించింది..?
న్యూఢిల్లీ: రుణాల పునర్నిర్మాణానికి సంబంధించి కేవీ కామత్ కమిటీ సిఫారసులను తమ ముందు రికార్డుల రూపంలో ఉంచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా రుణాల మారటోరియం విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు, ఉత్తర్వులను కూడా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ వరకు రుణ చెల్లింపులపై విరామానికి (మారటోరియం) ఆర్బీఐ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇలా ఈఎంఐలు చెల్లించని కాలానికి వడ్డీతోపాటు.. వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం సోమవారం కూడా ఈ కేసులో తన విచారణను వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కొనసాగించింది. వ్యక్తిగత రుణ గ్రహీతలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.2 కోట్ల వరకు రుణాలకు గాను వడ్డీపై వడ్డీ భారం వేయకుండా.. ఆ భారాన్ని తాము భరిస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ అఫిడవిట్ సమర్పించింది. కేంద్రం, ఆర్బీఐ ఈ విషయమై ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల వివరాలను తమ ముందుంచాలంటూ సెప్టెంబర్ 10నాటి తమ ఆదేశాలను ధర్మాసనం గుర్తు చేస్తూ.. కేంద్రం స్పందనలో అవి లేవంటూ వారం రోజుల్లో ఆ వివరాలను తమ ముందు ఉంచాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదన కింద రియల్టీ రంగానికి ఎటువంటి ఉపశమనం లభించదంటూ ఆ రంగం తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం కోర్టుకు తెలియజేశారు. దీంతో రియల్ ఎస్టేట్, విద్యుదుత్పత్తి తదితర రంగాల అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. మరిన్ని వివరాల దాఖలు కు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది వి.గిరి కోర్టును కోరారు. కేంద్రం స్పందనపై పూర్తి స్థాయి అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని మరో న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. సమతూకం అవసరం.. బ్యాంకులు, రుణ గ్రహీతల అవసరాల మధ్య సమతూకం అవసరమని, ఈ విషయంలో అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేస్తూ.. విచారణను ఈ నెల 13కు సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. కేంద్రం నిర్ణయంపై స్పందన తెలియజేయవచ్చంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) సహా భాగస్వామ్య పక్షాలన్నింటికీ సూచించింది. ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసిన 24 గంటల్లోగా బ్యాంకులు ప్రణాళికను అమలు చేయగలని ఐబీఏ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే తెలియజేశారు. కొన్ని రంగాలకు కేంద్రం తాజా ప్రతిపాదనలో చోటు లేకపోవడాన్ని.. మొత్తం పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన మీదట తీసుకున్న నిర్ణయంగా సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా పేర్కొన్నారు. ఆగస్ట్‌తో మారటోరియం గడువు తీరిపోవడంతో.. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. 26 రంగాలకు రుణ పునర్నిర్మాణ అవకాశం కల్పించాలంటూ కామత్ కమిటీ సూచించడం గమనార్హం. -
సంస్కరణలతో దీర్ఘకాలంలో స్థిరవృద్ధి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల బలోపేతానికి సాయపడతాయని.. తద్వారా దీర్ఘకాలంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ‘‘విధానపరమైన వాతావరణానికితోడు భాగస్వాములు అందరూ కలసి తీసుకున్న చర్యలు.. అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన నెలవారీ ఆర్థిక నివేదిక తెలియజేసింది. కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉండడం అన్నది స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి వృద్ధి రేటుకు ప్రతికూలంగా మారుతుందని.. అయితే ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు దీన్ని అధిగమించేలా చేస్తాయంటూ వివరించింది. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 30 మధ్య దేశంలో కరోనా కేసులు గరిష్టాలకు చేరినట్టు తెలుస్తోందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో తాజాగా చేపట్టిన సంస్కరణలు ఎప్పుడో సాకారం కావాల్సినవిగా అభిప్రాయపడింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, ఆర్థిక వ్యవస్థను క్రమంగా తెరవడం అన్నవి దేశ ఆర్థిక రికవరీకి తోడ్పడ్డాయంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన నివేదికలో పేర్కొంది. -
కొలువు పోయిందా... సగం జీతం తీసుకో!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 ప్రభావంతో ఉద్యోగం కోల్పోయారా..? ఇలాంటి వారికి కొత్తగా మరో ఉద్యోగం దొరికేవరకు తాత్కా లిక ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ఏబీవీకేవై) పథకం కింద 3 నెలల పాటు సగం జీతం ఇచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ఈ పథకం కనీసం రెండేళ్ల సీనియర్ ఈఎస్ఐ చందాదారులైన వారికి మాత్రమే వర్తిస్తుంది. కోవిడ్–19 వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 24 నుంచి లాక్డౌన్ విధించింది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ లాక్డౌన్... ఆ తర్వాత దశలవారీగా అన్‌లాక్ నిబంధనలతో పలు వ్యాపారాలు మూతపడ్డాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీలు ఏకంగా 50శాతం ఉద్యోగాలను కోతపెట్టాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా పలువురు నిరుద్యోగులుగా మారారు. వారికి కుటుంబపోషణ భారమైంది. ఈ పరిస్థితిని సమీక్షించిన కేంద్ర కార్మిక శాఖ ఇలాంటి వారికి నిరుద్యోగ పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. నెల తర్వాత దరఖాస్తు... ఏదేని కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కోవిడ్–19 కారణంగా జాబ్ కోల్పోతే నెలరోజుల తర్వాత ఈ పథకానికి అర్హత సాధిస్తాడు. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా, ఈఎస్ఐసీ వివరాలతో ఆన్లైన్లో ఈఎస్ఐసీ పోర్టల్‌లో దర ఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మాన్యువల్ పద్ధతిలో ఈఎస్ఐసీ కార్యాలయంలో కూడా ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులో యాజమాన్యం నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. దరఖాస్తు పరిశీలించిన అనంతరం లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో ఈ నగదును జమ చేస్తారు. నిర్దేశించిన గరిష్ట గడువులోగా ఉద్యోగం వెతుక్కునేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర కార్మిక శాఖ చెబుతోంది. సాయంగా సగం జీతం... ఏబీవీకేవై పథక కింద లబ్ధిదారులకు నెలలో సగం జీతాన్ని సాయంగా ఇస్తారు. ఈ పథ కం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి వరుసగా రెండేళ్ల పాటు ఈఎస్ఐ చందా చెల్లిస్తూ ఉం డాలి. ఆ వ్యక్తి రెండేళ్ల వేతనాన్ని రోజువారీ వేతన రూపంలో లెక్కించిన తర్వాత... నెల లో పదిహేను రోజుల భత్యాన్ని లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈఎస్ఐసీ నిబంధనల్లో ఈ వెసులుబాటు ఒక ఉద్యోగి తన జీవిత కాలంలో ఒకేసారి వినియోగించుకునే వీలుంది. సగం జీతం ఇచ్చే నిబంధన ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో వచ్చిన దరఖాస్తులకు మా త్రమే వర్తిస్తుందని కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చే దర ఖాస్తులకు 25 శాతం వేతనాన్ని ఇస్తారు. -
ఎందుకు.. ఏమిటి.. ఎలా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు టీఎంసీలకు అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం చేపడుతున్న పనులపై కేంద్రం లేఖాస్త్రం సంధించింది. ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించి ఒక్కో అంశాన్ని ఆరా తీస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్, పర్యావరణ అనుమతులు, వ్యయా లపై వరుసగా లేఖలు సంధిస్తున్న కేంద్రం, రెండ్రోజుల కిందట ఆయకట్టు వివరాలు కోరగా, తాజాగా గురువారం అదనపు టీఎంసీ పనులను గత పనులకు భిన్నంగా చేపట్టడంపై వివరణ కోరుతూ లేఖ రాసింది. ఒక్కొక్కటిగా వివరాల సేకరణ... కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొండపోచమ్మసాగర్ వరకు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు పూర్తవగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్, గంధమల్ల, బస్వాపూర్, వాటి కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉంది. రెండు టీఎంసీల తరలింపు పనులకు కేంద్రం రూ.80,190 కోట్లకు అనుమతులు ఇవ్వగా, ఇందులో ఇప్పటికే రూ.55 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ పనులు కొనసాగుతుండగానే, కృష్ణా బేసిన్లో నీరందని ప్రాంతాలకు సైతం కాళేశ్వరం ద్వారానే గోదావరి జలాలు అందించేలా అదనపు టీఎంసీ పనులు చేపడుతోంది. ఈ పనులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు సైతం దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. డీపీఆర్‌లపై బోర్డు, కేంద్రం రాసినా స్పందన లేకపోవడంతో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేరుగా లేఖలు రాశారు. ఇందులో రెండు టీఎంసీల నీటిని తరలింపునకే కేంద్రం అనుమతి ఇచ్చిందని, అదనపు టీఎంసీ పనులకు అనుమతి లేదన్న అంశాన్ని లేవనెత్తారు. దీనికి కొత్తగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అనంతరం పర్యావరణ అనుమతులపై కేంద్ర జలశక్తి శాఖ మరో లేఖ రాయగా, అనంతరం ప్రాజెక్టుకు తొలుత నిర్ధారించిన అంచనా వ్యయం, సవరించిన అంచనా వ్యయాలు, ఇప్పటివరకు చేసిన ఖర్చుల వివరాలను సమర్పించాలని కోరింది. ఈ లేఖ రాసిన వారం రోజుల వ్యవధిలో మూడు రోజుల కిందటే తాము 98 రోజులపాటు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 195 టీఎంసీల ఎత్తిపోతలకు అనుమతిచ్చామని, దీనికి అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రతిపాదన చేశారో, లేదో తెలపాలని కోరుతూ లేఖ రాసింది. అదనపు టీఎంసీతో అదనంగా సాగులోకి వచ్చే ఆయకట్టు లేక స్థిరీకరణ ఆయకట్టు, జిల్లాల వారీగా ఆ ఆయకట్టు వివరాలు చెప్పాలని ఆదేశించింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, వరద కాల్వ, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కోరింది. ఇది రాసిన రెండ్రోజులకే గురువారం మరో లేఖ రాసింది. ఇప్పటికే చేపట్టిన రెండు టీఎంసీల నీటి తరలింపునకు గ్రావిటీ కెనాల్, టన్నెళ్ల వ్యవస్థల ద్వారా నీటి తరలింపు చేపట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం అదనంగా టీఎంసీ నీటిని తీసుకునేందుకు చేపట్టిన పనులను మాత్రం పాత విధానంలో కాదని, పైప్‌లైన్ ద్వారా ప్రెషర్‌మెయిన్ వ్యవస్థ ఏర్పాటు చేసి తరలించడానికి కారణాలు ఏంటని ప్రశ్నించింది. ప్రెషర్ మెయిన్ వ్యవస్థను ఎంచుకునేందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర వరుస లేఖల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్ని వివరాలను సేకరించి పెట్టుకుంటోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేక జాతీయ సత్వర సాగునీటి ప్రాయోజిక కార్యక్రమం (ఏఐబీపీ)లో చేర్చి ఆర్థికసాయం చేయాలని పదేపదే కోరుతున్నా స్పందించని కేంద్రం, అదనపు టీఎంసీ పనుల వివరాలపై లేఖలు రాయడం మాత్రం విస్మయానికి గురి చేస్తోందని జల వనరుల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు చట్టబద్ధంగా రావాల్సిన జీఎస్టీ పరిహారం నిధులను పూర్తిగా చెల్లించడం మినహా కేంద్రానికి మరోమార్గం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్రం అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు సమాఖ్య స్ఫూర్తితో విరివిగా నిధులిచ్చి ఆదుకోవాల్సిన కేంద్రం చేతులెత్తేయడం సరికాదని అన్నారు. కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే పార్లమెంటులో నిలదీస్తామని స్పష్టంచేశారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. సోమవారం జరిగిన బీజేపీయేతర రాష్ట్రాల మంత్రుల సమావేశంలో ఎంసీఆర్హెచ్ఆర్డీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి బెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... నైతికంగా పరిహారం చెల్లించాల్సిందే... ‘జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా(ఏజీఐ)ను కూడా సంప్రదించింది. పరిహారం రాష్ట్రాలకివ్వాల్సి ఉంటుందని ఏజీ చెప్పారు. చెల్లింపు ఎలా అనే విషయంలో భిన్నాభిప్రాయాలుండొచ్చు కానీ, ఇవ్వాల్సిందే. పరిహారాన్ని కోవిడ్, జీఎస్టీ నష్టంగా విడగొట్టాలని ఏజీ చెప్పలేదు. న్యాయపరంగా, నైతికంగా.. ఎలా చూసినా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రాష్ట్రాలకు పరిహారం చెల్లించాల్సిందే. కేంద్రానికి ఇంకో అవకాశం లేదు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మూడేళ్లలో సెస్ డబ్బులు మిగిలినప్పుడు తీసుకున్నారు. ఐజీఎస్టీని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేసుకున్నారు. అంటే.. మిగిలినప్పుడు కేంద్రం తీసుకుంటుంది, తగిలితే రాష్ట్రాలు అప్పు తెచ్చుకోవాలా? ఇదెక్కడి నీతి? పరిహారం కింద రూ.3 లక్షల కోట్లు ఇవ్వబోమని, రూ.1.65 లక్షల కోట్లు మాత్రమే ఇస్తామంటూ కేంద్రం రూ.1.35 లక్షల కోట్ల పరిహారం తగ్గించే ఆలోచన చేస్తోంది. దీన్ని తెలంగాణ అంగీకరించదు’ జీఎస్టీలో చేరకుంటే 25 వేల కోట్లు వచ్చేవి ‘కోవిడ్ వల్ల కేంద్రమే కాదు, రాష్ట్రాలూ నష్టపోయాయి. గత 4 నెలల్లో తెలంగాణ 34% ఆదాయం కోల్పోయింది. రూ.8 వేల కోట్లు తగ్గాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రాలకు నిధులిచ్చి ఆదుకోవాలి. కానీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన సెస్సును ఎగ్గొట్టాలని చూస్తోంది. జీఎస్టీలో చేరేటప్పుడే తెలంగాణ వెనకా ముందూ ఆలోచించింది. మనం జీఎస్టీలో చేరకుండా ఉంటే అదనంగా రూ.25 వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. కానీ, దేశ విస్తృత ప్రయోజనాలు, పన్నుల సరళీకరణ, పెట్టుబడుల ఆకర్షణ లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని చేరాం. గత మూడేళ్లలో జీఎస్టీ సెస్ కింద రూ.18,032 కోట్లు కేంద్రానికి చెల్లించాం. కానీ, రాష్ట్రం తిరిగి పొందింది రూ.3,200 కోట్లే. యూపీఏ ప్రభుత్వం చేసిన విధంగానే నష్టం చేయొద్దని జీఎస్టీ ప్రాథమిక చర్చల్లోనే కేంద్రానికి చెప్పాం. పార్లమెంటులో చట్టం చేస్తున్నందున నమ్మాలని కేంద్రం చెప్పింది. కానీ, అదే చట్టాన్ని కేంద్రం ఇప్పుడు ఉల్లంఘిస్తోంది. రాష్ట్రాల హక్కులను కాలరాసి వాటి ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. కేంద్ర పాలకులు అధికారాలను తీసేసుకుంటున్నారు. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటే ఇచ్చిన మాట అమలు చేయకుండా కేంద్రం చేతులెత్తేస్తోంది. వనరుల సమీకరణకు రాష్ట్రాల కన్నా కేంద్రానికి అవకాశాలు ఎక్కువ. ఎఫ్ఆర్బీఎం పరిమితులూ కేంద్రానికి ఎక్కువే. ఎప్పుడంటే అప్పుడు ఆ పరిమితిని పెంచుకునే అవకాశముంది’అని హరీశ్ పేర్కొన్నారు. -
విద్యుత్ చట్ట సవరణలు వెంటనే ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ప్రజలకు నష్టం చేసే ఈ సవరణలను వెనక్కు తీసుకోకపోతే గతంలో విద్యుత్ ఉద్యమ షాక్ తగిలి ఏపీ ప్రభుత్వం కూలిపోయిన మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా షాక్ తగులుతుందని హెచ్చరించారు. కేంద్రం విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోకపోతే విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమాన్ని చేపడతామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని షహీద్‌చౌక్ వద్ద విద్యుత్ ఉద్యమ అమరులు బాలాస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌లకు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అమరవీరుల 21వ సంస్మరణ సభలో కేంద్ర విద్యుత్ చట్టాల సవరణకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. గతంలో జరిగిన ‘బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమం’మహత్తరమైన ఉద్యమమని, ఆ ఉద్యమం కారణంగానే ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలను పెంచే సాహసం చేయలేదని, పైగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ తదితర సదుపాయాలను కల్పించాయని వక్తలు పేర్కొ న్నారు. ఒకే దేశం–ఒకే పన్ను తదితర నినాదాలతో బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా చట్టాలను సవరిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ముందుకు రావాలని సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి కోరారు. నాడు ప్రపంచ బ్యాంకు విధానాల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను అమలు చేసిందని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఉధృతంగా ప్రపంచ బ్యాంకు, పెట్టుబడిదారీ విధానాలను అమలు చేస్తోందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కార్యక్రమంలో అజీజ్‌పాషా, పశ్య పద్మ (సీపీఐ), జి.నాగయ్య, డీజీ నరసింహారావు, బి.వెంకట్, టి.సాగర్ (సీపీఎం), ఎం.సుధాకర్ (ఎంసీపీఐ–యూ), కె. మురహరి (ఎస్‌యూసీఐ–సీ), అచ్యుత రామారావు, ఎస్.ఎల్.పద్మ (న్యూడెమోక్రసీ) తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో ప్రత్యేక శాఖ లేకపోవడం బాధాకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రస్తుతమున్న సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, బీసీలకు సంబంధించిన అనుకూల సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడంలో తీవ్ర అన్యాయం చేసిందని, ప్రత్యేక శాఖ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి పాలన సాగించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. -
కేంద్ర సాయమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి నిధుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకొనే స్థాయిలో నిధులివ్వని కేంద్రం... గత ఆరేళ్లుగా ఇదే వైఖరి అవలంబిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో 50 శాతం కూడా దాటకపోవడం గమనార్హం. గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్రం రూ. 1.12 లక్షల కోట్లు అడిగితే కేంద్రం మాత్రం రూ. 50.93 వేల కోట్లు (అడిగిన దాంట్లో 45.1 శాతం) మాత్రమే ఇచ్చింది. తొలి ఏడాది నుంచీ ఇదే తీరు... గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సాయం చేయడంలో రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది నుంచే కేంద్రానికి మనసు రావడం లేదని కాగ్ లెక్కలు పరిశీలిస్తే అర్థమవుతుంది. 2014–15 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 21,720 కోట్లు వస్తాయని రాష్ట్రం అంచనా వేసింది. అయితే కారణమేదైనా రాష్ట్ర అంచనాలో 30 శాతానికి అటుఇటూగా రూ. 6,487.72 కోట్లే వచ్చాయి. అప్పటి నుంచి ఏటా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద రాష్ట్రానికి అంచనా కంటే తక్కువ నిధులు వచ్చాయి. రాష్ట్ర బడ్జెట్ అంచనా ప్రకారం 2015–16లో 60.89 శాతం, 2016–17లో 62.34 శాతం, 2017–18లో 29.94 శాతం, 2018–19లో 28.16 శాతం నిధులు అందాయి. అంటే రాష్ట్రం ఏర్పాటై ఆరేళ్లవగా అందులో మూడేళ్లు రాష్ట్ర అంచనాల్లో కేవలం 30 శాతం అంతకంటే తక్కువ మాత్రమే కేంద్ర సాయం అందిందన్న మాట. 2019–20లో పరిస్థితి భిన్నం... తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,177.75 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వస్తుందని రాష్ట్రం అంచనా వేయగా అందులో 148 శాతం అంటే 11,450.85 కోట్లు విడుదల అయ్యాయి. అయితే ఇందులో కూడా కేంద్రం తిరకాసు పెట్టిందని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. అంతకుముందు ఏడాది రూ. 29 వేల కోట్లకుపైగా ఉన్న అంచనా గతేడాదికి వచ్చేసరికి రూ. 8,177 కోట్లకు తగ్గిందని, అయినా కేంద్రం ఇచ్చింది రూ. 11 వేల కోట్లేనని వారంటున్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అంచనా కంటే రూ. 3,300 కోట్లు ఎక్కువ వచ్చినా కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలో రూ. 2,900 కోట్లు తగ్గిందని చెబుతున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో రూ. 14,338.9 కోట్ల వాటా వస్తుందని అంచనా వేస్తే కేంద్రం ఇచ్చింది రూ. 11,450.85 కోట్లు మాత్రమేనని కాగ్ ఇటీవల వెల్లడించిన లెక్కలు కూడా స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలపట్ల ఉదారంగా వ్యవహరించి నిధులివ్వాలని, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఇతోధికంగా సాయం చేయకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మనుగడ కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
స్వదేశీ కోచ్‌లపై కేంద్రం చిన్నచూపు
చెన్నై: దేశవాళీ కోచ్‌ల విషయంలో ప్రభుత్వ వైఖరి పట్ల ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) మాజీ చీఫ్ సెలక్టర్, గ్రాండ్‌మాస్టర్ ఆర్బీ రమేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశానికి పతకాలు అందించే క్రీడాకారులను తయారుచేసినప్పటికీ జాతీయ అవార్డుల విషయంలో స్వదేశీ కోచ్‌లను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ప్రస్తుతం చెస్‌లో అద్భుతాలు చేస్తోన్న ఆర్. ప్రజ్ఞానంద, వైశాలి, జాతీయ చాంపియన్ అరవింద్ చిదంబరం, కార్తికేయన్ మురళీ వంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన రమేశ్... భారత కోచ్‌ల జీతాల విషయంలోనూ కేంద్రం తీరును విమర్శించారు. ‘భారత కోచ్‌లు కేంద్రం అందించే అవార్డుల గురించి ఆలోచించకపోవడమే ఉత్తమం. 15 ఏళ్లలో భారత్. 34 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ పతకాలు, 40 ఆసియా యూత్, 5 ఆసియా సీనియర్, 23 కామన్వెల్త్ పతకాలు, చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం సాధించింది. కానీ కేంద్రం నుంచి లభించిన అవార్డులు సున్నా. అసలు క్రీడా పాలసీ అనేది ఉందా? భారత జట్టు చెస్ కోచ్‌కు ఒక్క రోజుకు లభించే జీతమెంతో ఎవరూ ఊహించలేరు. చెప్పినా నమ్మరు కూడా! కానీ విదేశీ కోచ్‌లకు 10 రెట్లు అధికంగా చెల్లింపులు ఉంటాయి’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. -
ఇంధన ధరలతో కేంద్రం దగా
శంషాబాద్: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత కష్టకాలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను దగా చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా గత మూడు మాసాలుగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలపై ధరల పెంపు భారం మోపడం దారుణమన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్న సమయంలో దేశంలో మాత్రం ఇం«ధన రేట్లు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 108 డాలర్లు ఉండగా, ఇక్కడ లీటరు పెట్రోలు రూ.71.40, డీజిల్ ధర రూ. 59.49 ఉందని.. అదే క్రూడాయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 41 డాలర్లు ఉన్నా.. పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. గత ఆరేళ్ల కాలంలో పదకొండు సార్లు ఎక్సైజ్ పన్ను పెంచిన ఘనత బీజేపీ సర్కారుకే దక్కిందన్నారు. రోజూ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని తెలిపారు. అనంతరం తహసీల్దార్ జనార్దన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్, పార్టీ సీనియర్ నాయకురాలు మైలారం సులోచన తదితరులు పాల్గొన్నారు. శనివారం శంషాబాద్ తహసీల్ ఎదుట జరిగిన ధర్నాలో ఉత్తమ్, విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు -
రాజకీయాల్లో చేరను: వీకే సింగ్
సాక్షి, హైదరాబాద్: తాను రాజకీయాల్లో చేరడం లేదని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్, ఏడీజీ వీకేసింగ్ అన్నారు. ముందస్తు రాజీనామాను ఆమోదించాలని కేంద్రానికి తాను రాసిన లేఖపై పలు ప్రచారాలు జరుగుతున్న వేళ గురువారం ఆయన మరో లేఖను విడుదల చేశారు. ‘రాజకీయ నేతలు ఏ రాష్ట్రాన్నీ బంగారంగా మార్చలేరు, రాజ్యాంగపరంగా ప్రజలే కీలకమైనా, వారు బలవంతుల చేతుల్లో కీలుబొమ్మలయ్యారు. దీనికి రాజకీయాలను, నేతలను తప్పుబట్టలేం, లోపం ప్రజల్లోనే ఉంది. అందుకే వివేకానంద, మహాత్మాగాంధీ, అన్నాహజారే బాటలో పయనిస్తూ ప్రజల కోసం పాటుపడతా. సుపరిపాలనతో ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందిన దేశాలకంటే మంచి ప్రగతిని సాధిస్తుంది. దీనికి టీఎస్పీఏనే చక్కటి ఉదాహరణ. ముందస్తు రిటైర్మెంట్కు కేంద్రం అనుమతించగానే నా భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తా’అని లేఖలో స్పష్టం చేశారు. -
ఈ సారి ‘అర్జున’ను ఆశిస్తున్నా: సంజిత చాను
న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంలో నిర్దోషిగా బయటపడిన భారత వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత సంజిత చాను కేంద్ర ప్రభుత్వం అందించే క్రీడా పురస్కారం ‘అర్జున’ను ఆశిస్తోంది. 2016 నుంచి ఈ అవార్డు కోసం ప్రయత్నిస్తోన్న తనకు ఈ సారైనా ఈ గౌరవాన్ని అందజేయాలని ఆమె కోరింది. ‘నాలుగేళ్ల క్రితం అర్జున అవార్డు కోసం దరఖాస్తు చేశాను. అప్పుడు తిరస్కరించారు. 2017లో కూడా విస్మరించారు. ఆ తర్వాత డోపింగ్ ఆరోపణలతో నన్ను పక్కన బెట్టారు. కానీ ఈసారి అర్జున వస్తుందని నేను ఆశిస్తున్నా’ అని 26 ఏళ్ల చాను పేర్కొంది. గత నెలలోనే చాను అర్జున దరఖాస్తును క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది. అయితే డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఈ పురస్కారానికి అనర్హులని కేంద్ర క్రీడా శాఖ ఆమె దరఖాస్తును తిరస్కరించింది. -
కోవిడ్ మరణాల రేటు 2.82%
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకున్న నివారణ చర్యల ఫలితంగా దేశంలో కోవిడ్ వ్యాప్తి వేగంగా జరగలేదని, ఈ విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థానంలోనే ఉందని కేంద్రం తెలిపింది. కోవిడ్–19 కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కోవిడ్ మరణాల రేటు దేశంలో 2.82 శాతం కాగా, ప్రపంచ దేశాల సరాసరి 6.13 శాతంగా ఉంది. అదేవిధంగా, ప్రతి లక్ష మంది బాధితుల్లో దేశంలో 0.41 శాతం మంది మృతి చెందగా ప్రపంచవ్యాప్తంగా ఇది 4.9 శాతంగా ఉంది’అని ఆయన అన్నారు. దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందిందంటూ కొందరు పరిశోధకులు చెప్పడంపై ఆయన స్పందిస్తూ..‘కేసుల సంఖ్య రీత్యా ప్రపంచంలో ఏడో స్థానంలో ఉన్నాం. అయితే, 14 దేశాల మొత్తం జనాభా భారత్‌తో సమానం కాగా ఆయా దేశాల్లో భారత్ కంటే 55.2 శాతం ఎక్కువ కోవిడ్–19 మరణాలు సంభవించాయి. వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉంది? ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన చెప్పారు. 8,171 కేసులు..204 మరణాలు దేశంలో మంగళవారం ఒక్క రోజే కోవిడ్–19తో మరో 204 మంది మరణించడంతో మృతుల సంఖ్య 5,598కు చేరుకుంది. అదేవిధంగా, కొత్తగా 8,171 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 1.98 లక్షలకు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 97,581కు చేరుకున్నాయనీ, ఇప్పటి వరకు 95,526 మంది కోవిడ్ బాధితులు కోలుకోవడంతో రికవరీ రేటు 48.07 శాతం వరకు ఉందని తెలిపింది. దేశంలో మొత్తం కోవిడ్–19 కేసులు 1,98,706కు పెరగడంతో అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ తర్వాత 7వ స్థానంలో భారత్ ఉందని పేర్కొంది. -
5స్టార్ నగరాలు ఆరు
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ నగరాల రేటింగ్స్‌లో అంబికాపూర్(ఛత్తీస్‌గఢ్), రాజ్‌కోట్, సూరత్ (గుజరాత్), మైసూర్(కర్ణాటక), ఇండోర్(మధ్యప్రదేశ్), నవీ ముంబై(మహారాష్ట్ర)లకు అత్యున్నత 5స్టార్ లభించింది. వ్యర్థాల(గార్బేజ్) నిర్వహణలో సమర్ధంగా వ్యవహరించినందుకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంగళవారం ఈ నగరాలకు ‘గార్బేజ్ ఫ్రీ నగరాలుగా’ అత్యుత్తమ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆరు నగరాలకు 5స్టార్, 65 నగరాలకు 3స్టార్, 70 నగరాలకు స్టార్ ప్రకటిస్తున్నట్లు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ తెలిపారు. కరోనాపై పోరులో స్వచ్ఛభారత్ మిషన్ గణనీయ పాత్ర పోషిస్తోందన్నారు. 2019–20 సంవత్సరానికి గానూ మొత్తం 1435 నగరాలు ఈ రేటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, 141 నగరాలకు రేటింగ్స్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 3స్టార్‌లో న్యూఢిల్లీ గార్బేజ్ ఫ్రీ నగరాలుగా 3 స్టార్ రేటింగ్ పొందిన వాటిలో న్యూఢిల్లీ, కర్నాల్(హరియాణా), చండీగఢ్, అహ్మదాబాద్(గుజరాత్), భోపాల్(మధ్యప్రదేశ్), జంషెడ్పూర్(జార్ఖండ్).. మొదలైనవి ఉన్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్, రోహ్తక్(హరియాణా), గ్వాలియర్(మధ్యప్రదేశ్), వడోదర, భావ్‌నగర్(గుజరాత్)లకు 1 స్టార్ లభించింది. గత ఐదేళ్లుగా స్వచ్ఛభారత్ మిషన్ విజయవంతంగా కొనసాగడం వల్లనే కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని పురి చెప్పారు. ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను ప్రారంభించిందని, దీని వల్ల నగరాల మధ్య స్వచ్ఛత విషయంలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొందన్నారు. 1.19 కోట్ల మంది పౌరుల నుంచి సమాచారం సేకరించామని, 10 లక్షల జియోట్యాగ్డ్ ఫొటోలను పరిశీలించామని, 5175 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లను తమ క్షేత్రస్థాయి పర్యవేక్షకులు సందర్శించారని మంత్రి వివరించారు. రేటింగ్స్ పొందిన ఆంధ్రప్రదేశ్ నగరాల 3స్టార్: తిరుపతి, విజయవాడ 1స్టార్: విశాఖపట్నం, పలమనేరు(చిత్తూరు జిల్లా), చీరాల(ప్రకాశం జిల్లా), సత్తెనపల్లి(గుంటూరు జిల్లా) -
కష్టకాలంలో కేంద్రం స్పందన ఇలాగేనా?
సాక్షి, సంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి రాష్ట్రాలకు సహాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు, జానపద కళాకారులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. తర్వాత పరిశ్రమల యాజమాన్యాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రం కష్టకాలంలోనూ పేదలను ఆదుకోవడం లేదని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహాయం చేయడంలో ఆంక్షలు విధిస్తున్నదని ఆరోపించారు. అప్పులు తీసుకోవడానికి పలు రకాల షరతులు విధించడం సరికాదన్నారు. ఈ కష్టకాలంలో షరతులు ఎలా పెడతారని ప్రశ్నించారు. కేంద్రం పేదలకు కేవలం 5 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకున్న దని దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్థలో మా ర్పు రావాల్సిన అవసరం ఉందని ఆయ న అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ సమ యం లో ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం, రూ.1,500 ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.2,500 కోట్లను రెండు దఫాలుగా పంపిణీ చేశామన్నారు. వైజాగ్ గ్యాస్ లీకేజీ లాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పరిశ్రమల యాజమాన్యాలు, సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు 24 గంట ల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా పాల్గొన్నారు. -
యురేనియం సర్వేపై మీ వైఖరేమిటి?
సాక్షి, హైదరాబాద్: నల్లమలలో యురేనియం నిక్షేపాల అన్వేషణ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో యురేనియం ని ల్వలు ఎక్కడెక్కడున్నాయన్న దానిపై సర్వే చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కోరింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అటవీ సలహా మండలి సమావేశంలో ఏటీఆర్ పరిధిలో ప్రతిపాదిత యురేనియం నిల్వల సర్వే, వెలికితీత అంశం చర్చకు వచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయమేమిటో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమావేశం సూచించింది. గతంలో జరిగిందిదీ..: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం 200, 300 మీటర్ల లోతున అటవీ ప్రాంతవ్యాప్తంగా 4 వేల బోర్లు వేస్తామని, దాదాపు ఐదేళ్ల్లపాటు ఈ సర్వే ప్రక్రియ సాగించేందుకు అనుమతినివ్వాలంటూ గతేడాది టమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) నుంచి ప్రతి పాదనలు వచ్చాయి. గత ప్రతిపాదనలకు భిన్నంగా ఉన్న ఈ కొత్త ప్రతిపాదనలను తిరస్కరిస్తూ సంబంధిత ఫైల్‌ను జిల్లా, క్షేత్రస్థాయి అధికారులు తాజా గా తిప్పి పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల వారం, పదిరోజుల క్రితమే ఈ మేరకు నివేదికను హైదరాబాద్‌లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి నివేదించినట్టు తెలుస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించలేమని, వీటివల్ల అడవికి, జంతువులు, వృక్షాలకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. అడవిలో ప్రతిపాదిత బోరు వేసే పాయింట్లను ఏఎండీ సాంకేతిక బృందం వచ్చి చూపిస్తే తప్ప గుర్తించలేమని, ఈ బృందాల ప్రవేశానికి కూడా స్థానిక గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఈ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నివేదికను రాష్ట్ర వన్యప్రాణి మండలి సమక్షంలో ఉంచి, ఏటీఆర్‌లో యురేనియం నిల్వలపై సర్వే, వెలికితీత సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ నివేదించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు తెలియజేసే అవకాశముందని సమాచారం. -
పదేళ్లు పన్ను మినహాయింపు!!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో అస్తవ్యస్తమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే క్రమంలో... భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ప్రకారం.. 500 మిలియన్ డాలర్లకు పైగా కొత్త పెట్టుబడులు పెట్టే కంపెనీలకు 10 ఏళ్ల పాటు పూర్తిగా పన్ను మినహాయింపులు ఇచ్చే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, భారీ యంత్రాలు, టెలికం పరికరాల ఉత్పత్తి తదితర రంగాలకు దీన్ని వర్తింపచేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కింద ఇన్వెస్ట్ చేసే సంస్థలు.. జూన్ 1 నుంచి మూడేళ్లలోగా కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. 100 మిలియన్ డాలర్లు.. నాలుగేళ్లు ... ఇక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే రంగాల్లో 100 మిలియన్ డాలర్లు.. ఆపైన ఇన్వెస్ట్ చేసే సంస్థలకు నాలుగేళ్ల పాటు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఆ తర్వాత ఆరేళ్ల పాటు తక్కువ స్థాయిలో 10% కార్పొరేట్ ట్యాక్స్ రేటు వర్తిస్తుంది. టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్, ఫుట్‌వేర్ తదితర రంగాలు ఈ జాబితాలోకి వస్తాయి. ప్రస్తుతం పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలకు తాజా మినహాయింపులు అదనం. ఈ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమగ్ర అభివృద్ధిపై దృష్టి.. ప్రధానంగా టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, వజ్రాభరణాలు వంటి రంగాలతో పాటు వివిధ పరిశ్రమల సమగ్ర అభివృద్ధిపై కేంద్రం వాణిజ్య శాఖ దృష్టి పెడుతోంది. సేవల రంగానికి చెందిన టూరిజం వంటి విభాగాలను కూడా ఈ జాబితాలో చేర్చడంపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుత మౌలిక సదుపాయాలు, టెస్టింగ్ ల్యాబ్‌లు, పరిశోధన.. అభివృద్ధి కేంద్రాల అప్‌గ్రెడేషన్ కోసం 50 పారిశ్రామిక క్లస్టర్లను వాణిజ్య శాఖ గుర్తించింది. చైనా నుంచి భారత్‌కు కంపెనీలు.. ఎన్నో ఉత్పత్తుల కోసం ప్రపంచదేశాలు చైనాపైనే అధికంగా ఆధారపడడం వల్ల వైరస్ విస్తరణకు దారితీయడంతోపాటు.. సరఫరా పరంగా తీవ్ర ఇబ్బందుల పాలవ్వాల్సి వచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు చైనాపైనే పూర్తిగా ఆధారపడిపోకుండా ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లోనూ తయారీ యూనిట్ల ఏర్పాటుకు మొగ్గుచూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. చైనాకు దూరమయ్యే ఆలోచనలో ఉన్న ఇన్వెస్టర్లను భారత్ వైపు ఆకర్షించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. భారత్‌లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే సంస్థలకు స్థల సమీకరణను సులభతరం చేయడం, కొత్త ప్లాంట్లకు పన్నుపరమైన రాయితీలివ్వడం తదితర చర్యలు తీసుకుంటోంది. ‘‘ఎన్నో చర్యల దిశగా పనిచేస్తున్నాం. రాష్ట్రాలు భూముల అందుబాటు వివరాలను సిద్ధం చేసి ఇస్తే, వాటిని ఆసక్తిగల ఇన్వెస్టర్ల ముందు ఉంచుతాం’’ అని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఓ సీనియర్ అధికారి ఇటీవల తెలిపారు. బహుళజాతి సంస్థలు చైనా నుంచి పూర్తిగా బయటకు వచ్చే ఆలోచనలో లేవని, కాకపోతే ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయని, వారికి భారత్ ఆకర్షణీయ కేంద్రం అవుతుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు. నిర్ణీత సమయంలోగా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, సకాలంలో అన్ని అనుమతులను ఇచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర అధికారులను బాధ్యులను చేయాలని ఎగుమతుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ శరద్ సరాఫ్ అభిప్రాయపడ్డారు. భారత్ వైపు.. యాపిల్ చూపు.. టెక్ దిగ్గజం యాపిల్ కూడా చైనాలోని తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో అయిదో వంతు భాగాన్ని భారత్‌కు మళ్లించాలని యోచిస్తోంది. దేశీయంగా తయారీ రంగానికి ఊతమిచ్చే ఉద్దేశంతో భారత్ అమలు చేస్తున్న ఉత్పత్తిపరమైన ప్రోత్సాహకాల ప్రయోజనాలు పొందాలని భావిస్తోంది. ప్రస్తుతం యాపిల్ స్మార్ట్ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ సంస్థలు కాంట్రాక్టు ప్రాతిపదికన తయారు చేసి అందిస్తున్నాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ చేసే స్మార్ట్ఫోన్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడం కోసం భారత్‌లో తయారు చేసేందుకు .. ఈ కాంట్రాక్టర్లను యాపిల్ ఉపయోగించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) లెక్కల ప్రకారం.. గత త్రైమాసికంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ 62.7 శాతం వాటా దక్కించుకుంది. దేశీయంగా రీసెల్లర్స్ ద్వారానే విక్రయిస్తున్న యాపిల్.. సొంతంగా కూడా స్టోర్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 2021 నాటికి తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభిస్తామని ఇటీవలే సంస్థ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్ఫోన్లు తయారవుతున్నాయి. చిన్న వ్యాపారాలు, తయారీకి ప్యాకేజీ దన్ను ... కరోనా కష్టం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో చిన్న పరిశ్రమలకు పన్నుల రూపంలో ప్రయోజనం కల్పించడమే కాకుండా, దేశీయ తయారీ రంగానికి ఊతం కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా ఇబ్బందుల్లో నుంచి ఆర్థిక వ్యవస్థలను గట్టెక్కించడానికి ఇప్పటికే అమెరికా తమ జీడీపీలో 13% ప్యాకేజ్ని ప్రకటించగా, జపాన్ విషయంలో ఇది 21%. మోదీ ప్రకటించిన ప్యాకేజీ కూడా ఇదే తరహా భారీ ప్యాకేజ్ కిందకు వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్ తనంతట తానుగా నిలదొక్కుకోడానికి దోహదపడే ప్యాకేజ్‌లో ఇప్పటికే కేంద్రం ప్రకటించిన 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ అలాగే ఆర్బీఐ ద్రవ్య, వడ్డీరేట్ల పరమైన ప్రయోజనలు కలిపి ఉన్నాయి. భూ, కార్మిక, ద్రవ్య, న్యాయ పరమైన అంశాలు ప్యాకేజ్‌లో ఇమిడి ఉంటాయని మోదీ తన మంగళవారంనాటి ప్రసంగంలో పేర్కొన్నారు. మొత్తంగా కరోనాను ఎదుర్కొనే విషయంలో మోదీ ప్రకటించిన ప్యాకేజీ సమగ్ర స్వరూపాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి వెల్లడించనున్నారు. -
లాక్డౌన్ 4.0: భారీ ఆర్థిక ప్యాకేజీ
న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకానికి రూపకల్పన చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలను ఆదుకునే ప్రణాళికతో ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రారంభించారు. భారీ, మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమలవారు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, కూలీలు.. వ్యవస్థలోని అందరినీ ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజీ దేశ జీడీపీలో దాదాపు 10% అని ప్రధాని వెల్లడించారు. ఆర్బీఐ, ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో కలిపి ఇది రూ. 20 లక్షల కోట్లుగా ఉంటుందన్నారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా (చట్టం).. వీటిపై ప్రధానంగా ఈ ప్యాకేజీలో దృష్టి పెడతామన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజ్ పూర్తి వివరాలను రానున్న రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడిస్తారని చెప్పారాయన. ఆత్మబలం, ఆత్మ విశ్వాసం నిండుగా ఉన్న ‘ఆత్మ నిర్భర్ భారత్’ దేశ ప్రజల నినాదం కావాలన్నారు. కరోనా సంక్షోభం కారణంగా అనుకోకుండానే స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేశామన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8 గంటల నుంచి దాదాపు 35 నిమిషాల పాటు ప్రసంగించారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా మారిన పరిస్థితులను, కరోనా సంక్షోభాన్ని భారత్ సమర్ధంగా ఎదుర్కొన్న తీరును ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలను భారత్ అనేక ప్రపంచదేశాలకు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్వయం సమృద్ధి సాధించడానికి, ప్రపంచంలోనే అత్యుత్తమంగా రూపొందడానికి భారత్‌కు కరోనా సంక్షోభం ద్వారా అవకాశం లభించిందన్నారు. కరోనా నేపథ్యంలో దేశప్రజలనుద్దేశించి టీవీ మాధ్యమం ద్వారా ప్రధాని ప్రసంగించడం ఇది మూడో సారి. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ► కరోనా వైరస్ కారణంగా మునుపెన్నడూ చూడనటువంటి సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దాదాపు 2.75 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లోనూ ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. ► కరోనా సమస్య చుట్టూనే తిరుగుతూ ఇతర కీలక కార్యక్రమాలను విస్మరించలేం. స్వయం సమృద్ధి నేటి నినాదం ► స్వయం సమృద్ధి సాధించడం ఇప్పుడు అత్యావశ్యకం. స్వయం సమృద్ధ భారత్ ఇప్పుడు అత్యంత అవసరం. అంతర్జాతీయంగా స్వయం సమృద్ధి అంటే ఇప్పుడు అర్థం మారింది. భారత సంస్కృతి, సంప్రదాయం చెప్పేది ‘వసుధైక కుటుంబం’ అనే అర్థంలోనే. ► విశ్వమానవాళి సంక్షేమమే భారత స్వయం సమృద్ధికి విస్తృతార్థం. ► బహిరంగ మల విసర్జన, పోలియో, పౌష్టికాహార లోపంపై.. ఇలా భారత్ సాధించిన ప్రతీ విజయం ప్రపంచంపై ప్రభావం చూపింది. గ్లోబల్ వార్మింగ్‌పై పోరులో అంతర్జాతీయ సౌర కూటమి అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి. భారత్ ఇప్పుడు ఏదైనా సాధించగలదు అని ప్రపంచం నమ్ముతోంది. ► ఇప్పుడు మన వద్ద వనరులున్నాయి. శక్తి, సామర్థ్యాలున్నాయి. అత్యుత్తమ వస్తువులను ఉత్పత్తి చేయాలి. మన సప్లై చెయిన్‌ను ఆధునీకరించుకోవాలి. ఇవి మనం చేయగలం. చేస్తాం. దేశీయానికి ప్రచారం: హా మనమంతా దేశీయ ఉత్పత్తులను కొనడమే కాదు. వాటికి ప్రచారం కూడా చేయాలి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంస్థలన్నీ ఒకప్పుడు స్థానికంగా ఏర్పడినవే. కృషి, పట్టుదల, నాణ్యత, ప్రచారం.. మొదలైన వాటితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. దేశీయ సంస్థలు ఆ దిశగా ముందుకు వెళ్లాలి. అందుకు మనమంతా ప్రోత్సహించాలి. ► మంచి ప్రోత్సాహం అందించడంతో ఖాదీ, చేనేతలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అవి బ్రాండ్ల స్థాయికి వెళ్లాయి. ► 1999లో వై2కే సమస్య వచ్చింది. అంతర్జాతీయంగా భయభ్రాంతులను సృష్టించింది. అయితే, భారతీయ సాంకేతిక నిపుణులు ఆ సమస్యను సునాయాసంగా పరిష్కరించారు. ► కచ్ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. కచ్ అంతా మృత్యువనే దుప్పటి కప్పుకుందా? అనేలా కనిపించింది. మళ్లీ సాధారణ స్థితి సాధ్యమా? అని అంతా అనుమానించారు. కానీ కచ్ మళ్లీ నిలబడింది. త్వరలోనే సగర్వంగా సాధారణ స్థితికి చేరుకుంది. అదే భారత్ ప్రత్యేకత. లాక్డౌన్ 4.0 లాక్‌డౌన్‌ను మే 17 తరువాత కూడా పొడిగించనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. అయితే, ఈ నాలుగో దశ గత మూడు దశల తీరులో ఉండబోదని, మారిన నిబంధనలతో కొత్త తరహాలో ఉంటుందని తెలిపారు. లాక్డౌన్ 4.0 కు సంబంధించిన పూర్తి నిబంధనలు, ఇతర వివరాలను మే 18 లోపు వెల్లడిస్తామన్నారు. కరోనాతో మరి కొన్నాళ్లు కలిసి జీవించక తప్పని పరిస్థితుల్లో.. ఒకవైపు, ఆ మహమ్మారితో పోరాడుతూనే, అభివృద్ధి దిశగా ముందడుగు వేయాల్సి ఉందని తేల్చిచెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాకేజీ: బీజేపీ ప్రధాని మోదీ ప్రకటించిన ప్యాకేజీ ప్రపంచంలోనే అతిపెద్దదని బీజేపీ పేర్కొంది. ఈ ప్యాకేజీ దేశ జీడీపీలో 10 శాతంతో సమానమని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశం స్వావలంబన సాధించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి నడ్డా కృతజ్ఞతలు తెలిపారు. వలస జీవుల కష్టాలను ప్రధాని పట్టించుకోలేదు: కాంగ్రెస్ వలస కార్మికుల కష్టాలు తీరుస్తారని భావించిన దేశ ప్రజలు ప్రధాని మోదీ ప్రసంగంతో నిరుత్సాహానికి గురయ్యారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ‘వేలాది మంది వలస కార్మికులు కాలినడకన సొంతూళ్లకు పయనం కావడం అతిపెద్ద మానవ విషాదం. వారి పట్ల కనీస సానుభూతి, కనికరం చూపలేకపోయారు. దీనిపై దేశ ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు’ అని కాంగ్రెస్ పేర్కొంది. (కోయంబేడు కొంపముంచిందా?) -
జూన్‌లో రైళ్ల కూత.. బస్సులపై అస్పష్టత
సాక్షి, హైదరాబాద్: జూన్ తొలి వారంలో ప్రజా రవాణాను ప్రారంభించేలా కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఇప్పటికిప్పుడు ప్ర జా రవాణా ప్రారంభించటం సరికాదని నిపుణు లు హెచ్చరిస్తున్నా, ఇప్పటికే లాక్డౌన్ వల్ల 50 రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యం లో.. ప్రజా రవాణా ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున, జూన్ మొదటి వారంలో ప్రారంభిం చాలని కేంద్రం భావిస్తోంది. ఆర్టీసీలపై రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేసింది. ఇటీవలే గ్రీన్జోన్లలో బస్సులు తిప్పుకునేందుకు వెసులుబాటు కలిగించిన విషయం తెలిసిందే. వాటిని తిప్పాలా వద్దా అన్నది మాత్రం రాష్ట్రాలకే వదిలేసింది. ఆరెంజ్, రెడ్ జోన్లలో మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఇక తన పరిధిలో ఉన్న రైల్వే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈనెలాఖరు వరకు రైళ్లను తిప్పొద్దని స్వయంగా రైల్వే బోర్డు అభిప్రాయపడింది. దీంతో జూన్ మొదటివారంలో రైళ్లను ప్రారంభించాలని భావిస్తోం ది. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గల వలస కూలీలను సొం త ప్రాంతాలకు తరలిం చేందుకు వీలుగా శ్రామిక్ స్పెషల్స్ పేరుతో సాధారణ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక సాధారణ రైళ్లను ప్రారంభిస్తే, ప్రయాణికుల మధ్య భౌతిక దూరం నిబంధన అంతగా అమలయ్యే అవకాశం లేదు. ఇదే భయం కేంద్రాన్ని వెంటాడుతోంది. ఈనెల 17 కేంద్రం లాక్డౌన్ విషయంలో సమీక్షించనుంది. ఆ సందర్భంగా రైళ్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకరిద్దరు మంత్రులు మాత్రం 17 తర్వాత రైళ్లను నడపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నిర్వహించే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. గ్రీన్జోన్లు పెరగటంతో..: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను నడిపే విషయంలో ప్రభుత్వం ఇంకా తేల్చుకోలేదు. బస్సులు తిప్పుకునేందుకు కేంద్రం అ నుమతించినా, రాష్ట్రంలో గ్రీన్‌జోన్ పరిధి తక్కువ గా ఉండటం, వాటి మధ్య ఆరెంజ్, రెడ్ జోన్లు ఉండటంతో బస్సులు తిప్పే అవకాశం లేదు. ప్రస్తుతం గ్రీన్ జోన్ల సంఖ్య పెరగటంతో ఇప్పుడు కొంత సానుకూలత ఏర్పడింది. త్వరలో ఈ సం ఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున మరిం త అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, హైదరాబాద్‌తో అనుసంధానం లేకుండా బస్సు లు తిప్పటం కష్టమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా హైదరాబాద్–జిల్లాల మధ్యనే ఎక్కువగా ప్రయాణిస్తారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం రెగ్యులర్‌గా కొత్త కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నందున ఇప్పట్లో అది గ్రీన్‌జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. పక్కపక్కనే గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు ఉన్నందున.. బస్సులు తిప్పేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా, గ్రీన్ జోన్లలో కూడా కొత్త పాజిటివ్ కేసులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 15న మరోసారి సమీక్షించి బస్సుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. అప్పటికి గ్రీన్‌జోన్ పరిధిలో దాదా పు 25 జిల్లాలు వచ్చే అవకాశం ఉన్నందున బ స్సులు తిప్పేందుకు సానుకూలత వస్తుంది. ఆ రెంజ్, రెడ్‌జోన్ సరిహద్దుగాలేని జిల్లాల్లో బస్సు లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డిపోల్లో థర్మో స్క్రీనింగ్ పరికరాలు: బస్సులు ప్రారంభించాక ప్రత్యే క జాగ్రత్తలు తీసుకోనున్నట్టు అధికారులు చెబు తున్నారు. సిబ్బందిలో ఎవరికైనా జ్వరం లక్షణా లుంటే అనుమతించకూడదని నిర్ణయించారు. ఇందుకోసం నిత్యం ప్రతి ఒక్కరిని థర్మో స్క్రీనిం గ్ ద్వారా శరీర ఉష్ణోగ్రత చెక్ చేయాలని నిర్ణయిం చారు. ప్రతి డిపో, కార్యాలయాల్లో వీటిని అందుబాటులో ఉంచేందుకు కొత్తవి కొంటున్నారు. ఇక సిబ్బంది చేతులు కడుక్కోవటం, శానిటైజర్ కో సం కాలితో నొక్కితే నీళ్లు, శానిటైజర్ వచ్చే పరికరాలను సమకూరుస్తున్నారు. వీటిని ఆర్టీసీనే సొంతంగా రూపొందిస్తోంది. ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సిబ్బంది విధులకు హాజరయ్యేలా ఇప్పటికే ఉత్తర్వు జారీ అయింది. ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా లేనందున, సిబ్బంది పెద్ద సంఖ్య లో డిపోలకు వస్తే భౌతికదూరం నిబంధన గల్లం తై కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. సగం మంది ప్రయాణికులతో.. ఒక కోచ్‌లో 72 మంది ప్రయాణికుల(బెర్తులు)కు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాన్నే అనుసరిస్తే భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించినట్టవుతుంది. దీంతో ఈ సంఖ్యను తగ్గించాలని యోచి స్తున్నారు. ఒక కోచ్‌లో 9 కూపేలుంటాయి. ఒక కూపేలో ఎదురెదురుగా మూడు బెర్తులు(అప్పర్, మిడిల్, లోయర్), సైడ్‌కు మరో రెండు బెర్తులు ఉంటాయి. సైడ్ బెర్తులో ఒకరు, ఎదురెదురుగా ఉండే బెర్తుల్లో నలుగురు ఉండేలా ఏర్పాట్లు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అంటే ఒక కూపేలో 8 మందికి బదులుగా 5గురు ఉంటారన్న మాట. ఇదే జరిగితే రైల్వే ఆదాయం భారీగా పడిపోతుంది. -
వలస కూలీలను తరలించే బాధ్యత కేంద్రానిదే: తలసాని
బన్సీలాల్‌పేట్: వలస కూలీలను స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బిహార్ వంటి సుదూర రాష్ట్రాలకు బస్సుల్లో వలస కూలీలను తరలించడం కూలీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. గురువారం సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లో అధికారులతో కలసి నూతన రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మార్గదర్శకాల పేరిట వలస కూలీల తరలింపు బాధ్యతను రాష్ట్రాలపై మోపీ చేతులు దులుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించి ప్రత్యేక రైళ్లలో ఉచితంగా వారిని స్వస్థలాలకు చేర్చాలన్నారు. వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చే విషయం లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు బాధ్యతారాహిత్యంగా, అసం బద్ధంగా, ఆచరణకు సాధ్యం కాని గాలిమాటల్లా ఉన్నాయన్నారు. ఓ ఆర్డర్ పాస్ చేశాం.. రాష్ట్రాలు అవి అమలు చేయాలని కేంద్రం కోరడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించి లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రశ్నకు తలసాని బదులిచ్చారు. -
మే 3 తర్వాత స్వదేశాలకు..!
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావంతో అంతర్జాతీయ విమాన సేవలు నిలిపివేయడంతో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. మే 3 తర్వాత లాక్‌డౌన్‌కు కొన్ని సడలిం పులు ఇవ్వాలని యోచిస్తున్న కేంద్రం.. ప్రవాసీల ను తీసుకురావడానికి ప్రత్యేకంగా విమానాలు పంపాల ని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం చూపుతుండటంతో గత నెల 22న అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం అదే నెల 24 నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. దీం తో విద్య, ఉద్యోగ, ఉపాధి, పర్యాటకానికి వివిధ దేశాలకు వెళ్లిన భారతీ యులు అక్కడే చిక్కుకుపోయారు. ఆయా దేశాల్లోనూ లాక్డౌన్ కొనసాగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నే విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకురావాలనే డి మాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయినవారి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఆయా దేశాల నుంచి ఎం తమంది భారత్‌కు రానున్నారనే వివరాలను సేకరించాలని భారత రా యబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆన్లైన్లో వివరాలను సేకరించగా.. తాజాగా సోమవారం ఖతర్‌లోని రాయబార కార్యాలయం కూడా ట్రావె ల్ అడ్వైజరీని జారీ చేసింది. -
ప్రతి ఉద్యోగి చేతిలో ఆరోగ్యసేతు
సాక్షి, హైదరాబాద్: కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం లాక్డౌన్ కాలంలో మినహాయింపు రంగాలతో పాటు లాక్డౌన్ తర్వాత పనిచేసే అన్ని రంగాల్లో ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఇటీవల కేంద్ర హోంశాఖ, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తో జరిగిన సమావేశంలో ఆరోగ్య సేతు యాప్‌పైనే చర్చించారు. ఈనెల 20 నుంచి లాక్డౌన్లో కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చింది. ఆహార పరిశ్రమలు, ఆహార ఉత్పత్తుల తయారీ రంగంతో పాటు నిర్మాణ రంగానికి నిబంధనలతో కూడిన మినహాయింపులు ఇచ్చింది. అయితే ఈ రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, ఇతర సిబ్బంది భౌతికదూరం పాటించడంతో పాటు ప్రతి ఒక్కరు ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ప్రస్తుత లాక్డౌన్ కాలంతో పాటు లాక్డౌన్ తర్వాత తీసుకునే చర్యలకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధిత సర్క్యులర్ కాపీని కేంద్రం పంపించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సూచించిన ఆరోగ్యసేతు యాప్ నిబంధనలకు మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మే 3 తో లాక్డౌన్ ముగియనుండగా..రాష్ట్రంలో మాత్రం మే 7తో లాక్డౌన్ ముగుస్తుంది. ఆ తర్వాత విడతల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు సందర్భాల్లో ప్రకటించారు. విడతల వారీగా ఇచ్చే మినహాయింపులను పకడ్బందీగా చేపట్టి పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సేతు అప్డేటెడ్ వెర్షన్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేస్తే కరోనా వ్యాప్తిని కేంద్రం సైతం పసిగట్టి తదుపరి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఎందుకీ యాప్? ప్రయోజనం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పలు రకాల ప్రశ్నలకు అందులో సమాధానాలు ఎంట్రీ చేయాలి. కరోనా వైరస్ వ్యాప్తి, సంబం«ధీకులతో మనం కనెక్ట్ అయ్యామా? విదేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చామా, కరోనా వైరస్ సోకే లక్షణాలేమైనా ఉన్నాయా అనే రీతిలో ప్రశ్నలకు జవాబులు రాయాలి. వీటి ఆధారంగా మన ఆరోగ్య పరిస్థితి ఈ యాప్‌లో రికార్డవుతుంది. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ఈయాప్ సూచిస్తుంది. మన చుట్టుప్రక్కల ఎవరైనా కరోనా రోగులుంటే అలర్ట్ చేస్తుంది. ఇందుకు జీపీఎస్‌ను ఆన్‌లో ఉంచాలి. ప్రస్తుతం ఆరోగ్య వివరాలను ఒకసారి మాత్రమే ఎంట్రీ చేయాల్సి ఉండగా..త్వరలో మరింత అప్డేట్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది. ప్రతి వ్యక్తిని పరిశీలించేందుకు బదులుగా..సాంకేతిక సాయంతో విశ్లేషించడానికి ఈ యాప్ దోహదపడుతుందని అధికారులు భావించి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. -
అంకుర దశలోనే ఆధునిక కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక విద్యా కోర్సులు పాఠశాల స్థాయి నుంచే చదువుకునేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆరో తరగతి నుంచే ఆ కోర్సుకు సంబంధించిన పరిచయ అంశాలను సీబీఎస్ఈ పాఠశాలల్లో బోధించేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంచి, ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు, శారీరక దృఢత్వం కలిగి ఉండేలా వారిని తీర్చిదిద్దేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజైన్ అండ్ థింకింగ్, ఫిజికల్ యాక్టివిటీ ట్రైనర్ కోర్సులను తీసుకువచ్చింది. 2020–21 విద్యా ఏడాది నుంచి వీటిని అమల్లోకి తీసుకువస్తోంది. స్కిల్ కోర్సులను రెగ్యులర్ విద్యలో భాగం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలిమెంటరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయిలో స్కిల్ కోర్సులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ స్కూళ్లన్నింటిలో వీటిని అమలు చేయనుంది. కొత్త విద్యావిధానానికి అనుగుణంగా.. పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య, అదనపు పాఠ్య కార్యక్రమాలకు మధ్య, వృత్తి విద్యా, సంప్రదాయ విద్యకు మధ్య వ్యత్యాసం ఉండొద్దని, విద్యార్థిని అన్నింటిలో మేటిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాల్సిందేనని నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా ప్రణాళిక చట్రాన్ని (నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్) సవరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సంప్రదాయ విద్యలో వృత్తి విద్యను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టింది. వృత్తి విద్య అంటే టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రీషియన్, సెల్‌ఫోన్ మెకానిక్ వంటి కోర్సులే ఉండగా ఇకపై వాటి రూపు మారుతోంది. 21వ శతాబ్దంలో క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్ కీలకమైన ప్రక్రియ. దానిని సీబీఎస్ డిజైన్–థింకింగ్ పేరుతో సబ్జెక్టుగా తీసుకొస్తోంది. తరగతులను అనుసరించి... ప్రాథమిక (6, 7, 8) తరగతుల్లో స్కిల్ కోర్సులకు సంబంధించిన పరిచయ పాఠాలు ఉండనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఐటీ తదితర కోర్సులకు సంబంధించి 12 గంటల బోధన ఉండనుంది. ఏఐతో సహా మొత్తంగా 9 కోర్సులకు సంబంధించిన పరిచయ పాఠాలు బోధిస్తారు. ఇందులో 15 మార్కులు థియరీకి, 35 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఉంటాయి. కొత్త సబ్జెక్టులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిజికల్ యాక్టివిటీ ట్రైనర్ సబ్జెక్టులు కలుపుకొని సెకండరీ స్థాయిలో 18 సబ్జెక్టులు అందుబాటులోకి రానున్నాయి. సీనియర్ సెకండరీ స్థాయిలో 40 సబ్జెక్టులను అందుబాటులోకి తెచ్చింది. అయితే సెకండరీ స్థాయిలో విద్యార్థులు తమ తప్పనిసరి సబ్జెక్టులైన లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్‌తోపాటు ఆరో (అదనపు) సబ్జెక్టును (స్కిల్ సబ్జెక్టుగా) ఎంచుకోవాల్సి ఉంటుంది. సీనియర్ సెకండరీ స్థాయిలో సబ్జెక్టు–1గా లాంగ్వేజ్–1, సబ్జెక్టు–2గా లాంగ్వేజ్–2 ఉంటాయి. సబ్జెక్టు–3, 4, 5లుగా రెండు అకడమిక్ సబ్జెక్టులు (ఎలక్టివ్), ఒక స్కిల్ సబ్జెక్టు ఎంచుకోవాలి. లేదా ఒక అకడమిక్ సబ్జెక్టు, రెండు స్కిల్ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదా మూడు స్కిల్ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఆరో అదనపు సబ్జెక్టుగా (ఆప్షనల్) ఒక భాషను లేదా అకడమిక్ సబ్జెక్టును లేదా స్కిల్ సబ్జెక్టును ఎంచుకోవచ్చు. ఇందులో స్కిల్ సబ్జెక్టులో 50 మార్కులు థియరీకి, 50 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించారు. అకడమిక్ సబ్జెక్టుగానే అప్లైడ్ మ్యాథమెటిక్స్ ► 2020–21 నుంచి 11వ తరగతిలో అప్లైడ్ మ్యాథమెటిక్స్ స్కిల్ సబ్జెక్టుగా ఉండదు. అకడమిక్ సబ్జెక్టుగా ఉంటుంది. అలాగే ఎక్స్‌రే టెక్నీషియన్, మ్యూజిక్ ప్రొడక్షన్, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ స్కిల్ సబ్జెక్టులుగా ఉండవు. ► పదో తరగతిలో విద్యార్థులు ఎవరైనా తప్పనిసరి సబ్జెక్టులైన మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌సైన్స్‌లో ఫెయిల్ అయితే ఆరో సబ్జెక్టుగా చదువుకున్న స్కిల్ సబ్జెక్టును అందులో పరిగణనలోకి తీసుకొని పాస్ చేస్తారు. అయితే విద్యార్థి ఫెయిల్ అయిన ఆ సబ్జెక్టు పరీక్ష రాయాలనుకుంటే రాసుకోవచ్చు. -
మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు ఉందా?
సాక్షి, హైదరాబాద్: ‘మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలున్నాయా?’.. అంటూ మీ మొబైళ్లకు ఫోన్లు వస్తే కంగారు పడకండి. కరోనా మహమ్మారి విస్తరణ, వైరస్ వ్యాప్తిపై వాస్తవ పరిస్థితిని, దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే నడుం బిగించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనంతో పాటు వైరస్ ఏ మేరకు వ్యాపించింది, ప్రస్తుత పరిస్థితిని గురించి స్పష్టమైన అంచనాకు వచ్చేందుకు కేంద్రం ఈ పద్ధతిని ఎంచుకుంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారక ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యం (ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్–ఐఎల్ఐ) లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి కరోనా వైరస్ సోకిందా లేదా అని పరీక్షలు నిర్వహించి, ఆ లక్షణాలున్న వారిని ఐసోలేషన్‌కు పంపించాలనేది కేంద్రం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత ప రిస్థితుల్లో సువిశాల దేశంలో కరోనా లక్షణాలున్న వారి గుర్తింపు ప్రక్రియ అసంభవంగా మారిన నేపథ్యంలో అతి పెద్ద టెలిఫోనిక్ సర్వే ద్వారా ఈ పనిని పూర్తిచేయాలని నిర్ణయించింది. అయితే తాము జాతీయ స్థాయిలో ఈ టెలి సర్వేను మొదలుపెట్టడానికి ముందే దీనికి సంబం ధించిన అవగాహన, చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. టాస్క్‌ఫోర్స్ సూచనల మేరకు.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా నిర్వహించే ఈ సర్వేకు 1921 టోల్‌ఫ్రీ నంబర్‌ను కేంద్రం ఉపయోగించబోతోంది. ఈ నంబర్ నుంచి దేశంలోని అన్ని ఫోన్లకు కాల్ చేసి దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలపై సమాచారం సేకరిస్తారు. కరోనా లక్షణాలపై ఆరా తీసేందుకు ప్రభుత్వపరంగా సేకరిస్తున్న సమాచారం కాబట్టి.. ఈ సర్వేలో అందరూ పాల్గొని ఈ వైరస్ లక్షణాల వ్యాప్తి, విస్తరణకు సంబంధించి నిర్దిష్టమైన ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వా లని కోరుతోంది. సర్వే నిర్వహణకు సంబంధించి, దీని ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి కేంద్రం తాజాగా ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. దేశంలో 90 శాతం కుటుంబాలకు మొబైల్ ఫోన్ల సౌకర్యం అందుబా టులో ఉన్నట్టు అంచనా. ఈ నేపథ్యంలోనే టెలి సర్వే సందర్భంగా తమకు లేదా కుటుంబసభ్యులకు కరోనా వైరస్ లక్షణాలున్నాయని వెల్లడించిన పక్షం లో వెంటనే వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు వెల్లడించాయి. నేషనల్ టాస్క్‌ఫోర్స్ సూచనల మేరకు ‘మెగా ఎపిడెమియోలాజికల్ సర్వే’లో భాగంగానే ఈ సర్వేను చేపడు తున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఈ టెలి సర్వే ద్వారా ఐఎల్ఐ లక్షణాలు న్న కేసులను దేశవ్యాప్తంగా ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో వర్గీకరించనున్నారు. ఇలాంటి వాటిలో అనుమానిత కేసులెన్నో గుర్తించి హోంక్వారంటైన్‌కు పరిమితం చేసి, ఆపై వైద్యపరంగా చికిత్స అందించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్ల వినియోగదార్లకు ఫోన్ చేయడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి అనుమానితులతో పాటు ఏ స్ధాయిలో అది విస్తరించిందో అంచనా వేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే సర్వే ఫలితాలపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి మొదలయ్యాక కూడా విదేశాల నుంచి వచ్చిన విషయాన్ని, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్నా వాటిని పలువురు దాచిపెట్టారని, కాబట్టి టెలి సర్వేలో ఏ మేరకు నిజాలు చెబుతారనేది తెలియదని వారంటున్నారు. -
దేశీయ అవసరాలు తీరాకే..!
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుపై భారత్, అమెరికాల మధ్య రగడ మొదలైంది. ఆ మందు వెంటనే తమకు పంపాలని ట్రంప్ కొంతకాలంగా డిమాండ్ చేస్తూండగా.. సోమవారం ఒకడుగు ముందుకేసి భారత్ సరఫరా చేయకపోతే ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారత్ అటు కర్ర విరగకుండా.. ఇటు పామూ చావకుండా అన్నట్లుగా మందుల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. క్లోరోక్విన్ కోసం ఇప్పటికే కొన్ని దేశాలు ఆర్డర్లు ఇచ్చినప్పటికీ పరిస్థితులను బట్టి ఎగుమతులు మొదలుపెడతామని, అది కూడా దేశీయ అవసరాలన్నీ తీరిన తరువాత మాత్రమే జరుగుతుందని కుండబద్దలు కొట్టింది. ‘కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మానవతా దృష్టితో తగు మోతాదులో పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్పత్తికి లైసెన్సులు ఇవ్వాలని భారత్ నిర్ణయించంది. మా సామర్త్యంపై ఆధారపడ్డ ఇరుగు పొరుగు దేశాలకు మందులు అందిస్తాం’అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. మహమ్మారి కారణంగా బాగా దెబ్బతిన్న దేశాలకూ ఈ అత్యవసర మందులు సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ సమాజం పరస్పరం సహకరించుకోవాలన్నదే భారత్ విధానమని, ఇతర దేశాల నుంచి భారతీయులను ఖాళీ చేయించే విషయంలోనూ తాము ఇదే స్ఫూర్తితో వ్యవహరించామని ఆయన వివరించారు. బాధ్యతాయుతమైన దేశంగా ముందు దేశ జనాభాకు తగ్గ మందులు ఉంచుకోవాల్సి ఉంటుందని, ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగానే పాక్షిక నిషేధం విధించామని, పరిస్థితులను సమీక్షించిన తరువాత ఎత్తివేస్తున్నామని చెప్పారు. మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం భారత్ కావడం గమనార్హం. నిస్పృహతోనే బెదిరింపు తమకు కావాల్సిన మందులు సరఫరా చేయని పక్షంలో భారత్‌పై ప్రతిచర్యలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే భారత్ ఎగుమతులపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయడం గమనార్హం. గత ఆదివారమే మోదీతో జరిగిన ఫోన్ సంభాషణల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తమకు సరఫరా చేయాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. తాజాగా ప్రతిచర్యలు ఉంటాయన్న ట్రంప్ వ్యాఖ్య నిస్పృహతో అప్పటికప్పుడు చేసింది మాత్రమేనని భారత్ భావిస్తోంది. వైట్‌హౌస్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఒకవేళ భారత్ ఎగుమతులకు అనుమతించకపోతే ఆది వారి నిర్ణయమని, ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు. -
లాక్డౌన్ కొనసాగింపు?
న్యూఢిల్లీ: ఏప్రిల్ 14 తరువాత కూడా కొంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కరోనాను పూర్తిగా కట్టడి చేసేందుకు అదొక్కటే మార్గమని తెలంగాణ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం ఆ దిశగా సమాలోచనలు చేస్తోందని తెలిపాయి. అయితే, లాక్డౌన్ కొనసాగింపునకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ విషయంలో ఊహాగానాలు చేయొద్దని సూచించారు. మరోవైపు, అన్ని విద్యాసంస్థల మూసివేతతో పాటు, ప్రార్థన స్థలాల్లో ప్రజలు సామూహికంగా పాల్గొనే మత కార్యక్రమాలపై విధించిన ఆంక్షలు మే 15 వరకు కొనసాగాలని దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) మంగళవారం సిఫారసు చేసింది. ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా లేక కొనసాగించినా ఈ నిర్ణయాలను అమలు చేయాలని సూచించింది. ప్రస్తుత లాక్డౌన్ గడువు ముగిసే ఏప్రిల్ 14 తరువాత నెలకొనే పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఆ జీఓఎం చర్చించింది. హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితర మంత్రులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, మతపరమైన కేంద్రాల్లో ఏప్రిల్ 14 తరువాత కనీసం నెల రోజుల పాటు సాధారణ కార్యకలాపాలను ఎట్లిపరిస్థితుల్లో అనుమతించకూడదని జీఓఎం సిఫారసు చేసింది. మత ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ తదితర బహిరంగ ప్రదేశాలపై డ్రోన్లతో సునిశిత పర్యవేక్షణ పెట్టాలని సూచించింది. ఎలాగూ వేసవి సెలవులు ఉంటాయి కనుక జూన్ చివరి వరకు విద్యా సంస్థలను మూసేయడమే సరైన నిర్ణయమని ప్రభుత్వం భావిస్తోంది. కరోనాపై తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రాలు ఇచ్చే సమాచారమే కీలకమని జీఓఎం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. నిత్యావసర వస్తువుల సరఫరాపై కూడా భేటీలో చర్చించారని, దేశంలో ఎక్కడా వాటి రవాణాకు అడ్డంకులు ఏర్పడలేదని సంబంధిత మంత్రి వివరించారని అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితిపై లోతైన చర్చ జరిపామని జీఓఎం భేటీ అనంతరం రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. 40 కోట్ల మంది మరింత పేదరికంలోకి.. కరోనా వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో మార్చ్ 25 నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా భారత్‌లో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు మరింత పేదరికంలోకి వెళ్లే ప్రమాదముం దని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. మరోవైపు, ఆల్కహాల్ ఉత్పత్తులను అమ్మేందుకు అనుమతించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) తెలంగాణ, కర్నాటక, రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, యూపీ సహా 10 రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. -
లాక్డౌన్ దశలవారీగా సడలింపు!
ముంబై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్లో శనివారంతో సగం రోజులు పూర్తయ్యాయి. 21 రోజులు పూర్తయ్యాక లాక్డౌన్ ఉంటుందా లేదా అనే దానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలిస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైలు, విమానయాన సంస్థలు సంకేతాలిస్తున్నాయి. దేశంలో రైల్వే సర్వీసుల పునరుద్ధరణపై ఇప్పటికైతే తుది నిర్ణయం తీసుకోలేదని, కొన్ని రోజుల తర్వాత తీసుకునే అవకాశముందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేస్తే రైళ్లను నడిపేందుకు రైల్వే జోనల్ ఆఫీస్‌లు సిద్ధమవుతున్న వేళ ఈ ప్రకటన వచ్చింది. ‘రైల్వే బోర్డు ఒక్కో రైలుకు నిర్దిష్టంగా అనుమతి ఇచ్చాకే సర్వీసుల్ని నడుపుతాం. దశలవారీగా రైల్వే సర్వీసులను ఎలా పునరుద్ధరించాలన్న అంశంపై రైల్వే బోర్డుకు సూచనలిచ్చాం’ అని అధికారులు తెలిపారు. లాక్డౌన్ పర్యవేక్షణకు ఏర్పాటైన మంత్రుల బృందం ఓకే చెప్పాకే రైల్వే సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. దేశంలోని 17 రైల్వేజోన్లలో అందుబాటులో ఉన్న బోగీల ఆధారంగా ఎలాంటి సర్వీసుల్ని ముందుగా పునరుద్ధరించాలన్న అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఒకవేళ సర్వీసులను పునరుద్ధరించినా ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. తమ విమానాల బుకింగ్‌లు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఆసియా ఇండియా సంస్థ ప్రకటించింది. అయితే, డీజీసీఏ మార్గదర్శకాలను బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను పున:ప్రారంభిస్తామని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. దేశీయ విమాన సర్వీసులకు గాను ఏప్రిల్ 15 నుంచి బుకింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నట్లు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి మే 1 నుంచి టిక్కెట్లు విక్రయిస్తామని స్పైస్‌జెట్, గోఎయిర్ స్పష్టం చేశాయి. ప్రజలు సహకరించే విధానాన్ని బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిశాక ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్న దానిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారులతో చర్చించారు. -
కరోనా అలర్ట్ @ ‘ఆరోగ్యసేతు’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై ఇప్పటికే లాక్డౌన్ యుద్ధం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా డిజిటల్ వార్‌కు దిగింది. వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవల్సిన జాగ్రత్తలు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య, అప్డేట్స్ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ‘ఆరోగ్యసేతు’యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెండ్రోజుల క్రితం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా ఈ యాప్ వినియోగంలోకి వచ్చింది. ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి.. రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ విరుగుడుకు ఇంకా మందు రాలేదు. అవగాహనతోనే దీనిని ఎదుర్కోగలమని చెబుతోన్న ప్రభుత్వం.. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్యేకంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ► ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘ఆరోగ్య సేతు’పేరు నమోదు చేసిన వెంటనే యాప్ కనిపిస్తుంది. సూచనల ఆధారంగా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ► జీపీఎస్ ఆధారంగా లొకేషన్ ఎంపిక చేసుకున్నాక మొబైల్ నంబర్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ► ప్రస్తుతం 11 భాషల్లో యాప్ అందుబాటులో ఉంది. జీపీఎస్, బ్లూటూత్ నిరంతరం ఆన్‌లో ఉండాలి. అప్పుడే ఈ యాప్ కరోనా సమాచారం, స్థానిక వివరాలు అందిస్తుంది. అప్రమత్తం చేస్తుందిలా.. ► యాప్‌ను ఇప్పటివరకు 10లక్షల మందికిపైగా ఇన్స్టాల్ చేసుకున్నారు. యూజర్లు 4.6 పాయింట్ల రేటింగ్ ఇచ్చారు. 13,330 మంది సానుకూలమైన రివ్యూలు రాశారు. ► ఈ యాప్ కరోనా బారిన పడ్డవారెవరైనా మీ సమీపంలోకి వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ► కరోనా వైరస్ దుష్ప్రభావాలను ఎలా గుర్తించాలో అవగాహన కల్పిస్తూనే సెల్ఫ్ ఐసోలేషన్ ఎలా పాటించాలో సూచిస్తుంది. -
వైరస్ హాట్ స్పాట్స్ పెరుగుతున్నాయి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ కశ్మీర్, బీహార్‌లతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ మంగళవారం కొత్తగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 1397కు, మరణాల సంఖ్య 35కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 146 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. ప్రజలు సహకరించకపోవడంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ హాట్‌స్పాట్స్ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ బారిన పడ్డవారు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు, ఈ హాట్‌స్పాట్స్‌ను దిగ్బంధించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మంగళవారం తెలిపారు. అయితే, ఈ విషయంలో ప్రజలు మరింత సహకారం అందించాలని కోరారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 72 కొత్త కేసులు నమోదు కాగా ఇందులో 59 ముంబైలోనే ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేరళలోనూ ఏడు కొత్త కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 215కు చేరుకుంది. కోవిడ్ కారణంగా కేరళలో మంగళవారం మరొకరు చనిపోయారు. పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలోనూ మరణాలు సంభవించాయి. కోవిడ్ బారిన పడ్డ వారికి సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి తగినన్ని రక్షణ పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, విదేశీ వ్యవహారాల శాఖ దక్షిణ కొరియా, టర్కీ, వియత్నాంల్లో సరఫరాదారులను గుర్తించిందని లవ్ అగర్వాల్ తెలిపారు. కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రుల బృందం నిర్ణయించిందన్నారు. ఏ రాష్ట్రమైనా విజ్ఞప్తి చేస్తే లాక్డౌన్ నిబంధనలను అమలు చేసేందుకు పారామిలటరీ బలగాలను దింపే విషయంపై ఆలోచిస్తామని హోంశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీవాస్తవ తెలిపారు. తమిళనాడులో మంగళవారం ఒక్కరోజే 57 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మతప్రార్థనలకు హాజరైన వారు 50 మంది ఉన్నారు. వీసా నిబంధనలను అతిక్రమిస్తే.. భారతీయ వీసా నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలుంటాయని కేంద్రం హెచ్చరించింది. వీసా నిబంధనలను అతిక్రమించి భారత్‌కు వచ్చిన వారిపై కఠిన చర్యలుంటాయని, వారిని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని పేర్కొంది. -
కరోనా మృతదేహాల నిర్వహణ ఇలా..!
న్యూఢిల్లీ: కోవిడ్–19తో మరణించిన వారి మృతదేహాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం అంతగా లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, మృతదేహం వద్ద పనిచేసే వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల నిర్వహణకు సంబంధించి పలు మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. వాటిలో ముందు జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్ నివారణ, వాతావరణం వైరస్‌తో కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మొదలైనవి ఉన్నాయి. ‘దగ్గు, తుమ్ము సమయంలో వెలువడే డ్రాప్లెట్స్ కారణంగానే కరోనా వైరస్ ప్రధానంగా వ్యాపిస్తుంది. మృతదేహం ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. అయితే, వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పోస్ట్‌మార్టం సమయంలో మృతదేహంలోని ఊపిరితిత్తుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది’ అని అందులో వివరించారు. శ్మశానాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్‌లు, గ్లవ్స్‌ను వినియోగించడం వంటి నిర్ధారిత జాగ్రత్తలు తీసుకోవాలని శ్మశానంలోని సిబ్బందికి వివరించాలన్నారు. మృతదేహాన్ని ముట్టుకోకుండా చివరి చూపు చూడొచ్చని, ఇతర మతపరమైన ప్రక్రియలు కూడా నిర్వహించవచ్చని వివరించారు. మృతదేహానికి స్నానం చేయించడం, హత్తుకోవడం, ముట్టుకోవడం మాత్రం చేయవద్దని హెచ్చరించారు. అంత్యక్రియల అనంతరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా శుభ్రంగా స్నానం చేయాలని సూచించారు. అయితే, అంత్యక్రియలకు పెద్ద ఎత్తున హాజరుకావడం మంచిది కాదని పేర్కొన్నారు. మత సంప్రదాయాల ప్రకారం నదీజలాల్లో కలిపేందుకు మృతదేహానికి సంబంధించిన బూడిదను సేకరించవచ్చని, దాని వల్ల వైరస్ వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. -
రైలు బోగీల్లో ఏసీ 25 డిగ్రీలే..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజా రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో సాధారణంగా ఏసీ బోగీల్లో ఉష్ణోగ్రత 17, 18 డిగ్రీలుగా ఉండేలా చూస్తారు. కానీ కోవిడ్ వైరస్ నేపథ్యంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండొద్దని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఏసీ బోగీల్లో ఉండే కర్టెన్లు అన్నింటినీ తొలగించాలని ఆదేశించింది. కర్టెన్లను నిత్యం మార్చరు. కొన్ని రైళ్లలో పక్షం రోజులకోసారి, కొన్నింటిలో నెలకోసారి మార్చి ఉతికినవి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత పరిస్థితిలో అవి ఉండటం క్షేమం కాదని అధికారులు నిర్ణయించారు. అలాగే ఏసీ బోగీల్లో సాధారణ బెడ్షీట్లను అందుబాటులో ఉంచుతారు. వాటిని నిత్యం మార్చి ఉతికిన జతను సరఫరా చేస్తున్నందున వాటిని అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు ఇచ్చే బ్లాంకెట్లను మాత్రం తొలగించారు. వీటిని రోజూ ఉతకరు. మరీ చలిని తట్టుకోలేని వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మాత్రం రెండు మూడు ఉతికి శుభ్రంగా ఉన్నవి అందుబాటులో ఉంచుతారు. ఇక రైళ్లను అప్పటికప్పుడు శుభ్రపరిచే చర్యలు తీసుకుంటున్నారు. టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని, అక్కడ చేతులు కడుక్కోవడానికి వీలుగా సబ్బు ద్రావణం, ఇతర క్రిమి సంహారక ద్రావణాలు ఉంచాలని రైల్వే శాఖ ఆదేశించింది. -
హోం ఐసోలేషన్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా (కోవిడ్–19) అనుమానితులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఎలాంటి కోవిడ్ అనుమానిత లక్షణాలు లేకపోయినా హోం ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. హోం ఐసోలేషన్‌లో ఉండే వారి కోసం కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటంటే.. ►ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ లక్షణా లు లేకపోయినా ఇంట్లో గాలి వెలుతురు ఉన్న గదిలో ఐసోలేషన్(ఒంటరిగా) ఉండాలి. ఈ విషయంలో కుటుంబసభ్యులు వారికి సహకరించాలి. ►వారికి సాయంగా కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంతో ఉన్న వ్యక్తిని కేటాయించాలి ►ఇతర కుటుంబ సభ్యులు వేరే గదిలో ఉండాలి. అది సాధ్యం కాకపోతే, ఆ వ్యక్తికి కనీసం ఒక మీటర్ దూరంలో ఉండాలి ►బాధితుడు ముఖానికి సురక్షితమైన మెడికల్ మాస్క్ ధరించాలి. ►మాస్క్‌లు తడిగా లేదా మురికిగా ఉంటే వెంటనే మార్చాలి ►ఆరు గంటలు ఉపయోగించిన తర్వాత మాస్క్‌ను తీసేయాలి. దాన్ని తొలగించిన తర్వాత చేతిని శుభ్రంగా కడుక్కోవాలి ►ఇంట్లోవారు కూడా ఏదైనా పనిచేశాక చేతిని సబ్బుతో కడుక్కోవాలి. అందుబాటులో ఉంటే టిష్యూ పేపర్లను వాడాలి. ►క్లినికల్ పరీక్షలో వారికి లక్షణాలు లేవని నిర్ధారించే వరకు ఆ వ్యక్తులు ఇంట్లోనే ఉండాలి ►బెడ్లను, ఇతర çఫర్నీచర్‌ను, బాత్రూమ్లను తరచూ తాకినప్పుడు వాటిని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి ►బాధితుడిని 14 రోజులపాటు ఈ జాగ్రత్తలు పాటించాలని కోరాలి ►అతనికి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్య వస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి ►ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్లకు ఫోన్ చేసి వివరాలు చెప్పాలి. -
రోడ్డు భద్రతకు రూ. 400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా రూ.500 కోట్ల వరకు రానున్నాయి. ఏప్రిల్ నుంచి దాదాపు ఐదేళ్ల వరకు ఈ నిధులు అందనున్నాయి. గురువారం రాష్ట్ర రోడ్‌సేఫ్టీ విభాగం చైర్మన్ క్రిష్ణప్రసాద్ నేతృత్వంలో ప్రపంచబ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రోడ్డు భద్రత విభాగం ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను డీజీపీ క్రిష్ణప్రసాద్ వారికి వివరించారు. ప్రమాదాలకు కారణంగా నిలుస్తోన్న అతివేగం, బ్లాక్స్పాట్లు, నిర్లక్ష్యం తదితర అంశాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తోన్న ఈ బృంద సభ్యులు తెలంగాణ రోడ్‌సేఫ్టీ విధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బృందం నివేదిక ఆధారంగా ఏప్రిల్ నుంచి రోడ్‌సేఫ్టీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏటా రూ.400 నుంచి 500 కోట్ల వరకు ప్రత్యేక గ్రాంటును అందజేయనుంది. ఎన్ఆర్ఎస్పీపై ప్రశంసల వర్షం.. దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం డీజీపీ క్రిష్ణప్రసాద్‌ను నివేదిక రూపొందించమని కోరింది. 6 నెలలపాటు దేశంలోని రోడ్లు, ప్రమాదాలపై అధ్యయనం చేసిన క్రిష్ణప్రసాద్ నేషనల్ రోడ్‌సేఫ్టీ ప్లాన్ (ఎన్ఆర్ఎస్పీ)కి రూపకల్పన చేశారు. దానికి రూ.3,000 కోట్ల మూలధనం, ఏటా రూ.2,000 కోట్ల నిర్వహణ వ్యయంతో ప్రత్యేక నేషనల్ హైవే పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను గురువారం జరిగిన సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులకు వివరించారు. దేశంలో ఎన్ఆర్ఎస్పీ అమల్లోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ఏడీజీ రైల్వేస్ అండ్ రోడ్‌సేఫ్టీ సందీప్ శాండిల్య, జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు. -
శాస్త్ర శిఖరాలు
స్త్రీని వంటింటికే పరిమితం చేస్తే ఆ వంట దినుసులతోనే ప్రయోగాలు చేసి దేశానికి పౌష్టికత్వాన్ని ఇచ్చింది. స్త్రీని చదువుకోనిస్తే కుటుంబానికే వెలుతురు ఇచ్చింది. స్త్రీ ఇంటి నుంచి ప్రయోగశాల వరకు చేరడానికి చాలాకాలమే పట్టింది. కానీ శాస్త్రాన్వేషణలో స్త్రీ దృష్టి తిరుగులేనిదని పదే పదే నిరూపితమైంది. మగవారి ప్రభావం అధికంగా ఉండటం వల్ల చాలామంది మహిళా శాస్త్రవేత్తలు అజ్ఞాతంలోనే ఉండిపోవలసి వచ్చింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సైన్స్‌లో విశేష సేవలు చేసి ఎందరో బాలికలు ఆ రంగం వైపు అడుగుపెట్టేలా నిలిచిన 11 మంది శాస్త్రవేత్తలను గౌరవించుకునేందుకు వారి పేరున కేంద్ర ప్రభుత్వం అధ్యయన పీఠాలను స్థాపించనుంది. ఇది గత నూరేళ్ల కాలంలో స్త్రీలు శాస్త్రవేత్తలుగా చేసిన కృషికి ఒక సత్కారం. ఒక అభివాదం. బిభా చౌదురి (1913–1991) ఫిజిక్స్ ఆమె పేరును ఓ నక్షత్రానికి పెట్టారు. సెక్స్‌టాన్స్ నక్షత్ర మండలంలోని ‘హెచ్డీ 86081’ నక్షత్రానికి ఇంటర్నేషనల్ అస్ట్రనామికల్ యూనియన్ బిభా చౌదురి పేరు పెట్టింది. కోల్‌కతాలో జన్మించి అక్కడి యూనివర్శిటీలో ఫిజిక్స్ అభ్యసించిన బిభా 1939లో ప్రఖ్యాత బోస్ ఇన్స్టిట్యూట్లో చేరారు. అక్కడ దేవేంద్ర మోహన్ బోస్‌తో కలిసి ప్రాథమిక కణమైన బోసాన్లను గుర్తించారు. మాంచెస్టర్ యూనివర్శిటీలో పరిశోధనలు చేశాక భారత్ తిరిగి వచ్చి టాటా ఇన్‌న్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఎనిమిదేళ్లపాటు పని చేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ పరిశోధనల్లోనూ కీలకపాత్ర పోషించారు. కోల్‌కతాలోని సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో భౌతికశాస్త్ర పాఠాలు చెప్పారు. 1991లో మరణించేంత వరకూ పరిశోధనలు కొనసాగించిన బిభాను ‘జాతి మరచిన ఆణిముత్యం’గా పేర్కొంటారు. అసిమా ఛటర్జీ (1917–2006) కెమిస్ట్ మూర్ఛ వ్యాధితోపాటు, మలేరియా చికిత్సకు ఉపయోగించే మందుల తయారీలో కీలకపాత్ర పోసించిన అసిమా ఛటర్జీ బెంగాల్లో జన్మించి తండ్రి ఇష్టం మేరకు వృక్షశాస్త్రంలో ఉన్నత విద్య ను అభ్యసించారు. దేశంలో సైన్స్‌లో డాక్టరల్ డిగ్రీ పొందిన తొలి మహిళగా 1944లో రికార్డు సస్టించారు. దిగ్గజ శాస్త్రవేత్తలుగా ఖ్యాతి గడించిన ప్రఫుల్ల చంద్ర రాయ్, సత్యేంద్రనాథ్ బోస్‌ల మార్గదర్శనంలో విస్కాన్సిన్, కాల్‌టెక్‌లలో పరిశోధనలు నిర్వహించారు. ప్రకృతి సహజమైన ఉత్పత్తుల రసాయన ధర్మాలపై పని చేసిన అసిమా చక్రవర్తి, కీమోథెరపీ మందులు కూడా అభివృద్ధి చేశారు. సుమారు 400 పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. 1975లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్‌గానూ వ్యవహరించారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు కూడా. రాజేశ్వరి ఛటర్జీ (1922–2010) ఇంజినీరింగ్ కర్ణాటక నుంచి ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన తొలి మహిళ రాజేశ్వరి ఛటర్జీ. బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో బీఎస్సీ హానర్స్, గణితంలో ఎమ్మెస్సీ చదివి మైసూరు యూనివర్శిటీ పరిధిలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 1943లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో పరిశోధక విద్యార్థిగా చేరారు. సమాచార ప్రసార రంగంలో పరిశోధనలు ప్రారంభించి నోబెల్ అవార్డు గ్రహీత సర్ సి.వి.రామన్ నేతృత్వంలో పనిచేశారు. 1947 జూలై నెలలో అమెరికా వెళ్లి అక్కడి మిషిగన్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యనభ్యసించారు. పీహెచ్డీ తరువాత భారత్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో చేరి దేశంలో తొలిసారి సూక్ష్మ తరంగాలపై పరిశోధనలు చేపట్టారు. సైన్స్ పుస్తకాలు రాశారు. వసుధైక కుటుంబకం పేరుతో రాజేశ్వరి కొంతమంది మహిళలు, పురుషులకు సంబంధించిన వాస్తవ కథనాలను అక్షరబద్దం చేయడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. అన్నా మణి (1918–2001) మెటరాలజిస్ట్ భౌతిక, వాతావరణ శాస్త్రవేత్తగా అన్నా మణి చిరపరిచితురాలు. వాతావరణ శాస్త్రానికి ఉపయోగపడే పలు పరికరాల తయారీలో కీలకపాత్ర పోషించారు. సూర్యుడి రేడియోధార్మికత, ఓజోన్లతోపాటు పవనశక్తిని కొలిచే విషయంపై పలు పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. తమిళనాడులోని రామనాథపురంలో పుట్టిన అన్నా మణి మద్రాస్‌లోని పాచియప్ప కాలేజీ నుంచి భౌతికశాస్త్ర, రసాయన శాస్త్ర విద్యను అభ్యసించారు. 1940లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఆ తరువాత లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలోనూ చదువుకున్నారు. ఇంపీరియల్ కాలేజీలో ఉండగానే వాతావరణ శాస్త్ర పరికరాల తయారీపై మక్కువ పెంచుకున్నారు. మహాత్మాగాంధీ, జాతీయోద్యమ స్ఫూర్తితో వాతావరణ పరిశోధనల విషయంలో దేశం స్వావలంబన సాధించాలని నిర్ణయించుకున్న అన్నా మణి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సుమారు వంద పరికరాల డిజైన్లను సిద్ధం చేశారు. తుంబా రాకెట్ స్టేషన్లో వాతావరణ కేంద్రం ఏర్పాటు చేయడంలో అన్నా మణిదే కీలకపాత్ర. అవివాహితగానే మిగిలిపోయిన అన్నా మణి 1969లో భారత వాతావరణ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1975లో ప్రపంచ వాతావరణ విభాగం సలహాదారుగా ఈజిప్టులో పనిచేశారు కూడా. దర్శన్ రంగనాథన్ (1941–2001) ఆర్గానిక్ కెమిస్ట్ హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డిప్యూటీ డైరెక్టర్ (1998–2001)గా పనిచేసిన దర్శన్ రంగనాథన్ కృత్రిమ రసాయన మూలకాలు, హైబ్రిడ్ పెప్టైడ్, నానోట్యూబుల తయారీలో నిష్ణాతులు. సేంద్రీయ రసాయన శాస్త్రవేత్త. ఢిల్లీకి చెందిన దర్శన్ మర్కాన్ అక్కడే పీహెచ్డీ వరకూ చదివారు. ఆ తరువాతి కాలంలో కాన్పూర్ ఐఐటీలో ఉండగా.. సహ విద్యార్థి సుబ్రమణియ రంగనాథన్‌ను వివాహమాడి పలు పుస్తకాలు రచించారు. 1993లో త్రివేండ్రంలోని రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో చేరిన దర్శన్ ఆ తరువాత 1998లో ఐఐసీటీకి డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రకృతిలో జరిగే రసాయన ప్రక్రియలను పరిశోధనశాలల్లో కృత్రిమంగా సృష్టించడం.. తద్వారా మానవాళికి ఉపయోగపడే పదార్థాలను సష్టించడం దర్శన్ పరిశోధనల ప్రత్యేకత. 1997లో రొమ్ము కేన్సర్ బారిన పడ్డ దర్శన్ 2001లో తన పుట్టిన రోజైన జూన్ నాలుగున మరణించారు. ఫార్మా రంగంలో కీలకమైన ఐమిడజోల్ ఉత్పత్తికి ప్రత్యేక పద్ధతిని అభివృద్ధి చేశారు. కమల్ రణదివే (1917–2001) మెడిసిన్ కేన్సర్‌కు వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాలను మొట్టమొదట గుర్తించిన బయో మెడికల్ రీసెర్చర్ కమల్ రణదివే. ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు. మహారాష్ట్రలోని పుణేలో జన్మించిన కమల్ రణదివే ప్రతిభావంతురాలైన విద్యార్థి కూడా. వైద్యం చదవాలి, వైద్యుడినే పెళ్లి చేసుకోవాలని తండ్రి ఆశించినా కమల్ మాత్రం వృక్ష, జంతుశాస్త్రాలను చదువుకున్నారు. 1934లో బీఎస్సీ, ఆ తరువాత పుణేలోని అగ్రికల్చర్ యూనివర్శిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 1943లో సైటోజెనిటిక్స్‌లో ఉన్నత విద్యనభ్యసించిన కమల్ జె.టి.రణదివేను పెళ్లి చేసుకున్న తరువాత ముంబై వెళ్లిపోయారు. అక్కడే టాటా మెమోరియల్ ఆసుపత్రిలో పని చేయడం మొదలుపెట్టారు. 1949లో బాంబే యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ అందుకున్న తరువాత బాల్టీమోర్ యూనివర్శిటీ నుంచి పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ పొందారు. భారత్ తిరిగి వచ్చిన తరువాత ఇండియన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. లుకేమియా, రొమ్ము, గొంతు కేన్సర్లకు కారణాలను గుర్తించడంలో కీలకపాత్ర పోషించారు. కేన్సర్ కణితులకు, వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించారు. బ్యాక్టీరియాపై కమల్ చేసిన పరిశోధనల ఆధారంగా కుష్టువ్యాధికి టీకా తయారీ వీలైంది. రామన్ పరిమళ (పుట్టింది 1948 నవంబరు 21) మేథమెటిక్స్ ఆల్జీబ్రా పేరుచెప్పగానే చాలా మంది మనసులో గాభరా మొదలు కావచ్చునేమోగానీ.. రామన్ పరిమళ మాత్రం అందులోనే పుట్టి పెరిగారనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఏళ్లుగా పనిచేస్తున్న ఈ మహిళ గణిత శాస్త్రవేత్త ఎమొరీ యూనివర్శిటీలోనూ ప్రత్యేక అధ్యాపకురాలిగా సేవలందిస్తున్నారు. తమిళనాడులో పుట్టి మద్రాస్‌లోని శారద విద్యాలయ, స్టెల్లా మేరిస్కాలేజీల్లో చదువుకున్న పరిమళ మద్రాస్ యూనివర్శిటీ నుంచి ఎమ్మెస్సీ, ముంబై యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ పొందారు. కదంబిని గంగూలీ (1861–1923) డాక్టర్ దేశంలోనే రెండో మహిళా వైద్యురాలిగా కదంబిని గంగూలీ ప్రసిద్ధురాలు. బ్రిటిష్ కాలంలో బిహార్‌లోని భాగల్పూర్లో జన్మించిన కదంబిని తండ్రి బ్రజ కిశోర్ బసు ఆ కాలంలోనే మహిళ విముక్తి కోసం పోరాటాలు నిర్వహిచిన వ్యక్తి. 1863లోనే భాగల్పూర్ మహిళ సమితి పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. బంగ మహిళా విద్యాలయలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత 1878లో కోల్‌కతా యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష పాసై ఆ çఘనత సాధించిన తొలి మహిళగానూ కదంబిని రికార్డు సృష్టించారు. తరువాతి కాలంలో కలకత్తా మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించిన ఆమె 1886లో ఆనందీ గోపాల్ జోషీ తరువాత వైద్యురాలైన రెండో మహిళగా గుర్తింపు పొందారు. 1892లో ఎడిన్‌బరో, గ్లాస్గౌ, డబ్లిన్‌లలో ఉన్నత విద్య అభ్యసించిన తరువాత భారత్ తిరిగి వచ్చారు. బ్రహ్మ సమాజ్ కార్యకర్త ద్వారకనాథ్ గంగూలీని వివాహమాడిన కదంబిని పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1889 నాటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించిన ఐదుగురు మహిళల్లో కదంబిని ఒకరు. తన సామాజిక కార్యక్రమాలు, మహిళా విముక్తి పోరాటాలపై సాంఘిక విమర్శలకు గురైనా ఆమె ఉక్కు సంకల్పం మాత్రం సడలలేదు. తనను అనకూడని మాటలతో నిందించిన బంగబషీ పత్రికను కోర్టుకీడ్చి ఆ పత్రిక ఎడిటర్ మహేశ్ పల్కు ఆరునెలల జైలు శిక్ష పడేలా చేసిన ధీర వనిత కదంబిని గంగూలీ. ఇరావతి కర్వే (1905–1970) ఆంథ్రోపాలజీ మానవ విజ్ఞాన శాస్త్రంలో దిగ్గజ శాస్త్రవేత్త ఇరావతి కర్వే. మహారాష్ట్రకు చెందిన ఈ మహిళా శాస్త్రవేత్త మహాభారతంలోని పాత్రలను దేవుళ్లుగా కాకుండా చారిత్రక పురుషులుగా భావించి వారి ప్రవర్తన, వ్యక్తిత్వాల ఆధారంగా ఆ కాలం నాటి సమాజాన్ని అధ్యయనం చేశారు. పుణేలోని హుజుర్ పాగాలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత ఫెర్గూసన్ కాలేజీలో ఫిలాసఫీ చదువుకున్నారు. తండ్రి ఇష్టాన్ని కాదని దినకర్ ధోండో కర్వేను వివాహమాడిన ఇరావతి భర్త సలహా మేరకు జర్మనీకి వెళ్లి పెద్ద చదువులు చదివారు. ఖైసర్ వైహెల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ, హ్యుమన్ హెరిడిటీ అండ్ యుజెనిక్స్‌లో డాక్టరేట్ సాధించి తిరిగి వచ్చారు. నాస్తికుడైన భర్త ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు. దేశంలోనే తొలి మహిళా మానవ విజ్ఞాన శాస్త్రవేత్తగా ఇరావతికి రికార్డు ఉంది. జానపదాలను సేకరించడం, వాటిని స్త్రీవాద కవిత్వంగా మలచడం ఇరావతి ఇష్టపడ్డ వ్యాసంగం. దేశంలో రాజరిక వ్యవస్థలపైనా పరిశోధనలు చేసిన ఇరావతి హిందు సమాజంపైనా విస్తృత అధ్యయనాలు నిర్వహించారు. మహాభారత పాత్రల ప్రవర్తన, వ్యక్తిత్వాల ఆధారంగా ఆ కాలపు పరిస్థితులపై యుగాంత పేరుతో తనదైన అంచనా ఇచ్చారు. అర్చన శర్మ (1932–2008) సైటోజెనెటిసిస్ట్ విషతుల్యమైన ఆర్సెనిక్ ప్రభావాన్ని మొట్టమొదట అంచనా వేసి ప్రపంచానికి అందించిన జీవకణ శాస్త్రవేత్తగా అర్చన శర్మ సుప్రసిద్ధులు. పుణేలోని విద్యావేత్తల కుటుంబంలో జన్మించిన అర్చన రాజస్థాన్, కోల్‌కతాల్లో విద్యనభ్యసించారు. 1955లో కోల్‌కతా యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ చేసిన తరువాత మానవ జన్యు శాస్త్రం, పర్యావరణ ప్రభావాలు తదితర అంశాలపై విస్తృతమైన అధ్యయనం చేశారు. దేశంలో డాక్టర్ ఆఫ్ సైన్స్ బిరుదు (1960) పొందిన రెండో భారతీయ మహిళగా రికార్డు సష్టించారు. కోల్‌కతా యూనివర్శిటీలోనే ప్రొఫెసర్‌గా పనిచేసి ఆ తరువాత 1983లో యూనివర్శిటీ వృక్షశాస్త్ర విభాగానికి అధ్యక్ష స్థానానికి ఎదిగారు. సుమారు 70 మంది పీహెచ్డీ విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించిన అర్చన శర్మ యూజీసీలో, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ టాస్క్‌ఫోర్స్ ఛైర్ పర్సన్‌గా సేవలందించారు. పదికిపైగా పుస్తకాలు రచించి 300 – 400 పరిశోధన వ్యాసాలు ప్రచురించిన అర్చనశర్మ దేశంలో కణ జీవశాస్త్ర విభాగానికి ఆద్యుడిగా భావించే అరుణ్ కుమార్‌శర్మను వివాహం చేసుకున్నారు. జానకీ అమ్మళ్ (1897 – 1984) బోటనిస్ట్ కేరళ అడవులను జల్లెడ పట్టి వాణిజ్యపరంగానూ, ఔషధాలుగానూ ఉపయోగపడే పలు మొక్కలను అందరికీ అందించిన ఘనత వృక్ష శాస్త్రవేత్త జానకీ అమ్మళ్ ఎడలావత కక్కత్ది. ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం దేశంలో సాగవుతున్న చక్కెర వంగడాల అభివృద్ధి జానకీ అమ్మళ్ హయాంలోనే మొదలయ్యాయని చెప్పవచ్చు. మొక్కల వర్గీకరణ మొదలుకొని కణజీవశాస్త్రంలోనూ అమూల్యమైన సేవలందించి పద్మశ్రీ అవార్డుకు వన్నె తెచ్చిన మహిళా శాస్త్రవేత్త. చెరకు, వంగ వంటి పంటలపై జానకీ అమ్మళ్ నిర్వహించిన పరిశోధనలు, వాటి ఫలితాలు ఇప్పటికీ అనుసరణీయమైనవే. క్రోమోజోమ్స్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ పేరుతో సి.డి.డార్లింగ్టన్తో కలిసి ప్రచురించిన పుస్తకం ప్రపంచవ్యాప్త పరిశోధన సంస్థలకు బైబిల్ లాంటిది అంటే అతిశయోక్తి కాదు. మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీ తరువాత 1924లో అమెరికాలోని మిషిగన్‌లో స్నాతకోత్తర విద్య తరువాత కొన్నేళ్లపాటు మద్రాస్‌లోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేశారు. త్రివేండ్రంలోని మహారాజాస్ కాలేజ్ ఆఫ్ సైన్స్, చక్కెర వంగడాభివృద్ధి కేంద్రం (కోయంబత్తూరు)ల్లోనూ పనిచేశారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటన్‌లో చిక్కుకుపోయిన జానకీ అమ్మళ్ అక్కడే డాక్టర్ సి.పి.డార్లింగ్టన్తో కలిసి పరిశోధనలు కొనసాగించారు. మీకు తెలుసా.. దేశంలో పలు కొత్త వంగడాల అభివృద్ధికి కృషి చేసిన జానకీ అమ్మళ్ పేరుతోనే ఓ రోజా పువ్వు వంగడమూ ఉందని! 1977లో పద్మశ్రీ అవార్డు అందుకున్న జానకీ అమ్మళ్ పేరుతో పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక అవార్డు కూడా ఏర్పాటు చేసింది. -
కోవిడ్‌పై మరింత అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ తదితర దేశాలకూ వైరస్ వ్యాప్తి చెందడంతో కేంద్రప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు చేసిన మార్గదర్శకాలకు అదనంగా కొన్ని సూచనలు చేసింది. ఇప్పటివరకు చైనా, హాంకాంగ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైనే ప్రత్యేకంగా దృష్టి సారించగా, ఇప్పుడు అదనంగా దక్షిణ కొరియా, జపాన్, వియత్నాం, ఇటలీ, ఇరాన్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకల నుంచి వచ్చే ప్రయాణికులపైనా కూడా కేంద్రీకరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్లి, అక్కడి నుంచి వచ్చేవారు నేరుగా ఇళ్లకు వెళ్తున్నారని, వారిలో ఎవరికైనా కోవిడ్ అనుమానిత లక్షణాలుంటే గుర్తించాలని, వారి వివరాలు సేకరించాలని ప్రత్యేక ఆదేశాలు ఇ చ్చింది. కేవలం చలి ప్రదేశాల్లో మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల్లోనూ వైరస్ బలపడుతుందన్న భావనలో వైద్య ఆరోగ్యశాఖ ఉంది. వుహాన్ నగరంలో చలి తీవ్రత అధికంగా ఉండటం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందన్న భావనతో ఇప్పటివరకు ఉన్న అధికారులు, అది కాస్తా ఉష్ణోగ్రత అధికంగా ఉండే కొన్ని దేశాలకు పాకడంతో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని కేంద్రం స్పష్టం చేసినట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్‌లో గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో మాత్రమే వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక పడకలను ఏర్పాటు చేసిన అధికారులు, ఇక నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రుల్లోనూ ఐసోలేషన్ వార్డులు, పడకలు, ఎన్95 మాస్క్‌లను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. కోవిడ్ వైరస్ నేపథ్యంలో గత నెల నుంచి ఇప్పటివరకు నిర్ణీత దేశాల నుంచి వచ్చిన వారిలో 14,472 మందికి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యలను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధికారి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వచ్చే నెల 2 లేదా 3న రాష్ట్రానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇటీవల వుహాన్ నగరం నుంచి మన దేశానికి వచ్చిన 112 మందిని ఇప్పటివరకు ఢిల్లీలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచారు. వారిని త్వరలో వారి సొంత రాష్ట్రాలకు పంపనున్నట్లు కేంద్రం తెలిపింది. అందులో ఎంతమంది తెలుగువారున్నారన్న దానిపై తమకు సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
కేంద్రం నియంత పాలన
కవాడిగూడ: రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ కేంద్రం నియంత పాలన కొనసాగిస్తోందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య విమర్శించారు. ప్రజల పక్షాన గొంతువిప్పుతున్న ఉద్యమకారులను అర్బన్ నక్సలైట్ పేరుతో జైళ్లలో పెడుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలపై నిర్బంధాన్ని, అక్రమ కేసులను, అక్రమ అరెస్టులను ఖండిద్దాం.. ఉపా చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో నిర్బంధ వ్యతిరేక వేదిక–తెలం గాణ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా అరెస్టు చేసిన 17 మంది ప్రజా ఉద్యమకారుల కుటుంబ సభ్యులను సభకు పరిచయం చేశారు. ప్రొ.హరగోపాల్ అధ్యక్షతన ఈ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ.. తాను స్వాతంత్య్ర, సాయుధ, తెలంగాణ పోరాటం లో పాల్గొన్నానని ఏనాడూ అర్బన్ నక్సలైట్ అనే పదం వినలేదన్నారు. ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్ర చేశారని విరసం నేత వరవరరావును అరెస్టు చేసి జైల్లో పెట్టారని, తనకు తెలిసి ఆ కుటుంబంలో ప్రతి బిడ్డా దేశభక్తుడేనని అన్నారు. అచ్చోసిన ఆంబోతులుగా ట్రంప్, మోదీ పదే పదే కౌగిలించుకుంటున్నారని.. ఇది ఒక అసాంఘిక లైంగిక చర్య అని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా.. అని చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రొ.హరగోపాల్ అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావవ్యక్తీకరణ కల్పించిందని, ఈ హక్కుతో ప్రతి ఒక్కరికీ రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటం నేరం కాదని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొ.కోదండరాం చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎవరైనా గొంతువిప్పితే నేరం, దేశద్రోహులంటూ జైల్లో పెడుతున్నారని అన్నారు. దేశం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నదే లేదని, నలుగురు కూర్చొని మాట్లాడితే 144 సెక్షన్ అమలు చేస్తున్న పరిస్థితి ఉందని ప్రొ.విశ్వేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, రమ, సీపీఎం రాములు, వేదిక సమన్వయకర్తలు రవిచందర్, లక్ష్మణ్, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్ సాగుకు కేంద్రం అనుమతి
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో 45,250 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం లేఖ పంపిందని వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు అనుమతి కోసం రాష్ట్రం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో రైతులు విస్తృతంగా ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని కోరారు. పంటమార్పిడి దిశగా రైతులను ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2019–20 సంవత్సరానికి గాను 2,500 ఎకరాల్లో రాష్ట్ర ఉద్యానశాఖ ప్రయోగాత్మకంగా ఆయిల్ పామ్ సాగును ప్రారంభించిందని, రవాణా ఖర్చులు ఇచ్చి పంటను ఆయిల్ ఫెడ్ సేకరిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని 246 మండలాలు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలమని కేంద్ర సర్వే తేల్చిందని, విదేశీ మారకద్రవ్యం ఆదా చేసేందుకు ఆయిల్‌పామ్ సాగు వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ పంటల సాగుతో తెలంగాణ రైతులకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అన్నిరకాల పంటల సాగుకు తెలంగాణ ప్రాంతం అనుకూలం అయినందున రాష్ట్ర వ్యవసాయ రంగానికి చేయూత నివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
దేశంలో రిజర్వుడ్ హెల్త్ ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: దేశానికి రిజర్వుడ్ ఆర్మీ దళం ఉన్నట్లుగానే వైద్య దళాన్ని సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం అత్యంత కీలకమైన సిఫార్సు చేసింది. 15వ ఆర్థిక సంఘం పరిధి లోని ఆరుగురు సభ్యుల ఉన్నతస్థాయి వైద్య బృందం ఆరోగ్య రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై పలు సూచనలు చేస్తూ కేంద్రానికి తాజాగా నివేదిక సమర్పించింది. ఈ విషయంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇండియన్ రిజర్వుడ్ ఆర్మీ మాదిరిగా షార్ట్ సర్వీస్ కమిషన్‌కు రూపకల్పన చేసి దేశంలో వైద్యుల కొరత ఎక్కడ ఉంటే అక్క డకు రిజర్వుడు స్పెషలిస్టు వైద్యులను పంపించడమే దీని ఉద్దేశం. అనేక రాష్ట్రాల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఆరోగ్యపరమైన విపత్తులు తలెత్తినా, ఎక్కడైనా కొరత ఉన్నా ఈ రిజర్వుడు వైద్య దళం అక్కడకు వెళ్తుంది. అవసరమైనన్ని రోజులు అక్కడ ఉండి వైద్య సేవలు అందిస్తుంది. అందుకోసం జాతీయ స్థాయిలో ఒక వైద్య దళాన్ని జాతీయస్థాయి పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇక ఇప్పటివరకు రాజ్యాంగంలో వైద్య ఆరోగ్య రంగం రాష్ట్ర జాబితాలో ఉంది. దీన్ని ఉమ్మడి జాబితాలోకి చేర్చాలని మరో కీలకమైన సిఫార్సు చేసింది. ఆరోగ్యం ప్రాథమిక హక్కు.. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2021లో ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా మార్చాలని ఆర్థిక సంఘం మరో ముఖ్యమైన సిఫార్సు చేసింది. దీనివల్ల ప్రతీ ఒక్కరికి ఆరోగ్య భరోసా లభిస్తుందని తెలిపింది. 2025 నాటికి బడ్జెట్లో ప్రభుత్వం వైద్యంపై పెట్టే ఖర్చును ఇప్పుడున్న దానికి రెండింతలు చేయాలని సూచించింది. రాష్ట్రాలు వైద్య బడ్జెట్లో పరిశోధనకు 2 శాతానికి తగ్గకుండా కేటాయించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే 10 శాతం నిధుల్లో మూడింట రెండొంతులు ప్రాథమిక ఆరోగ్యంపై ఖర్చు పెట్టాలని తెలిపింది. ప్రోత్సాహకాల వ్యవస్థను వైద్య ఆరోగ్య రంగంలో ప్రవేశపెట్టాలని, ప్రాథమిక వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీర్చిదిద్దాలని నివేదించింది. ప్రైవేటు ప్రాక్టీసు రద్దు.. వైద్య కళాశాలల్లో పనిచేసే ప్రొఫెసర్లు, డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదని మరో కీలక సిఫార్సు చేసింది. ఇప్పటికే ఎవరైనా చేస్తుంటే తమ ప్రైవేట్ ప్రాక్టీసును వదులుకోవాలని, తమ జీతం ప్రాతిపదికనే పనిచేయాలని సూచించింది. ప్రైవేట్ ప్రాక్టీస్‌ను అనుమతించడం వల్ల వైద్య బోధనలో నాణ్యత దెబ్బతింటుందని తేల్చిచెప్పింది. ప్రభుత్వ వైద్యులను ఇతర విభాగాలతో పోల్చకుండా సముచిత వేతనాలు, సౌకర్యాలు, ఇతరత్రా రాయితీలు ఇవ్వాలంది. మెడికల్ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆదేశాల ప్రకారం వైద్యరంగంలో పరిశోధనలు చేయాలని పేర్కొంది. వైద్య కళాశాలకు రేటింగ్.. మెడికల్ కాలేజీలకు అవి సాధించే పీజీ సీట్లు, ఉత్తీర్ణత ఆధారంగా గుర్తింపు, రేటింగ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఎంబీబీఎస్ స్థాయిలోనే కొన్ని స్పెషాలిటీ కోర్సులను ప్రోత్సహించాలని సూచించింది. అనస్థీషీయా, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో డిప్లొమా వైద్యులను కొనసాగిస్తూ వారి సేవలను మాధ్యమిక స్థాయి ఆస్పత్రుల్లో వినియోగించుకోవాలని వెల్లడించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ కోర్సు చేయాలనుకునే విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది అనైతికం, అహేతుకం, మానవ విలువలకు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. దీనివల్ల అర్హులైన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత వైద్య విద్యను పొందటానికి అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ పరిస్థితులను నియంత్రించాలని సిఫార్సు చేసింది. నిష్క్రమణకూ పరీక్ష.. వైద్య విద్య నాణ్యతను నిర్ధారించడానికి ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన విద్యార్థులకు ఒక సాధారణ ఎగ్జిట్ ఎగ్జామ్(నిష్క్రమణ పరీక్ష) పెట్టాలని సూచించింది. నర్సింగ్ వృత్తిని బలోపేతం చేయాలని సూచించింది. నర్సింగ్ కౌన్సిల్ చట్టం ద్వారా నర్సింగ్ కౌన్సిల్ పనితీరును సమీక్షించడం అవసరమని చెప్పింది. తద్వారా నర్సింగ్ నాణ్యతను మెరుగుపరచాలని సూచించింది. ఎయిమ్స్‌లను విస్తరించడం, జిల్లా ఆస్పత్రులను, మెడికల్ కాలేజీలను పెంచడం అవసరమని పేర్కొంది. 250 పడకల కంటే ఎక్కువగా ఉన్న ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఫ్యామిలీ మెడిసిన్ కోర్సు దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, సబ్ సెంటర్లను 2011 జనాభా లెక్కల ప్రకారం పెంచాలని పేర్కొంది. దీనికి సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం వెయ్యి జనాభాకు ఒక బెడ్ ఉంటే, దాన్ని రెండుగా చేయాలని తెలిపింది. ఆ ప్రకారం వచ్చే ఐదేళ్లలో ప్రైవేటు భాగస్వామ్యం తో 3 వేల నుంచి 5 వేల ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని చెప్పింది. అలాగే ఆరోగ్య కార్డులను తీసుకురావాలని సూచించింది. 2025 నాటికి ఎంబీబీఎస్ సీట్లతో సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచాలని, ఎంబీబీఎస్‌లోనే కొన్ని స్పెషాలిటీ కోర్సులను పెట్టాలని పేర్కొంది. ఫ్యామి లీ మెడిసిన్ కోర్సును ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, దానికి శాఖను ఏర్పాటు చేయాలని సూచించింది. -
పెళ్లైన ఐదేళ్లలోపే సరోగసీ బెటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సరోగసీ రెగ్యులేషన్ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత సరోగసీకి అనుమతివ్వాలన్న బిల్లులోని అంశాన్ని సవరించాలని, పెళ్లయిన ఐదేళ్లలోపే అనుమతిస్తే బాగుంటుందని పేర్కొంది. కేంద్ర సరోగసీ రెగ్యులేషన్ బిల్లు అమలులో అనుసరించాల్సిన విధానాలు, ఇతర అంశాలపై అభిప్రాయ సేకరణకు పార్లమెంటరీ కమిటీ బృందం గురువారం హైదరాబాద్‌కు వచ్చింది. సరోగసీ పార్లమెంటరీ సెలక్ట్ కమిటీ చైర్మన్ భూపేం ర్ యాదవ్ నేతృత్వంలో ఇక్కడకు వచ్చిన బృందంలో డాక్టర్ బండా ప్రకాశ్, వికాశ్ మహాత్మ్, సరోజ్ పాండే, అశ్వనీ వైష్ణవ్, అమీయాజ్నిక్, ఏఆర్ బిశ్వాస్, ఎ.నవనీత్ కృష్ణన్, రవిప్రకాశ్ వర్మ తదితరులున్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, వైద్య,ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బిల్లులో రెండు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ఎంత వయసులో సరోగసీకి అనుమతించాలన్న అంశాన్ని కమిటీ బృందం ప్రశ్నించగా, పెళ్లయిన ఐదేళ్లలోపే అనుమతించాలని సూచించినట్లు సమాచారం. సరోగసీ తల్లులకు నష్టపరిహారం ఎంతివ్వాలన్న దానిపై బిల్లులో ఉన్న దాన్నే పూర్తిగా సమర్థించినట్లు తెలిసింది. వ్యాపారాత్మకంగా సరోగసీ ఉండకూడదని, బిల్లులో దాన్ని నిషేధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించినట్లు సమాచారం. అయితే పూర్తి అభిప్రాయాలను రాతపూర్వకంగా పంపించాలని పార్లమెంటరీ కమిటీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు సూచించింది. అంతకుముందు ఈ బృందం కామినేని ఫెర్టిలిటీ ఆసుపత్రిలో సరోగసీ తల్లిదండ్రులతో మాట్లాడింది. ఆ తర్వాత సరోగసీ తల్లుల అభిప్రాయాలను సేకరించింది. కాగా, బిల్లులో కఠిన నిబంధనలను సవరించాలని తల్లిదండ్రులు కోరినట్లు సమాచారం. -
పల్లె బతుకు మారుతోందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణుల జీవన ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీయనుంది. పదేళ్లలో మారిన ప్రజల స్థితిగతుల గురించి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనుంది. సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్ఈసీసీ) పేరిట ఇంటింటి సర్వే నిర్వహించనుంది. ప్రజలకు అందుతున్న కనీస సేవలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇతరత్రా సామాజిక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించనుంది. ఈ మేరకు గ్రామాలవారీగా వివరాలు సేకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ సహకారంతో ఈ ఏడాది ఏప్రిల్ 14 కల్లా ఈ వివరాలను సేకరించాలని నిర్ణ యించింది. ఇందుకోసం 16 ప్రామాణికాలను నిర్దేశించిన ప్రభుత్వం.. ఆ మేరకు సమా చారాన్ని నమోదు చేయాలని ఆదేశించింది. వంటగ్యాస్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, బ్యాంకు ఖాతా, జీవిత బీమా ఉందా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకోనుంది. గర్భిణులు, 0–6 ఏళ్లలోపు చిన్నారుల సమాచారం, టీకాల వివరాలు, పౌష్టికాహార లభ్యతకు సంబంధించిన డేటా నమోదు చేయనుంది. ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయా? ప్రాథమిక పాఠశాల సౌకర్యముందా? కుటుంబ సభ్యులు డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారా? పక్కా ఇళ్లు ఉన్నాయా? అనే అంశాలపై సర్వే నిర్వహించనుంది. సామాజిక పింఛన్ అందుతోందా? ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డు ఉందా? అనే వివరాలు సేకరించనుంది. వివరాల సేకరణకు ప్రత్యేక యాప్.. ప్రజల వివరాలను నమోదు చేసేందుకు కేంద్రం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. గ్రామీణ ప్రజల సమాచారాన్ని నమోదు చేసేందు కు వెళ్లే ఎన్యూమరేటర్లకు యాప్‌తో కూడిన మొబైల్‌ను అందించనుంది. పదేళ్లకోసారి జనగణన నిర్వహించే కేంద్రం.. అదే సమయంలో దశాబ్ద కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయి? ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల దరికి చేరుతున్నాయా? అనేది అంచనా వేసేందుకు సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహిస్తోంది. ఈ డేటా ప్రాతిపదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. పథకాల అమలు తీరును సమీ క్షించి కొత్త వాటికి రూపకల్పన చేస్తాయి. ఈసారి సర్వేలో ఇంటి యజ మాని మొబైల్ నంబర్‌ను కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. -
మహిళా కేంద్రాలకు అందని ‘శక్తి’
గృహ హింస నిరోధక చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం... తదితర అత్యంత ప్రధానమైన చట్టాల అమలు, అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహిళా శక్తి కేంద్రాలు (ఎంఎస్కే) నీరసించిపోతున్నాయి. మహిళల శక్తిని చాటే చట్టాలను పర్యవేక్షించే సిబ్బందికి పది నెలలుగా వేతనాలు అందడం లేదు. 2019–20 వార్షిక సంవత్సరంలో ఈ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వలేదు. ఫలితంగా ఎంఎస్‌కేల్లో పనిచేస్తున్న సిబ్బంది ఖాతాల్లో గతేడాది ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు వేతనాలు జమకాలేదు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఈ సిబ్బందికి ఇచ్చే వేతనాలు అరకొరే అయినప్పటికీ... అవి కూడా సకాలంలో అందకపోవడంతో ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వేతనమందక...పనిపై శ్రద్ధ పెట్టలేక... మహిళా శక్తి కేంద్రాల్లో పనిచేసేఉద్యోగులకు ఇదివరకు ప్రతినెల ఐదో తేదీలోగా వేతనాలు అందేవి. కొన్ని సందర్భాల్లో నెలవారీ వేతన చెల్లింపుల్లో జాప్యం జరిగినప్పటికీ ప్రభుత్వం మూడు నెలల్లోగా సమస్యను పరిష్కరించి బకాయిలను క్లియర్ చేసేది. ప్రస్తుతం ఈ జాప్యం పది నెలలకు పెరిగింది. గతేడాది ఏప్రిల్ నెల నుంచి ఎంఎస్‌కేల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు రాలేదు. 2019–20 వార్షిక సంవత్సరంలో ఎంఎస్‌కేలకు నిర్దేశించిన బడ్జెట్‌ను కేంద్రం విడుదల చేయలేదు. దీంతో వారికి వేతనాలు ఇవ్వలేదని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎంఎస్‌కేలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన బకాయిలు దాదాపు రూ.కోటిన్నర వరకు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎంఎస్కే విధులేంటి... మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడంలో మహిళా శక్తి కేంద్రాలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఎంఎస్‌కేలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్వహిస్తారు. ఒక్కో మహిళా శక్తి కేంద్రంలో సోషల్ కౌన్సిలర్(ఎస్సీ), లీగల్ కౌన్సిలర్(ఎల్సీ)తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు(పీసీ), మరో డాటా ఎంట్రీ ఆపరేటర్(డీఈఓ) ఉంటారు. సోషల్, లీగల్ కౌన్సిలర్లు గృహ హింస చట్టంతో పాటు పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా శిక్షణ కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు. గతంలో గృహ హింస చట్టంపైనే పనిచేసే సోషల్, లీగల్ కౌన్సిలర్లకు ఎంఎస్‌కేల ఏర్పాటుతో అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న ఎంఎస్‌కేలు త్వరలో కొత్త జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
ఆశల్లేకున్నా.. అడగాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు చేపట్టిన భారీ ఎత్తిపోతల పథకాలకు సాయం చేయాలని రాష్ట్రం మరోమారు కేంద్రాన్ని కోరనుంది. ఈ నెల 21న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తున్న భేటీలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా లేదా కేంద్ర సంస్థల నుంచి ఆర్థిక సాయమైనా ఇవ్వాలని అభ్యర్థించనుంది. దీనిపై ఇప్పటికే పలు మార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. ఈసారి కూడా స్పందిస్తుందన్న ఆశలు పెద్దగా లేకున్నా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రాజెక్టులకు నిధుల కొరత రాకుండా రాష్ట్రానికి ఊరటినిచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరనుంది. ఎన్నిమార్లు కోరినా మొండిచెయ్యే... కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉంది. దీనిపై పార్లమెంటు లోపలా వెలుపలా పోరాటం చేస్తున్నా కేంద్రం మొండిచెయ్యే చూపు తోంది. గత జూన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్రం కోరింది. అయినా కేంద్రం ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదు. 20 శాతమే లెక్కిస్తారా? కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద వినియోగిస్తున్న తాగునీటి జలా ల్లో 20 శాతాన్ని మాత్రమే రాష్ట్రా ల వినియోగ ఖాతాలో వేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ఏడో క్లాజు ప్రకారం తాగునీటి కోసం వాడే జలాల్లో 20 శాతాన్నే లెక్కలోకి తీసుకోవాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తోంది. పట్టణాలు, మున్సిపాలిటీల్లో తాగునీటికి సరఫరా చేసిన నీటిలో 20 శాతం మాత్రమే వినియోగం కిందకు వస్తుంది. హైదరాబాద్ తాగునీటి కోసం తెలంగాణ ఏటా 16.5 టీఎంసీలు సరఫరా చేస్తుండగా ఇందులో 3.3 టీఎంసీలు (20%) మాత్రమే వాస్తవ వినియోగం ఉండగా మరో 13 టీఎంసీలు వివిధ రూపాల్లో నదిలోకే చేరుతోంది. కానీ ఏటా కృష్ణా బోర్డు 16.5 టీఎంసీలను లెక్కలోకి తీసుకుం టోంది. దీనిపై ఇటీవల బోర్డు భేటీలో రాష్ట్రం ప్రస్తావించగా కేంద్రమే దీనిపై మార్గదర్శనం చేయాలని బోర్డు చైర్మన్ పేర్కొ న్నారు. దీంతో 21న జరిగే భేటీలో దీనిపై కేంద్రం ఏం చెబుతుంద నేది కీలకంగా మారింది.