ఢిల్లీలో విజ్ఞాన్ భవన్‌లో రైతు ప్రతినిధులతో జరిగిన చర్చలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే శాఖ మంత్రి పియూశ్ గోయల్, సహాయక మంత్రి సోమ్ ప్రకాశ్ తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ఉద్యమిస్తున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య సోమవారం జరిగిన ఏడో విడత చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. కొత్త సాగు చట్టాల రద్దు మినహా మరే ప్రతిపాదన తమకు అంగీకారయోగ్యం కాదని రైతు నేతలు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఆ చట్టాల్లోని రైతుల అభ్యంతరాలను నిబంధనల వారీగా చర్చిద్దామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చారు. రైతు ప్రతినిధులు వ్యవసాయ చట్టాల రద్దుపైనే పట్టుపట్టడంతో, వారి మరో డిమాండ్ అయిన ‘కనీస మద్దతు ధరకు చట్టబద్ధత’ అంశం పెద్దగా చర్చకు రాలేదు.
8న మళ్లీ చర్చించాలని నిర్ణయించారు. 41 రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. విజ్ఞాన్ భవన్‌లో చర్చలు ప్రారంభం కాగానే, మొదట, ఈ ఆందోళనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన చర్చల్లో తొలి నుంచీ రైతు నేతలు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన సవరణల ప్రతులను చించివేశారు. దాంతో, చర్చలు ప్రారంభమైన గంట సేపటికే ప్రతిష్టంభన నెలకొంది. దాంతో ఇరువర్గాలు బ్రేక్ తీసుకున్నాయి. ఆ సమయంలో రైతు నేతలు, తమకు దీక్షాస్థలి నుంచి వచ్చిన భోజనాన్ని స్వీకరించారు.
ఆరో విడత చర్చల సమయంలో రైతులతో పాటు కేంద్రమంత్రులు కూడా అదే ఆహారాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. కానీ ఈ విడత చర్చల్లో మంత్రులు రైతు నేతలతో కలిసి భుజించలేదు. ఆ సమయంలో వారు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అనంతరం, సాయంత్రం 5.15 గంటల సమయంలో ఇరు వర్గాలు మళ్లీ సమావేశమయ్యాయి. చట్టాల రద్దు మినహా మరే ప్రత్యామ్నాయానికి అంగీకరించబోమని రైతు నేతలు తేల్చిచెప్పడంతో, చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. రైతుల డిమాండ్లపై అంతర్గతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, ఆ తరువాత మళ్లీ చర్చలు కొనసాగిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పినట్లు రైతు నేతలు వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అహం అడ్డుపడుతోందని వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత.. కీలకమైన ఈ రెండు డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గబోమని పునరుద్ఘాటించారు. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం చర్చిస్తామన్నారు.
రెండు చేతులతో చప్పట్లు
జనవరి 8న జరిగే చర్చల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చర్చల అనంతరం వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. అయితే, అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం లభించాలంటే ఇరు వర్గాలు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ‘రెండు చేతులతోనే చప్పట్లు కొట్టగలం’ అని వ్యాఖ్యానించారు. ‘వారు చట్టాల రద్దు అనే ఒక్క విషయం పైననే మొండిపట్టు పట్టారు. చట్టాలను క్లాజ్‌లవారీ చర్చించాలన్నది మా అభిప్రాయం’ అని వివరించారు. జనవరి 8న జరిగే చర్చలు కూడా మరో తేదీకి వాయిదా పడేందుకే జరుగుతాయా? అన్న ప్రశ్నకు.. పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతోనే చర్చలు జరుపుతున్నామని సమాధానమిచ్చారు. దేశంలోని రైతులందరి ప్రయోజనాలు ఆశించి, తమ ప్రభుత్వం చట్టాలను చేసిందన్నారు. అనంతరం, ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సమస్య పరిష్కారానికి అన్ని సానుకూల ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అందులో పేర్కొంది. తద్వారా చట్టాల రద్దు కుదరదన్న విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేసింది.
సింఘు సరిహద్దు వద్ద నిరసన
Comments
Please login to add a commentAdd a comment