అదే ప్రతిష్టంభన | Govt-farmers talks fail again and next round on Jan 19 | Sakshi
Sakshi News home page

అదే ప్రతిష్టంభన

Published Sat, Jan 16 2021 3:58 AM | Last Updated on Sat, Jan 16 2021 9:15 AM

Govt-farmers talks fail again and next round on Jan 19 - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి తోమర్‌

సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. 9వ ధపా చర్చలు శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో దాదాపు ఐదు గంటలపాటు జరిగాయి. కేంద్రం తరపున వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్‌ సహా ఉన్నతాధికారులు 41 రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు.

కొత్త సాగు చట్టాల విషయంలో ఇరుపక్షాలు తమ వాదనలకే కట్టుబడి ఉండడంతో ప్రతిష్టంభన నెలకొంది. రైతులు లేవనెత్తిన కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, కాస్తయినా బెట్టు సడలించాలని తోమర్‌ రైతు సంఘాల నేతలను కోరారు. అయితే, కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని నేతలు తేల్చిచెప్పారు. తమ డిమాండ్ల విషయంలో మార్పు లేదని కుండబద్ధలు కొట్టారు. దీంతో చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. 10వ రౌండ్‌ చర్చలు 19న మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్నాయి.

ప్రతిపాదనలతో రండి
తదుపరి చర్చల కంటే ముందే రైతులు సాగు చట్టాల విషయంలో తమ ప్రతిపాదనలతో ఒక ముసాయిదాను సమర్పిస్తే, వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. 9వ రౌండ్‌ చర్చలు విఫలమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు తాము రాతపూర్వక హామీ ఇచ్చామని వెల్లడించారు. కొత్త చట్టాల అమలు విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుకు కట్టుబడి ఉంటామని తోమర్‌ పేర్కొన్నారు.  మధ్యవర్తిత్వం కోసం న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీ తమను పిలిచినప్పుడు వాదనలు వినిపిస్తామన్నారు.  

రాహుల్‌ని చూసి కాంగ్రెస్‌ నవ్వుకుంటోంది
తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం వ్యవసాయ సంస్కరణల విషయంలో 2–3 రాష్ట్రాల రైతులు మాత్రమే ధర్నా చేస్తున్నారని నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు.  ప్రస్తుతం శీతాకాలం, కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి వంటి పరిస్థితుల దృష్ట్యా నిరసనకారుల గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అన్నారు.  రాహుల్‌ గాంధీ ప్రకటనలు, ఆయన చర్యలను చూసి మొత్తం కాంగ్రెస్‌ పార్టీ నవ్వుకుంటోందని తోమర్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో–2019లో వ్యవసాయ సంస్కరణలపై  వాగ్దానం చేశారని గుర్తుచేశారు.  ఈ విషయం మేనిఫెస్టోలో ఉంటే.. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ మీడియా ముందుకు వచ్చి, అప్పుడు అబద్ధాలు చెప్పారో లేక ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారో వివరించాలని సూచించారు.

19న సుప్రీంకోర్టు కమిటీ సమావేశం!
సాగు చట్టాల విషయంలో ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు  ఏర్పాటు చేసిన  నిపుణుల కమిటీ మొదటి సమావేశం జనవరి 19వ తేదీన జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.   

డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం..
మూడు వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత అనే తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని, అదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేశామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికైత్‌ చెప్పారు. అంతేగాక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరుకాకూడదని తాము నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మాట్లాడుతామని, డిమాండ్లపై చర్చిస్తామని ఉద్ఘాటించారు. చర్చలు కొనసాగించాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నట్లు ఆలిండియా కిసాన్‌ సంఘర్‌‡్ష కో–ఆర్డినేషన్‌ కమిటీ సభ్యురాలు కవితా కురుగంటి తెలిపారు.

కమిటీ నుంచి తప్పుకుంటున్నా
రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) జాతీయ అధ్యక్షుడు భూపీందర్‌సింగ్‌ మన్‌ చెప్పారు. కొత్త సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ కమిటీపై రైతు సంఘాలు, ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.  కమిటీలో తనను సభ్యుడిగా చేర్చినందుకు భూపీందర్‌సింగ్‌ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, రైతన్నల ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ పడబోనని తేల్చిచెప్పారు. భూపీందర్‌సింగ్‌కు దూరంగా ఉండాలని బీకేయూ పంజాబ్‌ యూనిట్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఆయన ప్రకటన వెలువడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement