
ముంబై: గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) చిట్టచివరి, ఆరవ ద్వైమాసిక సమావేశం ఇది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022–23 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో సమర్పించిన నేపథ్యంలో జరుగుతున్న తాజా ఆర్‌బీఐ విధాన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ గురువారం మీడియాకు వెల్లడిస్తారు. నిజానికి ఈ సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భారత రత్న లతామంగేష్కర్ మృతి నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రారంభమైంది.
పరిశీలించే కీలక అంశాలు..
అంతర్జాతీయంగా ముడిచమురు రికార్డు స్థాయిలో బేరల్‌కు 93 డాలర్లకు చేరడం, దేశంలో ద్రవ్యోల్బణం ఒత్తిడులు, కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పరిణామాలు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ మార్చిలోనే ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0–0.25%) పెంచవచ్చంటూ వస్తున్న సంకేతాలు, రష్యా–ఉక్రేయిన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతల తీవ్రత వంటి అంశాలు సమావేశంలో కీలక చర్చనీయాంశాలుగా ఉండే వీలుందని నిపుణుల అంచనా.
యథాతథమే..: రెపో రేటు (ప్రస్తుతం 4%)ను ‘వృద్ధే లక్ష్యంగా’ యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. అయితే లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) నిర్వహణ, బ్యాంకుల వద్ద అదనపు నిధులు ఉన్న పరిస్థితులు వంటి అంశాల నేపథ్యంలో రివర్స్ రెపో (ప్రస్తుతం 3.35 శాతం)ను 20 బేసిస్ పాయింట్లు పెంచవచ్చన్న అభిప్రాయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment