సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ తదితర దేశాలకూ వైరస్ వ్యాప్తి చెందడంతో కేంద్రప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు చేసిన మార్గదర్శకాలకు అదనంగా కొన్ని సూచనలు చేసింది. ఇప్పటివరకు చైనా, హాంకాంగ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైనే ప్రత్యేకంగా దృష్టి సారించగా, ఇప్పుడు అదనంగా దక్షిణ కొరియా, జపాన్, వియత్నాం, ఇటలీ, ఇరాన్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకల నుంచి వచ్చే ప్రయాణికులపైనా కూడా కేంద్రీకరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్లి, అక్కడి నుంచి వచ్చేవారు నేరుగా ఇళ్లకు వెళ్తున్నారని, వారిలో ఎవరికైనా కోవిడ్ అనుమానిత లక్షణాలుంటే గుర్తించాలని, వారి వివరాలు సేకరించాలని ప్రత్యేక ఆదేశాలు ఇ చ్చింది. కేవలం చలి ప్రదేశాల్లో మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల్లోనూ వైరస్ బలపడుతుందన్న భావనలో వైద్య ఆరోగ్యశాఖ ఉంది. వుహాన్ నగరంలో చలి తీవ్రత అధికంగా ఉండటం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందన్న భావనతో ఇప్పటివరకు ఉన్న అధికారులు, అది కాస్తా ఉష్ణోగ్రత అధికంగా ఉండే కొన్ని దేశాలకు పాకడంతో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని కేంద్రం స్పష్టం చేసినట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్‌లో గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో మాత్రమే వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక పడకలను ఏర్పాటు చేసిన అధికారులు, ఇక నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రుల్లోనూ ఐసోలేషన్ వార్డులు, పడకలు, ఎన్95 మాస్క్‌లను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు.
కోవిడ్ వైరస్ నేపథ్యంలో గత నెల నుంచి ఇప్పటివరకు నిర్ణీత దేశాల నుంచి వచ్చిన వారిలో 14,472 మందికి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యలను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధికారి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వచ్చే నెల 2 లేదా 3న రాష్ట్రానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇటీవల వుహాన్ నగరం నుంచి మన దేశానికి వచ్చిన 112 మందిని ఇప్పటివరకు ఢిల్లీలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచారు. వారిని త్వరలో వారి సొంత రాష్ట్రాలకు పంపనున్నట్లు కేంద్రం తెలిపింది. అందులో ఎంతమంది తెలుగువారున్నారన్న దానిపై తమకు సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment