State medical health department
-
మరో 10వేల ఆక్సిజన్ పడకలు
సాక్షి, హైదరాబాద్: కరోనా థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేలా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధమవుతోంది. ముఖ్యంగా రోగులకు ఆక్సిజన్‌ను అందించడంలో ఎటువంటి కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మొదటి, రెండో వేవ్‌ల సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 17 వేల పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించగా.. తాజాగా మరో 10 వేల పడకలకు ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనుంది. ప్రతి ఏరియా ఆస్పత్రిలోనూ 20 పడకలను ఐసీయూలుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 20 శాతం పడకలను పిల్లలకు కేటాయించనున్నారు. ఐసీయూ పడకలనూ ఇదే విధంగా కేటాయిస్తారు. వంద పడకలకు పైగా ఉన్న ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్న్ప్లాంటు ఉండాలని ఆదేశించారు. 100 పడకలు నుంచి 200 పడకల వరకు ఉన్న ఆసుపత్రులు నిమిషానికి 500 లీటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యమున్న ప్లాంటును ఏర్పాటు చేయాలి. 200–500 మధ్య పడకలున్న ఆసుపత్రులు నిమిషానికి వెయ్యి లీటర్లు ఉత్పత్తి చేసే ప్లాంటును నెలకొల్పాలి. 500 పడకలకు మించి ఉన్న ఆస్పత్రి నిమిషానికి 2 వేల లీటర్లు ఉత్పత్తి చేసే ప్లాంటును కలిగి ఉండాలి. థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. కరోనా థర్డ్‌వేవ్‌పై జాతీయ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ‘కార్యాలయాలు తెరుచుకున్నాయి. మార్కెట్లు రద్దీగా మారాయి. జనసంచారం పెరిగింది. కానీ జాగ్రత్తలు పాటించడంలో విఫలమవుతున్నాం. భౌతికదూరం పాటించడం లేదు. మాస్క్‌లు ధరించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది..’అని పేర్కొంది. ఈ వైఖరి థర్డ్‌వేవ్‌ను మోసుకొస్తుందని హెచ్చరించింది. తగిన వైద్య సదుపాయాలు లేకపోవడం, టీకాలు వేయడంలో వెనుకబడి ఉండటం వల్ల థర్డ్‌వేవ్ వస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని తెలిపింది. దేశంలోని 40 మంది నిపుణులు కూడా థర్డ్‌వేవ్ అక్టోబర్‌లో వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు, ఇతరత్రా సన్నద్ధతపై దృష్టి సారించింది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. సన్నాహాలు ఇలా.. ►పిల్లల చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రిలో మరో వెయ్యి పడకలను అందుబాటులోకి తీసుకురావాలి. ►దాదాపు కోటిన్నర ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ కిట్లను కొనుగోలు చేయాలి. ►దాదాపు 2 వేల మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలి. ►ఫైనలియర్ చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థుల సేవలనూ ఉపయోగించుకోవాలి. ఆ మేరకు వారికి శిక్షణ ఇవ్వాలి. ►ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అవసరమైన మేర ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకురావాలి. -
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య, మరణాలు తగ్గుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని.. 25 శాతం కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయని ఆయన వెల్లడించారు. కొన్ని కొత్త ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని, ఇప్పటి వరకు 26 ఆసుపత్రుల కోవిడ్ లైసెన్సులు రద్దు చేశామని ఆయన వెల్లడించారు. (చదవండి: ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఉద్యోగులకు శుభవార్త..) ‘‘తూర్పుగోదావరి లో 17 ఆస్పత్రుల లైసెన్స్ లు రద్దు చేశాం. ఎవ్వరు అధికంగా డబ్బులు వసూలు చేసిన కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కి కూడా ఇదే చెప్పా. రెండో వేవ్ కూడా ఉంటుంది. కేసులు నమోదవుతాయి. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. అక్కడ గ్రామాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని’’ జవహర్‌రెడ్డి వివరించారు. (చదవండి: 95 వేలు దాటిన కోవిడ్ మరణాలు) కంటైన్మెంట్ కానీ ప్రాంతాల్లో కూడా ర్యాండమ్ సర్వే చేస్తున్నామని, రెండోసారి కూడా కరోనా పాజిటివ్ వస్తున్న కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో చాలా చోట్ల జరుగుతుందని, మన రాష్ట్రానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆయన చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా కిట్లు ఇస్తున్నామని, 2 లక్షల కిట్లు కొనుగోలు చేశామని జవహర్‌రెడ్డి వెల్లడించారు. -
ప్రభుత్వంలో చికిత్స.. ప్రైవేట్‌లో స్కానింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రు ల్లో నెలకొన్న దుస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రోగులు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సకు వస్తారు. స్కానింగ్ మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయించుకోవాల్సి వస్తోంది. జనగాం, ఖమ్మం జిల్లా ఆసుపత్రుల తీరు ప్రభుత్వాసుపత్రుల దయనీయతకు అద్దం పడుతోంది. జనగాం ఆసుపత్రిలో 100 పడకలున్నాయి. అందులో కరోనా రోగులకూ చికిత్సచేస్తున్నారు. ప్రస్తుతం కొద్దిమందే ఇన్పేషెంట్లుగా కరోనా రోగులున్నా, చాలామంది హోంఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సలహా మేర కు చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడకు వచ్చేవారికి ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య తలెత్తితే సీటీస్కాన్ చేయా ల్సి ఉంటుంది. సీటీ స్కానింగ్ యంత్రం చెడిపోవడంతో వారిని ప్రైవేట్‌కు రిఫర్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినవారికి ప్రైవేట్‌లో స్కానింగ్ చేస్తుండటంతో రూ.3 వేల వరకు రోగులు చెల్లిస్తున్నారు. విచిత్రమేంటంటే ఆ ఆసుపత్రిలో పనిచేసే ఒక వైద్యాధికారికి చెందిన సొంత ప్రైవేట్ ఆసుపత్రికే రోగులను రిఫర్ చేస్తున్నారు. ఆ రకం గా ఆ అధికారి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి ప్రైవేట్‌గా డబ్బులు గుంజుతున్నారని ఫిర్యాదులున్నాయి. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోనూ అదే తీరు... ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో సీటీస్కాన్ చాలారోజులుగా పనిచేయడంలేదు. అక్కడ ప్రస్తుతం 100 మందికిపైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది ఐసీయూలో ఉన్నారు. అటువంటిచోట కనీసం సీటీ స్కాన్ లేదంటే అక్కడి వైద్యాధికారుల పనితీరు ఏపాటిదో అర్థమవుతోంది. దీనిపై రోగులు, ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా రోగుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకితే కనీసం స్కాన్ చేయలేని దుస్థితి నెలకొంది. బయట రూ.3 వేలకుపైగా డబ్బులు చెల్లించి సీటీస్కానింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి సీరియస్ పేషెంట్లకు తక్షణమే సీటీ స్కాన్ చేయాల్సి వచ్చి నప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. పైగా సొంతంగా డబ్బులు చెల్లించాల్సి రావడంతో రోగులు అసహనం వ్య క్తం చేస్తున్నారు. ఇటీవల ఆ జిల్లాకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెళ్లినప్పుడు కూడా కొందరు ఆయన దృష్టికి ఈ విషయాలను తీసుకొచ్చారు. కానీ, ఇప్పటికీ కొత్త స్కానింగ్ మిషన్ అందుబాటులోకి రాలేదని బాధితులు అంటున్నారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు వైద్య పరికరాలు పనిచేయడంలేదు. ప్రైవేట్ లేబొరేటరీలతో కుమ్మక్కు... కొన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనైతే కనీసం ఎక్స్‌రే మిషన్లు కూడా పనిచేయడంలేదు. అక్కడి టెక్నీషియన్లు లేదా డాక్టర్లు స్థానికంగా ఉండే ప్రైవేట్ లేబొరేటరీలతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల మి షన్లు పనిచేసినా రోగులను ప్రైవేట్ లేబొరేటరీలకు రిఫర్ చేయడం గమనార్హం. మరోవైపు కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ కిట్లు కూడా మాయమవుతున్నా యి. అవి ప్రైవేట్ లేబొరేటరీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొందరు డాక్టర్లు వాటిని తమ సొంత ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి పరీక్షలు చేస్తున్నారు. యాంటిజెన్ పరీక్షలు చేసే అధికారం రాష్ట్రంలో ప్రభుత్వంలో తప్ప మరోచోట లేనేలేదు. కానీ, వాటిని కొందరు డాక్టర్లు తమ ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారన్న ఫిర్యాదులూ వైద్య, ఆరోగ్యశాఖకు వచ్చాయి. -
కోవిడ్‌పై మరింత అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ తదితర దేశాలకూ వైరస్ వ్యాప్తి చెందడంతో కేంద్రప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు చేసిన మార్గదర్శకాలకు అదనంగా కొన్ని సూచనలు చేసింది. ఇప్పటివరకు చైనా, హాంకాంగ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైనే ప్రత్యేకంగా దృష్టి సారించగా, ఇప్పుడు అదనంగా దక్షిణ కొరియా, జపాన్, వియత్నాం, ఇటలీ, ఇరాన్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకల నుంచి వచ్చే ప్రయాణికులపైనా కూడా కేంద్రీకరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్లి, అక్కడి నుంచి వచ్చేవారు నేరుగా ఇళ్లకు వెళ్తున్నారని, వారిలో ఎవరికైనా కోవిడ్ అనుమానిత లక్షణాలుంటే గుర్తించాలని, వారి వివరాలు సేకరించాలని ప్రత్యేక ఆదేశాలు ఇ చ్చింది. కేవలం చలి ప్రదేశాల్లో మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల్లోనూ వైరస్ బలపడుతుందన్న భావనలో వైద్య ఆరోగ్యశాఖ ఉంది. వుహాన్ నగరంలో చలి తీవ్రత అధికంగా ఉండటం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందన్న భావనతో ఇప్పటివరకు ఉన్న అధికారులు, అది కాస్తా ఉష్ణోగ్రత అధికంగా ఉండే కొన్ని దేశాలకు పాకడంతో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని కేంద్రం స్పష్టం చేసినట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్‌లో గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో మాత్రమే వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక పడకలను ఏర్పాటు చేసిన అధికారులు, ఇక నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రుల్లోనూ ఐసోలేషన్ వార్డులు, పడకలు, ఎన్95 మాస్క్‌లను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. కోవిడ్ వైరస్ నేపథ్యంలో గత నెల నుంచి ఇప్పటివరకు నిర్ణీత దేశాల నుంచి వచ్చిన వారిలో 14,472 మందికి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యలను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధికారి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వచ్చే నెల 2 లేదా 3న రాష్ట్రానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇటీవల వుహాన్ నగరం నుంచి మన దేశానికి వచ్చిన 112 మందిని ఇప్పటివరకు ఢిల్లీలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచారు. వారిని త్వరలో వారి సొంత రాష్ట్రాలకు పంపనున్నట్లు కేంద్రం తెలిపింది. అందులో ఎంతమంది తెలుగువారున్నారన్న దానిపై తమకు సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
ప్రభుత్వ బోధనా వైద్యులకు రవాణా భత్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు రవాణా భత్యం (టీఏ) ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించి సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోధన వైద్యులకు టీఏ ఇవ్వాలని నిర్ణయించినా ఇప్పటివరకు అమలు కాలేదు. తాజాగా దాన్ని అమలుచేసేందుకు సర్కారు ముందుకు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 1,361 మందికి, జిల్లాల్లో పనిచేస్తున్న 755 మందికి మొత్తంగా 2,116 మంది వైద్యులకు టీఏ అందనుంది. హైదరాబాద్‌లో పనిచేసే వైద్యులకు నెలకు రూ.800, మిగిలిన ప్రాంతాల వారికి రూ.400 చొప్పున టీఏ చెల్లించనున్నారు. టీఏ కోసం నెలకు రూ.1.66 కోట్లు అదనంగా అందజేయడంతో పాటు 2009 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు అర్హులైన ఆయా వైద్యులకు ఎరియర్స్ కింద బకాయిలు చెల్లిస్తారు. బకాయిల కింద రూ.14.19 కోట్లు అందనున్నాయి. -
మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో నేరుగా నియామకాలు
⇒ 519 వైద్య పోస్టుల భర్తీకి ప్రతిపాదన ⇒ రంగం సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో వైద్య సిబ్బంది పోస్టులను నేరుగా భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. వైద్య పోస్టులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తుండగా మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి మాత్రం నేరుగా భర్తీ చేయాలని నిర్ణయిం చారు. గత ఏడాది ప్రభుత్వం ఆ కాలేజీకి పాక్షిక స్వయం ప్రతిపత్తి ఇచ్చిన నేపథ్యంలో నేరుగా నియామకాలు జరుపుకొనే వీలు కలిగింది. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెంటనే ఖాళీలను భర్తీ చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం ప్రారంభంలో 462 మంజూరు పోస్టులుండగా మరో నాలుగేళ్ల కోసం అదనంగా 519 పోస్టులు ప్రతిపాదించారు. అందులో 118 టీచింగ్, 401 నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. వీటిని వీలైనంత త్వరలో భర్తీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. 2016–17 విద్యా సంవత్సరం నుంచి మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రిటైర్ అయ్యే వరకు అక్కడే పనిచేయాలి ప్రస్తుతం నిమ్స్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థనే. కర్ణాటకలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అను బంధ బోధనాసుపత్రులు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల్లో చేరే వారు చాలా మంది నెలలు గడ వక ముందే తమ ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ లేదా డిప్యుటేషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో మారుమూల మెడికల్ కాలేజీ లకు వైద్యు లు, ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. మెడికల్ విద్యార్థులు, బోధనాసు పత్రుల్లోని రోగులు ఇబ్బందులు పడక తప్పట్లేదు. మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ఇందుకు భిన్నంగా కొత్తగా ఎవరు ఉద్యోగంలో చేరినా రిటైర్ అయ్యేంత వరకు సంబంధిత కాలేజీ లేదా బోధనాసుపత్రిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇతర చోట్లకు బదిలీలు ఉండవు. అందుకు సిద్ధమయ్యే వారే చేరాల్సి ఉంటుంది. దీంతో బదిలీల సమస్య ఉండకుండా పూర్తి స్థాయిలో ఈ కాలేజీపైనే దృష్టి సారించే వీలుంటుంది. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యోచన - స్వయంగా సిబ్బందిని నియమించుకునేందుకు అవకాశం - బదిలీలు, డిప్యుటేషన్లకు నో - ఒకసారి నియమితులైతే రిటైరయ్యే వరకు అక్కడే విధులు - అవసరమైన సౌకర్యాలు, పరిపాలనా నిర్ణయాలు తీసుకునే వీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. పరిపాలన, విధానపరమైన నిర్ణయాలను సొంతంగా తీసుకోవడంతోపాటు వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీనీ చేపట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దీనిని ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభం కానున్న మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రులకు స్వయం ప్రతిపత్తిని అమలు చేస్తున్నారు. దీంతో అక్కడ మంచి ఫలితాలు వ స్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. బదిలీలు, బాదరబందీలు ఉండవు రాష్ట్రంలో మొత్తం 18 మెడికల్ కాలేజీలుండగా.. వాటన్నింటిలో కలిపి 2,750 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో (కొత్తగా వచ్చే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలుపుకొని) వెయ్యి ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఈ ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకూ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ ఏడాది మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రయోగాత్మకంగా స్వయం ప్రతిపత్తి విధానాన్ని అమలు చేస్తారు. అక్కడ విజయవంతమైతే మిగతా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ అమల్లోకి తెస్తారు. మరోవైపు ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల్లో చేరే వారు చాలా మంది కొంతకాలానికే తమకు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడమో, డిప్యుటేషన్లపై వెళ్లడమో చేస్తున్నారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇది వైద్య విద్యార్థులకు, బోధనాసుపత్రులకు వస్తున్న రోగులకు శాపంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే స్వయం ప్రతిపత్తి విధానం వైపు సర్కారు మొగ్గుతోంది. ఇది అమల్లోకి వస్తే ఆయా మెడికల్ కాలేజీల్లో కొత్తగా ఎవరు ఉద్యోగంలో చేరినా.. రిటైరయ్యే వరకు సంబంధిత కాలేజీ లేదా బోధనాసుపత్రిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇతర చోట్లకు బదిలీలు ఉండవు. అందుకు సిద్ధమయ్యే వారే ఉద్యోగంలో చేరుతారు కాబట్టి సమస్యలు తలెత్తే అవకాశం తక్కువ. ఉదాహరణకు మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి ఈ ఏడాది దాదాపు 400 మందికిపైగా ప్రొఫెసర్లు, వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని నియమిస్తారు. ఆ కాలేజీకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే వారంతా రిటైరయ్యే వరకూ అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిమ్స్‌లో ఇటువంటి విధానమే అమలవుతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసి వీలైనంత త్వరలో జీవో జారీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. పాలమూరు కాలేజీలో ప్రయోగాత్మకంగా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కర్ణాటకలో అలాంటి విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది నుంచి కొత్తగా రాబోయే మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో దానిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నాం. - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
ఆర్బీఎస్కే నియామకాలు ఆయుష్ వైద్యులతోనే!
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ యోచన సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలోని రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో చేపట్టే వైద్య పోస్టుల నియామకాలన్నింటినీ ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఇందుకు ఎంబీబీఎస్ వైద్యుల అవసరం లేదని భావిస్తోంది. ఎన్హెచ్ఎం కింద రాష్ర్టంలో 600 మంది వైద్యులు, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్యూహెచ్ఎం) కింద 275 మంది వైద్యులను నియమించనున్నారు. అయితే ఆర్బీఎస్కే కింద చేపట్టే నియామకాల్లో 120 మంది ఆయుష్ వైద్యులను, 480 మంది ఎంబీబీఎస్ వైద్యులను నియమించాలని ప్రభుత్వం తొలుత మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆర్బీఎస్కే కింద నియమితులయ్యే వైద్యులు గ్రామాల్లో పర్యటించి పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, ఎదుగుదలలో సమస్యలు, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను గుర్తించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర అధికారి ఒకరు ఇటీవల రాష్ట్రానికి వచ్చి ఆర్బీఎస్కేలో వైద్య పోస్టుల నియామకాలను పూర్తిగా ఆయుష్ వైద్యులతోనే చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. కేవలం పిల్లల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించడమే కాబట్టి ఇందుకు ఎంబీబీఎస్ వైద్యుల అవసరం లేదని పేర్కొన్నట్లు తెలిసింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టులను ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేస్తున్నారని ఆ అధికారి చెప్పినట్లు తెలియవచ్చింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా ఎంబీబీఎస్‌ల బదులు ఆయుష్ వైద్యులతోనే నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నియామకాలకు సంబంధించి కేంద్రం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ వైద్యులకు 80 శాతం, ఆయుష్ వైద్యులకు 20 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. ఆ మార్గదర్శకాలను ఇప్పుడు మార్చాలని యోచిస్తుండటంతో నియామక ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ చర్యను ఎంబీబీఎస్ వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.