ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యోచన
- స్వయంగా సిబ్బందిని నియమించుకునేందుకు అవకాశం
- బదిలీలు, డిప్యుటేషన్లకు నో
- ఒకసారి నియమితులైతే రిటైరయ్యే వరకు అక్కడే విధులు
- అవసరమైన సౌకర్యాలు, పరిపాలనా నిర్ణయాలు తీసుకునే వీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. పరిపాలన, విధానపరమైన నిర్ణయాలను సొంతంగా తీసుకోవడంతోపాటు వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీనీ చేపట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దీనిని ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభం కానున్న మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రులకు స్వయం ప్రతిపత్తిని అమలు చేస్తున్నారు. దీంతో అక్కడ మంచి ఫలితాలు వ స్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
బదిలీలు, బాదరబందీలు ఉండవు
రాష్ట్రంలో మొత్తం 18 మెడికల్ కాలేజీలుండగా.. వాటన్నింటిలో కలిపి 2,750 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో (కొత్తగా వచ్చే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలుపుకొని) వెయ్యి ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఈ ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకూ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ ఏడాది మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రయోగాత్మకంగా స్వయం ప్రతిపత్తి విధానాన్ని అమలు చేస్తారు. అక్కడ విజయవంతమైతే మిగతా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ అమల్లోకి తెస్తారు. మరోవైపు ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల్లో చేరే వారు చాలా మంది కొంతకాలానికే తమకు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడమో, డిప్యుటేషన్లపై వెళ్లడమో చేస్తున్నారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది.
ఇది వైద్య విద్యార్థులకు, బోధనాసుపత్రులకు వస్తున్న రోగులకు శాపంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే స్వయం ప్రతిపత్తి విధానం వైపు సర్కారు మొగ్గుతోంది. ఇది అమల్లోకి వస్తే ఆయా మెడికల్ కాలేజీల్లో కొత్తగా ఎవరు ఉద్యోగంలో చేరినా.. రిటైరయ్యే వరకు సంబంధిత కాలేజీ లేదా బోధనాసుపత్రిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇతర చోట్లకు బదిలీలు ఉండవు. అందుకు సిద్ధమయ్యే వారే ఉద్యోగంలో చేరుతారు కాబట్టి సమస్యలు తలెత్తే అవకాశం తక్కువ. ఉదాహరణకు మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి ఈ ఏడాది దాదాపు 400 మందికిపైగా ప్రొఫెసర్లు, వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని నియమిస్తారు. ఆ కాలేజీకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే వారంతా రిటైరయ్యే వరకూ అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిమ్స్‌లో ఇటువంటి విధానమే అమలవుతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసి వీలైనంత త్వరలో జీవో జారీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
పాలమూరు కాలేజీలో ప్రయోగాత్మకంగా..
ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కర్ణాటకలో అలాంటి విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది నుంచి కొత్తగా రాబోయే మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో దానిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నాం.
- లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి