ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామంటే వద్దనడం ఏమిటి?
మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థుల ఆశలు గల్లంతు
చంద్రబాబు ఏనాడు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టలేదు
రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ నేతలు
నరసరావుపేట/నగరి/రాజంపేట/ప్రొద్దుటూరు క్రైం/పిడుగురాళ్ల: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కల సాకారం చేయడం కోసం.. సామాన్యులకు ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందించేందుకు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు మోకాలొడ్డుతోంది. తమది పెత్తందారుల ప్రభుత్వమని చెప్పకనే చెప్పింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది.
ఏకంగా రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించింది. 2023–24లో 5 కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరు కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉండింది. దాదాపుగా పూర్తయిన ఈ కళాశాలల్లో ఎన్‌ఎంసీ తనిఖీలకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. పులివెందుల, పాడేరు కళాశాలలకు సీట్లు మంజూరు చేస్తూ ఎన్‌ఎంసీ ఆదేశాలు ఇచ్చింది.
దీనికి సంతోషించాల్సింది పోయి పులివెందుల కళాశాలకు సీట్లు కేటాయించొద్దంటూ ఆగమేఘాలపై గుట్టు చప్పుడు కాకుండా లేఖ రాసింది. జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు ప్రభుత్వం ఇలా పేద విద్యార్థులకు, పేద రోగులకు అన్యాయం చేయడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఆదివారం పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించి బాబు వైఖరిని కడిగిపారేశారు.
మీకు నష్టమేంటి బాబూ?
ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే సీఎం చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటో చెప్పాలి. వైఎస్ జగన్ తీసుకొచ్చాడనే దుగ్ధతో, కోపంతో, పగతో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణం. మీ హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా కట్టావా చంద్రబాబూ? మీకు ప్రైవేట్‌పైనే మోజు. ఒక పేద విద్యార్థి ప్రైవేటు మెడికల్ కళాశాలలో చదవాలంటే సుమారుగా రూ.1.5 కోట్ల డొనేషన్ చెల్లించాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించలేరన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గతేడాది 5 కళాశాలలు ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కావాల్సి ఉండింది. బాబు పుణ్యమా అని వాటికి మోక్షం లభించలేదు. – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
క్షమించరాని నేరం
జగనన్నపై ఉన్న ఈర్ష, ద్వేషాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలపై చూపుతున్నారు. కేటాయించిన సీట్లను ప్రభుత్వం రద్దు చేయమని కోరడం దుర్మార్గం. తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని తేకపోగా, ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం క్షమించరాని నేరం. ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? నీట్ పరీక్షలు రాసి మెడిసిన్ సీటు కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. కొత్తగా ఐదు కాలేజీలు వస్తున్నాయంటే కొంచెం ర్యాంకు తక్కువగా వచ్చినా, సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు. వారి ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. – ఆర్కే రోజా, మాజీ మంత్రి
సీట్లు అమ్ముకోవడమే లక్ష్యం
వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసి పెత్తందారులకు అమ్ముకోవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. మెడికల్ కాలేజీలు పూర్తి కాకుండా ప్రారంభించారని.. వసతులు, సిబ్బంది లేరని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రచారం చేయటం సిగ్గుచేటు. వైద్య కళాశాలలు ప్రారంభించటం అనేది మెడికల్ కౌన్సిల్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్ సభ్యులు పరిశీలించాకే కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తారు. ఇది కూడా మంత్రికి తెలియదా? – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment