అత్యంత చెత్త ప్రభుత్వం చంద్రబాబుదే
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
కాశీబుగ్గ: మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య అని.. ఈ విషయంలో ఏకైక అత్యంత చెత్త ప్రభుత్వం చంద్రబాబుదేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు.
చంద్రబాబు హామీలకు తాను గ్యారంటీ అన్న పవన్‌కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్ కాలేజీలు స్థాపించేందుకు గత సీఎం వైఎస్ జగన్ ఏర్పాట్లు చేశారని, వాటిలో ఐదింటిని పూర్తి చేశారని గుర్తు చేశారు. ఫలితంగా 2023–24లో విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలో వైద్య కళాశాలలు ప్రారంభమై ఒకేసారి 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.
మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయి ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు సైతం ప్రారంభమై మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చి ఉండేవని అన్నారు. మరోవైపు ముందుగా నిర్దేశించుకున్నట్టు 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, పెనుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురంలలో ఏడు కాలేజీలు కూడా ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్లు దాదాపు 5వేలకు చేరేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment