medical seats
-
మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ స్కాంలో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ సీట్ల కేటాయింపులో గతంలో జరిగిన అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీల సిబ్బందిని విచారణకు పిలుస్తున్నారు. గురువారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకుడు, చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు విచారణకు హాజరైనట్టు అధికారవర్గాల సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన లక్ష్మీనర్సింహారావును మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. ఏమిటీ కుంభకోణం? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి అనుబంధంగా ఉన్న 12 మెడికల్ కాలేజీల్లో పలు సీట్లను బ్లాక్ చేసి, అధిక ఫీజులకు అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు గతేడాది (2023) జూన్‌లో సోదాలు జరిపారు. నీట్ పీజీ మెరిట్ ఆధారంగా కనీ్వనర్ కోటా లేదా ఫ్రీ సీట్ల కింద దాదాపు 45 సీట్లను ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పేర్లతో బ్లాక్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యార్థులు ఎవరూ వర్సిటీలో అడ్మిషన్ కోసం ఎన్నడూ దరఖాస్తు చేసుకోలేదని విశ్వవిద్యాలయ అధికారులు గుర్తించారు. దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ 2022 ఏప్రిల్‌లో వరంగల్‌లోని మటా్వడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సీట్లను బ్లాక్ చేసి పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు ఉన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తులో భాగంగా 2023 జూన్ 22న బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ జిల్లా నగునూర్‌లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలోని కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని భాస్కర్ మెడికల్ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, సూరారంలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పటాన్‌చెరులోని మహేశ్వర మెడికల్ కాలేజీ, చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీ, డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణాల్లో ఈడీ సోదాలు జరిపింది. అందులో భాగంగా దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులు.. 12 కాలేజీలతో పాటు మరికొన్ని కాలేజీల యాజమాన్యాలకు కూడా సమన్లు జారీ చేసినట్టు తెలిసింది. అన్ని కాలేజీల ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం కాలేజీల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. -
సగం సీట్లు ‘ఇతరులకే’..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ మెడికల్ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా 50 శాతం సీట్లను నింపుతుండటంపై రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీజీ మెడికల్ సీట్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయి. ఎంబీబీఎస్‌లో నేషన ల్ పూల్ కింద ప్రభుత్వ సీట్లలో 15 శాతం జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుండగా, పీజీ మెడికల్ సీట్లలో ఏకంగా సగం కేటాయిస్తున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ విద్యార్థులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు మనోళ్ల అనాసక్తి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి దాదాపు 2,800 పీజీ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దాదాపు 1,200 మెడికల్ పీజీ సీట్లున్నాయి. వాటిల్లో 600 వరకు (50 శాతం) జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని రాష్ట్ర కౌన్సెలింగ్‌లో నింపుతారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విధానం మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్న రాష్ట్రాల విద్యార్థులకు మేలు చేస్తుండగా, తెలంగాణలాంటి రాష్ట్రాల విద్యార్థులకు మాత్రం నష్టం కలిగిస్తున్నదని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాదికి చెందిన చాలామంది విద్యార్థులు మన రాష్ట్రంలోని సీట్లపై ఆసక్తి చూపుతారు. కానీ మన రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో జాతీయ కోటాలో నింపే మన రాష్ట్ర 600 సీట్లలో దాదాపు 300 మంది ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారని కాళోజీ వర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో మన రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారని చెబుతున్నారు. -
మెడికల్ సీట్లు వదులుకోవడం హేయం
కాశీబుగ్గ: మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య అని.. ఈ విషయంలో ఏకైక అత్యంత చెత్త ప్రభుత్వం చంద్రబాబుదేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు.చంద్రబాబు హామీలకు తాను గ్యారంటీ అన్న పవన్‌కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్ కాలేజీలు స్థాపించేందుకు గత సీఎం వైఎస్ జగన్ ఏర్పాట్లు చేశారని, వాటిలో ఐదింటిని పూర్తి చేశారని గుర్తు చేశారు. ఫలితంగా 2023–24లో విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలో వైద్య కళాశాలలు ప్రారంభమై ఒకేసారి 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయి ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు సైతం ప్రారంభమై మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చి ఉండేవని అన్నారు. మరోవైపు ముందుగా నిర్దేశించుకున్నట్టు 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, పెనుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురంలలో ఏడు కాలేజీలు కూడా ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్లు దాదాపు 5వేలకు చేరేవన్నారు. -
మెడికల్ సీట్లపై హరీశ్ రావు ఆగ్రహం.. ప్రభుత్వానికి ప్రణాళిక లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదని మండిపడ్డారు. ఆయన బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘‘ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రణాళిక లేదని మెడికల్ సీట్ల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులుగా పరిగణించేలా కుట్రలు జరుగుతున్నాయి. 2018 లో బీఆర్ఎస్ ప్రభుత్వం 114 జీవో ఇచ్చి 95 శాతం ఉద్యోగాలన్ని తెలంగాణకే దక్కే విధంగా ఉత్తర్వులు ఇచ్చాము. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్ రాజధానిగా ఉంది. ఈ పదేళ్లు ఏపీలోని విద్యార్థులు 15 శాతం ఇక్కడ చదువుకోవచ్చని చెప్పింది. .. డాక్టర్లు కావాలని పిల్లల తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ వారి కలలు కల్లల్లుగా మారే పరిస్తితికి వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెడికల్ సీట్ల సంఖ్య పెంచాము. జీవో సవరించి 520 సీట్లు పెరిగేలా మేము కృషి చేశాం. బీ కేటగిరి సీట్లలో కూడా లోకల్ రిజర్వేషన్లు ఉండేలా తెలంగాణ పిల్లలకు దక్కేలా చేశాం. ఆదరాబాదరాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం, నష్టం జరిగేలా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ‘స్వచ్ఛదనం పచ్చదనం’ అని అయిదు రోజుల కార్యక్రమం ప్రారంభించింది. ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదు. గ్రామాల్లో సమస్యలు గుర్తించి చెప్పాలని అంటున్నారు. క్లీనింగ్ కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లాలని చెప్పింది మరీ డబ్బులు ఎక్కడివి. సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల దగ్గర డబ్బే లేదు. డీజిల్ లేక ట్రాక్టర్లు ఆగిపోయాయి. గ్రామ పంచాయతీలో కరెంట్ బిల్లులు పేరుకుపోయాయి. సిబ్బందికి జీతాలు లేవు. మరి ఎక్కడి నుంచి ‘స్వచ్ఛదనం పచ్చదనం’ ఎలా చేస్తారు. ఇవాల్టికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గ్రామ పంచాయతీలకు 8పైసలైన ఇచ్చారా? ఆసుపత్రుల్లో మందులు లేవు’ అని అన్నారు.అని మండిపడ్డారు. -
అన్ని వైద్య కళాశాలల్లోఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లలో 10 శాతం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని (మైనారిటీ కాలేజీలు మినహా) సగం కనీ్వనర్ కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కేటాయించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ మేరకు అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 7 కాలేజీల్లోనే.. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. హైదరాబాద్‌లోని గాందీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఎన్ఎంసీ అనుమతి మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గతేడాది వరకు ఆయా కాలేజీల్లో 103 ఎంబీబీఎస్ సీట్లు ఈ కోటా కింద అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చారు. కాగా ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను అమలు చేస్తే మరో 350 వరకు ఎంబీబీఎస్ సీట్లు అగ్రవర్ణ పేదలకు దక్కే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత, అడ్మిషన్ నోటిఫికేషన్ కంటే ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జనరల్ కోటా సీట్లకు గండిరాష్ట్రంలో గతేడాది వరకు 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అయితే ఇప్పటివరకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు గాను అంతే మొత్తంలో సీట్లను ఆయా మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ మంజూరు చేసింది. దీనివల్ల ఇతర రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కానీ, జనరల్ కేటగిరీ కోటా సీట్లకు కానీ కోత పడేది కాదు. కానీ తాజాగా ఎన్ఎంసీ అదనపు సీట్లు మంజూరు చేయడం కుదరదని, ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి కోత ఉండదని అంటున్నారు. అంటే జనరల్ కేటగిరీ సీట్లకు కోత పెట్టి వాటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు కేటాయిస్తారు. అలాగైనా తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అంటున్నారు. జనరల్ కేటగిరీలోనూ తమకు ప్రతిభ ప్రకారం రావాల్సిన సీట్లకు గండి పడుతుందని, దీనివల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలంటే ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలున్నాయి. అన్ని మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యే పక్షంలో ఈ మేరకు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. -
కొత్తగా... 850 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, అమరావతి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 850 వైద్య సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఐదు నూతన వైద్య కళాశాలలను ప్రారంభించడం ద్వారా 750 సీట్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేయడంతో పాటు, మన విద్యార్థులకు వైద్య విద్యావకాశాలు పెంచేలా ఏకంగా 17 కొత్త కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 2024–25 విద్యా సంవత్సరం నుంచి పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఐదు చోట్ల వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, వైద్య కళాశాలలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. వసతుల కల్పన వేగంగా కొనసాగుతోంది. ఒక్కోచోట 150 చొప్పున 750 సీట్ల కోసం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)కు దరఖాస్తు చేశారు. మరోవైపు అనంతపురం వైద్య కళాశాలలో 50, నెల్లూరు, శ్రీకాకుళం కళాశాలల్లో ఒక్కో చోట 25 చొప్పున 50 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం అనంతపురంలో 150, శ్రీకాకుళంలో 175, నెల్లూరులో 175 సీట్లున్నాయి. కాగా, ఒక్కో చోట 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా బోధనాస్పత్రుల్లో పడకలు, వైద్యులు, సిబ్బంది, ఇతర వనరులున్నాయి. దీంతో 200 సీట్లను పెంచేలా ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. నూతన వైద్య కళాశాలలతో పాటు, అనంత, శ్రీకాకుళం, నెల్లూరు కళాశాలల్లో ఎన్ఎంసీ బృందం త్వరలో ఇన్స్పెక్షన్కు రానుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ప్రతి కొత్త జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండేలా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తోంది. తద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ విద్యా సంవత్సరంలో ఐదు కళాశాలలను ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం మరో ఐదు కళాశాలలు ప్రారంభించడం ద్వారా ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు సమకూరనున్నాయి. ఇక మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. నిబంధనలకనుగుణంగా వనరులు ఐదు కొత్త కళాశాలలను ప్రారంభించడానికి వీలుగా అన్ని విధాలా సిద్ధమవుతున్నాం. ఇప్పటికే ఐదు చోట్ల అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్లు, ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాం. కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఎన్ఎంసీ నిబంధనలకనుగుణంగా ఏపీఎంఎస్ఐడీసీ వనరులు సమకూరుస్తోంది. ఎన్ఎంసీ బృందం తనిఖీలకు రావాల్సి ఉంది. – డాక్టర్ నరసింహం, డీఎంఈ -
వైద్యసేవల్లో తెలంగాణ ఫస్ట్
సాక్షి, యాదాద్రి: వైద్య సేవల్లో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో ఉంటే.. డబుల్ ఇంజిన్ సర్కారు పాలిస్తున్న ఉత్తరప్రదేశ్ చిట్టచివరి స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. ఒక్క ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. హరీశ్‌రావు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం సైదాపురం గ్రామంలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. సీఎం కేసీఆర్ జన్మదినానికి ఒక రోజు ముందుగానే ఆస్పత్రికి భూమిపూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. వారి చేతికి పోతే ఆగమే..: రాష్ట్ర ప్రభుత్వం 81 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నోటిఫికేషన్లు ఇస్తే సంతోషపడాల్సిందిపోయి బాధపడుతున్నాడని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం లేక, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే ఒకరు కుట్ర అంటున్నారని, అంబేడ్కర్ పేరు మీద సచివాలయం నిర్మిస్తే ఇంకొకరు కూలుస్తం అంటున్నారని మండిపడ్డారు. పేల్చేటోని చేతికో.. కూల్చేటోని చేతికోపోతే తెలంగాణ ఆగం అవుతుందన్నారు. వచ్చే నెల మొదటి వారంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో న్యూట్రిషన్ కేసీఆర్ కిట్టును ప్రారంభించనున్నామని, ఏప్రిల్ మొదటి వారంలో 33 జిల్లాల్లో ప్రారంభించనున్నామని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుండటంతో మహారాష్ట్ర, కర్ణాటక సర్పంచులు.. తమను తెలంగాణాలో కలపాలని వినతులు ఇస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా వార్త వచి్చందని బీబీసీ మీద ఐటీ దాడులు చేయించడాన్ని చూసి ప్రజలు నవ్వుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ స్టూడెంట్స్ కు శుభవార్త
-
ఉక్రెయిన్ విద్యార్థులకు దేశీయంగా సీట్లు కల్పించలేం
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశీయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో మరో దేశంలో వైద్య విద్య పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను దేశీయ కళాశాలల్లో ప్రవేశం కల్పించడం చట్టపరంగా సాధ్యం కాదని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ‘నీట్లో తక్కువ మార్కులు రావడంతోనే వారంతా ఉక్రెయిన్ వెళ్లారు. నీట్లో తక్కువ మెరిట్ ఉన్న వీరికి ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తే ఆయా కాలేజీల్లో సీట్లు పొందలేకపోయిన అభ్యర్థుల నుంచి పిటిషన్లు వెల్లువెత్తే ప్రమాదముంది. ఉక్రెయిన్ యుద్ధంతో కోర్స్ పూర్తి చేయలేని విద్యార్థుల కోసం సెప్టెంబరు ఆరున నేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన పబ్లిక్ నోటీస్‌తో మాకు అభ్యంతరం లేదు. అయితే ఆ నోటీసు వీరికి ఇక్కడి కాలేజీల్లో బ్యాక్ డోర్ ఎంట్రీగా భావించరాదు’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘తిరిగొచ్చిన విద్యార్థుల్ని దేశీయ మెడికల్ కాలేజీలకు బదిలీ చేస్తే దేశంలో వైద్య విద్య ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని కేంద్రం పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద ఏయే దేశాల్లోని యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చో తెలిపే జాబితాను గురువారం నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, లిథువేనియా, పోలండ్, స్వీడన్, ఈజిప్టు, ఇజ్రాయెల్, గ్రీస్, ఇరాన్, చెక్ రిపబ్లిక్, జార్జియా, కజకిస్తాన్, స్లోవేకియా, హంగేరీ, ఉజ్బెకిస్తాన్, బెలారస్, లాత్వియాల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చని తెలిపింది. ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే! -
వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: నీట్ పీజీ–21 కౌన్సిలింగ్లో ఏకంగా 1456 సీట్లు ఖాళీగా మిగిలిపోవడంపై సుప్రీంకోర్టు విస్మయం వెలిబుచ్చింది. దేశమంతా డాక్టర్ల కొరతతో అల్లాడుతుంటే ఇదేం నిర్వాకమంటూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) తీరును తూర్పారబట్టింది. మెడికల్ పీజీ ఖాళీల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, అనిరుద్ధ బోస్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ బుధవారం విచారించింది. ‘‘ఒక్క సీటు మిగిలినా దాన్ని ఖాళీగా పోనీయొద్దు. అది మెడికల్ కౌన్సిల్ బాధ్యత. కానీ ఏటా ఇదే సమస్య పునరావృతమవుతోంది. ఇన్ని సీట్లు ఖాళీగా మిగిలిపోతే ఎలా?’’ అంటూ తూర్పారబట్టింది. సీట్ల సంఖ్య, అడ్మిషన్ల సంఖ్య వెల్లడికి కటాఫ్ డేట్ ఉండాలని మేం గతంలోనే తీర్పు ఇచ్చాం. అయినా కౌన్సెలింగ్ మధ్యలో సీట్లను ఎందుకు జోడిస్తున్నారు? ఇలాంటి చర్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎంతటి ఒత్తిడి పడుతుందో ఆలోచించారా? స్టూడెంట్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయమిది. అహర్నిశలూ పట్టుదలగా చదివి పరీక్ష రాయాలి. 99 శాతం తెచ్చుకున్నా చివరికిలా అడ్మిషన్ సమస్యలు! ఇలాంటి పరిస్థితి వారినెంతటి నరకంలోకి నెడుతుందో మీకు అర్థమవుతోందా?’’ అని ప్రశ్నించింది. కేంద్రం తరఫున వాదించాల్సిన అదనపు సొలిసిటర్ జనరల్ బల్బీర్‌సింగ్ వ్యక్తిగత సమస్యతో రాలేకపోయినందున వాయిదా ఇవ్వాలన్న విజ్ఞప్తికి తిరస్కరించింది. ‘‘ఇది వైద్య విద్యార్థుల హక్కులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం. పైగా సుప్రీంకోర్టులో కేంద్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఒక్క ఏఎస్జీ మాత్రమే లేరుగా!’’ అని పేర్కొంది. మొత్తం సీట్లు, ఖాళీలు, అందుకు కారణాలతో 24 గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఎంసీసీని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. అడ్మిషన్ల వ్యవహారాలు చూసే డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ గురువారం హాజరవాలని ఆదేశించింది. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుంటే వారికి పరిహారమివ్వాల్సిందిగా ఆదేశాలిస్తామని పేర్కొంది. చదవండి: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆహుతైన కార్లు, బైక్‌లు, రిక్షాలు, ఫొటోలు వైరల్ -
పేదింట్లో వైద్య కాంతులు.. ఆ కల వాళ్లని ఇంత వరకు నడిపించింది!
సాక్షి,మల్యాల(చొప్పదండి): నిరుపేద కుటుంబాల విద్యార్థులు చదువులో సత్తాచాటి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సీటు సాధించి తమ కలలను సాకారం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా లక్ష్యసాధనకు నిరంతరం తపించారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన వైద్య విద్య వారి దరికి చేరింది. కష్టసుఖాలు.. తాము అనుభవించిన పేదరికాన్ని పిల్లలు అనుభవించకూడదనే తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా.. సమాజానికి సేవ చేసే ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనే తమ కలలను నెరవేర్చుకున్నారు. పేదరికాన్ని రుచి చూస్తూ పెరిగిన పిల్లలు వైద్య వృత్తి బాటలో పయనిస్తూ నిరుపేదలకు చేయూతనందిస్తామంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బింగి నర్సయ్య– మంజుల కూతురు మనీషా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వైద్య విద్యవైపు అడుగులు వేసింది. తండ్రి బట్టల వ్యాపారి, తల్లి బీడీ కార్మికురాలు. నూకపల్లి మోడల్స్కూల్లో పదో తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్లో 985 మార్కులు సాధించింది. తండ్రి గ్రామాల్లో తిరుగుతూ బట్టల వ్యాపారం, మరోవైపు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కూతురు మనీషా ఈ ఏడాది నీట్లో 543 మార్కులు సాధించి వైద్యురాలిగా తన కల నెరవేర్చుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. చిన్న కూతురు అనూషను సైతం నీట్ కోసం సిద్ధం చేస్తున్నారు. విరిసిన దళిత కుసుమం.. మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబం పద్మ–గంగయ్యల ఒక్కగానొక్క కూతురు నిఖిత. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టాడు. ఆది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివింది. పదో తరగతిలో 9.3 జీపీఏ, ఇంటర్లో 953 మార్కులు సాధించింది. గతేడాది వైద్య విద్యలో సీటు సాధించి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకుంది. వైద్య విద్య అడ్మిషన్‌కు కూడా డబ్బులు కట్టలేని స్థితిలో నిఖితకు “సాక్షి’ తోడుగా నిలవగా.. డాక్టర్ కావాలనే కల సాకారం చేసుకుంది. తనలాంటి పేద విద్యార్థులకు చేయూతనందిస్తానని, నిరుపేదలకు ఉచితంగా సేవలందిస్తానని నిఖిత చెబుతోంది. తండ్రి కల నెరవేర్చిన తనయ మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి మల్లేశం కూతురు అలేఖ్య. గ్రామంలో రెండు దశాబ్దాలుగా మల్లేశం ఆర్ఎంపీగా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య గీత బీడీ కార్మికురాలు. తన కూతురును డాక్టర్ చేయాలనే తండ్రి ఆశయానికి తోడు తనయ కష్టపడి చదివి ఉస్మానియాలో ఉచితంగా సీటు సాధించింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్లో 988 సాధించింది. మూడేళ్లక్రితం ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు సాధించి, తండ్రి ఆశయాన్ని, తన కలను నెరవేర్చుకుంది. ఆది నుంచి ముందువరుసలో.. మల్యాల మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ రెండు దశాబ్దాలుగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. డాక్టర్ కావాలంటూ చిన్నప్పటి నుంచి తన కుమారుడు గాయత్రినందన్కు బీజాలు నాటాడు. తండ్రి మాటలకు అనుగుణంగా గాయత్రినందన్ డాక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆదినుంచి ప్రణాళికతో చదివి పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 988 మార్కులు సాధించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే నీట్లో 583 మార్కులు సాధించి ఇటీవలే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉచితంగా సీటు సాధించాడు. మట్టి పరిమళం కల్పన మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన మిర్యాల మల్లారెడ్డి– వనిత దంపతులది వ్యవసాయ కుటుంబం. డాక్టర్ కావాలనే కూతురు కల్పన కలకు బాసటగా నిలిచారు. చదువుకోసం వ్యవసాయ భూమి అమ్మేందుకుసైతం వెనకాడబోమని భరోసానిచ్చారు. తల్లిదండ్రుల భరోసాతో కల్పన మరింత కష్టపడి చదివింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్ మొదటి సంవత్సరంలో 436/440 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకులో నిలిచింది. అదే ఉత్సాహంతో ఇంటర్లో 986 మార్కులు సాధించింది. కష్టపడి చదివి ఉచితంగా వైద్య కళాశాలో సీటు సాధించి ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతోంది. గ్రామంలో నెట్వర్క్ లేకపోతే చదువుకు ఆటంకం కలుగవద్దని నేరుగా శ్మశానంలో కూర్చుండి కూడా ఆన్లైన్ తరగతులు వింటూ చదువును కొనసాగించి, డాక్టర్ కావాలనే తనలోని దృఢ సంకల్పాన్ని చాటి చెప్పింది. -
ఏ ర్యాంకుకు ఎక్కడ ఎంబీబీఎస్ సీటు? విద్యార్థుల్లో పరేషాన్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఇటీవలే ముగిసింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 59 వేల మందికిపైగా నీట్ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల ఆందోళన అంతా తమకొచ్చే ర్యాంకుకు సీటు వస్తుందో, రాదోననే. మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా.. ఇలా అన్నీ కలిపి 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. అభ్యర్థుల్లో అందరి దృష్టి ప్రభుత్వ కళాశాలలపైనే ఉంది. దీనికోసం ఎన్ని మార్కులు వస్తే.. ఎంత ర్యాంకు వస్తుంది, ఎంత ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తుందో తెలుసుకునే పనిలో ప్రస్తుతం అభ్యర్థులంతా తలమునకలై ఉన్నారు. ఈ ఏడాది నీట్లో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) కొంచెం కష్టంగా వచ్చింది. దీంతో ఫిజిక్స్‌లో బాగా పట్టున్న వారు, ఆ సబ్జెక్టు బాగా రాసిన వారు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఎన్ని మార్కులొస్తే సీటు వస్తుంది? ఏయూ పరిధిలో ఓపెన్ కేటగిరీలో 343 మార్కులకు డెంటల్ సీటు గతేడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో ఎస్టీ కేటగిరీలో 162 మార్కులు సాధించిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో దంత వైద్య సీటు లభించింది. జాతీయ స్థాయిలో 6,31,277 ర్యాంకు సాధించిన అభ్యర్థికి 162 మార్కులు వచ్చాయి. అదే ఓపెన్ కేటగిరీలో చివరి సీటు 343 మార్కులు (ర్యాంకు 2,57,671) వచ్చినవారికి దక్కింది. ఎస్సీ కేటగిరీలో 310 మార్కులు వచ్చిన వారికి చివరి సీటు లభించింది. అదే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చూస్తే ఎస్టీ కేటగిరీలో 359 మార్కులు (2,35,606 ర్యాంకు) వచ్చిన వారికి కూడా సీటు దక్కింది. దీన్ని బట్టి చూస్తే ఒకే రాష్ట్రంలో రెండు యూనివర్సిటీల పరిధిలో ఎంత వ్యత్యాసం ఉందో అంచనా వేయొచ్చు. -
NEET 2021: నేడు ‘నీట్’.. ఇవి వద్దు, ఇవి తప్పనిసరి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం ఆదివారం ‘నీట్’(జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) నిర్వహించనున్నారు. దీని కోసం రాష్ట్రంలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలోని కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఏపీ నుంచి ఈ ఏడాది 59 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి సుమారు 5 వేల సీట్లున్నాయి. 85 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసుకోనుండగా, 15 శాతం సీట్లు మాత్రం నేషనల్ పూల్(కేంద్ర కోటా)లో భర్తీ అవుతాయి. ఈ 15 శాతం సీట్లు ఏపీ ఇవ్వడం వల్ల.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలిచ్చే 15 శాతం కోటాకు రాష్ట్ర విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశముంటుంది. ప్రభుత్వ పరిధిలో 11 వైద్యకాలేజీలుండగా, ప్రైవేటు పరిధిలో 18 వరకు ఉన్నాయి. గంట ముందే రావాలి.. పరీక్షా కేంద్రానికి గంట ముందే వచ్చేలా విద్యార్థులు సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు మధ్యాహ్నం 1.30కల్లా పరీక్షా కేంద్రానికి వచ్చి ఇన్విజిలేటర్‌కు అడ్మిట్ కార్డు చూపించాలి. 1.45 గంటలకు బుక్లెట్ ఇస్తారు. 1.50కి బుక్‌లెట్‌లో వివరాలు నింపాల్సి ఉంటుంది. సరిగ్గా 2 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకే పరీక్షా కేంద్రానికి రావడం వల్ల ప్రశాంతంగా ఇవన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యంగా వస్తే నిబంధనల మేరకు పరీక్షకు అనుమతించరు. తప్పకుండా తీసుకురావాల్సినవి ఇవే.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు విధిగా ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకురావాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులు.. అంటే పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వీటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా తెచ్చుకోవాలి. కోవిడ్ నిబంధనల మేరకు మాస్కు, గ్లౌజులు ధరించాలి. శానిటైజర్(50 ఎం.ఎల్) బాటిల్ తెచ్చుకోవచ్చు. నిషేధిత జాబితా.. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, ఆభరణాలు తదితరాలు తీసుకురాకూడదని నిబంధనల్లో స్పష్టం చేశారు. చెవులకు ధరించే ఆభరణాలు, బ్రాస్లెట్, వేలి ఉంగరాలు, ముక్కు పిన్లు, చైన్లు, నక్లెస్‌లు, పెండెంట్స్ తదితర ఆభరణలేవీ పెట్టుకోకూడదు. అలాగే కాగితాలు, బిట్స్ పేపర్లు, జామెట్రీ బాక్స్‌లు, పెన్సిల్ బాక్స్‌లు, క్యాలిక్యులేటర్లు, ప్లాస్టిక్ పౌచ్‌లు, స్కేల్, రైటింగ్ ప్యాడ్, ఎరైజర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్స్ తీసుకురాకూడదు. మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, పేజర్స్, హెల్త్ బ్యాండ్లు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్, స్కార్ఫ్, కెమెరా తదితర వస్తువులన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. -
మెడికల్ సీట్లలో కరోనా వారియర్స్ కోటా
సాక్షి, హైదరాబాద్: మెడికల్ సీట్లలో కోవిడ్ వారియర్స్ కోటాను కేంద్రం కల్పించింది. ఈ కోటా కింద మొత్తం 5 ఎంబీబీఎస్ సీట్లను రిజర్వ్ చేస్తారు. గతేడాది జరిగిన పరీక్షలో కూడా ఈ కోటాను కేంద్రం కల్పించింది. నీట్ పరీక్షలో అర్హత సాధించిన కోవిడ్ వారియర్స్ పిల్లలకు ఈ కోటా కింద మెడికల్ సీట్లలో రిజర్వేషన్ లభిస్తుంది. కరోనా సోకిన వారికి నేరుగా చికిత్స అందించే డాక్టర్లు, సిబ్బంది (ప్రభుత్వ/ ప్రైవేటు)ని కోవిడ్ వారియర్స్‌గా పరిగణిస్తారు. కాగా, రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నీట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హయత్‌నగర్‌లోనూ పరీక్ష కేంద్రాలుంటాయి. నీట్ కోసం దరఖాస్తు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. వచ్చే నెల 6వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 8 నుంచి 12 వరకు సవరణలు చేసుకోవచ్చు. పరీక్షకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. నీట్ ముఖ్యాంశాలు.. నీట్ పరీక్ష సెప్టెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య జరుగుతుంది. మాతృ భాష భాషను ఎంచుకునే అభ్యర్థులకు వారి భాష, ఇంగ్లిష్‌లో పరీక్ష బుక్లెట్ ఇస్తారు. ఇంగ్లిష్ ఎంచుకునే వారికి ఆ భాషలోనే బుక్లెట్ ఉంటుంది. నీట్ ప్రవేశ పరీక్ష ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1,500, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.1,400, ఎస్సీ, ఎస్టీ తదితరులకు రూ.800గా నిర్ణయించారు. -
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 145 పీజీ సీట్ల పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. ఇటీవలే 700 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, తాజాగా అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు తదితర చర్యలతో ఎండీ, ఎంఎస్ వంటి పీజీ సీట్లకు అర్హత వచ్చింది. దీంతో పలు కాలేజీల్లో వివిధ పీజీ కోర్సులకు దరఖాస్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు కళాశాలల్లో దరఖాస్తు చేసిన సీట్లకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు జారీ చేసింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో సుమారు ఐదు విభాగాల్లో 28 సీట్లు రానున్నాయి. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో గైనకాలజీ సీట్లు, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ సీట్లకు దరఖాస్తు చేశారు. కాకినాడలోని వైద్య కళాశాలకు భారీగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. సీట్లు పెరగడం వల్ల పేదలకు భారీ లబ్ధి జరగనుంది. కర్నూలు, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం కాలేజీల్లో కూడా భారీగా పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంచేందుకు దరఖాస్తు చేశారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ కలిపి ఒకేసారి 145 సీట్లు పెరగడం ఇదే మొదటిసారి. ఈ సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. సీట్లతో పాటు మౌలిక వసతుల కల్పన వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరగడమంటే కేవలం వైద్య విద్యార్థులు చదువుకోవడమే కాకుండా, దీనికి సంబంధించి భారీ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి విభాగంలోనూ యూనిట్లు పెంచాలి. ఒక్కో యూనిట్‌కు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్లు, ఒక ప్రొఫెసర్ ఉండాలి. స్టాఫ్ నర్సులు, ఆపరేషన్ థియేటర్లు పెరుగుతాయి. ఇంటెన్సివ్ కేర్, ఆక్సిజన్ బెడ్స్ విధిగా అందుబాటులోకి తీసుకురావాలి. ఇలా ఒక పీజీ సీటు పెరిగిందంటే చాలా రకాల మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, వైద్యులు పెరిగితే ఆటోమేటిగ్గా ఎక్కువ మంది పేషెంట్లకు స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అందువల్ల త్వరలో పెరగనున్న పీజీ సీట్లతో భారీగా వసతులు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు బలోపేతం జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల మేరకు సీట్లు పెంచుతున్నాం. అదనపు సీట్లతో భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఆయా సీట్లకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు జారీ చేసింది. సీట్లకు సరిపడా ప్రొఫెసర్ల కోసం అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాలలు భారీగా బలోపేతం కానున్నాయి. – డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు -
గోల్డ్ మెడలిస్ట్.. అతని టార్గెట్ నీట్ విద్యార్థులే!
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసిన యువతను టార్గెట్ చేసుకుని..ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ దేశ వ్యాప్తంగా అనేక మందిని మోసం చేసిన హైదరాబాదీ ఆనంద్‌ను భోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దందా కోసం ఇతగాడు ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసి, కాల్ సెంటర్ నిర్వహించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇతని చేతిలో మోసపోయిన వారిలో నగరానికి చెందిన వారూ ఉన్నట్లు తేలింది. దీంతో దర్యాప్తు కోసం ఓ ప్రత్యేక బృందం మంగళవారం వచ్చివెళ్లింది. బెంగళూరుకు చెందిన అర్వింద్ కుమార్ అలియాస్ ఆనంద్ కుటుంబం నగరంలో స్థిరపడింది. ఓయూ నుంచి ఎంటెక్ గోల్డ్ మెడల్ పొందాడు. ఇండోర్ వెళ్లి కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీగా పనిచేశాడు. అదే సమయంలో నీట్ పరీక్ష రాసిన అనేక మంది సీట్ల కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తారని గుర్తించాడు. అలాంటి వారిని మోసం చేయడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ భోపాల్, ఇండోర్, పుణే, బెంగళూరుల్లో కార్యాలయాలు తెరిచాడు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల జాబితాలను సమీకరించే వాడు. తన కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకున్న కాల్‌సెంటర్ల నుంచి ఫోన్లు చేయించి ఎస్ఎమ్మెస్లు పంపి ఆకర్షించేవాడు. రెండేళ్ల క్రితం ఓ నకిలీ వెబ్సైట్ రూపొందించాడు. దీనిలోకి ఎంటర్ అయిన వారి వివరాల ద్వారా అభ్యర్థుల ఫోన్లు చేయించి ప్రైవేట్ వైద్య కళాశాల్లో సీట్లంటూ చెప్పించే వాడు. స్టార్ హోటళ్లలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో నమ్మకం కలిగించే వాడు. ఆపై విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, అడ్వాన్సుల పేరుతో రూ.లక్ష వరకు వసూలు చేసి మోసం చేసేవాడు. ఈ వ్యవహారాల్లో ఇతడికి మరో మహిళ సహకారం అందించింది. ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న భోపాల్ క్రైమ్ బ్రాంచ్ ఆనంద్‌ను గత బుధవారం పుణేలో పట్టుకుంది. ఇతడి చేతిలో హైదరాబాద్ చెందిన వాళ్లూ మోసపోయినట్లు గుర్తించింది. ఆయా విద్యార్థుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు తదుపరి దర్యాప్తు కోసం భోపాల్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ టీమ్ మంగళవారం వచ్చి వెళ్లింది. వందల మందిని మోసం చేసిన ఈ స్కామ్ రూ.కోట్లలో ఉంటుందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
కరోనా కట్టడికి అన్ని చర్యలు
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోందని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదించారు. కరోనా చికిత్సలు చేస్తున్న వైద్యులు, ఇతర మెడికల్ సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలంటూ నగరానికి చెందిన ఆర్.సమీర్ అహ్మద్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన నివేదిక సమర్పించారు. ‘ఇప్పటివరకు 60,81,517 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశాం. డిసెంబర్ 1 తర్వాత రోజూ 50 వేలకుపైగా పరీక్షలు చేస్తున్నాం. రాష్ట్రంలోని వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందికి సంబంధించి రక్షణ చర్యలు తీసుకుంటున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా 300 మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను ఏర్పాటు చేసి అవసరమైన వారందరికీ పరీక్షలు చేస్తున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు 20 మంది సైకాలజిస్టులు పలు జిల్లా ఆసుపత్రుల్లో అవసరమైన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులకు ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబర్‌కు 1,409 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధిక బిల్లులు వసూలు చేశారంటూ 277 ఫిర్యాదులు రాగా అందులో 211 పరిష్కరించాం. 65 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరహాలో డెత్ ఆడిట్ కమిటీని ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.’అని నివేదించారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 31న విచారణ చేయనుంది. -
పీజీ ప్రవేశాల్లో ప్రభుత్వ డాక్టర్లకు కోటా!
న్యూఢిల్లీ: మారుమూలప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లకు పీజీ కోర్సుల అడ్మిషన్లలో రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు ఉన్న రిజర్వేషన్లలో ప్రత్యేక ప్రొవిజన్లు చేర్చుకునే చట్టబద్ధత రాష్ట్రాలకు ఉందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి ప్రత్యేక కోటా ఇవ్వకూడదన్న ఎంసీఐ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ డాక్టర్లకు రిజర్వేషన్ సౌకర్యంపై తమిళనాడు మెడికల్ ఆఫీసర్ల సంఘం వేసిన దావాలో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. (జేఈఈ మెయిన్ ఫలితాలు 11న) -
పేదల విద్యార్ధులకు అండగా ఏపీ ప్రభుత్వం
-
పీజీ చేసినా కాన్పు చేయడం రాదాయే!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ గైనకాలజీ పూర్తి చేసిన అనేకమంది విద్యార్థులు కనీసం కాన్పులు చేయలేని దుస్థితి నెలకొంది. పీజీ సీటు కోసం లక్షలకు లక్షలు.. మేనేజ్మెంట్ కోటాలోనైతే కోట్లు పెట్టి గైనిక్ పూర్తిచేసినా కనీసం ప్రసవం చేస్తామన్న ఆత్మవిశ్వాసం కూడా వారిలో లేకుండా పోయింది. దీంతో అనేకమంది విద్యార్థులు కోర్సు పూర్తయిన తర్వాత ఎక్కడో ఒకచోట సీనియర్ గైనకాలజీ డాక్టర్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో అనేక ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో నెలకొంది. మరోవైపు గైనిక్ సీట్లను కాపాడుకునేందుకు ప్రసవాలు ఎక్కువగానే చేస్తున్నామంటూ ప్రైవేటు కాలేజీలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. కాన్పులు చేయలేని పరిస్థితి ఏర్పడటంతో కనీసం ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని కొందరు జూనియర్ గైనిక్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సోమవారం కొందరు గైనిక్ విద్యార్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తమకు ఎలాగైనా సాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వాస్పత్రులకే గర్భిణులు.. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే మగ బిడ్డను కన్న తల్లికి రూ.12 వేలు, ఆడ బిడ్డను కన్న తల్లికి రూ.13 వేలు ప్రోత్సాహకం ఇస్తుంది. దీంతోపాటు బిడ్డ, తల్లికి కలిపి వారి అవసరాల కోసం కొన్ని రకాల వస్తువులను కూడా ఉచితంగా ఇస్తుంది. దీంతో 2017 నుంచి ఇప్పటివరకు 6.5 లక్షల మంది మహిళలు కేసీఆర్ కిట్ పథకం ద్వారా లబ్ధి పొందారు. దీంతో ప్రైవేటు బోధనాస్పత్రులకు వెళ్లే గర్భిణీల సంఖ్య భారీగా పడిపోయింది. తక్కువ ఫీజుకే ప్రసవాలంటూ బోర్డులు.. కేసీఆర్ కిట్ దెబ్బతో అధికార పార్టీలోని ఓ కీలక ప్రజాప్రతినిధికి చెందిన ప్రైవేటు మెడికల్ కాలేజీకి చెందిన అనుబంధ ఆస్పత్రి ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. గర్భిణీలను ఆకర్షించేందుకు ఒక బోర్డు తగిలించింది. గర్భిణీ స్త్రీలు మొదట రూ.2 వేలు చెల్లిస్తే చాలు.. వారికి మొదటి నుంచి తమ వద్దే చెకప్‌లు చేసి, ఆ తర్వాత కాన్పు కూడా చేసి పంపిస్తామని బోర్డులో పేర్కొంది. దీనికైనా ఆకర్షితులై గర్భిణీలు తమ వద్దకు వస్తారని, తద్వారా గైనిక్ పీజీ విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందుతుందని ఆశిస్తున్నారు. అలాగే మరో ప్రైవేటు అనుబంధ ఆస్పత్రి కూడా ఇలాగే బోర్డు తగిలించింది. మొదట తమకు రూ.2,500 చెల్లిస్తే చాలు, మిగిలిన మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చుతామని హామీ ఇస్తోంది. అయితే ఈ హామీలు ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు ఇవ్వడం లేదని ఆయా కాలేజీలు అంటున్నాయి. తమకు కూడా కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తే ఈ సమస్య తీరుతుందని, సర్కారు ప్రోత్సాహకం వల్ల గర్భిణీలు అధికంగా వస్తారని, గైనిక్ విద్యార్థులకు మంచి శిక్షణ కూడా ఉంటుందని బోధనాస్పత్రులు ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విన్నవించాయి. అయితే ఇలా చేస్తే పథకం దుర్వినియోగం అవుతుందన్న భయం సర్కారులో ఉంది. ప్రాక్టికల్ శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది.. కేసీఆర్ కిట్ అమలు తర్వాత ప్రభుత్వ బోధనాస్పత్రులకు, ఇతర సర్కారు ఆస్పత్రులకు గర్భిణీల రాక మరింత పెరిగింది. దీంతో ప్రైవేటు బోధనాస్పత్రులకు గర్భిణీల సంఖ్య కాస్తంత తగ్గి ఉండొచ్చు. దీంతో అక్కడ చదివే పీజీ విద్యార్థులకు సరైన ప్రాక్టికల్ శిక్షణ పెద్దగా ఉండటంలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో గైనిక్ పూర్తి చేసిన జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3 నెలలపాటు ప్రాక్టికల్ శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది. డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళన.. రాష్ట్రంలో 12 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మెడికల్ పీజీ గైనకాలజీ కోర్సు ఉంది. ఆయా కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులకు కేసీఆర్ కిట్ వల్ల గర్భిణీల సంఖ్య తగ్గింది. దీంతో పీజీ గైనిక్ విద్యార్థులకు ప్రసవాలు ఎలా చేయాలన్న దానిపై ప్రయోగాత్మకంగా నేర్చుకునే వెసులుబాటు తగ్గింది. దీంతో తమకు సరైన శిక్షణ అందడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జూనియర్ గైనిక్ డాక్టర్లు సాధారణ ప్రసవాలు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. సాధారణ ప్రసవం చేయాలన్నా అత్యంత జాగ్రత్తలు తప్పనిసరి. ఏమాత్రం తేడా వచ్చినా మాతా శిశువుల ప్రాణానికే గండం ఏర్పడనుంది. ఇక సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా చేయడమంటే ఇంకా ఎక్కువ రిస్క్ చేయాల్సి ఉంటుంది. వీరికి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సరైన ప్రాక్టికల్ శిక్షణ లేకపోవడంతో సాధారణ, సిజేరియన్ ప్రసవాలు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. తప్పుడు లెక్కలు.. ఇదిలావుంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలు తమకు రోజుకు అవసరమైన గర్భిణీలు వస్తున్నారని, విద్యార్థులకు సరైన గైనిక్ ప్రాక్టికల్ శిక్షణ అందుతుందని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కు తప్పుడు నివేదికలు ఇస్తున్నాయి. తద్వారా తమ పీజీ గైనిక్ సీట్లు కోల్పోకుండా చూసుకుంటున్నాయి. ప్రైవేటు బోధనాస్పత్రులకు కాన్పు కేసులు కరువవుతుండగా, ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో కేసులు ఎక్కువై వైద్య సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. -
భార్యాభర్తల గొడవ; బయటపడ్డ బండారం..
సాక్షి, మద్దిపాడు (ప్రకాశం): మండలంలోని ఏడుగుండ్లపాడు సమీపంలో ఉన్న ఓంశ్రీ గాయత్రి విశ్వకర్మ యూనివర్సిటీ పేరుతో ఏర్పాటు చేసిన కళాశాల చైర్మన్ చింతాడ గిరినాథ్పై ఆయన భార్య చింతాడ అనూరాథ ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశారు. తమ యూనివర్సిటీకి ప్రభుత్వ పరమైన అనుమతులున్నాయంటూ విద్యార్థులను మోసం చేస్తూ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని.. ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో ఆమె ఈనెల 12వ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్ఐ ఖాదర్‌బాషాను వివరణ కోరగా ఆయనపై కేసు నమోదు చేశామని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు ఎదుర్కొంటున్న వ్యక్తి.. మెడికల్ కళాశాల వస్తుందని నమ్మబలుకుతూ ఇంటర్నెట్లో అద్భుతమైన భవనాలను చూపుతూ.. తమకు మెడికల్ కళాశాల వచ్చినట్లు అందరినీ మోసం చేస్తున్నారన్నారు. ఎటువంటి కౌన్సెలింగ్ నిర్వహించకుండానే తమ కళాశాలలో మెడిసిన్ సీట్లు విద్యార్థులకు అందిస్తామని చెప్పుకొచ్చారని తెలిసింది. అయితే కొత్తగా ప్రకాశం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కాలేదని, ఒక వేళ డెంటల్ కళాశాల ఏదైనా మంజూరు కావచ్చని తెలిసింది. ఈక్రమంలో యూనివర్సిటీ చైర్మన్‌గా చెప్పుకుంటున్న గిరినాథ్ విశాఖ పట్నం కేంద్రంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకుని ఎటువంటి కౌన్సెలింగ్ లేకుండా మెడికల్ సీట్లు ఇప్పిస్తామని ఏజెంట్ల ద్వారా నమ్ముబలుకుతున్నట్లు తెలిసింది. ఒక్కొక్క సీటుకు రూ. 13 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి వ్యవహారం నడుస్తుండటంతో ఆయన భార్య ఆతనిపై కేసు పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తన అనుమతి లేకుండా తన భార్య కళాశాలలో ప్రవేశించి ఆస్తి నష్టం కలిగించారనే గిరినాథ్ ఫిర్యాదుతో ఆమెపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదు చేసినట్లు సమాచారం. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో ఈ విధంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో విద్యార్థులు నష్టపోతారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గిరినా«థ్ మెడికల్ కళాశాల పేరుతో జీఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులు నడిపారు. కాగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. అసలు ఏడుగుండ్లపాడు వద్ద ఉన్న శ్రీగాయత్రీ విశ్వకర్మ యూనివర్శిటీకి మెడికల్ కళాశాల మంజూరైయిందో లేదో అధికారులు తేల్చి చెప్పాల్సి ఉంది. రిమ్స్‌కు అనుమతులు ఇవ్వడానికి సుమారు 6 సంవత్సరాలు పట్టిన నేపథ్యంలో కొత్తగా మరో కళాశాలకు అనుమతులిస్తారా అనే∙చర్చ మొదలైంది. -
కాలేజీ చేతుల్లోకి మెడిసీన్!
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో తీసుకొచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టంపై వైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీని ప్రకారం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. మిగతా ఫీజుల నిర్ణయం కాలేజీ యాజమాన్యాలదే. అలాగే ప్రస్తుతం పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షను రద్దు చేసి ‘నెక్ట్స్’అనే పరీక్ష పెడతామని ప్రతిపాదించింది. ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు కాలేజీలు.. తాజా నిర్ణయంతో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని జూడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మిగులుతుందని అంటున్నారు. సాక్షి, హైదరాబాద్ : నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టంపై జూనియర్ డాక్టర్ల ఆందోళనలు ఉధృతమయ్యాయి. దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చేస్తుండగానే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో 1956 నాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అమల్లోకి వచ్చింది. డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సెక్షన్లకు ఎటువంటి సవరణలు చేయకుండానే బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ చట్టంలో ప్రతిపాదించిన కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్, కమిషన్‌లో డాక్టర్లకు బదులు నాన్–డాక్టర్లకు అవకాశం కల్పించడం.. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం, ప్రైవేటు కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను యాజమాన్యాలకే కట్టబెట్టడం వంటి అంశాలను డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017లోనూ బిల్లుపై వ్యతిరేకత ఎన్ఎంసీ బిల్లును తొలిసారి 2017 డిసెంబర్లో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సహా దేశవ్యాప్తంగా డాక్టర్లు ఈ బిల్లును వ్యతిరేకించడంతో సెలెక్ట్ కమిటీకి పంపించారు. 16వ లోక్‌సభ రద్దు అవడంతో ఈ బిల్లు మురిగిపోయింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తాజాగా చట్టంగా మారడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. మిగతా 50% సీట్ల ఫీజుల నిర్ణయం కాలేజీ యాజమాన్యాలదే. దీంతో కాలేజీలు ఇష్టానికి ఫీజులు పెంచేసే అవకాశముందని, ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కాలేజీలు, తాజా నిర్ణయంతో మరింతగా రెచ్చిపోయే ప్రమాదముందని డాక్టర్లు అంటున్నారు. ఈ బిల్లుతో పేద, మధ్యతరగతి స్టూడెంట్లకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల్లో మెరిట్ సాధించకపోయినా, కోట్లలో ఫీజులు కట్టే సామర్థ్యం ఉన్నవాళ్లకు ఎంబీబీఎస్ సీట్లు దక్కుతాయని చెబుతున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. దీనికి తోడు ఈ బిల్లులో ప్రతిపాదించిన నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ (నెక్ట్స్)పై వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒకే ఎగ్జామ్‌ను 3 రకాలుగా వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షగా, దేశ, విదేశాల్లో చదివిన విద్యార్థులకు ఎగ్జిట్ ఎగ్జామ్‌గా, పీజీ ప్రవేశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్‌గా ఈ పరీక్షను నిర్వహించాలని భావిస్తున్నారు. అంటే, ఇకపై ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ పరీక్ష పాసైతేనే డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసేందుకు లైసెన్స్ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే నెక్ట్స్‌ను ఎగ్జిట్ ఎగ్జామ్‌గా పేర్కొంటున్నారు. ఎన్ఎంసీ అమల్లోకి వస్తే.. విదేశాల్లో చదివిన వాళ్లు కూడా ఎఫ్‌ఎంజీఈకి బదులు, నెక్ట్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇందులో పాసైతేనే ప్రాక్టీస్‌కు అర్హులవుతారు. అలాగే, ప్రస్తుతం పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ విధానాన్ని రద్దు చేసి, నెక్ట్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగానే పీజీ సీట్లు కేటాయిస్తామని బిల్లులో ప్రతిపాదించారు. దీన్నే విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ ఎన్ఎంసీ బిల్లులోని సెక్షన్ 32లో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అనే క్లాజ్ ఉంది. మోడ్రన్ సైంటిఫిక్ మెడికల్ ప్రొఫెషన్‌తో ముడిపడి ఉన్న వ్యక్తులకు ‘కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్’గా ‘లిమిటెడ్ లైసెన్స్’ఇవ్వొచ్చునని ఈ సెక్షన్లో ప్రతిపాదించారు. దీన్ని డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ పేరుతో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియో థెరపిస్టులు తదితరులకు మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఇచ్చే అవకాశముంది. అయితే వీళ్లకు మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేందుకు అవకాశమిస్తే, ప్రజారోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా వైద్య విద్యార్ధులు, జూనియర్ డాక్టర్లు గళమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్ ధర్నాచౌక్‌లో గురువారం భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. దీనికి పలు రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు హాజరై సంఘీభావం తెలిపారు. కమిషన్‌లో నాన్–డాక్టర్స్ ప్రస్తుతం ఉన్న మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నింగ్ బాడీలో 80% మంది డాక్టర్లు ఉంటే, 20% మంది నాన్–డాక్టర్స్ ఉంటారు. కానీ, మెడికల్ కమిషన్‌లో 80% స్థానాల్లో నాన్–డాక్టర్స్‌ను కూడా నియమించుకునే అవకాశమిచ్చారు. ఇలా నాన్–డాక్టర్స్ కీలకంగా ఉండే కమిషన్‌లో రాజకీయ జోక్యం పెరుగుతుందని, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల చేతుల్లోకి వైద్య విద్య వ్యవస్థ వెళ్తుందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. భారీగా పెరగనున్న ఫీజులు నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిడ్జ్ కోర్సు, ఎగ్జిట్ ఎగ్జామ్, ఫీజుల నియంత్రణ ఎత్తివేయడం వంటి అనేక అంశాలు మెడిసిన్ స్టూడెంట్లకు, మెడిసిన్ చదవాలనుకుంటున్న విద్యార్థులకు నష్టాన్ని కలిగిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లోని మొత్తం సీట్ల ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. ఎన్ఎంసీ చట్టంతో ప్రైవేటులోని 50% సీట్లపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోనుంది. చాలా రాష్ట్రాల్లో బీ–కేటగిరీ సీటుకు కనీసం రూ.50లక్షలు, సీ–కేటగిరీ సీటుకు కోటి రూపాయల వరకూ కాలేజీలకు చెల్లించాల్సి వస్తోంది. ఈ నియంత్రణ ఎత్తివేస్తే ఫీజులు రెండు, మూడింతలు పెరిగే ప్రమాదముంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారనుంది. -
‘ఈడబ్ల్యూఎస్’కు నేడు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్ లాంటి ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఎట్టకేలకు ఫలించింది. కేంద్రం ప్రవేశపెట్టిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కోటా కింద వైద్య సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లో మార్గం సుగమమైంది. ఈ మేరకు కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఈడబ్ల్యూఎస్ కింద రాష్ట్రానికి పెరిగిన 360 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 29న (సోమవారం) నోటిఫికేషన్ జారీ చేయనుంది. వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారు. సాధారణంగా రిజర్వేషన్ పరిధిలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాలకు ఈ సీట్లు వర్తించవు. కేవలం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికోసమే ఈ సీట్లు కేటాయిస్తారు. కేంద్రం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం తహసీల్దార్ కార్యాలయాల నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కచ్చితంగా పొంది ఉంటేనే సీటుకు అర్హులవుతారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద వరం.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఒక్కసారిగా రాష్ట్రంలో 360 సీట్లు పెరగడం సాధారణ విషయం కాదని, ఇది నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద వరమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా, అందులో 10 కాలేజీలకు సీట్లు పెరిగాయి. ఆంధ్రా మెడికల్ కళాశాల, గుంటూరు మెడికల్ కళాశాల, రంగరాయ మెడికల్ కళాశాల, కర్నూలు మెడికల్ కాలేజీల్లో అత్యధికంగా 50 చొప్పున సీట్లు పెరిగాయి. ఈ సీట్లకు ఇప్పటికే భారతీయ వైద్య మండలి అనుమతి కూడా లభించింది. ఇదివరకే 14 వేల మంది మొత్తం అభ్యర్థులు ఈ ఏడాది సీట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఎవరైనా ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన విద్యార్థులు సాధారణ మెడికల్ కాలేజీలలో ఓపెన్ కేటగిరీ కింద సీటు తీసుకుని ఉన్నా సరే మంచి కాలేజీకి మారవచ్చు. ఇందుకోసం ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మళ్లీ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంబీబీఎస్ సీటు తృటిలో అవకాశం కోల్పోయిన చాలా మంది విద్యార్థులకు ఇప్పుడు సీటు దక్కే అవకాశం ఉంటుంది. వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి ప్రభుత్వం నుంచి ఈడబ్ల్యూఎస్ సీట్ల భర్తీకి ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఈ ప్రక్రియ మొత్తం వారం రోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఈ కోటాలో ఉన్న సీట్లను వారితోనే భర్తీ చేస్తాం. అత్యంత పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. – డా. సీవీ రావు, వైస్ చాన్సలర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
ఈడబ్ల్యూఎస్ కోటాపై నీలినీడలు!
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో నీలినీడలు అలుముకున్నాయి. వాటిల్లోని కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్ విడుదలై కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైనా ఇప్పటికీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్ల పెంపుపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం ప్రకటించలేదు. దీంతో అసలు సీట్ల పెంపు జరుగుతుందా? లేదా? అన్న సంశయం విద్యార్థుల్లో నెలకొంది. గత నెల చివరి వారంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లల్లో అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఆ మేరకు సీట్లు పెంచుతామని ఎంసీఐ ప్రకటించింది. అందుకోసం ఆయా కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో పది ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ముందుకు వచ్చాయి. సీట్లు పెంచాలని ఎంసీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. ప్రతిపాదనల దరఖాస్తులను ఎంసీఐకి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పంపాయి. మొత్తం 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండగా, 10 మాత్రమే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే సీట్ల పెంపుపై ఎంసీఐ నిర్ణయం ప్రకటిస్తుందని అందరూ ఎదురుచూశారు. కానీ వారం రోజులు దాటినా ఇప్పటికీ పెంపుపై ఎంసీఐ ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈసారి ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను ఎంసీఐ ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదని వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయ అధికారులు అంటున్నారు. మొదలైన కన్వీనర్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ.. ఈడబ్ల్యూఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసిన 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు 750 ఉన్నాయి. వాటికి పది శాతం రిజర్వేషన్ల అమలుకు సీట్లు పెంచాల్సి ఉంది. ఈ మేరకు 188 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా ఈడబ్ల్యూఎస్ అమలుకు ఎంసీఐ పెంచుతుందని భావించారు. కానీ ఆ సీట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అధికారులే అంటుండటంతో విద్యార్థుల్లో నిరాశ అలముకుంది. మరోవైపు ఇటీవల తెలంగాణలో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నాలుగు కాలేజీలకు 25 శాతానికి బదులు 20 శాతం చొప్పున మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు పెంచింది. ఆ ప్రకారం కేవలం 190 సీట్లు మాత్రమే పెంచింది. తక్కువ పెంచడంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీల విషయంలో ఎంసీఐ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం జాబితాను కూడా ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నెల 10 వరకు వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. కన్వీనర్ కోటా సీట్లంటే ప్రభుత్వ మెడికల్ సీట్లకు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు ఈ వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుంది. ఇంత జరుగుతున్నా ఎంసీఐ నుంచి ఈడబ్ల్యూఎస్ సీట్ల పెంపుపై ఆదేశాలు జారీకాలేదు. ఇంకా ఆయా సీట్లపై ఆశలు పెట్టుకున్న ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈడబ్ల్యూఎస్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వెబ్ ఆప్షన్లకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే జాతీయస్థాయిలో అఖిల భారత కోటా సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. రెండో విడత మొదలుకానుంది. ఎక్కడికక్కడ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంటే, ఈడబ్ల్యూఎస్ సీట్లపై ఎంసీఐ నిర్ణయం తీసుకోకపోవడం, ఏదో ఒక విషయం స్పష్టంగా చెప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
మెడికల్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్–2019లో అర్హత సాధించిన అభ్యర్థులు కేటగిరీ బీ, సీ (ఎన్ఆర్ఐ) కోటాలో సీట్లకు బుధవారం ఉదయం 9 నుంచి 10వ తేదీ సాయంత్రం 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు జ్టి్టhttps:// tspvtmedadm. tsche. in లో ఉంటాయి. ఈ నెల 11న ప్రొవిజనల్ మెరిట్ లిస్టును.. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ప్రొఫెసర్ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో నిర్వహిస్తారు. తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. దరఖాస్తుకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు 9502001583, 8466924522ను సంప్రదించాలి. పూర్తి సమాచారానికి వర్సిటీ వెబ్సైట్ www. knruhs. in, www. knruhs. telangana. gov. in ను చూడాలని వర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఇదిలావుండగా 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలు అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద సీట్లు పెంచాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కి దరఖాస్తు చేశాయి. కానీ ఇప్పటివరకు సీట్ల పెంపుపై ఎంసీఐ స్పష్టత ఇవ్వలేదు. ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. వాటికి ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. కానీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా వర్గాల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.