సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో నీలినీడలు అలుముకున్నాయి. వాటిల్లోని కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్ విడుదలై కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైనా ఇప్పటికీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్ల పెంపుపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం ప్రకటించలేదు. దీంతో అసలు సీట్ల పెంపు జరుగుతుందా? లేదా? అన్న సంశయం విద్యార్థుల్లో నెలకొంది. గత నెల చివరి వారంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లల్లో అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఆ మేరకు సీట్లు పెంచుతామని ఎంసీఐ ప్రకటించింది. అందుకోసం ఆయా కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో పది ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ముందుకు వచ్చాయి.
సీట్లు పెంచాలని ఎంసీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. ప్రతిపాదనల దరఖాస్తులను ఎంసీఐకి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పంపాయి. మొత్తం 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండగా, 10 మాత్రమే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే సీట్ల పెంపుపై ఎంసీఐ నిర్ణయం ప్రకటిస్తుందని అందరూ ఎదురుచూశారు. కానీ వారం రోజులు దాటినా ఇప్పటికీ పెంపుపై ఎంసీఐ ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈసారి ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను ఎంసీఐ ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదని వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయ అధికారులు అంటున్నారు.
మొదలైన కన్వీనర్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ..
ఈడబ్ల్యూఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసిన 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు 750 ఉన్నాయి. వాటికి పది శాతం రిజర్వేషన్ల అమలుకు సీట్లు పెంచాల్సి ఉంది. ఈ మేరకు 188 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా ఈడబ్ల్యూఎస్ అమలుకు ఎంసీఐ పెంచుతుందని భావించారు. కానీ ఆ సీట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అధికారులే అంటుండటంతో విద్యార్థుల్లో నిరాశ అలముకుంది. మరోవైపు ఇటీవల తెలంగాణలో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నాలుగు కాలేజీలకు 25 శాతానికి బదులు 20 శాతం చొప్పున మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు పెంచింది. ఆ ప్రకారం కేవలం 190 సీట్లు మాత్రమే పెంచింది. తక్కువ పెంచడంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీల విషయంలో ఎంసీఐ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం జాబితాను కూడా ప్రకటించింది.
ఆదివారం నుంచి ఈ నెల 10 వరకు వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. కన్వీనర్ కోటా సీట్లంటే ప్రభుత్వ మెడికల్ సీట్లకు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు ఈ వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుంది. ఇంత జరుగుతున్నా ఎంసీఐ నుంచి ఈడబ్ల్యూఎస్ సీట్ల పెంపుపై ఆదేశాలు జారీకాలేదు. ఇంకా ఆయా సీట్లపై ఆశలు పెట్టుకున్న ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈడబ్ల్యూఎస్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వెబ్ ఆప్షన్లకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే జాతీయస్థాయిలో అఖిల భారత కోటా సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. రెండో విడత మొదలుకానుంది. ఎక్కడికక్కడ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంటే, ఈడబ్ల్యూఎస్ సీట్లపై ఎంసీఐ నిర్ణయం తీసుకోకపోవడం, ఏదో ఒక విషయం స్పష్టంగా చెప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment