
ముషీరాబాద్ (హైదరాబాద్): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మెజార్టీ తీర్పు విచారకరమని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో మరోసారి రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రకటించారు. 15 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపాలన్నారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...అగ్ర కులాల్లోని పేదలకు ఆర్థిక పరమైన స్కీములు పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదని, ఆర్థిక అభివృద్ధి పథకం అంతకంటే కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి తమతమ జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, అధికార పదవులలో వాటా ఇవ్వాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధమని ఇది రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.