న్యూఢిల్లీ: నీట్–పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ఆలిండియా కోటా సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) కింద రిజర్వేషన్ పొందడానికి వార్షికాదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉండాలన్న నిబంధనను పునఃసమీక్షించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారన్నది తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తేల్చే ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేస్తామన్నారు. కోర్టు అనుమతి మేరకు నీట్–పీజీ కౌన్సెలింగ్‌ను నాలుగు వారాలపాటు వాయిదా వేసినట్లు తెలిపారు. కేంద్ర సర్కారు, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) జూలై 29న జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్–పీజీ మెడికల్ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఎంసీసీ గతంలో తెలిపింది.
కేంద్రీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 15 శాతం సీట్లు, పీజీ కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కిందకు వస్తాయి. పీజీ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ‘జాతీయ జీవన వ్యయ సూచిక’ ఆధారంగా ఈ పరిమితి విధించినట్లు స్పష్టం చేసింది. దీనిపై పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈడబ్ల్యూఎస్ కోటా అమలును వాయిదా వేయడం సాధ్యం కాదని తుషార్ మెహతా అన్నారు. తుషార్ మెహతా వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి ఆరవ తేదీకి వాయిదావేసింది.
Comments
Please login to add a commentAdd a comment