National Eligibility Entrance Test
-
నీట్లో ఏపీ విజయదుందుభి
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2024 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 23,33,297 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 13,16,268 మంది అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 64,931 మంది పరీక్ష రాయగా 43,858 మంది అర్హులుగా నిలిచారు. అలాగే తెలంగాణలో 77,849 మందికి గాను 47,371 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో 9.98 లక్షల మంది అబ్బాయిలు నీట్ రాయగా 5.47 లక్షల మంది, 13.34 లక్షల మంది అమ్మాయిలు పరీక్ష రాయగా 7.69 లక్షల మంది అర్హులుగా నిలిచారు. గత నెల 5న దేశవ్యాప్తంగా 571 నగరాలు, పట్టణాలతోపాటు విదేశాల్లో 14 నగరాల్లో నీట్ యూజీని నిర్వహించారు.సత్తా చాటిన రాష్ట్ర విద్యార్థులునీట్ రాసిన విద్యార్థుల్లో 68 మంది విద్యార్థులు 99.99 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్లుగా నిలిచారు. కాగా, మహారాష్ట్రకు చెందిన వి.సునీల్ షిండే, తమిళనాడుకు చెందిన సయ్యద్ ఆరి్ఫన్ యూసఫ్.ఎం, ఢిల్లీకి చెందిన ఎం.ఎం.ఆనంద్ మొదటి ర్యాంక్ సాధించిన వారిలో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కె. సందీప్ చౌదరి (21వ స్థాన), జి. భానుతేజ సాయి(29వ స్థానం), పోరెడ్డి ప్రవీణ్‌కుమార్ రెడ్డి(56వ స్థానం), వి. ముకేష్ చౌదరి(60వ స్థానం)లో నిలిచి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్లుగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనూ వీరే టాప్ ర్యాంకర్లుగా ఉన్నారు. పెరిగిన కటాఫ్‌లు నీట్–2023తో పోలిస్తే ఈ ఏడాది అన్ని విభాగాల్లో కటాఫ్ మార్కులు భారీగా పెరిగాయి. అన్ రిజర్వుడ్ /ఈడబ్ల్యూఎస్ విభాగంలో గతేడాది 720–137 కటాఫ్ మార్కులు ఉండగా ఈ ఏడాది 720–164 మధ్య ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 136–107 నుంచి 163–129కు కటాఫ్‌లు పెరిగాయి. పీహెచ్ యూఆర్/ఈడబ్ల్యూఎస్ విభాగంలో 136–121 నుంచి 163–146, పీహెచ్ ఓబీసీ, ఎస్సీ విభాగాల్లో 120–107 నుంచి 145–129కు, పీహెచ్ ఎస్టీలో 120–108 నుంచి 145–129కు కటాఫ్ మార్కులు ఎగబాకాయి. -
TS: పీజీ నీట్ కటాఫ్ మార్కులు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పీజీ నీట్–2022 కటాఫ్ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తగ్గించింది. దీనితో మరింత మంది విద్యార్థులు ప్రవేశాలకు అర్హత సాధించిన నేపథ్యంలో.. అడ్మిషన్ల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పీజీ మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి కన్వీనర్ కోటాతోపాటు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వర్సిటీ పేర్కొంది. వివిధ కేటగిరీల్లో పర్సంటైల్ మారుస్తూ.. పీజీ నీట్–2022 కటాఫ్ స్కోరును 25 పర్సంటైల్ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించడంతో అన్ని కేటగిరీల్లో పర్సంటైల్ మారినట్టు కాళోజీ వర్సిటీ తెలిపింది. జనరల్ కేటగిరీలో 25 పర్సంటైల్‌తో 201 మార్కులు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 15 పర్సంటైల్‌తో 169 మార్కులు.. దివ్యాంగుల కేటగిరీలో 20 పర్సంటైల్‌తో 186 మార్కులు సాధించినవారు ప్రవేశాలకు అర్హత పొందుతారని వెల్లడించింది. కటాఫ్ మార్కులు తగ్గిన మేరకు అర్హత పొందిన అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదే యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించింది. మరింత సమాచారం కోసం యూని వర్సిటీ వెబ్సైట్ www. knruhs. telangana. gov. in ను సందర్శించాలని సూచించింది. -
రూ.8 లక్షల వార్షికాదాయంపై పునఃసమీక్ష
న్యూఢిల్లీ: నీట్–పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ఆలిండియా కోటా సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) కింద రిజర్వేషన్ పొందడానికి వార్షికాదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉండాలన్న నిబంధనను పునఃసమీక్షించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారన్నది తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తేల్చే ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేస్తామన్నారు. కోర్టు అనుమతి మేరకు నీట్–పీజీ కౌన్సెలింగ్‌ను నాలుగు వారాలపాటు వాయిదా వేసినట్లు తెలిపారు. కేంద్ర సర్కారు, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) జూలై 29న జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్–పీజీ మెడికల్ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఎంసీసీ గతంలో తెలిపింది. కేంద్రీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 15 శాతం సీట్లు, పీజీ కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కిందకు వస్తాయి. పీజీ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ‘జాతీయ జీవన వ్యయ సూచిక’ ఆధారంగా ఈ పరిమితి విధించినట్లు స్పష్టం చేసింది. దీనిపై పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈడబ్ల్యూఎస్ కోటా అమలును వాయిదా వేయడం సాధ్యం కాదని తుషార్ మెహతా అన్నారు. తుషార్ మెహతా వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి ఆరవ తేదీకి వాయిదావేసింది. -
ఇక ఉర్దూలోనూ ‘నీట్’
న్యూఢిల్లీ: వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజి బిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను ఇక నుంచి ఉర్దూలోనూ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్‌ను ఉర్దూ లోనూ నిర్వహిస్తామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ సుప్రీంకోర్టుకు హాజరై జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనానికి లిఖితపూర్వక వివరణ నిచ్చారు. గతంలో ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనే ఓ విద్యార్థి సంఘం ‘నీట్’ను ఉర్దూలో నిర్వ హించాలని కోరుతూ వ్యాజ్యం వేసింది. -
కానిస్టేబుల్ రాతపరీక్ష ‘కీ’ వెల్లడి
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్స్ మెకానిక్స్, డ్రైవర్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన తుది రాత పరీక్ష ‘కీ’ని ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు ఈ నెల 22న సాయంత్రం 5 గంటలలోగా తమ అభ్యంతరాలు తెలపాలని కోరింది. విజయవాడ, విశాఖ కేంద్రాలుగా ‘నీట్’ సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–2017ను ఏపీలో విజయవాడ, విశాఖ కేంద్రాలుగా నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ తెలిపారు. జేఈఈ మెయిన్స్–2017ను తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖలో నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే జేఈఈ అడ్వాన్స్–2017ను అనంతపురం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎంపీ మురళీమోహన్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక జవాబిచ్చారు. -
ఆయుష్‌పై షరతుతో ఎంసెట్ నోటిఫికేషన్!
వైద్య ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వని కారణంగానే... సాక్షి, హైదరాబాద్: ‘ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జారీ చేస్తే.. విద్యార్థులంతా నీట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ ఉంటుంది’ అన్న షరతుతో ఎంసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ ద్వారా ఉంటాయా? లేక ఎంసెట్ ద్వారా చేపడతారా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ గత నెల 21వ తేదీన తెలంగాణ ఉన్నత విద్యామండలి లేఖ రాసినా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పైగా తామెలా స్పష్టత ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు మౌఖికంగా చెబుతున్న నేపథ్యంలో.. షరతులతో ఎంసెట్ నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇక ఎంసెట్‌తోపాటు ఐసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఆన్లైన్ సేవలను అందించే సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఉర్దూలోనూ ‘నీట్’ నిర్వహణపై మీ వైఖరేంటి?
కేంద్రం, ఎంసీఐకి సుప్రీంకోర్టు నోటీసులు సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను ఉర్దూలో కూడా నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిష న్పై వైఖరి తెలపా లంటూ కేంద్రం, భారత వైద్య మండలి (ఎంసీఐ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ) దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్ర వారం విచారణ చేపట్టింది. దేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజల సంఖ్య ఆధారంగా ఉర్దూ ఆరో స్థానంలో ఉందని, రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో కూడా ఉర్దూకు చోటు దక్కిందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భారీ సంఖ్యలో విద్యార్థులు 11, 12 తరగతులను ఉర్దూ మీడియంలో చదివారని, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఉర్దూలోనూ లభిస్తున్నాయని వివరించారు. అత్యధిక మంది మాట్లాడే భాషల్లో గుజరాతీ ఏడో స్థానంలో, కన్నడ 8వ స్థానంలో, ఒడియా పదో స్థానంలో, అస్సామీ 12వ స్థానంలో ఉన్నాయని, వీటన్నింటినీ ‘నీట్’ నిర్వహణ భాషల్లో చేర్చారని, ఉర్దూను మాత్రం చేర్చలేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు ఉర్దూ మీడియంలో చదివారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన అభ్యర్థన వస్తే ఏ భాషలోనైనా ‘నీట్’ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఎంసీఐ విన్నవించింది. అయితే, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి ఈ మేరకు అభ్యర్థన కేంద్రానికి వెళ్లిందని పిటిషనర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై అభిప్రాయం తెలపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి, ఎంసీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. -
డిసెంబర్లో నీట్ పీజీ డిప్లొమా ప్రవేశ పరీక్ష
న్యూఢిల్లీ: వైద్య విద్యలో పీజీ డిప్లొమా కోర్సులకు నీట్ (జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష) ప్రవేశ పరీక్షను డిసెంబర్ 5 నుంచి 13 వరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) నిర్వహించనుంది. ఎండీఎస్(డెంటల్) కోర్సులకు నీట్ పరీక్ష నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనుంది. 2017 పీజీ, ఎండీఎస్ వైద్య విద్యకు సంబంధించి ఇవి ఏకైక అర్హత, ప్రవేశ పరీక్షలు. కశ్మీర్, తెలంగాణ, ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లోని కేంద్ర కోటా( 50 శాతం) సీట్లు వీటి కిందే ఉంటాయి. ఈ పరీక్షలకు ఆన్లైన్లో సెప్టెంబర్ 26–అక్టోబర్ 31 మధ్య నమోదు చేసుకోవాలి. -
నేడు నీట్‌పై నడ్డా కీలక భేటీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణను పలువురు పార్లమెంటేరియన్లు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సోమవారం రాష్ట్రాల వైద్య, ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు. ‘వైద్యవిద్యలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న లక్షలమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ భేటీతో పరిష్కారం వస్తుందని భావిస్తున్న’ట్లు నడ్డా ట్వీట్ చేశారు. రెండు విడతల్లో నీట్ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో విపక్షాలతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని.. కేంద్రం ఈ భేటీ తలపెట్టింది. వివిధ ప్రాంతీయ భాషల్లో 12వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు నీట్లో పోటీ పడటం కష్టమవుతుందని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు వెల్లడించాయి. -
ఎగ్జామ్ రివ్యూ
‘నీట్’గా.. ఈజీగా.. ‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-1’గా ఇటీవల పేరుమారిన ఆలిండియా ప్రి మెడికల్/ప్రి డెంటల్ టెస్ట్ (ఏఐపీఎంటీ) దేశవ్యాప్తంగా మే 1న (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. 180 నిమిషాల (3 గంటల) వ్యవధి గల ఈ పరీక్షలో 180 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలని నిర్దేశించారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఉన్న ఈ ప్రశ్నలను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) సబ్జెక్ట్‌ల నుంచి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రశ్నల స్థాయిపై సమీక్ష.. ఫిజిక్స్: సగటు కన్నా కొంచెం ఎక్కువ కఠినంగా ఉన్నాయి. 40 శాతం ప్రశ్నలు ‘టఫ్’గా, మరో 40 శాతం ‘మీడియం’గా, మిగిలిన 20 శాతం ప్రశ్నలు ‘ఈజీ’గా ఉన్నాయి. అధిక శాతం గణనలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలను ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి ఇవ్వగా మరికొన్నింటిని గత ప్రశ్నాపత్రాల నుంచి ఇచ్చారు. కెమిస్ట్రీ: గత ఏడాదితో పోల్చితే కాస్త కఠినంగానే ఉన్నాయి. దాదాపు మూడొంతుల ప్రశ్నలు 11వ తరగతి నుంచి, మిగిలినవి 12 తరగతి నుంచి ఇచ్చారు. ఎక్కువ శాతం ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ సిలబస్ స్థాయిని మించి ఉన్నాయి. రెండు ప్రశ్నలకు రెండు ఆప్షన్లూ కరెక్ట్ ఆన్సరే ఇవ్వగా ఒక ప్రశ్నలో ఒక్క ఆప్షన్‌కూ సరైన సమాధానంలేదు. బయాలజీ: యావరేజ్ లెవల్ ప్రశ్నలు తక్కువగానే ఉన్నాయి. రెండు తరగతుల నుంచీ దాదాపు సమాన సంఖ్యలో వచ్చాయి. కొన్ని ప్రశ్నలను ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి ఇవ్వలేదు. ఒక ప్రశ్నలో సూక్ష్మ పోషకాలకు సరిపోలే ఆన్సరే ఇవ్వలేదు. అధిక శాతం ప్రశ్నలు సైటాలజీ, ఫిజియాలజీ, జెనెటిక్స్, ఇకాలజీ చాప్టర్ల నుంచే అడిగారు. మొత్తం మీద ప్రశ్నాపత్రం గత ఏడాదితో పోల్చితే తేలిగ్గానే ఉందని చెప్పొచ్చు. -
‘నీట్’కు 6 లక్షలమంది హాజరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)’ తొలి దశ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు ఆరు లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారని సీబీఎస్ఈ అధికారులు వెల్లడించారు. 6.67 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, కేవలం 8% మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరు కాలేదన్నారు. గత సంవత్సరం దాదాపు 15% మంది గైర్హాజరయ్యారని గుర్తుచేశారు. మే 1న, జూలై 24న రెండు దశల్లో నీట్‌ను నిర్వహించాలని తాజాగా సుప్రీంకోర్టు నిర్దేశించిన విషయం తెలిసిందే.