ఉర్దూలోనూ ‘నీట్’ నిర్వహణపై మీ వైఖరేంటి?
కేంద్రం, ఎంసీఐకి సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను ఉర్దూలో కూడా నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిష న్‌పై వైఖరి తెలపా లంటూ కేంద్రం, భారత వైద్య మండలి (ఎంసీఐ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఓ) దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్ర వారం విచారణ చేపట్టింది. దేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజల సంఖ్య ఆధారంగా ఉర్దూ ఆరో స్థానంలో ఉందని, రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో కూడా ఉర్దూకు చోటు దక్కిందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భారీ సంఖ్యలో విద్యార్థులు 11, 12 తరగతులను ఉర్దూ మీడియంలో చదివారని, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఉర్దూలోనూ లభిస్తున్నాయని వివరించారు.
అత్యధిక మంది మాట్లాడే భాషల్లో గుజరాతీ ఏడో స్థానంలో, కన్నడ 8వ స్థానంలో, ఒడియా పదో స్థానంలో, అస్సామీ 12వ స్థానంలో ఉన్నాయని, వీటన్నింటినీ ‘నీట్’ నిర్వహణ భాషల్లో చేర్చారని, ఉర్దూను మాత్రం చేర్చలేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు ఉర్దూ మీడియంలో చదివారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన అభ్యర్థన వస్తే ఏ భాషలోనైనా ‘నీట్’ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఎంసీఐ విన్నవించింది. అయితే, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి ఈ మేరకు అభ్యర్థన కేంద్రానికి వెళ్లిందని పిటిషనర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై అభిప్రాయం తెలపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి, ఎంసీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.