న్యూఢిల్లీ: ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించొచ్చని, కానీ రెండుసార్లు శిక్ష విధించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. గుట్కా అక్రమ రవాణా కేసులో బాంబే హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ మహారాష్ట్ర పోలీసులు దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. గుట్కా, పాన్ మసాలా అక్రమ రవాణా, నిల్వ, అమ్మకాలపై ఆహార భద్రతా ప్రమాణాల(ఎఫ్‌ఎస్‌ఎస్) చట్టం కింద కేసు పెట్టాలని, ఐపీసీ వర్తించదని గతంలో బాంబే హైకోర్టు తెలిపింది. తాజాగా ఈ తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెడుతూ ‘ఏదైనా ఒక చర్య లేదా ఉల్లంఘనను రెండు వేర్వేరు చట్టాల ప్రకారం నేరంగా పరిగణిస్తే, నేరస్తుడిని రెండు లేదా ఒకే చట్టం ప్రకారం విచారించొచ్చు.
కానీ అదే నేరానికి రెండుసార్లు శిక్ష విధించకూడదు’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో మహారాష్ట్ర పోలీసులు ఐపీసీ ప్రకారం కూడా విచారణ ప్రారంభించడానికి అనుమతిచ్చింది. ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించడానికి ఎలాంటి పరిమితులు లేవని, రెండుసార్లు శిక్ష విధించడమే ఆమోదయోగ్యం కాదని స్పష్టతనిచ్చింది. ఐపీసీ విస్తృతిని నిర్వచించడంలో బాంబే హైకోర్టు పొరబడిందని పేర్కొంది. మరోవైపు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తనిఖీలు వివాదాస్పదవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఆధార్ ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ నందన్ నిలేకని సాయం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment