‘శెభాష్‌ ప్రజ్ఞ’.. సీజేఐ సన్మానం | Chief Justice honours daughter of Supreme Court cook who won US scholarships | Sakshi
Sakshi News home page

అమెరికా వర్సిటీ సీటు సాధించిన ‘సుప్రీం’ వంటమనిషి కుమార్తె ప్రజ్ఞ

Published Thu, Mar 14 2024 6:08 AM | Last Updated on Thu, Mar 14 2024 6:53 AM

Chief Justice honours daughter of Supreme Court cook who won US scholarships - Sakshi

ప్రజ్ఞకు పుస్తకాలను బహూకరిస్తున్న సీజేఐ చంద్రచూడ్‌

ఘనంగా సన్మానించిన సీజే

న్యూఢిల్లీ: కలలు కనడం సులువే. వాటిని నెరవేర్చుకోవడమే కష్టం. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో కలలు సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలో ఒకరే ప్రజ్ఞ. సుప్రీంకోర్టులో పని చేస్తున్న వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ(25) అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ అభ్యసించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు.

న్యాయశాస్త్రంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తోపాటు ఇతర న్యాయమూర్తులు బుధవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దేశానికి సేవలందించాలని వారు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగంపై రచించిన మూడు పుస్తకాలపై వారంతా సంతకాలు చేసి, ఆమెకు బహూకరించారు.

స్వయంకృషి, పట్టుదలతో ప్రజ్ఞ ఈ స్థాయికి చేరుకున్నారని, భవిష్యత్తులో ఆమెకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు. పిల్లలు వారి కలలు నెరవేర్చుకొనేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులపైనా ఉందని సూచించారు.

సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రజ్ఞ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని కూడా న్యాయమూర్తులు సన్మానించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోరి్నయా, యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్‌లో మాస్టర్స్‌ చదవడానికి ప్రజ్ఞకు అవకాశం దక్కింది. స్కాలర్‌షిప్‌ లభించింది. ఆమె తండ్రి అజయ్‌ సమాల్‌ సుప్రీంకోర్టు వంట మనిషి. న్యాయశాస్త్రంలో ఉన్నత చదవులు చదవడానికి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తనకు స్ఫూర్తిగా నిలిచారని ప్రజ్ఞ చెప్పారు. ప్రజ్ఞ ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ప్లానింగ్‌లో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement