Top universities
-
‘శెభాష్ ప్రజ్ఞ’.. సీజేఐ సన్మానం
న్యూఢిల్లీ: కలలు కనడం సులువే. వాటిని నెరవేర్చుకోవడమే కష్టం. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో కలలు సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలో ఒకరే ప్రజ్ఞ. సుప్రీంకోర్టులో పని చేస్తున్న వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ(25) అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. న్యాయశాస్త్రంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తోపాటు ఇతర న్యాయమూర్తులు బుధవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దేశానికి సేవలందించాలని వారు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగంపై రచించిన మూడు పుస్తకాలపై వారంతా సంతకాలు చేసి, ఆమెకు బహూకరించారు. స్వయంకృషి, పట్టుదలతో ప్రజ్ఞ ఈ స్థాయికి చేరుకున్నారని, భవిష్యత్తులో ఆమెకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. పిల్లలు వారి కలలు నెరవేర్చుకొనేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులపైనా ఉందని సూచించారు. సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రజ్ఞ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని కూడా న్యాయమూర్తులు సన్మానించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌లో మాస్టర్స్ చదవడానికి ప్రజ్ఞకు అవకాశం దక్కింది. స్కాలర్షిప్ లభించింది. ఆమె తండ్రి అజయ్ సమాల్ సుప్రీంకోర్టు వంట మనిషి. న్యాయశాస్త్రంలో ఉన్నత చదవులు చదవడానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ తనకు స్ఫూర్తిగా నిలిచారని ప్రజ్ఞ చెప్పారు. ప్రజ్ఞ ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్‌లో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. -
జాతీయ ర్యాంకుల్లో పడిపోయిన రాష్ట్ర యూనివర్సిటీలు.. కారణం అదేనా!
సాక్షి, హైదరాబాద్: అధ్యాపకుల కొరత రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియాతోపాటు జేఎన్టీయూహెచ్ ర్యాంకులు కూడా తగ్గాయి. జాతీయ ఓవరాల్ ర్యాంకుల్లోనే కాదు.. పరిశోధన, యూనివర్సిటీ స్థాయి ప్రమాణాల్లోనూ విశ్వవిద్యాలయాలు వెనుకంజలో ఉన్నాయి. అన్నింటికన్నా ఐఐటీ–హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ దూసుకుపోవడం విశేషం. గత మూడేళ్ల విద్యా ప్రమాణాల ఆధారంగా ఎన్ఐఆర్ఎఫ్ ఏటా ర్యాంకులు ఇస్తుంది. ఐఐటీ–హైదరాబాద్ దూకుడు.. ఓయూ వెనక్కు జాతీయస్థాయిలో వంద యూనివర్సిటీల్లో ఐఐటీ–హైదరాబాద్ గత ఏడాది మాదిరిగానే 14వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థలో 2019లో 144 మంది రూ.17 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. 2020–21లో 185 మంది రూ.16 లక్షలకుపైగా, 2021–22లో 237 మంది రూ.20 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉపాధి పొందారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోనూ విద్యార్థులు అత్యధికంగా రూ.40 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. నిట్ వరంగల్‌లో అత్యధికంగా యూజీ విద్యార్థులు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఈ సంస్థ మంచి ప్రమాణాలు నెలకొల్పినట్టు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ఈ సంస్థలో అధ్యాపకుల కొరత వల్ల రీసెర్చ్‌లో వెనుకబడింది. ఫలితంగా నిట్ వరంగల్ జాతీయర్యాంకు 2022లో 45 ఉండగా, ఈసారి 53కు చేరింది. ఉస్మానియా వర్సిటీ ఓవరాల్ ర్యాంకులో గత ఏడాది 46 ఉంటే, ఈసారి 64 దక్కింది. ఇక్కడా పరిశోధనల్లో నెలకొన్న మందకొడితనమే జాతీయ ర్యాంకుపై ప్రభావం చూపింది. ఈసారి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు ఓవరాల్ ర్యాంకులో గతంలో మాదిరిగానే 20వ ర్యాంకు వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10 ర్యాంకుతో నిలకడగా ఉంది. హైదరాబాద్ ట్రిపుల్ఐటీ జాతీయస్థాయిలో 84వ ర్యాంకు పొందింది. చదవండి: విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు ఇంజనీరింగ్‌లో వెనుకబాటుతనం ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ సరికొత్త బోధన విధానాలతో 9లో ఉన్న ర్యాంకును 8కి తేగలిగింది. ఎక్కువ ఇంజనీరింగ్ అనుబంధ కాలేజీలున్న జేఎన్టీయూ–హెచ్ 76 నుంచి 98కి పడిపోయింది. నిట్ వరంగల్ 21వ ర్యాంకుతో నిలిచింది. ఈసారి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ జాతీయస్థాయి కాలేజీల విభాగంలో 98 ర్యాంకును సాధించింది. పరిశోధన విభాగంలో ట్రిపుల్ఐటీ హైదరా బాద్ ర్యాంకు 12 నుంచి 14కు చేరింది. అధ్యాపకుల కొరతే కారణం: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత. కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్ల పరిశోధనలో వెనుకబడిపోతున్నాం. అయినప్పటికీ బోధనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. -ప్రొ.డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ ర్యాంకు సాధించని వ్యవసాయ వర్సిటీ దేశంలో టాప్–40 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చోటు దక్కలేదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో వ్యవసాయ వర్సిటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాలను ఆరా తీయగా, సమాధానం లభించలేదు. వర్సిటీ ప్రమాణాలు తగ్గుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అడ్రస్ లేని మెడికల్ కాలేజీలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో దేశంలో టాప్ 50లో చోటు దక్కని వైనం సాక్షి, హైదరాబాద్: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చేసిన దేశంలోని టాప్–50 మెడికల్ కాలేజీల్లో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మెడికల్ కాలేజీ చోటు దక్కించుకోలేకపోయింది. రాష్ట్రం నుంచి నాలుగు కాలేజీలు... ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, కరీంనగర్‌లోని చలిమెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, హైదరాబాద్‌కు చెందిన మల్లారెడ్డి, అపోలో మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మిగిలిన కాలేజీలకు కనీసం దరఖాస్తు చేసుకునే స్థాయి కూడా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. టాప్–50 ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్ మొదటి ర్యాంకు, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండో ర్యాంకు, తమిళనాడులోని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మూడో ర్యాంకు, బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నాలుగో ర్యాంకు, పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐదో ర్యాంకు సాధించాయి. డెంటల్ ర్యాంకుల్లో మాత్రం తెలంగాణకు ఊరట కలిగింది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌కు 33 ర్యాంకు దక్కింది. 176 మెడికల్ కాలేజీలు, 155 డెంటల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో వైద్య పరిశోధన దాదాపు ఎక్కడా లేదని, అలాగే, విద్యార్థులు–అధ్యాపకుల నిష్పత్తి కూడా దారుణంగా ఉందన్న విమర్శలున్నాయి. -
‘మీరంతా ఇక్కడే ఉండి మాకు సాయం చేయండి’
వాషింగ్టన్ : యువత డాలర్ డ్రీమ్స్ మీద నీళ్లు కుమ్మరిస్తూ వలసదారుల పట్ల కఠినంగా ప్రవర్తించిన ట్రంప్ తొలిసారి ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశి విద్యార్థులు అమెరికాలోనే ఉండి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికాలోని పాత వలస విధానలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొనారు. దీని వల్ల ప్రతిభావంతులను కోల్పోతున్నాం అని తెలిపారు. చట్టబద్ధమైన వలస విధానాల్లో ఉన్న లొసుగులను అంతం చేయాలని.. ప్రతిభ ఆధారిత వలసలను ప్రోత్సహించాలని అన్నారు. చట్టబద్ధంగా, ప్రతిభ ఆధారంగా అమెరికాకు వలస వచ్చే ప్రజలను తమ ప్రభుత్వం స్వాగతిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలో చాలా గొప్ప కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో పని చేయడానికి ప్రతిభావంతులు కావాలి. అందుకే చట్టబద్ధంగా, మెరిట్ ఆధారంగా వచ్చే వారిని ప్రోత్సాహించాలని నిర్ణయించామన్నారు. కంపెనీల యజమానులు కూడా ఇదే విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ‘నాకు గొప్ప గొప్ప టెక్ కంపెనీల నుంచి ఫోన్లు వస్తున్నాయి. దేశంలోని మంచి విద్యాసంస్థలలో చదువుకున్న వారిని ఇక్కడ ఉంచలేకపోతున్నాం. వాళ్లు ఇక్కడి అత్యుత్తమమైన విద్యాసంస్థల్లో చదువుకుని తిరిగి చైనా, జపాన్, తదితర దేశాలకు వెళ్లిపోతున్నారు. వివిధ కారణాల వల్ల వారికి ఇక్కడ ఉండే అవకాశం ఉండట్లేదు. దీంతో గొప్ప ప్రతిభావంతులను కోల్పోతున్నాం. మనం అలా చేయకూడదంటూ కంపెనీల యాజమానులు తనను విన్నవించారని ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా చదువు పూర్తయిన విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునే విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ట్రంప్ ప్రస్తావించారు. ఈ విషయంపై డెమోక్రటిక్ కాంగ్రెషనల్ నేతలతో చర్చించినట్లు చెప్పారు. గొప్ప కంపెనీలను, ప్రతిభావంతులను వదులుకోమని అన్నారు. ఆశ్రయం కావాలని కోరుకునే వారికి చట్టబద్ధమైన విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన పోలీసు అధికారిని అక్రమ వలసదారుడు కాల్చి చంపడంపై స్పందించిన ట్రంప్.. అమెరికన్లను సురక్షితంగా ఉంచేందుకు సరిహద్దులు మరింత భద్రంగా ఉండాలని వెల్లడించారు. -
ఆసియాలో నెంబర్ వన్ యూనివర్సిటీగా సింగపూర్ ఎన్.యు.ఎస్.
ఆసియాలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయం ఏదో తెలుసా? సింగపూర్‌లో ఉన్న నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్.యు.ఎస్.)!! ఇన్నాళ్లూ ఈ స్థానంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌ను తోసిరాజని సింగపూర్ వర్సిటీ అగ్రస్థానానికి ఎగబాకింది. లండన్‌కు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ ఈ ర్యాంకులు ప్రకటించింది. క్వాక్వారెల్లి సైమండ్స్ అనే విద్యా సంబంధ కన్సల్టెన్సీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందులో సింగపూర్ వర్సిటీకి ప్రపంచంలో 24వ స్థానం వచ్చింది. హెచ్.కె.యు.లో ఎక్కువ మంది బ్రిటిష్ ప్రొఫెసర్లే ఉండటంతో అది దాదాపు బ్రిటిష్ వర్సిటీలా ఉంది. కానీ ఎన్.యు.ఎస్.లో ఇతరులు ఎక్కువ మంది ఉన్నారు. రాబోయే పదేళ్లలో అయితే ఎన్.యు.ఎస్. ప్రపంచంలో టాప్ 20 జాబితాకు వెళ్లిపోవచ్చని క్వాక్వారెల్లి సైమండ్స్ సంస్థ పరిశోధనా విభాగం అధిపతి బెన్ సోటర్ తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం ఉన్నత విద్యకు లభిస్తున్న ప్రోత్సాహమే ఇందుకు కారణమని ఎన్.యు.ఎస్. ప్రొవోస్ట్ టాన్ ఇంగ్ షై తెలిపారు. ప్రపంచంలోని అగ్రస్థాయి 10 విశ్వవిద్యాలయాల్లో అమెరికాకు చెందినవే ఏడు ఉన్నాయి. అగ్రస్థానంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), తర్వాత వరుసగా హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఇంపీరియల్ కాలేజి ఆఫ్ లండన్ ఉన్నాయి.