వాషింగ్టన్ : యువత డాలర్ డ్రీమ్స్ మీద నీళ్లు కుమ్మరిస్తూ వలసదారుల పట్ల కఠినంగా ప్రవర్తించిన ట్రంప్ తొలిసారి ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశి విద్యార్థులు అమెరికాలోనే ఉండి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికాలోని పాత వలస విధానలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొనారు. దీని వల్ల ప్రతిభావంతులను కోల్పోతున్నాం అని తెలిపారు. చట్టబద్ధమైన వలస విధానాల్లో ఉన్న లొసుగులను అంతం చేయాలని.. ప్రతిభ ఆధారిత వలసలను ప్రోత్సహించాలని అన్నారు. చట్టబద్ధంగా, ప్రతిభ ఆధారంగా అమెరికాకు వలస వచ్చే ప్రజలను తమ ప్రభుత్వం స్వాగతిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలో చాలా గొప్ప కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో పని చేయడానికి ప్రతిభావంతులు కావాలి. అందుకే చట్టబద్ధంగా, మెరిట్ ఆధారంగా వచ్చే వారిని ప్రోత్సాహించాలని నిర్ణయించామన్నారు. కంపెనీల యజమానులు కూడా ఇదే విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ‘నాకు గొప్ప గొప్ప టెక్ కంపెనీల నుంచి ఫోన్లు వస్తున్నాయి. దేశంలోని మంచి విద్యాసంస్థలలో చదువుకున్న వారిని ఇక్కడ ఉంచలేకపోతున్నాం. వాళ్లు ఇక్కడి అత్యుత్తమమైన విద్యాసంస్థల్లో చదువుకుని తిరిగి చైనా, జపాన్, తదితర దేశాలకు వెళ్లిపోతున్నారు. వివిధ కారణాల వల్ల వారికి ఇక్కడ ఉండే అవకాశం ఉండట్లేదు. దీంతో గొప్ప ప్రతిభావంతులను కోల్పోతున్నాం. మనం అలా చేయకూడదంటూ కంపెనీల యాజమానులు తనను విన్నవించారని ట్రంప్ తెలిపారు.
ఈ సందర్భంగా చదువు పూర్తయిన విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునే విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ట్రంప్ ప్రస్తావించారు. ఈ విషయంపై డెమోక్రటిక్ కాంగ్రెషనల్ నేతలతో చర్చించినట్లు చెప్పారు. గొప్ప కంపెనీలను, ప్రతిభావంతులను వదులుకోమని అన్నారు. ఆశ్రయం కావాలని కోరుకునే వారికి చట్టబద్ధమైన విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన పోలీసు అధికారిని అక్రమ వలసదారుడు కాల్చి చంపడంపై స్పందించిన ట్రంప్.. అమెరికన్లను సురక్షితంగా ఉంచేందుకు సరిహద్దులు మరింత భద్రంగా ఉండాలని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment