ఆసియాలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయం ఏదో తెలుసా? సింగపూర్లో ఉన్న నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్.యు.ఎస్.)!! ఇన్నాళ్లూ ఈ స్థానంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ను తోసిరాజని సింగపూర్ వర్సిటీ అగ్రస్థానానికి ఎగబాకింది. లండన్కు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ ఈ ర్యాంకులు ప్రకటించింది. క్వాక్వారెల్లి సైమండ్స్ అనే విద్యా సంబంధ కన్సల్టెన్సీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందులో సింగపూర్ వర్సిటీకి ప్రపంచంలో 24వ స్థానం వచ్చింది.
హెచ్.కె.యు.లో ఎక్కువ మంది బ్రిటిష్ ప్రొఫెసర్లే ఉండటంతో అది దాదాపు బ్రిటిష్ వర్సిటీలా ఉంది. కానీ ఎన్.యు.ఎస్.లో ఇతరులు ఎక్కువ మంది ఉన్నారు. రాబోయే పదేళ్లలో అయితే ఎన్.యు.ఎస్. ప్రపంచంలో టాప్ 20 జాబితాకు వెళ్లిపోవచ్చని క్వాక్వారెల్లి సైమండ్స్ సంస్థ పరిశోధనా విభాగం అధిపతి బెన్ సోటర్ తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం ఉన్నత విద్యకు లభిస్తున్న ప్రోత్సాహమే ఇందుకు కారణమని ఎన్.యు.ఎస్. ప్రొవోస్ట్ టాన్ ఇంగ్ షై తెలిపారు.
ప్రపంచంలోని అగ్రస్థాయి 10 విశ్వవిద్యాలయాల్లో అమెరికాకు చెందినవే ఏడు ఉన్నాయి. అగ్రస్థానంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), తర్వాత వరుసగా హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఇంపీరియల్ కాలేజి ఆఫ్ లండన్ ఉన్నాయి.
ఆసియాలో నెంబర్ వన్ యూనివర్సిటీగా సింగపూర్ ఎన్.యు.ఎస్.
Published Tue, Sep 10 2013 11:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
Advertisement