
న్యూఢిల్లీ: అవినీతిమయ, లంచగొండి ప్రభుత్వ అధికారులను చట్టం ముందు బోనులో నిలబెట్టేందుకు మరింత కృషి జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లంచగొండి అధికారికి వ్యతిరేకంగా నేరుగా సాక్ష్యాలు లేని సందర్భాల్లో ఇతరత్రా సాక్ష్యాధారాలతో శిక్ష ఎలా ఖరారుచేయాలనే వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పై విధంగా స్పందించింది. లంచం తీసుకున్న కేసులో అవినీతి ప్రభుత్వ అధికారి అక్రమంగా లబ్ధి పొందాడనే బలమైన సాక్ష్యాలు, డాక్యుమెంట్లు లేకున్నా ఆ నేరంలో అతడికి ప్రమేయముందని తెలిపే నమ్మదగ్గ సాక్ష్యాలుంటే సరిపోతుందని, అతనిని దోషిగా నిర్ధారిస్తామని జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బీఎస్ నాగరత్నల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అవినీతి అధికారులకు శిక్ష పడేలా చేసేందుకు ఫిర్యాదుదారులు, ప్రభుత్వ లాయర్లు అంకితభావంతో కృషిచేయాలని కోర్టు సూచించింది. లంచగొండి అధికారులను పక్కకు తప్పిస్తేనే అవినీతిరహిత పాలన సాధ్యమవుతుందని ధర్మాసనం పేర్కొంది. ‘ప్రాథమిక, బలమైన సాక్ష్యాలు, ఆధారాల లేని పక్షంలో, ఫిర్యాదుదారులు, బాధితుడు మరణించినా లేదా భయంతో ఫిర్యాదుదారు విచారణ సమయంలో సాక్ష్యం చెప్పలేకపోయినా నిందితుడికి నేరంలో ప్రమేయముందని తెలిపే మౌఖిక, నమ్మదగ్గ ఇతరత్రా సాక్ష్యాలు ఉన్న సరిపోతుంది. ఆ అధికారిని దోషిగా తేలుస్తాం. కేసు విచారణలో ప్రభుత్వ అధికారిని శిక్షించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ ఆ అధికారి లంచం అడగడానికి, లబ్ధి పొందడానికి పూర్తి అవకాశం ఉందనేది మొదట నిరూపించగలిగితే చాలు’ అని కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment