
అభిప్రాయం
హోళీ ముందురోజు హోళీ కా దహన్ ఉంటుంది. హోళికా అన్న రాక్షసిని చంపడాన్ని భారత ప్రజలు పండు గగా జరుపు కొంటారు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని చంపే ప్రయత్నం చేసిన రాక్షసి హోళికా. చెడు మీద మంచి గెలుపునకు ప్రతీకాత్మకంగా హోళీ దహ నాన్ని చూస్తారు.
చెడు పెరిగి పోతున్నప్పుడు ప్రకృతి తన చర్యలని చేపడుతుందని అంటూ ఉంటారు. కొన్నిసార్లు ఇది నిజమేనని అనిపిస్తుంది. నిప్పు కూడా ప్రకృతిలో భాగమే. అది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి మీద తన ప్రతాపాన్ని ఈ నెల 14వ తేదీన చూపించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో చెలరేగిన మంటల వల్ల ఆయన ఇంట్లో భారీ నగదు ఉన్నట్టుగా పోలీసు, అగ్నిమాపక అధికారులు కను గొన్నారు. ఆ మంటలు దేశంలోని న్యాయ వ్యవస్థని మండించాయి.
మంటలు చెలరేగినప్పుడు జస్టిస్ వర్మ ఇంట్లో లేరు. ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. మంటలు ఆర్పుతున్నప్పుడు ఒక గదిలో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదుని అధికారులు కనుగొన్నారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని సీనియర్ అధికారులకి తెలియజేశారు. ఫలితంగా విషయం సుప్రీంకోర్టు దాకా చేరింది.
ఈ అంశాన్ని చర్చించడానికి భారత ప్రధాన న్యాయ మూర్తి సంజీవ్ ఖన్నా అత్యవసరంగా కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను తిరిగి అలహాబాద్‌కు బదిలీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియంలోని సభ్యులు ఈ నేరానికి అంత ర్గత విచారణ అవసరమని అభిప్రాయపడినారని వార్తలు. కేవలం బదిలీతో ఆయనను వదిలేస్తే న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుందని కొంతమంది న్యాయమూర్తులు భావించినారు.
న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసం నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్న తరువాత సుప్రీంకోర్టు శుక్రవారం అంతర్గత విచారణను ప్రారంభించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నుంచి కూడా సుప్రీంకోర్టు నివేదికను కోరింది. శుక్రవారం ఉదయం జరిగిన న్యాయమూర్తుల ఫుల్ కోర్టు సమావేశంలో శిక్షాత్మక బదిలీ సరిపోదని, న్యాయమూర్తిపై కొంత నిర్దిష్ట చర్య తీసుకోవాలని అభిప్రాయపడినట్టుగా చెబుతున్నారు.
అంతర్గత విచారణకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంగీకరిస్తూ బదిలీని మొదటి అడుగుగా భావించినారు. బదిలీ ప్రక్రియ తక్షణమే అమల్లోకి రాదు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం తాజాగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారు.
జస్టిస్ వర్మ 1969 జనవరి 6న అలహాబాద్‌లో జన్మించి నారు. 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైనారు. 2016 ఫిబ్రవరి 1న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తరువాత 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టుకి బదిలీ అయ్యారు. న్యాయ వాద వృత్తిలో ఉన్నప్పుడు జస్టిస్ వర్మ రాజ్యాంగ, కార్మిక పారిశ్రామిక చట్టాలలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారు. అలహాబాద్ హైకోర్టుకి న్యాయవాదిగా 2006 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకు పని చేశారు.
హైకోర్టు న్యాయమూర్తిని ఎలా తొలగిస్తారు?
న్యాయమూర్తులపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, న్యాయమూర్తులపై ఫిర్యాదు అందిన తరువాత ప్రధాన న్యాయమూర్తి ఆ సంబంధిత న్యాయమూర్తి నుంచి వివరణ అడుగుతారు. ఆ వివరణకు ప్రధాన న్యాయమూర్తి సంతృప్తి చెందనప్పుడు, లేదా ఆ విషయంపట్ల మరింత దర్యాప్తు అవసర మని భావించినప్పుడు అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తారు.
ఆ కమిటీ తన నివేదికను సమర్పించిన తరువాత సంబంధిత న్యాయమూర్తి చేసిన దుష్ప్రవర్తన తీవ్రమైనదని, అతన్ని తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి భావిస్తే రాజీనామా చేయమని ఆ న్యాయమూర్తిని అడుగు తారు. ఆ న్యాయమూర్తి అందుకు నిరాకరిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం పార్లమెంట్ ద్వారా ఆయన తొలగింపునకు చర్యలు ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తి ప్రభు త్వానికి లేఖ రాస్తారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసం నుండి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న తరువాత సుప్రీంకోర్టు కొలీజియమ్ ఆయన్ని అలహాబాద్‌కి బదిలీ చేయాలని సిఫారస్ చేయాలని వార్తలు వచ్చాయి. ఈ సిఫారస్‌పై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘అలహాబాద్ హైకోర్టు చెత్తబుట్ట కాదు.
అతణ్ణి ఇక్కడికి పంపించడానికి వీల్లేదు. అవినీతిపరులను మేం అంగీకరించం. అవస రమైతే కోర్టు పనిని మానివేస్తాం’ అని అలహాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ అన్నారు. జస్టిస్ వర్మ ఇంటి నుండి 15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు బార్ అసోసియేషన్ తన ప్రెస్ నోట్‌లో పేర్కొంది.
కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ శుక్రవారం ఉదయం రాజ్యసభలో జస్టిస్ వర్మ అంశాన్ని లేవనెత్తారు. ఈ షాకింగ్ కేసుతో దేశం మేల్కొందని ఆయన అన్నారు. ఈ సంద ర్భాన్ని పురస్కరించుకుని జైరాం రమేష్... ప్రయాగరాజ్‌లో విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా గత డిసెంబర్‌లో 50 మంది పార్లమెంట్ సభ్యులు ఛైర్మన్‌కి పంపిన అభిశంసన నోటీసుని గుర్తు చేశారు. న్యాయమూర్తుల నియామకంలో న్యాయపరమైన జవాబుదారీతనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంతో చర్చించాలని ఛైర్మన్‌ని కోరారు.
సుప్రీంకోర్టు ఏం చేయాలి?
సుప్రీంకోర్టు కోరిన తరువాత కూడా ఆరోపణలు ఎదు ర్కొంటున్న న్యాయమూర్తి రాజీనామా చేయనపుడు, ఇతర హైకోర్టులు బార్ అసోసియేషన్లు అతని బదిలీని అంగీకరించ నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలి? ఇదీ ప్రశ్న.
అభిశంసన అనేది కార్యరూపం దాల్చ డానికి చాలా సమయం పడుతుంది. అందు కని ఆ న్యాయమూర్తికి ఎలాంటి పని అప్ప గించకుండా చర్యలు తీసుకోవాలి. ఆ అవ మాన భారంతో ఆ న్యాయమూర్తి రాజీ నామా చేసే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉంటే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే అధికారం తమకు ఉందని లోక్‌పాల్ అభిప్రా యపడింది. ఇది చాలా కలవరపెట్టే విషయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడి ఆ ఉత్తర్వులని స్టే చేసింది. అది సుప్రీంకోర్టు ముందుకు త్వరలో రానున్నది. సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి.
న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎవరూ సహించరు. ఇది చాలా తీవ్రమైన విషయం. న్యాయ వ్యవస్థలోనే కాకుండా సమాజంలో అవినీతి అనేది ఒక పెద్ద సమస్యగా మిగిలిపోయింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు తన దృష్టిని సారించా ల్సిన సమయం ఆసన్నమైంది.
డా‘‘ మంగారి రాజేందర్
వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment