కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత నెలలో ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సమయంలో.. నిందితుడు సంజయ్ రాయ్‌తోపాటు ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
అయితే వైద్యురాలి కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసిన కోల్‌కత్తా హైకోర్టు.. ఘోష్‌పై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తును సైతం సీబీఐకే అప్పజెప్పింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నేడు(శుక్రవారం) ఆయన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య దర్శాసనం.. తన పదవీకాలంలో ఆర్జీకర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌లో భాగస్వామిగా చేర్చుకోవాలన్న సందీప్ ఘోష్ విజ్ఞప్తిని తిరస్కరించింది.
‘ఒక కేసులో నిందితుడిగా ఉన్న మీరు.. కలకత్తా హైకోర్టు విచారిస్తున్న పిటిషన్‌లో జోక్యం చేసుకునే హక్కు లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారంతో.. అవినీతి ఆరోపణలను అనుసంధానిస్తూ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించేందుకు కూడా అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఇదిలా ఉండగా.. 2021 నుంచి సందీప్ ఘోష్ ఆర్‌జీ ఆసుపత్రి ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆయన హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే..
ఇక వైద్యురాలి కేసులో సందీప్ ఘోష్‌ను రెండు వారాలుగా విచారించిన అనంతరం సోమవారం సీబీఐ అతన్ని అరెస్టు చేసింది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఘోష్ నివాసంపై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. ఘోష్, అతడి సహచరులకు సంబంధించిన వివిధ ప్రదేశాలలో దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు. ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రసూన్ ఛటర్జీ ఇంట్లో కూడా సోదాలు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment