ప్రభుత్వ జాగా..వేసేయ్ పాగా..
పెడన, న్యూస్‌లైన్ : పెడన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణదారులకు అడ్డేలేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలాలు, భూములే లక్ష్యంగా ఆక్రమణలు చేస్తున్నారు. ఏకంగా విక్రయాలూ పూర్తిచేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు లంచాలు మరిగి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. మామూళ్ల మత్తులో మునిగిన పలువురు అధికారులు ఏకంగా విక్రయాలకు కూడా సహకరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా అధికారి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నారు.
ఆక్రమణలు ఇలా...
పెడన మండలం బల్లిపర్రులో 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో మూడు గదులతో దుకాణ సముదాయం నిర్మిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు అడ్డుపడితే.. నీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగటం, ఉన్నతాధికారులు కూడా ఒత్తిడి చేయడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. దీనివెనుక వేలకువేలు చేతులు మారాయని కొంతమంది అధికారులే చెబుతున్నారు.
పెడన పట్టణం కాపులవీధి శివారు హనుమాన్కాలనీలో 2.54 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలుచేసి 86 మందికి ఇళ్లు నిర్మించింది. కాలనీ నిర్మాణ సమయంలో రెవెన్యూ అధికారులు కమ్యూనిటీ స్థలం కోసం పది సెంట్ల మేరకు ఖాళీ స్థలం వదిలారు. దీనిపై కన్నేసిన ఆక్రమణదారులు అక్కడ అక్రమంగా నాలుగు గదుల ఇందిరమ్మ ఇల్లు కట్టేశారు. ఆపై మూడు లక్షలకు ఓ హోటల్ యజమానికి దానిని అమ్మేశారు. ఆయన మరింత అందంగా తీర్చిదిద్ది, మొదటి అంతస్తు నిర్మాణానికి యత్నాలు చేస్తుండటంతో అసలు విషయం బయటపడింది.
పెడన నూతన బైపాస్ సమీపంలో ఆర్ఎస్ఆర్ 341లో 4.30 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కోటి రూపాయల విలువైన ఈ భూమిని కొంతమంది ఆక్రమించుకుని వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్డీవో సాయిబాబు దీనిని గుర్తించి మున్సిపల్ అధికారులకు అధికారులకు స్వాధీనం చేస్తామని స్పష్టం చేశారు. ఓ నాయకుడికి భయపడి మున్సిపల్ అధికారులు రేపు మాపు అంటూ వాయిదా వేస్తూ పబ్బం గడుపుతున్నారు. దీంతో ఆ భూమి ఆక్రమణదారుల చేతుల్లోనే ఉంది.
పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, శ్మశానవాటికకు మధ్యలో 30 సెంట్ల ప్రభుత్వ భూమి మరొకరి ఆధీనంలో కొనసాగుతోంది.
పెడన మార్కెట్ యార్డు వెనుక ప్రాంతంలో అర కోటి ఖరీదు చేసే 37 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఓ వ్యక్తి ఆక్రమించుకుని ప్లాట్లు వేసుకుని అమ్మకాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం పూడిక పనులు కూడా పూర్తిచేశారు. కొనే వారుంటే అమ్మటానికి సిద్ధంగా ఉంది.
మామూళ్ల మత్తులో అధికారులు...
ఆక్రమణలు ఇష్టారాజ్యంగా సాగుతున్నా మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక రెవెన్యూ అధికారులకు ఎప్పుడు నగదు అవసరమైతే అప్పుడు వచ్చి తమవద్ద వేలాది రూపాయలు దండుకుంటున్నారని పలువురు ఆక్రమణదారులే చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాలు, భూములు ఓ పక్క ఆక్రమణల్లో ఉండగా వివిధ కార్యాలయాల అవసరాల నిమిత్తం భవనాల నిర్మాణానికి ప్రభుత్వ భూములే లేవంటూ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు నివేదించటం కొసమెరుపు. దీనివల్ల టూరిజం టెక్స్టైల్స్ పార్కు, రెండు స్త్రీ శక్తి భవనాలు, విద్యుత్ సబ్‌స్టేషన్, స్టేడియం, నియోజకవర్గ స్థాయి వసతి గృహం ఏర్పాటుకు స్థలాలు లేక నిధులు వెనక్కితరలిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల విషయంపై తహశీల్దారును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా అవేమీ తమ దృష్టికి రాలేదని, అలాంటివి ఉంటే వాటిని వెంటనే స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.