government sector
-
లంచగొండి అధికారులకు శిక్షలు పడాల్సిందే
న్యూఢిల్లీ: అవినీతిమయ, లంచగొండి ప్రభుత్వ అధికారులను చట్టం ముందు బోనులో నిలబెట్టేందుకు మరింత కృషి జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లంచగొండి అధికారికి వ్యతిరేకంగా నేరుగా సాక్ష్యాలు లేని సందర్భాల్లో ఇతరత్రా సాక్ష్యాధారాలతో శిక్ష ఎలా ఖరారుచేయాలనే వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పై విధంగా స్పందించింది. లంచం తీసుకున్న కేసులో అవినీతి ప్రభుత్వ అధికారి అక్రమంగా లబ్ధి పొందాడనే బలమైన సాక్ష్యాలు, డాక్యుమెంట్లు లేకున్నా ఆ నేరంలో అతడికి ప్రమేయముందని తెలిపే నమ్మదగ్గ సాక్ష్యాలుంటే సరిపోతుందని, అతనిని దోషిగా నిర్ధారిస్తామని జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బీఎస్ నాగరత్నల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినీతి అధికారులకు శిక్ష పడేలా చేసేందుకు ఫిర్యాదుదారులు, ప్రభుత్వ లాయర్లు అంకితభావంతో కృషిచేయాలని కోర్టు సూచించింది. లంచగొండి అధికారులను పక్కకు తప్పిస్తేనే అవినీతిరహిత పాలన సాధ్యమవుతుందని ధర్మాసనం పేర్కొంది. ‘ప్రాథమిక, బలమైన సాక్ష్యాలు, ఆధారాల లేని పక్షంలో, ఫిర్యాదుదారులు, బాధితుడు మరణించినా లేదా భయంతో ఫిర్యాదుదారు విచారణ సమయంలో సాక్ష్యం చెప్పలేకపోయినా నిందితుడికి నేరంలో ప్రమేయముందని తెలిపే మౌఖిక, నమ్మదగ్గ ఇతరత్రా సాక్ష్యాలు ఉన్న సరిపోతుంది. ఆ అధికారిని దోషిగా తేలుస్తాం. కేసు విచారణలో ప్రభుత్వ అధికారిని శిక్షించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ ఆ అధికారి లంచం అడగడానికి, లబ్ధి పొందడానికి పూర్తి అవకాశం ఉందనేది మొదట నిరూపించగలిగితే చాలు’ అని కోర్టు పేర్కొంది. -
ఆరోగ్య రంగంపై వ్యయాలు పెరగాలి
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ బుధవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ కేవలం 0.95 శాతం ఉందని పేర్కొన్న ఆయన, 2024నాటికి ఇది 2.5 శాతానికి చేరాలని సూచించారు. దురదృష్టవశాత్తూ, ఆరోగ్య రంగానికి సంబంధించి దేశంలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆసియా హెల్త్ 2020 అనే అంశంపై పారిశ్రామిక వేదిక సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సింగ్ మాట్లాడారు. ఆరోగ్య రంగంలో సవాళ్లను ఏ ఒక్కరో ఎదుర్కొనలేరనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ... ఈ రంగంపై కేటాయింపులను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వాల నుంచి చర్యలు ఉంటాయని తాను విశ్వసిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సు పరిధి పెంచడం వంటి రెగ్యులేటరీ మార్పులను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం... ఆరోగ్య సేవల రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం కూడా కీలకమని సింగ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వినూత్న నైపుణ్యలతో ప్రైవేటు రంగం చక్కటి సేవలను అందించగలుగుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు. కోవిడ్–19ను ఎదుర్కొనడంలో ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్న సింగ్, ఆరోగ్య సేవల విషయంలో మరింత గుర్తింపు లభించడానికి వారు అర్హులని అన్నారు. ‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్’ ప్రస్తావన ‘‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ఏర్పాటవుతుందని 1951 సివిల్ సర్వీసెస్ యాక్ట్ పేర్కొంది. ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే, అప్పటి నుంచీ ఈ తరహా సర్వీస్ ఏదీ ఏర్పాటు కాలేదు’’ అని సందర్భంగా పేర్కొన్న సింగ్, అంతర్జాతీయ ప్రమాణాలు, ఇప్పటికే చోటుచేసుకున్న పరిణా మాలు, ఉదాహరణల ప్రాతిపదికన ఈ సర్వీసు ఏర్పాటుకావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆరోగ్యం రంగం పలు సమస్యలు, సవాళ్ల వలయంలో చిక్కుకుందనీ వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలని ఇండియన్ మెడికన్ అసోసియేషన్ (ఐఎంఏ) గత కొంత కాలంలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2021–22 నుంచి 2025–26 మధ్య దేశ ఆర్థిక రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై సింగ్ నేతృత్వంలోని 15వ ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలకు తన సిఫారసులను సమర్పించిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత నివేదికాంశాలు వెల్లడవుతాయి. -
అమెరికా షట్‌డౌన్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన మరోసారి పాక్షికంగా స్తంభించింది (షట్‌డౌన్). అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.30) కొన్ని అత్యవసర, కీలక విభాగాలు తప్పించి మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. అమెరికాలో ఇలా జరగడం ఈ ఏడాదిలోనే ఇది మూడోసారి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండానే, అలాగే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ అడిగిన 500 కోట్ల డాలర్ల డబ్బుపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే శుక్రవారం కాంగ్రెస్ వాయిదా పడింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు సకాలంలో కాంగ్రెస్ అమోదం పొందకపోయినా, అధ్యక్షుడు సంతకం చేయకపోయినా పాలన స్తంభిస్తుంది. పాలన నిలిచిపోకుండా చూసేందుకు చివరి నిమిషం వరకు కాంగ్రెస్ నేతలు, శ్వేతసౌధం అధికారుల మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రభుత్వానికి చెందిన కొన్ని కీలక భద్రతా సంస్థలు, అత్యవసర సేవల సంస్థలు మాత్రమే ప్రస్తు తం అమెరికాలో పనిచేస్తున్నా యి. అమెరికా రక్షణ మంత్రి పదవికి జిమ్ మ్యాటిస్ రాజీనామా చేసిన మరుసటి రోజునే పాలన స్తంభించడంతో అమెరికాలో కల్లోలిత వాతావరణం నెలకొంది. షట్‌డౌన్ కారణంగా 8 లక్షల మంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి వేత నం లేని సెలవులు లభించనుండగా, మరికొందరు జీతం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఈసారి ఎక్కువ కాలం.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ ఆమోదించేంత వరకు అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతుంది. ఈ సారి షట్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగుతుందనీ, దానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ అధికారం చేపట్టాకా షట్‌డౌన్ అమలు కావడం ఇది మూడో సారి. ఈ ఏడాది జనవరి, జూన్ నెలలలో కూడా కొన్ని రోజుల పాటు పాలన స్తంభించింది. షట్‌డౌన్ కాలంలో చాలా మంది ఉద్యోగులకు సెలవులు ఇస్తారు. అత్యవసర విభాగాల సిబ్బంది యథావిధిగా పని చేస్తారు. ఈ కాలంలో సామాజిక తనిఖీ విభాగం, వైద్యశాఖ, తపాలా విభాగాలపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. అవన్నీ యథా ప్రకారం పని చేస్తాయి. ఎఫ్‌బీఐ, సరిహద్దు గస్తీ, తీరరక్షణ, ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, ఆహార తనిఖీ, హోంలాండ్ సెక్యూరిటీ విభాగం వంటి అత్యవసర విభాగాలు కూడా మామూలుగానే పని చేస్తాయి. షట్‌డౌన్ కాలంలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మ్యూజియంలు, ఉద్యానవనాలు, షాపింగ్ మాల్స్ మూతపడతాయి. సెనెట్ అప్రాప్రియేషన్ కమిటీలోని డెమోక్రాట్ల నివేదిక ప్రకారం 4,20,000 మంది ఈ షట్డౌన్లో జీతం లేకుండా పని చేస్తారు. షట్డౌన్లు కొత్త కాదు అమెరికాకు షట్డౌన్లు కొత్త కాదు. దాదాపు ప్రతి సంవత్సరం జనవరిలో కొన్ని రోజుల పాటు పాలన స్తంభిస్తుంటుంది. దైనందిన ప్రభుత్వ వ్యవహారాలకు అవసరమైన నిధులను ఖర్చు చేయడానికి ద్రవ్యవినిమయ బిల్లును జనవరిలో కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదం సకాలంలో లభించకపోతే షట్‌డౌన్ అవుతుంది. జిమ్మి కార్టర్ హయాంలో ప్రతి ఏడూ సరాసరి 11 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి నెలకొంది. రోనాల్డ్ రీగన్ రెండు దఫాల పాలనలో ఆరు షట్డౌన్లను అమెరికా చూసింది. 2013లో ఏకంగా 16 రోజుల పాటు ప్రభుత్వ పాలన స్తంభించిపోయింది. ఈ ఏడాది జనవరిలో మూడు రోజుల పాటు, జూన్‌లో కొన్ని గంటలపాటు షట్‌డౌన్ అయ్యింది. అయితే ఒకే సంవత్సరంలో మూడు సార్లు షట్‌డౌన్ కావడం మాత్రం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. -
మేడారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
మేడారం(తాడ్వాయి), న్యూస్‌లైన్ : మండలంలోని మేడారంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ములుగు ఆర్డీఓ మోతీలాల్, డీఎస్పీ మురళీధర్, ఏటూరునాగారం సీఐ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రె వెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. మేడారంలోని 161 సర్వే నంబర్‌లోగల ప్రభుత్వ భూముల్లో గిరిజనేతరుడు కోళ్ల రాజే శం నిర్మించుకున్న షెడ్‌ను ట్రాక్టర్ డోజర్‌తో పూర్తిగా తొలగించారు. గిరిజనుడు వత్తం లక్ష్మ య్య ఇంటిని తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతుండగా ఆయన అడ్డుకుని తన ఇం టిని తానే తొలగిస్తానని అధికారులను కోరడం తో కొంతమేరకు పాక్షికంగా కూల్చారు. సిద్ధబోయిన రవి నిర్మించిన బిల్డింగ్ స్లాబ్‌పై కట్టిన గోడను కూడా తొలగించారు. పోలీసులు వెళ్లిపోయూక గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఇళ్ల ను తొలగించొద్దని ఆర్డీఓను కోరారు. ప్రభుత్వ భూముల్లో ఇకమీదట అక్రమంగా ఇళ్లను ని ర్మించకుండా చూస్తామని, ప్రస్తుతం నిర్మించుకున్న ఇళ్లకు మినహాయింపు ఇవ్వాలని సర్పం చ్ గడ్డం సంధ్యారాణి ఆర్డీఓను కోరగా ప్రభుత్వ భూమిలో ఇళ్లను కోల్పోరుున గిరిజనులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని ఆయన సమాధానమిచ్చారు. తొలగించవొద్దని ఆత్మహత్యాయత్నం ఇదిలా ఉండగా షెడ్‌ను తొలగించొద్దని కోళ్ల రాజేశం ఆత్మహత్యకు యత్నించాడు. షెడ్‌ను అధికారులు ట్రాక్టర్ డోజర్‌తో తొలగిస్తుండగా రాజేశం బయటకు రాకపోవడంతో ప్రమాదం జరుగుతుందని భావించిన అధికారులు బల వంతంగా బయటకు తీసుకొస్తుండగానే అత డు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకుని ఆటోలో తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాము ఓ వ్యక్తి భూమి కొనుగోలు చేశామని, షెడ్‌ను అధికారులు కూల్చడంతో తీవ్ర నష్టపోయూమని రాజేశం భార్య కన్నీరుపెట్టింది. ముగ్గురిపై కేసు నమోదు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మిం చిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హతీరాం మంగళవారం తెలిపారు. మేడారంలోని 161 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూ మిలో కోళ్ల రాజేశం, వట్టం లక్ష్మయ్య, సిద్ధబోయిన రవి అక్రమంగా ఇళ్లు నిర్మించుకునట్లు రె వెన్యూ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.