అమెరికా షట్‌డౌన్‌ | America Government Will Now Be Shut Down | Sakshi
Sakshi News home page

అమెరికా షట్‌డౌన్‌

Dec 23 2018 5:13 AM | Updated on Apr 4 2019 3:25 PM

America Government Will Now Be Shut Down  - Sakshi

అమెరికా కాంగ్రెస్‌ భవనం

వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన మరోసారి పాక్షికంగా స్తంభించింది (షట్‌డౌన్‌). అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.30) కొన్ని అత్యవసర, కీలక విభాగాలు తప్పించి మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. అమెరికాలో ఇలా జరగడం ఈ ఏడాదిలోనే ఇది మూడోసారి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండానే, అలాగే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్‌ అడిగిన 500 కోట్ల డాలర్ల డబ్బుపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే శుక్రవారం కాంగ్రెస్‌ వాయిదా పడింది.

అమెరికా రాజ్యాంగం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు సకాలంలో కాంగ్రెస్‌ అమోదం పొందకపోయినా, అధ్యక్షుడు సంతకం చేయకపోయినా పాలన స్తంభిస్తుంది. పాలన నిలిచిపోకుండా చూసేందుకు చివరి నిమిషం వరకు కాంగ్రెస్‌ నేతలు, శ్వేతసౌధం అధికారుల మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రభుత్వానికి చెందిన కొన్ని కీలక భద్రతా సంస్థలు, అత్యవసర సేవల సంస్థలు మాత్రమే ప్రస్తు తం అమెరికాలో పనిచేస్తున్నా యి. అమెరికా రక్షణ మంత్రి పదవికి జిమ్‌ మ్యాటిస్‌ రాజీనామా చేసిన మరుసటి రోజునే పాలన స్తంభించడంతో అమెరికాలో కల్లోలిత వాతావరణం నెలకొంది. షట్‌డౌన్‌ కారణంగా 8 లక్షల మంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి వేత నం లేని సెలవులు లభించనుండగా, మరికొందరు జీతం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది.

ఈసారి ఎక్కువ కాలం..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్‌ ఆమోదించేంత వరకు అమెరికాలో షట్‌డౌన్‌ కొనసాగుతుంది. ఈ సారి షట్‌డౌన్‌ ఎక్కువ కాలం కొనసాగుతుందనీ, దానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్‌ వెల్లడించారు. ట్రంప్‌ అధికారం చేపట్టాకా షట్‌డౌన్‌ అమలు కావడం ఇది మూడో సారి. ఈ ఏడాది జనవరి, జూన్‌ నెలలలో కూడా కొన్ని రోజుల పాటు పాలన స్తంభించింది. షట్‌డౌన్‌ కాలంలో చాలా మంది ఉద్యోగులకు సెలవులు ఇస్తారు. అత్యవసర విభాగాల సిబ్బంది యథావిధిగా పని చేస్తారు.

ఈ కాలంలో సామాజిక తనిఖీ విభాగం, వైద్యశాఖ, తపాలా విభాగాలపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. అవన్నీ యథా ప్రకారం పని చేస్తాయి. ఎఫ్‌బీఐ, సరిహద్దు గస్తీ, తీరరక్షణ, ట్రాన్స్‌పోర్ట్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, ఆహార తనిఖీ, హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగం వంటి అత్యవసర విభాగాలు కూడా మామూలుగానే పని చేస్తాయి. షట్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మ్యూజియంలు, ఉద్యానవనాలు, షాపింగ్‌ మాల్స్‌ మూతపడతాయి. సెనెట్‌ అప్రాప్రియేషన్‌ కమిటీలోని డెమోక్రాట్ల నివేదిక ప్రకారం 4,20,000 మంది ఈ షట్‌డౌన్‌లో జీతం లేకుండా పని చేస్తారు.

షట్‌డౌన్‌లు  కొత్త కాదు
అమెరికాకు షట్‌డౌన్‌లు కొత్త కాదు. దాదాపు ప్రతి సంవత్సరం జనవరిలో కొన్ని రోజుల పాటు పాలన స్తంభిస్తుంటుంది. దైనందిన ప్రభుత్వ వ్యవహారాలకు అవసరమైన నిధులను ఖర్చు చేయడానికి ద్రవ్యవినిమయ బిల్లును జనవరిలో కాంగ్రెస్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదం సకాలంలో లభించకపోతే షట్‌డౌన్‌ అవుతుంది. జిమ్మి కార్టర్‌ హయాంలో ప్రతి ఏడూ సరాసరి 11 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి నెలకొంది. రోనాల్డ్‌ రీగన్‌ రెండు దఫాల పాలనలో ఆరు షట్‌డౌన్‌లను అమెరికా చూసింది. 2013లో ఏకంగా 16 రోజుల పాటు ప్రభుత్వ పాలన స్తంభించిపోయింది. ఈ ఏడాది జనవరిలో మూడు రోజుల పాటు, జూన్‌లో కొన్ని గంటలపాటు షట్‌డౌన్‌ అయ్యింది. అయితే ఒకే సంవత్సరంలో మూడు సార్లు షట్‌డౌన్‌ కావడం మాత్రం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement