వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి షాకిచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దు గోడకు నిధుల్ని అడ్డుకుంటున్నందుకు ప్రతీకారంగా ఆమె బ్రస్సెల్స్, ఈజిప్టు, అఫ్గానిస్తాన్ పర్యటనకు మిలటరీ విమానాన్ని ఇచ్చేందుకు సర్వసైన్యాధ్యక్షుడి హోదాలో నిరాకరించారు. ఈ మేరకు ట్రంప్ ఆమెకు లేఖ రాశారు. ‘షట్‌డౌన్ కారణంగా మీ విదేశీ పర్యటన వాయిదా పడింది. షట్‌డౌన్ ముగిశాక పర్యటనను రీషెడ్యూల్ చేస్తాం.
కానీ మీరు ఈ పర్యటనకు ప్రైవేటుగా వెళ్లాలని అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. అమెరికాకు చెందిన 8 లక్షల మందికిపైగా గొప్ప ఉద్యోగులకు 27 రోజులుగా వేతనాలు అందడం లేదన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటారనే అనుకుంటున్నా. మన సరిహద్దుకు అత్యవసరంగా కావాల్సిన భద్రత, నిధుల విషయంలో మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటానని ఆశిస్తున్నా’ అని ట్రంప్ లేఖలో తెలిపారు. మరోవైపు, షట్‌డౌన్ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఐదురోజులపాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు అమెరికా ప్రతినిధుల బృందం పర్యటనను ట్రంప్ రద్దుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment