ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో గత 35 రోజులుగా కొనసాగుతున్న షట్‌డౌన్‌కు పాక్షికంగా తెరపడింది. రాజకీయ ఒత్తిడికి తలొగ్గిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరి 15 వరకూ ప్రభుత్వం నడిచేందుకు అవసరమైన నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లును కాంగ్రెస్‌లోని ఉభయసభలు మూజువాణీ ఓటుతో ఆమోదించగా, ట్రంప్ సంతకం చేయడంతో చట్టంగా మారింది. దీంతో దాదాపు 8,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు అందనున్నాయి. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 3 వారాల్లోగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం, వలసవిధానంపై ఇరుపార్టీలు ఓ అంగీకారానికి రావాలి.
డెమొక్రాట్లకు మినహాయిపు కాదు..
షట్‌డౌన్ ముగిసిన నేపథ్యంలో వైట్‌హౌస్‌లో శుక్రవారం(స్థానిక కాలమానం) నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘వలసల్ని సమీక్షించే హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి ఏడాది కాలానికి అవసరమైన నిధుల్ని కేటాయించే విషయమై ఉభయ సభలతో త్వరలోనే చర్చిస్తా. 35 రోజులుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న 8 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు పూర్తి నెల జీతాన్ని అందిస్తాం. షట్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నేను తీసుకున్న నిర్ణయం డెమొక్రాట్లకు ఇచ్చిన మినహాయింపు కానేకాదు. సరిహద్దులో బలమైన గోడ లేదా ఉక్కు కంచె నిర్మించడం తప్ప మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఫిబ్రవరి 15లోగా ఆమోదయోగ్య ఒప్పందం కుదరకుంటే మళ్లీ షట్‌డౌన్ తప్పదు’ అని అన్నారు.
హెచ్1బీ ప్రీమియం ప్రాసెసింగ్ రేపటి నుంచే
హెచ్–1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను సోమవారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. వార్షిక పరిమితి (మొత్తం 85,000) కిందకు వచ్చే అన్ని రకాల హెచ్–1బీ వీసా కోటాలకు ప్రీమియం ప్రాసెసింగ్ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. ఈ పరిమితి కిందకు రాని పలు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన హెచ్–1బీ ప్రీమియం ప్రాసెసింగ్ ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం. ప్రీమియం ప్రాసెసింగ్ కింద దరఖాస్తుదారులు నిర్దిష్ట మొత్తంలో ఎక్కువ రుసుమును చెల్లిస్తే కేవలం 15 రోజుల్లోనే వారి దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment