
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కాంగ్రెస్ నిధులు మంజూరు చేయకుంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ప్రతిష్టంభన తొలగకుంటే ప్రభుత్వ షట్‌డౌన్ నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగొచ్చని ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యులతో చెప్పారు. రెండు వారాలుగా కొనసాగుతున్న పీటముడిని పరిష్కరించేందుకు శుక్రవారం అధ్యక్షుడు, డెమొక్రటిక్ సభ్యుల మధ్య జరిగిన సమావేశం విఫలమైంది.
గోడతోనే అక్రమ వలసల కట్టడి..
సమావేశం ముగిశాక ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అనుమతి లేకుండానే గోడ నిర్మాణానికి నిధులు పొందేందుకు అవసరమైతే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తానని వెల్లడించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తనకు ఈ విషయంలో విశేష అధికారాలున్న సంగతిని ప్రస్తావించారు. అయితే పరిస్థితి అంతదాకా రాకపోవచ్చని, కాంగ్రెస్ సమ్మతితోనే ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. గోడతోనే అక్రమ వలసల కట్టడి సాధ్యమన్నారు.
విద్యార్థి మేధావుల్లారా వెళ్లకండి
అమెరికా ఉత్తమ విద్యా సంస్థల్లో చదువు ముగించుకున్న విద్యార్థులు దేశం విడిచి వెళ్లొద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. అమెరికాలోనే ఉండి అక్కడి కంపెనీల అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. వీసా విధానంలోని లొసుగుల్ని సరిదిద్ది మేధావుల్ని, ప్రతిభావంతుల్ని ఆకర్షించేందుకు కట్టుబడి ఉన్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment