mexico border wall
-
గోడకు నిధులిస్తే.. డ్రీమర్లకు గడువిస్తా
వాషింగ్టన్: అమెరికాలో కొనసాగుతున్న షట్డౌన్కు ముగింపు పలికేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. డెమొక్రాట్లు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలిపితే, దాదాపు 7 లక్షల మంది డ్రీమర్లకు(బాల్యంలోనే అమెరికాకు అక్రమంగా వచ్చినవారు) మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా కల్పిస్తామని ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్ నుంచి శనివారం(స్థానిక కాలమానం) ప్రజలు, రాజకీయ నేతలనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. ‘వాషింగ్టన్‌లోని రెండు పక్షాలు(రిపబ్లికన్లు, డెమొక్రాట్లు) ఓ అంగీకారానికి రావాల్సిన అవసరం ఉంది. దేశంలోని 7,00,000 మంది డ్రీమర్లకు మరో మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా(టీపీఎస్) కల్పిస్తాం. స్వదేశాల్లో హింస, అంతర్యుద్ధం కారణంగా అమెరికాలో ఉంటున్న 3 లక్షల మంది విదేశీయులకు టీపీఎస్‌ను మూడేళ్ల పాటు పొడిగిస్తాం. ఇందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ కోసం 5.7 బిలియన్ డాలర్లు(రూ.40,615 కోట్లు) ఇవ్వాలని ట్రంప్ కోరుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడి ప్రతిపాదన ఆచరణసాధ్యం కాదని డెమొక్రటిక్ నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని షట్‌డౌన్ చేయడాన్ని ట్రంప్ గర్వంగా భావిస్తున్నారనీ, దీనిని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
కాంక్రీట్ వద్దు.. స్టీల్
వాషింగ్టన్: అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణంపై మొండిగా వ్యవహరిస్తున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. అక్రమ వలసదారుల్ని అడ్డుకునేందుకు సరిహద్దులో కాంక్రీట్ గోడ కాకపోయినా స్టీల్‌తో గోడలాంటి నిర్మాణాన్ని చేపట్టాలని వ్యాఖ్యానించారు. అక్రమవలసదారుల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా నష్టం జరుగుతోందని వాపోయారు. స్టీల్ గోడలాంటి నిర్మాణంపై చర్చించేందుకు అమెరికా ఉక్కు పరిశ్రమ సంఘం అధ్యక్షుడితో పాటు ముఖ్యులతో సమావేశమవుతానని తెలిపారు. గోడ కారణంగా అక్రమ వలసలతో పాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకోవచ్చనీ, తద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని వెల్లడించారు. ఆదివారం వైట్‌హౌస్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు బయలుదేరిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. దాదాపు 3 వారాలుగా కొనసాగుతున్న షట్‌డౌన్ సుదీర్ఘకాలం కొనసాగుతుందని ట్రంప్ పునరుద్ఘాటించారు. గోడ నిర్మాణం విషయమై ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ, మైనారిటీ నేతల చక్ కలిసివస్తే 20 నిమిషాల్లో సమస్య పరిష్కారమైపోతుందని స్పష్టం చేశారు. షట్డౌన్కు వీరిద్దరే కారణమని ఆరోపించారు. -
నిధులివ్వకుంటే.. ఎమర్జెన్సీ
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కాంగ్రెస్ నిధులు మంజూరు చేయకుంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ప్రతిష్టంభన తొలగకుంటే ప్రభుత్వ షట్‌డౌన్ నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగొచ్చని ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యులతో చెప్పారు. రెండు వారాలుగా కొనసాగుతున్న పీటముడిని పరిష్కరించేందుకు శుక్రవారం అధ్యక్షుడు, డెమొక్రటిక్ సభ్యుల మధ్య జరిగిన సమావేశం విఫలమైంది. గోడతోనే అక్రమ వలసల కట్టడి.. సమావేశం ముగిశాక ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అనుమతి లేకుండానే గోడ నిర్మాణానికి నిధులు పొందేందుకు అవసరమైతే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తానని వెల్లడించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తనకు ఈ విషయంలో విశేష అధికారాలున్న సంగతిని ప్రస్తావించారు. అయితే పరిస్థితి అంతదాకా రాకపోవచ్చని, కాంగ్రెస్ సమ్మతితోనే ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. గోడతోనే అక్రమ వలసల కట్టడి సాధ్యమన్నారు. విద్యార్థి మేధావుల్లారా వెళ్లకండి అమెరికా ఉత్తమ విద్యా సంస్థల్లో చదువు ముగించుకున్న విద్యార్థులు దేశం విడిచి వెళ్లొద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. అమెరికాలోనే ఉండి అక్కడి కంపెనీల అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. వీసా విధానంలోని లొసుగుల్ని సరిదిద్ది మేధావుల్ని, ప్రతిభావంతుల్ని ఆకర్షించేందుకు కట్టుబడి ఉన్నానన్నారు. -
‘ఆ గోడకు పైసా చెల్లించం.. మేం వాటిని నమ్మం’
మెక్సికో: యూఎస్-మెక్సికో మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్మించే గోడకు తాము ఒక్క పైసా కూడా ఇవ్వబోమని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనానీతో స్పష్టం చేశారు. గోడలకు తాము వ్యతిరేకం అని, మెక్సికోకు ఇరు దేశాల మధ్య అడ్డుగా నిర్మించే గోడలపై అస్సలు నమ్మకం లేదని అన్నారు. గురువారం ఆయన తమ దేశ పౌరులకు సందేశం ఇచ్చే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఇంతకుముందు చెప్పాను మరోసారి స్పష్టంగా చెబుతున్నాను. మెక్సికో ఏ గోడకు కూడా ఎలాంటి డబ్బులు చెల్లించదు. కలిసి ఉండకుండా గత కొంతకాలంగా అమెరికా గోడను నిర్మిస్తూ ఉండటాన్ని దానిని పూర్తి చేస్తానని ట్రంప్ ప్రకటించడాన్ని చూసి నేను సిగ్గుగా భావిస్తున్నాను. అమెరికా నిర్ణయాన్ని ఖండిస్తున్నాను. కలిపి ఉంచేలా ప్రయత్నించాల్సి పోయి ఇలాంటి పనులు చేస్తున్నందుకు బాధగా ఉంది’ అని అన్నారు. అయితే, ఈ నెల తన అమెరికా పర్యటన రద్దు చేసుకుంటారా.!కొనసాగిస్తారా! అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. వాషింగ్టన్కు ఈ నెల 31న డోనాల్డ్ ట్రంప్‌ను ఎన్రిక్ కలిసేందుకు వెళ్లనున్నారు. వివాదాస్పద ‘యూఎస్- మెక్సికో సరిహద్దు గోడ’ను ఖచ్చితంగా నిర్మిస్తామని ట్రంప్ చెప్పడమే కాకుండా ఆ ఫైలుపై బుధవారం సంతకం చేశారు. అంతకుముందు యూఎస్- మెక్సికోల మధ్య గోడను కట్టబోతున్నాం’ అని అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.