![Supreme Court Stays Bombay High Court Judgment - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/28/bom-h.jpg.webp?itok=5aJ7n5IU)
న్యూఢిల్లీ: శరీరానికి శరీరం తాకకుండా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ ‘పోక్సో’ చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణించలేమని తేల్చిచెబుతూ కేసులో నిందితుడికి విముక్తి కలిగిస్తూ బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వానికి, నిందితుడికి నోటీసు జారీ చేసింది. రెండు వారాల్లోగా ప్రతిస్పందించాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం జనవరి 19న ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్‌కు సూచించింది.
నాగపూర్ ధర్మాసనం తీర్పును సవాలు చేస్తూ ‘యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎస్.ఎ.బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ హాజరై నాగపూర్ ధర్మాసనం తీర్పు వివరాలను తెలియజేశారు. గతంలో ఏ కోర్టు కూడా ఇలాంటి తీర్పు ఇవ్వలేదని, ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment