‘కొంచెం గొంతు తగ్గించి మాట్లాడండి’: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం | "Lower Your Pitch..": CJI Rebukes Lawyer On Kolkata Doctor Case Hearing, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘కొంచెం గొంతు తగ్గించి మాట్లాడండి’: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం

Published Mon, Sep 9 2024 5:19 PM | Last Updated on Mon, Sep 9 2024 5:45 PM

Lower Your Pitch: CJI Rebukes Lawyer On Kolkata doctor case Hearing

కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన  ఆర్‌జీకర్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో జరిగిన జూనియర్‌ వైద్యురాలి హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేత, న్యాయవాది కౌస్తవ్‌ బాగ్చి మాట్లాడుతున్న సందర్భంలో జోక్యం చేసుకున్న సీజేఐ.. న్యాయవాదిని గొంతు తగ్గించి మాట్లాడాలని హెచ్చరించారు.

ఈసలేం జరిగిందంటే.. కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా బెంగాల్‌ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ.. ఆగష్టు 9న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జీకర్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై నిరసనలు చేస్తున్న వారిపై న్యాయవాది కౌస్తవ్‌ బాగ్చి రాళ్లు రువ్వుతున్నట్లు నిరూపించేందుకు తన వద్ద వీడియోలు, ఫోటోలు ఉన్నాయని పేర్కొన్నారు.  

కాగా కౌస్తవ్‌ బాగ్చి బీజేపీ నేత.. ఈ ఏడాదిఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. కపిల్‌ సిబల్‌ ఆరోపణలపై.. న్యాయవాది కౌస్తవ్ స్పందిస్తూ.. ఒక సీనియర్ న్యాయవాది కోర్టులో అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సీజేఐ కల్పించుకొని.. మీ ముందు ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. ముందు గొంతు తగ్గించుకొని మాట్లాడండి’ అంటూ హెచ్చరించారు.

‘గత రెండు గంటలుగా మీ ప్రవర్తనను గమనిస్తున్నాను. మీ మీ పిచ్‌ని ముందు తగ్గించడండి. మీరు న్యాయమూర్తులను ఉద్ధేశించి మాట్లాడుతున్నారు. కోర్టు వెలుపల ఉన్న గ్యాలరీని ఉద్దేశించి కాదు.’ అంటూ మండిపడ్డారు. దీంతో న్యాయవాది కౌస్తవ్‌ త్రిసభ్య ధర్మాసనానికి క్షమాపణలు తెలియజేశారు.

ఇక చీఫ్ జస్టిస్ బాగ్చీని మందలించడంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘పార్ట్‌టైమ్‌ న్యాయవాది, ఫుల్‌టైం బీజేపీ కార్యకర్త అయిన కౌస్తవ్‌ బాగ్చి నుంచి ఇంకా ఏం ఆశించగలమని మండిపడింది. తమ(బీజేపీ) పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మాదిరి కోర్టు గదిని బుల్డోజ్ చేయవచ్చని భావించే వీరి నుంచి ఇలాంటి ప్రవర్దనే ఉంటుందని విమర్శలు గుప్పించింది. నేడు సీజేఐ అతన్ని సరిగ్గా మందలించింది అంటూ తెలిపింది

ఇదిలా ఉండగా మంగళవారం నాటికి నిరసనలు చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని సీజేఐ డీవే చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు ఆందోళనలు చేస్తున్న డాక్టర్లు విధుల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఒక వేళ విధుల్లోకి రాకపోతే వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది.

అలాగే బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు అన్నీ సోషల్​ మీడియా వేదికల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐని విచారణపై కొత్త నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు సెప్టెంబర​ 17 వరకు గడువిచ్చింది. ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement